Douklam border dispute
-
డోక్లాం: భారత్‌కు చైనా ఆర్మీ వార్నింగ్
బీజింగ్: రెండు నెలలకుపైగా కొనసాగిన డోక్లాం సరిహద్దు వివాదం ముగిసిపోయిన నేపథ్యంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని భారత్‌కు చైనా ఆర్మీ హెచ్చరించింది. డోక్లాం కొండప్రాంతంలో ఇరుదేశాల సైన్యాలు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్న నేపథ్యంలో మంగళవారం ఇరుదేశాలు డోక్లాం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించడంతో వివాదానికి తెరపడింది. ఈ వివాదానికి పరిష్కారం లభించిన నేపథ్యంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సీనియర్ కల్నల్ వు కియాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'భారత్-చైనా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా ఆర్మీ ఇకనుంచి ఎంతో అప్రమత్తంగా ఉంటూ జాతీయ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంది' అని కియాన్ అన్నారు. 'ఈ ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్వాల్సిందిగా మేం భారత్‌కు గుర్తుచేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను అనుసరించి సరిహద్దుల్లో శాంతిని, సుస్థిరతను కాపాడటానికి, ఇరుదేశాల సైన్యాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించడానికి కలిసి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం' అని ఆయన అన్నారు. డోక్లాం నుంచి ఇరుదేశాల సైన్యాలు ఉపసంహరించుకున్నాయని భారత్ తెలియజేయగా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో వచ్చిన మార్పు మేరకు, భారత్ ప్రతిస్పందన మేరకు కొన్ని మార్పులు మాత్రమే చేసినట్టు చైనా చెప్తోంది. -
ఔను, ప్రధాని మోదీ చైనా వెళుతున్నారు
డోక్లాం వివాదం పరిష్కారం నేపథ్యంలో బ్రిక్స్ సదస్సుకు హాజరుకాబోతున్న నరేంద్రమోదీ అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలోని జియామెన్ నగరంలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరవుతారని విదేశాంగశాఖ మంగళవారం వెల్లడించింది. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన 73 రోజుల డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఫుజియన్ ప్రావిన్స్‌లోని జియామెన్ నగరంలో జరిగే 9వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు' అని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల్లో ప్రపంచంలోని 42శాతం జనాభా నివసిస్తోంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఈ దేశాల మొత్తం వాటా 23శాతం. చైనా పర్యటన ముగిసిన అనంతరం మయన్మార్‌లో ప్రధాని మోదీ సెప్టెంబర్ ఐదు నుంచి ఏడో తేదీ వరకు పర్యటిస్తారు. మయన్మార్‌లో మోదీ ద్వైపాకిక్ష దౌత్య పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. -
దృఢ వైఖరి, పరిణత దౌత్య చర్చల వల్లే..
డోక్లాం వివాదాన్ని భారత్ హుందాగా ఎదుర్కొంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం ప్రశాంతంగా ముగియడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వివాదం వల్ల భారత్-చైనా సంబంధాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయన్న విషయాన్ని గుర్తించి.. ఇరుదేశాలూ వెనుకకు తగ్గడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఇది గొప్ప పరిణతితో కూడిన పరిణామామని, దీనిని అందరూ స్వాగతించాలని తెలిపారు. డోక్లాం వివాదాన్ని దౌత్యపరంగా ఎదుర్కోవడంలో భారత్ ఎంతో పరిణతిని, హుందాతనాన్ని, విజ్ఞతను పాటించిందన్నారు. మనల్ని రెచ్చగొట్టే పరిస్థితి రాకుండా.. పరిణతితో కూడిన దౌత్యమార్గంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నామని ఆయన చెప్పారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో దృఢంగా వ్యవహరించామని, దృఢ వైఖరి, పరిణతితో కూడిన దౌత్య ప్రయత్నాల కలయిక వల్లే ఈ వివాదం శాంతియుతంగా సమసిపోయిందని తెలిపారు. డోక్లాం విషయంలో భారత్ తన వైఖరిని కొనసాగిస్తుందని, చాలాకాలం కిందట ఉమ్మడిగా నిర్ణయించిన ప్రకారమే నడుచుకుంటుందని చెప్పారు. పొరుగుదేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే శాంతి తప్పనిసరి అని తెలిపారు. భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు సోమవారం తెరపడిన సంగతి తెలిసిందే. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ అతిపెద్ద ద్వైపాక్షిక పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
డోక్లాం వివాదం సుఖాంతం
బలగాల ఉపసంహరణకు చైనా అంగీకారం: భారత్ ► ఇరు దేశాలు బలగాల్ని వెనక్కి తీసుకున్నాయని వెల్లడి ► మేం ఉపసంహరించలేదు.. పరిస్థితుల మేరకు మార్పులు చేస్తాం: చైనా న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైందని భారత్ ప్రకటించింది. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరడంతో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడిందని తెలిపింది. ‘వీలైనంత త్వరగా డోక్లాం నుంచి సరిహద్దు బలగాల్ని వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా అంగీకరించాయి’ అని విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. మరోవైపు తమ బలగాల్ని ఉపసంహరించలేదని, పరిస్థితుల మేరకు మార్పులు ఉంటాయని చైనా పేర్కొంది. మరో వారంలో చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ అతిపెద్ద ద్వైపాక్షిక పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘డోక్లాం సంఘటనపై భారత్, చైనాలు ఇటీవల ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలు తమ అభిప్రాయాల్ని వెల్లడించడంతో పాటు పరస్పరం ఆందోళనలు, ఆసక్తుల్ని పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద డోక్లాం నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. డోక్లాంలో భారత్, చైనాల బలగాల ఉపసంహరణ దాదాపుగా పూర్తయిందని విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. గత నెల్లో చైనా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ డోక్లాం వివాదంపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో కీలక చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరి మధ్య ఫోన్లో చర్చలు కొనసాగాయని, ఈ నేపథ్యంలోనే సమస్య కొలిక్కివచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. విదేశాంగ కార్యదర్శి జై శంకర్, చైనాలో భారత రాయబారి విజయ్ గోఖలేలు కూడా డోక్లాం వివాద పరిష్కారానికి కృషిచేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. డోక్లాం నుంచి బుల్డోజర్లతో సహా చైనా బలగాలు వెనక్కి మళ్లాయని, టెంట్లు, జెండాను కూడా తొలగించాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు తమ బలగాల్ని వెనక్కి తీసుకోలేదని చైనా చెప్పడంతో భారత ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది. బలగాల ఉపసంహరణపై అస్పష్ట సమాధానమిస్తూ... తాజా పరిస్థితుల్ని అంచనావేసి వివాదాస్పద ప్రాంతంలో కొన్ని మార్పులు చేస్తామని చైనా పేర్కొంది. వివాదానికి అసలు కారణమిదే.. భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని కీలక భూభాగమే డోక్లాం. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. ఇక్కడ భూటాన్ అధీనంలో ఉన్న ప్రాంతంలో యుద్ధట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా రోడ్డు నిర్మాణానికి జూన్‌లో చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రోడ్డు పూర్తయితే ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్‌లోని సన్నని కోడి మెడ ప్రాంతం(చికెన్ నెక్) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావించిన భారత్ భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని మోహరించి దాన్ని అడ్డుకుంది. దీంతో భారత బంకర్లను చైనా ధ్వంసం చేసింది.