
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్, చైనా దేశాలు ఏ స్థాయిలో అయితే దిగుమతి సుంకాలు వేస్తున్నాయో అంతే శాతం దిగుమతి సుంకాలు తామూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తాజాగా వాషింగ్టన్‌లో వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికాపై ఏదైనా కంపెనీ లేదంటే ఒక దేశం ఎంత పన్నులు విధిస్తే మనమూ ఇకపై అంతే సుంకాలు వసూలు చేద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ లేదా చైనాలు మనపై ఎంత పన్నుల భారం మోపుతాయో అమెరికా సైతం అంతే పన్నుల భారాన్ని వాటిపై వేయనుంది. త్వరలోనే ఈ కొత్త పన్నులను తీసుకొస్తాం. ఇదొక అనులోమానుపాత సిద్ధాంతం అనుకోండి. అటు ఎంత పెరిగితే ఇటు అంతే పెరుగుతుంది. అటు ఎంత తగ్గితే ఇటూ అంతే తగ్గుతుంది. వాళ్లు మనకు ఛార్జీ వేస్తున్నారు. మనమూ వాళ్లకు ఛార్జీ వేద్దాం’’అని అక్కడి అమెరికన్లనుద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ‘మనం గతంలో ఇలా ఎప్పుడూ ప్రతిస్పందించలేదు. కానీ ఈసారి మాత్రం మనం అవతలి దేశాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకోబోతున్నాం’ అని అన్నారు. గత మంగళవారం సైతం ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా తనను కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఇదే విషయం స్పష్టంచేశానని ట్రంప్ చెప్పారు. ‘మంత్రి హొవార్డ్ సారథ్యంలోనే అమెరికా విదేశాలపై కొత్త పన్నుల విధానాన్ని అమలుచేయబోతోంది. నూతన వాణిజ్య మంత్రి హొవార్డ్‌కు వాణిజ్య సంబంధాలపై మంచి పట్టు ఉంది’ అని పొగిడారు.
నా నాలుగో ఫేవరెట్ పదం
కొద్దిసేపు ట్రంప్ సరదాగా మాట్లాడారు.‘నాకిష్టమైన పదాలను చెప్పాలంటే దేవుడికి అగ్రస్థానం ఇస్తా. ఇందులో మరో మాటే లేదు. ప్రచారంవేళ కాల్పుల ఘటనల నుంచి తప్పించుకున్నా. దేవుడు రక్షించాడు. నా మొదటి ఫేవరెట్ పదం దేవుడు. తర్వాత కుటుంబం, ఆ తర్వాత రిలేషన్‌ఫిప్’ అని అన్నారు. పదే పదే టారిఫ్ అని వల్లెవేస్తున్నారుగా అని అక్కడి మీడియా ప్రశ్నించగా ‘అవును. టారిఫ్ ఇప్పుడు నా ఫేవరెట్ నాలుగో పదం. దీన్నే ఖాయం చేసుకోండి’ అని ట్రంప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment