
న్యూఢిల్లీ: 2023 చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లు(ఈసీల) నియామకాలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ అంశంపై సత్వరం విచారణ చేపట్టాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వినతి మేరకు బుధవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న సుప్రీంకోర్టు ప్రకటించిన విధంగా వాస్తవానికి ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే, భూ సేకరణకు సంబంధించిన కీలకమైన అంశాలున్నందున వాయిదా వేయాల్సి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. మే 14వ తేదీన తప్పక విచారిస్తామంది.