అద్భుతలోక ప్రయాణం | Korean docu film tops box office, beats 'Interstellar,' 'Exodus' | Sakshi
Sakshi News home page

అద్భుతలోక ప్రయాణం

Published Sun, Dec 14 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

Korean docu film tops box office, beats 'Interstellar,' 'Exodus'

 ఇంటర్ స్టెల్లార్
 హైదరాబాద్ నుండి విజయవాడ... అంతర్‌నగర ప్రయాణం - ఇంటర్‌సిటీ!
 భారతదేశం నుండి అమెరికా... అంతర్జాతీయ ప్రయాణం - ఇంటర్నేషనల్ జర్నీ!
 మరి, మన సౌర కుటుంబం నుండి మరో సౌర కుటుంబానికి ప్రయాణం...?
 అది - ‘ఇంటర్‌స్టెల్లార్’ ప్రయాణం!

 
 బూడిద  తుపాన్లు, ఆమ్ల వర్షాలు, చెదపట్టిన పంటలు - అలా మనిషి మనుగడ సాగించ లేని ప్రమాద స్థితిలో భూమి. మళ్లీ భూమి లాంటి మరో గ్రహం వెతికే ప్రయాణమే - తాజా హాలీవుడ్ సంచలనం ‘ఇంటర్‌స్టెల్లార్’  కథావస్తువు. కూపర్ ఒక రైతు. పూర్వాశ్రమంలో నాసా పెలైట్. అతనికి పదేళ్ల కూతురు మర్ఫి. పదిహేనేళ్ల కొడుకు టామ్. భార్య లేదు. ఏదో అతీతశక్తి ఆ గదిని ఆవహించిందని మర్ఫి నమ్ముతుంది. ఆ అతీతశక్తి గురుత్వాకర్షణ తరంగాల ద్వారా ఒక సందేశాన్ని పంపుతుంది. ఆ సందేశం తండ్రీ కూతుళ్లని రహస్యంగా నడుస్తున్న నాసా కేంద్రానికి చేరేలా చేస్తుంది. ప్రొఫెసర్ జాన్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఆ నాసా కేంద్రం పని చేస్తూంటుంది.
 
 విశ్వంలో వామ్‌హోల్స్ ఉన్నాయని, వాటిని ‘వాహకం’లా వాడుకుని కొత్త గ్రహాలకు చేరే అవకాశం ఉందని చెబుతాడు బ్రాండ్. ఆ విధంగా ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు మిల్లర్, ఎడ్మండ్, మాన్ మూడు గ్రహాల్ని కనుక్కొన్నారని, వాటిని దర్శించారని, ఆ ముగ్గురి పేర్లే ఆ గ్రహాలకు పేర్లుగా పెట్టారని చెబుతాడు. ఈ మూడు గ్రహాలు గార్గాంటా అనే కృష్ణబిలం (బ్లాక్ హోల్) చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఆ గ్రహాల డాటాను సేకరించమని, ఆ మూడింటిలో ఏ ఒక్క గ్రహంపైనైనా మనిషి మనుగడకు అనువుగా ఉందేమో కనుక్కు రమ్మని కూపర్‌కు జాన్‌బ్రాండ్ చెబుతాడు. బ్రాండ్ కూతురు, జీవశాస్త్ర నిపుణురాలు అయిన అమెలా, మరో ఇద్దరు వ్యోమగాములు, మరో రెండు రోబోలు టర్స్, కేస్‌లతో కలిసి ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షిప్ (అంతరిక్ష నౌక) ద్వారా కూపర్ అంతరిక్షయానం చేస్తాడు.
 
 అయితే బ్రాండ్ దగ్గర రెండు ప్రతిపాదనలుంటాయి. మనిషి మనుగడ సాగించగల గ్రహాన్ని వెతకడం ప్లాన్-ఎ. అలా మూడు గ్రహాలు మనిషి మనుగడకు అనుకూలం కాని పక్షంలో తమ వెంట తీసుకెళ్లిన, ఫలదీకరించిన వివిధ రకాల జీవుల పిండాల్ని ఆ గ్రహాలపై మనగలిగేలా చేయడం ప్లాన్-బి. కూపర్‌కి ప్లాన్-బి ఇష్టం ఉండదు. ఆ గ్రహాలపై డాటా సేకరించడం, తిరిగి భూమిని చేరుకొని తన కూతుర్ని కలుసుకోవడం అనేది అతని కోరిక. ప్రత్యక్షంగా బయటపడకపోయినా జాన్‌బ్రాండ్‌కు ప్లాన్-ఎ ఫలించదని నమ్మకం. అతని ఆశ అంతా ప్లాన్-బి మాత్రమే. తప్పకుండా తిరిగి వస్తానని మాట ఇచ్చి బయలుదేరతాడు కూపర్. వెళ్లేముందు తన చేతి వాచిని కూతురికి ఇస్తాడు. తండ్రి వెళ్లడం ఇష్టం లేని మర్ఫి ఆ చేతి వాచిని విసిరి కొడుతుంది. అదొక పుస్తకాల అల్మారాలో పడిపోతుంది.
 
 కూతురి జ్ఞాపకాలతో కూపర్ బయలుదేరతాడు. వీరు ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్‌ని ఒక రాకెట్, రోదసిలో విడిచిపెడుతుంది. అప్పటికే భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఎండ్యూరెన్స్ అనే అంతరిక్ష నౌకను స్పేస్ షటిల్ అతుక్కొంటుంది. అక్కడ నుండి ఎండ్యూరెన్స్ అంతరిక్ష నౌక వేగంగా రోదసియానం చేస్తుంది. మన శనిగ్రహం దాటగానే వామ్‌హోల్‌ని గుర్తిస్తారు. ఒక వైపు దూరి మరోవైపు వెలుపలకి వచ్చే సొరంగ మార్గం లాంటిదే వామ్‌హోల్. ఒక విశ్వం నుండి మరో విశ్వానికి తక్కువ సమయంలో ఈ వామ్‌హోల్ ద్వారా ప్రయాణించవచ్చు. అలా ప్రయాణించి అవతలి వైపుకు చేరుతుంది ఎండ్యూరెన్స్ అంతరిక్షనౌక.
 
 అక్కడ నుండి షటల్ ద్వారా మిల్లర్ గ్రహాన్ని చేరుతారు. గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ (గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న చోట సమయం నెమ్మదిగా గడుస్తుంది). మిల్లర్ గ్రహంపై ఒక గంట సమయం, మన భూమి మీద 7 సంవత్సరాలతో సమానం. ఆ గ్రహం అంతా సముద్రమే. అక్కడ దిగి డాటా సేకరించే సమయంలో కనీవినీ ఎరుగని భారీ అల ముంచెత్తుకు రావడంతో తిరుగు ప్రయాణమౌతారు. అలా మిల్లర్‌కి వెళ్లి ఇలా ఎండ్యూరెన్స్ తిరిగి చేరడానికి వారికి 3 గంటల సమయం పడుతుంది. అప్పటికి భూమి మీద 23 సంవత్సరాలు గడిచాయి. కూపర్ కూతురు మర్ఫి పెద్దదై, నాసాలో బ్రాండ్ దగ్గర అసిస్టెంట్ సైంటిస్ట్‌గా పని చేస్తుంటుంది. కొడుకు టామ్ పెద్దవాడై పెళ్లి చేసుకొని తన సంతానాన్ని వీడియో ట్రాన్స్‌మిషన్ ద్వారా తండ్రి కూపర్‌కి పరిచయం చేస్తాడు.
 
 ఆ క్షణం కూపర్ మానసిక సాంత్వన పొందుతాడు. వీలైనంత త్వరగా మిషన్‌ను పూర్తి చేయాలనుకుంటాడు. మిగిలిన రెండు గ్రహాల్లో ఏదో ఒక గ్రహం వెళ్లడానికే ఫ్యూయల్ (ఇంధనం) ఉంటుంది. ఇంతలో మాన్ గ్రహం నుండి సంకేతాలు రావడంతో ఆ గ్రహంపై వాలతారు. దీర్ఘనిద్రలో ఉన్న డా. మాన్‌ని నిద్రలేపుతారు. ఆ గ్రహం అంతా గడ్డకట్టిన మంచు ముక్కలా ఉంటుంది. అక్కడ 67 గంటలు పగలు, 67 గంటలు రాత్రి. ఆ గ్రహం మనిషి బ్రతకడానికి అనువైన స్థలం అని డా. మాన్ నమ్మబలుకుతాడు. ఏమైనా తను తిరిగి భూమిని చేరాలని కూపర్ చెబుతాడు. అది డా. మాన్‌కు నచ్చదు. కూపర్ ఆక్సిజన్ పైప్‌ను తొలగించి వైజర్ (హెల్మెట్ ముందున్న పారదర్శక గాజుపలక)ను పగలగొట్టి చంపే ప్రయత్నం చేస్తాడు డా. మాన్. ఆ గ్రహం కూడా మానవాళికి పనికిరాదని అర్థమైపోతుంది. అతి కష్టం మీద కూపర్, అమెలీలు అక్కడ నుండి బయటపడతారు. ఈ లోపు మాన్ మరో షటిల్‌తో ఎండ్యూరెన్స్‌ని చేరి అతుక్కోవాలని చూస్తాడు. కానీ పాస్‌వర్డ్ తెలియక ప్రమాదానికి గురై పేలిపోతాడు.
 
 ఇప్పుడు కూపర్‌కి రెండు లక్ష్యాలు. కానీ ఒక్కటే సాధించగలడు. వెనక్కి కూతురి దగ్గరకు వెళ్లడమా లేదా మూడో గ్రహం ఎడ్‌మండ్ చేరడమా. కానీ అమెలీ లక్ష్యం మాత్రం సుస్పష్టం. అది ఎడ్‌మండ్ గ్రహాన్ని చేరడమే. కూపర్‌కి ఆమె ఆంతర్యం అర్థమయ్యాక తను విడిపోవాలనుకుంటాడు. విడిపోయేముందు అమెలీని ఎడ్‌మండ్ వైపు పయనమయ్యేలా ‘స్లింగ్‌షాట్’ ఆపరేషన్ చేస్తారు (ఇంధనం ఖర్చు కాకుండా ఒక గ్రహపు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని వేగంగా ప్రయాణించే ప్రక్రియే ‘స్లింగ్ షాట్’). ఆమె అలా ఎడ్‌మండ్ వైపు ప్రయాణం అవుతుండగా, కూపర్ ఒక్కడే ఆ ఎండ్యూరెన్స్ నుండి విడిపోయి విశ్వంలో పడిపోతాడు.
 
 అలా విడిపోవడం మూలాన ఇంధన ఖర్చు తగ్గించినవాడవుతాడు. అంతేకాక ఎడ్‌మండ్ గ్రహం కూడా మానవాళికి పనికి రాకపోతే ప్లాన్-బి అమలు చేయాలి. అది అతనికి ఇష్టం లేదు. అన్నిటికన్నా ప్రధానం  మాట ఇచ్చినట్లుగా కూతుర్ని కలవడం. అందుకే విశ్వంలో పడి పోయాడు. అలా విశ్వంలో ప్రయాణిస్తుండగా వామ్‌హోల్ లాంటి మరో గొట్టంలో పడి పోతాడు. అయితే అది వామ్‌హోల్‌లా లేదు. ఫోర్ డెమైన్షనల్ హైపర్ క్యూబ్ (టెస్సిరాక్ట్). ఆ క్యూబ్‌లో భూత, వర్తమానాలు బంధించబడి ఉంటాయి. తన కూతురు చిన్నప్పటి దృశ్యాలు మొదలు పెద్దయ్యేంత వరకు ప్రతిదీ క్షుణ్ణంగా కనబడుతుంది.
 
 ఇక్కడ భూమి మీద బ్రాండ్ అవసాన దశలో, తన పరిశోధనలో సింగులారిటీ మిస్ అయ్యిందని, ఇక భూమి మీద మనిషి అంతరించి పోవాల్సిందేనని చెప్పి మరణిస్తాడు. మానవాళిని ఏ విధంగాైనె నా సరే భూమి నుంచి ఖాళీ చేయించాలన్న మర్ఫీని ఆ విషయం కలవరపెడుతుంది. అదే సమయంలో హైపర్ క్యూబ్‌లో కూతురి మర్ఫీ గది దగ్గరకు కూపర్ చేరి బుక్ షెల్ఫ్‌ని కదుపుతాడు. వాచి కింద పడుతుంది. ఆ వాచ్ లోని టైం ఒక ఈక్వేషన్‌కు ఆధారంలా తోస్తుంది. భూమ్యాకర్షణ శక్తి నుండి మానవాళి తప్పించుకొని విశ్వంలో బతకడానికి ఆధారం దొరుకుతుంది. ఆ హైపర్ క్యూబ్ నుండి వెలువడ్డాక కూపర్ స్పృహ కోల్పోతాడు.
 
 అప్పటికి మానవాళి స్పేస్ ఫారింగ్ సొసైటీ (అంతరిక్షంలో నివసించగల సంఘం)గా అవతరించి ఉంటుంది. కూపర్ కళ్లు తెరిచేసరికి శనిగ్రహం ఆవరణలో ఓ స్పేస్ స్టేషన్ హాస్పిటల్‌లో ఉంటాడు. చూడటానికి 40 ఏళ్ల వయసులా ఉన్న కూపర్ వయసు అప్పటికి 124 ఏళ్లు. అక్కడ 95 ఏళ్ల తన కూతుర్ని కలుస్తాడు. ఆమె వృద్ధురాలై అవసాన దశలో ఉంటుంది. ఎడ్‌మండ్ గ్రహానికి వెళ్లి అమెలీని కలవాల్సిందిగా తండ్రిని కోరుతుంది మర్ఫి. కూపర్ తిరిగి ఎడ్‌మండ్‌కి ప్రయాణమవుతాడు.
 
 విశ్లేషణ: ఈ సినిమాలో వాస్తవం ఎంత, కల్పన ఎంత? అంటే... వాస్తవం ఒక ఆధారం మాత్రమే! మిగతా అంతా కల్పనే... అత్యద్భుతమైన కల్పన. మాటలకందని ఊహాశక్తి. దానికి దృశ్యరూపమిచ్చిన క్రిస్టఫర్ నోలన్‌కు వెయ్యి వీరతాళ్లు వేయొచ్చు.విశ్వంలో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉన్నాయని రూఢి అయింది. అయితే వామ్‌హోల్స్ ఉంటాయని ఇంకా రూఢి కాలేదు. కాంతిని కూడా మింగేయగల శక్తి కృష్ణబిలానిది. అయితే కాంతివేగం కంటే తక్కువ వేగంతో వామ్‌హోల్స్ ప్రయాణం చేయొచ్చు అన్నది కల్పన. అది నిజమే కాబోలు అన్నంత గొప్పగా తెరపై ఆవిష్కరించారు.
 
 గ్రావిటేషనల్ టైమ్ డిలేషన్ - అంటే విశ్వంలో మనం ఒక చోట కూర్చుని రెండు వేరు వేరు గ్రహాలపై గాని, గ్రహ కూటముల వద్దగాని గడియారాల్ని పరికించి చూస్తే సమయంలో మార్పుంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నచోట టైమ్ నెమ్మదిగా గడుస్తుంది. లేని చోట వేగంగా గడుస్తుంది. దీన్ని ఆధారం చేసుకొని మిల్లర్ గ్రహంపై మూడు గంటల సమయం, భూమి మీద 21 సంవత్సరాలతో సమానం అని చెబుతారు. భూమి మీద మర్ఫి, టామ్‌లు పెద్దవాళ్లై ఉంటారు. కానీ కూపర్, అమెలీలు యవ్వనంలోనే ఉంటారు. ఇది అందమైన, తెలివైన కల్పన. మనమిక్కడ ఆదివారంలో ఉన్నా అమెరికా వాళ్లు శనివారంలోనే ఉంటారు. కానీ ఏకకాలంలో శని, ఆదివారాల్ని భూవాసులు అనుభవిస్తున్నట్లు ఆకాశంలో కూర్చుని చూసేవాడికి తెలుస్తుంది. ఇదీ అంతే!
 
 ఈ సినిమాలో మరో అద్భుతం ఎండ్యూరెన్స్ స్పేస్ షిప్. దాని ఆకారం, అది పని చేసే విధానం రెండూ అద్భుతాలే. అతి దగ్గర్లోనే అలాంటి నిజమైన స్పేష్‌షిప్‌ని చూస్తామనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని ఆధారం చేసుకొని ఎండ్యూరెన్స్ అనే స్పేస్‌షిప్‌ని డిజైన్ చేశారు.
 
 టార్స్ అనే రోబో కోసమైనా ఈ సినిమా చూడాలి. ఒక ఆరడుగుల బీరువాలా ఉండే టార్స్ సున్నితమైనవాడు, విధేయుడు, రక్షకుడు. సినిమా చూస్తున్నంత సేపు టార్స్‌ని ఒక మిషన్‌లా చూడము. ఒక మనిషిని చూస్తున్నట్లు చూస్తాము. దాంతో అనుబంధం పెంచుకుంటాం.
 
 మిల్లర్ నీటి గ్రహంపై డాటా సేకరించే విధానం. భారీ అల నుండి తప్పించుకొనే విభాగం. అలాగే మాన్ గ్రహంపై చివరి నిమిషంలో ల్యాండర్ (షటిల్)ని అందుకొనే సన్నివేశాలు అద్భుతం... మరో మాట లేదు. టార్స్ ఎక్కడ మిస్ అవుతాడో అని మనం కంగారు పడిపోతాము.
 
 డా. మాన్ దొంగగా ఎండ్యూరెన్స్‌ని డాక్ చేయాలనుకొని ప్రమాదంలో పడి పేలిపోతాడు. ఆ సమయంలో ఒక చక్రం ఆకారంలో చుట్టూ 12 క్యాప్సూల్స్ కలిగిన స్పేష్‌షిప్ ఎండ్యూరెన్స్ పాక్షికంగా దెబ్బతిని భూచక్రంలా గిర్రున తిరుగుతుంది. అంత వేగంగా తిరుగుతున్న స్పేస్‌షిప్‌తో అంతే వేగంగా తిరుగుతూ కూపర్ ప్రయాణిస్తున్న షటిల్‌ని లాక్ చేసే సన్నివేశం పరమాద్భుతం. వర్ణించలేం... చూడాల్సిందే.
 
 చివరగా ఫోర్ డెమైన్షనల్ హైపర్ క్యూబ్ లాంటి ప్రదేశం... అందులో కూపర్ చిక్కుకున్న విధానం. తన కూతురి భూత వర్తమానాల దృశ్యాలు మాటలకందవు. ఇలా తీయడం ఎలా సాధ్యం అని జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఇదంతా కల్పనే కదా అనుకున్నా, నువ్వు నమ్మి తీరాల్సిందే అని ఆ దృశ్యాలు సవాలు విసురుతాయి.
 
 దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌కి సింగిల్ పేజీలో కథ ఇచ్చి సంగీతం కంపోజ్ చేయమన్నాడట. అది చదివి థీమ్‌ని కంపోజ్ చేసి వినిపించాడట జిమ్మర్. గ్రీన్ మ్యాట్‌లు, బ్లూ మ్యాట్‌లు లేకుండా ముందుగానే గ్రాఫిక్స్ డిజైన్ చేసి వాటిని డిజిటల్ ప్రొజెక్టర్స్‌తో లొకేషన్‌లో ప్రొజెక్ట్ చేసి ఈ సినిమాని షూట్ చేశారు. గ్రాఫిక్స్ మీద ఆధారపడకుండా స్పేస్‌షిప్ లోపలి భాగం అంతా నిజంగానే నిర్మించారు. అంచేత ఐమ్యాక్స్ కెమేరా కదలికలకు ఇబ్బంది రావడంతో కెమేరామెన్ ఐమ్యాక్స్ కెమేరాను రీ డిజైన్ చేసుకొని వాడారు.
 
 ‘ఇంటర్‌స్టెల్లార్’ సినిమా ప్రాజెక్ట్ నిజానికి 2006లో ప్రారంభమైంది. అప్పుడు దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. ఈ సినిమాకు నాలుగేళ్ళు రైటర్‌లాగా పనిచేశారు జొనాథన్ నోలన్. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలోరిలెటివిటి థియరీని అభ్యసించాడు. ఇంతలో పారమౌంట్ పిక్చర్స్ నుండి స్పీల్‌బర్గ్ తప్పుకోవడంతో మరో దర్శకుడు కావాల్సి వచ్చింది. జొనాథన్ నోలన్ తన సోదరుడు క్రిస్టఫర్ నోలన్‌ను రికమెండ్ చేశాడు. అలా 2012లో ఈ సినిమా పట్టాలెక్కింది. కూపర్‌గా నటించిన మాథ్యూ మెక్ కనౌగీ, తూరు మర్ఫీ (మెక్కింగి ఫో)తో నటించిన సన్నివేశాలు అత్యంత భావోద్వేగాలకు గురి చేస్తాయి. ఒకానొక దశలలో కూపర్ ప్రయాణం ఆపేసి కూతురితో ఉండచ్చు కదా అనేంతగా వీరిద్దరి మధ్య బంధాన్ని పటిష్ఠం చేశాడు దర్శకుడు. డా. మాన్ ప్రవర్తన ఈ సినిమాలో కాస్త వింతగా ఉంటుంది. అతను కూపర్‌ని చంపే ప్రయత్నం చేయకుండా ఉండి ఉంటే బాగుండనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది అద్భుత దృశ్య భాండాగారం. చూడండి. మూడు గంటలపాటు అంతరిక్షంలో విహరించండి.
 
 విచిత్ర కథల... వెండితెర మెజీషియన్: క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్‌లో సుప్రసిద్ధ దర్శకుడు. ‘మెమెంటో’ (మన ‘గజిని’ సినిమాకు మూలం ఇదే), ‘బ్యాట్‌మన్ బిగిన్స్’, ‘ది డార్క్ నైట్’, ‘ఇన్‌సెప్షన్’ లాంటి అపురూప చిత్రాలను అందించింది ఆయనే. అద్భుతమైన ఊహాశక్తితో అంతు చిక్కని కథాంశాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రతి సినిమా ఒక పజిల్... కానీ, ప్రేక్షకులకు యమ క్రేజ్.
 
 విడుదల:
 2014 నవంబర్ 5 (యూఎస్‌ఎ)
 దర్శకుడు: క్రిస్టఫర్ నోలన్
 సినిమా నిడివి: 169 నిమిషాలు
 నిర్మాణ వ్యయం: 165 మిలియన్ డాలర్లు (దాదాపు 1,000 కోట్ల రూపాయలు)
 ఇప్పటి వరకూ వసూళ్లు: 597.2 మిలియన్ డాలర్లు (దాదాపు 3,700 కోట్లు)
 
  మదన్ (‘ఆ నలుగురు’ ఫేం) సినీ రచయిత  దర్శకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement