ఔను, ప్రధాని మోదీ చైనా వెళుతున్నారు
డోక్లాం వివాదం పరిష్కారం నేపథ్యంలో
బ్రిక్స్ సదస్సుకు హాజరుకాబోతున్న నరేంద్రమోదీ
అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని విదేశాంగశాఖ మంగళవారం వెల్లడించింది. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన 73 రోజుల డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఫుజియన్ ప్రావిన్స్‌లోని జియామెన్ నగరంలో జరిగే 9వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు' అని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల్లో ప్రపంచంలోని 42శాతం జనాభా నివసిస్తోంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఈ దేశాల మొత్తం వాటా 23శాతం. చైనా పర్యటన ముగిసిన అనంతరం మయన్మార్‌లో ప్రధాని మోదీ సెప్టెంబర్ ఐదు నుంచి ఏడో తేదీ వరకు పర్యటిస్తారు. మయన్మార్‌లో మోదీ ద్వైపాకిక్ష దౌత్య పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి.