central Home department
-
ఢిల్లీ ఎల్జీకి ఫుల్ పవర్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు, కమిషన్, అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలనైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది. అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులను కూడా ఇకపై ఎల్జీయే నియమించవచ్చు. ఈ మేరకు ఆర్టికల్ 239, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం–1991 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి వద్ద ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ప్రతిష్టాత్మకమైన అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మోదీ సర్కారు ఈ చర్యకు దిగడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి పదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండటం తెలిసిందే. ఢిల్లీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు తరచూ కోర్టుల దాకా వెళ్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు ఆప్‌కు అనుకూలంగా వచ్చినా చట్ట సవరణల ద్వారా కేంద్రం వాటిని పూర్వపక్షం చేస్తూ వస్తోంది. -
వరద నష్టంపై వివరాలివ్వరా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో భారీవర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టానికి సంబంధించిన వివరాలు అందజేయకపోవడంపై కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రోజువారీ పరిస్థితిపై నివేదిక పంపేలా రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఎస్ఈఓసీ)లోని అధికారులను ఆదేశించాలని సీఎస్ శాంతికుమారికి కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు తాజాగా సీఎస్‌కు కేంద్ర హోంశాఖలోని విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్‌గవాయ్ లేఖ రాశారు. ఎస్ఈఓసీ నుంచి అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎస్ఈఓసీ నుంచి టెలిఫోన్ ద్వారా ఇటీవల కేంద్ర హోంశాఖకు అందిన సమాచారం ప్రకారం.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రొటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా వరదలకు సంబంధించి తాజా నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పడవలు, రక్షించే పరికరాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 7 బృందాలను మోహరించిందన్నారు. వీటితోపాటు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం వాయుసేనకు చెందిన 2 హెలికాప్టర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది.నిధులివ్వాలంటే నివేదిక పంపాలి...» 2024–25 సంవత్సరానికిగాను రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ నిర్వహణ కోసం రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి రూ.1345.15 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర వాటాను విడుదల చేసేందుకు అవసరమైన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. » 2022–23 సంవత్సరానికిగాను ఎస్డీఆర్ఎఫ్కు చెందిన 2వ విడత కేంద్ర వాటా కింద రూ.188.80 కోట్లు.. 2023 జూలై 10న తెలంగాణకు విడుదలయ్యాయని కేంద్రం తెలిపింది. 2023–24కు సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా రెండు వాయిదాలను ఒక్కొక్కటి రూ.198 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 13న, మార్చి 28న విడుదల చేశామని చెప్పింది. » 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత మొత్తం రూ.208.40 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ 1 తర్వాత ఈ రూ.208.40 కోట్లు విడు దల కావాల్సి ఉన్నా, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యర్థన చేయలేదని లేదా ముందుగా విడుదల చేసిన నిధులు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ మొదలైన వాటి జమకు సంబంధించిన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అందువల్ల ఎస్డీఆర్ఎఫ్ నిధుల విడుదల కోసం నిర్ణీత ప్రొఫార్మాలో అవసరమైన సమాచారం/యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆ తర్వాతే 2024–25కు సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కేంద్ర వాటా మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. -
తెలంగాణ సీఎస్‌పై కేంద్రం సీరియస్
సాక్షి, ఢిల్లీ: కొద్ది రోజులుగా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయి, ఇంట్లోకి నీరు చేరడంతో బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పంటలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరద నష్టం వివరాలు రాష్ట్రం పంపించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని హోం శాఖ సూచించింది. రూ.1,345 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, వరదల సందర్భంగా సాయం కోసం ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు లేఖలో పేర్కొంది.ఇక, ఎస్డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్‌లో రూ.208కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫిటెక్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపించాలని లేఖలో పేర్కొంది. -
ఐపీఎస్‌లను వెంటనే డెప్యుటేషన్‌పై పంపండి
సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రాలు డెప్యుటేషన్‌పై ఐపీఎస్ అధికారులను పంపకపోవడంపై కేంద్ర హోం శాఖ అసహనం వ్యక్తం చేసింది. ‘ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపండి. ఇప్పటికే ఓసారి చెప్పాం. అయినా పంపడంలేదు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే కోటా మేరకు ఐపీఎస్ అధికారులను పంపించడి’ అని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శు (సీఎస్)లకు లేఖలు రాసింది. కేంద్ర హోం శాఖ ఈ విధంగా రాష్ట్రాలకు లేఖ రాయడం ఈ ఏడాది ఇది రెండోసారి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర భద్రతా విభాగాల్లో రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులనే డెప్యుటేషన్‌పై నియమిస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి నిర్దేశించిన కోటా ప్రకారం ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై కొంతకాలం కేంద్ర సర్వీసులకు పంపాల్సి ఉంటుంది. డెప్యుటేషన్ ముగిసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరిన అధికారుల స్థానంలో మరికొందరిని పంపాలి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోటా మేరకు ఐపీఎస్‌లను కేంద్ర సర్వీసులకు పంపడంలేదు. దీనిపై కొన్ని నెలల క్రితం కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయినా హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐపీఎస్ అధికారులను పంపించలేదు. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలని ఇటీవల మరో లేఖ రాసింది.దాదాపు 250 పోస్టులు ఖాళీరాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 3 నాటికి ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల పోస్టులు 250 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక డీజీ, అదనపు డీజీ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎస్పీస్థాయిలో 129 పోస్టులు, డీఐజీ స్థాయిలో 81 పోస్టులు, ఐజీ స్థాయిలో 25 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.