
ఆ నిధులకు ‘ఓటర్ల సంఖ్య పెంపు’నకు సంబంధం లేదన్న ఆర్థికశాఖ నివేదిక
7 ప్రాజెక్టుల కోసం 75 కోట్ల డాలర్లు కేటాయించారని వివరణ
న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా నుంచి యూఎస్‌ఎయిడ్ తరఫున 2.1 కోట్ల డాలర్ల నిధులు వచ్చాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోదీ ప్రభుత్వం కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023–24 ఆర్థికసంవత్సరంలో భారత్‌లో ఏడు ప్రాజెక్టుల కోసం యూఎస్‌ఎయిడ్ 75 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చిందని భారత ఆర్థికశాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
‘‘ మొత్తంగా 75 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారత ప్రభుత్వ భాగస్వామ్యంలో యూఎస్‌ఎయిడ్ చేపట్టింది. అందులో 2023–24 కాలంలో 9.7 కోట్ల డాలర్లను ఖర్చుచేశారు. ఇందులో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్ లేదు.
వ్యవసాయం, ఆహార భద్రత, నీరు, శుభ్రత(వాష్ ప్రోగ్రామ్), పునరుత్పాదక ఇంధనం, విపత్తు నిర్వహణ, ఆరోగ్యం, సుస్థిర అడవులు, పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, ఇంధన సమర్థ వినియోగ సాంకేతికలను అందుబాటులోకి తేవడం, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి’’ అని వార్షిక నివేదిక పేర్కొంది.
1951 ఏడాదిలో మొదలైన ద్వైపాక్షిక అభివృద్ధి సాయంలో భాగంగా భారత్‌కు అమెరికా ఇప్పటిదాకా 555కుపైగా ప్రాజెక్టుల్లో ఏకంగా 17 బిలియన్ డాలర్ల సాయం అందించిందని వార్షిక నివేదిక పేర్కొంది. ద్వైపాక్షిక నిధుల వ్యవహారాలను చూసే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థికవ్యవహారాల విభాగం సైతం ఈ వివరాలను వెల్లడించింది.