
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.
అయితే భారత్.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.
ఇది కూడా చదవండి: Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు