
గెలాక్సీ కేంద్రస్థానంలో కాకుండా దూరంగా ఉన్న సంచార బ్లాక్‌హోల్
అంతరిక్ష వింత గుట్టు విప్పిన హబుల్ టెలిస్కోప్
నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్çహోల్ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం.
గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్‌లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్ డిస్ట్రప్షన్ ఈవెంట్–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచి్చనప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్‌హోల్ ఉందనే విషయం తెలుస్తుంది.
బ్లాక్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్‌లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్ అబ్జర్వేటరీలోని ఆప్టికల్ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్‌హోల్ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోప్ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్‌హోల్ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్ అంతర్థానమవుతుంది.
కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్‌హోల్
ఈ బ్లాక్‌హోల్ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్‌హోల్స్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ అరే రేడియో టెలిస్కోప్ పరిశోధకుల బృందాలు తెలిపాయి.
రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్‌క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్ డాక్టోరల్ యుహాన్ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది.