Black Hole
-
కృష్ణ ‘చక్రం’
కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక మలుపు. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూచక్రం మాదిరిగా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యా నక్షత్ర రాశిలో ఉంది. దీనికి సంబంధించి రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన మీదట సైంటిస్టులకు ఈ విశేషం చిక్కింది. అందులో భాగంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి నాలుగేళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలీస్కోప్ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కలకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేలడం ఇదే మొదటిసారి. కృష్ణ బిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ► కృష్ణ బిలం సమీపానికి వచి్చన ప్రతి వస్తూ రాశినీ దాని తాలూకు డిస్క్ లోనికి లాక్కునే క్రమంలో ఇలా తిరుగుతోందట. ► ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట. ► ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్ గా ఉందని దీనిపై సమరి్పంచిన అధ్యయన పత్రానికి లీడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యుజూ కుయ్ చెప్పుకొచ్చారు. ► ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందం నాలుగేళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించింది. తెలిసింది గోరంతే ► అత్యంత భారీగా ఉండే కృష్ణబిలాల అధ్యయనం చాలా కష్టం. ► ఎందుకంటే అవి కాంతితో సహా అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. ► వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా స్వల్పం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ..
అంతరిక్షంలో నక్షత్రాలన్నీ సమూహాలు (గెలాక్సీలు)గా.. అక్కడో గుంపు, ఇక్కడో గుంపు అన్నట్టుగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలకు ఒకచోట మాత్రం ఏదో గీత గీసినట్టుగా నక్షత్రాల వరుస కనిపించింది. అదేదో పదులు, వందల్లో కాదు.. లక్షల నక్షత్రాలు అలా లైన్ కట్టాయి. అదేమిటా అని చూస్తే నోరెళ్లబెట్టేసంగతి బయటపడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ నక్షత్రాల లైన్ ఏమిటని చూసి.. సాధారణంగా ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ) మధ్యలో పెద్ద బ్లాక్‌హోల్ ఉంటుంది. దాని చుట్టూరానే నక్షత్రాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. నక్షత్రాలు కూడా గుంపుగా ఉంటాయి. కానీ ఇటీవల హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల్లో.. నక్షత్రాలు ఒక గీతలా వరుసగా ఉండటం, అదీ ఓ చిన్న గెలాక్సీ దగ్గర మొదలై కోట్ల కిలోమీటర్ల పొడవునా కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. చిత్రాల్లో అదేదో ‘పొరపాటు (ఎర్రర్)’ కావొచ్చని తొలుత భావించారు. కానీ యేల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ వాన్ డొక్కుమ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధన చేసి.. ఆ నక్షత్రాల వరుస ముందు ఓ ప్రకాశవంతమైన వస్తువును గుర్తించింది. క్షుణ్నంగా పరిశీలించి అది కృష్ణబిలం అని తేల్చింది. గెలాక్సీ నుంచి తప్పించుకుని.. ఓ పెద్ద కృష్ణబిలం తన గెలాక్సీ నుంచి తప్పించుకుని, అమిత వేగంతో ప్రయాణిస్తూ.. దారిలో ఈ నక్షత్రాల పుట్టుకకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు, మూడు గెలాక్సీలు ఢీకొన్న క్రమంలో.. ఒక గెలాక్సీ నుంచి విసిరేసినట్టుగా ఈ కృష్ణబిలం బయటికి వచ్చి ఉంటుందని అంచనా వేశారు. దాని పరిమాణం మన సూర్యుడి కంటే రెండు కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. అది గంటకు సుమారు 58 లక్షల కిలోమీటర్ల అమిత వేగంతో ప్రయాణిస్తోందని గుర్తించారు. నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి? విశ్వం ఏర్పడే క్రమంలో గెలాక్సీలతోపాటు వాటి మధ్యలో అక్కడక్కడా విడిగా వాయువులు, ఇతర ఖగోళ పదార్థాలు ఉండిపోయాయని శాస్త్రవేత్త పీటర్ వాన్ చెప్పారు. ఈ కృష్ణబిలం ప్రయాణిస్తున్న క్రమంలో దాని ఆకర్షణ శక్తి వల్ల వాయువులు, ఖగోళ పదార్థాలు ఒక్కచోటికి చేరుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కృష్ణబిలం వెనుక ఏర్పడే అతిశీతల పరిస్థితితో.. అవి సంకోచించి నక్షత్రాలు జన్మిస్తున్నాయని వివరించారు. విశ్వంలో ఇలాంటి దానిని గుర్తించడం ఇదే మొదటిసారని తెలిపారు. దీని గుట్టు తేల్చేందుకు త్వరలో ప్రఖ్యాత జేమ్స్‌వెబ్ టెలిస్కోప్‌తో పరిశీలించనున్నామని వెల్లడించారు. ఏమిటీ కృష్ణ బిలం? అతిపెద్ద నక్షత్రాలు వేలకోట్ల ఏళ్లపాటు మండిపోయి, ఇంధనం ఖాళీ అయ్యాక.. వాటిలోని పదార్థమంతా కుచించుకుపోయి ‘కృష్ణబిలం’గా మారుతాయి. వీటి గురుత్వాకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉండి.. సమీపంలోకి వచ్చే అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. కాంతి కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోవడంతో.. నేరుగా కనబడవు. అందుకే కృష్ణబిలం (బ్లాక్‌హోల్స్) అని పిలుస్తారు. -
ఇదో వింత.. ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు!
కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో ఉండగా, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉంది. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. -
కృష్ణబిలం పుట్టింది!
అంతరిక్షంలో ఒక అరుదైన దృగ్విషయం సైంటిస్టుల కంటబడింది! రెండు న్యూట్రాన్ నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి కిలోనోవాగా పేర్కొనే భారీ పేలుడుకు దారి తీయడమే గాక, చూస్తుండగానే శక్తిమంతమైన కృష్ణబిలంగా రూపొంతరం చెందాయి. ఇటీవలి కాలంలో అంతరిక్షంలో చోటుచేసుకున్న అత్యంత శక్తిమంతమైన పేలుడు ఇదేనని నాసా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రెండు తారలూ కలిసిపోయి కొద్దిసేపు ఒకే తారగా మారి అలరించాయట. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ నుంచి సైంటిస్టులు సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. ఇదంతా మనకు 1.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్జీసీ4993 గెలాక్సీలో చోటుచేసుకుందట. -
అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. గుర్తించిన ‘గ్రోత్’.. టీడీఈ అంటే తెలుసా?
అంతరిక్షంలో రగడ జరుగుతోంది! మరణిస్తున్న ఓ తారను అతి భారీ కృష్ణ బిలమొకటి శరవేగంగా కబళించేస్తోంది. ఈ ఘర్షణ వల్ల చెలరేగుతున్న కాంతి పుంజాలు సుదూరాల దాకా కనువిందు చేస్తున్నాయి. ఈ అరుదైన అంతరిక్ష దృగ్విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని సరస్వతి పర్వత శిఖరంపై ఉన్న టెలిస్కోప్ ‘గ్రోత్’ గుర్తించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, ఐఐటీ బాంబే సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇది భారత తొలి పూర్తిస్థాయి రొబోటిక్ ఆప్టికల్ రీసెర్చ్ టెలిస్కోప్. ‘‘అంత్య దశలో ఉన్న ఆ నక్షత్రాన్ని భారీ కృష్ణబిలం అనంతమైన ఆకర్షణ శక్తితో తనలోకి లాగేసుకుంటోంది. దాంతో నక్షత్రం ఊహాతీత వేగంతో దానికేసి సాగుతోంది. వీటిని టైడల్ డిస్రప్షన్ ఈవెంట్స్ (టీడీఈ) అంటారు’’ అని ఐఐటీ బాంబే ఆస్ట్రో ఫిజిసిస్ట్ వరుణ్ భలేరావ్ వివరించారు. ఈ అంతరిక్ష రగడకు కేంద్రం మనకు 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట! ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. -
మన ముంగిట్లో కృష్ణబిలం
భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలాన్ని తాజాగా గుర్తించారు. ఇప్పటిదాకా భూమికి అతి సమీపంలో ఉన్న కృష్ణబిలం కంటే ఇది ఏకంగా మూడింతలు దగ్గరగా ఉంది! సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం భూమికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఒఫికస్ నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంతలో నిద్రాణంగా ఉన్న కృష్ణబిలాన్ని కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారి కూడా కావడం విశేషం. కృష్ణబిలాలు ఏర్పడే క్రమాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
కృష్ణబిలం ‘వినిపిస్తోంది’.. ఆడియో క్లిప్ విడుదల చేసిన నాసా
కృష్ణబిలం.. ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్‌హోల్) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘వినిపించింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది. శబ్దం శూన్యంలో ప్రయాణించదన్నది తెలిసిందే. అంతరిక్షం చాలావరకూ శూన్యమయం. కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా ‘హూం’.. అంటూ వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు. సైన్స్‌ను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతోనే ఈ శబ్ద సృష్టి చేసినట్టు నాసా తెలిపింది. ఇదీ చదవండి: మిస్టరీ గెలాక్సీ చిక్కింది -
సెకనుకో భూమిని మింగేస్తోంది!
అంతరిక్షంలో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉండటం కామనే. కాంతి సహా ఏదైనా సరే తన సమీపంలోకి వస్తే లాగేసుకునే కృష్ణ బిలాలు.. ప్రతి నక్షత్ర సమూహం (గెలాక్సీ)లో ఉంటాయి. కానీ ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఓ అతిపెద్ద ‘రాక్షస’కృష్ణబిలాన్ని గుర్తించి ‘జే1144’అని పేరు పెట్టారు. ఇప్పటివరకు గుర్తించిన అన్ని కృష్ణ బిలాల్లో.. అతిపెద్దది, కాంతివంతమైనది, వేగంగా ఎదుగుతున్నది ఇదేనని తెలిపారు. ►‘జే1144’మన సూర్యుడి కంటే 300 కోట్ల రెట్లు పెద్దగా ఉందని.. ప్రతి సెకన్‌కు మన భూమి అంత పరిమాణంలో ద్రవ్యరాశిని మింగేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ►సుమారు తొమ్మిది వందల కోట్ల ఏళ్ల వయసున్న ‘జే 1144’.. మన పాలపుంత (మిల్కీవే) మధ్యలో ఉన్న కృష్ణబిలం ‘సాగిట్టారియస్ ఏ’కన్నా ఐదు వందల రెట్లు పెద్దదని తెలిపారు. ►పాలపుంతకు దక్షిణంగా 18 డిగ్రీల కోణంలో.. 700 కోట్ల కాంతి సంవత్సరాల దూరం లో ఈ కృష్ణబిలం ఉందని వెల్లడించారు. ►అసలు పాలపుంతలోని కొన్ని కోట్ల నక్షత్రాలన్నీ వెలువరించే కాంతికన్నా.. ఈ భారీ కృష్ణబిలం చుట్టూ ఉన్న ప్లాస్మా రింగ్ నుంచి వెలువడుతున్న కాంతి ఏడు వేల రెట్లు ఎక్కువని పేర్కొన్నారు. ►ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ‘స్కైమ్యాపర్ సదరన్ స్కై సర్వే’.. విశ్వంలో దక్షిణ భాగంలో నక్షత్రాలు, గెలాక్సీలు, కృష్ణబిలాలు, ఇతర అంతరిక్ష వస్తువులను గుర్తించి మ్యాప్ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు భారీ కృష్ణ బిలాన్ని కనుగొని, ఫొటో తీశారు. చిన్న గ్రహాలెన్నింటినో మింగేసి.. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి (జూపిటర్). అది ఎంత పెద్దదంటే.. భూమి వంటి 1,300 గ్రహాలు అందులో సులువుగా ఫిట్టయిపోతాయి. ఇంకా చెప్పాలంటే సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలను కలిపినా జూపిటర్‌లో సగం కూడా నిండవు. మరి జూపిటర్ ఇంత పెద్దగా ఎలా ఉందన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. అది చిన్నచిన్న గ్రహాలెన్నింటినో స్వాహా చేసినట్టు తాజాగా గుర్తించారు. నాసాకు చెందిన జునో స్పేస్ ప్రోబ్ సాయంతో సేకరించిన డేటా ఆధారంగా ఈ అంచనాలు వేశారు. జూపిటర్ నిజానికి ఓ భారీ వాయుగోళం (గ్యాస్ జియాంట్). కేవలం పదిశాతమే కోర్ (గట్టిగా ఉండే మధ్యభాగం) ఉండి.. ఆపై మొత్తంగా హైడ్రోజన్, హీలియం, ఇతర వాయువులతో నిండి ఉందని ఇన్నాళ్లూ భావించారు. అయితే తాజా డేటా ప్రకారం.. జూపిటర్ పరిమాణంలో 30 శాతం వరకు కోర్ ఉన్నట్టు గుర్తించారు. ‘‘సాధారణంగా వాయుగోళాల్లో కోర్ పెద్దగా ఉండదు. దీనితో జూపిటర్ వాతావరణంలోని వాయువులు, ధూళి మేఘాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా.. భారీ మూలకాలు ఉన్నట్టు తేలింది. సాధారణంగా భూమి, అంగారకుడు వంటి మట్టి, రాళ్లు ఉండే గ్రహాల్లోనే భారీ మూలకాలు ఉంటాయి. అంటే సౌర కుటుంబం ఏర్పడిన మొదట్లో చిన్న చిన్న గ్రహాలు, గ్రహ శకలాలను జూపిటర్ మింగేసి ఉంటుంది..’’అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నెదర్లాండ్స్ లీడెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యమిలా మిగ్వేల్ తెలిపారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రాకాసి బిలం.. సెకనులో భూమినే మింగేసేంత పవర్ఫుల్
ఈ విశ్వంలో ఎలాంటి వస్తువునైనా, అది ఎంత భారీదైనా తనలోకి లాక్కునేంత శక్తి ఉంది.. ఒక్క బ్లాక్‌హోల్(కృష్ణ బిలం)కే. స్పేస్‌టైమ్ ప్రాంతంగా పేరున్న బ్లాక్ హోల్ నుంచి.. ఏ కణమూ, చివరికి కాంతి లాంటి విద్యుదయస్కాంత వికిరణంతో సహా ఏవీ తప్పించుకోలేవు. అలాంటిది భూమి లాంటి పరిమాణంలో ఉన్నవాటిని.. ఒక సెకనులో మింగేసేంత శక్తి ఉంటే.. ?.. ఈ భూమిని సెకనులోనే మింగేసేంత భా...రీ బ్లాక్‌హోల్‌ను గుర్తించారు ఖగోళ శాస్త్రవేత్తలు. పైగా సుమారు 900 కోట్ల సంవత్సరాల వయసున్నదిగా భావిస్తున్న ఆ బ్లాక్‌హోల్ సైజు కూడా జెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. అది ఎంతలా అంటే.. సెకనులోనే భూమి సైజు ఉన్నంత పరిణామాన్ని అమాంతం మిగేసేంతగా.. అలాగని బ్లాక్ హోల్స్‌తో ఈ భూమికి వచ్చే ప్రమాదం ఏదీ లేదు!. ► స్కై మ్యాపర్ అనే టెలిస్కోప్ ద్వారా.. ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ‘బైనరీ స్టార్స్’ను గుర్తించే ప్రయత్నంలో.. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ భారీ బ్లాక్ హోల్‌ను కనిపెట్టారు. ► పాలపుంత కన్నా.. 500 రెట్లు భారీగా ఉందని చెప్తున్నారు. మొత్తం పాలపుంత నుంచి వెలువడే కాంతి కంటే.. ఏడువేల రెట్ల కాంతివంతంగా ఈ బ్లాక్ హోల్ ఉందంట. భారీ పరిణామం, ఊహించనిదని వర్ణించారు డాక్టర్ క్రిస్టోఫర్ ఆన్కెన్. ► శక్తివంతంగా.. ప్రకాశవంతంగా కనిపించిన ఈ బ్లాక్ హోల్ సైజు పెరగడానికి కారణం ఏంటన్న దానిపై నిర్ధారణకు రాలేకపోయారు. కాకపోతే.. రెండు భారీ పాలపుంతలు ఒకదాన్నొక్కటి ఢీకొడితే.. వెలువడ్డ మెటీరియల్ ఈ బ్లాక్‌హోల్‌లోకి ప్రవేశించి సైజును పెంచుతూ పోతుందని భావిస్తున్నారు. ► యాభై ఏళ్లకొకసారి ఈ తరహా వింతలు కనిపించినప్పటికీ.. ఇన్నేళ్లలో ఇంత ప్రకాశవంతమైన భారీ బ్లాక్‌హోల్‌ను గుర్తించడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. ► మూడు బిలియన్ల సూర్యులు కలిస్తే ఎంత సైజు ఉంటుందో ఈ బ్లాక్ హోల్ సైజు అంతగా ఉందట!. పైగా పోను పోను మరింత భారీ సైజులో పెరుగుతూ పోతుందట. ఆర్ఎక్స్ఐవీ డేటాబేస్‌లో ఈ పరిశోధనను పొందుపరచగా.. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఈ కథనం పబ్లిష్ చేశారు. ► 14.5 విజువల్ మాగ్నిట్యూడ్ ఉన్న టెలిస్కోప్‌తో ఈ భారీ బ్లాక్ హోల్‌ను ఎవరైనా చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: అంతరిక్షం నుంచి మిస్టరీ రేడియో సిగ్నల్స్.. ఇది రెండోసారి -
విశ్వంలోకెల్లా అతి పే...ద్ద గెలాక్సీ
ఆమ్స్టర్డామ్: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఇది ఏకంగా 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉందట! మన పాలపుంత కంటే 153 రెట్లు, సూర్యుని కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదట. ఈ భారీ రేడియో గెలాక్సీకి అల్సియోనెస్ అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని దీన్ని కనిపెట్టిన నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని మధ్యలో కేంద్రకం వద్ద చురుకైన ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని వారంటున్నారు. దాని సమీపం నుంచి భారీ ద్రవ్యరాశితో కూడిన పలు ఖగోళ పదార్థాలు ఎగజిమ్ముతున్నాయట. ఇలాంటి అజ్ఞాత రేడియో గెలాక్సీల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. కృష్ణబిలం తన చుట్టూ ఉన్న పదార్థాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటూ ఉంటే అది చురుగ్గా ఉందని అర్థం. అలా దానిలోకి వెళ్లే వాటిలో అతి తక్కువ పదార్థాలు బిలం తాలూకు బయటి పొర గుండా దాని ధ్రువాల వైపు శరవేగంతో విసిరివేతకు గురవుతాయి. అక్కణ్నుంచి భారీ పేలుడుతో అంతరిక్షంలోకి దూసుకుపోయి అయనీకరణం చెందిన ప్లాస్మాగా రూపొందుతాయి. తర్వాత ఇవి కాంతివేగంతో సుదూరాలకు ప్రయాణిస్తూ చివరికి రేడియో ధారి్మకతను వెలువరించే భారీ అంతరిక్ష దృగి్వషయాలుగా మిగిలిపోతాయి. ఇలాంటి రేడియో ధారి్మక పదార్థాలు మన పాలపుంతలోనూ లేకపోలేదు. కానీ అల్సియోనెస్ వంటి భారీ గెలాక్సీల్లో అవి అంతంత సైజులకు ఎలా పెరుగుతాయన్నది ఇప్పటిదాకా మనకు అంతుపట్టని విషయం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉన్న పలు సందేహాలకు అల్సియోనెస్ రూపంలో సమాధానాలు దొరుకుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇంత భారీ గెలాక్సీలు ఎలా పుట్టుకొస్తాయన్న ప్రశ్నలకు కూడా అల్సియోనెస్పై జరిగే పరిశోధనల్లో సమాధానాలు దొరకొచ్చని అబ్జర్వేటరీకి చెందిన మారి్టజిన్ ఒయ్ అన్నారు. యూరప్‌లో ఏర్పాటు చేసిన లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) డేటాను విశ్లేషించే క్రమంలో ఓయ్, ఆయన బృందం యాదృచి్ఛకంగా ఈ భారీ గెలాక్సీని కనిపెట్టింది. -
అదిగదిగో ప్లానెట్ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా
మన సౌర కుటుంబంలో గ్రహాలెన్ని? ఇదేం ప్రశ్న తొమ్మిది గ్రహాలు కదా అంటారా.. కాదు కాదు.. ఫ్లూటోను లిస్టులోంచి తీసేశారు కాబట్టి ఎనిమిదే అంటారా.. ఏం అన్నా అనకున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం ఫ్లూటో కాకుండానే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫ్లూటో అవతల ఓ పెద్ద గ్రహం ఉందనడానికి కొన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, కానీ దాని జాడ మాత్రం కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలేమో.. అలాంటి గ్రహమేదీ లేకపోవచ్చని చెప్తున్నారు. అసలు ఈ తొమ్మిదో గ్రహం ఏమిటి? దానికి ఆధారాలేమిటి? ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? ఫ్లూటోను తొలగించాక.. మనం చిన్నప్పటి నుంచీ సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయనే చదువుకున్నాం. కానీ కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు.. గ్రహాలకు సంబంధించి కొన్ని పరిమాణం, ఆకృతి, దాని కక్ష్య వంటి పలు నిబంధనలు రూపొందించారు. అందులో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ప్లూటో అప్పటి నుంచి మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలే (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్) మాత్రమే మిగిలాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఫ్లూటోకు కొంచెం అటూఇటూగా మరో మూడు, నాలుగు మరుగుజ్జు గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. కానీ ఇటీవల ఫ్లూటో, ఇతర మరుగుజ్జు గ్రహాలు కాకుండానే.. తొమ్మిదో గ్రహం ఉండి ఉంటుందన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. ‘ప్లానెట్ 9’ ఉందంటూ.. 2016లో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)కు చెందిన అంతరిక్ష పరిశోధకులు మైక్ బ్రౌన్, కోన్స్టాంటిన్ బటిగిన్ ‘ప్లానెట్ 9’ను ప్రతిపాదించారు. ఫ్లూటో అవతల సౌర కుటుంబం చివరిలో ఓ భారీ గ్రహం పరిభ్రమిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దానికి ప్రస్తుతానికి ‘ప్లానెట్ 9’ అని పేరు పెట్టారు. ►2018లో ది ఆస్ట్రానమికల్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన కూడా సౌర కుటుంబం అంచుల్లో ఏదో పెద్ద గ్రహం ఉండవచ్చని అంచనా వేసింది. ‘2015 బీపీ519’గా పిలిచే ఓ భారీ ఆస్టరాయిడ్ కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. నెప్ట్యూన్ కక్ష్యకు సమీపంగా సూర్యుడి చుట్టూ తిరిగి వెళుతుంది. అంత దూరంలో భారీ గ్రహం ఉందని, దాని ఆకర్షణ వల్లే ఈ ఆస్టరాయిడ్ సౌర కుటుంబం పరిధిలో ఉందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. భారీ గ్రహాల గురుత్వాకర్షణను బట్టి.. అంతరిక్షంలో నక్షత్రాలు, భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి చుట్టూ ఉండే గ్రహాలు, ఆస్టరాయిడ్లు, ఇతర ఖగోళ వస్తువులపై ప్రభావం చూపుతూ ఉంటుంది. సౌర కుటుంబంలోనే అతి భారీ గ్రహమైన గురుడి గురుత్వాకర్షణ కారణంగానే.. ఆ గ్రహ కక్ష్యలో, అంగారకుడు–గురు గ్రహాల మధ్య పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు తిరుగుతుంటాయి. అదే తరహాలో క్యూపియర్ బెల్ట్‌లోనూ ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు గుంపులుగా పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏదైనా భారీ గ్రహం గురుత్వాకర్షణ ప్రభావం చూపితే తప్ప.. ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు అలా వ్యవహరించవని సూత్రీకరించారు. ►మార్స్–గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉన్నట్టుగానే.. నెప్ట్యూన్ గ్రహం పరిభ్రమించే చోటు నుంచి అవతల సుమారు 500 కోట్ల కిలోమీటర్ల వెడల్పున మరో బెల్ట్ ఉంటుంది. దానినే క్యూపియర్ బెల్ట్ అంటారు. ప్లూటోతోపాటు ఎన్నో మరుగుజ్జు గ్రహాలు, కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు ఆ బెల్ట్‌లోనే తిరుగుతుంటాయి. ఆ గ్రహం ఎలా ఉండొచ్చు? క్యూపియర్ బెల్ట్‌లో మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల గుంపులు, కక్ష్య, పరిమాణాలను బట్టి.. పలు కంప్యూటర్ సిమ్యులేషన్లు, గణిత సూత్రాల ఆధారంగా ‘ప్లానెట్ 9’ అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ లెక్కన.. భూమి ప్లానెట్ 9 ►భూమితో పోలిస్తే ప్లానెట్ 9 పది రెట్లు పెద్దగా ఉండి ఉంటుంది. ►సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఎంతదూరంలో ఉందో.. అంతకు 20 రెట్లు దూరంలో తిరుగుతూ ఉంటుంది. ►ప్లానెట్–9 సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు కనీసం 10 వేల ఏళ్ల నుంచి 20 వేల ఏళ్లకుపైగా సమయం పడుతుంది. నేరుగా ఎందుకు గుర్తించలేం? సౌర కుటుంబం అంచుల్లో ఉన్న గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్లు పరిభ్రమించే వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా సూర్యుడి చుట్టూ తిరిగేందుకు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మనం పరిశీలిస్తున్న సమయంలో.. అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు.అందువల్ల వాటిని నేరుగా గుర్తించడం కష్టం. ఒకసారి గుర్తిస్తే.. వాటి పరిమాణం, వేగం, ఇతర అంశాలు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడు ప్లానెట్ 9 ►సౌర కుటుంబం చివరిలో ఉన్న నెప్ట్యూన్ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 165 ఏళ్లు పడుతుంది. అదే ప్లూటోకు 248 ఏళ్లు, దాని అవతల ఉన్న మరుగుజ్జు గ్రహం ఎరిస్కు 558 ఏళ్లు, సెడ్నాకు 11,408 ఏళ్లు పడుతుంది. భిన్న వాదన కూడా ఉంది క్యూపియర్ బెల్ట్‌లోని కొన్ని మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల కక్ష్య, ఇతర అంశాలు భిన్నంగా ఉండటానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చని.. అక్కడ భారీ గ్రహం ఉండకపోవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ బ్లాక్ హోల్ అయితే? సౌర కుటుంబం ఆవల భారీ గ్రహం కాకుండా.. చిన్న స్థాయి బ్లాక్‌హోల్ ఉండి ఉండొచ్చని మరో ప్రతిపాదన కూడా ఉంది. ఆ బ్లాక్‌హోల్ ప్రభావం వల్లే కొన్ని ఆస్టరాయిడ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని 2020లో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రం వెలువరించారు. ఖగోళ వస్తువులను ఇన్ఫ్రారెడ్ తరంగాల ద్వారా కాకుండా.. ఎక్స్‌రే, గామా కిరణాల ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని సూచించారు. -
ఖగోళ అద్భుతం: బ్లాక్ హోల్ వెనుక ఫస్ట్ టైం వెలుగులు
Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్ హోల్ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భూమికి 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్ హోల్లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్ డాన్ విల్కిన్స్ వెల్లడించారు. ఐన్‌స్టీన్ ఏనాడో చెప్పాడు జర్మన్ మేధావి, థియోరెటికల్ ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్ అయ్యింది. -
కృష్ణబిల పరిశోధనలకు పట్టం
స్టాక్‌హోమ్: కాంతిని కూడా తనలో లయం చేసుకోగల అపారశక్తి కేంద్రం కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు దక్కింది. అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం బ్రిటిష్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని జర్మనీకి చెందిన రైన్‌హార్డ్ గెంజెల్, అమెరికన్ శాస్త్రవేత్త ఆండ్రియా గేజ్‌లు చెరిసగం పంచుకుంటారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. కృష్ణబిలం ఏర్పడటం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్రోజ్కు అవార్డు లభించగా మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్‌హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్‌లకు అవార్డు అందిస్తున్న ట్లు అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ వివరించారు. ఒకప్పుడు కేవలం కాల్పినిక కథలకు మాత్రమే పరిమితమైన కృష్ణ బిలాలు వాస్తవిక ప్రపంచంలోనూ భాగమని ఈ పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయని, కాలం కూడా నిలిచిపో యే విస్మయకర కృష్ణబిలాల ఉనికిని ఈ అవార్డు గుర్తిస్తోందని అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్రోజ్ గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూఢి చేశారు. గెంజెల్, గేజ్‌లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతు న్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు ఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షలరెట్లు ఎక్కువ∙బరువు ఉందని గెంజెల్, గేజ్‌ల పరిశోధనలలో తెలిసింది. ఒకే రంగంలో పరిశోధనలు చేసిన వారు నోబెల్ అవార్డును పంచుకోవడం కొత్తేమీ కాదు. గత ఏడాది కెనడా దేశస్తుడైన ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్ పీబల్స్ మహా విస్ఫోటం తర్వాతి సూక్ష్మకాలపు పరిణామాలను వివరించినందుకు నోబెల్‌దక్కగా సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలను గుర్తించినందుకు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు మైకేల్ మేయర్, క్యూలోజ్‌లకు అవార్డు అందించారు. కృష్ణబిలం అంటే.. విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే... విశ్వం లోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు. సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయని అంచనా. పాలపుంతలతోపాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా. కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవు తుందో ఎవరికీ తెలియదు. ఐన్‌స్టీన్ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా ప్రకారం... కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్ని వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్ స్పాగెటిఫికేషన్ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు. 1960లో జాన్ ఆర్చీబాల్డ్ వీలర్ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు. ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్టతొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్–1. సూర్యుడు.. ఇంధనమంతా ఖర్చయిపోయి కుప్పకూలిపోయినా కృష్ణబిలంగా మారేంత పెద్దది కాదు. భూమికి అతిదగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు వీ616 మోనోసెరోటిస్. దాదాపు మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది. విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం ఎన్జీసీ 4889. నిద్రాణంగా ఉన్న ఈ కృష్ణబిలం ఎప్పుడు చైతన్యవంతమై చుట్టూ ఉన్న దుమ్ము ధూళి, కాంతులను లయం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు. సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు ‘సాగిటరియస్ –ఏ’. 40 లక్షల సూర్యుళ్లు ఒక్కదగ్గర చేరితే ఉండేంత బరువు ఉంటుంది ఇది. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. -
కొత్త బ్లాక్‌హోల్స్‌కు స్టీఫెన్ హకింగ్ పేరు
న్యూఢిల్లీ: రష్యన్ వ్యోమగాములు ఓ కొత్త బ్లాక్ హోల్(కృష్ణ బిలం)ను కనుగొన్నారు. తన జీవితమంతా అంతరిక్ష పరిశోధనలకు కేటాయించిన ప్రఖ్యాత బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హకింగ్ పేరును బ్లాక్ హోల్‌కు పెట్టారు. కొత్తగా కనిపెట్టిన బ్లాక్ హోల్ ఓఫికస్ నక్షత్రాలు కూటమిలో ఉన్నట్లు కనుగొన్నారు. సరిగ్గా స్టీఫెన్హకింగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత ఈ విషయం కనిపెట్టారు. మాస్కో స్టేట్‌యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా నక్షత్రాల కూటమిలో గామా కిరణాల పేలుళ్లను(జీఆర్బీ) పరిశీలిస్తున్నారు. నక్షత్రం కూలిపోవటం వల్లే పేలుడు సంభవించిందని, దాని స్థానంలో బ్లాక్ హోల్ ఏర్పడటానికి పరిస్థితులు దారితీశాయని వెల్లడించారు. గామా-రే ఖగోళ శాస్త్రంలో.. గామా-రే పేలుళ్లు చాలా శక్తివంతమైన పేలుళ్లు అని, సుదూరంలో ఉన్న గెలాక్సీలను కూడా అవి మింగేస్తాయని తెలిపారు. పేలుళ్ల సమయంలో విడుదలయ్యే శక్తిని టెలిస్కోపు ద్వారా బంధించడం కూడా దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సెకనులోపదో వంతు నుంచి మిల్లీ సెకండ్ సమయంలో మాయమైపోతాయని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు రష్యాన్ వ్యోమగాములు ఈ దృశ్యాన్ని బంధింపగలిగారని రష్యన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ శక్తివంతమైన పేలుళ్లను స్పెయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన మాస్టర్-ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ బంధించగలిగిందని తెలిపారు. బ్లాక్ హోల్‌పై పరిశోధనలకు గానూ దీనికి స్టీఫెన్హకింగ్ బ్లాక్ హోల్ అని నామకరణం చేసినట్లు రష్యన్ పరిశోధకులు, ఆస్ట్రోనామర్స్ టెలిగ్రామ్ జర్నల్‌లో పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణను జీఆర్బీ180316ఏ పేరుతో రిజిస్టర్ చేశారు. బ్లాక్ హోల్లో వెళ్లిన ఏ వస్తువులూ తిరిగి రాలేవు. కాంతిని కూడా బ్లాక్ హోల్స్ మింగేస్తాయి. స్టీఫెన్ హకింగ్(76) ఈ నెల 14న అమియోట్రోఫిక్ లాటెరల్ స్ల్కెరోసిస్- ప్రోగ్రెస్సివ్ న్యూరోడీజనరేటివ్ వ్యాధితో మరణించిన సంగతి తెల్సిందే. -
హాకింగ్‌కు ఎందుకు నోబెల్ రాలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : భూమిపై మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని తొలిసారిగా హెచ్చరించి వారు ఇతర గ్రహాల్లో వీలయినంత త్వరగా నివాసాలు ఏర్పాటుచేసుకోవాలని హెచ్చరించిన తొలి భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. కాలం గుట్టును శోధించేందుకు యత్నించడమే కాకుండా, కృష్ణబిలాల రహస్యాలపై అహర్నిషలు కృషిచేసిన ఆయన బుధవారం కన్నుమూశారు. మానవాళికి అద్భుతమైన సేవలు అందించి, గొప్ప పరిజ్ఞానాన్ని, ఎవరూ ఊహించని రహస్యాల గుట్టును చెప్పిన ఆయనకు ఎందుకు నోబెల్ బహుమతి రాలేదని ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బ్లాక్ హోల్ లు చనిపోతాయి అంటూ ఆయన వెల్లడించిన కొత్త సిద్ధాంతానికైనా నోబెల్ వచ్చి ఉండాలి కదా అని ప్రశ్నించుకుంటున్నారు. కృష్ణబిలాల గురించి సంక్షిప్తంగా.. బ్లాక్ హోల్స్‌ను తెలుగులో కృష్ణ బిలాలు అని అంటారు. ఆకాశంలో మనం చుక్కలుగా పిలుచుకునే నక్షత్రాలు వాటి స్వరూపం, వయసు, పదార్థ ద్రవ్య రాశుల ఆధారంగా రకరకాల మార్పులకు లోనవుతాయి. చివర దశకు చేరుకుంటాయి. కొన్ని నక్షత్రాలు వాటిలో ఉండే హైడ్రోజన్ పూర్తిగా అయిపోయాక శక్తిని విడుదల చేయలేనివిగా మారతాయి. దాంతో నక్షత్రాలలో ఉండే హీలియం తదితర పదార్థాల కేంద్రకాలను విడిగా ఉంచే ఉష్ణ శక్తి నశిస్తుంది. దాంతో ఆ పదార్థాలన్నీ అంతరంగికంగా గురుత్వాకర్షణ బలానికి గురై ఆవగింజంత పరిమాణం (చిన్న సైజు)లోకి కుంచించుకుపోతాయి. అయితే అన్ని నక్షత్రాలూ బ్లాక్ హోల్స్‌గా మారాలని ఏమీ లేదు. సూర్యుడికంటే సుమారు ఒకటిన్నర రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినట్టివే కృష్ణబిలాలుగా మారతాయని ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ ఇదివరకే సిద్ధాంతీకరించారు. నోబెల్ ఎందుకు రాలేదు? 'హాకింగ్ చెప్పిన కృష్ణబిలాలు సిద్ధాంతాన్ని కొంత అనుమానాలతో కూడిన, ఊహించదగిన భౌతిక సిద్ధాంత కేటగిరిలోకి మాత్రమే చేర్చారు. దానిని ప్రామాణికంగా ఆమోదించదగ్గ మార్గం లేదు' అని ది సైన్స్ ఆఫ్ లిబర్టీ అనే నేషనల్ జాగ్రఫిక్ మేగజిన్ రచయిత తిమోతి ఫెర్రిస్ తెలిపారు. బ్లాక్ హోల్స్ అనేవి అంతమైపోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఒక అంచనాగా చెప్పాలంటే కొన్ని బిలియన్ సంవత్సరాలకుగానీ వాటికి ఏమీ జరగదు. ఇప్పటి వరకు ఏం జరగలేదు కూడా.. అన్నింటికంటే ముందే పుట్టిన ఒక నక్షత్రం సైజు పరిమాణంలోని కృష్ణబిలానికి కూడా ఇప్పటి వరకు ఏమీ కాలేదు' అని ఆయన చెప్పారు. సైద్ధాంతిక పరంగా నిరూపించేందుకు హాకింగ్ థియరీకీ అవకాశం లేకపోయినందునే ఆయనకు బహుశా నోబెల్ రాకపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
అక్కడ ఎవరున్నారు?!
బెంగళూరు : అంతరిక్ష పరిశోధనల్లో ఇదొక అద్భుతం. విశ్వంలో ఎన్నో పాలపుంతలు.. నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులో భూమిని పోలిన గ్రహాలు, మనిషిలా ఆలోచించే జీవులు ఉన్నాయా? అనే ప్రశ్నలు సుదీర్ఘకాలంగా వస్తున్నాయి. వాటికి సమాధానలు కనుగొనేందుకు అనేక దేశాల శాస్త్రవేత్తలు బృందాలుగా మారి పరిశోధనలు చేస్తున్నారు. అంతరిక్షం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రవేత్తల బృందాలు పరిశోధనలు చేస్తున్నాయి. అందులో భాగంగా 67 మంది భారతీయ శాస్త్రవేత్తలు లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్సర్వేటరీ (లిగో)లో పని చేస్తున్నారు. ఇందులో విశేషమేముంది.. అనుకుంటే.. ఇప్పటివరకూ వేలవేల కాంతినక్షత్రాల దూరం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా.. ఆగస్టు 14న నాలుగు శక్తివంతమైన గురుత్వాకర్షణ తరంగాలను ఇండియన్ సైంటిస్టులు గుర్తించారు. అందులో శక్తివంతమైన రెండు తరంగాలు బ్లాక్‌హోల్ ఆవల నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే లిగో, ఐరోపా కేంద్రంగా పనిచేసే విర్గో సంస్థలు సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలు చేస్తున్నాయి. భారతీయ శాస్ర్తవేత్తలు భాగస్వాములుగా ఉన్న లిగో.. గురుత్వ తరంగాలపై మరింత వేగంగా పరిశోధనలు చేస్తోంది. తాజాగా కనుగొన్నబడ్డ గురుత్వ తరంగాలు.. 1.8 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. లిగో-ఇండియా అంతరిక్ష పరిశోధనల్లో గురత్వ తరంగాలను గుర్తించడం.. అద్భుతమైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గురుత్వ తరంగాలను గుర్తించడం వల్ల.. అంతరిక్షంలో ఎవరో, ఎక్కడో, మనలను పోలిన, లేక మనకన్నా ముందున్న వారు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చని లిగో సైంటిస్టులు అంటున్నారు. శక్తింతమైన..! అంతరిక్షం నుంచి జవాబులుగా వచ్చిన గురుత్వ తరంగాల్లో మొదటిది చాలా శక్తివంతమేకాక.. అంత్యంత శబ్ందతో కూడుకున్నదని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో తరంగం బలహీనంగా ఉండడమేకాక అందులో విభిన్న శబ్దాలు కలిశాయని.. చెబుతున్నారు. ఈ తరంగాలు కేవలం ఒకటి రెండు సెకండ్లు మాత్రమే ఫ్రీక్వెన్సీ బాండ్ మీద రికార్డయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డాటా ఎనాలసిస్ గురుత్వ తరంగాలను విశ్లేషణ తరువాత ఏదైనా అంచనాకు రాగలమని.. లిగో ఇండియా టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న సంజీవ్ ధురంధర్ చెబుతున్నారు. డాటా విశ్లేషణ అనేది తొలిఅడుగుగా ఆయన అభివర్ణించారు. బ్లాక్‌హోల్స్ నుంచి వచ్చిన గురుత్వ తరంగాలను గుర్తించడం అనేది.. మనం సాధించిన అతి పెద్ద విజయమని.. కగోళశాస్త్రంలో మనం ముందున్నమని చెప్పడానికి ఇదొక నిదర్శమని మరో శాస్త్రవేత్త బాల అయ్యర్ చెప్పారు. భారత్‌లో కేంద్రాలు లిగోలో బాగంగా భారత్‌లో మొత్తం 13 కేంద్రాలున్నాయి. ఇందులో 67 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. లిగో ఇండియా టీమ్‌లో భాగంగా సీఎంఐ-చెన్నై, ఐసీటీఎస్- బెంగళూరు, ఐఐఎస్ఇఆర్-కోల్‌కతా, ఐఐఎస్ఇఆర్-తిరువనంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్ఆర్సీఏటీ ఇండోర్, టీఐఎఫ్ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. లిగో డేటాను బెంగళూరు, పూణే కేంద్రాల్లో విశ్లేషణ చేస్తారు. -
అద్భుతలోక ప్రయాణం
ఇంటర్ స్టెల్లార్ హైదరాబాద్ నుండి విజయవాడ... అంతర్నగర ప్రయాణం - ఇంటర్సిటీ! భారతదేశం నుండి అమెరికా... అంతర్జాతీయ ప్రయాణం - ఇంటర్నేషనల్ జర్నీ! మరి, మన సౌర కుటుంబం నుండి మరో సౌర కుటుంబానికి ప్రయాణం...? అది - ‘ఇంటర్స్టెల్లార్’ ప్రయాణం! బూడిద తుపాన్లు, ఆమ్ల వర్షాలు, చెదపట్టిన పంటలు - అలా మనిషి మనుగడ సాగించ లేని ప్రమాద స్థితిలో భూమి. మళ్లీ భూమి లాంటి మరో గ్రహం వెతికే ప్రయాణమే - తాజా హాలీవుడ్ సంచలనం ‘ఇంటర్స్టెల్లార్’ కథావస్తువు. కూపర్ ఒక రైతు. పూర్వాశ్రమంలో నాసా పెలైట్. అతనికి పదేళ్ల కూతురు మర్ఫి. పదిహేనేళ్ల కొడుకు టామ్. భార్య లేదు. ఏదో అతీతశక్తి ఆ గదిని ఆవహించిందని మర్ఫి నమ్ముతుంది. ఆ అతీతశక్తి గురుత్వాకర్షణ తరంగాల ద్వారా ఒక సందేశాన్ని పంపుతుంది. ఆ సందేశం తండ్రీ కూతుళ్లని రహస్యంగా నడుస్తున్న నాసా కేంద్రానికి చేరేలా చేస్తుంది. ప్రొఫెసర్ జాన్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఆ నాసా కేంద్రం పని చేస్తూంటుంది. విశ్వంలో వామ్‌హోల్స్ ఉన్నాయని, వాటిని ‘వాహకం’లా వాడుకుని కొత్త గ్రహాలకు చేరే అవకాశం ఉందని చెబుతాడు బ్రాండ్. ఆ విధంగా ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు మిల్లర్, ఎడ్మండ్, మాన్ మూడు గ్రహాల్ని కనుక్కొన్నారని, వాటిని దర్శించారని, ఆ ముగ్గురి పేర్లే ఆ గ్రహాలకు పేర్లుగా పెట్టారని చెబుతాడు. ఈ మూడు గ్రహాలు గార్గాంటా అనే కృష్ణబిలం (బ్లాక్ హోల్) చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఆ గ్రహాల డాటాను సేకరించమని, ఆ మూడింటిలో ఏ ఒక్క గ్రహంపైనైనా మనిషి మనుగడకు అనువుగా ఉందేమో కనుక్కు రమ్మని కూపర్‌కు జాన్బ్రాండ్ చెబుతాడు. బ్రాండ్ కూతురు, జీవశాస్త్ర నిపుణురాలు అయిన అమెలా, మరో ఇద్దరు వ్యోమగాములు, మరో రెండు రోబోలు టర్స్, కేస్‌లతో కలిసి ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షిప్ (అంతరిక్ష నౌక) ద్వారా కూపర్ అంతరిక్షయానం చేస్తాడు. అయితే బ్రాండ్ దగ్గర రెండు ప్రతిపాదనలుంటాయి. మనిషి మనుగడ సాగించగల గ్రహాన్ని వెతకడం ప్లాన్-ఎ. అలా మూడు గ్రహాలు మనిషి మనుగడకు అనుకూలం కాని పక్షంలో తమ వెంట తీసుకెళ్లిన, ఫలదీకరించిన వివిధ రకాల జీవుల పిండాల్ని ఆ గ్రహాలపై మనగలిగేలా చేయడం ప్లాన్-బి. కూపర్‌కి ప్లాన్-బి ఇష్టం ఉండదు. ఆ గ్రహాలపై డాటా సేకరించడం, తిరిగి భూమిని చేరుకొని తన కూతుర్ని కలుసుకోవడం అనేది అతని కోరిక. ప్రత్యక్షంగా బయటపడకపోయినా జాన్బ్రాండ్కు ప్లాన్-ఎ ఫలించదని నమ్మకం. అతని ఆశ అంతా ప్లాన్-బి మాత్రమే. తప్పకుండా తిరిగి వస్తానని మాట ఇచ్చి బయలుదేరతాడు కూపర్. వెళ్లేముందు తన చేతి వాచిని కూతురికి ఇస్తాడు. తండ్రి వెళ్లడం ఇష్టం లేని మర్ఫి ఆ చేతి వాచిని విసిరి కొడుతుంది. అదొక పుస్తకాల అల్మారాలో పడిపోతుంది. కూతురి జ్ఞాపకాలతో కూపర్ బయలుదేరతాడు. వీరు ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్‌ని ఒక రాకెట్, రోదసిలో విడిచిపెడుతుంది. అప్పటికే భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఎండ్యూరెన్స్ అనే అంతరిక్ష నౌకను స్పేస్ షటిల్ అతుక్కొంటుంది. అక్కడ నుండి ఎండ్యూరెన్స్ అంతరిక్ష నౌక వేగంగా రోదసియానం చేస్తుంది. మన శనిగ్రహం దాటగానే వామ్హోల్ని గుర్తిస్తారు. ఒక వైపు దూరి మరోవైపు వెలుపలకి వచ్చే సొరంగ మార్గం లాంటిదే వామ్‌హోల్. ఒక విశ్వం నుండి మరో విశ్వానికి తక్కువ సమయంలో ఈ వామ్‌హోల్ ద్వారా ప్రయాణించవచ్చు. అలా ప్రయాణించి అవతలి వైపుకు చేరుతుంది ఎండ్యూరెన్స్ అంతరిక్షనౌక. అక్కడ నుండి షటల్ ద్వారా మిల్లర్ గ్రహాన్ని చేరుతారు. గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ (గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న చోట సమయం నెమ్మదిగా గడుస్తుంది). మిల్లర్ గ్రహంపై ఒక గంట సమయం, మన భూమి మీద 7 సంవత్సరాలతో సమానం. ఆ గ్రహం అంతా సముద్రమే. అక్కడ దిగి డాటా సేకరించే సమయంలో కనీవినీ ఎరుగని భారీ అల ముంచెత్తుకు రావడంతో తిరుగు ప్రయాణమౌతారు. అలా మిల్లర్‌కి వెళ్లి ఇలా ఎండ్యూరెన్స్ తిరిగి చేరడానికి వారికి 3 గంటల సమయం పడుతుంది. అప్పటికి భూమి మీద 23 సంవత్సరాలు గడిచాయి. కూపర్ కూతురు మర్ఫి పెద్దదై, నాసాలో బ్రాండ్ దగ్గర అసిస్టెంట్ సైంటిస్ట్‌గా పని చేస్తుంటుంది. కొడుకు టామ్ పెద్దవాడై పెళ్లి చేసుకొని తన సంతానాన్ని వీడియో ట్రాన్స్మిషన్ ద్వారా తండ్రి కూపర్‌కి పరిచయం చేస్తాడు. ఆ క్షణం కూపర్ మానసిక సాంత్వన పొందుతాడు. వీలైనంత త్వరగా మిషన్‌ను పూర్తి చేయాలనుకుంటాడు. మిగిలిన రెండు గ్రహాల్లో ఏదో ఒక గ్రహం వెళ్లడానికే ఫ్యూయల్ (ఇంధనం) ఉంటుంది. ఇంతలో మాన్ గ్రహం నుండి సంకేతాలు రావడంతో ఆ గ్రహంపై వాలతారు. దీర్ఘనిద్రలో ఉన్న డా. మాన్ని నిద్రలేపుతారు. ఆ గ్రహం అంతా గడ్డకట్టిన మంచు ముక్కలా ఉంటుంది. అక్కడ 67 గంటలు పగలు, 67 గంటలు రాత్రి. ఆ గ్రహం మనిషి బ్రతకడానికి అనువైన స్థలం అని డా. మాన్ నమ్మబలుకుతాడు. ఏమైనా తను తిరిగి భూమిని చేరాలని కూపర్ చెబుతాడు. అది డా. మాన్కు నచ్చదు. కూపర్ ఆక్సిజన్ పైప్‌ను తొలగించి వైజర్ (హెల్మెట్ ముందున్న పారదర్శక గాజుపలక)ను పగలగొట్టి చంపే ప్రయత్నం చేస్తాడు డా. మాన్. ఆ గ్రహం కూడా మానవాళికి పనికిరాదని అర్థమైపోతుంది. అతి కష్టం మీద కూపర్, అమెలీలు అక్కడ నుండి బయటపడతారు. ఈ లోపు మాన్ మరో షటిల్‌తో ఎండ్యూరెన్స్ని చేరి అతుక్కోవాలని చూస్తాడు. కానీ పాస్వర్డ్ తెలియక ప్రమాదానికి గురై పేలిపోతాడు. ఇప్పుడు కూపర్‌కి రెండు లక్ష్యాలు. కానీ ఒక్కటే సాధించగలడు. వెనక్కి కూతురి దగ్గరకు వెళ్లడమా లేదా మూడో గ్రహం ఎడ్మండ్ చేరడమా. కానీ అమెలీ లక్ష్యం మాత్రం సుస్పష్టం. అది ఎడ్మండ్ గ్రహాన్ని చేరడమే. కూపర్‌కి ఆమె ఆంతర్యం అర్థమయ్యాక తను విడిపోవాలనుకుంటాడు. విడిపోయేముందు అమెలీని ఎడ్మండ్ వైపు పయనమయ్యేలా ‘స్లింగ్షాట్’ ఆపరేషన్ చేస్తారు (ఇంధనం ఖర్చు కాకుండా ఒక గ్రహపు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని వేగంగా ప్రయాణించే ప్రక్రియే ‘స్లింగ్ షాట్’). ఆమె అలా ఎడ్మండ్ వైపు ప్రయాణం అవుతుండగా, కూపర్ ఒక్కడే ఆ ఎండ్యూరెన్స్ నుండి విడిపోయి విశ్వంలో పడిపోతాడు. అలా విడిపోవడం మూలాన ఇంధన ఖర్చు తగ్గించినవాడవుతాడు. అంతేకాక ఎడ్మండ్ గ్రహం కూడా మానవాళికి పనికి రాకపోతే ప్లాన్-బి అమలు చేయాలి. అది అతనికి ఇష్టం లేదు. అన్నిటికన్నా ప్రధానం మాట ఇచ్చినట్లుగా కూతుర్ని కలవడం. అందుకే విశ్వంలో పడి పోయాడు. అలా విశ్వంలో ప్రయాణిస్తుండగా వామ్‌హోల్ లాంటి మరో గొట్టంలో పడి పోతాడు. అయితే అది వామ్హోల్లా లేదు. ఫోర్ డెమైన్షనల్ హైపర్ క్యూబ్ (టెస్సిరాక్ట్). ఆ క్యూబ్‌లో భూత, వర్తమానాలు బంధించబడి ఉంటాయి. తన కూతురు చిన్నప్పటి దృశ్యాలు మొదలు పెద్దయ్యేంత వరకు ప్రతిదీ క్షుణ్ణంగా కనబడుతుంది. ఇక్కడ భూమి మీద బ్రాండ్ అవసాన దశలో, తన పరిశోధనలో సింగులారిటీ మిస్ అయ్యిందని, ఇక భూమి మీద మనిషి అంతరించి పోవాల్సిందేనని చెప్పి మరణిస్తాడు. మానవాళిని ఏ విధంగాైనె నా సరే భూమి నుంచి ఖాళీ చేయించాలన్న మర్ఫీని ఆ విషయం కలవరపెడుతుంది. అదే సమయంలో హైపర్ క్యూబ్‌లో కూతురి మర్ఫీ గది దగ్గరకు కూపర్ చేరి బుక్ షెల్ఫ్ని కదుపుతాడు. వాచి కింద పడుతుంది. ఆ వాచ్ లోని టైం ఒక ఈక్వేషన్‌కు ఆధారంలా తోస్తుంది. భూమ్యాకర్షణ శక్తి నుండి మానవాళి తప్పించుకొని విశ్వంలో బతకడానికి ఆధారం దొరుకుతుంది. ఆ హైపర్ క్యూబ్ నుండి వెలువడ్డాక కూపర్ స్పృహ కోల్పోతాడు. అప్పటికి మానవాళి స్పేస్ ఫారింగ్ సొసైటీ (అంతరిక్షంలో నివసించగల సంఘం)గా అవతరించి ఉంటుంది. కూపర్ కళ్లు తెరిచేసరికి శనిగ్రహం ఆవరణలో ఓ స్పేస్ స్టేషన్ హాస్పిటల్లో ఉంటాడు. చూడటానికి 40 ఏళ్ల వయసులా ఉన్న కూపర్ వయసు అప్పటికి 124 ఏళ్లు. అక్కడ 95 ఏళ్ల తన కూతుర్ని కలుస్తాడు. ఆమె వృద్ధురాలై అవసాన దశలో ఉంటుంది. ఎడ్మండ్ గ్రహానికి వెళ్లి అమెలీని కలవాల్సిందిగా తండ్రిని కోరుతుంది మర్ఫి. కూపర్ తిరిగి ఎడ్మండ్కి ప్రయాణమవుతాడు. విశ్లేషణ: ఈ సినిమాలో వాస్తవం ఎంత, కల్పన ఎంత? అంటే... వాస్తవం ఒక ఆధారం మాత్రమే! మిగతా అంతా కల్పనే... అత్యద్భుతమైన కల్పన. మాటలకందని ఊహాశక్తి. దానికి దృశ్యరూపమిచ్చిన క్రిస్టఫర్ నోలన్‌కు వెయ్యి వీరతాళ్లు వేయొచ్చు.విశ్వంలో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉన్నాయని రూఢి అయింది. అయితే వామ్‌హోల్స్ ఉంటాయని ఇంకా రూఢి కాలేదు. కాంతిని కూడా మింగేయగల శక్తి కృష్ణబిలానిది. అయితే కాంతివేగం కంటే తక్కువ వేగంతో వామ్‌హోల్స్ ప్రయాణం చేయొచ్చు అన్నది కల్పన. అది నిజమే కాబోలు అన్నంత గొప్పగా తెరపై ఆవిష్కరించారు. గ్రావిటేషనల్ టైమ్ డిలేషన్ - అంటే విశ్వంలో మనం ఒక చోట కూర్చుని రెండు వేరు వేరు గ్రహాలపై గాని, గ్రహ కూటముల వద్దగాని గడియారాల్ని పరికించి చూస్తే సమయంలో మార్పుంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నచోట టైమ్ నెమ్మదిగా గడుస్తుంది. లేని చోట వేగంగా గడుస్తుంది. దీన్ని ఆధారం చేసుకొని మిల్లర్ గ్రహంపై మూడు గంటల సమయం, భూమి మీద 21 సంవత్సరాలతో సమానం అని చెబుతారు. భూమి మీద మర్ఫి, టామ్లు పెద్దవాళ్లై ఉంటారు. కానీ కూపర్, అమెలీలు యవ్వనంలోనే ఉంటారు. ఇది అందమైన, తెలివైన కల్పన. మనమిక్కడ ఆదివారంలో ఉన్నా అమెరికా వాళ్లు శనివారంలోనే ఉంటారు. కానీ ఏకకాలంలో శని, ఆదివారాల్ని భూవాసులు అనుభవిస్తున్నట్లు ఆకాశంలో కూర్చుని చూసేవాడికి తెలుస్తుంది. ఇదీ అంతే! ఈ సినిమాలో మరో అద్భుతం ఎండ్యూరెన్స్ స్పేస్ షిప్. దాని ఆకారం, అది పని చేసే విధానం రెండూ అద్భుతాలే. అతి దగ్గర్లోనే అలాంటి నిజమైన స్పేష్షిప్ని చూస్తామనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని ఆధారం చేసుకొని ఎండ్యూరెన్స్ అనే స్పేస్‌షిప్‌ని డిజైన్ చేశారు. టార్స్ అనే రోబో కోసమైనా ఈ సినిమా చూడాలి. ఒక ఆరడుగుల బీరువాలా ఉండే టార్స్ సున్నితమైనవాడు, విధేయుడు, రక్షకుడు. సినిమా చూస్తున్నంత సేపు టార్స్ని ఒక మిషన్లా చూడము. ఒక మనిషిని చూస్తున్నట్లు చూస్తాము. దాంతో అనుబంధం పెంచుకుంటాం. మిల్లర్ నీటి గ్రహంపై డాటా సేకరించే విధానం. భారీ అల నుండి తప్పించుకొనే విభాగం. అలాగే మాన్ గ్రహంపై చివరి నిమిషంలో ల్యాండర్ (షటిల్)ని అందుకొనే సన్నివేశాలు అద్భుతం... మరో మాట లేదు. టార్స్ ఎక్కడ మిస్ అవుతాడో అని మనం కంగారు పడిపోతాము. డా. మాన్ దొంగగా ఎండ్యూరెన్స్ని డాక్ చేయాలనుకొని ప్రమాదంలో పడి పేలిపోతాడు. ఆ సమయంలో ఒక చక్రం ఆకారంలో చుట్టూ 12 క్యాప్సూల్స్ కలిగిన స్పేష్‌షిప్ ఎండ్యూరెన్స్ పాక్షికంగా దెబ్బతిని భూచక్రంలా గిర్రున తిరుగుతుంది. అంత వేగంగా తిరుగుతున్న స్పేస్‌షిప్‌తో అంతే వేగంగా తిరుగుతూ కూపర్ ప్రయాణిస్తున్న షటిల్‌ని లాక్ చేసే సన్నివేశం పరమాద్భుతం. వర్ణించలేం... చూడాల్సిందే. చివరగా ఫోర్ డెమైన్షనల్ హైపర్ క్యూబ్ లాంటి ప్రదేశం... అందులో కూపర్ చిక్కుకున్న విధానం. తన కూతురి భూత వర్తమానాల దృశ్యాలు మాటలకందవు. ఇలా తీయడం ఎలా సాధ్యం అని జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఇదంతా కల్పనే కదా అనుకున్నా, నువ్వు నమ్మి తీరాల్సిందే అని ఆ దృశ్యాలు సవాలు విసురుతాయి. దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌కి సింగిల్ పేజీలో కథ ఇచ్చి సంగీతం కంపోజ్ చేయమన్నాడట. అది చదివి థీమ్‌ని కంపోజ్ చేసి వినిపించాడట జిమ్మర్. గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు లేకుండా ముందుగానే గ్రాఫిక్స్ డిజైన్ చేసి వాటిని డిజిటల్ ప్రొజెక్టర్స్‌తో లొకేషన్లో ప్రొజెక్ట్ చేసి ఈ సినిమాని షూట్ చేశారు. గ్రాఫిక్స్ మీద ఆధారపడకుండా స్పేస్‌షిప్ లోపలి భాగం అంతా నిజంగానే నిర్మించారు. అంచేత ఐమ్యాక్స్ కెమేరా కదలికలకు ఇబ్బంది రావడంతో కెమేరామెన్ ఐమ్యాక్స్ కెమేరాను రీ డిజైన్ చేసుకొని వాడారు. ‘ఇంటర్స్టెల్లార్’ సినిమా ప్రాజెక్ట్ నిజానికి 2006లో ప్రారంభమైంది. అప్పుడు దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఈ సినిమాకు నాలుగేళ్ళు రైటర్లాగా పనిచేశారు జొనాథన్ నోలన్. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలోరిలెటివిటి థియరీని అభ్యసించాడు. ఇంతలో పారమౌంట్ పిక్చర్స్ నుండి స్పీల్బర్గ్ తప్పుకోవడంతో మరో దర్శకుడు కావాల్సి వచ్చింది. జొనాథన్ నోలన్ తన సోదరుడు క్రిస్టఫర్ నోలన్‌ను రికమెండ్ చేశాడు. అలా 2012లో ఈ సినిమా పట్టాలెక్కింది. కూపర్‌గా నటించిన మాథ్యూ మెక్ కనౌగీ, తూరు మర్ఫీ (మెక్కింగి ఫో)తో నటించిన సన్నివేశాలు అత్యంత భావోద్వేగాలకు గురి చేస్తాయి. ఒకానొక దశలలో కూపర్ ప్రయాణం ఆపేసి కూతురితో ఉండచ్చు కదా అనేంతగా వీరిద్దరి మధ్య బంధాన్ని పటిష్ఠం చేశాడు దర్శకుడు. డా. మాన్ ప్రవర్తన ఈ సినిమాలో కాస్త వింతగా ఉంటుంది. అతను కూపర్‌ని చంపే ప్రయత్నం చేయకుండా ఉండి ఉంటే బాగుండనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది అద్భుత దృశ్య భాండాగారం. చూడండి. మూడు గంటలపాటు అంతరిక్షంలో విహరించండి. విచిత్ర కథల... వెండితెర మెజీషియన్: క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్లో సుప్రసిద్ధ దర్శకుడు. ‘మెమెంటో’ (మన ‘గజిని’ సినిమాకు మూలం ఇదే), ‘బ్యాట్మన్ బిగిన్స్’, ‘ది డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’ లాంటి అపురూప చిత్రాలను అందించింది ఆయనే. అద్భుతమైన ఊహాశక్తితో అంతు చిక్కని కథాంశాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రతి సినిమా ఒక పజిల్... కానీ, ప్రేక్షకులకు యమ క్రేజ్. విడుదల: 2014 నవంబర్ 5 (యూఎస్ఎ) దర్శకుడు: క్రిస్టఫర్ నోలన్ సినిమా నిడివి: 169 నిమిషాలు నిర్మాణ వ్యయం: 165 మిలియన్ డాలర్లు (దాదాపు 1,000 కోట్ల రూపాయలు) ఇప్పటి వరకూ వసూళ్లు: 597.2 మిలియన్ డాలర్లు (దాదాపు 3,700 కోట్లు) మదన్ (‘ఆ నలుగురు’ ఫేం) సినీ రచయిత దర్శకుడు