Bangladesh PM Sheikh Hasina Spoke About Rohingya Migrants - Sakshi
Sakshi News home page

రోహింగ్యాల సమస్యకు భారత్‌ పరిష్కారం చూపగలదు: షేక్‌ హసీనా

Published Sun, Sep 4 2022 4:21 PM | Last Updated on Sun, Sep 4 2022 4:57 PM

Bangladesh PM Sheikh Hasina Spoke About Rohingya Migrants - Sakshi

ఢాకా: రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి అతిపెద్ద సమస్యగా మారారని పేర్కొన్నారు బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా. వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు అంతర్జాతీయ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది శరణార్థులు దేశంలో ఉండటం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించటంలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు చెప్పారు హసీనా. ఆమె శనివారం ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

‘రోహింగ్యాల సమస్య అతిపెద్ద భారమని మాకు తెలుసు. భారత్‌ పెద్ద దేశం. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పొరుగు దేశాలతో  చర్చలు జరుపుతున్నాం. వారిని తిరిగి పంపించేందుకు వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మానవీయ కోణంలోనే వారికి ఆశ్రయం కల్పించాం. కొవిడ్‌ సమయంలో మొత్తం రోహింగ్యాలకు టీకాలు వేయించాం. కానీ, వారు ఏన్నాళ్లుంటారు. అందుకే వారిని క్యాంపులో ఉంచాం. అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు మత్తు పదార్థాలు, మహిళల అక్రమ రవాణలకు పాల్పడుతున్నారు. వారు ఎంత త్వరగా స్వస్థలాలకు వెళితే మాకు, మయన్మార్‌కు అంత మంచిది. ఈ క్రమంలో వారిని స్వస్థలాలకు పంపే విషయమై ఏషియాన్‌, యూఎన్‌వో, ఇతర దేశాలతో చర్చిస్తున్నాం. కానీ, భారత్‌ పొరుగు దేశం. వారు దీనిలో కీలక పాత్ర పోషించగలరు. నేను అదే అనుకొంటున్నాను’ అని షేక్‌ హసీనా పేర్కొన్నారు.  

తీస్తా నది జలాల పంపకాల అంశలో భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సమన్వయంపై ప్రశ్నించగా.. తీస్తా నది విషయంలో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. భారత ప్రధాని కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో తమ విద్యార్థులు పలువురిని భారత్‌ స్వస్థలాలకు చేర్చిందన్నారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ మైత్రి రూపంలో సహాయపడిందని గుర్తు చేసుకొన్నారు. హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్‌లో అధికారిక పర్యటన జరపనున్నారు.

ఇదీ చదవండి: ‘మేం ఫ్రీగా డబ్బులిస్తాం...ఇళ్లు కట్టుకోండి’..బంపరాఫర్‌ ఇచ్చిన ప్రభుత్వం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement