
బంగ్లాదేశ్(Bangladesh)లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంలో అశాంతి, హింసాయుత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాజధాని ఢాకాలో సైనికులను మోహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని వారాలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఆర్మీ ఇటువంటి ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తిరిగి అల్లర్లు జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే ఇటువంటి ఆదేశాలు జారీ అయ్యాయని కూడా చెబుతున్నారు.
నార్త్-ఈస్ట్ న్యూస్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ సైన్యం ఇప్పటికే ఢాకా(Dhaka) చేరుకుంది. భారీ సంఖ్యలో సాయుధ వాహనాలు, 100 మంది సైనికులను తొలుత ఢాకాలో మోహరించినట్లు సమాచారం. 9వ డివిజన్ సైనికులు కూడా ఢాకాకు చేరుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకుని సైన్యం ఇటువంటి చర్యలు చేపట్టిందని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామీణాభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమూద్ షాజిబ్ భూయాన్‌కు చెందిన పాత వీడియో ఒకటి బయటపడింది. అందులో అతను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సమక్షంలో బంగ్లాదేశ్ పగ్గాలను ముహమ్మద్ యూనస్(Muhammad Yunus)కు అప్పగించడానికి అయిష్టంగానే అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా విద్యార్థి నేత హస్నత్ అబ్దుల్లా మార్చి 11న జనరల్ జమాన్‌తో రహస్య భేటీ తర్వాత సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆర్మీ చీఫ్ అనడం హస్నత్ అబ్దుల్లాకు నచ్చలేదని అంటున్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలకు, ఆర్మీ చీఫ్‌కు మధ్య సయోధ్య లేనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నియంత్రించాలని ఆర్మీ చీఫ్ యూనస్ నిరంతరం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో ఆర్మీ చీఫ్ మరోసారి షేక్ హసీనా అవామీ లీగ్‌కు మార్గం సుగమం చేస్తున్నారని విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో రాబోయే ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు ఆర్మీ చీఫ్ సన్నాహాలను ప్రారంభించారని సమాచారం.
ఇది కూడా చదవండి: Janta Curfew: జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు.. 68 రోజుల లాక్‌డౌన్ మొదలైందిలా..
Comments
Please login to add a commentAdd a comment