పోసేవాడు ఒకందుకు పోస్తే... తాగేవాడు మరొకందుకు తాగాడని మోటు సామెత. ఎన్నికల కమిషనర్లు, ప్రత్యేకించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామకంపై కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 10న రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు వ్యవహారం అచ్చం ఆ సామెతనే గుర్తు చేస్తోంది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై పాలనావ్యవస్థ ఉడుంపట్టును సడలించేలా గత మార్చిలో సుప్రీమ్ కోర్డ్ రాజ్యాంగ ధర్మాసనం ఒక ఉద్దేశంలో తీర్పు చెబితే, అయిదునెలల్లో కేంద్రం ఏకంగా ఆ తీర్పు స్ఫూర్తికే విరుద్ధమైన బిల్లుతో ముందుకొచ్చింది.
ఎంపిక ప్రక్రియ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తప్పించింది. తటస్థంగా ఉండాల్సిన ఎంపిక కమిటీని అధికారపక్షం తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేలా తెగబడింది. పార్టీ, ప్రభుత్వాలకతీతంగా నడవాల్సిన ఎన్నికల సంఘ స్వతంత్రతను దెబ్బతీస్తోంది. భారత ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ), కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఇకపై సీఈసీని నియమిస్తుందని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించింది. ఇప్పటి దాకా కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు సీఈసీని రాష్ట్రపతి నియమిస్తున్నారు. తాజాగా ప్రతిపక్ష నేతను కూడా చేర్చి, విస్తృత ప్రాతినిధ్యంతో ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మామూలుగా నైతే స్వాగతించాలి. కానీ, ఇక్కడే తిరకాసుంది.
సీఈసీ సహా ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసే వరకు, సదరు ఎంపిక కమిటీలో సీజేఐకి కూడా చోటిచ్చి, ఈ ప్రక్రియను మరింత ప్రజాస్వామ్యయుతం చేయాలని మార్చి 2న అయిదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. సహజంగానే ఇది మింగుడుపడని సర్కార్ ఆగమేఘాలపై బిల్లు తెచ్చేసింది. ఆ బిల్లులో సీజేఐకి బదులుగా కేంద్ర మంత్రికి చోటిచ్చింది. మంత్రులంటే ప్రధాని గీచిన గీత దాటలేరు. వెరసి, ఎంపిక కమిటీలో పేరుకు ప్రతిపక్ష నేత ఉన్నా మొత్తం ముగ్గురిలో ఇద్దరు సభ్యులు పాలక పక్షీయులే గనక మెజారిటీ ఎటు మొగ్గుతుందో వేరుగా చెప్పనక్కర లేదు.
పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని భారత రాజ్యాంగ పరిషత్ చర్చలు పేర్కొన్న మాట నిజమే. దాన్ని ఆసరాగా చేసుకొనే సుప్రీమ్ సైతం ప్రభుత్వం చట్టం చేసే వరకు ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ఎంపిక సంఘమంటూ అయిదు నెలల క్రితం తాత్కాలిక ప్రతిపాదన తన తీర్పులో చెప్పింది. తీరా ఇప్పుడు ప్రభుత్వం చట్టం చేస్తోంది కానీ పరోక్షంగా అధికార పక్షం చేతిలోకే అంతా తెచ్చి, రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రతను పణంగా పెట్టింది. ఇదీ అసలు సమస్య. అలాగే, ఎంపిక సంఘం తనదైన సొంత ప్రక్రియను ఎంచుకోవచ్చట.
ఆ సంఘం ముందు ఉంచాల్సిన తొలి జాబితాను క్యాబినెట్ సెక్రటరీ సారథ్యంలోని సెర్చ్ కమిటీ సిద్ధం చేస్తుందట. వెరసి, ప్రతిపక్ష నేత వట్టి ఉత్సవ విగ్రహమవుతారు. ఆయన అభిప్రాయం అరణ్యఘోషగా మిగులుతుంది. కొద్దినెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోనూ, సరిగ్గా మరో 9 నెలల్లో లోక్‌సభకూ ఎన్నికలు జరగాల్సి ఉండగా కేంద్రం ఈ బిల్లు ద్వారా ఎన్నికల సంఘంపై పూర్తిగా పట్టు బిగించాలన్నది పాలకుల తాపత్రయమనిపిస్తోంది.
ప్రభుత్వ ప్రమేయం లేకుండా నడవాల్సిన వ్యవస్థకు పెద్ద తలకాయలెవరో అధికారంలో ఉన్నవారే నిర్ణయించడం ఎన్నికల ప్రజాస్వామ్యపు ప్రాథమిక లక్ష్యానికే విఘాతం. ఆ మాటకొస్తే దేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే ఎన్నికల సంఘం, కమిషనర్ల నియామకం పారదర్శకంగా లేదని కొన్నేళ్ళుగా వింటున్నదే. వారిపై ప్రభుత్వం పరోక్షంగా స్వారీ చేస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. 2021 నవంబర్‌లో న్యాయశాఖ ఆదేశాల మేరకు సీఈసీ, ఎన్నికల కమిషనర్లు ఉమ్మడి ఓటర్ల జాబితాపై చర్చించడానికి ప్రధానమంత్రి కార్యాలయంతో సమావేశానికి వెళ్ళడం దుమారం రేపింది.
ఇది ఎన్నికల సంఘం అధికారం, స్వతంత్రతను తగ్గించడమేనని రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలకవ్యవస్థ జోక్యం నుంచి ఎన్నికల సంఘాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో సుప్రీమ్ తీర్పునిస్తే అంతా సంతోషించారు. తీరా కొత్త బిల్లుతో ఎన్నికల సంఘం ఇక అధికారి కంగానే పాలకుల గూటి చిలకగా మారిపోనుంది. ఎన్నికలు కురుక్షేత్ర సమరంగా మారిన వర్తమాన పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉందని సంబంధిత పక్షాలన్నిటికీ నమ్మకం కలగడం ముఖ్యం. పాలకులేమో చట్టం తెచ్చి మరీ ఆ నమ్మకానికి చరమగీతం పలుకుతున్నారు.
ఎన్నికల సంస్కరణలపై ఏర్పాటైన దినేశ్ గోస్వామి కమిటీ 1990లోనే ఎన్నికల సంఘపు స్వతంత్రతను కాపాడే మార్గాలతో కొన్ని సిఫార్సులు చేసింది. న్యాయ సంఘం 2015 నాటి తన 255వ నివేదికలో ఆ కమిటీ ప్రతిపాదనకు మార్పులు చేస్తూ, ఎంపిక కమిటీలో ప్రధానికి చోటుకల్పించింది. సీజేఐకీ అందులో స్థానం ఉంటే అధికార, ప్రతిపక్షాలు వేటికీ మొగ్గు లేకుండా తటస్థత నెలకొనేది. కొత్త బిల్లుతో ఆ తటస్థత నిర్వీర్యమైంది. ఇది గ్రహించి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు కావలిసంస్థ స్వతంత్రతను కాపాడుకోవాలి.
రాజ్యాంగ రూపకల్పన వేళ అంబేడ్కర్ సైతం పాలనా వ్యవస్థ జోక్యానికి దూరంగా ఎన్నికల సంఘం ఉండాలన్నారు. సీఈసీ ఎంపిక ప్రక్రియ నుంచి సీజేఐని తప్పించకుండా ఉంటేనే అది సాధ్యం. కాదూ కూడదనుకుంటే, ప్రత్యామ్నాయంగా ఎంపిక కమిటీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా ఉండాలనే షరతు పెట్టాలి. తద్వారా ప్రతిపక్ష నేత మాటకు విలువ ఉంటుంది. ఎన్నికల సంఘం సమగ్రతను కాపాడినట్టూ అవుతుంది. మార్గం ఏదైనా, ఎన్నికల సంఘం నియామకాల ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఈ కొత్త బిల్లుపై తక్షణ సమీక్ష అవసరం. ప్రభుత్వం పునరాలోచించి, ఆ పని చేస్తేనే స్వతంత్ర భారతావనికి శోభ! ప్రజాస్వామ్యానికి రక్ష!!
తటస్థతకు తిలోదకాలు
Published Tue, Aug 15 2023 12:12 AM | Last Updated on Tue, Aug 15 2023 12:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment