డోక్లాం వివాదం సుఖాంతం | China and India Agree to End Border Standoff | Sakshi
Sakshi News home page

డోక్లాం వివాదం సుఖాంతం

Published Tue, Aug 29 2017 1:29 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

డోక్లాం వివాదం సుఖాంతం

డోక్లాం వివాదం సుఖాంతం

బలగాల ఉపసంహరణకు చైనా అంగీకారం: భారత్‌
► ఇరు దేశాలు బలగాల్ని వెనక్కి తీసుకున్నాయని వెల్లడి  
► మేం ఉపసంహరించలేదు.. పరిస్థితుల మేరకు మార్పులు చేస్తాం: చైనా


న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం పరిష్కారమైందని భారత్‌ ప్రకటించింది. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరడంతో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడిందని తెలిపింది. ‘వీలైనంత త్వరగా డోక్లాం నుంచి సరిహద్దు బలగాల్ని వెనక్కి తీసుకునేందుకు భారత్, చైనా అంగీకరించాయి’ అని విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది. మరోవైపు తమ బలగాల్ని ఉపసంహరించలేదని, పరిస్థితుల మేరకు మార్పులు ఉంటాయని చైనా పేర్కొంది.

మరో వారంలో చైనాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ అతిపెద్ద ద్వైపాక్షిక పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.  ‘డోక్లాం సంఘటనపై భారత్, చైనాలు ఇటీవల ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాలు తమ అభిప్రాయాల్ని వెల్లడించడంతో పాటు పరస్పరం ఆందోళనలు, ఆసక్తుల్ని పంచుకున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద డోక్లాం నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

డోక్లాంలో భారత్, చైనాల బలగాల ఉపసంహరణ దాదాపుగా పూర్తయిందని విదేశాంగ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ చెప్పారు. గత నెల్లో చైనా పర్యటన సందర్భంగా జాతీయ భద్రతా సలహదారు అజిత్‌ దోవల్‌ డోక్లాం వివాదంపై చైనా జాతీయ భద్రతా సలహాదారుతో కీలక చర్చలు జరిపారు. అనంతరం వారిద్దరి మధ్య ఫోన్‌లో చర్చలు కొనసాగాయని, ఈ నేపథ్యంలోనే సమస్య కొలిక్కివచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.

విదేశాంగ కార్యదర్శి జై శంకర్, చైనాలో భారత రాయబారి విజయ్‌ గోఖలేలు కూడా డోక్లాం వివాద పరిష్కారానికి కృషిచేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  డోక్లాం నుంచి బుల్‌డోజర్లతో సహా చైనా బలగాలు వెనక్కి మళ్లాయని, టెంట్లు, జెండాను కూడా తొలగించాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   మరోవైపు తమ బలగాల్ని వెనక్కి తీసుకోలేదని చైనా చెప్పడంతో భారత ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది. బలగాల ఉపసంహరణపై అస్పష్ట సమాధానమిస్తూ... తాజా పరిస్థితుల్ని అంచనావేసి వివాదాస్పద ప్రాంతంలో కొన్ని మార్పులు చేస్తామని చైనా పేర్కొంది.

వివాదానికి అసలు కారణమిదే..
భారత్, చైనా, భూటాన్‌ సరిహద్దుల్లోని కీలక భూభాగమే డోక్లాం. సిక్కిం వైపున ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా భారత్‌కు ఎంతో కీలకం. ఇక్కడ భూటాన్‌ అధీనంలో ఉన్న ప్రాంతంలో యుద్ధట్యాంకులు, పరికరాల్ని మోసుకెళ్లేలా రోడ్డు నిర్మాణానికి జూన్‌లో చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. రోడ్డు పూర్తయితే ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడి మెడ ప్రాంతం(చికెన్‌ నెక్‌) చేరుకునేందుకు చైనాకు వీలవుతుంది. దేశ భద్రత పరంగా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావించిన భారత్‌ భూటాన్‌కు మద్దతుగా తన సైన్యాన్ని మోహరించి దాన్ని అడ్డుకుంది. దీంతో భారత బంకర్లను చైనా ధ్వంసం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement