క్రిస్టఫర్ నోలన్
సినిమా స్క్రిప్ట్‌ల్లో బాపు సినిమా స్క్రిప్ట్ ప్రత్యేకమైనది. ఇంచక్కా ప్రతి సన్నివేశానికి బొమ్మలు వేసి స్క్రిప్టు బుక్‌లో ముందే సినిమా చూపిస్తారు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే బొమ్మలతో స్క్రిప్ట్‌లు తయారు చేసుకుంటారు. ‘ఇన్‌సెప్షన్’ నుంచి ఇటీవలి ‘ఇంటర్‌స్టెల్లార్’ చిత్రాల దాకా హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఈ దిగ్దర్శకుడు కూడా స్క్రిప్ట్‌ను స్కెచ్‌లుగా మార్చే కళాకారుడే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ట్రైబె కా చిత్రోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రిస్టఫర్ మాట్లాడుతూ ‘‘మూలకథ కూడా రాసుకోను. అంతా స్కెచ్ వర్కే ఉంటుంది. దీంతో కథలో తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇదే నా శైలి. నా ‘మెమొంటో’ చిత్రానికి మాత్రమే స్క్రిప్ట్ రాసుకున్నాను. మిగతా వాటన్నిటికీ ఇలస్ట్రేషన్స్ వేసుకున్నా’’ అని చెప్పారు.