sheik haseena
-
షేక్ హసీనాను భారత్ అప్పగిస్తుందా?లేదా?: బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేసిన షేక్ హసీనా.. దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి లండన్ వెళ్లి అక్కడే ఆశ్రయం పొందాలని భావించిన ఆమెకు.. అక్కడి నుంచి అనుమతి రాకపోవడంతో.. ఇక్కడే చిక్కుకుపోయారు.ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. భారత ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా మరోసారి షేక్ హసీనా అప్పగింతపై స్పందించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. హసీనాను స్వదేశానికి తిరిగి రప్పించడానికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు.హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా ఆయన ప్రశ్నించారు. ఆమెను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని పేర్కొన్నారు.తమ న్యాయ వ్యవస్థ కోరుకుంటే ఖచ్చితంగా ఆమెను తిరిగి బంగ్లాకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ మేరకు భారత్‌తో తమకు వివిధ ఒప్పందం, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయని, దీనిపై ఊహాగానాలు చేయకపోవడమే మంచిదని అన్నారు.అయితే హసీనా అసలు భారత్‌లో ఎక్కడ ఉన్నారనే విషయం తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అనే మీడియా ప్రశ్నించగా.. తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి భారత్‌ను అడగండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హసీనాతోపాటు ఆమె బంధువుల దౌత్య పాస్‌పోర్ట్‌లను బంగ్లాదేశ్ రద్దు చేసింది. ఈ క్రమంలో షేక్ హసీనా ఇకపై భారత్‌లో ఉండగలదా? లేక ఆమెను బంగ్లాకు అప్పగించనుందా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆగష్టు 5న ఆమె దేశం వదిలి పారిపోయి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. -
హసీనాపై కఠిన వైఖరి వద్దు: అమెరికాను కోరిన భారత్ !
వాషింగ్టన్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దించడం వెనుక అమెరికా కుట్ర ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికా మీడియా కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి. హసీనాను ఒత్తిడికి గురిచేయొద్దని గతంలో భారత్ అధికారులు అమెరికాను కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక ఓ కథనం ప్రచురించింది. బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్ అతివాద శక్తుల కేంద్రంగా మారుతుందని, ఇది భారత్ జాతీయ భద్రతకు సవాళ్లను విసురుతుందని అమెరికాకు భారత్ తెలిపినట్లు కథనంలో రాసుకొచ్చారు. హసీనాపై కఠిన వైఖరి వద్దని అమెరికాను భారత విదేశాంగవర్గాలు కోరినట్లు కథనం సారాంశం. 2024 ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో పలువురిని జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు విమర్శించారు. అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు పోలీసులపై అప్పట్లో ఆంక్షలు విధించింది. ఈ విభాగం నేరుగా హసీనా కింద పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. దేశంలో హింస చెలరేగడంతో షేక్‌హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా దేశం విడిచిన బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం. -
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ డౌటే.. పీసీబీ ఆఫర్‌కు నో రిప్లై!
బంగ్లాదేశ్- పాకిస్తాన్ టెస్టు సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది. బంగ్లాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టు పాకిస్తాన్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రధాని షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనకారుల ఆందోళనలు సోమవారం మిన్నంటాయి. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు.ఈ క్రమంలో వారి డిమాండ్లకు తలొగ్గిన హసీనా.. తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21 నుంచి బంగ్లా- పాక్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ నుంచి విమాన ప్రయాణం అంత సురక్షితం కాదన్న వార్తల నేపథ్యంలో.. ఆటగాళ్లు పాక్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్ క్రికెటర్లను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో పాటు.. అదనంగా మరికొన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పీసీబీ బంగ్లా బోర్డుకు చెప్పింది.రావల్పిండిలో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఆఫర్ చేసింది. కానీ ఇంత వరకు అటువైపు నుంచి స్పందన రాలేదు. బంగ్లా బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఉందని తెలిసింది. బోర్డు కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాయి. 2019-2020లో బంగ్లాదేశ్ జట్టు చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది.కాగా షేక్ హసీనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారిపై కూడా నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొర్తజా ఇంటికి ధ్వంసం చేసి.. నిప్పు అంటించారు. ఈ మాజీ పేసర్ కెరీర్ ఎదుగుదలలో హసీనా పాత్ర కూడా ఉందని సమాచారం.అదే విధంగా.. అధికార అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా రెండుసార్లు(2019, 2024) గెలిచాడు కూడా! ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబరులో జరగాల్సిన మహిళా టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. -
షేక్ హసీనా.. నియంతగా మారిన ప్రజాస్వామ్య ప్రతీక!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్యస్థాపన కోసం సైనికపాలకులతో పోరాడిన నాయకురాలు.. నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటం నడిపిన షేక్ముజిబుర్ రెహ్మాన్ వారసత్వంతో దేశ రాజకీయాల్లోకి వచ్చిన హసీనా 1975లో దేశం మిలిటరీ పాలనలోకి వెళ్లిన తర్వాత యూరప్‌తో పాటు భారత్‌లో ఆశ్రయం పొందారు. 1981లో ఇండియా నుంచే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి ప్రత్యర్థి ఖలీదా జియాతో కలిసి దేశంలో ప్రజాస్వామ్య పోరాటం నడిపారు. తర్వాతి పరిణామాల్లో తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఐదుసార్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై దేశంలో చెలరేగిన ఆందోళనలు, హింసకు తలొగ్గి దేశం విడిచి తిరిగి భారత్‌కే వచ్చారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం.పోరాటం నుంచి తిరుగులేని అధికారం వైపు.. మిలిటరీ పాలనపై పోరాడేందుకు హసీనా 1981లో ప్రవాసం వీడి బంగ్లాదేశ్‌కు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)చీఫ్ ఖలీదా జియాతో చేతులు కలపి దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడారు. 1990లో ఈ పోరాటంలో విజయం సాధించి సైనిక నియంత హుస్సేన్ మహమ్మద్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్, బీఎన్పీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీపై విజయం సాధించి షేక్‌హసీనా తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. కానీ ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ చేతిలో హసీనా తిరిగి ఓటమి చవిచూశారు. సైనిక తిరుగుబాటు తదనంతర పరిణామాల తర్వాత మళ్లీ 2007లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారంలోనే ఉండి బంగ్లాదేశ్‌కు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.ప్రతిపక్షమే లేకుండా అణిచివేశారు..2007లో రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత హసీనా అసలు స్వరూపం బయటపడింది. నియంతృత్వ విధానాలు అమలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు, ప్రజాసంఘాల నేతల మూకుమ్మడి అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్కోసారి కొందరు నేతలు ఉన్నట్టుండి అదృశ్యమయ్యేవారు. వారి మిస్సింగ్ మిస్టరీగానే మిగిలింది. ఇంతే కాకుండా హసీనా పాలనలో ఫేక్ ఎన్కౌంటర్లు సర్వసాధారణమైపోయాయి. ఆమె హయాంలో ఐదుగురు ముస్లిం అగ్రనేతలను యుద్ధనేరాల్లో ఉరితీశారు. హసీనా నాయకత్వంలో దేశంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్షం వాటిని బహిష్కరించి పోటీకి దూరంగా ఉందంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యం ముసుగులో నియంతగా ఎలా మారారన్నదానికి హసీనా రాజకీయ జీవితం ఒక ఉదాహరణ అని ఢాకా యూనివర్సిటీ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ నజ్రుల్ అన్నారు.15 ఏళ్ల హసీనా పాలనలో పాజిటివ్ కోణం.. షేక్ హసీనా వరుస 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందిందని చెబుతారు. వస్త్ర తయారీ రంగంలో మహిళలకు అత్యధికంగా ఉద్యోగాలు కల్పించడం వల్లే ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధ్యమైందన్న వాదన ఉంది. హసీనా పాలనలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారత్ కంటే ముందుకు వెళ్లింది. హసీనా పాలనలో దేశంలో పేదిరికం తగ్గడంతో పాటు దేశంలోని 17 కోట్ల మంది ప్రజల్లో 95 శాతంమందికి కరెంటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దేశం ఎందుకు వీడాల్సి వచ్చింది..ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. తొలుత ప్రభుత్వం తీసుకున్న ఈ కోటా నిర్ణయాన్ని తర్వాత ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన ఈ హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో హసీనా ప్రభుత్వం దిగివచ్చి కోటా విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆందోళనలు ఆగలేదు. హసీనా గద్దె దిగాల్సిందేనని, ఆమె ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు తీవ్రమయ్యాయి. చివరకు ప్రధాని అధికార నివాసాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సోదరితో కలిసి హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. -
బంగ్లాదేశ్‌లో సైనిక పాలన.. దేశం విడిచిన షేక్ హసీనా
ఢాకా: అవామీ లీగ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా(76) బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజర్వేషన్ల ఆందోళనలు తీవ్ర స్థాయిలో చేరడం.. సైన్యం హెచ్చరికల నేపథ్యంలో ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. అన్ని పార్టీలతో చర్చించాకే సైనిక పాలన ప్రకటన చేస్తున్నామని, దేశంలో శాంతి భద్రతలను ఇక ఆర్మీ పర్యవేక్షిస్తుందని, ప్రజలు సంయమనం పాటించాలని, త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ప్రకటించారు. ‘‘మేం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నిరసనల వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ హింసను ఆపాల్సిన సమయం ఇది. నా ప్రసంగం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. పరిస్థితుల్లో మార్పు వస్తే.. ఎమర్జెన్సీ అవసరం ఉండదు’’ ::: ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇప్పటిదాకా వందల మంది మరణించారు. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం ఒక్కరోజే వంద మంది దాకా మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా ప్రకటనను జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ద్వారా చేయాలని హసీనా భావించారు. అయితే.. సైన్యం ఆమెకు అంత సమయం ఇవ్వలేదు. ఈ ఉదయం ఢాకాలోని ప్రధాని భవనం ‘గణభబన్’కు చేరుకున్న ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్.. రాజీనామా విషయంలో హసీనాకు 45 నిమిషాల డెడ్‌లైన్ విధించారని, సైన్యం సూచనల మేరకే ఆమె హెలికాఫ్టర్‌లో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారని తెలుస్తోంది. మరోవైపు.. హసీనా ఢాకా విడిచిపెట్టారనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు. ఆ దేశ మాజీ ప్రధాని, హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సైన్యం ధ్వంసం చేశారు. అయితే కాసేపటికే సైన్యం రంగప్రవేశం చేయడంతో వాళ్లంతా వెనక్కి తగ్గారు. ఆ తర్వాత సైన్యం పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించింది. బంగ్లావ్యాప్తంగా సంబురాలుమరోవైపు.. హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. اِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِیْنًاۙA HISTORIC WIN. #Bangladesh pic.twitter.com/mVW0qV9GON— Ahmed Rashid (@ThisahmedR) August 5, 2024 I salute students of #Bangladesh pic.twitter.com/ModiqyZCa6— Shehr Bano Official (@OfficialShehr) August 4, 2024 ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా నిరసనల్లో వందల మంది(300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించినట్లు తెలుస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా, ఆమె సోదరితో కలిసి హెలికాఫ్టర్‌లో వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె అగర్తలకు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. అక్కడి నుంచి ఆమె విదేశాలకు వెళ్లొచ్చని తెలుస్తోంది.#BREAKING Sheikh Hasina resigns as Prime Minister of #Bangladesh She has left Dhaka in a military helicopter after thousands broke into her residence in Dhaka. Reports claim Hasina is headed to Bengal, India! Hasina is likely to tender her official resignation amid the… pic.twitter.com/T3pA9UCpT5— Nabila Jamal (@nabilajamal_) August 5, 2024 మరోవైపు.. తాజా పరిణామాలపై హసీనా తనయుడు స్పందించారు. బలవంతంగా అధికారాన్ని లాక్కోవడం మంచిది కాదంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారాయన. భారత్ సరిహద్దులో అప్రమత్తంబంగ్లాదేశ్ పరిస్థితులపై భారత్ అలర్ట్ అయ్యింది. చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నందునా.. సరిహద్దులో నిఘా పెంచాలని సైన్యం నిర్ణయించింది. అంతకు ముందు.. భారత విదేశాంగశాఖ బంగ్లాలో ఉన్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. అయితే.. ఇప్పటికే చాలామంది భారతీయులు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే మహిళా నేతగా.. గత పదిహేనేళ్లుగా బంగ్లా ప్రధాని పదవిలో షేక్ హసీనా కొనసాగుతున్నారు. 1996 జూన్‌లో తొలిసారి ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009 నుంచి రాజీనామా దాకా ఆమె ప్రధానిగా కొనసాగారు. మొత్తంగా 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె.. సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన బంగ్లాదేశ్ నేతగానే కాకుండా ప్రపంచంలోనూ తొలి మహిళా నేతగా ఘనత సాధించారు.ఎందుకీ ఆందోళనలు? 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచి్చంది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే.. 2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచ్చింది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు. రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లే కనిపించినప్పటికీ.. గత రెండ్రోజులుగా కొనసాగిన అల్లర్లు.. హింసాత్మక ధోరణిలో కొనసాగాయి. -
‘మా అతిపెద్ద సమస్య అదే.. భారత్ పరిష్కరించగలదు’
ఢాకా: రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి అతిపెద్ద సమస్యగా మారారని పేర్కొన్నారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు అంతర్జాతీయ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది శరణార్థులు దేశంలో ఉండటం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించటంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు చెప్పారు హసీనా. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘రోహింగ్యాల సమస్య అతిపెద్ద భారమని మాకు తెలుసు. భారత్ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నాం. వారిని తిరిగి పంపించేందుకు వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మానవీయ కోణంలోనే వారికి ఆశ్రయం కల్పించాం. కొవిడ్ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్లుంటారు. అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మత్తు పదార్థాలు, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్, యూఎన్వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను’ అని షేక్ హసీనా పేర్కొన్నారు. తీస్తా నది జలాల పంపకాల అంశలో భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సమన్వయంపై ప్రశ్నించగా.. తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భారత ప్రధాని కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తమ విద్యార్థులు పలువురిని భారత్ స్వస్థలాలకు చేర్చిందన్నారు. కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ మైత్రి రూపంలో సహాయపడిందని గుర్తు చేసుకొన్నారు. హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు. ఇదీ చదవండి: ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’..బంపరాఫర్ ఇచ్చిన ప్రభుత్వం! -
బంగ్లాదేశ్ నుంచి మోదీ, దీదీలకు 2,600 కేజీల మామిడి పళ్లు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేమంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు మామాడి పళ్లు పంపించారు. హరిభంగా రకానికి చెందిన సుమారు 2,600 కిలోగ్రాముల మామిడి పండ్లను పంపించారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేబ్‌కు కూడా ఈ మామిడి పళ్లలో వాటా ఉంది. మామిడిపండ్లు సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు చేరుకోగా.. ఆ తర్వాత వాటిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపించారు. మామిడిపండ్లు ఆదివారం బెనపోల్ పెట్రోపోల్ ల్యాండ్ బార్డర్ ద్వారా కోల్‌కతాకు చేరుకోగా.. ఆ తరువాత రైలు ద్వారా ఢిల్లీకి రవాణా చేయబడ్డాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ, "మాకు చాలా తీపి, రుచికరమైన మామిడి పండ్లు ఉన్నాయి. మేము వాటిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాము. మేము మా ఆనందాన్ని మా మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాము. చారిత్రాత్మకమైన ముజిబ్ బోర్షోతో పాటు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాల సందర్భంగా రుచికరమైన మామిడి పండ్లను మా పొరుగువారు, స్నేహితులకు ఇచ్చి.. మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాము’’ అని తెలిపారు. హరిభంగా మామిడి పళ్లను బంగ్లా వాయువ్య భాగంలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా రంగపూర్ జిల్లా వీటి సాగుకు ప్రధాన కేంద్రంగా ఉంది. గతంలో, పీఎం హసీనా ‘హిల్సా’ చేపలను పంపిన సంగతి తెలిసిందే. భారతదేశం-బంగ్లాదేశ్ మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీ ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాలతో పాటు బంగ్లా జాతిపిత బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రవాణా, వాణిజ్యాన్ని పెంచడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి. భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్ భూటాన్‌కు మామిడి పండ్లను పంపింది. అలానే నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాధ్యక్షులు, ప్రధానులకు సరుకులను పంపుతుంది. -
భారత్–బంగ్లా బంధాన్ని విడగొట్టలేరు
ఢాకా: 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో (ముక్తి జుద్దో) బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంతోపాటు భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి బయటపడ్డాక మోదీ మరో దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఢాకాలోని నేషనల్ పరేడ్ స్క్వేర్‌లో దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు బంగబంధు శత జయంతి వేడుకల్లో అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాతోపాటు మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత సైన్యం పోషించిన పాత్రను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. బంగ్లాదేశ్ అమర వీరుల రక్తం, భారత సైనికుల రక్తం కలిసి పారుతున్నాయని చెప్పారు. ఈ రక్తం రెండు దేశాల నడుమ గొప్ప అనుబంధాన్ని ఏర్పర్చిందని, దాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడగొట్టలేరని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి వెనుక అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కృషి మరువలేనిదన్నారు. రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకం బంగబంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ సామాన్య ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చారని, ముక్తి వాహినిగా మారారని మోదీ అన్నారు. 1970వ దశకంలో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలపై పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అకృత్యాలకు సంబంధించిన చిత్రాలు భారతీయులను కలచి వేసేవని గుర్తుచేశారు. అప్పట్లో తన వయసు 20–22 అని, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతుగా మిత్రులతో కలిసి సత్యాగ్రహం చేశానని వివరించారు. రాబోయే 25 సంవత్సరాలు భారత్, బంగ్లాదేశ్‌కు అత్యంత కీలకమని చెప్పారు. మన వారసత్వాన్నే కాదు అభివృద్ధిని, లక్ష్యాలను, అవకాశాలను కూడా పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో భారత్, బంగ్లాదేశ్‌కు ఒకే తరహా అవకాశాలు ఉన్నట్లే, ఉగ్రవాదం లాంటి ఉపద్రవాలు కూడా పొంచి ఉన్నాయని మోదీ హెచ్చరించారు. వాటిని ఎదిరించడానికి ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ఇండో–బంగ్లా సంబంధాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా 50 మంది బంగ్లాదేశీ పారిశ్రామికవేత్తలను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు. అంతకుముందు భారత్ నుంచి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ‘పొరుగు ప్రథమం’ భేష్ దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి చొరవ తీసుకోవాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రసంగించారు. భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘పొరుగు ప్రథమం’ విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు. బంగ్లాదేశ్‌తోపాటు ఇరుగు పొరుగు దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం సరఫరా చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. ఢాకా–న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరాయని తెలిపారు. బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని ఆయన కుమార్తెలు షేక్ రెహానా, షేక్ హసీనాకు ప్రధాని మోదీ అందజేశారు. ఈ వేడుకల్లో ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళిగా ఖాదీ బట్టతో తయారైన నల్లరంగు ముజీబ్ జాకెట్‌ను మోదీ ధరించారు. ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఢాకాలో అధికార మహాకూటమి నేతలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఆందోళనల్లో నలుగురి మృతి మోదీ రాకను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాలు పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఆందోళన చేపట్టాయి. పొలీసులతో ఘర్షణకు దిగాయి. చిట్టగాంగ్‌లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురు మరణించినట్లు తెలిసింది. అలాగే మరో 12 మంది గాయపడ్డారు. ఢాకాలో జరిగిన ఘర్షణలో 50 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. -
నా టీనేజ్‌లో బంగ్లాదేశ్ కోసం కొట్లాడాను
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటున్నారు. ఈక్రమంలో తాను మొట్టమొదటిసారి పోరాటం చేసింది బంగ్లాదేశం కోసమేనని.. అది కూడా టీనేజ్‌లో ఉన్నప్పుడు అని మోదీ గుర్తు చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలిన అనంతరం తొలిసారి మోదీ విదేశీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ నెమరువేసుకున్నారు. బంగ్లా పర్యటనలో శుక్రవారం ప్రధాని బిజీబిజీగా గడిపారు. బంగ్లాదేశ్ 50 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢాకాలోని జాతీయ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ప్రయాణం ప్రారంభమయ్యిందే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం. నా మిత్రులతో కలిసి నేను 20 ఏళ్ల వయసులో భారత్‌లో సత్యాగ్రహ దీక్ష చేశా. ఆ పోరాటం సందర్భంగా నేను జైలుకు కూడా వెళ్లా’ అని మోదీ తన రాజకీయ జీవిత అరంగేట్రాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప దేశం ఆవిర్భవించడానికి ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరువలేనివని మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సైనికుల గొప్పదనం.. మమకారం సరిహద్దులో ఉండే భారతీయులు ఎప్పుడు మరువలేరని తెలిపారు. ‘ఇవి నా జీవితంలో మరచిపోలేని రోజులని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని నరేంద్ర మోదీ చెప్పారు. అంతకుముందు బంగ్లాదేశ్‌లోని భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో ముచ్చటించి వారితో ఫొటోలు దిగారు. రేపు కూడా బంగ్లా పర్యటనలో మోదీ బిజీబిజీగా ఉండనున్నారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
భారత్ మాకు నిజమైన మిత్రదేశం...
న్యూఢిల్లీ: భారత్ తమకు నిజమైన మిత్ర దేశమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తమకు అండగా నిలిచిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్‌కు భారత్ పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1971లో ఇండో- పాక్ యుద్ధం మొదలైంది. ఇందులో భారత్ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ స్వతంత్ర్య దేశంగా అవతరించింది. ఈ చారిత్రాత్మక ఘటన జరిగి బుధవారానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనా గురువారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ హసీనా మాట్లాడుతూ.. స్వాత్రంత్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. అదే విధంగా తమకు అండగా నిలబడిన భారత జవాన్లు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. తమ జాతి స్వేచ్ఛా పోరాటంలో సహకరించిన భారత ప్రభుత్వం, ప్రజల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు. (చదవండి: ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?) ఇక ఇందుకు ప్రధాని మోదీ బదులిస్తూ.. బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులపై గెలుపొందిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ దివస్ జరుపుకోవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానానికి సంబంధించి బంగ్లా కీలక పొరుగు దేశం అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తన బంగ్లాదేశ్ పర్యటనను ఉద్దేశించి తనకు ఆహ్వానం పలికినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇది తనకు దక్కిన గౌరవం అన్నారు. కాగా ఈ వర్చువల్ సమావేశంలో భాగంగా భారత్- బంగ్లాదేశ్ ఏడు అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
హసీనా వ్యాఖ్యల అంతరార్థం
మన పొరుగు దేశం, మనతో సాన్నిహిత్యాన్ని నెరపుతున్న దేశం బంగ్లాదేశ్. భౌగోళికంగా, జనాభా రీత్యా అది చిన్న దేశమే కావొచ్చు. కానీ దానితో మనకు 4,096 కిలోమీటర్ల సరిహద్దువుంది. ఇందులో దాదాపు 1,116 కిలోమీటర్ల మేర నదీ పరీవాహ ప్రాంతం. వలస పాలకులు వదిలివెళ్లిన సరిహద్దు వివాదాన్ని అయిదేళ్లక్రితం రెండు దేశాలూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలి గాయి. తీస్తా నదీ జలాల విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయదల్చుకున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ), జాతీయ ప్రజా నమోదు పట్టిక(ఎన్పీఆర్) బంగ్లాదేశ్‌లో కలవరం కలిగిస్తున్న సూచనలు కొంతకాలంగా కనబడుతున్నాయి. అస్సాంలో ఎన్ఆర్సీ అమలు మొదలైన తర్వాత వరసగా ఇద్దరు బంగ్లాదేశ్ మంత్రులు మన దేశంలో జరిపే పర్యటనలు వాయిదా వేసు కున్నారు. అందుకు కారణాలేమిటో బాహాటంగా చెప్పలేదు. కానీ మన దేశానికి విషయమేమిటో అర్థమైంది. ఎన్ఆర్సీ ప్రక్రియ అస్సాంలో పూర్తయ్యాక పరాయివారిగా తేలిన 19 లక్షలమందిలో ముస్లింలు కూడా గణనీయంగావున్నారు. వీరంతా బంగ్లా నుంచి వచ్చినవారేనని మన కేంద్ర మంత్రులు చెబుతుండటం ఆ దేశానికి అంత రుచించడంలేదు. తమ గడ్డపై నుంచి ఎవరూ అక్రమంగా భారత్ వెళ్లలేదన్నదే వారి వాదన. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండురోజుల క్రితం సీఏఏపై తొలిసారి నేరుగా మాట్లాడారు. అయితే సాధ్యమైనంత లౌక్యంగా ఉండే ప్రయత్నం చేశారు. సన్నిహితంగా మెలగుతున్న రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఎవరికీ మంచిది కాదు. మన ఇరుగు పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ మినహా మిగిలినవన్నీ పైకి ఏం చెబుతున్నా ఏదోమేర ఇప్పటికే చైనాకు దగ్గరయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌తోనూ ఇలాంటి పరిణామాలే ఏర్పడొచ్చునా అనే సందేహం హసీనా వ్యాఖ్యలు చూశాక పలువురిని కలవరపెడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనలోవున్న హసీనాను అక్కడి పాత్రికేయులు ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీలు భారత్ ఆంతరంగిక వ్యవహారమని చెబుతూనే, సీఏఏ అవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అసలు దాన్నెందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు. సీఏఏలో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ లతోపాటు బంగ్లాదేశ్‌ను కూడా ప్రస్తావించి అక్కడున్న మైనారిటీలు హింసకూ, అణచివేతకు గురవుతున్నారని, అటువంటివారికి పౌరసత్వం ఇవ్వడమే ఉద్దేశమని చట్టం చెప్పడంపై హసీనాకు తీవ్ర అభ్యంతరాలే వున్నట్టు ఈ వ్యాఖ్య తేటతెల్లం చేస్తోంది. అంతేకాదు...ఆమె మరో మాటన్నారు. ఆంతరంగికంగా భారత ప్రజలకు సమస్యలున్నమాట యదార్థమని హసీనా చెప్పారు. అస్సాంలో ఎన్ఆర్సీ కింద స్థానికేతరులుగా తేలిన 19 లక్షలమంది పౌరులూ భారత్‌లోని వేరే ప్రాంతాల నుంచి అక్కడికెళ్లినవారు అయివుండొచ్చని ఈ మాటలద్వారా ఆమె చెప్పదల్చుకున్నట్టు కనబడు తోంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేసి, ఇలాగే మరిన్ని లక్షలమంది పౌరులు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని ముందూ మునుపూ భారత్ అనే ప్రమాదం వున్నదని బంగ్లాదేశ్ నేతలు అనుమా నిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా హసీనా స్పష్టంగానో, అస్పష్టంగానో తన అభిప్రాయం వివరించే యత్నం చేశారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో మైనారిటీలను వేధి స్తున్నారని, బాధిస్తు న్నారని చెబితే ఎవరైనా విశ్వసించడం పెద్ద కష్టం కాదు. కానీ బంగ్లాదేశ్‌ను సైతం ఆ గాటనే కట్టడం సరైందేనా? ఒక అంచనా ప్రకారం 16.10 కోట్లమంది బంగ్లా జనాభాలో 10.7 శాతంమంది హిందువులు కాగా, 0.6 శాతంమంది బౌద్ధులు. బంగ్లాలో వుండే ఛాందసవాద ఇస్లామిక్ సంస్థలు అన్య మతస్తులపైనా, తమ మతంలో సెక్యులరిస్టులుగా వుండేవారిపైనా దాడులకు దిగడం రివాజు. ఈ కారణంవల్లే బంగ్లాదేశ్‌తో మనకు అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వున్న సరిహద్దుల వద్ద అక్రమంగా మన దేశంలోకి అనేకులు వలసవస్తుంటారని ఆ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఆరోపిస్తుంటారు. అటు అఫ్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సైతం హసీనా మాదిరే వాదిస్తున్నారు. తమ దేశంలో అందరికీ వేధింపులుంటాయని సీఏఏలో హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు మాత్రమే వేధింపులు ఎదుర్కొంటున్నట్టు చెప్పడం సరికాదంటున్నారు. అక్రమ వలసలుంటున్నాయా లేదా, ఉంటే అవి ఏ మేరకుంటున్నాయన్నది అంత సులభంగా తేలేదికాదు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏల వల్ల అంతా తేటతెల్లమవుతుందనుకోవడం కూడా సరికాదు. అస్సాంలో ఎన్ఆర్సీ అమలైన తీరే అందుకు ఉదాహరణ. అడిగిన పత్రాలు చూపలేని కారణంగా ఇప్పుడు స్థానికేతరులుగా లెక్కతేలి, నిర్బంధ శిబిరాల్లో వుంటున్నవారిలో ఆ పత్రాల్ని భద్రపరచుకోలేక జాబితాకెక్కిన అమాయకులెందరో ఉండొచ్చు. రేపు దేశమంతా అదే స్థితి తలె త్తదన్న గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఇరుగు పొరుగుతో... ముఖ్యంగా బంగ్లాదేశ్ వంటి మిత్ర దేశంతో పొరపొచ్చాలు రావడం మంచిది కాదు. ఇప్పటికే బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తున్న ధోర ణులు కనబడుతున్నాయి. హసీనా గత జూలైలో ఆ దేశం పర్యటించి పలు ఒప్పందాలు కుదు ర్చుకున్నారు. త్వరలో బంగ్లాదేశ్ పితామహుడు ముజిబుర్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. అందులో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు పాల్గొనాల్సివుంది. ఈ ఉత్సవాలకు ముందు మన దేశంపై హసీనా ఇలా వ్యాఖ్యానించడం, పైగా వేరే దేశంలో పర్యటిస్తుండగా మాట్లాడటం గమనిస్తే ఆమె ఆగ్రహం అర్థమవుతుంది. మన ప్రభుత్వం దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని, చాకచక్యంతో వ్యవహరించి ఇరుగు పొరుగులో తలెత్తే అసంతృప్తిని పోగొట్టాల్సివుంది. -
సీఏఏ అవసరం లేదు
దుబాయ్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ఈ రెండూ భారత్ అంతర్గత వ్యవహారాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సీఏఏ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ‘సీఏఏ ఇప్పుడు చేయాల్సిన పని లేదు. మరి భారత ప్రభుత్వం ఎందుకు ఈ చట్టం చేసిందో అర్థం కావడం లేదు’’అని యూఏఈ రాజధాని అబూధాబిలో హసీనా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ నుంచి ఎలాంటి తిరుగు వలసలు లేవని, అయితే దేశంలో ప్రజలే బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సీఏఏకి పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన తర్వాత ముగ్గురు బంగ్లాదేశ్ మంత్రులు భారత పర్యటన రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్, పాక్, అప్ఘానిస్తాన్‌లో ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని వీలు కల్పించే ఈ చట్టంపై భారత్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
మరింత అనుబంధం
సాంస్కృతికంగా, చారిత్రకంగా సన్నిహిత దేశాలైన భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. నాలుగు రోజుల పర్యటన కోసం శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశంతో అణు ఇంధన ఒప్పందం, 50 కోట్ల డాలర్ల రుణ సహా యంతోసహా 25 ఒడంబడికలను కుదుర్చుకోబోతున్నారు. ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో చెలిమి నిరంతరం ప్రవహించే నదిలాంటిదని హసీనా అభి వర్ణించారు. మధ్యమధ్య కొన్ని ఒడిదుడుకులు ఏర్పడిన మాట నిజమే అయినా రెండు దేశాల మధ్యా విడదీయరాని సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. 2011లో యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ పర్యటించినప్పుడు, రెండేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడు ఎన్నో ఒప్పందాలు కుదిరాయి. అయితే అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నదని చెప్పలేం. వలస పాలన అవశేషమైన తీస్తా నదీజలాల సమస్య ఇంకా తీరలేదు. సిక్కిమ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌కు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలిసే తీస్తా నదీ జలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. అయిదు జిల్లాలకు చెందిన 5,000 గ్రామాల తాగు నీటి అవసరాలకు... సాగు యోగ్యమైన భూమిలో 14 శాతానికి... దేశ జనాభాలో దాదాపు 7.5 శాతానికి కేవలం తీస్తా జలాలే ఆధారం. ముఖ్యంగా డిసెంబర్– మార్చి మధ్య బంగ్లాదేశ్‌కు గడ్డుకాలం. ఆ సమయంలో దేశానికి తీస్తా జలాల అవసరం బాగా ఉంటుంది. నిజానికి 2011లో మన్మోహన్ పర్యటన సందర్భంగా తీస్తా ఒప్పందం సంతకాలే తరవాయిగా ఖరారైంది. కానీ చివరి నిమిషంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలకబూని, హఠాయించి దాన్ని పక్కన బెట్టించారు. ఈ ఒప్పందం అమలైతే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని, తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆమె భావించారు. అప్పటికి తమ భాగస్వామ్య పక్షంగా ఉన్న మమతను కాదనలేక మన్మోహన్ చివరకు ఆ ఒప్పందాన్ని ఆపేశారు. ఈ వ్యవహారాన్ని అటు హసీనా కూడా అర్ధం చేసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే ఆమెకు అక్కడి విపక్షాలనుంచి ఇబ్బందులు తప్పలేదు. ఒకపక్క భారత్ తనకు చాలా సన్నిహితమని చెప్పుకునే హసీనా తీస్తా నదీజలాలను సాధించలేక పోతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈసారి హసీనా పర్యటనలో దాదాపు 25 ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారుగానీ అందులో తీస్తా మాత్రం లేదు. అయితే ఆ విషయంలో మమత వైఖరిని మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నట్టు కనబడుతోంది. అందులో భాగంగానే హసీనా గౌరవార్ధం ఏర్పాటుచేసే సమావేశంలో, విందులో పాల్గొనాలని మమతను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వా నించారు. ఆమె అందుకు అంగీకరించారు. అయితే ఎన్డీఏ సర్కారుతో సంబం ధాలు అంతంతమాత్రంగా ఉన్న ఈ దశలో తీస్తా ఒప్పందం విషయంలో ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏమేరకు చేయగలదో, ఆమె ఎంతవరకూ వింటారో అనుమానమే. ఇరు దేశాల సంబంధాలకూ అవరోధం కలిగిస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తమది చాలా చిన్న దేశమని, పొరుగునున్న భారత్‌తో ఎంత మంచిగా ఉన్నా అది పెద్దన్న పాత్ర పోషించి పెత్తనం చలాయించాలని చూస్తుందేమోనన్న సంశయం బంగ్లాదేశ్‌లో ఉంది. మన ప్రభుత్వాల వైపు లోపం మరో రకమైనది. ఇరుగు పొరుగు దేశాలతో చెలిమికి ప్రయత్నించి, వాటితో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ఉత్సుకత మన దగ్గర శూన్యం. ముఖ్యంగా పదేళ్ల యూపీఏ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. దీని ఫలితం కూడా తీవ్రంగానే ఉంది. మన చుట్టుపక్కలనున్న చాలా దేశాలకు చైనా సన్నిహితం కాగలి గింది. వ్యూహాత్మకంగా ఇది మనకెంతో చేటు తెచ్చింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రా లకు చేరువలో ఉన్న బంగ్లాతో చెలిమిని కాపాడుకోవడం వ్యూహాత్మకంగా ఎంతో అవసరం. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక విదేశాంగ విధానంలో ఉన్న ఈ లోపాలను సరిదిద్దారు. అయితే చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. 17 కోట్ల జనాభాగల బంగ్లా ఇప్పుడు అన్నివిధాలా ముందంజలో ఉంది. ఆర్ధిక రంగంలో శరవేగంతో దూసుకెళ్తున్న దేశాల్లో అదొకటి. ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కాగా, సామాజిక–ఆర్ధిక అంశాల్లో, మానవాభివృద్ధిలో అది మెరుగ్గా ఉంది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న సమయంలో హసీనా 2008లో బంగ్లాలో అధికారాన్ని చేపట్టారు. ఏడాది తిరగకుండానే సైనిక తిరుగు బాటుకు విఫలయత్నం జరిగింది. విపక్షాల ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు క్షీణించాయి. వీటన్నిటినీ ఆమె అధిగమించగలిగారు. అయితే ప్రస్తుత పర్యటనలో రక్షణకు సంబంధించి కుదరబోతున్న రెండు ఒప్పందాలను అక్కడి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒప్పందాల వల్ల దేశ సార్వభౌమాధికారం దెబ్బ తింటుందని ఆరోపిస్తున్నాయి. భారత్ అంటే పొసగని శక్తులు తమ దేశం ఎలాగైనా చైనాతో దగ్గరకావాలని వాంఛిస్తున్నాయి. ఇప్పుడు కుదిరే ఒప్పందాల వల్ల తమ కోరిక నెరవేరదన్న బెంగ వాటికుంది. ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడాలంటే తీస్తా విషయంలో సామరస్య ధోరణితో వ్యవహరించడం అవసరం. బంగ్లా ప్రజల ప్రయోజనాల సంగతలా ఉంచి రెండు బెంగాలీ ప్రాంతాలు సన్నిహితం కావడానికి, మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఇది తోడ్పడుతుందని మమత తెలుసు కుంటేనే సాధ్యపడుతుంది. తూర్పు ఆసియా దేశాలతో నేరుగా అనుసంధానానికి బంగ్లా వారధి అవుతుంది. ఇప్పటికే భూ సరిహద్దు, సముద్ర జలాల సరిహద్దు ఒప్పందాలు కుదిరి ఆ సమస్యలు పరిష్కారమయ్యాయి. తీస్తా జలాలపై ఒప్పందం కుదిరితే బంగ్లాలో రాజకీయంగా హసీనాకు ఎంతో లాభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆమె విజయానికి బాటలు పరుస్తుంది. లేనట్టయితే దేశ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన హసీనా భారత్ పెత్తనానికి చోటిచ్చారని అక్కడి విపక్షాలు ఆరోపించే స్థితి ఏర్పడుతుంది. హసీనా ప్రస్తుత పర్యటన ఈ ప్రాంత అభివృద్ధికీ, ప్రగతికీ ఎంతగానో దోహదపడుతుంది. -
బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 66 ఏళ్ల షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు. సైనిక పాలన ముగిసి ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన తర్వాత ఈ రెండు దశాబ్దాల్లో హసీనా ప్రధాని పీఠాన్ని అధిష్టించడం ఇది మూడోసారి. అధ్యక్షుడి నివాస సౌధం బంగభవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానిగా హసీనాతో పాటు 48 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులతో పాటు భారత్ హై కమిషనర్ పంకజ్ శరణ్ సహా పలువురు దౌత్యాధికారులు హాజరయ్యారు. హసీనాకు భారత ప్రధాని మన్మోహన్ శుభాకాంక్షలు తెలిపారు.