
ఎగుమతులను పెంచుకోవచ్చు
దేశీయ తయారీని బలోపేతం చేసుకోవచ్చు
నిపుణుల అభిప్రాయాలు
న్యూఢిల్లీ: చైనా, మెక్సికో, కెనడాపై అమెరికా అధిక దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) మోపడం అన్నది, భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో అవకాశాలను విస్తృతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం నుంచి వ్యవసాయం, ఇంజనీరింగ్, మెషిన్ టూల్స్, గార్మెంట్స్, టెక్స్‌టైల్స్, రసాయనాలు, లెదర్ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మొదటి నాలుగేళ్ల పదవీ కాలంలో చైనాపై అధిక సుంకాల బాదుడు నుంచి ఎక్కువగా లాభపడిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ లోగడే ప్రకటించారు.
చైనా ఉత్పత్తులపైనా టారిఫ్‌ను 20 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికా విధించిన సుంకాలతో అమెరికా మార్కెట్లో చైనా, మెక్సికో, కెనడా వస్తువుల ధరలను పెంచేస్తాయి. దీంతో వాటి పోటీతత్వం తగ్గిపోతుంది. భారత ఎగుమతిదారులు ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలి’’అని భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు.
భారత్‌కు ప్రయోజనం: జీటీఆర్‌ఐ
ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. వాణిజ్య యుద్ధం భారత్‌కు అనుకూలిస్తుందని, ఎగుమతులను పెంచుకోవడంతోపాటు అమెరికా కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి సాయపడుతుందని పేర్కొంది.
చైనాపై అధిక సుంకాలు భారత్ తన తయారీరంగాన్ని బలోపేతం చేసుకునేందుకు అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. ఒప్పందాలకు కట్టుబడని ట్రంప్ వైఖరి దృష్ట్యా ఆ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ హెచ్చరించారు. దీనికి బదులు జీరోకి జీరో టారిఫ్ డీల్‌ను కుదుర్చుకోవాలని సూచించారు.
సుంకాలేతర చర్యలు భారత ఎగుమతులకు అడ్డు: డీజీఎఫ్‌టీ
అభివృద్ధి చెందిన దేశాలు విధించిన నాన్ టారిఫ్ (సుంకాలు కాని ఇతర చర్యలు)లు భారత వస్తువులకు మార్కెట్ అవకాశాలను పరిమితం చేయొచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ సారంగి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన కార్బన్ ట్యాక్స్, డీఫారెస్టేషన్ నిబంధనలను ప్రస్తావించారు.
అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానమై ఉండకపోవడం, అధిక దిగుమతి సుంకాలు, టెక్నాలజీ పరంగా అననుకూలత, అధిక లాజిస్టిక్స్ వ్యయాలు వంటి ఇతర సవాళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల దుందుడుకు పారిశ్రామిక విధానాలు సైతం భారత ఎగుమతులకు అవరోధంగా మారొచ్చన్నారు.
‘‘2023–24లో 437 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులకు గాను 284 బిలియన్ డాలర్ల రుణ సాయం అవసరం. కానీ, అందించిన రుణ సాయం 125 మిలియన్ డాలర్లుగానే ఉంది. 2030 నాటికి ఎగుమతుల రుణ డిమాండ్ 650 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది’’అని సారంగి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment