
బంగ్లా ప్రభుత్వ ప్రకటన
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి.
ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు.
యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా
మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు.
యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment