బ్రిక్స్ సదస్సుపై చైనీస్ మీడియా ఆశ్చర్యకర కథనం
గోవాలో బ్రిక్స్ సదస్సు.. కేవలం ఆయా దేశాల అధినేతలతోనే కాదు.. బంగళాఖాత పరివాహక ప్రాంత సరిహద్దు దేశాలన్నింటిన్నీ భారత్ ఆహ్వానిచ్చింది. కానీ ఒక్క దాయాది దేశం పాకిస్తాన్ను మాత్రం భారత్ వెలివేసింది. బ్రిక్స్ సదస్సును బాగా వాడుకుని పాక్ను భారత్ ఒంటరిచేసినట్టు ఆ దేశ చిరకాల మిత్రుడు చైనా పేర్కొంది. ప్రాంతీయ వెలివేత పేరుతో పాకిస్తాన్ను భారత్ పూర్తిగా సమాధిచేస్తుందని చైనీస్ ప్రభుత్వ మీడియా ఓ ఆశ్చర్యకరమైన కథనాన్ని ప్రచురించింది.
బ్రిక్స్ సదస్సుతో పాక్ కు భారత్ ఎత్తుకు పై ఎత్తు వేసిందని పేర్కొంది. చైనీస్ స్కాలర్ రాసిన ఈ ఆశ్చర్యకరమైన ఓపీనియన్ కాలమ్లో బ్రిక్స్ సదస్సులో భారత్ సాధించిన విజయాలను అభివర్ణించింది. ఈ సదస్సులో భారత్ గెలిచినట్టు బీజింగ్ భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ సదస్సుకు సరిహద్దు దేశాలన్నింటిన్నీ ఆహ్వనించిన భారత్, పాకిస్తాన్ను వెలివేయడంపై గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. ఈ సదస్సుతో ప్రాంతీయంగా పాకిస్తాన్ను భారత్ సమాధిచేస్తున్నట్టు తెలిపింది.
నవంబర్లో సార్క్ సదస్సును బహిష్కరించిన భారత్, కొద్ది వారాల్లోనే బ్రిక్స్ సదస్సు జరపడం భారత్కు లభించిన ఓ అరుదైన అవకాశంగా పేర్కొంది. ఉడి ఉగ్ర ఘటనతో 19 మంది జవాన్ల ప్రాణాలను భారత్ కోల్పోవడంతో, సార్క్ సమావేశాలను ఆ దేశం బహిష్కరించిందని ఆర్టికల్ పేర్కొంది. బ్రిక్స్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్లాండ్, మయన్మార్, నేపాల్, భూటాన్ దేశాలను ఒకే వేదికగా తీసుకురావడంలో భారత్ చట్టబద్ధత పాటించి తన సత్తా చాటిందని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ప్రతికూల వాతావరణాలపై బ్రిక్స్ మెంబర్స్ ఎవరూ ఏ దేశంపైనా బహిరంగంగా మొగ్గుచూపలేదన్నారు.
భారత్ తన వైఖరిపై సురక్షితంగా ఉందని, అదేమాదిరి పాకిస్తాన్ కూడా తన సదస్సులతో అజెండాలను నిర్మించుకుంటూ లబ్దిపొందుతున్నట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అయితే సార్క్కు ప్రత్యామ్నాయంగా మరింత సమర్థవంతంగా భారత్ బ్రిక్స్-బిమ్స్టెక్ సదస్సు నిర్వహించిందని అనుకోవడం లేదని తెలిపింది. పాకిస్తాన్ను వెలివేసి ఉపఖండ దేశాల సమావేశాలు ఏర్పాటుచేయడం, చిన్న దేశాలకు భయాందోళనగా భారత్ ఆధిపత్య స్థానానికి ఎగబాకుతున్నట్టు వివరించింది. భారత్ పరంగా చూస్తే బ్రిక్స్ సదస్సు ప్రస్తుత ప్రపంచ ఆర్థికవ్యవస్థ, ఆర్థిక పాలనలో సంస్కరణలు ప్రతిపాదించడానికి ఇది ఓ అద్భుతమైన వేదికగా ఆర్టికల్ అభివర్ణించింది.