న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులను నియమిస్తోందనే తీవ్ర ఆరోపణల నడుమ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరిచింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తున్నారు.
ఇకపై ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలు జరపాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది.
అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది
‘శక్తివంతమైన తుపాకీ కంటే బ్యాలెట్ మరింత శక్తిమయం. ఎన్నికల ప్రక్రియ అతిగా దుర్వినియోగానికి గురైందంటే అది చివరకు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది. అధికారం ముందు సాగిలపడే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికకాకూడదు. ఇంకొకరి ఆదేశాలను శిరసావహించే వ్యక్తి ప్రజాస్వామ్య తలరాతను మార్చే హోదాలో ఉండకూడదు. ఎన్నికల ప్రక్రియ స్వతంత్రతను మరింతగా ఇనుమడింపజేసేందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నాం. స్వచ్ఛత తగ్గిపోతే వినాశక పరిణామాలు సంభవిస్తాయి.
పార్లమెంట్‌లో కొత్త చట్టం వచ్చేవరకు నూతన నియామక ప్రక్రియ అమలులో ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఇన్నాళ్లూ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతికి కొత్త సీఈసీ, ఈసీల కోసం సిఫార్సుచేసేది. సిఫార్సులమేరకు రాష్ట్రపతి వారిని నియమించేవారు. ఇకపై కొత్త ప్రక్రియ ప్రకారం లోక్‌సభలో విపక్షనేత లేని సందర్భంలో లోక్‌సభలో సంఖ్యపరంగా అతిపెద్ద విపక్ష పార్టీ నేత త్రిసభ్య కమిటీలో సభ్యునిగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో గతంలో దాఖలైన నేపథ్యంలో వాటిని విచారించిన కోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు.
తీర్పును స్వాగతించిన విపక్షాలు
‘ప్రభుత్వ ప్రమేయం, ప్రభావం బారిన పడకుండా ఈసీని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు తీర్పు బాటలు పరిచింది’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తీర్పును ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అభివర్ణించారు. ‘ఇంతకాలం ప్రధాని ఎన్నికల ర్యాలీలు, ప్రభుత్వ పథకాల ప్రకటనలకు అనుగుణంగా ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయించేది. ఇకపై ఎన్నికల సంఘంలో ఎవరు ఉంటారనే త్రిసభ్య కమిటీ చూసుకుంటుంది’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment