
చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడిన ట్లయింది. 2025 సంవత్సరం నాటికి మళ్ళీ మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని కూడా ప్రణాళికలు తయారవు తున్నాయి. వాటిలో నేరుగా మనుషులు ఉండకపోవచ్చు. కానీ మరమనుషులు తప్పకుండా ఉంటారు.
ఆ యంత్రాలు అక్కడ బయట తిరిగి ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగిస్తాయి. వాటి కొరకు మనుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు.
అంటే, భూమి మీద లాగే అక్కడ కూడా కార్యక్రమాలన్నీ ఒక కాల మానం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం వస్తుందన్నమాట! అందుకే చంద్రుని మీద కాలాన్ని లెక్కిండడం ఎలా అనేది ఇప్పుడు మానవాళి ముందున్న ముఖ్య మైన ప్రశ్నగా నిలిచింది.
అపోలో వ్యోమగాములు చంద్ర గోళం మీద దిగారు. తమ పని తాము ముగించి తిరిగి వచ్చేశారు. అక్కడ వారికి కాలం కొలతలతో అవసరం రాలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఉంటాయంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరం అవుతాయి.
భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే సమయాన్ని లెక్కించే పద్ధతిని అక్కడ కూడా అనుసరించవలసి ఉంది. ఈ మాట అనడానికి సులభంగానే ఉన్నా... అటు సాంకేతిక పరంగానూ, ఇటు రాజకీయపరంగానూ ఇది గొప్ప సమస్యగా ఉంది. అసలు చంద్రుని మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటి?
భూమి మీద ఒక సెకండ్ అంటే ఎంతో తెలుసు. అందరూ తెలుసు అనుకుంటున్నారు కానీ అసలు లెక్క ఒకటి ఉంది. అది అంత సులభంగా తలకెక్కదు. ఎక్కినా మన దినసరి జీవితంలో దాన్ని వాడే అవకాశం ఉండదు. ఒక గడియారాన్ని సరైన సమయానికి మార్చాలన్నా, అంటే సెట్ చేయాలన్నా మరి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి అవసరం. భూమి మీద మనకు ఆ పద్ధతి అలవాటయింది. మానవుల శరీరాలు కూడా ఆ పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి.
భూమి తన చుట్టు తాను తిరిగే కాలం మనకు తెలుసు. అది సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే మన కాలం కొలతలు కొనసాగుతున్నాయి. చంద్రగోళం మాత్రం తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం వెలుగు లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రగోళం ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుంది.
చంద్రగోళం తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. మనకు ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే కనపడుతుంది. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం.
చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే మనకు కనబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం.
మనకు భూమి మీద సూర్యో దయం, అస్తమయం లాంటి కొలతలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద కాలం కొలతలు అంత సుల భంగా కుదరవు అని అర్థం. కనుకనే వాటి గురించి పరిశోధకులు గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు.
చంద్రగోళం మీదకి బహుశా మన దేశం వాళ్లు కూడా వెళతారు. మరెన్నో దేశాల వాళ్ళు వెళతారు. కనుక అందరికీ అంగీకారమయ్యే లెక్కలు రావాలి. అక్కడికి వెళ్లిన అంతరిక్ష యాత్రికులు, తాము ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎంతకాలం పాటు ఉన్నాము అన్న సంగతులను లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కదలిక వేగాల ఆధారంగా చంద్రుని మీద కూడా ఇటువంటి కొలతలు రావాలి. ఇందుకు కావలసిన సాంకేతిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు.
మొత్తం మీద కొత్త రకం కాలం కొలతలు వచ్చేస్తున్నాయి అని మాత్రం అర్థం చేసుకోక తప్పదు. మానవ చరిత్ర మొత్తం మీద ఒక పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మరో మరో పద్ధతీ వస్తున్నదని అంటున్నారు పరిశోధకులు.
కె.బి. గోపాలం
వ్యాసకర్త ప్రముఖ సైన్స్ రచయిత ‘ 98490 62055
Comments
Please login to add a commentAdd a comment