International Travel
-
మనోళ్లు విదేశాలను చుట్టేస్తున్నారు..!
న్యూఢిల్లీ: సానుకూల స్థూలఆర్థిక పరిస్థితుల దన్నుతో విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా రెండుసార్లు లేదా అంతకు మించి పర్యటిస్తున్న వారి సంఖ్య 32 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రయాణాలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్‌లు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. 2023 జూన్ నుంచి 2024 మే మధ్య కాలానికి సంబంధించి ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫాం మేక్మైట్రిప్ రూపొందించిన ’హౌ ఇండియా ట్రావెల్స్ ఎబ్రాడ్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం విదేశాలకు వెళ్లే భారతీయులకు యూఏఈ, థాయ్‌లాండ్, అమెరికా టాప్ గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే కజకిస్తాన్, అజర్బైజాన్, భూటాన్‌లపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ‘చేతిలో కొంత మిగిలే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ సంస్కృతుల గురించి మరింతగా తెలుస్తుండటం, ప్రయాణాలు సులభతరం కావడం తదితర అంశాల కారణంగా విహారయాత్రలు లేదా వ్యాపార అవసరాల రీత్యా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా పర్యాటకం ప్రోత్సాహకరంగానే ఉండగా మా తాజా విశ్లేషణ ప్రకారం స్థూలఆర్థిక అంశాల ఊతంతో భారతీయుల్లో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ధోరణులు గణనీయంగా పెరుగుతున్నాయి‘ అని మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ మెగో తెలిపారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ⇒ టాప్ 10 వర్ధమాన గమ్యస్థానాలకు సంబంధించి సెర్చ్ చేయడం 70 శాతం పెరిగింది. అజర్‌బైజాన్‌లోని అల్మటీ, బకూ కోసం సెర్చ్‌లు వరుసగా 527 శాతం, 395 శాతం పెరిగాయి. ⇒ విలాసవంతమైన ప్రయాణాలపై కూడా భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో బిజినెస్ తరగతి ఫ్లయిట్స్ కోసం చేసే సెర్చ్‌లు 10 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. ⇒ సెర్చ్‌లలో 131 శాతం వృద్ధితో హాంకాంగ్ టాప్‌లో ఉంది. శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేíÙయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒ ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్‌లో దాదాపు సగం బుకింగ్స్ టారిఫ్ రోజుకు రూ. 7,000 పైనే ఉంటున్నాయి. హోటళ్ల విషయంలో న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఈ విషయంలో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే టాప్ గమ్యస్థానాల జాబితాలో దక్షిణాసియాలోని పోఖారా, పట్టాయా, కౌలాలంపూర్ మొదలైనవి ఉన్నాయి. ⇒ సీజన్లతో పనిలేకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి సెర్చ్‌ల పరిమాణం అన్ని కాలాల్లోనూ స్థిరంగా ఉంటోంది. డిసెంబర్లో మాత్రం అత్యధికంగా సెర్చ్‌లు నమోదవుతున్నాయి. -
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
వాషింగ్టన్: భారత్ సహా వివిధ దేశాలపైనున్న ప్రయాణాల ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా ఎత్తివేసింది. నవంబర్ 8 నుంచి విదేశీ ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వారు విమానం ఎక్కడానికి ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణ ఆంక్షల్ని ఎత్తివేసే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేసినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. ‘‘కోవిడ్ కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో వివిధ దేశాలపై విధించిన ఆంక్షల్ని అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎత్తివేస్తున్నాం. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మా దేశంలోకి ఇక అనుమతి లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చర్యలు ఉంటాయ్’’అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. చదవండి: (చైనాలో డెల్టా వేరియెంట్ భయం) అయితే 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. 10 శాతం కంటే తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన సుమారు 50 దేశాల ప్రయాణికులపై కూడా అమెరికా ఆంక్షల్ని సడలించింది.. ఆయా దేశాల నుంచి వచ్చేవారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్తో రావాల్సి ఉంటుంది. వారు అమెరికాలో 2 నెలల కంటే ఎక్కువ రోజులు ఉంటే వ్యాక్సిన్ తప్పనిసరి. ‘‘కొత్త నిబంధనల ప్రకారం విదేశీ ప్రయాణికులు 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా నెగెటివ్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరి. ఇవన్నీ అమెరికన్లు, విదేశీ ప్రజల భద్రత కోసమే తీసుకువచ్చాం’’అని వైట్‌హౌస్ అధికారి చెప్పారు. యూకే, ఈయూ, ఐర్లాండ్, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై 2020 లోనే అమెరికా ఆంక్షలు విధించింది. -
Sudha Mahalingam: 70 ఏళ్ల డాక్టర్.. ఇప్పటికి 70 దేశాలు చుట్టారు.. ఇంకా
70 ఏళ్లు డాక్టర్ సుధా మహాలింగంకు. ఇప్పటికి దాదాపు 70 దేశాలు చుట్టేసిందామె. భయం లేదు.. గియం లేదు... బ్యాగ్ సర్దుకుని పదండి అంటోందామె. మరి తోడు? ఎవరూ అక్కర్లేదు.. మీరు ఎక్కడకు వెళితే అక్కడి మనుషులే తోడు అంటుంది. నిజానికి మన దేశాన్ని పూర్తిగా చూడటానికే ఒక జీవిత కాలం సరిపోదు. ఉన్న ఆయుష్షులో ఇంత పెద్ద ప్రపంచం చూడాలంటే ఎంత వేగిర పడాలి. అందుకే సుధా మహాలింగం భ్రమణకాంక్ష కొందరికి ఈర్ష్య పుట్టిస్తోంది... కొందరిచే టికెట్లు బుక్ చేయిస్తోంది. ‘వీలున్నప్పుడు మంచి ప్రయాణం చేయాలి అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. నామాట నమ్మండి. వీలు ఎప్పుడూ ఉండదు. వీలు చేసుకోవాలి’ అంటుంది సుధా మహాలింగం. ఆమె కథ కొంచెం అసూయ పుట్టించేదే. ‘చాలామంది మేగజీన్లలో మంచి మంచి ట్రావెల్ ఫొటోలు చూసి అంతటితో సంతృప్తి పడతారు. నా అదృష్టం... నేను ఆ చోట్లకంతా వెళ్లాను’ అంటుందామె. బెంగళూరుకు చెందిన సుధా మహాలింగంకు చెన్నైతో కూడా అనుబంధం ఉంది. ఆమె భర్త సివిల్ సర్వీసెస్‌లో పని చేసి రిటైర్ అయ్యాడు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకున్న సుధ ‘అందరూ చెప్పేటటువంటి తీర్చిదిద్దేటటువంటి’ జీవితాన్నే ఆ తర్వాతి 25 ఏళ్లు జీవించింది. 50వ ఏట వరకూ ఆమె కూడా ట్రావెల్ మేగజీన్లు చూస్తూ గడిపింది. అదనంగా చేసిన పని ఏదైనా ఉంటే భర్త టూర్లు వెళ్లినప్పుడు తోడు వెళ్లడమే. కాని ఒకసారి ఒక విశేషం జరిగింది. భర్తకు ఆఫీస్ పని మీద స్వీడన్లో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది. తోడు వెళ్లిన సుధకు అక్కడ ఖాళీగా ఉండటం బోరు కొట్టింది. ‘నేను ఒక్కదాన్నే ఫిన్లాండ్కు ఒక షిప్లో వెళ్లాను. అక్కడి నుంచి నార్వేకు ట్రైన్లో వెళ్లాను. అక్కడి నుంచి డెన్మార్క్, బెర్లిన్ తిరిగి మళ్లీ స్వీడన్ చేరుకున్నాను. భలే అనిపించింది’ అంటుంది సుధ. కాని ఆమె కాలి కింద చక్రాలు ఏర్పడటానికి 2003 రావాల్సి వచ్చింది. అంతకు రెండేళ్ల ముందు ఆమె ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ (ఇంధన శక్తి) ఎక్స్‌పర్ట్‌గా మారింది. ‘ఆ సమయంలో ఆ రంగంలో ఎవరూ ఎక్స్‌పర్ట్‌లు లేరు. దాంతో నాకు దేశవిదేశాల నుంచి కాన్ఫరెన్స్‌లకు ఆహ్వానాలు రాసాగాయి. 2003లో కిర్గిస్తాన్ వెళ్లాను ఒక్కదాన్నే. అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ వెళ్లాను. ఒక్కదాన్నే తిరగడంలో ఆనందం అర్థమైంది. ఇక నేను ఆగలేదు. నా భ్రమణ జీవితం నా 50వ ఏట మొదలైంది’ అంటుంది సుధా నాగలింగం. సుధకు ఇద్దరు కొడుకులు. వాళ్లు ఎప్పుడూ తల్లికి మద్దతే. ‘నీ ఇష్టం వచ్చినట్టు లోకం చూడమ్మా. కాని సేఫ్‌గా ఉండు’ అంటారు. కాని భర్త సంప్రదాయవాది. ‘ఆయన నేను ఎక్కడకు వెళ్లానో తెలిస్తే కంగారు పడతారు. అందుకని ఎక్కడికో చెప్పను. వచ్చాక నా ప్రయాణ అనుభవాలు బ్లాగ్‌లో రాస్తే చదువుకుంటారు. వచ్చేశాక ఏం భయం’ అని నవ్వుతుందామె. స్త్రీగా ఉంటూ ఒంటరిగా తిరుగుతూ 50 ఏళ్లు పైబడ్డాక ఇన్ని పర్యటనలు చేయడం సుధా నాగలింగంకే చెల్లిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె నేపాల్ మీదుగా ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ అధిరోహణ చేసింది. ఆస్ట్రేలియాలో డీప్ సీ డైవింగ్ చేసింది. ఆ దేశంలోని ‘ఉలురు’లో స్కైడైవింగ్ కూడా చేసింది. ఆకాశంలో ఇన్స్ట్రక్టర్ సహాయంతో దూకినప్పుడు ఆమె వయసు 66 సంవత్సరాలు. ‘నా ప్రయాణాల్లో అనుకోనివి ఎన్నో జరిగాయి. నైరోబీ ఎయిర్పోర్ట్ లో ఎల్లో ఫీవర్ వాక్సినేషన్ లేదని నన్ను ఆపేశారు. చైనాలో వెజిటేరియన్ రెస్టరెంట్ వెతకలేక ఆకలి తో నకనకలాడాను. చెక్ రిపబ్లిక్ లో వాలిడ్ వీసా లేదని చాలా హంగామా చేశారు. ఇరాన్లో ఒక చారిత్రక కట్టడం చూస్తుంటే నేను లోపల ఉన్నానన్న సంగతి మరచి సిబ్బంది తాళం వేసుకు వెళ్లిపోయారు. ఇన్ని జరిగినా చివరకు మనుషులు తోడు నిలిచారు. ప్రయాణాలు సాటి మనుషుల మీద విశ్వాసాన్ని పెంచుతాయి అని తెలుసుకున్నాను’ అంటుందామె. ‘నేను తిరిగిన అన్నీ దేశాల్లోకెల్లా ఇరాన్లో స్త్రీలు ఒంటరిగా చాలా సేఫ్‌గా తిరగొచ్చు అని తెలుసుకున్నాను.’ అంటుందామె. ఇరాక్‌ను కూడా చుట్టేసింది. ‘సాధారణంగా కొత్త ప్రాంతాల్లో తిరుగుతుంటే స్థానికులు ఆకర్షణీయంగా ఉండే స్త్రీలను చూస్తారు. గమనిస్తారు. కాని నా వయసు, మామూలు దుస్తులు నా మీద అటెన్షన్ పడేలా చేయవు. అందుకే నేను స్వేచ్ఛగా అన్నీ ఆస్వాదిస్తాను’ అంటుందామె. ‘ఇండోనేషియాలో రెయిన్ ఫారెస్ట్‌లో పది రోజులు ఉన్నాను. అక్కడ మోకాలు లోతున ఆకులు రాలిపడి ఉంటాయి. వాతావరణం అనూహ్యంగా ఉంటుంది. వేరెవరైనా సరే భయపడతారు. కాని నేను మాత్రం ప్రకృతి ఎంత చిక్కగా ఉంటుందో అక్కడే చూడగలిగాను. ఏ మలినం లేని ప్రకృతి అది’ అంటుంది సుధ. ఆమె ఇకపై ఆఫ్రికా ఖండం చుట్టాలనుకుంది. అక్కడ ఏ అనుభవాలు మూటకట్టుకోనుందో. ‘పెళ్లి.. పిల్లలు.. కెరీర్– ఉంటాయి. కాని ఇవి మాత్రమే జీవితం కాదు. మన జీవితంలో ఎన్నో జీవితాలు జీవించాలి. ప్రయాణాలు ఒక అవసరమైన జీవితం. అద్భుత జీవితం. జీవిస్తేనే అందులోని గొప్పతనం తెలుస్తుంది’ అంటుందామె. ఆమె మాటలు విని, కదిలే అదృష్టం ఎందరిదో. -
భారత్ సహా 4 దేశాలపై నిషేధం ఎత్తివేత
మాస్కో: మహమ్మారి కరోనా ప్రవేశంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడం.. వ్యాక్సిన్ కూడా రావడంతో క్రమేణా ప్రపంచ దేశాలు ఇతర దేశాలకు రాకపోకలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారతదేశం షరతులతో రాకపోకలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా ఇప్పుడు పలు దేశాలకు విధించిన రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసింది. భారతదేశంతో పాటు ఫిన్‌ల్యాండ్, వియత్నాం, ఖతార్ దేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు కొనసాగించవచ్చని రష్యా నిన్న ప్రకటించింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మార్చి 16, 2020లో విధించిన నిషేధం దాదాపు పది నెలల తర్వాత జనవరి 25న ఎత్తివేశారు. దీంతో ఈ దేశాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యాలో 36, 79, 247 కరోనా కేసులు నమోదవగా, 68, 397 మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశంలో తాజాగా సోమవారం 19,290 కేసులు నమోదవగా.. 456 మృతులు నమోదయ్యాయి. -
‘అంతర్జాతీయ విమాన సేవలు అప్పుడే’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నియంత్రణలను ఎత్తివేసే దిశగా వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పూరీ మంగళవారం పేర్కొన్నారు. ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్ సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ విమాన సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని నిర్ధిష్టంగా తాను వెల్లడించలేనని చెప్పారు. కాగా ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాల సంఖ్యపై పరిమితులతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను అనుమతించిన సంగతి తెలిసిందే. చదవండి : పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. -
విదేశీ ప్రయాణమే కొంపముంచిందా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం కుగ్రామం కావడం కరోనా వైరస్‌కు కలిసొచ్చింది. సీఎం కేసీఆర్ చెప్పినట్లు స్వాభిమానం ఎక్కువున్న ఈ వైరస్.. ఆహ్వానించగానే అంతర్జాతీయ ప్రయాణికుల ఒడిలో చేరింది. మన దేశంలోనూ అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరగడంతో వారి ద్వారా సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చి భయాందోళనలకు గురిచేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణిలకు సంఖ్యను పరిశీలిస్తే గత పదేళ్లలో ఇతర దేశాల నుంచి దేశంలోకి వచ్చిన వారి సంఖ్య మూడింతలు పెరిగింది. చదవండి: వందేళ్లకో మహమ్మారి.. అధికారిక లెక్కల ప్రకారం 2008లో ఇతర దేశాల నుంచి మన భూభాగంపై అడుగు పెట్టిన వారు 52 లక్షల మంది అయితే, 2018లో ఏకంగా అది 1.74 కోట్లకు చేరింది. దీంతోపాటు మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారు 2009లో 1.1 కోట్లుగా నమోదైతే, 2018లో ఆ సంఖ్య 2.6 కోట్లకు చేరింది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారానే మన దేశంలోకి కోవిడ్ మహమ్మారి అడుగుపెట్టడం ఆందోళనకరం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది విదేశీ ప్రయాణికుల ద్వారానే ఇతర దేశాలకు పాకింది. చైనాలోని వుహాన్ పట్టణంలో పుట్టిన ఈ వైరస్ విమానాల్లో ప్రయాణించి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా, ఇటలీ, హాంకాంగ్, జర్మనీ, లండన్ తదితర దేశాలు అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అగ్రభాగాన నిలవగా, అందులోని మెజారిటీ దేశాలు కోవిడ్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. -
అద్భుతలోక ప్రయాణం
ఇంటర్ స్టెల్లార్ హైదరాబాద్ నుండి విజయవాడ... అంతర్నగర ప్రయాణం - ఇంటర్సిటీ! భారతదేశం నుండి అమెరికా... అంతర్జాతీయ ప్రయాణం - ఇంటర్నేషనల్ జర్నీ! మరి, మన సౌర కుటుంబం నుండి మరో సౌర కుటుంబానికి ప్రయాణం...? అది - ‘ఇంటర్స్టెల్లార్’ ప్రయాణం! బూడిద తుపాన్లు, ఆమ్ల వర్షాలు, చెదపట్టిన పంటలు - అలా మనిషి మనుగడ సాగించ లేని ప్రమాద స్థితిలో భూమి. మళ్లీ భూమి లాంటి మరో గ్రహం వెతికే ప్రయాణమే - తాజా హాలీవుడ్ సంచలనం ‘ఇంటర్స్టెల్లార్’ కథావస్తువు. కూపర్ ఒక రైతు. పూర్వాశ్రమంలో నాసా పెలైట్. అతనికి పదేళ్ల కూతురు మర్ఫి. పదిహేనేళ్ల కొడుకు టామ్. భార్య లేదు. ఏదో అతీతశక్తి ఆ గదిని ఆవహించిందని మర్ఫి నమ్ముతుంది. ఆ అతీతశక్తి గురుత్వాకర్షణ తరంగాల ద్వారా ఒక సందేశాన్ని పంపుతుంది. ఆ సందేశం తండ్రీ కూతుళ్లని రహస్యంగా నడుస్తున్న నాసా కేంద్రానికి చేరేలా చేస్తుంది. ప్రొఫెసర్ జాన్ బ్రాండ్ ఆధ్వర్యంలో ఆ నాసా కేంద్రం పని చేస్తూంటుంది. విశ్వంలో వామ్‌హోల్స్ ఉన్నాయని, వాటిని ‘వాహకం’లా వాడుకుని కొత్త గ్రహాలకు చేరే అవకాశం ఉందని చెబుతాడు బ్రాండ్. ఆ విధంగా ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు మిల్లర్, ఎడ్మండ్, మాన్ మూడు గ్రహాల్ని కనుక్కొన్నారని, వాటిని దర్శించారని, ఆ ముగ్గురి పేర్లే ఆ గ్రహాలకు పేర్లుగా పెట్టారని చెబుతాడు. ఈ మూడు గ్రహాలు గార్గాంటా అనే కృష్ణబిలం (బ్లాక్ హోల్) చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఆ గ్రహాల డాటాను సేకరించమని, ఆ మూడింటిలో ఏ ఒక్క గ్రహంపైనైనా మనిషి మనుగడకు అనువుగా ఉందేమో కనుక్కు రమ్మని కూపర్‌కు జాన్బ్రాండ్ చెబుతాడు. బ్రాండ్ కూతురు, జీవశాస్త్ర నిపుణురాలు అయిన అమెలా, మరో ఇద్దరు వ్యోమగాములు, మరో రెండు రోబోలు టర్స్, కేస్‌లతో కలిసి ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షిప్ (అంతరిక్ష నౌక) ద్వారా కూపర్ అంతరిక్షయానం చేస్తాడు. అయితే బ్రాండ్ దగ్గర రెండు ప్రతిపాదనలుంటాయి. మనిషి మనుగడ సాగించగల గ్రహాన్ని వెతకడం ప్లాన్-ఎ. అలా మూడు గ్రహాలు మనిషి మనుగడకు అనుకూలం కాని పక్షంలో తమ వెంట తీసుకెళ్లిన, ఫలదీకరించిన వివిధ రకాల జీవుల పిండాల్ని ఆ గ్రహాలపై మనగలిగేలా చేయడం ప్లాన్-బి. కూపర్‌కి ప్లాన్-బి ఇష్టం ఉండదు. ఆ గ్రహాలపై డాటా సేకరించడం, తిరిగి భూమిని చేరుకొని తన కూతుర్ని కలుసుకోవడం అనేది అతని కోరిక. ప్రత్యక్షంగా బయటపడకపోయినా జాన్బ్రాండ్కు ప్లాన్-ఎ ఫలించదని నమ్మకం. అతని ఆశ అంతా ప్లాన్-బి మాత్రమే. తప్పకుండా తిరిగి వస్తానని మాట ఇచ్చి బయలుదేరతాడు కూపర్. వెళ్లేముందు తన చేతి వాచిని కూతురికి ఇస్తాడు. తండ్రి వెళ్లడం ఇష్టం లేని మర్ఫి ఆ చేతి వాచిని విసిరి కొడుతుంది. అదొక పుస్తకాల అల్మారాలో పడిపోతుంది. కూతురి జ్ఞాపకాలతో కూపర్ బయలుదేరతాడు. వీరు ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్‌ని ఒక రాకెట్, రోదసిలో విడిచిపెడుతుంది. అప్పటికే భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఎండ్యూరెన్స్ అనే అంతరిక్ష నౌకను స్పేస్ షటిల్ అతుక్కొంటుంది. అక్కడ నుండి ఎండ్యూరెన్స్ అంతరిక్ష నౌక వేగంగా రోదసియానం చేస్తుంది. మన శనిగ్రహం దాటగానే వామ్హోల్ని గుర్తిస్తారు. ఒక వైపు దూరి మరోవైపు వెలుపలకి వచ్చే సొరంగ మార్గం లాంటిదే వామ్‌హోల్. ఒక విశ్వం నుండి మరో విశ్వానికి తక్కువ సమయంలో ఈ వామ్‌హోల్ ద్వారా ప్రయాణించవచ్చు. అలా ప్రయాణించి అవతలి వైపుకు చేరుతుంది ఎండ్యూరెన్స్ అంతరిక్షనౌక. అక్కడ నుండి షటల్ ద్వారా మిల్లర్ గ్రహాన్ని చేరుతారు. గ్రావిటేషనల్ టైమ్ డైలేషన్ (గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్న చోట సమయం నెమ్మదిగా గడుస్తుంది). మిల్లర్ గ్రహంపై ఒక గంట సమయం, మన భూమి మీద 7 సంవత్సరాలతో సమానం. ఆ గ్రహం అంతా సముద్రమే. అక్కడ దిగి డాటా సేకరించే సమయంలో కనీవినీ ఎరుగని భారీ అల ముంచెత్తుకు రావడంతో తిరుగు ప్రయాణమౌతారు. అలా మిల్లర్‌కి వెళ్లి ఇలా ఎండ్యూరెన్స్ తిరిగి చేరడానికి వారికి 3 గంటల సమయం పడుతుంది. అప్పటికి భూమి మీద 23 సంవత్సరాలు గడిచాయి. కూపర్ కూతురు మర్ఫి పెద్దదై, నాసాలో బ్రాండ్ దగ్గర అసిస్టెంట్ సైంటిస్ట్‌గా పని చేస్తుంటుంది. కొడుకు టామ్ పెద్దవాడై పెళ్లి చేసుకొని తన సంతానాన్ని వీడియో ట్రాన్స్మిషన్ ద్వారా తండ్రి కూపర్‌కి పరిచయం చేస్తాడు. ఆ క్షణం కూపర్ మానసిక సాంత్వన పొందుతాడు. వీలైనంత త్వరగా మిషన్‌ను పూర్తి చేయాలనుకుంటాడు. మిగిలిన రెండు గ్రహాల్లో ఏదో ఒక గ్రహం వెళ్లడానికే ఫ్యూయల్ (ఇంధనం) ఉంటుంది. ఇంతలో మాన్ గ్రహం నుండి సంకేతాలు రావడంతో ఆ గ్రహంపై వాలతారు. దీర్ఘనిద్రలో ఉన్న డా. మాన్ని నిద్రలేపుతారు. ఆ గ్రహం అంతా గడ్డకట్టిన మంచు ముక్కలా ఉంటుంది. అక్కడ 67 గంటలు పగలు, 67 గంటలు రాత్రి. ఆ గ్రహం మనిషి బ్రతకడానికి అనువైన స్థలం అని డా. మాన్ నమ్మబలుకుతాడు. ఏమైనా తను తిరిగి భూమిని చేరాలని కూపర్ చెబుతాడు. అది డా. మాన్కు నచ్చదు. కూపర్ ఆక్సిజన్ పైప్‌ను తొలగించి వైజర్ (హెల్మెట్ ముందున్న పారదర్శక గాజుపలక)ను పగలగొట్టి చంపే ప్రయత్నం చేస్తాడు డా. మాన్. ఆ గ్రహం కూడా మానవాళికి పనికిరాదని అర్థమైపోతుంది. అతి కష్టం మీద కూపర్, అమెలీలు అక్కడ నుండి బయటపడతారు. ఈ లోపు మాన్ మరో షటిల్‌తో ఎండ్యూరెన్స్ని చేరి అతుక్కోవాలని చూస్తాడు. కానీ పాస్వర్డ్ తెలియక ప్రమాదానికి గురై పేలిపోతాడు. ఇప్పుడు కూపర్‌కి రెండు లక్ష్యాలు. కానీ ఒక్కటే సాధించగలడు. వెనక్కి కూతురి దగ్గరకు వెళ్లడమా లేదా మూడో గ్రహం ఎడ్మండ్ చేరడమా. కానీ అమెలీ లక్ష్యం మాత్రం సుస్పష్టం. అది ఎడ్మండ్ గ్రహాన్ని చేరడమే. కూపర్‌కి ఆమె ఆంతర్యం అర్థమయ్యాక తను విడిపోవాలనుకుంటాడు. విడిపోయేముందు అమెలీని ఎడ్మండ్ వైపు పయనమయ్యేలా ‘స్లింగ్షాట్’ ఆపరేషన్ చేస్తారు (ఇంధనం ఖర్చు కాకుండా ఒక గ్రహపు గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని వేగంగా ప్రయాణించే ప్రక్రియే ‘స్లింగ్ షాట్’). ఆమె అలా ఎడ్మండ్ వైపు ప్రయాణం అవుతుండగా, కూపర్ ఒక్కడే ఆ ఎండ్యూరెన్స్ నుండి విడిపోయి విశ్వంలో పడిపోతాడు. అలా విడిపోవడం మూలాన ఇంధన ఖర్చు తగ్గించినవాడవుతాడు. అంతేకాక ఎడ్మండ్ గ్రహం కూడా మానవాళికి పనికి రాకపోతే ప్లాన్-బి అమలు చేయాలి. అది అతనికి ఇష్టం లేదు. అన్నిటికన్నా ప్రధానం మాట ఇచ్చినట్లుగా కూతుర్ని కలవడం. అందుకే విశ్వంలో పడి పోయాడు. అలా విశ్వంలో ప్రయాణిస్తుండగా వామ్‌హోల్ లాంటి మరో గొట్టంలో పడి పోతాడు. అయితే అది వామ్హోల్లా లేదు. ఫోర్ డెమైన్షనల్ హైపర్ క్యూబ్ (టెస్సిరాక్ట్). ఆ క్యూబ్‌లో భూత, వర్తమానాలు బంధించబడి ఉంటాయి. తన కూతురు చిన్నప్పటి దృశ్యాలు మొదలు పెద్దయ్యేంత వరకు ప్రతిదీ క్షుణ్ణంగా కనబడుతుంది. ఇక్కడ భూమి మీద బ్రాండ్ అవసాన దశలో, తన పరిశోధనలో సింగులారిటీ మిస్ అయ్యిందని, ఇక భూమి మీద మనిషి అంతరించి పోవాల్సిందేనని చెప్పి మరణిస్తాడు. మానవాళిని ఏ విధంగాైనె నా సరే భూమి నుంచి ఖాళీ చేయించాలన్న మర్ఫీని ఆ విషయం కలవరపెడుతుంది. అదే సమయంలో హైపర్ క్యూబ్‌లో కూతురి మర్ఫీ గది దగ్గరకు కూపర్ చేరి బుక్ షెల్ఫ్ని కదుపుతాడు. వాచి కింద పడుతుంది. ఆ వాచ్ లోని టైం ఒక ఈక్వేషన్‌కు ఆధారంలా తోస్తుంది. భూమ్యాకర్షణ శక్తి నుండి మానవాళి తప్పించుకొని విశ్వంలో బతకడానికి ఆధారం దొరుకుతుంది. ఆ హైపర్ క్యూబ్ నుండి వెలువడ్డాక కూపర్ స్పృహ కోల్పోతాడు. అప్పటికి మానవాళి స్పేస్ ఫారింగ్ సొసైటీ (అంతరిక్షంలో నివసించగల సంఘం)గా అవతరించి ఉంటుంది. కూపర్ కళ్లు తెరిచేసరికి శనిగ్రహం ఆవరణలో ఓ స్పేస్ స్టేషన్ హాస్పిటల్లో ఉంటాడు. చూడటానికి 40 ఏళ్ల వయసులా ఉన్న కూపర్ వయసు అప్పటికి 124 ఏళ్లు. అక్కడ 95 ఏళ్ల తన కూతుర్ని కలుస్తాడు. ఆమె వృద్ధురాలై అవసాన దశలో ఉంటుంది. ఎడ్మండ్ గ్రహానికి వెళ్లి అమెలీని కలవాల్సిందిగా తండ్రిని కోరుతుంది మర్ఫి. కూపర్ తిరిగి ఎడ్మండ్కి ప్రయాణమవుతాడు. విశ్లేషణ: ఈ సినిమాలో వాస్తవం ఎంత, కల్పన ఎంత? అంటే... వాస్తవం ఒక ఆధారం మాత్రమే! మిగతా అంతా కల్పనే... అత్యద్భుతమైన కల్పన. మాటలకందని ఊహాశక్తి. దానికి దృశ్యరూపమిచ్చిన క్రిస్టఫర్ నోలన్‌కు వెయ్యి వీరతాళ్లు వేయొచ్చు.విశ్వంలో కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ఉన్నాయని రూఢి అయింది. అయితే వామ్‌హోల్స్ ఉంటాయని ఇంకా రూఢి కాలేదు. కాంతిని కూడా మింగేయగల శక్తి కృష్ణబిలానిది. అయితే కాంతివేగం కంటే తక్కువ వేగంతో వామ్‌హోల్స్ ప్రయాణం చేయొచ్చు అన్నది కల్పన. అది నిజమే కాబోలు అన్నంత గొప్పగా తెరపై ఆవిష్కరించారు. గ్రావిటేషనల్ టైమ్ డిలేషన్ - అంటే విశ్వంలో మనం ఒక చోట కూర్చుని రెండు వేరు వేరు గ్రహాలపై గాని, గ్రహ కూటముల వద్దగాని గడియారాల్ని పరికించి చూస్తే సమయంలో మార్పుంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నచోట టైమ్ నెమ్మదిగా గడుస్తుంది. లేని చోట వేగంగా గడుస్తుంది. దీన్ని ఆధారం చేసుకొని మిల్లర్ గ్రహంపై మూడు గంటల సమయం, భూమి మీద 21 సంవత్సరాలతో సమానం అని చెబుతారు. భూమి మీద మర్ఫి, టామ్లు పెద్దవాళ్లై ఉంటారు. కానీ కూపర్, అమెలీలు యవ్వనంలోనే ఉంటారు. ఇది అందమైన, తెలివైన కల్పన. మనమిక్కడ ఆదివారంలో ఉన్నా అమెరికా వాళ్లు శనివారంలోనే ఉంటారు. కానీ ఏకకాలంలో శని, ఆదివారాల్ని భూవాసులు అనుభవిస్తున్నట్లు ఆకాశంలో కూర్చుని చూసేవాడికి తెలుస్తుంది. ఇదీ అంతే! ఈ సినిమాలో మరో అద్భుతం ఎండ్యూరెన్స్ స్పేస్ షిప్. దాని ఆకారం, అది పని చేసే విధానం రెండూ అద్భుతాలే. అతి దగ్గర్లోనే అలాంటి నిజమైన స్పేష్షిప్ని చూస్తామనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని ఆధారం చేసుకొని ఎండ్యూరెన్స్ అనే స్పేస్‌షిప్‌ని డిజైన్ చేశారు. టార్స్ అనే రోబో కోసమైనా ఈ సినిమా చూడాలి. ఒక ఆరడుగుల బీరువాలా ఉండే టార్స్ సున్నితమైనవాడు, విధేయుడు, రక్షకుడు. సినిమా చూస్తున్నంత సేపు టార్స్ని ఒక మిషన్లా చూడము. ఒక మనిషిని చూస్తున్నట్లు చూస్తాము. దాంతో అనుబంధం పెంచుకుంటాం. మిల్లర్ నీటి గ్రహంపై డాటా సేకరించే విధానం. భారీ అల నుండి తప్పించుకొనే విభాగం. అలాగే మాన్ గ్రహంపై చివరి నిమిషంలో ల్యాండర్ (షటిల్)ని అందుకొనే సన్నివేశాలు అద్భుతం... మరో మాట లేదు. టార్స్ ఎక్కడ మిస్ అవుతాడో అని మనం కంగారు పడిపోతాము. డా. మాన్ దొంగగా ఎండ్యూరెన్స్ని డాక్ చేయాలనుకొని ప్రమాదంలో పడి పేలిపోతాడు. ఆ సమయంలో ఒక చక్రం ఆకారంలో చుట్టూ 12 క్యాప్సూల్స్ కలిగిన స్పేష్‌షిప్ ఎండ్యూరెన్స్ పాక్షికంగా దెబ్బతిని భూచక్రంలా గిర్రున తిరుగుతుంది. అంత వేగంగా తిరుగుతున్న స్పేస్‌షిప్‌తో అంతే వేగంగా తిరుగుతూ కూపర్ ప్రయాణిస్తున్న షటిల్‌ని లాక్ చేసే సన్నివేశం పరమాద్భుతం. వర్ణించలేం... చూడాల్సిందే. చివరగా ఫోర్ డెమైన్షనల్ హైపర్ క్యూబ్ లాంటి ప్రదేశం... అందులో కూపర్ చిక్కుకున్న విధానం. తన కూతురి భూత వర్తమానాల దృశ్యాలు మాటలకందవు. ఇలా తీయడం ఎలా సాధ్యం అని జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఇదంతా కల్పనే కదా అనుకున్నా, నువ్వు నమ్మి తీరాల్సిందే అని ఆ దృశ్యాలు సవాలు విసురుతాయి. దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్‌కి సింగిల్ పేజీలో కథ ఇచ్చి సంగీతం కంపోజ్ చేయమన్నాడట. అది చదివి థీమ్‌ని కంపోజ్ చేసి వినిపించాడట జిమ్మర్. గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు లేకుండా ముందుగానే గ్రాఫిక్స్ డిజైన్ చేసి వాటిని డిజిటల్ ప్రొజెక్టర్స్‌తో లొకేషన్లో ప్రొజెక్ట్ చేసి ఈ సినిమాని షూట్ చేశారు. గ్రాఫిక్స్ మీద ఆధారపడకుండా స్పేస్‌షిప్ లోపలి భాగం అంతా నిజంగానే నిర్మించారు. అంచేత ఐమ్యాక్స్ కెమేరా కదలికలకు ఇబ్బంది రావడంతో కెమేరామెన్ ఐమ్యాక్స్ కెమేరాను రీ డిజైన్ చేసుకొని వాడారు. ‘ఇంటర్స్టెల్లార్’ సినిమా ప్రాజెక్ట్ నిజానికి 2006లో ప్రారంభమైంది. అప్పుడు దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఈ సినిమాకు నాలుగేళ్ళు రైటర్లాగా పనిచేశారు జొనాథన్ నోలన్. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నా లజీలోరిలెటివిటి థియరీని అభ్యసించాడు. ఇంతలో పారమౌంట్ పిక్చర్స్ నుండి స్పీల్బర్గ్ తప్పుకోవడంతో మరో దర్శకుడు కావాల్సి వచ్చింది. జొనాథన్ నోలన్ తన సోదరుడు క్రిస్టఫర్ నోలన్‌ను రికమెండ్ చేశాడు. అలా 2012లో ఈ సినిమా పట్టాలెక్కింది. కూపర్‌గా నటించిన మాథ్యూ మెక్ కనౌగీ, తూరు మర్ఫీ (మెక్కింగి ఫో)తో నటించిన సన్నివేశాలు అత్యంత భావోద్వేగాలకు గురి చేస్తాయి. ఒకానొక దశలలో కూపర్ ప్రయాణం ఆపేసి కూతురితో ఉండచ్చు కదా అనేంతగా వీరిద్దరి మధ్య బంధాన్ని పటిష్ఠం చేశాడు దర్శకుడు. డా. మాన్ ప్రవర్తన ఈ సినిమాలో కాస్త వింతగా ఉంటుంది. అతను కూపర్‌ని చంపే ప్రయత్నం చేయకుండా ఉండి ఉంటే బాగుండనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది అద్భుత దృశ్య భాండాగారం. చూడండి. మూడు గంటలపాటు అంతరిక్షంలో విహరించండి. విచిత్ర కథల... వెండితెర మెజీషియన్: క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్లో సుప్రసిద్ధ దర్శకుడు. ‘మెమెంటో’ (మన ‘గజిని’ సినిమాకు మూలం ఇదే), ‘బ్యాట్మన్ బిగిన్స్’, ‘ది డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’ లాంటి అపురూప చిత్రాలను అందించింది ఆయనే. అద్భుతమైన ఊహాశక్తితో అంతు చిక్కని కథాంశాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఆయన ప్రతి సినిమా ఒక పజిల్... కానీ, ప్రేక్షకులకు యమ క్రేజ్. విడుదల: 2014 నవంబర్ 5 (యూఎస్ఎ) దర్శకుడు: క్రిస్టఫర్ నోలన్ సినిమా నిడివి: 169 నిమిషాలు నిర్మాణ వ్యయం: 165 మిలియన్ డాలర్లు (దాదాపు 1,000 కోట్ల రూపాయలు) ఇప్పటి వరకూ వసూళ్లు: 597.2 మిలియన్ డాలర్లు (దాదాపు 3,700 కోట్లు) మదన్ (‘ఆ నలుగురు’ ఫేం) సినీ రచయిత దర్శకుడు -
జోరు తగ్గని పర్యాటకం
న్యూఢిల్లీ: భారత పర్యాటకులపై రూపాయి పతనం ప్రభా వం స్వల్పమేనని ప్రముఖ యాత్రా పోర్టళ్లు అంటున్నా యి. రూపాయి పతనంతో భారత టూరిస్టులు బెంబేలెత్తిపోవడం లేదని, తమ టూర్లను రద్దు చేసుకోవడం లేదని యాత్రాడాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ మొత్తం 6,000 మందిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 62 శాతం మంది తమ షెడ్యూల్ ప్రకారమే టూర్లను కొనసాగిస్తున్నారని సర్వే పేర్కొంది. దక్షిణాసియా దేశాల పర్యటనకే భారత టూరిస్టుల ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ తర్వాతి స్థానాల్లో యూరప్, అమెరికా, బ్రిటన్లు ఉన్నాయని తెలిపింది. ప్రణాళిక ప్రకారమే... పర్యాటకులు కనీసం రెండు నెలలు ముందుగానే తన ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారని, అందువల్ల రూపాయి పతనం ప్రభావం పెద్దగా ఉండదని మేక్‌మైట్రిప్‌డాట్‌కామ్ పేర్కొంది. అయితే విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిందని ఎక్స్‌పీడియాడాట్‌కోడాట్‌ఇన్ పేర్కొంది. అయితే రూపాయి పతనం వల్ల భారత్‌ను సందర్శించే విదేశీయుల సంఖ్య పెరుగుతుందని వివరించింది.