దర్యాప్తులో జాప్యం.. దేశ భద్రత విధుల్లో ఇబ్బందులుకేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో ఇంత భారీగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సీబీఐ, ఎన్ఐఏలపై ఇప్పటికే పనిభారం విపరీతంగా పెరిగింది. కీలక కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. బీఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అధికారుల కొరతతో సరిహద్దుల్లో భద్రత విధుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఆర్పీఎఫ్లో అధికారుల కొరత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపింది. విభాగాల వారీగా ఖాళీలు» కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డీఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడంలేదు. రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్, 8 అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.» కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో 73 ఎస్పీ స్థాయి పోస్టులకుగాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి» ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో 36 ఎస్పీ స్థాయి పోస్టులలో 13 భర్తీ చేయాల్సి ఉంది.» కేంద్ర నిఘా విభాగం (ఐబీ)లో 83 ఎస్పీ పోస్టుల్లో 50 ఖాళీగా ఉన్నాయి.» భారత్–చైనా సరిహద్దుల్లో భద్రత విధులు నిర్వర్తించే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగంలో 11 డీఐజీ పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. » సరిహద్దు భద్రతా విభాగం (బీఎస్ఎఫ్) లో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డీఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులకుగాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.» కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్)లో 7 డీఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. -
బాబు పాలన గంజాయి ఖజానా
చంద్రబాబు అక్రమాలను కడుపులో పెట్టుకుని దాచుకోవడంలో రామోజీ సిద్ధహస్తుడు. బాబు ఓటమి రామోజీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే...ఆ మనోవేదనలో చిత్తచాంచల్యపు రాతలతో జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తూ టీడీపీ నేతలే సాగించినా, ఆ సమయంలో ఏ రోజునా ఈ అక్రమాల గురించి రామోజీ రాయలేదు. నర్సీపట్నం కేంద్రంగా బాబుకు సన్నిహితులైన టీడీపీ నేతలు బరితెగించి, అంతర్ రాష్ట్ర సిండికేట్ నడిపారు. బాబు హయాంలో అక్రమాలను రాయడానికి రామోజీ లేని చత్వారాన్ని, బధిరత్వాన్ని అరువు తెచ్చుకుని, పెన్ను మూసుక్కూర్చున్నారు...వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి దందాలపై ఉక్కు పాదం మోపుతోంది. అన్ని మార్గాల్లోనూ గంజాయి దందాలకు చెక్ పెట్టి, దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిరంతరం దాడులు చేస్తుంటే ఆ నేరనిరోధ చర్యలు రామోజీకి నచ్చడం లేదు... పనిలో పనిగా గంజాయి సాగును అరికట్టే క్రమంలో సంస్కరణలు సైతం చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన్ కింద గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఆపరేషన్ నవోదయం పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా సంస్కరణలనే ఆయుధంగా చేసుకుని, గిరిజన జీవితాల్లో వెలుగురేఖలు నింపుతోంది. సాక్షి, అమరావతి: రాబోయే ఎన్నికల్లో టీడీపికి మరోసారి ఓటమి ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటవంటి భవంతిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చపిచ్చగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. ఏదో విధంగా రోజూ ఈనాడు పత్రిక నిండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయందే రామోజీకి తిన్న ఆ కాస్త ముద్ద అరిగేలా అనిపించడం లేదు. ఆ పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. చంద్రబాబు హయాంలో విశృంఖలంగా నడిచిన గంజాయి మాఫియాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును ధ్వంసం చేసిన ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం కావడాన్నీ గుర్తించారు. మీ ఒక్కరే వీటిని గుర్తించనట్లు నటిస్తున్నారు రామోజీ... మీ నిద్రలేమి సమస్యకు... కడుపు మంటకు ఏదైనా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది.... కట్టుకథలతో ఈనాడు పత్రికను నింపేస్తే చిరిగేది మీ చాటేనని చెప్పేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్... చంద్రబాబు హయాంలోనే గంజాయి మాఫియా... చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ... 2014లో విభజన అనంతరం 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్చగా సాగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గంజాయి దందాకు ఏపీ కేంద్ర బిందువుగా మారింది. అంటే అదంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా అంతర్రాష్ట్రస్థాయిలో గంజాయి సిండికేట్‌ను నిర్వహించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అండతో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేయించారు. 2014 తరువాత అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా నియమితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువే ఈ దందాకు సూత్రధారిగా వ్యవహరించారు. గంజాయి సాగు కోసం విశాఖ ఏజెన్సీలో ఓ వ్యవస్థను సృష్టించారు. సాగును ధ్వంసం చేస్తే గిరిజనులు మావోయిస్టులకు సన్నిహితమయ్యే ప్రమాదముందని ఓ కట్టుకథను అధికారికంగా తెరపైకి తెచ్చారు. ఆ సాకుతో సాగును చూసీచూడనట్టు వదిలేయాలని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విధాన నిర్ణయం తీసుకుంది. ఇదే అదనుగా టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోయింది. వేలాది ఎకరాల్లో దర్జాగా సాగు చేస్తూ... నర్సీపట్నం గుండా అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, ఇటు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా స్మగ్లింగ్ చేస్తూ బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా ద్వారా చంద్రబాబు కోటరీ వేల కోట్ల రూపాయలు ఆర్జించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే నవోదయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గంజాయి సాగును ధ్వంసం చేయడం. రాష్ట్రంలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన గంజాయి సాగును అడ్డుకోలేమని పలువురు అభిప్రాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అన్నారు. యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్న ఈ మత్తు పంటను తుదముట్టించాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని రెండు దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అందుకోసం గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారి సహకారం తీసుకోవడం వ్యూహాత్మకంగా సత్ఫలితాలనిచ్చింది. గంజాయి సాగు వల్ల అనర్థాల గురించి ప్రభుత్వం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంత్రాన్ని జియో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు లేనేలేదు. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగును నిర్మూలించినప్పటికీ సరిహద్దు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు కొనసాగుతోంది. ఆ రాష్ట్రాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతున్న అక్రమ రవాణానూ అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాదీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’కు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసింది. -
ఇప్పటికైనా గ్రహిస్తారా?!
సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి. చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు. అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది. 2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్ఎస్ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి. ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్ఎస్లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది. పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్ఎస్ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్ఎస్లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది. అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం. -
పాత మూస... కొత్త చట్టం
మారుతున్న కాలానికీ, అవసరాలకూ తగ్గట్టు అన్నీ మారాల్సిందే. ఆ దృష్టితో చూసినప్పుడు బ్రిటిషు కాలపు పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర సంబంధ చట్టాలను తీసుకురావడం అభిలషణీయమే. అయితే, ప్రతిపక్షాలకు చెందిన 140 మందికి పైగా సభ్యులను వివిధ కారణాలతో సస్పెండ్ చేసిన అనంతరం పెద్దగా చర్చ లేకుండానే గత వారం పార్లమెంట్ ఈ కొత్త చట్టాలను ఆమోదించడంపై సహజంగానే విమర్శలు వచ్చాయి. ఎవరేమన్నా కొత్త చట్టాలకు భారత రాష్ట్రపతి ఈ సోమవారం ఆమోదముద్ర వేయడంతో ఒక తతంగం ముగిసింది. కేంద్ర హోమ్ శాఖ ప్రభుత్వ రాజపత్రంలో నోటిఫై కూడా చేయడంతో, ఇక ఈ సరికొత్త నేర శిక్షాస్మతులు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో ప్రకటించడమే లాంఛనంగా మిగిలింది. వెరసి, బ్రిటీషు కాలం నాటి ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872’ స్థానంలో కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య చట్టం’ ప్రవేశించాయి. తెచ్చిన మార్పులేమిటి, వీటి ప్రభావం ఎలాంటిదన్నదే ఇప్పుడిక ప్రజాక్షేత్రంలో వివిధ వర్గాలలో చర్చగా మారింది. భారతీయుల కొరకు, భారతీయుల చేత, భారతీయ పార్లమెంట్ తెచ్చిన చట్టాలంటూ హోమ్ మంత్రి ప్రకటించారు. బ్రిటిషు వలసవాద అవశేషాలను తొలగించే చర్యగా అధికార పక్షం వీటిని అభివర్ణించింది. అయితే, పేరుకు ఇవి కొత్త క్రిమినల్ చట్టాలే కానీ, బ్రిటిషు కాలపు పాత చట్టాలలోని భాష, అంశాలే ఎక్కువగా వీటిలో ఉన్నాయని నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాత చట్టాల్లోని సెక్షన్లనే వరుస మార్చడం తప్ప ఈ కొత్త వాటిల్లో చేసినది తక్కువనే విమర్శలూ ఉన్నాయి. అంతే కాక, అరెస్టు, పోలీస్ కస్టడీలకు సంబంధించి కొత్త చట్టాల్లోని అంశాల పట్ల అభ్యంతరాలూ వినిపిస్తున్నాయి. కొత్త చట్టాల ఫలితంగా కస్టడీని 60 నుంచి 90 రోజుల దాకా పొడిగించే వీలుండడం లాంటివి అందుకు కారణం. ఇలాంటి అంశాలు పౌరహక్కులకు భంగకరంగా పరిణమించే ప్రమాదం ఉంది. నిజానికి, కొత్త చట్టాలు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలన తర్వాతే సభ ముందుకొచ్చాయి. అయితే, శతకోటి భారతీయుల జీవితాలను శాసించే చట్టాలు గనక వీటిపై సభ క్షుణ్ణంగా చర్చించడం విధాయకం. అది లేకుండానే అవి చట్టం కావడం విషాదం. అలాగని ఈ చట్టాల్లో అసలంటూ ఆహ్వానించదగినవి ఏమీ లేవనలేం. వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తుందనే మిషతో వ్యభిచారాన్ని మళ్ళీ శిక్షార్హంగా మార్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసినా, ప్రభుత్వం అందుకు తలూపలేదు. లింగమనే నిర్వచనంలో ట్రాన్స్జెండర్లను కూడా చేర్చడమూ మంచి నిర్ణయమే. మూకదాడి హత్యలను మరణశిక్షకు అర్హమైనవిగా చేర్చడమూ మంచి పనే. అయితే, 2017 తర్వాత మూకదాడి హత్యల డేటాను క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించడం మానేసింది. అలాంటి దాడుల లెక్కలే లేకుండా కొత్త చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? ప్రయోజనం ఏమిట నేది సందేహం. ఇక, రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. వాస్తవంలో పేరు మార్చారే తప్ప, అది మరింత కర్కశంగా మారిందని నిపుణుల ఆందోళన. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తించినట్టు భావిస్తే చాలు, సెక్షన్ 150 కింద యావజ్జీవ కారాగారవాస శిక్ష వేసే వీలుండడం భయపెడుతోంది. కొత్త చట్టాల్లో అసలు సిసలు మార్పులు కేవలం 20 శాతమేనని ఒక అంచనా. అదే గనక నిజమైతే, ఈ మొత్తం ప్రక్రియ ప్రచారానికే తప్ప, ప్రయోజనకరం అనిపించుకోదు. అలాగే, ప్రభుత్వానికీ, పోలీసులకూ మరిన్ని అధికారాలు కట్టబెడుతున్న ఈ చట్టాల్లో జవాబుదారీతనం ఆ మేరకు కనిపించట్లేదు. ప్రజాస్వామ్యంలో అది సమర్థనీయం కాదు. వలసవాద చట్టాల్లో లాగానే ఇప్పుడూ ఉంటే జనాన్ని ఏమార్చడమే తప్ప ఏం మార్చినట్టు అన్నది ప్రశ్న. క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలంటే ఆశించేది ఇది కాదు. నిజానికి, సమాజంలోనూ, సాంకేతికంగానూ అనేక మార్పులు వస్తున్నవేళ... నేర చట్టాలను సవరించడం, నవీకరించడం చట్టబద్ధ పాలన అందించే ఏ దేశానికైనా తప్పనిసరి. అయితే, ఆ మార్పులు నిర్దేశిత సామాజిక ప్రయోజనాన్ని నెరవేర్చడం కీలకం. అలాగే, ఆ సవరించిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టుండడం అత్యవసరం. 150 ఏళ్ళ పాత వలసవాద చట్టాలను వదిలించుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఆపాటి ఆశలు, చర్చ ముఖ్యమైనవి. కానీ, వాస్తవంలో కొత్త చట్టాలు అలా లేవంటే నిరాశ మిగులుతుంది. చట్టాల్లో అవసరమైన అనేక ప్రాథమిక సవరణలు చేసే చరిత్రాత్మక అవకాశం చేజారిపోయింది. ఐపీసీ స్థానంలో తెచ్చిన బీఎన్ఎస్ లాంటివి శిక్షలతో భయపెట్టేదిగా కాక, సంస్కరించేదిగా ఉండాలి. 1975 నుంచి 2013 మధ్యకాలంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దాదాపు 33 ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత పాలకులు కొత్త పేర్లతో తమవిగా చెప్పుకుంటున్నారనీ, కొత్త పేర్లతో కొత్త నేర చట్టాలు కూడా ఆ కోవలోవే అనీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిందారోపణల మాటెలా ఉన్నా, ఇప్పటికీ మించి పోయింది లేదు. ప్రతిపక్షాలు, పౌరసమాజం తాలూకు భయాందోళలను పోగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అన్ని వర్గాల అనుమానాలనూ నివృత్తి చేయాలి. చట్టాలు తేవడంలో లేకున్నా, కనీసం అమలులోనైనా సర్వజనామోద వైఖరి శోభనిస్తుంది. అవసరమైతే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు సరికొత్త చట్టాల్లోనూ ఎప్పటికప్పుడు సవరణలు చేయాల్సిందే. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య మూలమే అది. ఒక్కమాటలో... కొత్త చట్టాలతో దేశంలోని 17.5 వేల పోలీస్ స్టేషన్లు బలోపేత మవడం సరే కానీ, 140 కోట్ల జనాభా నిస్సహాయులుగా మారిపోతేనే కష్టం. -
ఏపీ విధానాలు నచ్చాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసించింది. గ్రామ, వార్డు సచివాలయాలతో క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారని కితాబిచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తున్నారని, రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను గ్రామాల్లోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేస్తున్నారని..ఇదొక మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్‌పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణ ♦ ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో సమర్థవంతమైన పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తద్వారా వివిధ సంక్షేమ పథకాలతోపాటు పలు ప్రభుత్వ సేవలను పౌరుల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అవసరాలను తీర్చడంలో ఈ వ్యవస్థ వన్‌స్టాప్ సొల్యూషన్‌గా నిలిచింది. ♦ గ్రామాల్లో 50 ఇళ్లకు.. పట్టణాల్లో 70–100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున, పట్టణ సచివాలయాల్లో 10 మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమ పరిధిలోని ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలను నిర్ణీత కాల వ్యవధిలో అందిస్తున్నారు. ఆరు అంచెల్లో ట్రాక్ చేయడం ద్వారా పథకాలకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా చెబుతూ దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ ♦ దశల వారీగా సమగ్ర భూ సర్వేను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్స్ ద్వారా ఏరియల్ ఫ్లయింగ్‌తో సర్వే చేయడంతో పాటు గ్రౌండ్ ట్రూథింగ్, రికార్డుల తయారీ, క్షేత్ర స్థాయిలో ధృవీకరణ, రికార్డుల అప్డేషన్, సరిహద్దు వివాదాలపై అప్పీల్స్, సెక్షన్–13 నోటిఫికేషన్ ప్రచురణ, ఫైనల్ రికార్డ్ ఆఫ్ రైట్స్, స్టోన్ ప్లాంటేషన్, సబ్ డివిజన్స్.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్లను క్రమానుగతంగా అమలు చేస్తున్నారు. ♦ సరిహద్దుల ఆన్లైన్ పర్యవేక్షణ, జోనల్, నిబంధనలు, భూమిపై భౌతిక మార్పులతో సహా సమగ్ర భూసర్వే చేపట్టారు. ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కచ్చితమైన భూ హక్కు పత్రాలను భూ యజమానులకు పంపిణీ చేస్తున్నారు. తద్వారా భూ రికార్డులు క్లీన్ అవుతాయి. ఇది చాలా మంచి విధానం. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజల్లో నిశ్చింత ♦ డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టం చేసింది. ఇందులో భాగంగా రోగుల ఇంటి వద్దే వైద్య సేవలను అందిస్తోంది. తద్వారా చిన్న చిన్న జబ్బులకు పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవసరం తప్పిందని ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ♦ ఆయుష్మాన్ భారత్ హెల్త్–వెల్నెస్ సెంటర్ల ఏకీకరణ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పన డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది. ♦ ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఒక కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ముగ్గురు నలుగురు ఆశా వర్కర్లను నియమించారు. ♦ విలేజ్ క్లినిక్స్ భవనాలను 932 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్‌తో సహా నిరి్మంచారు. వీటిల్లో 105 రకాల మందులు, 14 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ ప్రతీ పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రతీ పీహెచ్‌సీకి విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానించారు. ♦ 104 మెబైల్ మెడికల్ యూనిట్‌తో సహా ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందిస్తున్నారు. ఒక డాక్టర్ పీహెచ్సీలో ఓపీ సేవలను అందిస్తే.. మరో డాక్టర్ విలేజ్ క్లినిక్స్‌కు హాజరవుతున్నారు. ♦ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సాధారణ ఓపీలతో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిర్వహణ, యాంటినేటల్ కేర్.. తల్లులు, నవజాత శిశువులకు పోస్ట్‌నేటల్ కేర్, అంగన్వాడీలు, పాఠశాలల సందర్శన, రక్తహీనత పరీక్షలు, పర్యవేక్షణ, మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల సందర్శన, పంచాయతీల సమన్వయంతో గ్రామ పారిశుధ్య పర్యవేక్షణ జరుగుతోంది. ♦ ఈ ఏడాది మే 3 నాటికి గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ సేవలను 97,11,224 మంది ప్రజలు వినియోగించుకున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు మంచి విధానమని, తద్వారా ప్రభుత్వం రైతుల సాగుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్‌ను ఉంటున్న ఊళ్లలోనే పొందే అవకాశం కల్పిందని అంతర్రాష్ట్ర మండలి నివేదిక పేర్కొంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు వారికి పనికొచ్చే ఇతర సేవలనూ ఆర్బీకేలు అందిస్తున్నాయని తెలిపింది. అన్ని పంటలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేస్తూ, వాస్తవ సాగుదారు సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకుంటోందని.. తద్వారా నిజమైన సాగుదారులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలను అందిస్తోందని ప్రశంసించింది. రైతుల నుంచి పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల్లోనే చేపడుతోందని తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడింది. -
‘డీప్’గా పసిగట్టి..‘ఫేక్’ పనిపట్టండి
సాక్షి, హైదరాబాద్: డీప్‌ఫేక్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో మోసాలకు పాల్పడటం, వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ కట్టడికి కఠిన నిబంధనలు విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే, డీప్‌ఫేక్‌తో మోసాలకు గురికాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. వీటిని పరిశీలించకుండా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాటిల్లో కొన్ని సూచనలు కింది విధంగా ఉన్నాయి. ► ఫొటోలు, వీడియోలలో ఉన్న లైటింగ్, నీడలను నిశితంగా పరిశీలించాలి. అందులో ఏవైనా తేడాలు గమనిస్తే అది ఫేక్ అని ప్రాథమిక అంచనాకు రావొచ్చు. ► అసహజ ముఖకవళికలు ఉన్నట్టు గమనిస్తే దానిని డీప్‌ఫేక్‌తో తయారు చేసిన వీడియోగా భావించవచ్చు. ► ఆడియోలలో అసమానతలు, ఆడియో అస్పష్టంగా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► ఫొటోలు, వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో అసమానతలు, ఏవైనా వస్తువులు సాధారణానికి భిన్నంగా ఉన్నట్టు గమనించినా అది డీప్‌ఫేక్ అయి ఉండొచ్చు. ► ఫొటోల్లో, వీడియోల్లో వ్యక్తులు నిలబడిన, నడుస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు అసాధారణంగా ఉన్నాయా? కదలికలు నిశితంగా పరిశీలిస్తే ఏవైనా అనుమానాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ► డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్స్ వాడి కూడా అవి నిజమైనవా..లేదా? గుర్తించవచ్చు. -
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
మహిళల మిస్సింగ్ కేసుల్లో ఆ రాష్ట్రమే టాప్.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలో మహిళల మిస్సింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో మహిళల మిస్సింగ్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ఉందని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా గణాంకాలను లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2021 లో మహారాష్ట్రలో 56,498 మంది మహిళలు అదృశ్యం అవ్వగా, మిస్సింగ్ కేసుల్లో టాప్ 5 రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, అస్సాం ఉన్నాయి. తెలంగాణలో 2021లో 12834 మంది మహిళలు అదృశ్యం కాగా, 2021లో ఏపీలో 8969 మహిళలు అదృశ్యం అయినట్లు కేంద్రం పేర్కొంది. -
ఢిల్లీ: నేడు ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం. -
ప్రాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) వస్తాయి. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. -
ఏ దేవుడూ హర్షించడు!
ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉద్రిక్తతలకు దారి తీస్తే? ఎవరూ హర్షించరు. కానీ, ఇలాంటి పరిణామాలు ఎక్కువవుతున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా గత వారం రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణలే అందుకు సాక్ష్యం. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన పండుగ,శాంతియుతంగా సాగాల్సిన శోభాయాత్రలు కొన్నేళ్ళుగా శత్రుత్వానికీ, అరెస్టులకూ, అభాగ్యుల మర ణాలకూ దారితీయడం శోచనీయం. ఈసారీ బిహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీల్లో రెండు మతాల ఘర్షణగా నవమి ఉత్సవం మారిపోయింది. అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇటు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ హింసాకాండ చెలరేగింది. ప్రధానంగా ప్రతిపక్షాల హయాంలోని పశ్చిమ బెంగాల్, బిహార్లలో భారీ విధ్వంసం రేగిన తీరు ఆందోళనకరం. నిరుటి లాగే ఈసారీ రాళ్ళు రువ్వడం, నినాదాలు చేయడం, గృహదహనాలు, లూటీలు! సోకాల్డ్ భక్తుల చేతుల్లో కత్తులు, తుపాకీలు. వెరసి, పవిత్ర రామనవమి, రంజాన్ మాసం కలిసొచ్చే సమయం దేశంలో కొత్త తరహా హింసాత్మక ధోరణికి అనువైన సందర్భంగా మారిపోవడం ఓ విషాదం. బెంగాల్లో హౌరా జిల్లాలో వరుసగా రెండురోజులు, సోమవారం రాత్రి హుగ్లీ దగ్గర రిష్రాలో మరోసారి ఘర్షణలు రేగాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. బిహార్‌లో సాసారామ్, నలందా జిల్లాల్లో హింసకు పలువురు గాయపడ్డారు. నలందా వద్ద 110 ఏళ్ళ చరిత్ర కలిగిన మదరసాలో వేలకొద్దీ అరుదైన పుస్తకాలకు నిలయమైన గ్రంథాలయం దుండగుల చేతిలో బూడిదైన ఘటన కదిలించేస్తుంది. రెచ్చగొట్టే ధోరణి వల్ల సామరస్యం దెబ్బతింటుందే తప్ప సమాజానికి మేలు చేకూరదు. ఇప్పుడు జరుగుతున్నదదే. వార్తల్ని గమనిస్తే – మథురలో జామా మసీదు పక్కనే కాషాయ జెండాలు కట్టారు. మరో రాష్ట్రంలో మసీదులో ప్రార్థనల వేళ పెద్దగా నినాదాలు చేస్తూ, లౌడ్ స్పీకర్లు హోరెత్తించారు. బెంగాల్లో అనుమతించిన మార్గంలో కాక రెండు వర్గాలూ ఉండే సున్నితమైన ప్రాంతం మీదుగా కత్తులతో ఊరేగింపు జరిపారు. నిరుటి ఉద్రిక్తతల రీత్యా ఢిల్లీలో ఓ పార్కులో నవమి యాత్ర, నమాజు – రెంటినీ పోలీసులు నిషేధించారు. అయినా కొన్ని మతవాద సంస్థలు అక్కడే యాత్ర, పూజ చేయడాన్ని ఏమనాలి? అదే సమయంలో రెండు చేతులూ కలవనిదే చప్పుడు రాదంటూ రెండోవర్గపు తప్పులు చెబుతున్నవారినీ కొట్టిపారేయలేం. ఈ హింసాకాండ రాజకీయ నిందలకు దారి తీస్తోంది. ఈ ఘర్షణలకు తమ పాలనలోని లోపాలు, ఉదాసీనతలు కారణమని అంగీకరించడానికి మమత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహజంగానే సిద్ధంగా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గూండాలతో బీజేపీ ఈ ఘర్షణలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. బెంగాల్ పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాస్తూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని బెంగాల్ బీజేపీ ఛీఫ్ నింద. ఇక, ఆ రాష్ట్ర గవర్నర్ సైతం బాధితప్రాంతాల్లో పర్యటించి గట్టిగానే గళం విప్పారు. ఘర్షణలపై కేంద్ర హోమ్‌శాఖ నివేదిక కోరే పరిస్థితి వచ్చింది. శ్రీరామనవమి ఘర్షణలతో గురువారం నాటి హనుమాన్ జయంతికి అప్రమత్తత అవసరమైంది. ఈసారి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాల్సిందిగా వివిధ రాష్ట్రాలకు హోమ్ శాఖ బుధవారం సలహా ఇవ్వాల్సి వచ్చింది. కలకత్తా హైకోర్ట్ ఆదేశంతో హనుమాన్ జయంతికి బెంగాల్ సర్కార్ 3 జిల్లాల్లో పారా మిలటరీ దళాలను బరిలోకి దింపాల్సొచ్చింది. ఈ ఘటనలన్నీ ధార్మిక ఉత్సవాలు అతి సున్నితంగా మారిన పరిస్థితులకు దర్పణం. నిజానికి, ఇలాంటివన్నీ నివారించదగ్గ విపరిణామాలు. ధార్మిక ఉత్సవాలు భారత సమాజంలో ఒక అంతర్భాగం. కానీ, వాటిని ఆసరాగా చేసుకొని, వివిధ మతాల మధ్య విషబీజాలను నాటాలనీ, రాజకీయ లబ్ధి పొందాలనీ చూస్తే అంతకన్నా నేరం, ఘోరం ఉండవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్ప టికీ ప్రజలు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను అనుసరించేలా రక్షణ కల్పించాలి. వారి ధార్మిక యాత్రలకు భద్రతనివ్వాలి. అది ఆయా ప్రభుత్వాల, అధికార యంత్రాంగాల బాధ్యత. అదే సమయంలో రెచ్చగొట్టే చర్యలు, నినాదాలు, పుకార్ల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లక్ష్మణరేఖ దాటిన దోషులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి ఎన్నికలో అధికారపీఠంపై పార్టీలు మారవచ్చేమో కానీ, మారకుండా ప్రజాసేవలోనే ఉండేది పోలీసు యంత్రాంగం. కాబట్టి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఏర్పాట్లలో లోపాలను సవరించాలి. విభిన్న వర్గాల మధ్య అపనమ్మకం పెంచే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి. కలసిమెలసి బతకాల్సిన సమాజంలో విషబీజాలను విత్తితే అది యావత్ దేశానికే నష్టం. రాజ కీయ లబ్ధి కోసం అంగలారుస్తున్నవారు అది గ్రహించాలి. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓటర్లను వర్గాలుగా చీల్చాలనే ప్రయత్నాలు పెరిగితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి నీచ రాజకీయ వ్యూహాల ఉచ్చులో పడకుండా, జనం అప్రమత్తంగా ఉండాలి. రాజ కీయ వర్గాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ, మారణకాండకూ, మనుషుల్లో చీలికకూ చెక్ పెట్టాలి. ఒక్కమాటలో – సహనం, శాంతి, క్షమ పాటించిన ఆ రాముడైనా, అల్లా అయినా పొరుగువాడిని ద్వేషించమనలేదు. తమ ధర్మం గొప్పదని చాటుకోవడా నికి పరధర్మాన్ని తక్కువ చేయమని ఏ సమాజమూ, ఏ దేవుడూ చెప్పలేదు. అంతర్యామి సైతం హర్షించని ఘర్షణలతో మానవతా ధర్మాన్ని సైతం మర్చిపోతే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ ధర్మంలోనూ లేదు. పాపఫలం మాత్రం ఇక్కడే, ఇప్పుడే మనమందరం అనుభవించాల్సి వస్తుంది. -
27న విభజన సమస్యలపై సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖలో కదలిక వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ నెల 27న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో పాటు అయా అంశాలకు చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే సమావేశం అజెండాలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన ద్వైపాక్షిక సమస్యలు, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలున్నాయి. అజెండాలోని అంశాలు ఇవీ.. ద్వైపాక్షిక సమస్యలు ► విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ► షెడ్యూల్ 10లోని రాష్ట్ర సంస్థల విభజన ► విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) విభజన ► సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన ► ఉమ్మడి సంస్థల్లోని కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెందిన బ్యాంకుల్లోని నగదు నిల్వలు విభజన. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల విభజన ► బియ్యం సబ్సిడీకి సంబంధించి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థకు నగదు క్రెడిట్ విడుదల ఇతర సమస్యలు ► ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక పన్ను రాయితీలు ► ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి ఏడు జిల్లాల అభివృద్ధి గ్రాంటు ► రెవెన్యూ లోటు ► పన్నుల సమస్యలు ► విద్యా సంస్థల ఏర్పాటు ► నూతన రాజధానికి కేంద్ర మద్దతు ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్‌కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
35 వాట్సాప్ గ్రూప్‌లపై నిషేధం విధించిన కేంద్రం
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. ప్లాన్స్ సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడుల నుంచి మొదలు కొని బీహార్‌లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఈ దాడులకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారనే నివేదికలపై చర్యలు చేపట్టింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. Centre bans 35 WhatsApp groups for spreading misinformation on Agnipath scheme, 10 arrested for fake news#AgnipathScheme pic.twitter.com/Fqv0N8DF2n — Pandurang Dhond (@PandurangDhond7) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి!
న్యూఢిల్లీ/చండీగఢ్: భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. బుధవారం ప్రధాని కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్‌పై నిలిచిపోయారు. దీనిపై మండిపడిన కేంద్ర హోంశాఖ ఘటనపై తక్షణ వివరణ ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన మోహరింపులు చేయలేదని అభిప్రాయపడింది. మోదీ కాన్వాయ్‌ను ఆపి పైరియాణా సమీపంలో ఆందోళనకు దిగిన రైతులు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సహించరానిదని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి అమిత్‌షా చెప్పారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిపై భౌతికదాడికి కాంగ్రెస్ యత్నించిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ ర్యాలీకి జనాలు తగినంతగా హాజరుకాలేదనే ప్రధాని వెనుదిరిగారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఘటన కారణంగా ముందుగా నిర్ణయించిన ఫిరోజ్‌పూర్ ర్యాలీని ప్రధాని రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో మోదీ దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఏం జరిగింది? హోంశాఖ కథనం ప్రకారం హుసేనీవాలా జాతీయ అమరవీరుల స్మారకం సందర్శన కోసం బుధ వారం ఉదయం ప్రధాని మోదీ పంజాబ్‌లోని భ టిండా చేరుకున్నారు. అక్కడినుంచి స్మారకచిహ్నం వద్దకు ఆయన హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. అయితే అనుకోకుండా వర్షం పడి వాతావరణం ప్రతికూలంగా మారింది. వాతావరణం అనుకూలంగా మారుతుందేమోనని ప్రధాని దాదాపు 20 నిమిషాలు వేచిచూశారు. కానీ వాతావరణంలో మార్పు కనిపించకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రధాని రోడ్డుమార్గం ద్వారా ప్రయాణమయ్యే విషయాన్ని అధికారులు రాష్ట్ర డీజీపీకి తెలియజేసి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. పోలీసుల నుంచి తగిన ధ్రువీకరణ అందిన తర్వాత ప్రధాని కాన్వాయ్ హుసేనీవాలాకు బయలుదేరింది. గమ్యానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ప్రధాని కాన్వాయ్ పైరియాణా గ్రామ సమీప ఫ్లైఓవర్‌ను చేరుకుంది. అక్కడ కొందరు రైతులు నిరసనకు దిగి రోడ్డును దిగ్భంధించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధాని తన కాన్వాయ్‌తో ఫ్లైఓవర్‌పై దాదాపు 15–20 నిమిషాలు నిలిచిపోవాల్సి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశ నాయకుడు నడిరోడ్డుపై నిలిచిపోవడాన్ని చూసి దేశం నిర్ఘాంతపోయింది. సుమారు 200 మంది రైతులు అకస్మాత్తుగా రోడ్డును నిర్భంధించారని పంజాబ్ డీఐజీ ఇందర్బీర్ సింగ్ చెప్పారు. క్రమం గా ఫ్లైఓవర్‌కు అవతల నిరసనకారులు భారీగా గుమిగూడుతుండడంతో రక్షణకు రిస్కు ఏర్పడుతుందని భావించి ప్రధాని కాన్వాయ్‌ను తిరిగి భటిండాకు మరలించాలని నిర్ణయించామన్నారు. ఆ ముగ్గురూ ఎందుకు లేరు! దేశ ప్రధాని ఒక రాష్ట్ర రాజధానికి వస్తే గవర్నర్, సీఎం, ఇతర ఉన్నతాధికారులు తప్పక ఆహ్వానం పలకాలి. అదే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పర్యటనకు వస్తే ప్రభుత్వం తరఫున సీఎం లేదా ఒక మంత్రితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతారు. కలకలం రేపుతున్న ప్రధాని పంజాబ్ పర్యటనలో ఆయనకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మాత్రమే స్వాగతం పలికారు. సీఎం, సీఎస్, డీజీపీ స్వాగతించేందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి స్వాగతం పలికినా, కేంద్ర సర్వీసులకు చెందిన డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎందుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సిబ్బందిలో కొందరికి కరోనా సోకడం వల్ల తాను వెళ్లలేదని సీఎం చన్నీ చెప్పారు. ఐదు ప్రశ్నలు 1. ప్రధాని ప్రయాణించే మార్గాన్ని క్లియర్ చేయడంలో పంజాబ్ పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? 2. నిరసనకారులకు ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళుతున్నట్లు, ఫలానా రోడ్డులోనే వెళుతున్నట్లు ఎలా తెలుసు? ఎవరు ఉప్పందించారు? 3. ప్రధాని భద్రతా సిబ్బందికి రైతులు రోడ్డును దిగ్భందించారని తెలుసా? 4. ప్రధాని ప్రయాణిస్తున్న మార్గాన్ని మార్చినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ– మోదీ భద్రత చూస్తుంది) పంజాబ్ పోలీసులకు తెలిపిందా? 5. జరగబోయేదేమిటో పంజాబ్ అధికార యంత్రాంగానికి ముందే తెలుసా? ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నా.. మీ సీఎంకు థ్యాంక్స్! మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పండి. కనీసం నేను భటిండా విమానాశ్రయం వరకు ప్రాణాలతో వచ్చాను కదా!’’ అని ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో వ్యాఖ్యానించారు. హుసేనీవాలా అమరవీరుల స్మారకం వద్దకు బయలుదేరిన ప్రధాని, భద్రతా వైఫల్యం కారణంగా వెనుదిరిగి భటిండాకు చేరుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఆయన తనను కనీసం ప్రాణాలతో ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రధాని వ్యాఖ్యల విషయం తనకు తెలియదని పంజాబ్ సీఎం చన్నీ చెప్పారు. ఒకవేళ ప్రధాని కోపంతోనో, రాజకీయ ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్య లు చేసి ఉంటే తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. సీఎం కనీసం అందుబాటులో లేరు! ఒకపక్క మార్గం క్లియర్‌గా ఉందని ప్రధాని భద్రతా దళాని (ఎస్పీజీ)కి పంజాబ్ డీజీపీ, సీఎస్ హామీ ఇచ్చారు, మరోపక్క అదే మార్గంలో నిరసనకారులకు అనుమతినిచ్చారు. పరిస్థితిని ఇంకా త్రీవం చేసేందుకు సీఎం చన్నీ కనీసం ఫోనులో అందుబాటులోకి రాలేదు, ఈ సమస్యను పరిష్కరించే యత్నాలు చేపట్టలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను నమ్మే ఎవరికైనా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు బాధను కలిగిస్తాయి. మోదీ ర్యాలీకి హాజరుకాకుండా ప్రజలను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిచ్చారు. నిరసనకారులతో కలిసి భారీగా బస్సులను ఆపేశారు. ఇలాంటి చర్యలతో భగత్ సింగ్ తదితర దేశభక్తులకు ప్రధాని నివాళి అర్పించకుండా అడ్డుకున్నారు. వీరికి స్వాతంత్య్ర సమరయోధులపై ఎలాంటి గౌరవం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తోంది. పంజాబ్‌లో ప్రధాని ఆరంభించాల్సిన వేలాది కోట్ల రూపాయల అభివృద్ది పనులు వీరివల్ల ఆగిపోయాయి. కానీ మేము వీరిలాగా చౌకబారుతనంతో వ్యవహరించము. ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికే పాటుపడతాం.’’ – బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వివరాలు ఎవరు లీక్ చేశారు? ప్రధాని మార్గాన్ని అడ్డుకున్న వ్యక్తులకు పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారమందించారు? ప్రధాని పర్యటనకు తప్పుడు క్లియరెన్స్ ఎందుకిచ్చారు? రక్షణ వైఫల్యం జరిగిందన్న సమాచారం తర్వాత ఎందుకు ఎవరూ స్పందించలేదు? ప్రధాని మృత్యు అంచుకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందానిస్తోందా? దేశ ప్రధానిని ప్రమాదకరమైన మార్గంలో తీసుకువచ్చేలా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యత్నించడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పంజాబ్ పుణ్యభూమిపై హత్యాకాండ జరపాలని యత్నించి కాంగ్రెస్ విఫలమైంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. – స్మృతీ ఇరానీ, కేంద్ర మంత్రి జరిగిన దానికి చింతిస్తున్నాం! మార్గమధ్యంలో అడ్డంకుల వల్ల ప్రధాని వెనుతిరగడంపై విచారిస్తున్నాం. ఆయన దేశానికి ప్రధాని, మేమంతా గౌరవిస్తాం. భద్రతా లోపం ఉందని చెప్పడం సరికాదు. భటిండా నుంచి పీఎం రోడ్డు మార్గంలో వెళ్తారన్న ప్రణాళికేమీ లేదు. కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రాగా ప్రధాని కాన్వాయ్‌ని మరో మార్గం ద్వారా లేదా హెలికాప్టర్ ద్వారా వెళ్లమని సూచించాం. కానీ ఆయన వెనుదిరిగారు. ఇది బాధాకరం. గతరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులను తొలగించాం. అయినాకానీ అనుకోకుండా కొందరు నిరసనకారులు రోడ్డుపైకి రావడమనేది హానికరమేమీ కాదు. రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేశారు కానీ ఎవరికీ హాని చేయలేదు. అలాంటి వారిపై లాఠీలు ఝళిపించమని చెప్పలేను. ఫిరోజ్పూర్లో బీజేపీ ర్యాలీ కోసం 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే 700 మంది వచ్చారు. దీనికి నేనేమీ చేయలేను. హోంశాఖ కోరినట్లు మొత్తం çఘటనపై విచారణ చేస్తాం. రోడ్డు మార్గంలో వెళ్లాలనేది పోలీసు, ఎస్పీజీ ఇతర ఏజెన్సీల ఉమ్మడి నిర్ణయం. ఈ నిర్ణయాల్లో పోలీసుల పాత్ర చాలా పరిమితం. ఎస్పీజీ, ఐబీ తదితర కేంద్ర ఏజెన్సీలు వీటిని నిర్వహిస్తాయి. ఈ మొత్తం ఘటనను అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే అతిధిపై దాడి చేయడం కన్నా చావడానికే ఒక పంజాబీ ప్రాధాన్యమిస్తాడు. – చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ సీఎం -
మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన
కోల్‌కతా/న్యూఢిల్లీ: సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి చెందిన భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలన్నింటికీ కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ‘మదర్ థెరిసా నెలకొల్పిన సంస్థ... మిషనరీస్ ఆఫ్ చారిటీ (ఎంఓసీ)కు భారత్‌లో ఉన్న బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర హోంశాఖ స్తంభింపజేసిందని తెలిసి షాక్ గురయ్యా! 22 వేల మంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం అందకుండా పోయింది. చట్టమే సర్వోన్నతమైనది... కాకపోతే మానవతాసాయం విషయంలో రాజీపడకూడదు’ అని మమత ట్వీట్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీ ఖాతాలను స్తంభింపజేశారనే వార్త తీవ్ర కలకలం రేపింది. టీఎంసీతో పాటు సీపీఎం తదితర విపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాయి. దాంతో హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు వీలుగా... ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ)–2011 కింద రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేయాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈనెల 25న తిరస్కరించామని తెలిపింది. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అర్హమైన నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ సంతృప్తిపరచడం లేదని, పైగా ఈ సంస్థపై తమకు రాతపూర్వకంగా కొంత ప్రతికూల సమాచారం అందిందని పేర్కొంది. తాము బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని వివరణ ఇచ్చింది. అయితే ఈ ప్రతికూల సమాచారమేమిటి? ఏయే నిబంధనలను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉల్లంఘించదనే వివరాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టలేదు. ‘ఎప్‌సీఆర్‌ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది అక్టోబరు 31తోనే ముగిసింది. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న ఇతర సంస్థలతో పాటు మిషనరీస్ ఆఫ్ చారిటీకి కూడా గడువును డిసెంబరు 31 దాకా పొడిగించాం’ అవి హోంశాఖ వివరించింది. ఎంఓసీయే తమ విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేయాలని కోరినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమకు తెలిపిందని పేర్కొంది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ నిరాకరణ నిర్ణయంపై పునఃపరిశీలన కోసం ఎంఓసీ నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని హోంశాఖ తెలిపింది. మేమే లావాదేవీలు నిలిపివేశాం: ఎంఓసీ విదేశీ నిధుల జమయ్యే బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని దేశంలోని తమ ప్రాంతీయ కేంద్రాలను కోరినట్లు మిషనరీస్ ఆప్ చారిటీ సోమవారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అంశం పరిష్కారమయ్యే వరకు ఆ ఖాతాలను వాడొద్దని చెప్పామని తెలిపింది. ‘ఎఫ్సీఆర్ఏ కింద మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం, సస్పెండ్ చేయడం గాని జరగలేదని మేము స్పష్టం చేయదలచుకున్నాం. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని హోంశాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ దరఖాస్తుకు ఆమోదం లభించలేదని మాత్రమే మాకు సమాచారమిచ్చింది. మావైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశంతో సమస్య పరిష్కారమయ్యే వరకు విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని మా కేంద్రాలను కోరాం’ అని ఎంఓసీ సూపీరియర్ జనరల్ సిస్టర్ ఎం.ప్రేమ సంతకంతో విడుదలైన ప్రకటన తెలిపింది. అయితే హోంశాఖ చెప్పినట్లుగా ఖాతాలను స్తంభింపజేయాలని ఎంఓసీయే ఎస్బీఐని కోరిందనే అంశంపై... ఈ ప్రకటనలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీని మదర్ థెరిసా కోల్‌కతా కేంద్రంగా 1950లో స్థాపించారు. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీయే ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ. దీని తరఫున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి. -
శభాష్.. పోలీస్
సాక్షి, అమరావతి: నేర పరిశోధనలో ఏపీ పోలీసుల సామర్థ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో చార్జిషీట్లు దాఖలు చేయడంలో మన రాష్ట్ర పోలీసులు అద్వితీయమైన పనితీరు కనబరిచారు. ఏకంగా 93.80 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జిషీట్లు దాఖలు చేసి ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషులను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్‌లతోపాటు వివిధ సంస్థల నుంచి రావల్సిన నివేదికలను సకాలంలో తెప్పించేందుకు అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. దర్యాప్తు అధికారిని ఎస్ఎంఎస్ల ద్వారా అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులోగా కేసు దర్యాప్తు పూర్తి చేయడంతోపాటు చార్జిషీట్ దాఖలు చేసేలా పర్యవేక్షిస్తోంది. కేసు దర్యాప్తు ప్రగతిని వివిధ దశల్లో బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తోంది. పటిష్టంగా ఐసీజేఎస్ విధానం క్రిమినల్ జస్టిస్ విధానంలోని అన్ని ప్రధాన విభాగాలకు కేసుల వివరాలను ఆన్లైన్ ద్వారా సమన్వయపరిచేందుకు ‘ఇంటర్ ఆపరేటబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్)ను పోలీసు శాఖ సమర్థంగా నిర్వహిస్తోంది. దాంతో దర్యాప్తును సకాలంలో పూర్తి చేసి ప్రాసిక్యూషన్ వేగవంతం చేయడం ద్వారా దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తోంది. ఐసీజేఎస్ విధానం ద్వారా పౌరులకు సేవలందించడంలో గతంలో రెండోస్థానంలో ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది. సీఎం, కేంద్ర హోం మంత్రి అభినందనలు మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సకాలంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర పోలీస్ శాఖను అభినందించారు. కాగా, సమగ్ర దర్యాప్తు చేసేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందిస్తున్న పోలీసు టెక్నికల్ సర్వీసెస్ విభాగాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. డీఐజీ ( పోలీస్ టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, ఇతర సాంకేతిక అధికారుల బృందాన్ని ఆయన ప్రశంసించారు. -
వెయ్యి బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సుల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపణలపై సీబీఐతో ప్రాథమికంగా దర్యాప్తు చేయించాలని హోం శాఖ సిఫారసు చేసింది. ఢిల్లీ రవాణా శాఖ బస్సుల కొనుగోలు, వార్షిక నిర్వహణ కాంటాక్టు (ఏఎంసీ)ల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష బీజేపీ ఆరోపించగా, దీనిపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజాల్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఏఎంసీలో విధానపరమైన లోపాలున్నాయని, దానిని రద్దు చేయాలంటూ ఆ కమిటీ సిఫారసు చేసింది. దాంతో దీనిపై సీబీఐతో విచారణకు హోంశాఖ ఆదేశించింది. -
27 మందికి పోలీస్ పతకాలు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సేవా పతకాలు తెలంగాణకు చెందిన 27 మంది పోలీసు అధికారులకు దక్కాయి. మరో ముగ్గురు జైలు అధికారులకు కూడా పతకాలు లభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాలు (పీపీఎంజీ), 628 మందికి పోలీస్ శౌర్య పతకాలు (పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్ పతకాలు ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ పతకాలు అందుకోనున్నారు. కాగా, పతకాలను అందుకోనున్న పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పోలీస్ సేవా పతకాలు... ఇంటెలిజెన్స్ డీఐజీ శివకుమార్, మాదాపూర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్, వరంగల్ ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి, మాదాపూర్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, పీటీసీ డీఎస్పీ ఎం.పిచ్చయ్య, టీఎస్ఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ కె. సంపత్‌కుమార్ రెడ్డి, ఎస్ఐబీ ఏఎస్ఐలు ఆనంద్‌కుమార్, డి. చంద్రశేఖర్ రావు, గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ ఆరిఫ్ అలీ, కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ ఎం. అనిల్‌గౌడ్‌కు సేవా పతకాలకు ఎంపికయ్యారు. పీఎంజీ విభాగంలో... గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి జిల్లాల్లో 2016, 2017, 2018లలో జరిగిన ఎన్కౌంటర్లలో పాల్గొని ధైర్యసాహసాలు ప్రదర్శించిన 14 మందికి పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఐ, కానిస్టేబుళ్లతో పాటు ఓ ఎస్ఐ కూడా ఉన్నారు. శౌర్యపతకాలు పొందిన వారిలో ఆర్ఎస్ఐ పి.కె.ఎస్. రమేష్, కానిస్టేబుళ్లు ఎన్.లయ, ఎం.పాపారావు, ఎం. భాస్కర్‌రావు, జి. ప్రతాప్‌సింగ్, కె. వెంకన్న, మాలోత్ రాములు, బి. మరియాదాస్, కె. పరుశురాం, అబ్దుల్ అజీమ్, కె.తిరుపతయ్య, పి.సత్యనారాయణ, వి.రమేష్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ ఉన్నారు. జైళ్ల విభాగంలో ముగ్గురికి... జైళ్ల విభాగంలో దేశ వ్యాప్తంగా 41 మందికి విశిష్ట సేవా పతకాలను ప్రకటించారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురికి పతకాలు దక్కాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ మ హేంద్ర కృష్ణమూర్తి, చీఫ్ హెడ్‌వార్డర్ బి.నారాయణ, హెడ్ వార్డర్ వేముల జంగయ్య పతకాలను అందుకోనున్నారు. -
ఏపీ పోలీస్ అధికారులకు కేంద్ర పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ గురువారం వీటిని ప్రకటించింది. ఈ పురస్కారం దక్కిన వారిలో 15 మంది సీబీఐకి చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, కేరళ, రాజస్థాన్ నుంచి 9 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్ (10), తమిళనాడు (8), బిహార్ (7), తెలంగాణ (5), గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులుండటం విశేషం. -
టీకా సర్టిఫికేట్లతో షో చేయోద్దు - కేంద్రం
న్యూఢిల్లీ: కొవిడ్ టీకా తీసుకున్నట్టుగా ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు సోషల్ మీడియాలో షేర్ చేయోద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం, షేర్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుందంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కితే ప్రమాదంలో పడేందుకు ఆస్కారం ఉందంటూ కేంద్రం సూచించింది. కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సైబర్ దోస్త్ ట్విట్టర్ పేజీలో ఈ వివరాలు ఉంచింది. సైబర్ సేఫ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ధృవీకరణ పత్రాలను కోవిన్ యాప్ ద్వారా కేంద్రం జారీ చేస్తోంది. ఇందులో పేరు, వయస్సు తదితర వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేప్పుడు వ్యాక్సినేటెడ్ సర్టిఫికేట్లు తప్పనిసరి చేశాయి పలు దేశాలు. దీంతో ఇటీవల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది తాము వ్యాక్సిన్ తీసుకున్నామంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పలు సూచనలు చేసింది.