
‘ఓటర్ల సంఖ్య కోసం అమెరికా డబ్బు’ ఉదంతంలో కేంద్రంపై కాంగ్రెస్ ఆగ్రహం
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(ఇన్‌చార్జ్) జైరాం రమేశ్ ఆదివారం ‘ఎక్స్’లో పలు పోస్ట్‌లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది.
2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్‌కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఎలాన్ మస్క్ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్ ఢిల్లీ అన్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్ అన్నారు.
సీఈపీపీఎస్‌కు 48 కోట్ల డాలర్లు
‘‘డోజ్ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఎయిడ్) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్(సీఈపీపీఎస్)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి.
ఇందులో తొలిగ్రాంట్ ఏఐడీ117ఎల్‌ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్‌కు భారత్‌కు వెళ్లాల్సి ఉందని మస్క్ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్ వాస్తవానికి బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్‌ను వినియోగించాలని బంగ్లాదేశ్‌లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్‌ఎయిడ్ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment