సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: కరోనా టీకాల ఉత్పత్తి సంస్థల నుంచి తమకు అవసరమైన మేరకు వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసే అవకాశం రాష్ట్రాలకు లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. జనాభా దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ కోటాలను కేటాయిస్తామని, ఆ మేరకు మాత్రమే రాష్టాలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఏకీకృతంగా వ్యాక్సినేషన్ (టీకా కార్యక్రమం) చేపట్టడం ద్వారానే కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కో వచ్చని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచిం చారని పేర్కొంది. ఆ మేరకు వ్యాక్సినేషన్‌ను ఏకీకృతంగా చేపట్టాలంటే టీకాలను అన్ని రాష్ట్రాలకు సమానరీతిలో అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసే వ్యాక్సిన్లపై నియంత్రణ విధించామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో ప్రమాణపత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది.
నిష్పక్షపాతం, సమానత్వం ప్రాతిపదికగా..
నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, వివక్ష చూపకుండా సమానత్వం ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రూపొందించామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మహమ్మారి హఠాత్తుగా విజృంభించడం, పరిమితంగా టీకా డోసులు అందుబాటులో ఉండటం తదితర కారణాల వల్ల ఒకేసారి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదని వివరించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారిని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టుకు కేంద్రం దాదాపు 218 పేజీలతో అఫిడవిట్ సమర్పించింది. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యులు, శాస్త్ర నిపుణులు, ఇతర ప్రముఖులతో సంప్రదింపులు జరిపి వ్యూహం రూపొందించిందని అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ అనవసర, అత్యుత్సాహ జోక్యం వల్ల అనూహ్య, అవాంఛిత పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదముందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. చదవండి: (తెలంగాణలో వ్యాక్సిన్ టెన్షన్!)
ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా పేషెంట్లు చనిపోతున్నారని, రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రభుత్వ వ్యూహం, ప్రణాళిక సరిగా లేదని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం స్పందిస్తూ తాజా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టు సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వర్చువల్ విచారణను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్‌ఎన్ రావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈలోపు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను అధ్యయనం చేస్తామని తెలిపింది. తనకు ఆదివారం రాత్రి ఈ అఫిడవిట్ అందిందని, సహచర న్యాయమూర్తులకు సోమవారం ఉదయం అందిందని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. అయితే తనకు అందేలోపే ఆ అఫిడవిట్ మీడియాలో వచ్చేసిందని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ప్రకారమే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారమే, నిపుణులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన తరువాతే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రూపొందించామని అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ స్థాయి మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాలు, టీకా ఉత్పత్తిదారులకు సుప్రీంకోర్టు సూచనలు అవసరం లేదని, ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘సదుద్దేశంతోనే అయినా.. ఈ విషయంలో అత్యుత్సాహంతో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం వల్ల అనూహ్య, అనవసర, అవాంఛిత పరిణామాలు చోటు చేసుకుంటాయి’ అని హెచ్చరించింది. నిపుణులు, పాలనానుభవం ఉన్నవారి సలహా సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదని సూచించింది. కనీవినీ ఎరగని తీవ్రస్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, పాలనాయంత్రాంగానికి సొంతంగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుత విపత్కర, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై, ప్రభుత్వ విజ్ఞతపై విశ్వాసం ఉంచాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అర్హులైన అందరికీ ఉచితంగానే టీకా ఇవ్వాలని నిర్ణయించినందున, టీకాకు ఉత్పత్తిదారులు నిర్ణయించే ధరను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. టీకా ధర ప్రభావం అంతిమ లబ్ధిదారులైన ప్రజలపై పడబోదని పేర్కొంది.
ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయవ్యవస్థ జోక్యానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చిందని, వాటిలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న సందర్భంలోనే ప్రభుత్వ నిర్ణయాలను కొట్టివేయాలనడం సహా పలు మార్గదర్శకాలను నిర్దేశించిందని కేంద్రం గుర్తు చేసింది. కరోనా టీకా, ఔషధాలను భారీగా ఉత్పత్తి చేసే విషయంలో ముడి పదార్ధాల లభ్యతే ప్రధాన అవరోధమని, అందువల్ల అదనపు వాణిజ్య అనుమతులు, లైసెన్సులు ఇవ్వడం వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొంది. ఉత్పత్తిని పెంచేలా చూడడం, దిగుమతులను పెంచడం ద్వారా యాంటీవైరల్ డ్రగ్ ‘రెమ్‌డెసివిర్’ లభ్యత పెంచడానికి కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. టీకాలకు, ఔషధాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్న సమయంలో సమస్యను దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వివరించింది. దేశ ప్రయోజనాల కోసం ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే విస్తృత స్థాయిలో చేపట్టిందని వెల్లడించింది. కోవిడ్ 19 రోగులకు ఆక్సిజన్, ఔషధాల లభ్యత, కోవిడ్ 19 ప్రొటోకాల్ సమీక్ష, రాష్ట్రాలకు ఆక్సిజన్ సప్‌లై, బఫర్ స్టాక్ ఏర్పాటు.. తదితర అంశాలపై సుప్రీంకోర్టు కేంద్రానికి ఇటీవల పలు ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: (తెలంగాణలో లాక్‌డౌన్?.. 15వ తేదీ నుంచి అమల్లోకి..!)
ఆస్పత్రుల్లో చేర్చుకోవాల్సిందే
సరైన గుర్తింపు కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్ట్, ఇతర పత్రాలు లేవంటూ పేషెంట్లను చేర్చుకోవడానికి నిరాకరించవద్దని, వారిని ఆసుపత్రిలో చేర్చుకుని వెంటనే చికిత్స అందించాలని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆదేశించామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోవిడ్ 19 అనుమానిత/నిర్ధారిత పేషెంట్ల చికిత్స విషయంలో అనుసరించాల్సిన మూడంచెల విధానానికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు పంపించిందని తెలిపింది. కరోనా పేషెంట్లను లక్షణాల తీవ్రత ఆధారంగా కోవిడ్ కేర్ సెంటర్లు(సీసీసీ), డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్లు(డీసీహెచ్‌సీ), డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్‌లో చికిత్స అందించాలని సూచించామని పేర్కొంది.
ఇంటింటికి వ్యాక్సినేషన్ కుదరదు
కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ఇంటింటికి ప్రత్యేకంగా అందించడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే గుర్తించేందుకు ప్రతీ ఇంట్లో అరగంట పాటు వ్యాక్సిన్ సిబ్బంది ఉండడం ఆచరణ సాధ్యం కాదని పేర్కొంది. ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకున్న, అర్హత కలిగిన, నిర్ధారిత ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల్లోనే టీకా ఇవ్వడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఆయా కేంద్రాల్లో అవసరమైన స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు, వ్యాక్సినేటర్లు, సిబ్బంది, వైద్య సదుపాయాలు ఉండాలని పేర్కొంది. లబ్ధిదారులు ‘కోవిన్’ ద్వారా తమ దగ్గర్లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను గుర్తించి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
టీకాల కోసం గ్రాంట్ ఇవ్వలేదు
కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల పరిశోధన, అభివృద్ధి కోసం ఆయా సంస్థలకు ప్రభుత్వం ఎలాంటి గ్రాంట్, ఎయిడ్ ఇవ్వలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం కొంత మొత్తం ఇచ్చామని వెల్లడించింది. కోవ్యాగ్జిన్‌ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేశాయని తెలిపింది.
ఏపీకి ఈ నెల కోటా 13,35,630 డోసులు..
మే నెల కోసం కేంద్రం సేకరించిన వ్యాక్సిన్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 6,90,360 కోవిషీల్డ్, 2,27,490 కోవాగ్జిన్ మొత్తం 9,17,850 డోసులను కేటాయించాం. రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేందుకు మే నెలలో అందుబాటులో ఉన్న రెండు కోట్ల (1.50 కోట్లు కోవిషీల్డ్, 50లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు) వ్యాక్సిన్ డోసుల్లో జనాభా దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్ 13,35,630 డోసులను కొనుగోలు చేయడానికి కేటాయించాం. ఇందులో కోవిషీల్డ్ వ్యాక్జిన్ డోసులు 9,91,700, కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు 3,43,930 ఉన్నాయి.
అఫిడవిట్ 16వ పేరాలో కేంద్రం సుప్రీంకోర్టుకు ఏం చెప్పిందంటే...
►వ్యాక్సినేషన్ విధానం ప్రకారం రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు కలిపి ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో కంపెనీలు యాభై శాతం ఇవ్వాలి
►వీటిని ఎంత ధరకు అమ్ముతారన్నదానిపై కంపెనీలు ముందుగానే ప్రకటించాలి.
►కేంద్ర ప్రభుత్వానికి ఎంతకు అమ్మాలన్న దానిపై ఇదివరకే ధర నిర్ణయించాం.
►ఒక నెలలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ల ఆధారంగా తమ వద్ద ఎన్ని నిల్వలు ఉంటాయన్న దానిపై కంపెనీలు అంచనాలు ఇవ్వాలి.
►ఈమేరకు ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్లను కేటాయించాల్సి ఉంటుంది.
►18 నుంచి 44 సంవత్సరాల్లోపు జనాభా ఆధారంగా ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ల కేటాయింపులు జరుగుతాయి.
►రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే వ్యాక్సిన్ల విషయంలో కూడా వ్యాక్సిన్ తయారీదారులు కేంద్రంతో సంప్రదించి ఆమేరకు కోటా కేటాయించి, పంపిణీ చేస్తారు.
►వ్యాక్సిన్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు లేకుండా, బేరసారాలు చేసే శక్తి, సామర్థ్యాలు ఉన్న రాష్ట్రాలకు ఒకలా, మిగిలిన మరో రాష్ట్రాలకు మరోలా ఉండే అవకాశం లేకుండా ఈ కేటాయింపులు చేస్తారు.
►మే నెలకు సంబంధించి ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్న దానిపై రాష్ట్రాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా సమాచారం ఇచ్చింది.
►వ్యాక్సినేషన్‌లో నిర్ణయించుకున్న పద్ధతిని, విధానాన్ని రాష్ట్రాలు తు.చ. తప్పకుండా పాటించాలి.
►టీకాల కోసం అధికంగా డిమాండ్ చేసే ఒకటి రెండు రాష్ట్రాల కారణంగా మిగతావి నష్టపోకుండా దేశం అంతా ఒక యూనిట్ ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌లో అందరికీ సమాన ప్రాధాన్యతకోసం ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment