పాక్‌లో పేలుళ్లు.. 30 మంది బలి | Pakistan Blast: Outside Independent candidate Election office Several Deceased | Sakshi
Sakshi News home page

పాక్‌లో పేలుళ్లు.. 30 మంది బలి

Published Wed, Feb 7 2024 3:54 PM | Last Updated on Thu, Feb 8 2024 5:44 AM

Pakistan Blast: Outside Independent candidate Election office Several Deceased - Sakshi

కరాచీ: సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్‌ సిద్ధమవుతున్న వేళ బుధవారం జంట పేలుళ్లతో పాకిస్తాన్‌ దద్దరిల్లింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనల్లో మొత్తంగా 25 మంది మరణించారు. 42 మంది గాయపడ్డారు. పర్వతమయమైన బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని వేర్వేరు పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు జరిపారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ పేలుళ్లు జరిపింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు.

తొలి పేలుడు పిషిన్‌ జిల్లాలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫాందర్‌ ఖాన్‌ కకర్‌ ఆఫీస్‌ బయట జరిగింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఒక గంట తర్వాత కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్‌ ఉలేమా ఇస్లామ్‌–పాకిస్తాన్‌ పార్టీ కార్యాలయం బయట జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రక్రియల్లో పౌరుల భాగస్వామ్యాన్ని తగ్గించేందుకే ఇలా ఉగ్రవాదులు బాంబు దాడులతో భయపెడుతున్నారని బలూచిస్తాన్‌ పంజ్‌ఘర్‌ సీనియర్‌ పోలీసు అధికారి అబ్దుల్లా చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బాంబుపేలుళ్ల జరగడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను పటిష్టం చేశారు.

బలూచిస్తాన్‌లో పెరిగిన దాడులు
అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతో సరిహద్దులు పంచుకుంటున్న పర్వతమయ బలూచిస్తాన్‌లో ఇటీవల బాంబు దాడులు ఎక్కువయ్యాయి. మంగళవారం సైతం 10 గ్రనేడ్‌ దాడులు జరిగాయి. వేర్వేరు ప్రావిన్స్‌లలోని భద్రతా పోస్ట్‌లు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై ఈ దాడులు జరిగాయి. ఆదివారం నుంచి లెక్కిస్తే ఈ సంఖ్య ఏకంగా 50కి చేరింది. చాన్నాళ్ల నుంచి బలూచిస్తాన్‌లో వేర్వేరువాద శక్తుల క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సైన్యం ఏరివేత చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జనవరిలో 24 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

చదవండి: పాక్‌ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement