రెండు మూడు నెలలుగా పలువురు నిపుణులు, విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు సోమవారం సర్వోన్నత న్యాయస్థానం నుంచి వినబడ్డాయి. వ్యాక్సిన్‌లపై కేంద్ర ప్రభుత్వానికి అసలు జాతీయ విధానమంటూ వున్నదా అని నిలదీయటమేకాక, క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా టీకాలివ్వడానికి ఆన్‌లైన్ నమోదు పద్ధతి రూపొందించటాన్ని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్. రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం తప్పు బట్టింది. డిజిటల్ ఇండియా అంటూ పాలకులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా, ఇప్పటికీ దేశం లోని అత్యధిక ప్రాంతాలకు ఇంటర్నెట్ లేదు. ఉన్నచోట్ల కూడా అది నాసిరకంగా పనిచేస్తోంది. చాలా పల్లెసీమల్లో అసలు మొబైల్ ఫోన్‌కే సిగ్నల్ అందడం లేదు. ఇవన్నీ చాలవన్నట్టు నిరక్షరాస్యత. ఇలాంటి పరిస్థితుల్లో టీకా వేయించుకోవడానికి ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి చేయటమంటే మెజా రిటీ ప్రజలకు దాన్ని నిరాకరించటమే అవుతుంది. ఒకసారి టీకా వేయించుకున్న వ్యక్తిని రెండో టీకా కోసం గుర్తించి సమాచారం ఇవ్వటం కోసమే ఈ ఏర్పాటు చేశామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన సరికాదు. ఈ డిజిటల్ బాటలో అసలు మొదటి టీకాకు వెళ్లటమే అసాధ్యంగా మారిన పరిస్థితుల్లో రెండో టీకా కోసం ఈ ఏర్పాటు చేశామనటం ఏమేరకు హేతుబద్ధమో ఆలోచించాలి.
ఈ ఏడాది ఆఖరుకల్లా అందరికీ టీకాలు అందించగలమన్న ఆత్మవిశ్వాసం కూడా వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించదు. దేశంలో కేవలం రెండే సంస్థలు ఉత్పత్తి చేస్తుండగా, అంతర్జాతీయంగా ఫైజర్, మోడెర్నా వంటి సంస్థలు ఇప్పటికే అడ్వాన్సులిచ్చిన దేశాలకు సరఫరా చేశాకే మనలాంటి దేశాల గురించి ఆలోచించే అవకాశం వుంటుందని కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 130 కోట్లకుపైగా వున్న మన జనాభాకు ఏడాది ఆఖరుకల్లా రెండు టీకాలూ పూర్తి చేయటం ఏమేరకు ఆచరణసాధ్యమో ఆలోచించాలి. మొన్న శుక్రవారం కేంద్రం ప్రకటించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటికి 20.86 కోట్లమందికి టీకాలు అందాయి. ఇది 15 శాతం లోపే. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం మరో 1.84 కోట్ల డోసులున్నాయని కేంద్రం అంటోంది. అసలు టీకాల పంపిణీ వ్యవహారమే పెద్ద లోపభూయిష్టంగా వుంది. ఉత్పత్తికి ముందు వాటర్ బాటిల్‌తో పోల్చినా తమ టీకా ధర తక్కువగా వుంటుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన భారత్ బయోటెక్ అధినేత ఇప్పుడు అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. మాకో ధర, రాష్ట్రాలకో ధర, ప్రైవేటు ఆసు పత్రులకొక ధర అంటూ కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా నిర్ణయించటంతో ఇక్కడి టీకా ఉత్పత్తి దారులు కూడా అభిప్రాయాన్ని మార్చుకుని వుండొచ్చు. 45 ఏళ్లు పైబడినవారి కోసం కేంద్రం టీకా లను నిల్వ చేస్తుంటే 18–44 ఏళ్లమధ్యవారి కోసం రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన ధరకు టీకా తయారీదారులనుంచి సొంతంగా కొనాలి. ఏడాదిన్నరగా కరోనా పర్యవసానంగా ఆదాయం పడి పోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలకు ఇది భారమే. పైగా, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే టీకాలు సాధారణ పౌరులకు ఏమేరకు అందుబాటులో వుంటాయో అనుమానమే. ఫలానా ధరకు టీకా వేయా లని ప్రభుత్వాలు వాటిని శాసించగలవా? అధికార యంత్రాంగాలు ఎంత కఠినంగా వుంటున్నా, జరి మానాలు విధిస్తున్నా బేఖాతరు చేస్తూ రోగులనుంచి లక్షలాది రూపాయలు గుంజుతున్న ఆసు పత్రులు టీకాల కృత్రిమ కొరత సృష్టించబోవని, వాటి ధరను అమాంతం పెంచబోవని గ్యారెంటీ లేదు. పేరుకు మనది ఫెడరల్ వ్యవస్థ. కానీ అందుకు సంబంధించిన లక్షణాలు దాదాపుగా కనుమరు గయ్యాయి. ప్రస్తుతం టీకాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడంలో మాత్రమే అది కనబడుతోంది.
గతంలో మశూచి, పోలియోవంటి మహమ్మారులను ఎదుర్కొనడానికి భారీయెత్తున కేంద్రం కదలటం, రాష్ట్రాలను కూడా ఆ స్థాయిలో కదిలించటం... సమష్టిగా విజయం సాధించటం కళ్ల ముందు కనబడుతున్నా ఇంత కంగాళీ విధానాన్ని రూపొందించినవారెవరో అర్థంకాదు. పైగా టీకాల కోసం రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లటం, అక్కడ ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలకు భంగపాటు ఎదురుకావటం కనబడుతూనే వుంది. ఒక స్పష్టమైన, విజయం సాధించిన నమూనాను కళ్లముందు పెట్టుకుని కూడా దాన్ని విస్మరించటం దిగ్భ్రాంతికరం. అసలు రాష్ట్రాలు అదనంగా ఎందుకు చెల్లిం చాలో ఎవరికీ అర్థంకాని విషయం. వ్యాక్సిన్‌లు సమయానికి అందుబాటులోకి రాకపోతే ఎలాంటి పర్యవసానాలు ఏర్పడతాయో గత రెండు నెలల అనుభవాలు నిరూపించాయి. ఇప్పుడు రెండో దశ శాంతిస్తున్న జాడలు కనబడుతున్నా, లాక్‌డౌన్ వల్లనే ఇలా వుందని... మరో పదిరోజుల తర్వాత సడలించాక ఇదే స్థితి వుంటుందన్న నమ్మకం లేదని అంటున్నారు. మరోపక్క కరోనా వైరస్ మూడో దశ పొంచివున్నదని నిపుణులు చెబుతున్న మాట. కనుక మెజారిటీ ప్రజానీకం ఇప్పటికీ విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నట్టే లెక్క. నిరుడు ప్రపంచ దేశాలన్నీ ఒకే స్థితిలో వున్నాయి. కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించటానికి ఎవరివద్దా వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు టీకాలు అందుబాటు లోకొచ్చినా, మన దేశంలో సరైన విధానం కొరవడింది. ఈ దుస్థితి ప్రపంచంలో మనల్ని అప్రది ష్టపాలు చేస్తుంది. కనుక ఇప్పటికైనా కేంద్రం అందరికీ ఉచితంగా టీకాలు అందాలన్న ఏకైక లక్ష్యంతో నికరమైన విధానం రూపొందించేందుకు ప్రయత్నించాలి. ఈ విషయంలో విఫలమైతే ప్రజలు క్షమించరు.
అడగవలసిన ప్రశ్నలు
Published Tue, Jun 1 2021 12:20 AM | Last Updated on Tue, Jun 1 2021 12:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment