భారత్‌కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా? | BJP vs Congress: USAID For India Voter Turnout Grant Or For Bangladesh | Sakshi
Sakshi News home page

భారత్‌కు అమెరికా సాయం.. బంగ్లాకు మళ్లిందా?

Published Fri, Feb 21 2025 2:21 PM | Last Updated on Fri, Feb 21 2025 3:05 PM

BJP vs Congress: USAID For India Voter Turnout Grant Or For Bangladesh

న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్‌ డాలర్ల సాయం వ్యవహారం.. కొత్త మలుపు తిరిగింది. ఆ సాయం భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేందుకేనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లోపు ఆ సాయాన్ని బంగ్లాదేశ్‌కు మళ్లించారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ నుంచి కథనం వెలువడంది. దాని ఆధారంగా బీజేపీ-కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో మండిపడుతున్నాయి.

భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంపు కోసం ఇచ్చిన ఆ నిధులను బంగ్లాదేశ్‌లో ఓ ప్రాజెక్టు వినియోగించారన్నది ఆ కథనం సారాంశం​. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌(Jairam Ramesh) దీనిని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి.. బీజేపీ, ఆ పార్టీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. దానిని షేర్‌ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. అయితే.. ఆ కథనాన్ని ఫేక్‌ అంటూ బీజేపీ ఖండించింది. 

 

భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్‌ 21 మిలియన్‌ డాలర్ల(రూ.182 కోట్ల నిధులు) కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌ను పెంచడంద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్‌ ప్రయత్నించారని ట్రంప్‌ విమర్శించారు. అందుకే డోజ్‌ దానిని రద్దు చేసిందని సమర్థించుకున్నారు. ఈ ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్‌లో దుమారం రేగింది.

విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) కీలుబొమ్మలా మారారని బీజేపీ ధ్వజమెత్తగా.. ట్రంప్‌వి అర్థం లేని ఆరోపణలని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది.  ట్రంప్‌ వ్యాఖ్యలతో 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పని చేస్తున్నాయని అప్పట్లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు నిజమని తేలిందని బీజేపీ పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్‌ గాంధీ.. భారత్‌ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాలను దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవీయ విమర్శించారు.  

అయితే ట్రంప్‌ వ్యాఖ్యలు అర్థం లేని ఆరోపణలేనని కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా దశాబ్దాలుగా భారత్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేత పత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని ఆ పార్టీ నేత జైరాం రమేశ్‌ డిమాండు చేశారు.

ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను రద్దు చేసినట్లు ప్రకటించింది. డోజ్‌ నిర్ణయం.. భారత్‌లో రాజకీయ వివాదానికి దారి తీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement