మరింత అనుబంధం
సాంస్కృతికంగా, చారిత్రకంగా సన్నిహిత దేశాలైన భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. నాలుగు రోజుల పర్యటన కోసం శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశంతో అణు ఇంధన ఒప్పందం, 50 కోట్ల డాలర్ల రుణ సహా యంతోసహా 25 ఒడంబడికలను కుదుర్చుకోబోతున్నారు. ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో చెలిమి నిరంతరం ప్రవహించే నదిలాంటిదని హసీనా అభి వర్ణించారు. మధ్యమధ్య కొన్ని ఒడిదుడుకులు ఏర్పడిన మాట నిజమే అయినా రెండు దేశాల మధ్యా విడదీయరాని సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. 2011లో యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పర్యటించినప్పుడు, రెండేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లినప్పుడు ఎన్నో ఒప్పందాలు కుదిరాయి.
అయితే అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నదని చెప్పలేం. వలస పాలన అవశేషమైన తీస్తా నదీజలాల సమస్య ఇంకా తీరలేదు. సిక్కిమ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌కు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలిసే తీస్తా నదీ జలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. అయిదు జిల్లాలకు చెందిన 5,000 గ్రామాల తాగు నీటి అవసరాలకు... సాగు యోగ్యమైన భూమిలో 14 శాతానికి... దేశ జనాభాలో దాదాపు 7.5 శాతానికి కేవలం తీస్తా జలాలే ఆధారం. ముఖ్యంగా డిసెంబర్– మార్చి మధ్య బంగ్లాదేశ్‌కు గడ్డుకాలం. ఆ సమయంలో దేశానికి తీస్తా జలాల అవసరం బాగా ఉంటుంది. నిజానికి 2011లో మన్మోహన్ పర్యటన సందర్భంగా తీస్తా ఒప్పందం సంతకాలే తరవాయిగా ఖరారైంది. కానీ చివరి నిమిషంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలకబూని, హఠాయించి దాన్ని పక్కన బెట్టించారు.
ఈ ఒప్పందం అమలైతే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని, తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆమె భావించారు. అప్పటికి తమ భాగస్వామ్య పక్షంగా ఉన్న మమతను కాదనలేక మన్మోహన్ చివరకు ఆ ఒప్పందాన్ని ఆపేశారు. ఈ వ్యవహారాన్ని అటు హసీనా కూడా అర్ధం చేసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే ఆమెకు అక్కడి విపక్షాలనుంచి ఇబ్బందులు తప్పలేదు. ఒకపక్క భారత్ తనకు చాలా సన్నిహితమని చెప్పుకునే హసీనా తీస్తా నదీజలాలను సాధించలేక పోతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈసారి హసీనా పర్యటనలో దాదాపు 25 ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారుగానీ అందులో తీస్తా మాత్రం లేదు.
అయితే ఆ విషయంలో మమత వైఖరిని మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నట్టు కనబడుతోంది. అందులో భాగంగానే హసీనా గౌరవార్ధం ఏర్పాటుచేసే సమావేశంలో, విందులో పాల్గొనాలని మమతను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వా నించారు. ఆమె అందుకు అంగీకరించారు. అయితే ఎన్‌డీఏ సర్కారుతో సంబం ధాలు అంతంతమాత్రంగా ఉన్న ఈ దశలో తీస్తా ఒప్పందం విషయంలో ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏమేరకు చేయగలదో, ఆమె ఎంతవరకూ వింటారో అనుమానమే.
ఇరు దేశాల సంబంధాలకూ అవరోధం కలిగిస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తమది చాలా చిన్న దేశమని, పొరుగునున్న భారత్‌తో ఎంత మంచిగా ఉన్నా అది పెద్దన్న పాత్ర పోషించి పెత్తనం చలాయించాలని చూస్తుందేమోనన్న సంశయం బంగ్లాదేశ్‌లో ఉంది. మన ప్రభుత్వాల వైపు లోపం మరో రకమైనది. ఇరుగు పొరుగు దేశాలతో చెలిమికి ప్రయత్నించి, వాటితో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ఉత్సుకత మన దగ్గర శూన్యం. ముఖ్యంగా పదేళ్ల యూపీఏ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు.
దీని ఫలితం కూడా తీవ్రంగానే ఉంది. మన చుట్టుపక్కలనున్న చాలా దేశాలకు చైనా సన్నిహితం కాగలి గింది. వ్యూహాత్మకంగా ఇది మనకెంతో చేటు తెచ్చింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రా లకు చేరువలో ఉన్న బంగ్లాతో చెలిమిని కాపాడుకోవడం వ్యూహాత్మకంగా ఎంతో అవసరం. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక విదేశాంగ విధానంలో ఉన్న ఈ లోపాలను సరిదిద్దారు. అయితే చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది.
17 కోట్ల జనాభాగల బంగ్లా ఇప్పుడు అన్నివిధాలా ముందంజలో ఉంది. ఆర్ధిక రంగంలో శరవేగంతో దూసుకెళ్తున్న దేశాల్లో అదొకటి. ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కాగా, సామాజిక–ఆర్ధిక అంశాల్లో, మానవాభివృద్ధిలో అది మెరుగ్గా ఉంది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న సమయంలో హసీనా 2008లో బంగ్లాలో అధికారాన్ని చేపట్టారు. ఏడాది తిరగకుండానే సైనిక తిరుగు బాటుకు విఫలయత్నం జరిగింది. విపక్షాల ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు క్షీణించాయి. వీటన్నిటినీ ఆమె అధిగమించగలిగారు. అయితే ప్రస్తుత పర్యటనలో రక్షణకు సంబంధించి కుదరబోతున్న రెండు ఒప్పందాలను అక్కడి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ ఒప్పందాల వల్ల దేశ సార్వభౌమాధికారం దెబ్బ తింటుందని ఆరోపిస్తున్నాయి. భారత్ అంటే పొసగని శక్తులు తమ దేశం ఎలాగైనా చైనాతో దగ్గరకావాలని వాంఛిస్తున్నాయి. ఇప్పుడు కుదిరే ఒప్పందాల వల్ల తమ కోరిక నెరవేరదన్న బెంగ వాటికుంది. ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడాలంటే తీస్తా విషయంలో సామరస్య ధోరణితో వ్యవహరించడం అవసరం. బంగ్లా ప్రజల ప్రయోజనాల సంగతలా ఉంచి రెండు బెంగాలీ ప్రాంతాలు సన్నిహితం కావడానికి, మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఇది తోడ్పడుతుందని మమత తెలుసు కుంటేనే సాధ్యపడుతుంది. తూర్పు ఆసియా దేశాలతో నేరుగా అనుసంధానానికి బంగ్లా వారధి అవుతుంది.
ఇప్పటికే భూ సరిహద్దు, సముద్ర జలాల సరిహద్దు ఒప్పందాలు కుదిరి ఆ సమస్యలు పరిష్కారమయ్యాయి. తీస్తా జలాలపై ఒప్పందం కుదిరితే బంగ్లాలో రాజకీయంగా హసీనాకు ఎంతో లాభిస్తుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆమె విజయానికి బాటలు పరుస్తుంది. లేనట్టయితే దేశ ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైన హసీనా భారత్ పెత్తనానికి చోటిచ్చారని అక్కడి విపక్షాలు ఆరోపించే స్థితి ఏర్పడుతుంది. హసీనా ప్రస్తుత పర్యటన ఈ ప్రాంత అభివృద్ధికీ, ప్రగతికీ ఎంతగానో దోహదపడుతుంది.