kb gopalam
-
పగటి నిద్ర మేలే సుమా!
పగటి నిద్ర పనికి చేటు అన్నారు మనవాళ్లు. కానీ పరిశోధకులు మరోరకంగా అంటున్నట్టున్నారు. పగటి పూట పని చేసుకునేట ప్పుడు కళ్ళు బరువెక్కుతాయి. నిద్ర వస్తున్న భావన కలుగుతుంది. అప్పుడు కాసేపు పడుకుంటే తప్పా? అంటే కాదు అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యం దృష్ట్యా చూస్తే కొంతసేపు పడుకోవడం మంచిదే అంటున్నారు. అయితే ఈ పగటి నిద్ర అందరిపైనా ఒకే ప్రభావం కలిగిస్తుందా అన్న ప్రశ్న కూడా ఉంది. చాలామందిలో మాత్రం కొంతసేపు పడుకుంటే మంచి జరుగుతుంది అని గమనించినట్లు పరిశోధకులు చెబు తున్నారు. క్రమంగా ప్రతి నిత్యం మధ్యాహ్నం కొంచెం సేపు పడుకుంటే అన్ని రకాల మంచిదే. దాని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అని కొంత కాలం క్రితమే తెలుసుకున్నారు. మెదడుకు కూడా మంచిదే అంటున్నారు. మెదడు కణాలు తగ్గకుండా ఉంటే జ్ఞాపకశక్తి తగ్గడం అనే సమస్య తగ్గుతుంది. అయితే ఎంతసేపు పడుకోవాలి అన్నది పెద్ద ప్రశ్న. అరగంట వరకు పడుకుంటే తప్పు లేదు. మెదడుకు మంచి ఆరోగ్యం అందుతుంది, అది పనిచేసే, పెరిగే తీరు సక్రమంగా సాగుతుంది అంటున్నారు విక్టోరియా గార్ఫీల్డ్. ఆమె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పరిశోధ కురాలు. సరైన సమయంలో కొద్దిపాటి నిద్ర వెంటనే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విష యాన్ని చాలా పరిశోధనల్లో నిర్ధారించారు. ఆరో గ్యంగా ఉన్నవారు ఒక క్రమంలో నిద్రపోతూ ఉంటే వాళ్ల మీద పరిశోధనలు జరిగాయి. పాత పరిశోధనల ఫలితాలను ఇక్కడి ఫలితాలతో సరిపోల్చి చూశారు. నిజానికి 2009లోనే ఇటు వంటి పరిశోధనా ఫలితాలు ‘స్లీప్ రీసెర్చ్’ అనే పత్రికలో వచ్చాయి. కొంతసేపు పడుకున్న వారిలో వారు పరిస్థితులకు ప్రతిచర్య చూపించే తీరు, చురుకుదనం, జ్ఞాపకశక్తి లాంటి అంశా లలో మంచి ప్రభావాలు కనిపించాయి. నిద్ర పోయి లేచిన తర్వాత సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంటే కొత్త అంశాలను ఊహించడం కూడా బాగా జరుగుతుంది. ఈ అంశం ఇటీవల పరిశోధనల్లో గమనించారు. పరిశోధనకు కూర్చున్న వారికి కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. ఆ లెక్కల్లో కొన్నింటికి సులభ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం వాలంటీర్లకు చెప్పలేదు. ప్రశ్న ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు పరిశోధకులు. కొద్దిసేపు కునికిన వారు కూడా ఆ లెక్కలను సులభంగా సాల్వ్ చేయగలిగారు. వారికి స్వల్ప మార్గాలు చటుక్కున తోచాయి. అదే ఎక్కువ సేపు నిద్ర పోయిన వారిలో మాత్రం ఇటువంటి చురుకు దనం కనిపించలేదు. అంటే మెదడులో ఎక్కడో విరామం కలిగే అవకాశం గల స్థానం ఉందని, దానివల్ల యురేకా అనుభవం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. నిద్ర సరిగా రానివారూ, కావలసినంత నిద్ర పోలేని వారు కూడా కొద్దిసేపు పడుకున్నందుకు మంచి ప్రభావాలు ఉంటాయి అంటు న్నారు. షిఫ్ట్‌లలో పనిచేసేవారూ, చిన్న శిశు వులతో బతికే తల్లితండ్రులూ, రాత్రిపూట సరిగా నిద్ర పట్టని పెద్ద వయసు వారూ చిన్న కునుకు వల్ల లాభం