నవభారత జయధ్వానం | Sakshi Guest Column On India Development In BRICs Chandrayaan3 | Sakshi
Sakshi News home page

నవభారత జయధ్వానం

Published Sat, Aug 26 2023 3:35 AM | Last Updated on Sat, Aug 26 2023 3:35 AM

Sakshi Guest Column On India Development In BRICs Chandrayaan3

ప్రజ్ఞాన్‌ రోవర్‌ పంపిన చంద్రుడి ఉపరితల ఫొటో

చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్‌–3 విజయవంతమైంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న శక్తిగా భావిస్తున్న అంతర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. చంద్రయాన్‌–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్‌ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగుపరుస్తుంది.

ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారత శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శనలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చుకున్నవిగా వాటిని కొట్టిపారేసింది. చంద్రయాన్‌–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం.

ఉత్కంఠ వీడిపోయింది. నిర్దేశించిన రోజు, సమయం, ప్రదేశంలో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్‌ అయిన చంద్రయాన్‌–3 సాధించిన మహాద్భుతమైన విజయం పట్ల భారతదేశం సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ నాయకత్వ చిహ్నాలలో సాంకే తిక పురోగతి ఒకటి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.

చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్‌–3 ల్యాండ్‌ అయింది. అన్వేషణ కోసం ప్రత్యేకంగా సవాలు విసిరేటటువంటి, పెద్దగా అర్థం చేసుకోని స్థలాన్ని ఎంచు కున్న ఏకైక అంతరిక్ష దేశం భారత్‌. చంద్రుని అసలైన తత్వం ఇప్పటికీ కలిగి ఉన్నది దాని ధ్రువ ప్రాంతాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ఉపరితలం చాలా వరకు పెద్ద, చిన్న గ్రహ శకలాల శిథిలాలతో కప్పబడి ఉంది.

ఈ శకలాలు వెయ్యేళ్లపాటు చంద్రునిపై పెనుదాడి చేసి, దానిపై పొరలు పొరలుగా పేరుకు పోయాయి. చంద్రుడి లోపలి నీటి కోసం వెతకడంతో సహా ‘ప్రజ్ఞాన్‌ రోవర్‌’ చేయబోయే ప్రయోగాలు, మనకు సమీపంలోని ఖగోళ పొరుగు గురించిన కొత్త జ్ఞానాన్ని వెల్లడిస్తాయి. సున్నితంగా ఉన్న మన సొంత భూగ్రహం చరిత్ర, తయారీలపై మన అవగాహనకు కూడా ఇది సాయపడుతుంది.

ఎదుగుతున్న శక్తి
ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్‌ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహ న్నెస్‌బర్గ్‌లో ఉన్నప్పుడు, యాదృచ్ఛికంగా అంతరిక్ష పరిశోధనలో ఈ గొప్ప విజయం లభించింది. చంద్రయాన్‌–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్‌ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న దేశాల సమూహంగా మొత్తం బ్రిక్స్‌ ప్రభావాన్ని కూడా ఇది ఇతోధికంగా పెంచుతుంది.

చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్‌–3 విజయవంతమైంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయో గాల్లో అనుభవజ్ఞ దేశంగా ఉన్న రష్యా తన మూన్‌ ల్యాండింగ్‌ ప్రాజెక్ట్‌ను భారతదేశం ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రారంభించడం యాదృచ్ఛికమే కావొచ్చు. అయినా రష్యా వైఫల్యం, భారత్‌ విజయాలను పక్కపక్కనే అంచనా వేయడం జరుగుతుంది.

వనరుల పరంగా, అధునాతన అంతరిక్ష శక్తిగా దాని హోదాను కొనసాగించడంలో రష్యా వైఫల్యాన్ని దాని క్షీణత, అసమర్థతా లక్షణాలుగా చూస్తున్నారు. అంతరిక్ష ప్రయోగం అనేది అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అన్వేషణ. 2019 సెప్టెంబరులో చంద్రయాన్‌–2 చంద్రుని ఉపరితలంపై కూలిపోయినప్పుడు భారతదేశం కూడా నిరాశకు గురైంది.

ఇప్పుడు రష్యా తన ఎదురుదెబ్బను అధిగమించి అంతరిక్ష రంగంలో మళ్లీ తన శక్తి పుంజుకోదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. అయినా దృక్కోణాలు ముఖ్యమవుతాయి. భారతదేశాన్ని అభి వృద్ధి చెందుతున్న శక్తిగా, రష్యాను క్షీణిస్తున్న శక్తిగా భావిస్తున్న అంత ర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది.

సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన సమానమైన ర్యాంక్‌లో తాను లేనందున, ఉక్రెయిన్‌ యుద్ధం ఆ స్థానాన్ని ఏ విధంగానూ దెబ్బతీయలేదనే భావ నను ఎదుర్కోవడానికి రష్యా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. రష్యన్‌ మీడియాలో కూడా, విఫలమైన మూన్‌ మిషన్‌ అందుకున్న పరిమితమైన కవరేజీని చూసినట్లయితే, దాని రాజకీయ, మానసిక తిరోగమనం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

చైనా వైఖరి మారేనా?
ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా చైనా ఎప్పుడూ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శ నలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది.

ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చు కున్నవిగా వాటిని చైనా కొట్టిపారేసింది. అయితే చంద్రయాన్‌–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా చైనా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. బహుశా భారత్‌ సాధించిన ఈ విజయంతో చైనా తన అహంకారాన్ని తొలగించుకుని, నమ్రతతో కాకపోయినా మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సిన దేశంగా భారత్‌ను పరిగణించవచ్చు.

ఒకరినొకరు సమానంగా చూసుకుంటేనే ఇరు దేశాలు తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోగలవు. చంద్రయాన్‌–3 విజయా నికి చైనా ఎలా స్పందిస్తుందనేది, తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద హింసాత్మక ఘర్షణల తర్వాత భారతదేశం పట్ల దాని వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేది సూచిక అవుతుంది.

చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో విజయం రాబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశంగా భారత్‌ హోదాను పెంచుతుంది. శిఖరాగ్ర సమావేశానికి ఇప్పటికే లభిస్తున్న విస్తృత ప్రచారం నేపథ్యంలో, చంద్రయాన్‌–3 భారత్‌ కీర్తి ప్రతిష్ఠలకు మరో పార్శా్వన్ని జోడిస్తుందనడంలో సందేహం లేదు. శిఖరాగ్ర సదస్సు చర్చల సమ యంలో, భారతదేశ స్వరం ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. దాని వివిధ కార్యక్రమాలు గౌరవప్రదంగా పరిగణించబడతాయి. అయితే ఇవన్నీ తదనంతర చర్యలలో ప్రతిఫలిస్తాయో, లేదో చూడాలి.

దూరదృష్టి ఫలితం
భారతదేశం కోసం, దాని అభివృద్ధి వ్యూహం కోసం తగిన పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రయాన్‌–3 సాధించినదంతా కూడా దేశం పేదగా ఉండి, అభివృద్ధి చెందుతున్నదైనప్పటికీ... అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శ్రేష్ఠమైన సంస్థలను స్థాపించాలనే తొలితరం నాయకుల దూరదృష్టి ఫలితమే. భారతదేశ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌ను 1948లోనే తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఛైర్మన్‌గా ఏర్పాటైంది. అప్పటి రాజకీయ నాయకత్వం ఈ అధునాతన శాస్త్రీయ సాధనకు ఇచ్చిన అధిక ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తుంది.

వాస్తవానికి, అంతరిక్ష పరిశోధనను సుప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయి నేతృత్వంలో 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్‌ నేష నల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ అని పిలిచే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఆటమిక్‌ ఎనర్జీకి అప్పగించారు. దీని తర్వాత 1972లో ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఏర్పాటైంది. 

ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌ నమూనాలో ఇండియన్‌ స్పేస్‌ కమిషన్ ను ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిషన్లు భారతదేశ అధునాతన శాస్త్ర, సాంకేతికతకు మూలస్థంభాలుగా నిలిచి, గణనీయమైన స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. అంతేకాకుండా వీటికి బాగా నిధులు సమకూరుస్తున్నారు కూడా. ఈ ముందస్తు, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ కార్మికుల కృషి వల్ల ఇప్పుడు భారతదేశం చేపట్టిన తాజా అంత రిక్ష యాత్ర విజయవంతమైంది.
శ్యామ్‌ శరణ్‌ 
వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement