వాషింగ్టన్: భారత్ సహా వివిధ దేశాలపైనున్న ప్రయాణాల ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా ఎత్తివేసింది. నవంబర్ 8 నుంచి విదేశీ ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వారు విమానం ఎక్కడానికి ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణ ఆంక్షల్ని ఎత్తివేసే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేసినట్టు శ్వేతసౌధం వెల్లడించింది.
‘‘కోవిడ్ కేసులు ఉధృతంగా ఉన్న సమయంలో వివిధ దేశాలపై విధించిన ఆంక్షల్ని అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎత్తివేస్తున్నాం. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మా దేశంలోకి ఇక అనుమతి లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా చర్యలు ఉంటాయ్’’అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
చదవండి: (చైనాలో డెల్టా వేరియెంట్ భయం)
అయితే 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. 10 శాతం కంటే తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిన సుమారు 50 దేశాల ప్రయాణికులపై కూడా అమెరికా ఆంక్షల్ని సడలించింది.. ఆయా దేశాల నుంచి వచ్చేవారు 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్‌తో రావాల్సి ఉంటుంది. వారు అమెరికాలో 2 నెలల కంటే ఎక్కువ రోజులు ఉంటే వ్యాక్సిన్ తప్పనిసరి.
‘‘కొత్త నిబంధనల ప్రకారం విదేశీ ప్రయాణికులు 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనా నెగెటివ్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరి. ఇవన్నీ అమెరికన్లు, విదేశీ ప్రజల భద్రత కోసమే తీసుకువచ్చాం’’అని వైట్‌హౌస్ అధికారి చెప్పారు. యూకే, ఈయూ, ఐర్లాండ్, చైనా, భారత్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై 2020 లోనే అమెరికా ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment