BRICS Summit
-
S Jaishankar: వివాదాలకు చర్చలే శరణ్యం
కజన్: వివాదాలు, విభేదాలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిందేనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పునరుద్ఘాటించారు. యుద్ధాలతో సాధించేదీ ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్తతలు చల్లారాలంటే చర్చలపై తక్షణమే దృష్టి పెట్టాలని సూచించారు. రష్యాలోని కజన్ నగరంలో బ్రిక్స్ ఔట్రీచ్/బ్రిక్స్ ప్లస్ సదస్సులో చివరి రోజు గురువారం జైశంకర్ మాట్లాడారు. ఇది యుద్ధాల శకం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. శాంతియుత చర్చలు, దౌత్య మార్గాలపై దృష్టి పెడితే వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినప్పుడు వాటిని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు ఎవరైనా సరే లోబడి ఉండాలని, ఎలాంటి మినహాయింపులు ఉండొద్దని తేల్చిచెప్పారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. పశి్చమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. దీర్ఘకాలపు సవాళ్లను ఎదిరించే విషయంలో కొత్తగా ఆలోచించడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిందే ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందడం లేదని, ఈ నిజాన్ని బ్రిక్స్ వేదిక గుర్తించాలని జైశంకర్ కోరారు. కోవిడ్ మహమ్మారితోపాటు వేర్వేరు సంఘర్షణల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలపై భారం మరింత పెరిగిందన్నారు. వైద్యం, ఆహారం, ఇంధన భద్రత విషయంలో ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘సరిసమానమైన ప్రపంచ క్రమం’ అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాల విషయంలో వివిధ దేశాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవి వలసవాద పాలన నుంచి వారసత్వంగా వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలను సరి చేయాలన్నారు. సరుకుల సరఫరా కోసం దేశాల మధ్య అనుసంధానం మరింత పెరగాలన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని గౌరవిస్తూ ఆ దిశగా అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల్లో సంస్కరణలు తక్షణావసరమని జైశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే ప్రారంభించాలని అన్నారు. భద్రతా మండలిలో మరికొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కలి్పంచాలని డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్∙సదస్సుకు పదికిపైగా బ్రిక్స్ సభ్యదేశాలతోపాటు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. -
బ్రిక్స్ సదస్సు వేళ.. రష్యాపై భారీ సైబర్ దాడి
మాస్కో: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.‘‘రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై ఈ బుధవారం ఉదయం విదేశాల నుంచి భారీ సైబర్‌టాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది. అయితే బుధవారం చేసిన సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా మాస్కో ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను అక్టోబర్ 22-24 తేదీల్లో రష్యాలోని కజాన్‌లో జరుపుతోంది.Russian Foreign Ministry suffers ‘unprecedented’ #cyberattack - spox ZakharovaSpecialists are working to restore the functionality of the Russian Foreign Ministry's website after a large-scale DDoS attack, ministry spokesperson Maria Zakharova told TASS.The attack...RTNews pic.twitter.com/RS2ilmEhVJ— TifaniesweTs (@TifaniesweTs) October 23, 2024 రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.చదవండి: PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు -
PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు ‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్‌పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి. ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి. అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్‌లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు. ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్‌లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కూటమిలోకి మరో ఐదు దేశాలు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిక్స్‌లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్‌పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్ భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్‌ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు. ఉగ్రవాదంతో అందరికీ ముప్పు బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. -
సుహృద్భావమే లక్ష్యం
కజాన్: భారత్, చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ ద్వైపాక్షిక సమావేశం బుధవారం జరిగింది. రష్యాలో జరిగిన మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికైంది. జిన్‌పింగ్, మోదీ అధికారికంగా భేటీ కావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. లద్దాఖ్ సమీపంలో సరిహద్దు గస్తీపై ఇరు దేశాల సైనిక, తదితర ఉన్నతాధికారుల స్థాయిలో కుదిరిన తాజా ఒప్పందాన్ని అధినేతలిద్దరూ స్వాగతించారు. ఇరుదేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా పలు అంశాలపై ప్రత్యేక ప్రతినిధులు నడుమ మరిన్ని ఉన్నత స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతల పరిరక్షణే ఇరుదేశాల ధ్యేయం కావాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, పరిణతే ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు బలపడాలని పిలుపునిచ్చారు. రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం నేతల భేటీ జరిగింది. అన్ని అంశాలపైనా వారిద్దరూ 50 నిమిషాలకు పైగా లోతుగా చర్చలు జరిపారు. ‘‘విభేదాలు, వివాదాలను చర్చలు తదితరాల ద్వారా సజావుగా పరిష్కరించుకోవాలి. శాంతి, సౌభ్రాతృత్వాలను అవి దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి’’ అంటూ చైనా అధ్యక్షునికి మోదీ ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలైన చైనా–భారత మధ్య సత్సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే గాక ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సామరస్యాలకు చాలా కీలకమని పేర్కొన్నారు. భేటీ అనంతరం ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ భేటీని ఇరు దేశాల ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోందని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. సమస్యలు, విభేదాల పరిష్కారానికి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాల మధ్యా అన్ని స్థాయిల్లోనూ మరింత సమన్వయం, మరిన్ని చర్చలు అత్యవసరమన్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సమస్యలు తదితరాలు కూడా నేతలిద్దరి చర్చల్లో చోటుచేసుకున్నాయి. షాంఘై సహకార సంస్థకు 2025లో చైనా సారథ్యానికి పూర్తిస్థాయిలో మద్దతిస్తామని జిన్‌పింగ్‌కు మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చైనా, భారత సైనికుల మధ్య 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు దారుణంగా క్షీణించడం తెలిసిందే. వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల దిశగా ఈ భేటీని కీలక ముందడుగుగా భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరచాలనం చర్చలు కొనసాగుతాయి పలు ద్వైపాక్షిక అంశాలను అధినేతలిద్దరూ దీర్ఘకాలిక దృష్టితో లోతుగా సమీక్షించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘సరిహద్దు వివాదం మొదలుకుని పలు విభేదాలపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కొనసాగాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు త్వరలోనే చర్చలుంటాయి’’ అని వెల్లడించారు. మోదీ–జిన్‌పింగ్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ముందుగా సరిహద్దు ప్రాంతాల వద్ద శాంతి, సామరస్యం నెలకొనాలన్న అంశంపై వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వివరించారు. అభివృద్ధిపరమైన సవాళ్లను అధిగమిస్తూ పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారన్నారు. ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భారత్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనాకు విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారథ్యం వహిస్తున్నారు. వారి నడుమ 2019లో చివరిసారిగా చర్చలు జరిగాయి. ఉజ్బెక్, యూఏఈ అధ్యక్షులతో మోదీ భేటీ బ్రిక్స్ సదస్సు చివరి రోజు బుధవారం ఉజ్బెకస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్అల్ నహ్యాన్తో కూడా మోదీ భేటీ అయ్యారు. వారిద్దరితో చర్చలు అత్యంత ఫలప్రదంగా జరిగినట్టు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ భారత్ బయల్దేరారు. -
ఈ భేటీ శుభ పరిణామం
అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది. దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి. 2020 ఏప్రిల్‌లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్‌లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు. రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసిన మాట వాస్తవం. అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్‌ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు. ఎల్ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం. యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి. ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్గల భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది. -
ముగిసిన బ్రిక్స్ సదస్సు.. భారత్‌కు బయల్దేరిన మోదీ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసింది. 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ఆయన.. బుధవారం ఢిల్లీకి బయల్దేరారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా ఆయా దేశాధినేతలను కలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతంగా కొనసాగిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు. బ్రిక్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారంటూ పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో సంస్కరణలు తీసుకురావాలన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని కోరిన ప్రధాని మోదీ.. భవిష్యత్‌లో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందని ఆకాంక్షించారు. పర్యటన తొలి రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కాగా, రెండోరోజు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ తొలిసారి భేటీ అయ్యారు.ఇదీ చదవండి: రష్యాకు ‘కిమ్’ బలగాలు.. ‘సియోల్’ ఆగ్రహం -
ఐదేళ్ల తర్వాత భేటీ కానున్న మోదీ, జిన్‌పింగ్
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఇవాళ ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఇరువురు నేతలు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ కానుండటం గమనార్హం. మరోవైపు.. ఇరుదేశాల మధ్య సరిహద్దు గస్తీకి సంబంధించి కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో మోదీ, జిన్ పింగ్ మధ్య తాజాగా భేటీ జరగనుండటంపై ఆసక్తి నెలకొంది. గత నాలుగున్నరేళ్లుగా సరిహద్దుల్లో భారత్, చైనాల దేశాల మధ్య ఉద్రిక్తతలు, గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య ఘర్షణతో తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.అదీకాక నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు కూడా సాగలేదు. ఇక.. గల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు 2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సమయంలో మొదటిసారి అక్కడ కలిశారు. అనంతరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో పాల్గొన్నారు. ఇక.. అప్పటినుంచి ప్రత్యకంగా ఇరు దేశాధినేతల మధ్య భేటీ జరగకపోవటం గమనార్హం. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ -
మరోసారి రష్యాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22, 23 తేదీల్లో ఆ దేశంలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు.‘గ్లోబల్ డెవలప్మెంట్, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్‌తో జరిగే ఈ సమ్మిట్ లో పలు కీలక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. భవిష్యత్ సహకారంకోసం శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుందని విదేశాంగశాఖ పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది.గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా భేటీ అయ్యారు.2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి. -
జగనన్న వల్లే నాకు ఈ అవకాశం
-
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ
నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది. భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్ ప్రకటించుకోవడం విచిత్రం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు. మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్’ (దక్షిణ టిబెట్) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్ ‘వన్ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం. ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్ ప్రతీక. అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్ వరకు తీసుకుంటే చంద్రయాన్–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్ సంక్షోభం, 2020లో గల్వాన్ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి. జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి. -
ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్ సతీమణికి నాగాలాండ్‌లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్ పెయింటింగ్స్‌ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్కు ఛత్తీస్‌గఢ్ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు. -
నవభారత జయధ్వానం
చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న శక్తిగా భావిస్తున్న అంతర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగుపరుస్తుంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారత శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శనలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చుకున్నవిగా వాటిని కొట్టిపారేసింది. చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. ఉత్కంఠ వీడిపోయింది. నిర్దేశించిన రోజు, సమయం, ప్రదేశంలో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన చంద్రయాన్–3 సాధించిన మహాద్భుతమైన విజయం పట్ల భారతదేశం సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ నాయకత్వ చిహ్నాలలో సాంకే తిక పురోగతి ఒకటి. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్–3 ల్యాండ్ అయింది. అన్వేషణ కోసం ప్రత్యేకంగా సవాలు విసిరేటటువంటి, పెద్దగా అర్థం చేసుకోని స్థలాన్ని ఎంచు కున్న ఏకైక అంతరిక్ష దేశం భారత్. చంద్రుని అసలైన తత్వం ఇప్పటికీ కలిగి ఉన్నది దాని ధ్రువ ప్రాంతాలు మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాని ఉపరితలం చాలా వరకు పెద్ద, చిన్న గ్రహ శకలాల శిథిలాలతో కప్పబడి ఉంది. ఈ శకలాలు వెయ్యేళ్లపాటు చంద్రునిపై పెనుదాడి చేసి, దానిపై పొరలు పొరలుగా పేరుకు పోయాయి. చంద్రుడి లోపలి నీటి కోసం వెతకడంతో సహా ‘ప్రజ్ఞాన్ రోవర్’ చేయబోయే ప్రయోగాలు, మనకు సమీపంలోని ఖగోళ పొరుగు గురించిన కొత్త జ్ఞానాన్ని వెల్లడిస్తాయి. సున్నితంగా ఉన్న మన సొంత భూగ్రహం చరిత్ర, తయారీలపై మన అవగాహనకు కూడా ఇది సాయపడుతుంది. ఎదుగుతున్న శక్తి ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహ న్నెస్బర్గ్లో ఉన్నప్పుడు, యాదృచ్ఛికంగా అంతరిక్ష పరిశోధనలో ఈ గొప్ప విజయం లభించింది. చంద్రయాన్–3 విజయం భారతదేశ ప్రతిష్ఠతో పాటు, బ్రిక్స్ భాగస్వాముల మధ్య మన దేశ స్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికంగా, సాంకేతికంగా సామర్థ్యం ఉన్న దేశాల సమూహంగా మొత్తం బ్రిక్స్ ప్రభావాన్ని కూడా ఇది ఇతోధికంగా పెంచుతుంది. చంద్రుడి మీద దిగడానికి ప్రయత్నించిన రష్యాకు చెందిన లూనా–25 విఫలమై, కొన్ని రోజుల క్రితం పేలిపోయిన సమయంలోనే చంద్రయాన్–3 విజయవంతమైంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయో గాల్లో అనుభవజ్ఞ దేశంగా ఉన్న రష్యా తన మూన్ ల్యాండింగ్ ప్రాజెక్ట్‌ను భారతదేశం ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రారంభించడం యాదృచ్ఛికమే కావొచ్చు. అయినా రష్యా వైఫల్యం, భారత్ విజయాలను పక్కపక్కనే అంచనా వేయడం జరుగుతుంది. వనరుల పరంగా, అధునాతన అంతరిక్ష శక్తిగా దాని హోదాను కొనసాగించడంలో రష్యా వైఫల్యాన్ని దాని క్షీణత, అసమర్థతా లక్షణాలుగా చూస్తున్నారు. అంతరిక్ష ప్రయోగం అనేది అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అన్వేషణ. 2019 సెప్టెంబరులో చంద్రయాన్–2 చంద్రుని ఉపరితలంపై కూలిపోయినప్పుడు భారతదేశం కూడా నిరాశకు గురైంది. ఇప్పుడు రష్యా తన ఎదురుదెబ్బను అధిగమించి అంతరిక్ష రంగంలో మళ్లీ తన శక్తి పుంజుకోదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. అయినా దృక్కోణాలు ముఖ్యమవుతాయి. భారతదేశాన్ని అభి వృద్ధి చెందుతున్న శక్తిగా, రష్యాను క్షీణిస్తున్న శక్తిగా భావిస్తున్న అంత ర్జాతీయ అవగాహనను ఇది బలపరుస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన సమానమైన ర్యాంక్‌లో తాను లేనందున, ఉక్రెయిన్ యుద్ధం ఆ స్థానాన్ని ఏ విధంగానూ దెబ్బతీయలేదనే భావ నను ఎదుర్కోవడానికి రష్యా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లయితే, అది తన ప్రయత్నంలో విఫలమైంది. రష్యన్ మీడియాలో కూడా, విఫలమైన మూన్ మిషన్ అందుకున్న పరిమితమైన కవరేజీని చూసినట్లయితే, దాని రాజకీయ, మానసిక తిరోగమనం చాలా స్పష్టంగా తెలుస్తోంది. చైనా వైఖరి మారేనా? ప్రపంచ ఆర్థిక, సాంకేతిక శక్తిగా చైనా ఎప్పుడూ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోంది. ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు లేకుండానే భారతదేశం అగ్రగామి శక్తిగా నటిస్తున్నట్లు చైనా భావిస్తుంటుంది. భారతదేశ శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన ప్రదర్శ నలను– అవి అణు, అంతరిక్ష రంగాలైనా, ఐటీ విజయాలైనా చైనా ఆశ్చర్యంతోనే స్వీకరించింది. ఇతర దేశాల నుండి ‘అరువు’ తెచ్చు కున్నవిగా వాటిని చైనా కొట్టిపారేసింది. అయితే చంద్రయాన్–3 సాధించిన అత్యుత్తమ విజయాన్ని కూడా చైనా ఇదే పద్ధతిలో కొట్టివేయడం కష్టం. బహుశా భారత్ సాధించిన ఈ విజయంతో చైనా తన అహంకారాన్ని తొలగించుకుని, నమ్రతతో కాకపోయినా మర్యాద పూర్వకంగా వ్యవహరించాల్సిన దేశంగా భారత్‌ను పరిగణించవచ్చు. ఒకరినొకరు సమానంగా చూసుకుంటేనే ఇరు దేశాలు తమ సంబంధాలను మరింత మెరుగుపరుచుకోగలవు. చంద్రయాన్–3 విజయా నికి చైనా ఎలా స్పందిస్తుందనేది, తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద హింసాత్మక ఘర్షణల తర్వాత భారతదేశం పట్ల దాని వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేది సూచిక అవుతుంది. చంద్రయాన్–3 ప్రాజెక్టులో విజయం రాబోయే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్య దేశంగా భారత్ హోదాను పెంచుతుంది. శిఖరాగ్ర సమావేశానికి ఇప్పటికే లభిస్తున్న విస్తృత ప్రచారం నేపథ్యంలో, చంద్రయాన్–3 భారత్ కీర్తి ప్రతిష్ఠలకు మరో పార్శా్వన్ని జోడిస్తుందనడంలో సందేహం లేదు. శిఖరాగ్ర సదస్సు చర్చల సమ యంలో, భారతదేశ స్వరం ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. దాని వివిధ కార్యక్రమాలు గౌరవప్రదంగా పరిగణించబడతాయి. అయితే ఇవన్నీ తదనంతర చర్యలలో ప్రతిఫలిస్తాయో, లేదో చూడాలి. దూరదృష్టి ఫలితం భారతదేశం కోసం, దాని అభివృద్ధి వ్యూహం కోసం తగిన పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రయాన్–3 సాధించినదంతా కూడా దేశం పేదగా ఉండి, అభివృద్ధి చెందుతున్నదైనప్పటికీ... అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శ్రేష్ఠమైన సంస్థలను స్థాపించాలనే తొలితరం నాయకుల దూరదృష్టి ఫలితమే. భారతదేశ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అటామిక్ ఎనర్జీ కమిషన్‌ను 1948లోనే తొలి ప్రధాన మంత్రి నెహ్రూ ఛైర్మన్‌గా ఏర్పాటైంది. అప్పటి రాజకీయ నాయకత్వం ఈ అధునాతన శాస్త్రీయ సాధనకు ఇచ్చిన అధిక ప్రాముఖ్యతను ఇది ప్రతిబింబిస్తుంది. వాస్తవానికి, అంతరిక్ష పరిశోధనను సుప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి నేతృత్వంలో 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్ నేష నల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని పిలిచే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి అప్పగించారు. దీని తర్వాత 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఏర్పాటైంది. ఆటమిక్ ఎనర్జీ కమిషన్ నమూనాలో ఇండియన్ స్పేస్ కమిషన్ ను ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిషన్లు భారతదేశ అధునాతన శాస్త్ర, సాంకేతికతకు మూలస్థంభాలుగా నిలిచి, గణనీయమైన స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. అంతేకాకుండా వీటికి బాగా నిధులు సమకూరుస్తున్నారు కూడా. ఈ ముందస్తు, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక రంగ కార్మికుల కృషి వల్ల ఇప్పుడు భారతదేశం చేపట్టిన తాజా అంత రిక్ష యాత్ర విజయవంతమైంది. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి -
భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్
న్యూఢిల్లీ: భారత్ అభ్యర్ధన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ శాఖ తెలిపిన దాంట్లో వాస్తవం లేదని.. వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల గురించి అభ్యర్ధించింది చైనాయేనని అది ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు. అది కూడా వేదిక నుండి కిందకు దిగుతున్న వేళ చిన్నగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు. ఇదే వేదికపై మోదీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమేవేశంలో పాల్గొంటారని ముందుగా వార్తలు వచ్చినప్పటికీ సమావేశాల్లో ఇరు దేశాల నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చల్లో పాల్గొనలేదు. అనధికారికంగా మాత్రం కొద్దిసేపు సంభాషిచారు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు మధ్య జరిగిన అనధికారిక సంభాషణలో ఇరువురు వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను తొలగించి ఉద్రిక్తతను తొలగించే విషయమైన చర్చించినట్లు తెలిపారు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా. జూన్ 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కాని అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది చైనాయేనని భారత్ ఇంకా ఆ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత్ అభ్యర్ధన మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచే అంశమై మాట్లాడినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందన్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: ట్రంప్ మగ్ షాట్:మస్క్ రియాక్షన్ అదిరిపోయింది! -
బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్‌లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్‌కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
బ్రిక్స్‌కు కొత్త బలం!
కాలం అందరికీ... వ్యక్తులకైనా, సంస్థలకైనా అన్నీ నేర్పుతుంది. పదిహేనేళ్ల క్రితం అప్పట్లో ఆర్థికంగా జవసత్వాలు పుంజుకుంటున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన సహకార కూటమి అనంతరకాలంలో దక్షిణాఫ్రికాను కూడా కలుపుకొని బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసే సమయానికి మరో ఆరు దేశాలకు– సౌదీ అరేబియా, యూఏఈ, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్, ఈజిప్టులకు ఈ సారి సభ్యత్వం లభించింది. ఈ దేశాల భాగస్వామ్యం వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇకపై దీన్ని బ్రిక్స్–11గా వ్యవహరిస్తారు. ఆరంభంలో ఆ కూటమి వైపు పెద్దగా దృష్టి సారించని దేశాలు అందులో భాగస్వాములై ఎదగాలని ఇప్పుడు తహతహలాడటం అనివార్య పరిణామం. కరోనా మహమ్మారితో, ఉక్రెయిన్ యుద్ధంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు విధానాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పశ్చి మార్ధ గోళ దేశాల ఆధిపత్యాన్ని, ముఖ్యంగా అమెరికా పెత్తనాన్ని బలహీన పరచాలని చూస్తున్న రష్యా, చైనాలకు ఈ పరిణామం సహజంగానే బలాన్నిస్తోంది. అయితే ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పీకల్లోతు కూరుకుపోయి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అభిశంసనకు గురయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాలేని నిస్సహాయస్థితిలో పడ్డారు. ఆ కోర్టులో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉండటం వల్ల అది పుతిన్‌పై జారీచేసిన అరెస్టు వారెంట్‌ను అమలుపరచక తప్పదు. నిజంగా దక్షిణాఫ్రికా ఆ పని చేస్తుందా లేదా అన్న సంగతి అటుంచితే ఈ స్థితిలో హాజరు కావటం పుతిన్‌కే అవమానకరమవుతుంది. దాంతో ఆయన శిఖరాగ్ర సదస్సును ద్దేశించి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అయితే ఇప్పటికిప్పుడు బ్రిక్స్ దేశాలు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసే స్థితి లేదు. మన దేశం, బ్రెజిల్ అమె రికాకూ, ఇతర పాశ్చాత్య దేశా లకూ సన్నిహితంగా ఉంటున్నాయి. ఆ మాటకొస్తే చైనా సైతం వివిధ అంశాల్లో అమెరికాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, దానితో బాహాటంగా ఘర్షణకు దిగాలనుకోవటం లేదు. రణరంగంలో నిలిచిన రష్యా ఒక్కటే ఇందుకు మినహాయింపు. సదస్సు ప్రారంభంలోనే ఈ ధోరణి కనబడింది. బ్రిక్స్ దేశాధినేతల్లో ఇతరులు సమానత్వం ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలుండాలని మాట్లా డితే... పుతిన్ మాత్రం ఏ రకమైన పెత్తందారీ పోకడలకైనా తాము బద్ధ విరోధులమని కుండ బద్దలు కొట్టారు. తన శత్రువులు నయా వలసవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపించారు. పనిలో పనిగా ఉక్రెయిన్‌లో వర్తమాన సంక్షోభానికి పాశ్చాత్య దేశాల పెత్తందారీతనమే కారణమన్నారు. కూటమి విస్తరణ, దాని అమరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న కూటమి సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు చెల్లాచెదురు కావొచ్చు. కొత్త దేశాలొచ్చి అందులో చేరవచ్చు కూడా. తన ప్రయోజనాలకు అనుగుణంగా బ్రిక్స్ విస్తరణ ఉండాలని చైనా ఏడాదిగా ప్రయత్నిస్తోంది. మన దేశం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. నిరుడు బీజింగ్‌లో జరిగిన సదస్సులోనే విస్తరణపై ఆలోచన బయల్దేరింది. సభ్యత్వానికి అర్హతలు, కూటమిలో చేరాక ఆ దేశాలు అనుసరించాల్సిన విధానాలు వగైరాలకు ఈ ఏడాదికాలంలో తుది రూపం ఇచ్చారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలు, మెరుగైన వృద్ధి రేటు ఉండేవాటినే సభ్యదేశాలుగా చేర్చుకోవాలని బ్రిక్స్ మూలవిరాట్టు లైన అయిదు దేశాలూ ఏకాభిప్రాయానికొచ్చాయి. అలాగే ఇకపై కూడా అయిదు దేశాలూ ఏకాభి ప్రాయానికొస్తే తప్ప ఏ దేశానికీ సభ్యత్వం ఇవ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు అంగీకారం లభించింది. బహుళత్వం, సుస్థిర, శాంతియుత అభివృద్ధి, పరస్పర సహకారంతో ఎదుగుదల, సంస్థాగత అభివృద్ధి, బ్రిక్స్ దేశాల ప్రజానీకం మధ్య సంబంధాలు నెలకొల్పటం వగైరాల సాధనకు కృషి చేయాలన్న జోహన్నెస్‌బర్గ్ డిక్లరేషన్ సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడితే సంస్థ భవిష్యత్తులో మరింత బలపడుతుంది. ఎప్పటిలాగే ఘర్షణల విషయం వచ్చేసరికి డిక్లరేషన్ ఆచితూచి వ్యవహరించిందనాలి. నిర్మాణాత్మక చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చి ఊరుకుంది. అంతేతప్ప ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించలేదు. బ్రిక్స్ స్వభావరీత్యా స్వేచ్ఛా వాణిజ్య కూటమి వంటిది కాదు. దేశాల మధ్య సమన్వయం సాధించి, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఎదగాలన్నది ఈ కూటమి ప్రధాన ధ్యేయం. బ్రిక్స్ కరెన్సీ అంటూ ప్రత్యేకించి లేకపోయినా ఆయా దేశాల కరెన్సీలు బలపడేందుకు అవసరమైన సాయాన్ని అందించటం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఈసారి శిఖరాగ్ర సదస్సులో ఉమ్మడి కరెన్సీ గురించిన ఆలోచన చేస్తారని వినబడినా అదేం జరగలేదు. అయితే 2015లో కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవెలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సమర్థవంతంగానే పనిచేస్తోంది. కూటమిలో కొంత వెనకబడిన దేశాలకు ఈ సంస్థ ద్వారానే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికైతే బ్రిక్స్‌లో చేరడానికి దక్షిణార్ధ గోళ దేశాల ఉత్సాహాన్ని సంపన్న దేశాలు ఒక హెచ్చరికగా పరిగణించక తప్పదు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న దేశాల ఆకాంక్షలను గుర్తించి తగినవిధంగా వ్యవహరించకుంటే బ్రిక్స్ మాత్రమే కాదు... భవిష్యత్తులో మరిన్ని కూటములు ఉనికిలోకొస్తాయి. ఒకటైతే నిజం – ఆవిర్భవించి పదిహేనేళ్లయినా బ్రిక్స్ సంస్థాగత స్వభావాన్ని సంతరించుకోలేదు. ఆ దేశాలమధ్య పరస్పర ఐక్యతగానీ, ఉమ్మడి లక్ష్యాలుగానీ లేవు. ఆ లోపాన్ని సవరించుకుంటే బ్రిక్స్ మరింత పటిష్టవంతమైన కూటమిగా రూపుదిద్దుకోవటం ఖాయం. -
BRICS summit 2023: బ్రిక్స్ విస్తరణకు భారత్ మద్దతు
జోహెన్నెస్‌బర్గ్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్)ల దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిని విస్తరించాలన్న ప్రతిపాదనతో భారత్ ముందుకు వచ్చింది. అయితే ఈ విస్తరణ ఏకాభిప్రాయంతో జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో బుధవారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించారు. అద్భుతమైన భవిష్యత్‌కు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నట్టుగా చెప్పారు. ‘‘జీ 20 సదస్సును భారత్‌లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాలన్నీ అందులో శాశ్వత సభ్యులే. ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా జీ–20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తున్నాం. బ్రిక్స్ భాగస్వామ్య పక్షాలన్నీ ఇందుకు అంగీకరిస్తాయని భావిస్తున్నాం’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బ్రిక్స్ సదస్సులో ప్రాధాన్యం కల్పించడాన్ని ప్రధాని స్వాగతించారు. జీ–20 సదస్సులో భారత్ కూడా గ్లోబల్ సౌత్ దేశాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాల్లో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారంతో అత్యంత అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించాయని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవలెప్మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రైల్వే రీసెర్చ్ నెట్వర్క్, స్టార్టప్ రంగాల్లో భారత్ చేసిన సూచనలతో అపారమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పశ్చిమ దేశాల వల్లే ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్ బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం పశ్చిమ దేశాల పాపమేనని ఆరోపించారు. డాన్బాస్ ప్రాంతంలో నివసించే ప్రజలకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో యుద్దానికి దిగుతున్నాయని నిందించారు. యుద్ధాన్ని నిలిపివేయడమే రష్యా మిలటరీ లక్ష్యమని పుతిన్ అన్నారు. దక్షిణాఫ్రికాకు వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు మేరకు తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నట్టు చెప్పారు. -
Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్ విజయం కాదని చెప్పారు. ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సకెŠస్స్ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే.. అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు. భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్ టూర్ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు. -
Brics Summit 2023: ప్రపంచానికి ‘గ్రోత్ ఇంజిన్’ భారత్
జోహన్నెస్‌బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో సంస్కరణలను మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్‌గా పాల్గొననున్నారు. -
BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. జోహన్నెస్‌బెర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు. అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్‌గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
BRICS SUMMIT: సార్వభౌమత్వాన్ని గౌరవించుకుందాం
న్యూఢిల్లీ: అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించుకోవాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తదితర అంశాలను చర్చించిన బ్రిక్స్ దేశాల నేతలు ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్ల మధ్య చర్చలే పరిష్కారమంది. ఈ విషయంలో ఐరాస, రెడ్ క్రాస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాలైన ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని తీర్మానించింది. అంతకుముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఇంకా తొలిగిపోలేదని, దీని నుంచి బయటపడేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం సహాయకారిగా ఉంటుందని చెప్పారు. ‘‘కరోనా మహమ్మారి నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ వరుసగా మూడో ఏడాది మనం సమావేశమయ్యాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు తగ్గినప్పటికీ, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగం విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే రకమైన వైఖరి కలిగి ఉన్నాయి. ఆర్థికంగా తిరిగి పుంజుకునేందుకు మనం పరస్పరం సహకరించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది’’అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. బ్రిక్స్‌ను కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగించారు. ఏకపకంగా కొందరు విధించే ఆంక్షలను, చిన్న కూటముల ఏర్పాటుకు సాగే ప్రయత్నాలను వ్యతిరేంచాలని పిలుపునిచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి విధానాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘కొన్ని దేశాలు సైనిక కూటములను విస్తరించుకునేందుకు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆధిపత్యం సాధించుకునే క్రమంలో ఇతర దేశాల హక్కులు, ప్రయోజనాలను కాలరాస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిని ఉపేక్షిస్తే మరింత అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి’’అని పరోక్షంగా ఆయన అమెరికా, ఈయూలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా, ఈయూల నాటో విస్తరణ కాంక్షే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మూల కారణమన్నారు. భేటీలో మోదీ, జిన్‌పింగ్‌లతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో 41%, జీడీపీలో 24%, వాణిజ్యంలో 16% బ్రిక్స్‌లోని ఐదు దేశాలదే. -
