మారుతున్న కాలానికీ, అవసరాలకూ తగ్గట్టు అన్నీ మారాల్సిందే. ఆ దృష్టితో చూసినప్పుడు బ్రిటిషు కాలపు పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర సంబంధ చట్టాలను తీసుకురావడం అభిలషణీయమే. అయితే, ప్రతిపక్షాలకు చెందిన 140 మందికి పైగా సభ్యులను వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన అనంతరం పెద్దగా చర్చ లేకుండానే గత వారం పార్లమెంట్ ఈ కొత్త చట్టాలను ఆమోదించడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. ఎవరేమన్నా కొత్త చట్టాలకు భారత రాష్ట్రపతి ఈ సోమవారం ఆమోదముద్ర వేయడంతో ఒక తతంగం ముగిసింది.
కేంద్ర హోమ్ శాఖ ప్రభుత్వ రాజపత్రంలో నోటిఫై కూడా చేయడంతో, ఇక ఈ సరికొత్త నేర శిక్షాస్మతులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. వెరసి, బ్రిటీషు కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872’ స్థానంలో కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య చట్టం’ ప్రవేశించాయి. తెచ్చిన మార్పులేమిటి, వీటి ప్రభావం ఎలాంటిదన్నదే ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో వివిధ వర్గాలలో చర్చగా మారింది.
భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారతీయ పార్లమెంట్ తెచ్చిన చట్టాలంటూ హోమ్ మంత్రి ప్రకటించారు. బ్రిటిషు వలసవాద అవశేషాలను తొలగించే చర్యగా అధికార పక్షం వీటిని అభివర్ణించింది. అయితే, పేరుకు ఇవి కొత్త క్రిమినల్ చట్టాలే కానీ, బ్రిటిషు కాలపు పాత చట్టాలలోని భాష, అంశాలే ఎక్కువగా వీటిలో ఉన్నాయని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాత చట్టాల్లోని సెక్షన్లనే వరుస మార్చడం తప్ప ఈ కొత్త వాటిల్లో చేసినది తక్కువనే విమర్శలూ ఉన్నాయి.
అంతే కాక, అరెస్టు, పోలీస్ కస్టడీలకు సంబంధించి కొత్త చట్టాల్లోని అంశాల పట్ల అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాల ఫలితంగా కస్టడీని 60 నుంచి 90 రోజుల దాకా పొడిగించే వీలుండడం లాంటివి అందుకు కారణం. ఇలాంటి అంశాలు పౌరహక్కులకు భంగకరంగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజానికి, కొత్త చట్టాలు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలన తర్వాతే సభ ముందుకొచ్చాయి. అయితే, శతకోటి భారతీయుల జీవితాలను శాసించే చట్టాలు గనక వీటిపై సభ క్షుణ్ణంగా చర్చించడం విధాయకం. అది లేకుండానే అవి చట్టం కావడం విషాదం.
అలాగని ఈ చట్టాల్లో అసలంటూ ఆహ్వానించదగినవి ఏమీ లేవనలేం. వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తుందనే మిషతో వ్యభిచారాన్ని మళ్ళీ శిక్షార్హంగా మార్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసినా, ప్రభుత్వం అందుకు తలూపలేదు. లింగమనే నిర్వచనంలో ట్రాన్స్‌జెండర్లను కూడా చేర్చడమూ మంచి నిర్ణయమే. మూకదాడి హత్యలను మరణశిక్షకు అర్హమైనవిగా చేర్చడమూ మంచి పనే. అయితే, 2017 తర్వాత మూకదాడి హత్యల డేటాను క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించడం మానేసింది.
అలాంటి దాడుల లెక్కలే లేకుండా కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రయోజనం ఏమిట నేది సందేహం. ఇక, రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. వాస్తవంలో పేరు మార్చారే తప్ప, అది మరింత కర్కశంగా మారిందని నిపుణుల ఆందోళన. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించినట్టు భావిస్తే చాలు, సెక్షన్ 150 కింద యావజ్జీవ కారాగారవాస శిక్ష వేసే వీలుండడం భయపెడుతోంది.
కొత్త చట్టాల్లో అసలు సిసలు మార్పులు కేవలం 20 శాతమేనని ఒక అంచనా. అదే గనక నిజమైతే, ఈ మొత్తం ప్రక్రియ ప్రచారానికే తప్ప, ప్రయోజనకరం అనిపించుకోదు. అలాగే, ప్రభుత్వానికీ, పోలీసులకూ మరిన్ని అధికారాలు కట్టబెడుతున్న ఈ చట్టాల్లో జవాబుదారీతనం ఆ మేరకు కనిపించట్లేదు. ప్రజాస్వామ్యంలో అది సమర్థనీయం కాదు. వలసవాద చట్టాల్లో లాగానే ఇప్పుడూ ఉంటే జనాన్ని ఏమార్చడమే తప్ప ఏం మార్చినట్టు అన్నది ప్రశ్న. క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలంటే ఆశించేది ఇది కాదు.
నిజానికి, సమాజంలోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తున్నవేళ... నేర చట్టాలను సవరించడం, నవీకరించడం చట్టబద్ధ పాలన అందించే ఏ దేశానికైనా తప్పనిసరి. అయితే, ఆ మార్పులు నిర్దేశిత సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చడం కీలకం. అలాగే, ఆ సవరించిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టుండడం అత్యవసరం. 150 ఏళ్ళ పాత వలసవాద చట్టాలను వదిలించుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఆపాటి ఆశలు, చర్చ ముఖ్యమైనవి. కానీ, వాస్తవంలో కొత్త చట్టాలు అలా లేవంటే నిరాశ మిగులుతుంది.
చట్టాల్లో అవసరమైన అనేక ప్రాథమిక సవరణలు చేసే చరిత్రాత్మక అవకాశం చేజారిపోయింది. ఐపీసీ స్థానంలో తెచ్చిన బీఎన్‌ఎస్ లాంటివి శిక్షలతో భయపెట్టేదిగా కాక, సంస్కరించేదిగా ఉండాలి. 1975 నుంచి 2013 మధ్యకాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 33 ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత పాలకులు కొత్త పేర్లతో తమవిగా చెప్పుకుంటున్నారనీ, కొత్త పేర్లతో కొత్త నేర చట్టాలు కూడా ఆ కోవలోవే అనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిందారోపణల మాటెలా ఉన్నా, ఇప్పటికీ మించి పోయింది లేదు.
ప్రతిపక్షాలు, పౌరసమాజం తాలూకు భయాందోళలను పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అన్ని వర్గాల అనుమానాలనూ నివృత్తి చేయాలి. చట్టాలు తేవడంలో లేకున్నా, కనీసం అమలులోనైనా సర్వజనామోద వైఖరి శోభనిస్తుంది. అవసరమైతే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు సరికొత్త చట్టాల్లోనూ ఎప్పటికప్పుడు సవరణలు చేయాల్సిందే. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మూలమే అది. ఒక్కమాటలో... కొత్త చట్టాలతో దేశంలోని 17.5 వేల పోలీస్ స్టేషన్లు బలోపేత మవడం సరే కానీ, 140 కోట్ల జనాభా నిస్సహాయులుగా మారిపోతేనే కష్టం.
పాత మూస... కొత్త చట్టం
Published Wed, Dec 27 2023 12:02 AM | Last Updated on Wed, Dec 27 2023 3:54 AM
Comments
Please login to add a commentAdd a comment