Muhammad Yunus
-
బంగ్లా తీరు మారాల్సిందే!
ఏదైనా మోతాదు మించితే వికటిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోగా అనవసర ప్రయాస మిగులు తుంది. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు ఆలస్యంగానైనా ఇది అర్థమైందో లేదో సందేహమే. గతవారం ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విజయవంతమైందని బంగ్లా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. కానీ అక్కడ తెలిసీ తెలియకుండా యూనస్ మాట్లాడిన మాటలవల్ల బంగ్లాకు ఒరిగిందేమీ లేకపోగా, ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పించుకోవాల్సివచ్చింది. నిరుడు ఆగస్టులో ప్రజా ఉద్యమం పర్యవసానంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయి మన దేశంలో ఆశ్రయం పొందినప్పటినుంచీ ఇరు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి. హత్యలు, అత్యా చారాలు అధికమయ్యాయి. మత ఛాందసవాదుల ప్రాబల్యం ఎక్కువైంది. ఈ పరిణామాల అనంతరం ఇరు దేశాలమధ్యా ఉన్నతస్థాయి భేటీ జరగటం ఇదే ప్రథమం. శుక్రవారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఏడు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల కూటమి బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూనస్‌తో విడిగా భేటీ అయినప్పుడు ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలు చేయటం మానుకోవాలని మోదీ సూచించినట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే నిర్మాణాత్మక, ఆచరణీయ వైఖరితో ఉండాలని కూడా సలహా ఇచ్చారట. తమ దేశంపై తప్పుడు ప్రచారం సాగుతోందని బంగ్లా దబాయించినా సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు నిజమేమిటో వెల్లడిస్తూ వచ్చాయి. వీటిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని, ఇవి పునరావృతం కానీయరాదని గతంలోనే మన దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుత భేటీలో కూడా మోదీ దీన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలన్న యూనస్‌కు... అలా అడగటా నికి ఇది వేదిక కాదని మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పాల్సి వచ్చింది.యూనస్ పూర్వాశ్రమంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థ రూపశిల్పిగా, మైక్రో ఫైనాన్స్ విధాన నిర్ణేతగా బంగ్లా గ్రామీణ ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు చేసినకృషికి 2006లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. పలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంఘాలకు సారథ్యం వహించారు. ఇదంతా బాగున్నా షేక్ హసీనాతో వచ్చిన విభేదాల కార ణంగా ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కేసులు వచ్చి పడ్డాయి. మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ వల్ల గ్రామీణులకు మేలు కలగకపోగా అప్పుల్లో కూరుకుపోయారన్న ఆరోపణలూ వచ్చాయి. తనకు ససేమిరా పడని హసీనాకు మన దేశం మద్దతుగా నిలిచిందన్న ఆక్రోశం యూనస్‌కు ఉండొచ్చు. ఇరుగు పొరుగు సత్సంబంధాలతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం, అభివృద్ధి సాధించటం అత్యవసరమని ఆయన ఇప్పటికీ గ్రహించలేదని చైనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలూ సముద్రతీరం లేనివని, కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదని యూనస్ చైనాలో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగలేదు. మౌలిక సదుపాయాలూ, కనెక్టివిటీ సరిగాలేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తుచేశారు. అది తెలివితక్కువతనమో, మతిమరుపోగానీ... భారత్‌కు రెండువైపులా 6,500 కిలోమీటర్ల పొడవైన విస్తృత తీరప్రాంతం ఉందన్న సంగతి ఆయనకు తట్టలేదు.ఈశాన్యంలో రహదారులు, రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే... జలరవాణాను పెంచితే దేశంలోని ఏ తీరప్రాంతంనుంచి అయినా విదేశాలకు ఎగుమతులు చేయటం ఎంత పని! యూనస్ వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారని బంగ్లా విదేశాంగ శాఖ ముక్తాయిస్తోంది. కానీ సమయమూ,సందర్భమూ గమనిస్తే అది నిజం కాదనిపిస్తుంది. తాము పాకిస్తాన్‌తోపాటు చైనాకు దగ్గర కాబోతు న్నామని మన దేశాన్ని నేరుగా హెచ్చరించటమే ఇది.బంగ్లాదేశ్‌కు ఆర్థిక కష్టాలు దండిగానే ఉన్నాయి. అందులో కొన్ని స్వయంకృతం. బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిపేశారు. హసీనా పదవీచ్యుతి తర్వాత అక్కడ మతఛాందసుల వీరంగంతో మన దేశం కూడా బంగ్లాను దూరం పెట్టింది. దాంతో నిధుల లేమితో అది సతమతమవుతోంది. ఇటీవల బియ్యం కొరత ఏర్పడి అది పాకిస్తాన్‌ను ఆశ్రయించినా అక్కడినుంచి చాలినంత అందలేదు. పైగా భారత్‌నుంచి వచ్చే బియ్యంతో పోలిస్తే వ్యయం తడిసి మోపెడవుతోంది. ప్రధాన సలహాదారయ్యాక యూనస్‌ను మన ప్రభుత్వం అభినందించినా, భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం పంపలేదు. అందుకే తొలి పర్యటనకు యూనస్ కావాలని చైనాను ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చైనాను ఆకాశానికెత్తి మనల్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. ఇంతచేసినా 210 కోట్ల డాలర్ల పెట్టుబడికి చైనా సమ్మతించింది. దాదాపు వంద కంపెనీలు 100 కోట్ల డాలర్లమేర మదుపు చేయటానికి అంగీకరించాయి. ఈ రెండు ప్రతిపాదనలకూ నిర్దిష్ట గడువు లేదు. ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ బంగ్లాకు తక్షణసాయం కావాలి. అది అధిక ధరలతో, నిత్యావసరాల కొరతతో సతమతమవుతోంది. మత ఛాందసులు ఈ స్థితిని తమకు అను కూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. మోదీ అన్నట్టు సుస్థిర, ప్రజాతంత్ర, శాంతియుత దేశ మన్న అభిప్రాయం కలిగించినప్పుడే బంగ్లాకు అన్నివైపులనుంచీ సాయం అందుతుంది. అరాచక శక్తులకు ఆటపట్టయితే, భారత్ వ్యతిరేకతే ఊపిరిగా బతుకుతానంటే ప్రయోజనం శూన్యం. యూనస్ ఈ సంగతిని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
మహమ్మద్ యూనస్ తో ప్రధాని మోదీ భేటీ
-
ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ
బ్యాంకాక్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు. వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్‌కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉన్నారు.Profsssor Muhammad Yunus is presenting a photo to Prime Minister Narendra Modi during their bilateral meeting in Bangkok on Friday. The photo is about Prime Minister Narendra Modi presenting a gold medal to Professor Yunus at the 102nd Indian Science Congress on January 3, 2015 pic.twitter.com/lsikvMOWT4— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) April 4, 2025ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్ యూనస్ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు... గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బిమ్స్టెక్లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.దేశవ్యాప్త ఆందోళనలతో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్‌కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్ నొక్కి చెప్పింది. మరోవైపు.. చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మండిపడగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. -
భారత్‌కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్‌లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్‌ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్‌కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శించింది. -
బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే. -
బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన!
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతోపాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు మీడియా స్పష్టంచేసింది.యూనస్‌ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించి, ఆ తర్వాత మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అత్యవసర భేటీ జరగలేదన్న సైన్యం సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని బంగ్లాదేశ్ సైన్యం తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది. -
Bangladesh: బంగ్లాలో మళ్లీ అల్లర్లు? సైనికుల పహారాకు ఆదేశాలు
బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంలో అశాంతి, హింసాయుత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాజధాని ఢాకాలో సైనికులను మోహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని వారాలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్మీ ఇటువంటి ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తిరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే ఇటువంటి ఆదేశాలు జారీ అయ్యాయని కూడా చెబుతున్నారు.నార్త్-ఈస్ట్ న్యూస్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ సైన్యం ఇప్పటికే ఢాకా(Dhaka) చేరుకుంది. భారీ సంఖ్యలో సాయుధ వాహనాలు, 100 మంది సైనికులను తొలుత ఢాకాలో మోహరించినట్లు సమాచారం. 9వ డివిజన్ సైనికులు కూడా ఢాకాకు చేరుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సైన్యం ఇటువంటి చర్యలు చేపట్టిందని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామీణాభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమూద్ షాజిబ్ భూయాన్‌కు చెందిన పాత వీడియో ఒకటి బయటపడింది. అందులో అతను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సమక్షంలో బంగ్లాదేశ్ పగ్గాలను ముహమ్మద్ యూనస్(Muhammad Yunus)కు అప్పగించడానికి అయిష్టంగానే అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా విద్యార్థి నేత హస్నత్ అబ్దుల్లా మార్చి 11న జనరల్ జమాన్‌తో రహస్య భేటీ తర్వాత సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆర్మీ చీఫ్ అనడం హస్నత్ అబ్దుల్లాకు నచ్చలేదని అంటున్నారు.బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలకు, ఆర్మీ చీఫ్‌కు మధ్య సయోధ్య లేనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నియంత్రించాలని ఆర్మీ చీఫ్ యూనస్ నిరంతరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆర్మీ చీఫ్ మరోసారి షేక్ హసీనా అవామీ లీగ్‌కు మార్గం సుగమం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో రాబోయే ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు ఆర్మీ చీఫ్ సన్నాహాలను ప్రారంభించారని సమాచారం. ఇది కూడా చదవండి: Janta Curfew: జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు.. 68 రోజుల లాక్డౌన్ మొదలైందిలా.. -
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
బంగ్లాదేశ్‌లో ఆపరేషన్ డెవిల్స్ హంట్.. 1300 మంది అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 1300 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా, షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ భవనాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు, ప్రత్యర్థుల ఏరివేతకు మహ్మద్ యూనస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావొస్తున్న నేపథ్యంలో దేశంలో అస్థిరతను సృష్టించే వారిని సర్కార్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. ఢాకా శివారులోని గాజీపుర్‌లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ను ప్రారంభించినట్టు ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ ఆలమ్ చౌద్రీ చెప్పుకొచ్చారు.ప్రజా భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆపరేషన్ డెవిల్ హంట్’లో ఇప్పటికే 1300 అరెస్ట్ చేశారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జహంగీర్ ఆలమ్ మాట్లాడుతూ..‘బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన దాడులు మరింత పెరిగాయి. వారి ఏరివేతే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుష్టశక్తులను అంతం చేసే వరకు ఇది ఆగదు అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల హేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని.. మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని మహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్‌లే కారణమని సమాచారం. -
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దూరం పెరిగిందా?బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి. ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024 ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ‘షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్ హుస్సేన్ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. మహ్మద్ యూనిస్ హెచ్చరికలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనిస్.. మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. -
షేక్ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. మరో షాకిచ్చిన బంగ్లా సర్కార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం హసీనా టార్గెట్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హాసీనా హయాంలో జరిగిన కొన్ని ఘటనలపై విచారణ జరుపుతోంది. వీటిపై ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.బంగ్లాదేశ్‌లో పలువురు అధికారుల అదృశ్యం, కొన్ని హత్యలపై బంగ్లా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ ‘అన్‌ఫోల్డింగ్ ది ట్రూత్’ అనే నివేదికను యూనస్‌కు అందజేసింది. ఈ కమిషన్ శనివారం మొదటి నివేదికను అందజేసింది. ఇందులో భాగంగా హసీనా హయాంలో మిస్సింగ్ కేసులపై 1,676 ఫిర్యాదులు రాగా.. 3500 మంది అదృశ్యమైనట్టు నివేదికలో పేర్కొంది. వీరిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. అక్రమ అరెస్ట్ చేసిన కొందరు కనిపించడంలేదని, హత్యకు గురైనట్టు కూడా తెలిపింది. ఇదే సమయంలో రహస్య నిర్బంధ కేంద్రాల గురించి కూడా వెల్లడించింది. వీటన్నింటిలో హసీనా సహా పలువురు డిఫెన్స్ అధికారులే కారణమని బాంబు పేల్చింది.ఇక, ఈ అంశాలపై కమిషన్ పూర్తి విచారణ ప్రక్రియకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని సభ్యులు తెలిపారు. తుది నివేదికను మార్చిలో అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని యూనస్ మాట్లాడుతూ.. కమిషన్ మొదటి మధ్యంతర నివేదికకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో భాగంగా కమిషన్ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, విచారణలో భాగంగా తాను రహస్య నిర్భంద కేంద్రాలను, జాయింట్ ఇంటరాగేషన్ సెల్స్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో పౌరుల తిరుగుబాటు కారణంగా షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు రకాల కేసులను పెడుతోంది. -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
హసీనా మౌనంగా ఉంటే మంచిది
ఢాకా: బంగ్లాదేశ్‌ను వీడిన మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉన్నంతకాలం మౌనంగా ఉంటే మంచిదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ హెచ్చరించారు. హసీనా బంగ్లాదేశ్‌ను వీడాక చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారికి న్యాయం జరగాలని ఆగస్ట్ 13వ తేదీన హసీనా డిమాండ్ చేయడంపై యూనుస్ ఘాటుగా స్పందించారు. గురువారం ఢాకాలోని తన అధికార నివాసంలో పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడా రు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..అప్పగింత కోరేదాకా మౌనంగా ఉండాల్సిందే‘‘హసీనాను అప్పగించాలని మేం భారత్‌ను మేం కోరేదాకా ఆమె అక్కడ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. మౌనమే మేలు. ఇక భారత్ సైతం ఒక విషయం గుర్తుంచుకోవాలి. హసీనా లేకపోయి ఉంటే మా దేశం అఫ్గానిస్తాన్‌లా తయారవుతుందన్న అభిప్రాయాలు మార్చుకోవాలి. హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ తప్ప బంగ్లాదేశ్‌లోని ప్రతి రాజకీయ పార్టీ ఇస్లామిక్ పార్టీ అనే భావననూ భారత్ విడనాడాలి. భారత్‌లో ఉంటూ ఆమె చేస్తున్న బంగ్లా వ్యతి రేక వ్యాఖ్యలపై ఇక్కడ ఎవరూ సంతోషంగా లేరు. ఆమెను వెనక్కి తీసుకురా వాలని యోచిస్తున్నాం. భారత్‌లో ఉంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి’’ అని అన్నారు.మేం కూడా ఆమెను మర్చిపోతాం‘‘ఆమె ఇండియాలో మౌనంగా కూ ర్చుంటేనే మేం కూడా ఆమెను మర్చి పోతాం. బంగ్లాదేశ్ ప్రజలూ ఆమెను మర్చిపోతారు. ఆమె తన లోకంలో తాను ఉంటే అందరికీ మంచిది. అలా కాకుండా భారత్‌తో కూర్చుని మాకు ఎలా పరిపాలించాలో ఉచిత సలహాలిస్తే ఎవ్వరికీ నచ్చదు. ఈ ధోరణి మాకేకాదు భారత్‌కు కూడా మంచిది కాదు. ఇరు దేశాల సంబంధాలపైనా ప్రతి కూల ప్రభావం చూపుతుంది. ఆమె సాధారణ పర్యటనకు ఇండియా వెళ్లలేదు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమా నికి జడిసి హసీనా దేశం నుంచి పారిపో యారు. దేశంలో దురా గతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు మా సర్కార్ కట్టుబ డి ఉంది. ఆమె చెబుతు న్నట్లు ప్రజలకు న్యాయం జరగా లంటే వాస్తవానికి ఆమెనే స్వదేశా నికి తీసుకురావాలి. అలా జరగకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలపై అందరి సమక్షంలో విచారణ జరగాల్సిందే’’ అని అన్నారు.భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఇస్లామిక్‌గా మారిపోయిందని, దేశాన్ని అఫ్గానిస్తాన్‌లా మార్చేస్తారని భారత్ భావిస్తోంది. కానీ మేం పొరుగుదేశం ఇండియాతో మైత్రి బంధాన్నే కోరుకుంటున్నాం. హసీనా నాయకత్వంలో మాత్రమే బంగ్లాదేశ్‌లో సుస్థిరత సాధ్యమని భారత్ భావించడం మానుకోవాలి. హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయనేది అవాస్తవం. భారత్‌తో బలహీనంగా ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయమొచ్చింది. రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందం వంటి వాటిని పట్టాలెక్కించాలి. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరుపుతా. తదుపరి ఎన్నికల్లో బీఎన్పీ గెలిచి అధికారంలోకి వస్తే దేశంలో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తా’’ అని అన్నారు. -
బంగ్లాలో దాడులు మతపరమైనవి కావు: మహమ్మద్ యూనస్
ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్‌తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు. -
ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో.. ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు తీవ్ర నిరాశ..
-
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాట్లు.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
తీవ్ర నిరసనలు, అట్టుడికిన అల్లర్లలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్నపళంగా దేశం వీడాల్సి వచ్చింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాలో ప్రస్తుతం దేశ పాలన సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. నిరసన కారులను శాంతిపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు దేశ ఆర్మీ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ సలహాలతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆలస్యంగా తన సమ్మతిని తెలిపారు.తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హసీనా రాజకీయ విరోధి, మాజీ ప్రధాని ఖలీదా జియా. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం. ఖలీదా జియా.. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు రాష్ట్రపతి ఆదేశించారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈమేరకు దేశాధ్యక్షుడి నుంచి ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది.ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. అలాగే దేశ తొలి మహిళా ప్రధాని. 1991 నుంచి 1996, 2001 నుంచి 2006 వరకు రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశారు. ఖలీదా 1996లో రెండవసారి పీఎంగా గెలిచినప్పటికీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించి ఖండించాయి. దీంతో ఆమె రెండవ పదవీకాలం 12 రోజులు మాత్రమే కొనసాగింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికలు నిర్వహించగా.. హసీనా ప్రధానిగా గెలుపొందారు.2007లో ఖలీదా అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. 2018లో దోషిగా నిర్ధారించడంతో జైలు శిక్ష పడింది. అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ కాలం ఆమె ఆసుపత్రిలోనే గడిపారు. మరి ఈ సమయంలో విడుదలవుతున్న ఖలీదా ప్రధానమంత్రి పదవిని చేపడతారా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. మహమ్మద్ యూనస్.. అతను 1983లో గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించాడు. బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంక్ చిన్న మొత్తంలో రుణాలను (రూ 2,000 వరకు) అందిస్తుంది. ఇది లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడుతోంది. అందుకే యూనస్‌కు ి 'పేదలకు బ్యాంకర్' అనే మారుపేరు వచ్చింది. ఈ మోడల్ ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలలో కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థ అయిన గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే యూనస్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. జూన్‌లో తన టెలికాం కంపెనీ అయినా గ్రామీణ టెలికాం సంబంధించిన కార్మికుల సంక్షేమ నిధి నుంచి 252.2 మిలియన్ టాకా (రూ. 219.4 కోట్లు) నిధుల దుర్వినియోగం చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. కానీ తనపై అభియోగాలు రాజకీయ ప్రోద్బలంతో మోపారని ఆరోపించారు.జనవరిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక షేక్ హసీనా రాజీనామా తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు షేక్ హసీనా ప్రత్యర్థులు పెనుగులాడుతుండగా.. విద్యార్థులు మాత్రం యూనస్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు విద్యార్ధులు అంగీకరించడం లేదు.నహీద్ ఇస్లాం..26 ఏళ్ల నహీద్ ఇస్లాం సోషియాలజీ విద్యార్థి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు. ఈ కోటా విధానంలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్ధుల ఉద్యమానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు. చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతకు దారి తీసిన నేత ఇస్లాం.జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్, హా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వ్యక్తులుగా చెప్పుకునే కొందరు అతన్ని అపహరించారు. కానీ నహిద్‌ను తాము ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
డిపాజిట్ల స్వీకరణకు ఎంఎఫ్‌ఐలను అనుమతించాలి
కోల్‌కతా: భారత్‌లో సూక్ష్మ రుణ సంస్థలను (ఎంఎఫ్ఐలు) ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణకు అనుమతించాలని నోబెల్ పురస్కార గ్రహీత, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మహమ్మద్ యూనస్ అన్నారు. ప్యాన్‌ఐఐటీ గ్లోబల్ ఈ కాంక్లేవ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. భారత్‌లో ఎంఎఫ్ఐలు నిధుల కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆర్బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకులను అనుమతించిందంటూ, అవి డిపాజిట్లను స్వీకరించే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ప్రజలకు రుణం అన్నది ఆరి్థకపరమైన ఆక్సిజన్. బ్యాంకులకు ప్రత్యా మ్నాయ బ్యాంకింగ్ చానల్ (నిధుల కోసం) ఏర్పా టు చేయకుంటే, పేదలకు రుణాలు ఇచ్చేందుకు అవి ఆసక్తి చూపవు’’ అని యూనస్ పేర్కొన్నారు. -
విభిన్న విధానాల వల్లే విజయం
► బంగ్లాదేశ్ గ్రామీణ్ బ్యాంక్ విజయంపై నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ ►పేదలకు రుణాలివ్వాలని అందర్నీ కోరి భంగపడ్డా ►అందుకే పేదలే యజమానులుగా గ్రామీణ్ బ్యాంక్ పెట్టాను తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థల నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పనిచేయడమే బంగ్లాదేశ్‌లో గ్రామీణ్ బ్యాంక్ విజయానికి ప్రధాన కారణమని నోబెల్ అవార్డు గ్రహీత మమహ్మద్ యూనస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ.. గ్రామీణ్ బ్యాంక్ మొదలుకాక ముందు పేదలకు రుణాలివ్వాల్సిందిగా ప్రతి బ్యాంక్‌ను కోరి భంగపడ్డానని చెప్పారు. దీంతో 1983లో పేదల కోసం.. వారే యజమానులుగా బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ్ బ్యాంక్ బంగ్లాదేశ్‌లోని ప్రతి గ్రామం, పట్టణంలో శాఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు. 200 కోట్ల డాలర్లకుపైగా నిధులు రుణాలుగా ఇస్తే పేద మహిళల నుంచి అంతకుమించిన డిపాజిట్లు చిన్నచిన్న మొత్తాల రూపంలో జమ అయ్యాయని ఆయన వివరించారు. గ్రామీణ్ బ్యాంక్ ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండానే పేదలకు రుణాలిస్తున్నామని, 40 ఏళ్లుగా రుణ వసూళ్లు దాదాపు వంద శాతం ఉండటం గమనార్హమని యూనస్ అన్నారు. ఇంతటితో ఆగకుండా పిల్లలను పాఠశాలకు పంపించేలా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించామని, తద్వారా వారు ఉన్నత విద్యను అభ్యసించి ప్రయోజకులుగా మారారని వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లో.. ► కొన్నేళ్ల క్రితం అనేక మంది యువతీ యువకులు నా వద్దకు వచ్చి పెద్ద చదువులు చదివినా తమకు ఉద్యోగాలు రావడం లేదని ఫిర్యాదు చేసేవారు. గ్రామీణ్ బ్యాంక్ యజమానులైన మీ తల్లుల నుంచి పాఠాలు నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని వారికి సూచించాను. ఈ రకంగా పుట్టుకొచ్చిందే సోషల్ బిజినెస్. ఈ విధంగా గ్రామీణ్ బ్యాంక్ ఓ వెంచర్ క్యాపటలిస్ట్గానూ మారింది. ఆసక్తికరమైన ఆలోచనలు, వ్యాపార నమూనాతో ముందుకొచ్చే యువకులకు ఎలాంటి హామీలు లేకుండా నిధులు అందజేశాం. వారి వ్యాపారాలు విజయవంతమయ్యేందుకు దగ్గరుండి మా వంతు సహకారం అందించాం. వారు వ్యాపారంలో నిలదొక్కుకున్న తరువాత మా పెట్టుబడి మాకు తిరిగివచ్చాయి. దాతృత్వం ద్వారా ఇది సాధ్యం కాదు. ► సోషల్ బిజినెస్‌కు ఇంకో ఉదాహరణ గ్రామీణ్ బ్యాంక్ అంతర్జాతీయ డెయిరీ కంపెనీ డానోన్ తో కలిసి స్థాపించిన సంస్థ. బంగ్లాదేశ్ పిల్లల్లోని పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఈ సంస్థ ప్రత్యేకమైన పెరుగును తయారు చేస్తోంది. పోషకాలన్నీ ఉండే ఈ పెరుగు రకరకాల రుచుల్లో లభిస్తోంది. డానోన్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇది తక్కువ ధరకే లభిస్తుండటంతో అటు పోషికాహార లోపమనే సామాజిక సమస్యకూ పరిష్కారాన్ని చూపగలిగాం ► 2050 నాటికల్లా 3 అంశాలను జీరోకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. పేదరికం, నిరుద్యోగం, కర్బన ఉద్గారాల కట్టడి.. ఈ మూడు అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. కాదేదీ వ్యాపారానికి అనర్హం ఫ్రాన్స్ లో మెకెయిన్ అని ఓ కంపెనీ ఉంది. బంగాళాదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం దీని వ్యాపారం. ఈ సంస్థ కూడా ఇటీవల సోషల్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.ఫ్రాన్స్ లో పండించే ఆకారం బాగా లేదని పెద్ద కంపెనీలు పక్కన పడేసే ఆలుగడ్డలను సేకరించి వాటితో సూప్‌లు చేసి తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ ఇంకో అడుగు ముందుకేసి బంగాళాదుంపలతో పాటు అన్ని రకాల కాయగూరలతోనూ ఇదే తరహా వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రామాయంపేట, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం దామరచెర్వు గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది. స్థానిక ఏఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహ్మద్ యూనస్(43) సోమవారం తన కూతురిని అత్తగారింట్లో దింపేందుకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి వెళ్లాడు. తిరిగి సరూర్‌నగర్ వెళ్తున్న క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట బైపాస్‌లో బస్సు దిగి, పట్టణ శివారులోని దామరచెర్వు 44వ జాతీయ రహదారిపై నడుచుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యూనస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఎస్ఐలు మురళి, బాలక్రిష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మురళి తెలిపారు.