ఆలస్యమైనా ఓ మంచి నిర్ణయమే జరిగింది. కరోనా మహమ్మారిపై యుద్ధ్దంలో టీకా (వ్యాక్సిన్)యే బ్రహ్మాస్త్రం అని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన ప్రధాని మోదీ సదరు అస్త్రాలు సమకూర్చే బాధ్యతను పూర్తిగా భుజాలకెత్తుకున్నారు. ఇకపై కేంద్రీకృతంగా టీకామందు పంపిణీ జరుగుతుందని, అదీ ఉచితమని ప్రకటించడం హర్షించదగిన నిర్ణయం. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ టీకా ప్రాధాన్యత మరోమారు నొక్కి చెప్పిన ప్రధాని, టీకామందు విధాన మార్పిడిని ప్రకటించారు. 75 శాతం టీకామందును ఇక కేంద్రమే సేకరించి, ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని, ప్రయివేటు రంగంలో కొనుగోళ్లకు 25 శాతం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రయివేటు ఆస్పత్రులు కూడా రూ.150 మించని సర్వీసుచార్జీలతో టీకాలు వేయాలన్నారు. టీకామందు ఉత్పత్తి, పంపిణీ ఇక జోరందుకుంటాయనీ ప్రకటించారు. ఎవరు చెబితేనేం? ఎందుకు మనసు మార్చుకుంటేనేం? అంతిమంగా జరిగింది మాత్రం మంచి నిర్ణయమని సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆపత్కాలంలో టీకా వంటి కీలకాంశాన్ని రాజకీయం చేయడం సరికాదని ఈ సందర్భంగా రాజకీయ ప్రత్యర్థులను ప్రధాని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ అనుసరించిన టీకామందు విధానం సరికాదని కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పక్షాల నేతలు కొంత కాలంగా విమర్శిస్తున్నారు. టీకామందు లభించక దేశంలో సదరు ప్రక్రియ మందగించడానికి కేంద్రమే కారణమన్నది వారి ఆరోపణ. ఒక దశలో సుప్రీంకోర్టు కూడా టీకా విధానాన్ని, టీకా వేర్వేరు ధరల పద్ధతినీ తప్పుబట్టింది. కేంద్రీకృత టీకా విధానమే మంచిదని ప్రముఖ వైద్య విజ్ఞాన పత్రిక ‘లాన్సెట్’ (లండన్) సూచించింది. ప్రాధాన్యతలను బట్టి విడతలుగా ముందువరుస కోవిడ్ పోరాట యోధులు, తర్వాత వృద్ధులు, ఆపైన 45 ఏళ్లకు పైబడ్డవారు ఇలా... సజావుగా ప్రక్రియ నిర్వహించడానికి సరిపడే టీకామందు లభించక రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. ఫలానా తేదీ నుంచి 18 ఏళ్ల వయసు పైబడ్డవారందరికీ టీకా అని ప్రకటించినా ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితి! ఆ తరుణంలో ప్రయివేటులోకి టీకామందు పంపిణీని ఏపీతో సహా పలు రాష్ట్రాలు తప్పుబట్టాయి. పౌరులందరికీ ఉచితంగా టీకా వేసే రాష్ట్ర ప్రభుత్వాలకు దొరకని స్థితిలో...‘మేం పది రోజుల్లో, మా ఆరు కేంద్రాల నుంచి పదిలక్షల టీకాలు వేశాం, ఇకపై ప్రతివారం పది లక్షల టీకాలు వేసే ప్రణాళిక మాది’ అని ఓ కార్పొరేట్ వైద్య సంస్థ చేసిన ప్రకటన పుండు మీద కారం వంటిదే! ఏ రాష్ట్రానికి ఎంత టీకామందు కోటానో కూడా కేంద్రమే నిర్ణయించి, తక్కువ ధరకు తాను పొంది రాష్ట్రాలకు అధిక ధర అన్నప్పటికీ కొనుగోళ్లకు అవి సిద్ధపడ్డాయి. కోరిన మేర టీకాల లభ్యత లేక, తాము గ్లోబల్ టెండర్లకు వెళతామని పలు రాష్ట్రాలు యత్నించి విఫలమయ్యాయి. కేంద్రంతోనే తప్ప తాము రాష్ట్రాలతో వ్యవహరించలేమని ఆయా అంతర్జాతీయ టీకా ఉత్పత్తి సంస్థలు స్పష్టం చేయడంతో అదీ కుంటుబడింది. ఇప్పుడిప్పుడు ఓ రెండు రాష్ట్రాలకు స్పుత్నిక్–వి టీకామందు దొరికే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఊరట!
కేంద్రీకృత ఉచిత టీకా విధానం ఆరంభం నుంచీ అమలై ఉంటే మంచి ఫలితాలుండేవి. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశంలో ఇదే విధానం అమలయింది. టీకా మందును తానే సమీకరించుకొని, రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ‘సార్వత్రిక టీకా కార్యక్రమం’ కేంద్రం చేపట్టేది. క్షేత్రస్థాయిలో టీకాప్రక్రియను రాష్ట్రాలు అమలు చేసేవి. ఎప్పటికప్పుడు ఆధునిక శాస్త్ర–సాంకేతికతను జోడిస్తూ ప్రక్రియను ఉభయులూ విజయవంతం చేసేది. కానీ, ఈసారి దేశీయంగా తగిన ఉత్పత్తి లేక, టీకామందును రాష్ట్రాలే సమకూర్చుకోవాలంటూ కేంద్రం విధానాన్ని మార్చడంతో సమస్య తలెత్తింది. ఫలితంగా జరిగిన జాప్యానికి దేశం పెద్దమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్–19 రెండో అల విజృంభణతో తీరని నష్టం జరిగింది. ఏప్రిల్, మే నెలల్లో దేశంలో పెద్ద సంఖ్యలో కోవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా సకాలంలో టీకా ప్రక్రియ వేగం పుంజుకొని ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నిపుణులూ అభిప్రాయపడ్డారు. స్పష్టమైన విధానం కొరవడి, ఉత్పత్తి లేక, పంపిణీ వైఫల్యాలతో తీరని జాప్యం జరిగింది. దేశంలో ఇచ్చిన టీకా డోసుల సంఖ్య ఇప్పటికీ పాతిక కోట్లు దాటలేదు. రెండు డోసులు టీకా వేసుకున్నవారు ఆరు కోట్లకు మించరు. వారు చాలా వరకు సురక్షితంగా ఉన్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవీషీల్డ్, కోవాక్సిన్ రక్షణ 95 శాతంగా ఉంది. రెండు డోసులు తీసుకున్న వారికి వైరస్ సోకినా, వ్యాధి తీవ్రత ప్రమాదకర స్థాయికి వెళ్లటం లేదు. మరణాల రేటు 0.004 కన్నా తక్కువే! ఛండీగఢ్‌కి చెందిన ఒక వైద్యపరిశోధన సంస్థ (పీజీఐఎంఎస్‌ఆర్) అధ్యయనం ప్రకారం, రెండు డోసులు వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేటు 1.6 శాతమని తేలింది. తాజా నిర్ణయంతోనైనా దేశంలో టీకా ప్రక్రియ వేగం పెరగాలి. అది సజావుగా, సమర్థంగా జరిగేట్టు చూడాలి. ఉత్పత్తి రమారమి పెంచాలి. పంపిణీ వ్యవస్థల్ని మెరుగుపరచాలి. ప్రభుత్వ వైద్యారోగ్య కేంద్రాల వద్ద టీకా ప్రక్రియ నిరంతరం జరిగేట్టు చూడాలి. ప్రైవేటులోకి టీకా విచ్ఛలవిడిగా రాకుండా, కేంద్రం విధించిన సర్వీసు చార్జీ పరిమితి మించకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన నిఘా ఉంచాలి. టీకాస్త్రం పదునెక్కాలి. కోవిడ్‌పై యుద్దం గెలవాలి.
Comments
Please login to add a commentAdd a comment