3వ బ్రిక్స్ సమావేశం: అఫ్గాన్‌ను ఉగ్ర అడ్డాగా మార్చొద్దు
న్యూఢిల్లీ: ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలపై పోరాడాలని పిలుపునిచ్చాయి. ఆన్లైన్లో భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 13వ బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గాన్‌లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. సమావేశంలో రష్యా అధిపతి పుతిన్, చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమఫోసా, బ్రెజిల్ అధినేత బోల్సనారో ఆన్లైన్లో పాల్గొన్నారు. సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. అఫ్గాన్‌లోని అన్ని వర్గాల మధ్య సామరస్య చర్చలు సాగాలని, తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం రావాలని ఆకాక్షించాయి. ఇటీవల కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడులను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఏవిధమైన ఉగ్రకార్యకలాపాలకు అఫ్గాన్ స్థావరంగా మారకూడదని కోరాయి. టెర్రరిజం ఏరూపంలో ఉన్నా గట్టిగా ఎదుర్కోవాలన్నదే తమ అభిమతమని చెప్పాయి. బ్రిక్స్ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌ను ఆమోదించాయి. టెర్రరిజానికి మతం, జాతీయత, వర్గం రంగు పులమకూడదని బ్రిక్స్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణిని వ్యతిరేకిస్తామని, ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని బ్రిక్స్‌దేశాలు తమ డిక్లరేషన్‌లో కోరాయి. కౌంటర్ టెర్రరిజం ప్లాన్ బ్రిక్స్ దేశాలు రూపొందించుకున్న కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. బ్రిక్స్ చైర్మన్‌గా భారత్ ప్రస్తుతం వ్యవహరిస్తోంది. తమ పాలనా కాలంలో ఇతర నాలుగు దేశాలు మంచి సహకారం అందించాయని ప్రధాని ప్రశంసించారు. ‘ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ప్రభావశీల గళంగా మారాము. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వడానికి బ్రిక్స్ ఉపయోగపడుతోంది’’అని మోదీ చెప్పారు. బ్రిక్స్ సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్, ఎనర్జీ రిసెర్చ్ కోఆపరేషన్ ప్లాట్ఫామ్లాంటి బలమైన సంస్థలను బ్రిక్స్ దేశాలు ఏర్పరుచుకున్నాయన్నారు. వచ్చే 15ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాజా సమావేశం బ్రిక్స్ చరిత్రలో తొలి డిజిటల్ సదస్సని గుర్తు చేశారు. నవంబర్‌లో బ్రిక్స్ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. గ్రీన్ టూరిజం, ఆన్లైన్ టీకా ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటువంటి వాటిపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఎవరేమన్నారంటే..: బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వేదికపై గణనీయమైన శక్తిగా మారాయని చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కొనియాడారు. సభ్యదేశాల మధ్య మరింత లోతైన సహకారం అవసరమని, అప్పుడే ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనే పటిష్టమైన భాగస్వాములుగా మారతామని చెప్పారు. ప్రజారోగ్యాలను బలోపేతం చేయడంలో సహకారం, టీకాలపై అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సహకారం, రాజకీయ, రక్షణ సహకారం, ప్రజా సంబంధాలు పెంపొందించడమనే ప్రతిపాదనలతో బ్రిక్స్ బలపడుతుందని వివరించారు. అఫ్గాన్‌లో నూతన సంక్షోభానికి అమెరికా, దాని మిత్రదేశాలు కారణమయ్యాయని రష్యా అధిపతి పుతిన్ విమర్శించారు. బ్రిక్స్ దేశాలు అఫ్గాన్‌పై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని, ఉగ్రకార్యక్రమాలకు, డ్రగ్స్‌కు ఆదేశం అడ్డాగా మారకుండా చూడాలని కోరారు. కోవిడ్ కట్టడి విషయంలో సమష్టి స్పందనను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా కొనియాడారు. బ్రెజిల్, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బాగుందని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో చెప్పారు. బ్రిక్స్ విశేషాలు ► ఈ సంవత్సరం బ్రిక్స్ థీమ్ ‘‘ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్’’. ► ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే. ► 2006లో తొలిసారి బ్రిక్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. ► 2009లో తొలి బ్రిక్ సమావేశం రష్యాలో జరిగింది. ► బ్రిక్ అనే పదం రూపకల్పన రూపా పురుషోత్తమన్ చేశారు. కానీ క్రెడిట్ మాత్రం జిమ్ ఓ నీల్‌కు వచ్చింది. ► బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది. ► 14వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది. ► ఏటా ఒక దేశం బ్రిక్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించారు. -
బ్రిక్స్ సదస్సుకు మోదీ అధ్యక్షత
న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. 9న వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పాల్గొననున్నారు. ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో అఫ్గానిస్తాన్ వ్యవహారం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని భారత్‌లో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ వ్యాఖ్యానించారు. -
ఉగ్రవాదమే పెను ముప్పు
న్యూఢిల్లీ/మాస్కో/బీజింగ్ : ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఉగ్రవాదమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పొరుగుదేశం పాకిస్తాన్‌ను నేరుగా ప్రస్తావించకుండా.. ఉగ్రవాదానికి సాయమందిస్తూ మద్దతిస్తున్న దేశాలను దోషులుగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మహమ్మారిపై ఉమ్మడిగా, వ్యూహాత్మకంగా పోరు సాగించాలన్నారు. రష్యా అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా) 12వ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బొల్సొనారొ, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమాఫొసా పాల్గొన్నారు. ‘రష్యా నేతృత్వంలో బ్రిక్స్ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం సిద్ధమైనందుకు సంతోషంగా ఉంది. ఇది గొప్ప విజయం. తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న భారత్.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘బ్రిక్స్ నూతన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహం’ను ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ వ్యూహం కార్యాచరణకు సంబంధించి సభ్య దేశాల జాతీయ భద్రత సలహాదారు చర్చలు జరపాలని మోదీ సూచించారు. ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ సమర్థించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను కుటుంబంలోని ‘విశ్వాసఘాతకులు’గా పుతిన్ అభివర్ణించారు. బ్రిక్స్ ప్రపంచంలోని ఐదు ప్రధాన దేశాల కూటమి. 360 కోట్ల జనాభాకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగం. ఈ ఐదు దేశాల మొత్తం జీడీపీ 16.6 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. సదస్సు అనంతరం సభ్యదేశాలు ఉమ్మడి ప్రకటనను వెలువరించాయి. అన్ని విధాలైన ఉగ్రవాద కార్యక్రమాలను బ్రిక్స్ గట్టిగా ఖండిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతం, వర్గం, జాతితో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు ఒక సమగ్ర, సమతుల కార్యాచరణను రూపొందించాలన్నారు. సంస్కరణలు అవసరం బహుళత్వ విధానం, అంతర్జాతీయ ఐక్యత ప్రస్తుతం సంక్షోభంలో పడ్డాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రత మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్ఓ తదితర అంతర్జాతీయ సంస్థల్లో సత్వరమే సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘ఈ సంస్థల పనితీరు, విశ్వసనీయతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం.. కాలానుగుణంగా, అంతర్జాతీయ అవసరాలు ప్రాతిపదికగా ఈ సంస్థలు మార్పు చెందకపోవడమే’ అని ప్రధాని మోదీ విమర్శించారు. ‘ఐరాస భద్రత మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు భారత్‌కు మద్దతిస్తారని ఆశిస్తున్నా’నన్నారు. కోవిడ్–19.. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల పునరుజ్జీవనంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. కరోనా టీకా ఉత్పత్తి, సరఫరాలో మొత్తం మానవాళి సంక్షేమాన్ని భారత్ దృష్టిలో పెట్టుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరిగేందుకు ఇంకా ఎంతో అవకాశముందన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరెంజ్మెంట్ తదితర ఉమ్మడి వ్యవస్థల ద్వారా బ్రిక్స్ దేశాలు ప్రయోజనం పొందడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక రంగ పునరుజ్జీవానికి కూడా అవకాశం లభిస్తుందన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరేందుకు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ టీకాలు, చికిత్సా విధానాలను అంతర్జాతీయ మేథో హక్కుల ఒప్పందాల నుంచి మినహాయించాలంటూ భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. దీనికి బ్రిక్స్ దేశాలు మద్దతివ్వాలన్నారు. స్వయం సమృద్ధ భారత్.. స్వయం సమృద్ధ భారత్ లక్ష్యంగా ఒక సమగ్ర సంస్కరణల విధానాన్ని భారత్‌లో ప్రారంభించామని ప్రధాని బ్రిక్స్ సభ్య దేశాలకు వివరించారు. ‘‘కోవిడ్–19 అనంతరం అంతర్జాతీయ అర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు సముచిత ప్రయోజనం చేకూర్చగల శక్తి స్వయం సమృద్ధ, ఉత్సాహపూరిత భారత్‌కు ఉందన్న విశ్వాసంతోనే ఈ ‘స్వావలంబ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించాం’’ అని వివరించారు. కరోనా విజృంభణ సమయంలో దాదాపు 150 దేశాలకు అత్యవసర ఔషధాలను భారత్ పంపించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించిన తరువాత డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం రంగాల్లో సభ్య దేశాలతో సమన్వయం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. భారత్‌కు సహకరిస్తాం: జిన్‌పింగ్ కరోనా వైరస్‌కు టీకాలను తయారు చేయడంలో భారత్ సహా బ్రిక్స్ దేశాలకు సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. కోవిడ్–19 చికిత్స, నివారణల్లో బ్రిక్స్ దేశాల్లోని సంప్రదాయ వైద్యం ప్రాధాన్యాన్ని వివరించేలా ఒక సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారు. ‘కరోనా టీకాల క్లినికల్ ట్రయల్స్‌లో రష్యా, బ్రెజిల్ దేశాల్లోని తమ భాగస్వామ్యులతో కలిసి చైనా ఫార్మా కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ విషయంలో భారత్, దక్షిణాఫ్రికాలతో కూడా కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాం’ అన్నారు. బ్రిక్స్ దేశాలకు అవసరమైతే, టీకాను సరఫరా చేస్తామన్నారు. భారత్, చైనాల్లో స్పుత్నిక్ వీ టీకా కరోనా వైరస్‌కు టీకాను తయారు చేసే ప్రక్రియలో బ్రిక్స్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి రూపొందించిన తమ స్పుత్నిక్ వీ టీకాను భారత్, చైనాల్లోనూ ఉత్పత్తి చేయనున్నారన్నారు. ‘బ్రిక్స్ దేశాలు వ్యాక్సిన్ల రూపకల్పనలో సహకరించుకోవాలి. టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఉమ్మడి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని రెండేళ్ల క్రితమే ఒక అంగీకారానికి వచ్చాం’ అని పుతిన్ గుర్తు చేశారు. స్పుత్నిక్ వీ టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి బ్రెజిల్, భారత్‌ల్లోని భాగస్వాములతో ఒప్పందాలు కుదిరాయన్నారు. టీకా ఉత్పత్తికి సంబంధించి భారత్, చైనాల్లోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదిరిందన్నారు. స్పుత్నిక్ వీ పేరుతో ప్రపంచంలోనే తొలిసారి కరోనా వైరస్‌కు టీకాను రష్యా ఈ ఆగస్ట్‌లో రిజిస్టర్ చేసింది.