
మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం
స్థానిక మీడియాలో వరుసగా కథనాలు
అలాంటిదేమీ లేదని ఖండించిన బంగ్లా సైన్యం
ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతోపాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు మీడియా స్పష్టంచేసింది.
యూనస్‌ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలో సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించి, ఆ తర్వాత మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది.
అత్యవసర భేటీ జరగలేదన్న సైన్యం
సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని బంగ్లాదేశ్ సైన్యం తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్ యూనస్‌పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది.