దృఢ వైఖరి, పరిణత దౌత్య చర్చల వల్లే..
- డోక్లాం వివాదాన్ని భారత్ హుందాగా ఎదుర్కొంది
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డోక్లాం సరిహద్దు వివాదం ప్రశాంతంగా ముగియడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వివాదం వల్ల భారత్-చైనా సంబంధాలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాయన్న విషయాన్ని గుర్తించి.. ఇరుదేశాలూ వెనుకకు తగ్గడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఇది గొప్ప పరిణతితో కూడిన పరిణామామని, దీనిని అందరూ స్వాగతించాలని తెలిపారు.
డోక్లాం వివాదాన్ని దౌత్యపరంగా ఎదుర్కోవడంలో భారత్ ఎంతో పరిణతిని, హుందాతనాన్ని, విజ్ఞతను పాటించిందన్నారు. మనల్ని రెచ్చగొట్టే పరిస్థితి రాకుండా.. పరిణతితో కూడిన దౌత్యమార్గంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నామని ఆయన చెప్పారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో దృఢంగా వ్యవహరించామని, దృఢ వైఖరి, పరిణతితో కూడిన దౌత్య ప్రయత్నాల కలయిక వల్లే ఈ వివాదం శాంతియుతంగా సమసిపోయిందని తెలిపారు. డోక్లాం విషయంలో భారత్ తన వైఖరిని కొనసాగిస్తుందని, చాలాకాలం కిందట ఉమ్మడిగా నిర్ణయించిన ప్రకారమే నడుచుకుంటుందని చెప్పారు. పొరుగుదేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలంటే శాంతి తప్పనిసరి అని తెలిపారు.
భారత్, చైనా, భూటాన్ దేశాల మధ్య ఉన్న ట్రై జంక్షన్ 'డోక్లాం'లో 70 రోజుల నుంచి సాగుతున్న ప్రతిష్టంభనకు సోమవారం తెరపడిన సంగతి తెలిసిందే. వివాదాస్పద ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. చైనాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ అతిపెద్ద ద్వైపాక్షిక పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.