పొందినట్టు గమనించారు. రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్న వాళ్లు షిఫ్ట్ మధ్యలో కొద్ది సేపు పడుకుంటే తప్పకుండా నిద్ర మత్తు తగ్గుతుంది. అసలు నిద్ర వస్తున్న భావమే కలు గదు. కొద్దిసేపు పడుకుని లేచిన తరువాత త్వర లోనే పరిస్థితి మారిపోతుంది. వారిలో చురుకు దనం కనిపిస్తుంది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో పని చేస్తున్న నటాలి డాటోవిచ్ బృందం వారు కూడా ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. వారికి నిజానికి ఔషధాలు తయారు చేసే కంపెనీలు, వైద్య పరికరాల కంపెనీలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. 20 నిమిషాలు పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గంటనుంచి గంటన్నరసేపు పడుకుంటే మరింతమంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నటాలి. పడుకుంటే 20 నిమిషాలు పడు కోవాలి, లేదంటే గంటపైన పడు కోవాలి. అంతే కానీ మధ్యలో లేస్తే అంత మంచి ప్రభావం ఉండదు అని గమనించారు. ఎక్కువ రోజులపాటు ఇలా కునుకులు తీసే వారి మీద ప్రభావం గురించి మాత్రం అంతగా సమాచారం లేదు. నిద్రకు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి గల సంబంధాన్ని గురించి చెప్పడం అంత తేలిక కాదు అని కూడా ఈ పరిశోధకులు అంటున్నారు. ‘కొంచెం సేపు నిద్రపోతే మంచిదేనట’ అని నిద్రకు ఉపక్రమించేవారు ఫలితాలను గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.మంచి ఫలితాలు కనిపిస్తే కొంచెం సేపు నిద్రించ వచ్చు. ఆ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసు కోవాల్సినది.డా‘‘ కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత -
పశుపక్ష్యాదులకూ లెక్కలు తెలుసు!
సంగీత జ్ఞానం అని ఒక మాట ఉంది. భక్తి లేకుండా సంగీత జ్ఞానం లేదు అంటాడు త్యాగరాజు. ఆ సంగతి పక్కన పెడితే స్వరజ్ఞానం, తాళజ్ఞానం అని సంగీతంలో రెండు భాగాలు. ఇక అక్షరజ్ఞానం అని మరొక మాట ఉంది. అంటే చదవడం, రాయడం రావడం అన్నమాట. మరి అంకెల మాట ఏమిటి? అందరికీ ఏదో ఒక రకంగా లెక్కపెట్టడం తెలిసే ఉంటుంది. చివరకు పిల్లలకు కూడా పంపకంలో తమకు అన్యాయం జరిగిన సంగతి అర్థం అవుతుంది. ఈ రకంగా మొత్తం మీద అందరికీ అంకెల గురించిన తెలివి ఉంటుంది. అది అనుకోకుండానే వస్తుంది. మనిషి మెదడుకు అంకెలు అర్థమవుతాయి, వాటి మధ్యన లంకె తెలుస్తుంది. అయితే ఈ జ్ఞానం ఉన్నది ఒక్క మనుషులకే కాదు అంటున్నారు. చీమల నుంచి మొదలు తేనెటీగల దాకా ఇంకా పైజాతి జంతువుల వరకు అన్నింటికీ అంకెల గురించి తెలుసు అంటున్నారు. కోతులు, సాలెపురుగులు కూడా కొన్ని అంకెలనైనా తెలుసుకుంటాయి అంటారు పరిశోధకులు. తేనెటీగలు బయలుదేరి తేనె సేకరణ కోసం తిరుగుతూ ఏ ప్రాంతంలో ఎక్కువ పువ్వులు ఉన్నదీ సులభంగా అర్థం చేసుకుంటాయి. కోతులకు ఏ చెట్టు మీద పండ్లు ఎక్కువ ఉన్నాయీ తెలుస్తుంది. ఎదుటి గుంపు గర్జనలను గుర్తించి క్రూర మృగాలు శత్రువుల సంఖ్యను తెలుసుకుంటాయి. జంతువులన్నీ ఆ రకంగా విషయాలు తెలుసుకుంటే గాని వాటి బతుకు సులభంగా సాగదు అంటారు ఆండ్రియాస్ నీడర్. ఆయన జర్మనీలోని ‘ట్యూబింజెన్’ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. సంఖ్యను గుర్తించే ఈ వెసులుబాటు జంతు జాతుల చరిత్రలో అత్యంత ప్రారంభ కాలంలోనే మొదలైంది అంటున్నారు పరిశోధకులు. అయితే మరి కొత్తగా ఈ సంగతిని గురించి ఎందుకు పట్టించుకోవాలి అన్నది ప్రశ్న. ఒక్కసారి చూచి గుర్తుంచుకోగలిగిన అంకెల విషయంలో మనుషులకు పరిమితులు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. నాలుగు వరకు మాత్రమే సులభంగా గుర్తుంటాయి అంటున్నారు. ఒకచోట నాలుగు పుస్తకాలు ఉంటే సులభంగా గుర్తించగలుగుతాం. అంతకన్నా ఎక్కువగా ఉంటే లెక్కపెట్టవలసి వస్తుంది. ఏ విషయంలో అయినా ఇదే పరిమితి. ఇందులో కూడా రెండు అంచెలు ఉంటాయి. ముందు సంఖ్య నిర్ణయం అవుతుంది. ఆ తరువాత ఆ సంఖ్య సరైనదేనా అని లెక్క తేలుతుంది. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పెట్రో పినైరో షాగాస్ ఈ విషయంలో ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఇక ఏ అంకె లేకుండా... అంటే సున్నా అన్న భావన ఉన్నచోట కూడా లెక్కింపు అవసరమే అంటున్నారు. అసలు అంకెలు అన్నింటిలోకి సున్నా అన్నది చాలా గొప్పది అంటారు నీడర్. చిన్న చిన్న అంకెలు నేర్చుకున్న తర్వాత కూడా సున్నా అనే భావన నేర్చుకోవడానికి చిన్నపిల్లలకు కొంతకాలం పడుతుంది అని పరిశోధకులు గమనించారు. ఏదో ఉంది అని చెప్పడం, వాటిని లెక్కించడం వింతగా తోచదు కానీ ఏమీ లేని చోట సున్నా అన్న భావన రావడం గొప్ప విషయం. నీడర్ బృందం వారు తమ పరిశోధన ద్వారా కోతులు, తేనెటీగలు, కాకులకు కూడా ‘0’ అన్న విషయం తెలుసునని కనుగొన్నారు. ఈ అంశం గురించి కొంత కాలం క్రితమే ‘క్వాంటా’ అనే పరిశోధన పత్రికలో వ్యాసాలు వచ్చాయి. చాలావరకు జంతువులు, లేదంటే జంతువులు అన్నింటికీ సంఖ్యాజ్ఞానం ఉంది అని సులభంగానే తెలుస్తుంది కానీ దానికి పరిమితి ఎక్కడ అన్న ప్రశ్న చిత్రమైనది. ఆస్ట్రేలియాలోని డికెన్స్ యూనివర్సిటీలో కృషి చేస్తున్న స్కార్లెట్ హోవర్డ్ ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. జంతువు అంకెల పరిమితి మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారం కాక మరీ ఎక్కువగా ఉందని కనుగొన్నారు. సున్నా అంటే ఒకటి కన్నా తక్కువ అని తెలుసునట. వాటికి కూడికలు, గుణకారాలు కూడా తెలుసునట. నిజానికి మనిషి పరిణామం చాలా కాలం తర్వాత జరిగింది. మనిషికి కూడా ఈ లెక్కలన్నీ తెలిశాయి. ఇది మొత్తం ప్రాణి ప్రపంచంలోనే ఉన్న విషయం అని పరిశోధకులకు తెలిసింది. మనుషులు ఒకసారి చూచినా, విన్నా ఎనిమిది అంకెల వరకు సులభంగా గుర్తించగలుగుతారని కొంత కాలం క్రితమే తెలుసు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ నంబర్లు 10 అంకెలు ఉంటాయి. కనుక వాటిని ఒకసారి విని గుర్తుంచుకోవడం కష్టం అవుతున్నదట. కొంతకాలం క్రితం ఫోన్ నంబర్లలో 8 కన్నా తక్కువ అంకెలు ఉండేవి. అప్పట్లో సులభంగా గుర్తుండేవట!ఇటువంటి విషయాలను గురించి మనం సాధారణంగా ఆలోచించం. అది సైంటిస్టుల పని అనుకుంటాం. నిజానికి ఈ విషయాలు అందరికీ సంబంధించినవి మరి!కె.బి.గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
ఆ కాలమానం కొలతలెలా?
చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడిన ట్లయింది. 2025 సంవత్సరం నాటికి మళ్ళీ మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని కూడా ప్రణాళికలు తయారవు తున్నాయి. వాటిలో నేరుగా మనుషులు ఉండకపోవచ్చు. కానీ మరమనుషులు తప్పకుండా ఉంటారు. ఆ యంత్రాలు అక్కడ బయట తిరిగి ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగిస్తాయి. వాటి కొరకు మనుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు. అంటే, భూమి మీద లాగే అక్కడ కూడా కార్యక్రమాలన్నీ ఒక కాల మానం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం వస్తుందన్నమాట! అందుకే చంద్రుని మీద కాలాన్ని లెక్కిండడం ఎలా అనేది ఇప్పుడు మానవాళి ముందున్న ముఖ్య మైన ప్రశ్నగా నిలిచింది. అపోలో వ్యోమగాములు చంద్ర గోళం మీద దిగారు. తమ పని తాము ముగించి తిరిగి వచ్చేశారు. అక్కడ వారికి కాలం కొలతలతో అవసరం రాలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఉంటాయంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరం అవుతాయి. భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే సమయాన్ని లెక్కించే పద్ధతిని అక్కడ కూడా అనుసరించవలసి ఉంది. ఈ మాట అనడానికి సులభంగానే ఉన్నా... అటు సాంకేతిక పరంగానూ, ఇటు రాజకీయపరంగానూ ఇది గొప్ప సమస్యగా ఉంది. అసలు చంద్రుని మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటి? భూమి మీద ఒక సెకండ్ అంటే ఎంతో తెలుసు. అందరూ తెలుసు అనుకుంటున్నారు కానీ అసలు లెక్క ఒకటి ఉంది. అది అంత సులభంగా తలకెక్కదు. ఎక్కినా మన దినసరి జీవితంలో దాన్ని వాడే అవకాశం ఉండదు. ఒక గడియారాన్ని సరైన సమయానికి మార్చాలన్నా, అంటే సెట్ చేయాలన్నా మరి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి అవసరం. భూమి మీద మనకు ఆ పద్ధతి అలవాటయింది. మానవుల శరీరాలు కూడా ఆ పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి. భూమి తన చుట్టు తాను తిరిగే కాలం మనకు తెలుసు. అది సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే మన కాలం కొలతలు కొనసాగుతున్నాయి. చంద్రగోళం మాత్రం తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం వెలుగు లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రగోళం ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుంది. చంద్రగోళం తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. మనకు ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే కనపడుతుంది. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే మనకు కనబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం. మనకు భూమి మీద సూర్యో దయం, అస్తమయం లాంటి కొలతలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద కాలం కొలతలు అంత సుల భంగా కుదరవు అని అర్థం. కనుకనే వాటి గురించి పరిశోధకులు గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు. చంద్రగోళం మీదకి బహుశా మన దేశం వాళ్లు కూడా వెళతారు. మరెన్నో దేశాల వాళ్ళు వెళతారు. కనుక అందరికీ అంగీకారమయ్యే లెక్కలు రావాలి. అక్కడికి వెళ్లిన అంతరిక్ష యాత్రికులు, తాము ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎంతకాలం పాటు ఉన్నాము అన్న సంగతులను లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కదలిక వేగాల ఆధారంగా చంద్రుని మీద కూడా ఇటువంటి కొలతలు రావాలి. ఇందుకు కావలసిన సాంకేతిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. మొత్తం మీద కొత్త రకం కాలం కొలతలు వచ్చేస్తున్నాయి అని మాత్రం అర్థం చేసుకోక తప్పదు. మానవ చరిత్ర మొత్తం మీద ఒక పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మరో మరో పద్ధతీ వస్తున్నదని అంటున్నారు పరిశోధకులు. కె.బి. గోపాలం వ్యాసకర్త ప్రముఖ సైన్స్ రచయిత ‘ 98490 62055 -
వేడికొద్దీ వానలు
ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం మామూలు కన్నా తక్కువగా ఉంటుందని సూచనలు వచ్చాయి. ఈ సూచనలు మొత్తం దేశానికి వర్తిస్తాయని చెప్పుకోవాలి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం వారి వాతావరణ శాఖ మాత్రమే కాక స్కైమెట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా వాతావరణం గురించి పరిశోధనలు చేసి సూచనలు అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థవారు నిజానికి ఈ సంవత్సరం వర్షపాతం దేశం మొత్తం మీద మామూలుగా 94 శాతం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. మళ్లీ ఈ అవకాశం 40 శాతం ఉంటుందని కూడా అన్నారు. వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పలేము అన్న మాట ఇక్కడ బహుశా గుర్తు చేసుకోవాలేమో? ఉత్తర భారత దేశం, దేశంలోని మధ్య ప్రాంతాలలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మామూలు గానే ప్రపంచమంతటా వాతావరణం వేడెక్కుతోంది. హిందూ మహాసముద్రంలో డైపోల్ అనే పరిస్థితి ఒక పక్కన, అనుకున్న దానికన్నా ముందే వచ్చిన ఎల్ నినోలు మరోపక్కన ఇందుకు కారణం అని చెబుతున్నారు. తూర్పు ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న శాంతి మహా సముద్రం అనే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రత సగటు కన్నా అర డిగ్రీ ఎక్కువయినందుకు ఎల్ నినో వస్తుంది. అన్నట్టు ఈ మాటలోనే చివరి అక్షరానికి ‘య’ ఒత్తు ఇచ్చినట్టు పలకాలట. మాటకు చిన్న బాబు అని అర్థం. ఈ పరిస్థితి ముందు అనుకున్న దానికన్నా రెండు నెలలు ముందే వచ్చేసింది. అంతకుముందు మూడు సంవత్సరాల పాటు లా మీనా అనే పరిస్థితి. అంటే ఇందుకు వ్యతిరేకమైన పరిస్థితి ఉండేది. సముద్రం పైభాగంలో నీళ్లు వేడెక్కడం, చల్లబడడం అనే ఈ రెండు పరిస్థితులు మూడు నుంచి ఏడేళ్లకు ఒకసారి మారుతుంటాయి. ఒక పక్కన మానవ కార్యక్రమాల వల్ల వాతావరణం వేడెక్కుతున్నది. దానికి తోడుగా ఈ పరిస్థితులు కూడా వచ్చేసరికి మొత్తం ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పగడపు కొండలన్నీ పాడై పోతాయి. అనుకోని పద్ధతిలో వరదలు వస్తాయి. లక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగే పరిస్థితులు వస్తాయి. ఎల్ నినో లేకుండానే వాతావరణ పరిస్థితి దారుణంగా ఉంది, ఇక ఇది కూడా తోడైతే ఏమవుతుందో అంటున్నారు పరి శోధకులు పెడ్రో డి నేజియో. 2015 – 16 ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి బలంగా వచ్చింది. పసిఫిక్ సముద్రంలో పెద్ద ఎత్తున వేడి చేరుకున్నది. ఇందులో గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కూడా కొంత ఉంది. ఇప్పుడిక సముద్రం మీద మూత తీసివేసినట్లే అంటారు యూఎస్ సంస్థ ‘ఎన్ఓఏఏ’ పరిశోధకులు మైఖేల్. సముద్రోపరితలంలో చేరిన వేడి ప్రభావం ఇప్పటికే ప్రపంచం మీద ప్రభావం చూపు తున్నది. 2024 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీలు ఎక్కువయ్యే అవకాశం నిండుగా ఉంటుంది అంటున్నారు ఈయన. సాధారణంగా ఈ వేడి కారణంగా తూర్పు వ్యాపార పవనాల మీద ప్రభావం ఉంటుంది. కనుక వేడి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు ఆ గాలుల వేగంలో అంతగా మార్పు కనిపించలేదు అని పరిశీలకులు గమనించారు. ప్రస్తుతం వచ్చిన పరిస్థితి వచ్చే ఫిబ్రవరి దాకా బలంగా కొనసాగుతుంది. కనుక సముద్రం మీద నుంచి వచ్చే వ్యాపార పవనాలను అక్కడి వేడి ప్రభావితం చేస్తుంది. సెప్టెంబర్ కల్లా ఈ పరిస్థితి గురించి మరింత మంచి అవగాహన అందుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఎల్ నినో బలంగా ఉన్నా లేకున్నా వరదలు, ఉత్పాతాలు మాత్రం తప్పవు. ఎల్ నినో వల్ల మంచి కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఆఫ్రికా లోని కరవు ప్రాంతాలలో వర్షాలు వస్తాయి. అక్కడి ఆకలిగా ఉన్న జనాలకు తిండి దొరుకుతుంది. మొత్తం మీద మాత్రం ప్రభావాలు వ్యతి రేకంగా మాత్రమే ఉంటాయనీ, ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉండక తప్పదనీ పరిశోధకులు అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తులలో ఐదు శాతం తగ్గింపు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ తెలివి తెచ్చుకుని, వాతావరణం వేడెక్కకుండా ఉండే ఏర్పాట్ల మీద దృష్టి పెట్టాలి. డా‘‘ కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత, అనువాదకుడు మొబైల్: 98490 62055 -
నక్షత్రాకాశం మాయం కానున్నదా?
చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడా పల్లెకు వెళ్లి ఆరుబయట పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేవి. పట్నం చేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. ఇందుకు కారణం ‘కాంతి కాలుష్యం’ అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలను మనకు కనిపించకుండా చేస్తున్నాయి. నక్షత్రాలనూ, అంతరిక్షంలోని ఇతర అంశాలనూ పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూశారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూసినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి సృష్టించిన వెలుగులు ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు మొదలయ్యాయి. జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. ఒక పట్టణంలో బాగా వెలుతురుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ప్రదేశాలతో ఒక పటం తయారు చేస్తారు. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కళ్ళు కూడా చూడగలుగుతాయి. 2011వ సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశారు. ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా! మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించనే కనిపించవేమో అంటున్నారు పరిశోధకులు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చారు. నివాసాల దగ్గర ఉండే వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు, మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమక పడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. కాంతి కాలుష్యాన్ని ఎవరికి వారు తగ్గించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం’ అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు. వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అందరూ చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు. కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రకృతి అందం పాడవకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంతవరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. ముందు తరాలకు అందమైన నక్షత్రాకాశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత ‘ మొబైల్: 9849062055 -
గన్‌పౌడర్ భోజనం
రచయిత, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో కొంతకాలం ఉండి చదువుకున్నారు. ఆ సంస్థను ఆయన హైదరాబాద్ మధ్యలో లండన్ అనేవారు. ఆయనకు అక్కడి తిండి తీరు నచ్చలేదు. ఒకనాడు వంటవాళ్లను అడిగి మిరప్పొడి, ఉప్పు తెప్పించుకుని అందులో నూనె కలుపుకుని దానితో అన్నం తింటున్నారు. ఒక మహిళ అది గమనించి, ఏమిటి తింటున్నావు అని అడిగింది. ఈయన గర్వంగా గన్ పౌడర్ అన్నారట. అది తిని ఎట్లా బతుకుతావు అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అది లేకుంటే నేను బతకలేను అని ఈయన జవాబు! అక్కడి వాతావరణం నుంచి బయటపడాలని ఆయన పక్కనే ఉన్న మా ఉస్మానియా బి హాస్టల్‌కు వచ్చేవారు. ఒక సారి భోజనానికి కూడా ఉండిపోయారు. ఆ సంగతి విన్న ఆ మహిళ ఈజ్ ఇట్ నాట్ నాయిసీ దేర్ (అక్కడంతా గోలగా లేదా) అని అడిగింది. నో, ఇట్ ఈజ్ వెరీ లైవ్ లీ (లేదు, అక్కడ చాలా జీవవంతంగా అంది) అని జవాబిచ్చారు. ఈ సంగతులు ఆయనే మాతో చెప్పారు. గోపాలం కె. బి. -
నిలబడే ఇవ్వాలి
ఒకసారి మార్క్ ట్వేన్ ఉపన్యాసాలు ఇస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అట్లా ఒక కొత్త ఊరికి వెళ్ళాడు. అక్కడ గడ్డం గీయించుకోవడానికి మంగలి షాపులోకి వెళ్ళాడు. మాటల సందర్భంలో తాను ఆ ఊరికి రావడం మొదటిసారి అని కూడా చెప్పాడు. మంచి దినాన వచ్చావు, ఇవాళ మార్క్ ట్వేన్ ఉపన్యాసం ఉంది. వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగాడు, మంగలి. వెళ్లక తప్పదు, అన్నాడు మనవాడు. మరి టికెట్ కొన్నావా? అని అడిగాడు, అతను. లేదు, అన్నాడు ట్వేన్. అయితే ఉపన్యాసం సాంతం నిలబడి ఉండక తప్పదు, హెచ్చరించాడు అతను. మామూలుగా అంతే. ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా నేను నిలబడే ఉంటాను, జవాబిచ్చాడు ట్వేన్. -డా.కె.బి.గోపాలం -
అరబిక్ సాహిత్యంలో ధ్రువతార
నాగీబ్ మహఫూజ్ (1911–2006) ఈజిప్ట్ దేశానికి చెందిన రచయిత. 22 సంవత్సరాల వయసులోనే రాయడం మొదలుపెట్టాడు. మొదట్లో దేశభక్తితో కైరో గురించి మూడు చారిత్రక నవలలు రాశాడు. నిజానికి భాషా సాహిత్యం చదువుకోవాలి అనుకున్న మహఫూజ్ పెద్దల బలవంతం వల్ల సామాజిక శాస్త్రం చదవవలసి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. గుమస్తాగా చేరిన అతను చివరకు తమ దేశపు సాంస్కృతిక శాఖకు సలహాదారుగా రిటైర్ అయ్యాడు. 70 ఏళ్ల రచనా వ్యాసంగంలో 34 నవలలు రాశాడు. 350 దాకా కథలు రాశాడు. చాలా సినిమాలకు స్క్రిప్టు రాశాడు. ఈజిప్టులోనూ, మొత్తం అరబ్బు ప్రపంచంలోనూ ఈయన రచనలు ఆధునిక క్లాసిక్స్‌గా గుర్తింపబడ్డాయి. ఆయన రచనల ఆధారంగానే ప్రస్తుత కాలపు అరబిక్ సాహిత్యం నిలబడిందని చెప్పవచ్చు. 1988లో మహఫూజ్ కు నోబెల్ బహుమతి ఇచ్చారు. ‘అరబిక్ సాహిత్యంలో నవల అన్నది 20వ శతాబ్దంలోనే మొదలైంది. అంటే ఇంచుమించు నాగిబ్ మహఫూజ్తోనే మొదలయింది అనవచ్చు. అంతకుముందు ఒకరిద్దరు మాత్రమే రచయితలు ఉన్నారు. మహఫూజ్ ఈ రచనా ధోరణిని ప్రామాణికంగా మార్చాడు’ అని ఈ సందర్భంగా స్వీడిష్ అకాడమీ వ్యాఖ్యానించింది. మొదట్లో చారిత్రక, పౌరాణిక నవలలు రాసిన మహఫూజ్ సమాజాన్ని బాగా పరిశీలించడం నేర్చుకున్నాడు. త్వరలోనే తన రచనా పద్ధతి మార్చుకున్నాడు. నవలలు, కథలు అన్నింటిలోనూ తన చుట్టూ కనిపించే మనుషులు, మనస్తత్వాలు, ప్రదేశాలు మొదలైన వాటి గురించి సూటిగా రాయడం మొదలు పెట్టాడు. ఆయన నవలలు చదువుతుంటే ఒక విచిత్రమైన పరిచిత ధోరణి కనపడుతుంది. మధ్య తరగతి మనుషులు, వాళ్ల మామూలు వాతావరణం కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఖాన్ అల్ ఖలీలీ, మిదాఖ్ అలీ లాంటి నవలలు అన్నీ ఈ ధోరణిలోనే సాగుతాయి. సన్నివేశాలలో మనం ఉన్నామన్న భావన కలుగుతుంది. మామూలు మనుషుల సాయంతో అతను ప్రపంచం మొత్తం గురించి చెపుతాడు. సంప్రదాయంలో పాతుకుపోయిన అరబ్ సమాజానికి, ముఖ్యంగా రచయితలకు సమకాలీన సమాజం మీద ప్రగతి మార్గంలో చర్చించడం, పాలకులకు ధిక్కార స్వరం వినిపించడం నేర్పిన రచయిత మహఫూజ్. సల్మాన్ రష్దీ విషయంగా ఇతను అనుసరించిన ధోరణి అప్పటికే అతని రచనలతో విసిగిన ఛాందసవాదులకు నచ్చలేదు. మహఫూజ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దేశంలోని పరిస్థితులను విమర్శిస్తూ వ్యాసాలు మాత్రమే కాక, అదే అంశంతో కథలు, నవలలు కూడా రాశాడు. చివరికి ఇతడిని రాజకీయాల గురించి రాస్తాడు, అనే దాకా పరిస్థితి వచ్చింది. మహఫూజ్ సుమారు 94 సంవత్సరాలు బతికాడు. మరణానంతరం కూడా ఆయన రచనలు అయిదు అచ్చయ్యాయి. వాటిలో ద క్వార్టర్ అన్నది మరీ ప్రత్యేకమైన రచన. అది 18 చిన్న కథానికల సంకలనం. 1994లో అచ్చు కావాలి అని మహఫూజ్ దాన్ని దాచుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అరబ్ భాషలోనే ఆ రచన అతని మరణం తరువాత అచ్చయింది. - డాక్టర్ కె.బి.గోపాలం -
ఇస్మత్ మంటో పెళ్లాడివుంటే...
ఉర్దూ కథ ప్రసక్తి వస్తే మొట్టమొదట గుర్తువచ్చే రెండు పేర్లు సాదత్ హసన్ మంటో, ఇస్మత్ చుగ్తాయీ. ఇద్దరూ సమకాలికులు, సమాజంలోని కుళ్లును బయటపెడుతూ కథలు రాశారు. ఇద్దరి మీదా విశృంఖలంగా రాస్తారన్న అభియోగం ఉంది. మా కథలు ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్నాయంటూ ఇద్దరూ మొండికెత్తారు. కోర్టుల పాలయ్యారు. పాఠకలోకం మాత్రం ఇద్దరినీ తలకెత్తుకున్నది. ఈనాటికీ దించలేదు. అయితే, ఇద్దరికీ వారి వారి సంసారాలున్నాయి. కానీ, వాళ్లిద్దరూ పెళ్లిచేసుకుంటే బాగుండేదనుకునే అభిమానులున్నారు. అలాంటి ‘ప్రతిపాదన’ వచ్చినప్పుడు మంటో సరదా స్పందన ఇది: ఏడాదిన్నర అయింది. నేను బాంబేలో ఉండగా హైదరాబాద్‌లోని ఒక పెద్దమనిషి నుంచి ఉత్తరం వచ్చింది. అందులో సంగతులు ఇలాగున్నాయి. ‘ఇస్మత్ చుగ్తాయీని నీవు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీరిద్దరూ ఒకటయితే బ్రహ్మాండంగా ఉండేది. ఇస్మత్ ఎవరో షాహిద్ లతీఫ్ని పెళ్లాడటం సిగ్గుచేటు...’ ఇంచుమించు ఆ రోజుల్లోనే హైదరాబాద్‌లో అభ్యుదయ రచయితల సమావేశాలు జరిగాయి. నేను వెళ్లలేదుగాని, హైదరాబాద్ నుంచి వచ్చే ఒక ప్రచురణలో వివరాలు చదివాను. అక్కడ చాలామంది అమ్మాయిలు ఇస్మత్ చుగ్తాయీని చుట్టుకుని మీరు మంటోను ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ అడిగారట! ఆ రాసిన సంగతులు అబద్ధమా, నిజమా తెలియదు. ఇస్మత్ మాత్రం బాంబే తిరిగివచ్చిన తరువాత మా ఆవిడతో ఒక సంగతి చెప్పింది. హైదరాబాద్‌లో ఒక అమ్మగారు మంటోకి పెళ్లి కాలేదటగదా అని అడిగిందట. తాను అది నిజం కాదు అన్నదట. అది విని ఆవిడగారు నిరాశపొంది నిశ్శబ్దంగా వెళ్లిపోయిందట! నిజమేమిటో తెలియదుగానీ, హైదరాబాద్‌లోని ఆడ, మగ మాత్రం ఇస్మత్కూ, నాకూ పెళ్లి కాలేదని బెంగ పెట్టుకున్నట్టున్నారు. నేను ఆ సంగతి గురించి అప్పట్లో పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇస్మత్ నేనూ భార్యభర్తలం అయి ఉంటే? ఇదేదో చిత్రమయిన ప్రశ్న. క్లియోపాత్ర ముక్కు అంగుళంలో 18వ వంతు పొడుగు ఎక్కువగా ఉంటే ఏమయి ఉండేది? చరిత్ర ఎలాగుండేది? అన్నట్టు ఉంటుంది. ప్రస్తుత కథలో ఇస్మత్ క్లియోపాత్ర కాదు, నేను మార్క్ అంటోనీ అంతకన్నా కాదు. అయినాసరే, మంటో, ఇస్మత్ పెళ్లి చేసుకుని ఉంటే, సమకాలీన కథా సాహిత్యంలో అటామిక్ బాంబులాంటి ప్రభావమే ఉండేది. కథలు వెనుకబడిపోయేవి. మా గురించిన కథలు చిక్కు ప్రశ్నల్లా ఎక్కువయి ఉండేవి. మాటకారితనం మంటగలిసిపోయి బూడిదగా మిగిలిపోయేది. వాళ్ల రాతలు పెళ్లి కాగితాలమీది సంతకాలతో అంతమయి ఉండేవి. అసలు పెళ్లి కాగితాలు అంటూ ఉండేవా లేదా? పెళ్లి కాంట్రాక్ట్ మీద కూడా బహుశా ఇద్దరూ కథలే రాసి సంతకాలను మాత్రం కాజీగారి నుదుటిమీద చేసి ఉండేవారు. ఆ తంతు జరుగుతుంటే, బహుశా మాటలు ఈ రకంగా నడిచి ఉండేవి: ‘ఇస్మత్, కాజీసాహెబ్ నుదురు రాతబల్లలాగ ఉంది కదూ!?’ ‘ఏమిటన్నావ్?’ ‘నీ చెవులకు ఏమయింది?’ ‘ఏమీ కాలేదు. నీ పీలగొంతు బయటకి రానంటోంది.’ ‘పిచ్చిగా మాట్లాడకు, కాజీసాహెబ్ నుదురు రాతబల్లలా ఉంది అన్నాను.’ ‘రాతబల్ల చదునుగా ఉంటుంది.’ ‘ఆయన నుదురు చదునుగా లేదా?’ ‘నీకు చదును అంటే ఏమిటో తెలుసా?’ ‘తెలీదు!’ ‘నీ తల చదునుగా ఉంది. కాజీ గారిది..?’ ‘చాలా అందంగా ఉంది.’ ‘అదే అంటున్నాను.’ ‘నువ్వు నన్ను ఏడిపిస్తున్నావ్’ ‘నీవు ఆ పని చేస్తున్నావని నేను అంటున్నాను.’ ‘నన్ను ఆట పట్టిస్తున్నావని నీవు ఒప్పుకు తీరాలి.’ ‘ఇది బాగుంది. అప్పుడే మొగుళ్లాగా మాట్లాడుతున్నావ్’ ‘కాజీసాహెబ్ ఈవిడను నేను పెళ్లి చేసుకోను. మీ అమ్మాయి నుదురు, మీ నుదురులా చదునుగా ఉన్నా సరే, ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి.’ ‘కాజీ సాహెబ్, ఇతగాడిని నేను పెళ్లాడటం లేదు. నన్ను మీ భార్యగా చేసుకోండి! ఇప్పటికే నలుగురు ఉండి ఉంటారు. మీ నుదురు నాకు చాలా నచ్చింది!’ వ్యవహారం ఇలా సాగుతుంటే పెళ్లి సంగతి ఏమవుతుందో! అనువాదం: కె.బి. గోపాలం 9849062055 సాదత్ హసన్ మంటో 1912-55 ఇస్మత్ చుగ్తాయీ 1915-91