
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్‌పై విచారణను వాయిదా వేయాలని కేంద్రం కోరింది. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంది.
ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం, ఆ స్థానంలో ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర మంత్రిని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని జస్టిస్ సూర్యకాంత్,ఎన్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం అత్యవసర విచారణ చేపట్టింది.
అయితే విచారణ ప్రారంభమైన కాసేపటికే.. రాజ్యాంగ ధర్మాసనం ముందు తాను హాజరు కావాల్సి ఉందని చెబుతూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ వాయిదా వేయాలని కోరారు. అయితే ప్రతీ కేసు విచారణ వాయిదా కోరడం సరికాదని పిటిషనర్ అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్‌జీ కాకుంటే.. 17 మంది లా ఆఫీసర్లు ఉంటారని, అలాంటప్పుడు వాయిదా కోరడం సరికాదని అన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సోలిసిటర్ జనరల్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పాలని ధర్మాసనం కోరింది.
ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(Chief Election Commissioner)గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జాతి నిర్మాణానికి తొలి అడుగు ఓటు అని, ఎన్నికల సంఘం ఎప్పుడూ ఓటర్లకు మద్ధతుగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
నూతన సీఈసీగా జ్ఞానేశ్వర్ ఎంపికపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం సరికాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించడం తెలిసిందే.
వివాదం ఏంటంటే..
2023లో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అందులో సీఈసీ, ఈసీల ఎంపిక కోసం ఏర్పాటు చేసే ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చాలని పేర్కొంది. అంటే.. ప్రధానితో పాటు ప్రతిపక్ష నేత, సీజేఐ ఆ ప్యానెల్‌లో ఉండాలి. కేంద్రం కొత్త చట్టం చేసేంత వరకు ఈ విధానం పాటించాలని స్పష్టం చేసింది.
అయితే కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా సీజేఐని మినహాయించింది. సీజేఐ బదులుగా కేంద్ర మంత్రిని చేర్చింది. ఈ మేరకు 2023లోనే ఓ కొత్త చట్టం(Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023) తీసుకొచ్చింది. అయితే కొత్త చట్టం ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ.. ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నింటికి మంచి అది ప్రజా స్వామ్యానికి ప్రమాదమని చెబుతూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాబట్టి సీజేఐనే కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో సుప్రీం కోర్టు ఇవాళ ఈ అంశంపై అత్యవసర విచారణ జరపనుంది.
ఇదిలా ఉంటే.. మార్చి 15, 2024 కొత్త చట్టం ప్రకారం కేంద్రం చేపట్టిన ఈసీ నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడం విశేషం. అయినప్పటికీ ప్రతిపక్షాలు సహా కొన్ని సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment