పాత చందమామల్లో కనబడే బేతాళ కథల్లో పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కొలీజియం వ్యవస్థపై నిప్పులు చెరుగుతూనే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వ్యవస్థ ఎంత ఉత్తమమైనదో, ఎందుకు ఉత్తమమైనదో సుప్రీంకోర్టు చెబుతూ వస్తోంది. ఈసారి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోపాటు ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న జగదీప్ ధన్‌కర్ సైతం విమర్శలకు దిగటమే కొత్త పరిణామం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రాజ్యసభలోనూ, వెలుపలా కూడా థన్‌కర్ నిశితంగా విమర్శించారు. అంతక్రితం కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం జాప్యం చేయటంపై వెల్లు వెత్తుతున్న ప్రశ్నలకు రిజిజు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అలాగైతే మావద్దకు ఫైళ్లు పంపొద్దని, మీరే అన్నీ చేసుకోండని జవాబిచ్చారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా వ్యాఖ్యానించటం తగునా అని సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టిగానే ప్రశ్నించింది. మా మనోభావాన్ని తెలియజేయండంటూ అటార్నీ జనరల్‌కూ, సొలిసిటర్ జనరల్‌కూ ఆదేశాలిచ్చింది. కేంద్రం, న్యాయవ్యవస్థలమధ్య ఘర్షణ పదునెక్కిందనటానికి ఈ పరిణామాలు తార్కాణం. తాజాగా కొలీజియం సిఫార్సులను కేంద్రం తరచు విడగొట్టి ఆమోదించటంవల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ అలవాటు మానుకోవాలని సూచించింది.
ఎన్‌జేఏసీ చట్టం, అందుకోసం కేంద్రం చేసిన 99వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకావని అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2015 అక్టోబర్‌లో తీర్పునిచ్చింది. ఈ రెండు చర్యలూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలుగా పరిగణించింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు కూడా అనుమతించలేదు. ఎన్‌జేఏసీ చట్టాన్నీ, రాజ్యాంగ సవరణనూ పార్లమెంటు ఏక గ్రీవంగా ఆమోదించింది. 20 శాసనసభలు సైతం వాటికి ఆమోదం తెలిపాయి. ప్రజల సమష్టి మనోగతాన్ని తెలియజేసే ఈ చర్యలను సుప్రీంకోర్టు తోసిపుచ్చడమేమిటన్న ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి. ఏ చట్టమైనా, రాజ్యాంగ సవరణ అయినా న్యాయసమీక్షకు లోబడే ఉంటుంది గనుక అక్కడితో ఆ ప్రస్తావన ముగియాలి. మరింత పకడ్బందీ నిబంధనలతో చట్టం తీసుకొస్తే తప్ప కొలీ జియం వ్యవస్థ సిఫార్సులకు కేంద్రం లోబడి ఉండాల్సిందే.
కానీ ఎప్పటికప్పుడు కేంద్రం తన ఆధిక్యతను ప్రదర్శించుకోవటానికి ప్రయత్నిస్తూనే వస్తోంది. దాని సిఫార్సులపై నిర్ణయం తీసు కోవటంలో జాప్యం చేయటం లేదా కొన్నిటిని మాత్రమే అంగీకరించి, మరికొన్నిటిపై మౌనం పాటించటం రివాజైంది. ప్రభుత్వాలు చేసే చట్టాలు నచ్చినా నచ్చకపోయినా పౌరులందరూ పాటించి తీరాల్సిందే. వాటిని రద్దు చేయాలని పోరాడటం, ప్రభుత్వాలను ఒప్పించటం ఒక పద్ధతి. సాగుచట్టాల విషయంలో రైతాంగం చేసింది అదే. న్యాయవ్యవస్థ తీసుకునే నిర్ణయాలూ, తీర్పులూ కూడా చట్టాలతో సమానం. వాటిపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌కు వెళ్లటం ఒక్కటే మార్గం. ప్రభు త్వాలైతే కొత్త చట్టాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
వీటిని విడనాడి కొలీజియం సిఫార్సులపై సాచివేత ధోరణి అవంబించటం, ప్రశ్నిస్తే విరుచుకుపడటం సరైంది కాదు. మొన్న సెప్టెంబర్ నెలాఖరున జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పంకజ్ మిత్తల్‌ను రాజస్థాన్ హైకోర్టుకూ, ఒరిస్సా హైకోర్టు చీఫ్ జస్టిస్ మురళీధర్‌ను మద్రాస్ హైకోర్టుకూ బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేస్తే ఒక్క మిత్తల్‌ను మాత్రమే కేంద్రం బదిలీ చేసి ఊరుకుంది. జస్టిస్ మురళీధర్ విష యంలో ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేదు. అందరూ చట్టాలను గౌరవించేలా, దేశంలో చట్టబద్ధ పాలన సజావుగా సాగేలా చూడాల్సిన ప్రభుత్వాలే అందుకు విరుద్ధమైన పోకడలకు పోరాదు.
అయితే ఇరుపక్షాలూ తమ అధికారాల గురించే పట్టుబడుతున్నాయి తప్ప న్యాయమూర్తుల నియామకాలు పారదర్శకంగా ఉండేందుకు ఏం చేయాలన్న చర్చకు పోవటం లేదు. కొలీజియం వ్యవస్థ ఎలా విఫలమైందో 1993లో ఆ విధానానికి పునాది వేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ పలుమార్లు చెప్పారు. ఎవర్ని ఎందుకు నియమించారో, నియమించలేదో ఏనాడూ కొలీజియం చెప్పిన పాపాన పోలేదు. ఒకసారి నియామకం పూర్తయి, పూర్తి స్థాయి న్యాయమూర్తిగా మారాక వారు ప్రశ్నార్థకమైన తీర్పులు వెలువరించినా, వారి ప్రవర్తన ఎలా వున్నా, ఏవిధమైన ఆరోపణలొచ్చినా అదే పదవిలో కొనసాగుతున్నారు. నియామకాల్లో అణగారిన వర్గాలకూ, మహిళలకూ పెద్దగా చోటుండటం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సైతం దీన్ని అంగీకరించారు.
సుప్రీంకోర్టు కొట్టేసిన ఎన్‌జేఏసీ చట్టంలోనూ ఎన్నో లోపాలున్నాయి. కొలీజియం స్థానంలో అది రావటం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అమెరికాలో మాదిరి న్యాయమూర్తులుగా నియమించదల్చుకున్న వారి పేర్లు, వారి అర్హతలూ, ప్రత్యేకతలూ వెల్లడించటం... వారిపై సాధారణ పౌరులు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించటానికి, చర్చించ టానికి అవకాశమీయటం అవసరం. అది వచ్చేలోపు కనీసం కొలీజియం తన నిర్ణయాలకు గల కారణాలేమిటో సాధారణ పౌరులకు విశదపరచాలి. అప్పుడు కేంద్రం జాప్యం చేయటంలోని ఉచితానుచితాలను ప్రజలు నిర్ణయించుకుంటారు. అలాగే ఏ కారణంతో జాప్యం చేస్తున్నారో లేదా తిరస్కరిస్తున్నారో కేంద్రం చెప్పాలి. అంతేతప్ప వ్యవస్థల మధ్య ఎడతెగకుండా వివాదం సాగటం, చివరకు నిర్ణయరాహిత్యమే రాజ్యమేలటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రేయస్కరం కాదు.
Comments
Please login to add a commentAdd a comment