డోక్లాం: భారత్‌కు చైనా ఆర్మీ వార్నింగ్
బీజింగ్: రెండు నెలలకుపైగా కొనసాగిన డోక్లాం సరిహద్దు వివాదం ముగిసిపోయిన నేపథ్యంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని భారత్‌కు చైనా ఆర్మీ హెచ్చరించింది.
డోక్లాం కొండప్రాంతంలో ఇరుదేశాల సైన్యాలు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్న నేపథ్యంలో మంగళవారం ఇరుదేశాలు డోక్లాం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి అంగీకరించడంతో వివాదానికి తెరపడింది.
ఈ వివాదానికి పరిష్కారం లభించిన నేపథ్యంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) సీనియర్ కల్నల్ వు కియాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'భారత్-చైనా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా ఆర్మీ ఇకనుంచి ఎంతో అప్రమత్తంగా ఉంటూ జాతీయ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంది' అని కియాన్ అన్నారు. 'ఈ ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్వాల్సిందిగా మేం భారత్‌కు గుర్తుచేస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను అనుసరించి సరిహద్దుల్లో శాంతిని, సుస్థిరతను కాపాడటానికి, ఇరుదేశాల సైన్యాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించడానికి కలిసి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం' అని ఆయన అన్నారు.
డోక్లాం నుంచి ఇరుదేశాల సైన్యాలు ఉపసంహరించుకున్నాయని భారత్ తెలియజేయగా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో వచ్చిన మార్పు మేరకు, భారత్ ప్రతిస్పందన మేరకు కొన్ని మార్పులు మాత్రమే చేసినట్టు చైనా చెప్తోంది.