Unlock 5.0: Guidelines for Cinema Theaters, Social Gatherings and Schools | కేంద్ర హోం శాఖ తాజా అన్‌లాక్‌–5 మార్గదర్శకాలను - Sakshi
Sakshi News home page

15 నుంచి ‘బొమ్మ’

Published Thu, Oct 1 2020 4:57 AM | Last Updated on Thu, Oct 1 2020 11:27 AM

Cinemas halls multiplexes theatres reopen Oct 15 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్‌–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్‌–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతిచ్చింది.  అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది.

అక్టోబర్‌ 15 నుంచి అనుమతించేవి..
► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది.

► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్‌ టు బిజినెస్‌) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు.

► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది.

► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు.


విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు..
► అక్టోబర్‌ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి.

► ఆన్‌లైన్‌ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు.

► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి.

► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు.

► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి.

► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి.

► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు.

► సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్ట్రీమ్‌లోని పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్‌ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్‌ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం.


50 శాతం భర్తీకి అనుమతి..
► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్‌ 15 తర్వాత కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి.

► హాల్‌ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్‌ స్కానింగ్, హ్యాండ్‌ వాష్‌ లేదా శానిటైజర్‌ వాడకం తప్పనిసరి.


అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం..
► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి.

► కంటైన్‌మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది.

► కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్‌డౌన్‌ విధించరాదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement