
ఢాకా: అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమె సోదరి షేక్ రెహానా, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా మరో 50 మంది పేర్లు పొందుపరిచింది. అధికార దుర్వినియోగంతో పుర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో 10 అంతస్తుల స్థలాన్ని కొనుగోలు చేశారంటూ జనవరి 13న రెహానాపై ఏసీసీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హసీనా, రెహానా కుమార్తె బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు.
మరో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీసీ మార్చి 10న సమర్పించిన తుది చార్జిషీట్‌లోలో మరో 18 మంది పేర్లు చేర్చింది. మూడు వేర్వేరు ఛార్జిషీట్లను పరిశీలించిన అనంతరం ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జాకీర్ హుస్సేన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు ఉత్తర్వుల అమలుపై నివేదికలను సమీక్షించడానికి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు.
రజుక్ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన మరో అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వజీద్ పుతుల్, మరో 17 మందిపై ఏప్రిల్ 10న ఇదే కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పుతుల్ 2023 నవంబర్ 1 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హసీనాపై సామూహిక హత్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు అదృశ్యాలు వంటి అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5న తిరుగుబాటు అనంతరం తన ప్రభుత్వం కూలిపోవడంతో, 77 ఏళ్ల హసీనా అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు.