నక్షత్రాకాశం మాయం కానున్నదా? | Sakshi Guest Column On Sky Stars By KB Gopalam | Sakshi
Sakshi News home page

నక్షత్రాకాశం మాయం కానున్నదా?

Published Sun, Jun 11 2023 3:13 AM | Last Updated on Sun, Jun 11 2023 3:13 AM

Sakshi Guest Column On Sky Stars By KB Gopalam

చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడా పల్లెకు వెళ్లి ఆరుబయట పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేవి. పట్నం చేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. ఇందుకు కారణం ‘కాంతి కాలుష్యం’ అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలను మనకు కనిపించకుండా చేస్తున్నాయి. 

నక్షత్రాలనూ, అంతరిక్షంలోని ఇతర అంశాలనూ పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూశారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూసినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి సృష్టించిన వెలుగులు ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు మొదలయ్యాయి.

జర్మనీ దేశంలో క్రిస్టఫర్‌ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. ఒక పట్టణంలో బాగా వెలుతురుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ప్రదేశాలతో ఒక పటం తయారు చేస్తారు. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కళ్ళు కూడా చూడగలుగుతాయి. 

2011వ సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశారు. ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు.

యూరోప్‌ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా! మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు.

మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించనే కనిపించవేమో అంటున్నారు పరిశోధకులు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చారు.

నివాసాల దగ్గర ఉండే వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు, మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమక పడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. కాంతి కాలుష్యాన్ని ఎవరికి వారు తగ్గించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు.

‘అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం’ అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు.

వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్‌ ఆఫ్‌ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అందరూ చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు.

కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రకృతి అందం పాడవకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంతవరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. ముందు తరాలకు అందమైన నక్షత్రాకాశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
కె.బి. గోపాలం
వ్యాసకర్త సైన్స్‌ అంశాల రచయిత ‘ మొబైల్‌: 9849062055  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement