theatures
-
విలీనానికి పీవీఆర్ వాటాదారుల ఆమోదం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ సేవల్లోని ఐనాక్స్ లీజర్తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీవీఆర్ ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పీవీఆర్ మంగళవారం తన వాటాదారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి ఆమోదాన్ని కోరింది. 99 శాతం విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్టు పీవీఆర్ బుధవారం ప్రకటించింది. విలీనానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అనుమతులను పీవీఆర్–ఐనాక్స్ లీజర్ జూన్‌లోనే పొందాయి. ఈ ఏడాది మార్చి 27న ఈ సంస్థలు తమ విలీన ఒప్పందాన్ని ప్రకటించాయి. తద్వారా 1,500 స్క్రీన్లతో దేశంలోనే అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించనున్నట్టు తెలిపాయి. -
ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..!
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా అభిమానులకు వినోదం పంచేందుకు పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా దసరాకు పెద్ద సినిమాల తాకిడి, థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో కాస్త ముందుగానే పలువురు యంగ్ హీరోలు ఆడియన్స్‌లో పలకరించబోతున్నారు. మరి ఆ చిత్రాలేవి, ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దామా! కృష్ణ వ్రింద విహారి: గశౌర్య, షెర్లీ జంటగా నటించిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనీశ్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించగా.. మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో ఎంట్రీ ఇవ్వనుంది. అల్లూరి: శ్రీ విష్ణు, కయాదు లోహర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'అల్లూరి'. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. ఇటీవల నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ హీరో అల్లు అర్జున్ హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. దొంగలున్నారు జాగ్రత్త: సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. ఈ చిత్రానికి సతీశ్ త్రిపుర దర్శకత్వం వహించగా.. కాలభైరవి సంగీత స్వరాలు అందించారు. ఈ వారంలోనే 23వ తేదీన ప్రేక్షకులకు థియేటర్లలో కనువిందు చేయనుంది. మాతృదేవోభవ: పంచానికి అమ్మ విలువను చాటిచెప్పేలా రూపొందించిన చిత్రం మాతృదేవోభవ. ఈ సినిమాలో సుధ, చమ్మక్ చంద్ర, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె.హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. జయసూర్య సంగీత బాణీలు సమకూర్చారు. అయితే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 థియేటర్లలో ఈనెల 24 విడుదల చేయనున్నారు. పగ పగ పగ: ప్రముఖ దర్శకుడు కోటి మొదటిసారి ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్న చిత్రం పగ పగ పగ. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాశ్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రం రాబోతోంది. వినోదాత్మకంగా సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీ రవి దుర్గా ప్రసాద్. అయితే ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయనుండగా ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులకు ఉచితంగా చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే! నెట్‌ఫ్లిక్స్ * ద పెర్ఫ్యూమర్ (హాలీవుడ్) సెప్టెంబరు 21 * జంతరా (హిందీ సిరీస్) సెప్టెంబరు 23 * ఎల్వోయూ (హాలీవుడ్) సెప్టెంబరు 23 డిస్నీ+హాట్‌స్టార్ * అందోర్ (వెబ్‌సిరీస్) సెప్టెంబరు 21 * ద కర్దాషియన్స్ (వెబ్‌సిరీస్2) సెప్టెంబరు 22 * బబ్లీ బౌన్సర్ (తెలుగు) సెప్టెంబరు 23 ఆహా * ఫస్ట్ డే ఫస్ట్ షో (తెలుగు) సెప్టెంబరు 23 * డైరీ (తమిళ చిత్రం) సెప్టెంబరు 23 అమెజాన్ ప్రైమ్ * డ్యూడ్ (హిందీ సిరీస్) సెప్టెంబరు 20 * హుష్ హుష్ (హిందీ సిరీస్) సెప్టెంబరు 22 జీ5 * అతిథి భూతో భవ (హిందీ) సెప్టెంబరు 22 -
ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాలు ఇదిగో..
కరోనా గానీ లేకున్నట్లయితే పెద్ద చిత్రాలన్నీ థియేటర్ల వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు పెద్ద పండుగలా ఉండేది. కానీ కరోనా రక్కసీ మళ్లీ కోరలు చాచి సినీ పరిశ్రమపై భారీ ప్రభావం చూపింది. భారీ బడ్జెట్ చిత్రాలన్నీ వాయిదా పడేలా చేసింది. అయితే దీనివల్ల చిన్న సినిమాలకు మాత్రం కలిసివచ్చింది. అందుకే ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. థియేటర్లతో పాటు మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎలాగు ఉండనేఉన్నాయి. అయితే ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో అలరించే సినిమాల జాబితా చూసేయండి. 1. కోతల రాయుడు, ఫిబ్రవరి 4 2. అతడు ఆమె.. ప్రియుడు 3. సామాన్యుడు, ఫిబ్రవరి 4 4. కె 3-కోటికొక్కడు, ఫిబ్రవరి 4 5. పటారుపాళెం.. ప్రేమకథ, ఫిబ్రవరి 4 ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు 1. ది టిండర్ స్విండ్లర్ (నెట్‌ఫ్లిక్స్), ఫిబ్రవరి 2 2. థ్రూ మై విండో (నెట్‌ఫ్లిక్స్), ఫిబ్రవరి 4 3. రీచర్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ఫ్రిబ్రవరి 4 4. ఒన్ కట్ టూ కట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ఫిబ్రవరి 4 5. లూప్ లపేట (సోనీ లివ్), ఫిబ్రవరి 4 6. 100 (జీ5), ఫిబ్రవరి 4 -
డిస్ట్రిబ్యూటర్ల నకిలీ లేఖలు కలకలం
సాక్షి, విశాఖపట్నం: సినిమా టికెట్ ధరల వ్యవహారం విశాఖలో కాకరేపుతోంది. ప్రభుత్వంపై బురదజల్లడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుందన్న వార్తలు ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. చోడవరానికి చెందిన ఒక ఎగ్జిబిటర్ తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారంటూ మిగిలిన ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా తమతో సంతకాలు చేయించుకున్నారంటూ.. గత నెల 25న జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద... చిన్న సినిమాలనే తారతమ్యం లేకుండా అన్ని సినిమా థియేటర్లలో ఆడాలి.. ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్ ఉండే విధంగా ప్రభుత్వం జీవో–35 జారీ చేసింది. దీనిపై ఎగ్జిబిటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నకిలీ లేఖలు సృష్టించి కేసులు వేశారు. ఆ సమయంలో కోర్టుకు సమర్పించిన లేఖల్లో నకిలీవని కొంతమంది ఎగ్జిబిటర్లు చెబుతుండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లలో ఒక వర్గం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను, సినీ వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. జేసీ ఆదేశాల మేరకే టిక్కెట్ల రేట్లు జీవో 35 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్ ధరలు పాత విధానంలో అమలు చేయాలా.. లేదా అనేది జేసీ ఆదేశాల మేరకు నిర్ణయించాలని పేర్కొంది. కోర్టుని ఆశ్రయించిన వారెవరూ ఇప్పటి వరకు తనని సంప్రదించలేదని జేసీ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు థియేటర్లలో అన్ని సౌకర్యాలు, టికెట్ల ధరలు సవ్యంగా ఉన్నాయో లేదో జిల్లా అధికారులు తనిఖీలు ముమ్మురంగా చేస్తున్నారు. థియేటర్లో తప్పక ఉండాల్సినవి ఇవే.. ►ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్, ఎలక్ట్రికల్ సర్టిఫికెట్ ►బిల్డింగ్ స్ట్రెంగ్త్‌ను తెలియజేసే ఆర్అండ్బీ అనుమతి ►ఫిలిమ్ డివిజన్ నుంచి అనుమతి పత్రం ►క్యాంటీన్ నిర్వహణ కోసం ఫుడ్‌లైసెన్స్ ►ఇవన్నీ రెవెన్యూ విభాగం వారికి సమర్పించి ‘ఫామ్–బి’సర్టిఫికెట్ పొందాలి. విచారణ చేస్తున్నాం హైకోర్టుని ఆశ్రయించామని చెప్పిన జిల్లాకి చెందిన 9 థియేటర్ల ఎగ్జిబిటర్లలో ఏడుగురు వారం రోజుల క్రితం తనకు ఫిర్యాదు చేశారు. తమకు అసలు విషయం చెప్పకుండా ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌కి చెందిన చోడవరం థియేటర్ యాజమాని ఒకరు తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఇదంతా తమ ప్రమేయం లేకుండానే జరిగిందని, విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ జీవోకు తామంతా ఆమోదయోగమేనని కోర్టుకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఫిర్యాదులో తెలిపారు. – వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ చదవండి: Vizag Beach: ఎక్కువ ప్రమాదాలు ఆ నెలల్లోనే! -
ఆ మ్యాజిక్ అలాగే ఉంటుంది
డిజిటల్ ఎంటర్టైన్ స్పేస్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా వల్ల నటీనటులకు, దర్శకులకు అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ విషయంపై రకుల్ ఇంకా మాట్లాడుతూ – ‘‘కోవిడ్ కారణంగా థియేటర్స్‌లో ఎంటర్టైన్మెంట్ అందుబాటులో లేకపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని కంటెంట్ వైపు ప్రేక్షకులు దృష్టి పెట్టారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని మన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూస్తున్నారు. మంచి కంటెంట్‌ను ప్రశంసిస్తున్నారు. పెద్ద తెరపై సినిమాలను చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేసే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. అలానే ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ను కూడా ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్స్ ఎన్ని ఉన్నా బిగ్ స్క్రీన్ సినిమా మ్యాజిక్ అలాగే ఉంటుంది. అయితే సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అటు సినిమాలతో పాటు ఇటు డిజిటల్ వల్ల అవకాశాలు పెరుగుతున్నాయి’’ అన్నారు. -
థియేటర్స్‌లోనే గుడ్‌లక్
కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం. దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. -
స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి!
‘రాధే’ అనుకున్నట్టుగానే రంజాన్‌కు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఈ నెల 13న ఒకేసారి ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చినా ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. ముంబయ్‌లో థియేటర్స్ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
షూటింగ్స్ బంద్
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్ క్వారంటైన్ లో టైమ్ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో రిలీజ్‌కు దగ్గరైన సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా, టీవీ షూటింగ్స్‌ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘బ్రేక్ ది చైన్ ’ పేరుతో ఏప్రిల్ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం వరకు లాక్డౌన్ విధించించి, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కోవిడ్ జాగ్రత్తల నడుమ జరుగుతున్న కొద్ది సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. షారుక్ ఖాన్ ‘పఠాన్ ’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, అమితాబ్‌బచ్చన్ – రష్మికల ‘గుడ్ బై’ , కార్తీక్ ఆర్యన్ ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలతో పాటు ముంబయ్‌లో జరుగుతున్న ఇతర సినిమాల షూటింగ్స్‌కి కూడా బ్రేక్ పడింది. ‘‘మేం అన్ని రూల్స్ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం’’ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ పేర్కొన్నారు. -
‘బ్లాక్’కు చెక్.. ఏ సినిమాకైనా, ఏ రోజైనా ఒకటే రేటు
బుకింగ్‌లో రూ.50కి కొన్న టికెట్‌ను.. బయట డిమాండ్ ఉందని రూ.200కు అమ్మితే, దానిని బ్లాక్ వ్యవహారం అంటారు. అలా అమ్మిన వారు బ్లాక్ టికెట్లు అమ్మిన నేరం కింద శిక్షార్హులు. మరి అదే పనిని థియేటర్ల యాజమాన్యాలు అధికారికంగా చేస్తే..? దాన్ని బ్లాక్‌లో విక్రయించినట్లుగా ఎందుకు పరిగణించకూడదు? అధికారికమైనా, అనధికారికమైనా చేసిన పని అదే కదా? ఇదే ఉద్దేశంతో.. ఈ అధికారిక బ్లాక్‌కు కళ్లెం వేయటానికే రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల వారీగా టికెట్లకు నిర్ణీత ధరలను నిర్దేశించింది. సాక్షి, అమరావతి: సినిమా అన్నది ప్రధానంగా వినోదాత్మకం. పేదల నుంచి ధనికుల వరకు దాదాపు అత్యధికులు సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఆయా సినీ హీరోలను బట్టి అభిమానుల సంఖ్య ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న ఉత్సాహం చాలా మంది అభిమానుల్లో ఉంటుంది. ఈ అభిమానాన్ని వీలున్నంత వరకు ‘క్యాష్’ చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ సినిమా అయినా ఒక్కటే.. సినిమాను సినిమాగానే చూడాలి. ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని స్పష్టం చేసింది. ప్రాంతాల వారీగా టికెట్ల ధర తమ అభిమాన హీరో సినిమా అనో.. లేక పేరున్న దర్శకుడి సినిమా అనో రిలీజైన తొలి రోజో, తర్వాతి రోజో చూడాలనుకుంటారు. ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమేంటన్నది అభిమానుల ఆక్రోశం కూడా. కాకపోతే ఎలాగైనా ఆ రోజే చూడాలన్న ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. కాబట్టే ఈ అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించింది. ఇవి అన్ని సినిమాలకూ... అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై కొత్త సినిమాలకు అదనపు బాదుడు ఉండదనేది పెద్ద ఉపశమనం కలిగించిందని వారి భావన. దీంతోపాటు ప్రతి సినిమా హాలు తగినంత పార్కింగ్ ప్రాంతాన్ని కేటాయించాలని, సహేతుక పార్కింగ్ ధరలను వసూలు చేయాలని, థియేటర్ క్యాంటీన్లలో విక్రయించే వస్తువులు కూడా వాటిపై ఉండే గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయించకూడదని స్పష్టం చేసింది. వీటిని ఉల్లంఘిస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సెకండ్ వేవ్ సినిమా.. మూడు నెలల ముచ్చటేనా?
కరోనా మళ్ళీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ స్పీడుగా వ్యాపిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... సినీ పరిశ్రమపై మళ్ళీ ప్రభావం చూపుతోంది. దేశంలోకెల్లా కరోనా కేసులు ఎక్కువున్న... మహారాష్ట్ర సినిమా హాళ్ళు పూర్తిగా మూసేసింది. హిందీ రిలీజులు వాయిదా పడుతున్నాయి. కర్ణాటక సహా దేశంలోని అనేక రాష్ట్రాలేమో... 50 శాతం సీటింగ్ కెపాసిటీకి దిగి వచ్చాయి. కన్నడ పునీత్ రాజ్‌కుమార్ ‘యువరత్న’ రిలీజైన వారం రోజులకే ఇవాళ్టి నుంచి ఓటీటీ బాట పట్టింది. తమిళ సర్కార్ నేటి నుంచే సీటింగ్ తగ్గించేసింది. ఫుల్ కెపాసిటీ ఉన్నా... తెలుగునాట హాళ్ళలో జనం పలచబడుతున్నారు. ‘లవ్‌స్టోరీ’ పోస్ట్‌పోన్ అయింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలంగాణ హైకోర్టు అడుగుతోంది. మరి, ఇప్పుడిక... మన సినిమా హాళ్ళ సంగతేమిటి? రిలీజవ్వాల్సిన మిగతా తెలుగు సిన్మాల భవిత ఏమిటి? సరిగ్గా ఏడాది క్రితం... కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్ డౌన్లో ఉంది. హాళ్ళు మూసేశారు. సినిమాలు లేవు. సమ్మర్ మొదలు గత డిసెంబర్ దాకా సినీ వ్యాపారమే తుడుచుకుపోయింది. ఏడాది తరువాత... ఇప్పుడు లాక్ డౌన్ లేదు. కరోనా మాత్రం బలంగానే ఉంది. హాళ్ళు తెరిచారు. సినిమాలు వస్తున్నాయి. కానీ, సెకండ్ వేవ్ దెబ్బతో ఇప్పుడు క్రమంగా హాలుకు వచ్చే జనమే తగ్గుతున్నారు. రెండువారాలుగా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో తెలుగు నాట కూడా సినిమా హాళ్ళపై షరతులు తప్పేలా లేవు. దాంతో, భారీ ఖర్చు పెట్టి తీసి, అంతే భారీగా వ్యాపారమూ జరుపుకొన్న పెద్ద సినిమాల రిలీజులు డోలాయమానంలో పడ్డాయి. తాజాగా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా తాజా పరిస్థితికి నిదర్శనం. టెస్టుల నడుమే... తెగ షూటింగ్స్ నిజానికి, లాక్డౌన్ ఎత్తేశాక∙ఒక దశలో తెలుగునాట షూటింగులు పీక్‌కి వెళ్ళాయి. రోజూ ఏకంగా 120కి పైగా షూటింగులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేప్తో ఆ జోరూ కొంత తగ్గింది. అయితేనేం... ఇప్పటికీ సినిమాలైతేనేం, వెబ్ సిరీస్లైతేనేం... రోజుకు సగటున 80 షూటింగులైతే తెలుగునాట జరుగుతున్నాయి. ‘‘షూటింగుల కోసం తగినంత మంది టెక్నీషియన్లైనా దొరకని పరిస్థితి. చివరకు, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న మా భారీ చిత్రానికి కావాల్సినంత మంది మేకప్మ్యాన్లు కూడా దొరకడం లేదంటే నమ్మండి’’ అని ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అయితే, ఈ షూటింగుల్లో శానిటైజేషన్, పదే పదే టెస్టులకే శ్రమ, ఖర్చు తడిసిమోపెడవుతున్నాయి. ఇటీవల అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ షూటింగు కోసం 100 మంది జూనియర్ ఆర్టిస్టులకు టెస్టులు చేస్తే, 45 మందికి పాజిటివ్ వచ్చింది. గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ సహా తెలుగునాట పలు సినిమా యూనిట్లు ముంబయ్, చెన్నైల నుంచి వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించి కానీ, షూటింగుకు అనుమతించడం లేదు. ‘‘రోజూ భారీ యూనిట్‌తో షూటింగ్ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్ళను ఒక రోజు ముందే వచ్చి, పరీక్ష చేయించుకోమంటున్నాం. స్థాని కులకు సైతం రెండు రోజులకు ఒకసారి ర్యాపిడ్ టెస్టులు చేయిస్తున్నాం’’ అని ‘శాకుంతలం’ చిత్ర వర్గాలు తెలిపాయి. హిందీలో వాయిదా పర్వం టెస్టులు, షూటింగుల మాటెలా ఉన్నా – కరోనా విజృంభణ ఆగడం లేదు. సామాజిక దూరంతో షూటింగులు జరుపుకొంటున్న హిందీ చిత్రసీమ చివరకు మూతపడ్డ హాళ్ళు, వివిధ ప్రాంతాల్లోని కర్ఫ్యూ, లాక్డౌన్, 144 సెక్షన్ల నిబంధనలతో ఏకంగా రిలీజులు వాయిదా వేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు హిందీ సినిమాలు వాయిదా బాట పట్టాయి. రానా నటించిన తెలుగు వెర్షన్ ‘అరణ్య’ రిలీజైంది కానీ, దాని రిలీజుకు మూడు రోజుల ముందే మార్చి 23న హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ రిలీజ్’ను చిత్రనిర్మాణ సంస్థ ఈరోస్ నిరవధికంగా వాయిదా వేసింది. ఇక, అమితాబ్ ‘చెహరే(’ ఏప్రిల్ 9న విడుదల కావాల్సింది. దాన్నీ వాయిదా వేశారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈ నెల 30న రిలీజు చేద్దామనుకున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశి’ సైతం తాజా పరిస్థితుల్లో మళ్ళీ నిరవధికంగా వాయిదా పడింది. ‘బబ్లీ ఔర్ బంటీ 2’ సహా అనేకం ఇప్పటికే పోస్ట్పోనయ్యాయి. కరోనా సెకండ్, ఆపై థర్డ్‌వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ సినిమాలు కానీ, వీటి తరువాత రిలీజనుకున్న ఇతర సినిమాలు కానీ అను కున్నట్టు రిలీ జవడం కచ్చితంగా అనుమానమే! పచ్చిగా చెప్పాలంటే, అసంభవమే!! మూడు నెలల ముచ్చటేనా? నిజానికి, అన్–లాక్డౌన్ తరువాత సినీరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హాలీవుడ్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ వేల కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క గత డిసెంబర్లో హాళ్ళు తెరవడానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. సగం థియేటర్ కెపాసిటీలో సైతం సంక్రాంతి సిన్మాలు ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’ లాంటివి వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ తరువాత ఫిబ్రవరి 5 నుంచి పూర్తి కెపాసిటీకి అనుమతి ఇచ్చాక, తెలుగులో చిన్న, పెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చాయి. ఫిబ్రవరి 12న వచ్చిన ‘ఉప్పెన’తో హాళ్ళు పూర్తిగా హౌస్ ఫుల్ అయి, కరోనా మునుపటి రోజుల్ని గుర్తు చేశాయి. ఇక కరోనాతో జీవితంలో నవ్వు కరవైన జనాన్ని మార్చి 11న వచ్చిన ‘జాతిరత్నాలు’ నవ్వించి, అనూహ్య విజయంతో పాటు, అద్భుతమైన షేర్లు రాబట్టింది. తాజా హాలీవుడ్ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అయితే ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు భాషల్లోనూ తెలుగునాట బాగా ఆడుతోంది. అందుకే, ‘‘గడచిన మూడున్నర నెలల్లో మన దేశం మొత్తం మీద మిగతా సినీపరిశ్రమలతో పోలిస్తే, తెలుగు సినిమాయే బాగుంది. తెలుగు స్ఫూర్తితో తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రసీమల్లోనూ ఉత్సాహం పుంజుకుంది’’ అని తమిళ హీరో కార్తీ, కన్నడ పునీత్ రాజ్ కుమార్ సైతం ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టే క్రమంగా మిగతాచోట్లా వసూళ్లు పెరిగాయి. మాలీవుడ్‌లో మమ్ముట్టి ‘ది ప్రీస్ట్’ కరోనా తర్వాత ఫస్ట్ బ్లాక్‌బస్టరైంది. కోలీవుడ్‌లో ఈ నెల 2న రిలీజైన కార్తీ ‘సుల్తాన్’ మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా గ్రాస్ సాధిం చింది. టాలీవుడ్‌లోనూ భారీ బిజినెస్ జరుగుతోంది. ఏడాది తర్వాత బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతున్నవేళ, ఇదంతా మూడునెలల ముచ్చటేనా అనిపించేలా సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్ళీ కలవరంలోకి నెట్టింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జనంపైనా, సరిగ్గా కరోనా నిబంధనలు పాటించని థియేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి, సుదర్శన్ థియేటర్ల ఓనరైన బాలగోవిందరాజు అంగీకరించారు. అయితే, ‘‘అలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా, ఎకాఎకిన హాళ్ళ కెపాసిటీ 50 శాతం తగ్గించడం మొదలు మూసివేత దాకా సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సినీపరిశ్రమకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో హాళ్ళలో యాభై శాతం కెపాసిటీకే అనుమతి అని షరతు పెడితే వ్యాపారం దాదాపు సున్నాయే. ‘‘ఆ షరతు మళ్ళీ పెడితే – జనం లేకుండా హాళ్ళు నామ్ కే వాస్తే నడుస్తాయే తప్ప, నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రతినిధి అన్నారు. ‘‘కెపాసిటీ 50 శాతమే ఐనా, ఖర్చు మాత్రం ఎప్పటిలానే వంద శాతం తప్పదు’’ అని శాలిబండ సుధా మల్టీప్లెక్స్ ఓనర్ కె. అనుపమ్ రెడ్డి వాపోయారు. కానీ, వ్యాపారం కన్నా జనం క్షేమం బాగుండాలని కోరుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. మూసినా... సగమే తెరిచినా... దెబ్బ మీద దెబ్బే! గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 నెలలకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్న నేపథ్యంలో సహజంగానే అడ్వా¯Œ ్స బుకింగులు జోరుగా సాగుతున్నాయి. కోర్టు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా తెచ్చుకుంటున్న ఉత్తర్వులతో తెలంగాణలో టికెట్ రేట్లూ సింగిల్ స్క్రీన్లలో రూ. 150కి, మల్టీప్లెక్సుల్లో రూ. 200కి ఎగబాకాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో ఓ హౌస్ ఫుల్ స్టార్ సినిమా రిలీజైతే, ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడేవారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే ఉంది. కొందరు ఎగ్జిబిటర్లే అది ఒప్పుకుంటున్నారు. అందుకే లాక్డౌన్ ఉండదనీ, హాళ్ళను మూయబోమనీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా – గుంపుల కొద్దీ జనంతో, వ్యాప్తికి కారణమయ్యే థియేటర్లపై ఆంక్షలు విధించడం పెద్ద పనేమీ కాదు. కర్ణాటక, తమిళనాడు బాటలో ఇతర రాష్ట్రాల్లో సైతం మళ్లీ 50 పర్సెంట్ కెపాసిటీతోనే థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు ఆదేశించేంచే ఛాన్స్ బలంగా ఉంది. తమిళ సర్కారు సైతం ఎన్నికలు ముగిశాక సరిగ్గా ధనుష్ ‘కర్ణన్’ రిలీజు రోజు నుంచి షరతులు పెట్టింది. ‘వకీల్ సాబ్’ సహా తెలుగులోనూ పలుకుబడి గల పెద్దల సినిమాలు రిలీజైపోతాయి గనక, ఇక్కడా హాళ్ళపై ఆంక్షలు రావడం ఖాయం. అదే జరిగితే... కలెక్షన్లే కీలకమైన ‘ఆచార్య’ సహా అనేక స్టార్ సినిమాల రిలీజ్ ప్రశ్నార్థకమే. అదే ఇప్పుడు ఎగ్జిబిటర్లకూ, వారి అడ్వాన్సుల మీద ఆధారపడ్డ బయ్యర్లకూ, వారితో వ్యాపారం చేసి సిన్మా రిలీజు చేసే నిర్మాతలకూ కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. ఒక్కమాటలో – ఇదంతా ఓ చెయిన్ రియాక్షన్. వెరసి, ఇప్పుడిప్పుడే కాళ్ళూ చేతులూ కూడదీసుకుంటున్న సినీ పరిశ్రమపై ఈ సెకండ్ వేవ్‌తో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. తగ్గుతున్న జనం... తరిగిపోతున్న కలెక్షన్లు... కరోనా సెకండ్ వేవ్ సమాజంతో పాటు సినిమా మీదా గట్టిగా ప్రభావం చూపెడుతోంది. ‘‘కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, హాళ్ళకొచ్చే జనం రెండు వారాలుగా తగ్గుతున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక... ఫరవాలేదనుకున్న సినిమాలకు సైతం మంచి కలెక్షన్లే వస్తే, ఇప్పుడు బాగున్న సినిమాలకు కూడా ఫరవా లేదనే స్థాయి కలెక్షన్లయినా రావట్లేదు. అలా కొన్ని సినిమాలు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్‌లో బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోయాయి’’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ టి. బాలగోవిందరాజు వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెల మధ్య దాకా హౌస్ ఫుల్ బోర్డులు చూసిన ఏసీ హాళ్ళలో ప్రస్తుతం సగటున ఆటకు 30 నుంచి 40 శాతం ప్రేక్షకులే ఉంటున్నారు. గత నెల మొదట్లో ఫ్యామిలీలు, ఆడవాళ్ళు, పిల్లలతో కళకళలాడి పూర్వవైభవం వస్తోందని ఆశలు రేపిన హాళ్ళు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మూడు రాష్ట్రాల మార్కెట్ పాయె! తెలుగులో కూడా సినిమాలు ముందుగా ప్లాన్ చేసిన తేదీలకు వస్తాయా అన్నది సందేహమే. మహారాష్ట్రలో హాళ్ళు మూసేస్తే, కన్నడనాట ఈ నెల 7 నుంచి సినిమా హాళ్ళను సగం సీటింగుకే పరిమితం చేశారు. తాజాగా, తమిళనాడులో సైతం ఇవాళ (ఏప్రిల్ 9) నుంచి థియేటర్లలో 50 శాతం సీటింగే అని అక్కడి సర్కారు ప్రకటించింది. అలా ఇప్పుడు మన తెలుగు సినిమాకు ఈ మూడు పొరుగు రాష్ట్రాల మార్కెట్ పోయింది. ఆ దెబ్బ తెలుగు సిన్మా వ్యాపారం పైనా ఉంటుంది. ‘‘మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో హాళ్ళపై వచ్చిన నిర్ణయాల ప్రభావం మన సినీసీమపై ఇప్పటికే పడింది. రేపు పొద్దున మన దగ్గర థియేటర్లు ఎంత కెపాసిటీతో నడుస్తాయి, హాళ్ళు తెరిచి ఉన్నా జనం వస్తారా – ఇలా అందరం రకరకాల అనుమానాలతో ఉన్నాం’’ అని పేరు ప్రచురించవద్దంటూ ఓ సినీ నిర్మాత చెప్పారు. హాళ్ళు మూసిన మరాఠ్వాడా, ఢిల్లీ లాంటి చోట్ల మన సినిమానే రిలీజు కాదు. పెద్ద హీరోల సినిమాలకు బలమైన మార్కెటైన కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల రిలీజైనా సగం కెపాసిటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మారిన పరిస్థితుల్లో బయ్యర్లు సైతం ఒకప్పుడు తాము ఒప్పుకున్న రేట్లకు సినిమా కొంటారా, డబ్బు మొత్తం నిర్మాతలకు కడతారా అన్నదీ అనుమానమే. ఆ మేరకు రిలీజుకు ముందే వ్యాపారం, రిలీజయ్యాక సీటింగ్ తగ్గుదలతో కలెక్షన్లు తెలుగు సినిమా నష్టపోయినట్టే! హాట్‌స్పాట్‌గా హాళ్లు? ఒక హౌస్‌ఫుల్ స్టార్ సినిమా ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో రిలీజవుతుంది. ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడే వారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే పొంచి ఉంది. జనంలో భయం పోయి, నిర్లక్ష్యం పెరిగిందని గమనిస్తున్న కొందరు ఎగ్జిబిటర్లే ఆ సంగతి బాహాటంగా ఒప్పుకుంటున్నారు. పెరుగుతున్న పాజిటివ్‌లు హిందీ, తెలుగు సీమల్లో రోజూ పలువురు ‘పాజిటివ్’గా తేలుతున్నారు. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న నటి నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. దాంతో, ఆమెతో కలసి టీవీ ఇంటర్వ్యూలిచ్చిన అంజలి, అనన్య, దర్శకుడు శ్రీరామ్ వేణు సహా అందరూ టెస్టుల హడావిడి పడ్డారు. హిందీలో పలువురి పేర్లు బయటకు వస్తుంటే, మన దగ్గరేమో బయటపడి చెప్పకుండా హోమ్ క్వారంటైన్లో గడిపేస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. నివేదా ఎఫెక్ట్‌తో అంజలి స్టాఫ్‌కూ కరోనా సోకిందనీ, తనకూ తప్పదని అంజలి సైతం క్వారంటైన్లోకెళ్ళారనీ భోగట్టా. ఆమె మాత్రం తనకు కరోనా రాలేదని ఖండించారు. ఏమైనా, షూటింగుల్లో ఇప్పటికీ పదులమంది కరోనా పాజిటివ్‌గా తేలుతు న్నారు. ఇటీవలే టీజర్ రిలీజైన ఓ భారీ ‘స్టయిలిష్’ సిన్మా సెట్స్‌లో ఒకటికి, రెండు సెట్ల అసిస్టెం ట్లను పెట్టుకొని, ఒకరికి వస్తే మరొకర్ని దింపి, షూటింగ్ కానిచ్చేస్తున్నారు. తెలుగులోనూ... వాయిదాలు షురూ! తాజా పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు దర్శక,నిర్మాతలు గురువారం సాయంత్రం ప్రకటించారు. కానీ,ఈ సెకండ్ వేవ్‌లోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. తెలుగునాట రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి వెళుతుండడంతో రానున్న రోజుల్లో మళ్ళీ షరతులు విధించే అవకాశం ఉంది. నేడో, రేపో తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లలో సగం మందినే అనుమతించే సూచనలున్నాయి. అదే గనక జరిగితే, ‘వకీల్ సాబ్’ మొదలు ఈ నెలలోనే రిలీజు కావాల్సిన రానా ‘విరాటపర్వం’, మే నెలలో వస్తామన్న చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’ లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు ఇరుకున పడడం ఖాయం. పెట్టిన ఖర్చు మేరకు వ్యాపారం జరిగి, వసూళ్ళూ రావాలంటే – పరిస్థితులు చక్కబడే దాకా రిలీజు వాయిదా మినహా మరో మార్గం లేదు. ఈ నెలలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రావాల్సిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ సైతం ఇప్పటికే రిలీజు వాయిదా రూటు పట్టింది. కరోనాకు తోడు గ్రాఫిక్స్ సహా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది గనక ‘ఆచార్య’ వాయిదా ఖాయమైందని ఆంతరంగిక వర్గాల సమాచారం. వెరసి, ఈ డోలాయమాన పరిస్థితిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందో, ఏం జరుగుతుందో సినీరంగంలో ఎవరూ ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. – డాక్టర్ రెంటాల జయదేవ -
టాలీవుడ్, బాలీవుడ్ల మధ్య క్లాష్ తప్పదా..
కోవిడ్ వల్ల సినిమా షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాల సంఖ్య అలా పెరిగిపోయింది. దీంతో రిలీజ్ డేట్స్ బుక్ చేసుకోవడం కీలకమైంది. ఎంత ముందు బుక్ చేసుకున్నా క్లాష్ అనివార్యంలా కనిపిస్తోంది. సౌత్‌లో తెరకెక్కుతున్న పలు భారీ సినిమాలన్నింటినీ ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సౌత్‌లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమాలు, హిందీ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన చిత్రాల్లో సౌత్ వర్సెస్ నార్త్ క్లాష్ వివరాలు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న మన సౌత్ సినిమాలకు క్లాష్ వల్ల ఏదైనా మైనస్ ఉంటుందా? థియేటర్స్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా? నార్త్ ఆడియన్స్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చి ఏ సినిమా బావుంటే అది చూస్తారా? లేక హిందీ సినిమాలకే ఓటు వేస్తారా? క్లాష్ అంటే బిజినెస్‌ని షేర్ చేసుకున్నట్టే. మరి బిజినెస్‌ని షేర్ చేసుకుంటారా? లేక కలిసి కూర్చుని మాట్లాడుకుని, ఒకేసారి కాకుండా డేట్స్‌ని మార్చుకుంటారా చూడాలి. ఆర్ఆర్ఆర్ వర్సెస్ మైదాన్ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా స్పెషల్‌గా అక్టోబర్ 13న విడుదల చేసున్నట్టు ఇటీవలే ప్రకటించారు. దసరా వీకెండ్‌కి హిందీలో అజయ్ దేవగణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ కూడా విడుదల కాబోతోంది. బోనీ కపూర్ ఈ సినిమా నిర్మాత. అక్టోబర్ 15న మైదాన్ రిలీజ్. ‘‘కోవిడ్ వల్ల ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మా సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత కూడా ‘ఆర్ఆర్ఆర్’ వాళ్లు రిలీజ్ డేట్ ఇవ్వడం సరైనదిగా అనిపించడంలేదు’ అని బోనీకపూర్ బాలీవుడ్ మీడియాతో పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాధే శ్యామ్ వర్సెస్ గంగూబాయి ప్రభాస్ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘పద్మావత్’ చిత్రం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఆలియా. పుష్ప వర్సెస్ అటాక్ అల్లు అర్జున్ తొలి ప్యాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ వీక్కి ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హిందీ సినిమాల్లో ఇండిపెండెన్స్ వీక్ కూడా కీలకమైనదే. ఈ ఇండిపెండెన్స్ డే వీక్‌కు వస్తున్నట్టు జాన్ అబ్రహామ్ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘అటాక్’ని ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మేజర్ వర్సెస్ షేర్షా ముంబై తాజ్ అటాక్స్‌లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. కథను అందించి, టైటిల్ రోల్ చేశారు అడివి శేష్. శశి కిరణ్ తిక్క దర్శకుడు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. అదే రోజున సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘షేర్షా’ రిలీజ్ కానుంది. ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ హిందీలో చేసిన తొలి చిత్రమిది. కరణ్ జోహార్ నిర్మించారు. మేజర్, షేర్షా.. రెండూ బయోగ్రఫీ జానర్ కావడం విశేషం. లైగర్ వర్సెస్ భూత్ పోలీస్ పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. కరణ్ జోహార్, చార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్ హీరోలుగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్స్‌లోకి రానుంది. -
థియేటర్లో హరి
శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డర్టీహరి’. ఈ సినిమా మొదట ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ఏటీటీలో డిసెంబర్ 18న, ఆ తర్వాత ఆహాలో విడుదలైంది. ఈ నెల 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా యం.ఎస్. రాజు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లో మా సినిమా ప్రేక్షకులకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ‘డర్టీ హరి’ నిరూపించింది’’ అన్నారు. ‘‘యం.యస్. రాజుగారు సినిమా తీసిన విధానం అద్భుతంగా ఉందని సినిమా చూసినవాళ్లందరూ అంటున్నారు’’ అన్నారు శ్రవణ్‌రెడ్డి. -
సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు..
థియేటర్ నిండితే సినిమా వాళ్లకు కడుపు నిండినంత ఆనందం. కోవిడ్ అన్‌లాక్ వల్ల అర్ధాకలితో నడుస్తున్నాయి థియేటర్స్. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు ఫుల్ మీల్స్ టికెట్ ఇచ్చింది. 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర్శించుకోవచ్చంది. ఇనియ పొంగల్ నల్ వాళ్తుగళ్ చెప్పింది. తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలన్న మాట. పొంగల్ పండుగ నిండుగా జరుపుకోమంది. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కీ 100 శాతం సీటింగ్ అనుమతి వస్తుందా? మన సంక్రాంతి కూడా నిండుగా జరుగుతుందా? కోలీవుడ్ ఖుషీ ఖుషీ సోమవారం కోలీవుడ్ ఇండస్ట్రీ ఖుషీ ఖుషీగా ఉంది. ‘థియేటర్స్ సిస్టమ్ తిరిగి పుంజుకోవాలంటే వంద శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వాలి’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోరింది. ఈ విషయమై తమిళనాడు సీయం పళని స్వామిని స్వయంగా కలిశారు తమిళ స్టార్ విజయ్. ఆయన నటించిన ‘మాస్టర్’, శింబు ‘ఈశ్వరన్’ సినిమాలు పొంగల్‌కి విడుదలవుతున్నాయి. తాజా ప్రకటనపై ఈ రెండు చిత్రబృందాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమిళ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అయితే థియేటర్స్ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిని అన్‌లాక్ చేసినప్పుడు థియేటర్స్ సగం సీటింగ్‌తో నడపడమెందుకు? అనేది ఇంకొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్ నిండుగా కనపడబోతున్నాయి. మనకూ 100శాతం సీటింగ్ ఉంటుందా? 50 శాతం సీటింగ్ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, విజయ్ ‘మాస్టర్’ (డబ్బింగ్), దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్’ విడుదలకు సిద్ధం అయ్యాయి. మరి మన నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతి కోరతారా? నిర్మాతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ► మన దగ్గర కూడా థియేటర్లు నిండుగా ఉంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయమై సంప్రదించాలనుకుంటున్నాం. సంక్రాంతి రిలీజ్‌కు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. 100 శాతం సీటింగ్‌కి అనుమతి లభిస్తే బాగుంటుంది. – సి. కల్యాణ్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు ► యాభై శాతం సీటింగ్ కెపాసిటీ విషయమై ఎంహెచ్ఎ (హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నుంచి ఓ లేఖ అందింది. తమిళనాడు ప్రభుత్వాన్ని దాన్ని ఉపయోగించుకుని వంద శాతం సీటింగ్ కెపాసిటీకి జీవో పాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ గురించి రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. – నిర్మాత డి. సురేశ్‌బాబు -
సినిమా హాళ్లలో పెరుగుతున్న సందడి
సాక్షి, నెట్వర్క్: కోవిడ్ కారణంగా దాదాపు ఎనిమిది నెలలకు పైగా ఇంటర్వెల్ ప్రకటించిన సినిమా హాళ్లు మెల్లగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లో సగానికి పైగా థియేటర్లు తెరవగా... మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటంతో... నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. దీంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ఏర్పాటు చేస్లూ, భౌతికదూరం, మాస్కుల వంటి నిబంధనలు పాటిస్తూ థియేటర్లను తెరుస్తున్నారు. మొదట పాత సినిమాలతో వీటిని తెరవగా... తాజాగా కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రేక్షకుల సంఖ్య కూడా ఏరోజుకారోజు పెరుగుతూనే వస్తోంది. కొత్త సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ కూడా కావడం గమనార్హం. సంక్రాంతికి మరిన్ని కొత్త సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేటర్లకు పూర్తిస్థాయిలో వస్తారని, అప్పటికి థియేటర్లన్నీ తెరుచుకుంటాయని యజమానులు చెబుతున్నారు. కృష్ణా, నెల్లూరుల్లో సగానికి పైగానే.. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, వైఎస్సార్ జిల్లాలో పెద్ద సంఖ్యలో థియేటర్లు తెరుచుకున్నాయి. మిగతా జిల్లాల్లో ఇలా తెరచుకున్న థియేటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇది రోజూ పెరుగుతూ ఉండటం సినీ రంగానికి ఊరటనిస్తోంది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సగానికిపైగానే థియేటర్లు తెరుచుకున్నాయి. కృష్ణాలో మొత్తం 126 థియేటర్లకు గాను 65, నెల్లూరులో 75కి గాను 38 తెరుచుకున్నాయి. ఇక గుంటూరులో 160 థియేటర్లకు గాను 60, వైఎస్సార్ జిల్లాలో 53కు గాను 24, విశాఖలో 82కు గాను 36 థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలైంది. కోవిడ్ నిబంధనల అమలు ఇలా... ► థియేటర్లతో పాటు, పరిసరాలనూ శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. ► టికెట్ల జారీలో ఆఫ్‌లైన్ కన్నా ఆన్లైన్ బుకింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. ► మాస్క్‌ను తప్పనిసరి చేశారు. లేనివారిని టిక్కెట్టున్నా అనుమతించడం లేదు. ► ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి.. టెంపరేచర్ ఎక్కువుంటే వెనక్కి పంపేస్తున్నారు. ► ఎక్కడికక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ ప్రేక్షకులు వాడేలా చూస్తున్నారు. ► మధ్య సీటును వదిలేసి భౌతిక దూరం పాటిస్తున్నారు. బ్లాక్ చేసిన సీట్లకు స్టిక్కరింగ్ చేశారు. ► షోల మధ్య విరామంలో అన్ని సీట్లను శానిటైజ్ చేయటంతో పాటు వాష్‌రూమ్‌లు, క్యాంటీన్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ►ప్రేక్షకులు విధిగా సెల్ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, టిక్కెట్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఇవ్వాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటూ థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తున్నారు గుంటూరులోని పల్లవి థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లా. థియేటర్లోకి వెళ్లే ముందే మాస్క్ ఉందా లేదా అనేది చూశారు. అనంతరం వారే శానిటైజర్‌ను చేతులపై వేస్తున్నారు. లోపల సీటు తరువాత సీటును కేటాయించారు. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తున్నారు. –– సీహెచ్ వంశీ, ప్రేక్షకుడు, గుంటూరు నగరం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకున్నా. మాస్క్ లేకపోతే లోనికి అనుమతించడం లేదు. కొందరికి థియేటర్ నిర్వాహకులే మాస్క్‌లు పంపిణీ చేశారు. చాన్నాళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూశా. థియేటర్లో చూస్తే ఆ ఎక్స్‌పీరియెన్స్ వేరు. టీవీలో అది రాదు. – – హరినా«థ్, ప్రేక్షకుడు, కృష్ణనగర్, గుంటూరు థియేటర్లో ఏర్పాట్లు బాగున్నాయి చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రారంభించడంతో కొత్త సినిమా కాబటిట సోలో బతుకే సో బెటర్ సినిమాకు వెళ్లా. థియేటర్లో కోవిడ్ నిబంధనలు పాటించారు. సీట్ల మధ్య గ్యాప్ ఏర్పాటు చేశారు. థియేటర్ అవరణలో శానిటైజ్ చేస్తున్నారు. ఏర్పాట్లు బాగా ఉన్నాయి. –– తాడి శివ, ప్రేక్షకుడు, విజయవాడ ఆ ఉల్లాసమే వేరు చాలా కాలం తరువాత థియేటర్‌కు వెళ్లి ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చూశా. ఓటీటీల్లో కొత్త సినిమాలు వచ్చినా, స్నేహితులతో కలసి థియేటర్‌కు వెళ్లి చూడటం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. థియేటర్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చు. – ధనబాబు, ప్రేక్షకుడు, మచిలీపట్నం కొత్త సినిమాలు వస్తే ఊపిరి పీల్చుకుంటాం ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ చేస్తున్నాం. సాధారణ పరిస్థితి రావాలంటే కొంత టైమ్ పడుతుంది. సంక్రాంతికి కొత్త సినిమాలు వచ్చాయంటే మేము కాస్త ఊపిరి పీల్చుకుంటాం. – బాబు, థియేటర్ మేనేజర్, మదనపల్లె. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనల ప్రకారం పట్టణంలో సినిమా థియేటర్లు ఇటీవలే ప్రారంభించాం. ప్రతి సీటు, ప్రతి షోకు శానిటైజ్ చేయటంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేసి మాస్క్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నాం. – సీహెచ్.పెద్దబాబు, సినిమా థియేటర్ నిర్వాహకుడు, మార్కాపురం, ప్రకాశం జిల్లా కరోనా భయమైతే ఉంది చాలా రోజుల తర్వాత థియేటర్లో సినిమా చూశా. ఒకవైపు సంతోషం, మరోవైపు కరోనా భయం కూడా ఉంది. థియేటర్లు, సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేయిస్తే ప్రేక్షకులకు భయం తగ్గుతుంది. –ఇమ్రాన్, హిందూపురం, అనంతపురం జిల్లా ప్రేక్షకులు రావడం సంతోషంగా ఉంది దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత థియేటర్లు క్రమంగా తెరుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా కార్మికులకు మళ్లీ ఉపాధి దొరుకుతోంది. ఉత్సాహంగా థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు కూడా మాకు సహకరిస్తున్నారు. – దేవళ్ల సూర్యనారాయణ (బుజ్జి), మారుతి థియేటర్ కా>ంట్రాక్టర్ శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెంకటగౌరి థియేటర్ వద్ద ప్రేక్షకులకు థర్మల్‌స్కాన్ చేస్తున్న సిబ్బంది సినిమా థియేటర్ పరిసరాల్లో కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. -
ఓటీటీకి లాభం రాదు
విజయ్ సేతుపతి, శ్రుతీహాసన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘లాభం’. సామాజిక అంశాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కొట్టిపారేసింది చిత్రబృందం. ‘‘లాభం’ సినిమా ఓటీటీలో విడుదల అవ్వదు. ముందు థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. రెండేళ్ల విరామం తర్వాత శ్రుతీహాసన్ చేసిన తమిళ చిత్రం ఇది. ఇందులో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారు. -
థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల
హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదిలో తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడంతోపాటు అదే రోజు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ‘వండర్ ఉమెన్’ థియేటర్స్‌లోనూ, హెచ్‌బీఓ మ్యాక్స్‌లోనూ ఒకేరోజు విడుదల కానుంది. అదే పద్ధతిని వచ్చే ఏడాది సినిమాలకు కూడా పాటించనున్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమాను థియేటర్స్‌లోనే ప్రదర్శించాలని అందరికీ ఉంటుంది. కానీ వచ్చే ఏడాది మొత్తం సగం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్స్ నడుస్తాయి. సో... ఏ విధంగా వీలుంటే ఆ విధంగా (ఇంట్లోనో, థియేటర్లోనో) సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని వార్నర్ బ్రదర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది వార్నర్ బ్రదర్స్ విడుదల చేసే సినిమాల్లో ‘డ్యూన్, మ్యాట్రిక్స్ 4, టామ్ అండ్ జెర్రీ, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్, ది కంజ్యూరింగ్, ది సూసైడ్ స్క్వాడ్’ వంటి సినిమాలు ఉన్నాయి. -
శుక్రవారం పండగ
శుక్రవారం సినీప్రియులకు ప్రియమైన రోజు. శుక్రవారమైతే కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. అయితే కొన్ని నెలలుగా శుక్రవారం కిక్ మిస్ అయింది. కోవిడ్ వల్ల థియేటర్స్ మూసేశారు. ఈ శుక్రవారం తెలంగాణలో థియేటర్స్ తెరచుకున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ విడుదలైంది. థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంది అన్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ విశేషాలు. సినిమాలో ఉన్న మజా తెలిసేది పెద్ద తెర మీదే. సినిమాను పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేయగలిగేది థియేటర్స్‌లోనే. సినిమాలో ఉన్న ఎనర్జీ తాలూకు రీసౌండ్ వినిపించేదీ థియేటర్స్‌లోనే. 50 శాతం సీటింగ్ కెపాసిటితో తెలంగాణాలో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. ‘థియేటర్స్‌కు రండి. భద్రమైన మూవీ ఎక్స్పీరియన్స్ అందిస్తాం’ అంటూ థియేటర్స్ ఓపెన్ చేశారు. అసలు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూస్తాడా? ఎన్ని టిక్కెట్లు తెగుతాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్ సంఖ్య ఆశాజనకంగా ఉంది అంటున్నారు థియేటర్స్ ఓనర్లు. ‘ఇంత సంఖ్యలో ప్రేక్షకులు రావడం చాలా సంతోషమైన విషయం. ఇది ఇలా కొనసాగితే థియేటర్స్ సిస్టమ్ త్వరగా కోలుకుంటుంది’ అన్నారు కొందరు ఎగ్జిబిటర్స్. ∙ఏయంబీ మల్టీప్లెక్స్‌లో 22 షోలు వేస్తే, అన్ని షోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో మొత్తం 650 సీటింగ్ అంటే.. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో 50 శాతం టిక్కెట్లే అమ్మాలి. అంటే 325 మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. ఆ థియేటర్లో సుమారు 300 టిక్కెట్లు తెగాయని తెలిసింది. అంటే అటూ ఇటూగా స్క్రీన్ నిండినట్లే. ఎల్బీ నగర్‌లోని విజయలక్ష్మీ థియేటర్లో ఉదయం ఆటకు 117 మంది, మధ్యాహ్నం ఆటకు 63 మంది ప్రేక్షకులు కనిపించారని ఓ ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. అలాగే సింగిల్ స్క్రీన్‌లో దేవి థియేటర్‌ను రీ ఓపెన్ చేశారు. ఒక ఆటకు 130 మంది వరకూ వచ్చారట. ‘‘ఇది (‘టెనెట్’) హాలీవుడ్ సినిమా కాబట్టి మాస్ ఏరియాల్లో తక్కువ ఆడియన్స్ కనిపించారు. అదే తెలుగు సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా అసలు ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం మాత్రం తీరిపోయింది. వస్తారని తేలిపోయింది. ఇది శుభపరిణామం. పైగా నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ వంటివాళ్లు థియేటర్లకు వెళ్లడం ఆనందించదగ్గ విషయం. సెలబ్రిటీలు కూడా థియేటర్లకి వెళ్లడంతో ప్రేక్షకుల్లో భయం తగ్గుతుంది. ఇక థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు జాగ్రత్తల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భార్యాభర్తలు మాత్రం ఒక సీటు గ్యాప్ తర్వాత కూర్చుని చూడ్డానికి ఇబ్బందిపడ్డట్లు చెప్పారు’’ అన్నారు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్. స్టార్స్ సందడి ‘‘సినిమా ప్రేమికుడికి థియేటర్‌ను మించిన హ్యాపీ ప్లేస్ ఏంటి? థియేటర్స్‌కు రండి. సినిమాలను ఎంజాయ్ చేయండి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. శానిటైజర్‌ను ఎప్పటికప్పుడు వాడండి’’ అని థియేటర్స్‌కు ప్రేక్షకులను రమ్మంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు సాయిధరమ్ తేజ్. ‘‘9 నెలల తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చాను. థియేటర్స్ సార్... థియేటర్స్ అంతే!’ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. నాగచైతన్య, నిఖిల్, విశ్వక్ సేన్, మారుతి కూడా థియేటర్స్‌కు వెళ్లి సినిమాని వీక్షించినవారిలో ఉన్నారు. ధైర్యంగా అనిపించింది సినిమాకు వచ్చే ప్రేక్షకుడికి భద్రతతో పాటు ధైర్యం కూడా కలిగించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. థియేటర్‌కు వచ్చిన కొందరు ప్రేక్షకుల అనుభవాన్ని పంచుకోమంటే ఇలా అన్నారు. ‘‘శానిటైజేషన్, సీటింగ్‌లో దూరం పాటించడం, ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేయడం బావుంది. ధైర్యంగా అనిపించింది’’ అన్నారు కొందరు. ‘‘సీట్‌కి సీట్‌కి గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రేమికులకు కాస్త ఇబ్బంది అనిపించే అవకాశం ఉంది’’ అన్నారు కొందరు. -
సినిమా చూపించలేం మావా!
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి. హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం. కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్లు తన శోభ కోల్పోకూడదు. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు. -
తెలంగాణ: సినీ ప్రేక్షకులకు తీపికబురు
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గత పది నెలలుగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేరట్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50 మంది ప్రేక్షకులతో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు తెరవవచ్చని తెలిపింది. సినిమా హాళ్లలో మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అలానే ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి షోకు ముందు థియేటర్ల పరిసరాలను శానిటైజేషన్ చేయడం తప్పనిసరి అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. (చదవండి: సినిమాను కాపాడండి) ఇక ఇప్పటికే మేసిఫెస్టోలో కేసీఆర్ సినిమా థియేటర్ల యజమానులకు పలు వెసులుబాట్లు కల్పించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా టికెట్ ధర పెంచుకోవచ్చని తెలపడమే కాక విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తామని.. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ సినిమాలకు ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌తో సాయం చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తామన్నారు. -
నేడే చూడండి టికెట్ కేవలం 50 రూపాయిలే
కోవిడ్ వల్ల థియేటర్స్ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్ ఆఫర్ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, పలు మల్టీప్లెక్స్ చైన్లు. ఆ విశేషాలు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది. కోవిడ్ వల్ల మర్చిపోయిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ ధర జస్ట్ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి. రండీ.. ఆనందించండీ ‘సినిమా విడుదలకు మంచి సీజన్ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్ ప్రతినిధులు. ప్రదర్శితం కానున్న చిత్రాలు యశ్‌రాజ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్ తో పాగల్ హై, వీర్ జరా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. -
మళ్లీ మేజిక్!
థియేటర్లు ఆరంభమయ్యాయి. 50 శాతం సీటింగ్‌తో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారీ సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందేమోననే ఆలోచన చాలామందికి ఉంది. మరి.. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలానే ఆలోచించారేమో. ‘బాహుబలి’ రెండు భాగాలను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మళ్లీ మేజిక్ జరగబోతోంది’’ అంటూ ఈ శుక్రవారం తొలి భాగం, వచ్చే శుక్రవారం మలి భాగాన్ని థియేటర్లు ఆరంభమైన రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
దసరదా లేదు
సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి వంటివి ఇండస్ట్రీకు చాలా ఇష్టమైన సీజన్లు. ఈ సమయంలో థియేటర్స్ నిండుగా ఉంటాయి. సినిమా ఆడితే లాభాలు మెండుగా ఉంటాయి. పండగలే ఫ్యామిలీలను థియేటర్స్‌కు కదిలిస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ వల్ల సమ్మర్ పోయింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే థియేటర్స్ తెరిచారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌లో లేరు. దసరాకి కూడా థియేటర్స్ బిజినెస్‌కు సందడి లేనట్టే. కొత్త సినిమాలేవి? థియేటర్స్‌కి ప్రేక్షకులు రావాలంటే కొత్త సినిమా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నట్టు అనిపిస్తేనే కొత్త సినిమా విడుదల చేయగలం అన్నట్లుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. పాత సినిమాలను ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను నడిపిస్తున్నారు. అయితే వస్తున్న ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈజీగా మూడు కొత్త రిలీజ్లు ఉండే సీజన్ దసరా. ఈసారి ఒక్కటీ లేదు. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు సిద్ధం అవుతాయో అర్థం కాని పరిస్థితి. సినిమాలన్నీ సంక్రాంతికి సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. డిజిటల్ దసరా థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్ ప్రారంభించినప్పటికీ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు విరివిగా విడుదలవుతున్నాయి. బాలకృష్ణ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే చిత్రం అప్పట్లో ప్రారంభం అయింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు. సౌందర్య, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే చిత్రీకరించిన కొంత భాగాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలయింది. సూపర్‌హిట్ సిరీస్ ‘మిర్జాపూర్’కి సీక్వెల్‌గా ‘మిర్జాపూర్ 2’ తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. టబు, ఇషాన్ కట్టర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్లో దసరా సందడి కనబడుతోంది. సందడి మళ్లీ సంక్రాంతికేనా? దీపావళి, క్రిస్మస్ సీజన్లోనూ కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆల్రెడీ రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తదితర చిత్రాలు కూడా పండగకి రానున్నాయి. మరి.. కొత్త సినిమాలతో సంక్రాంతికైనా థియేటర్లు కళకళాలాడతాయా? చూడాలి. -
ప్రేక్షకులు ఎక్కడ?
నిండుగా ఉంటేనే థియేటర్స్‌కి అందం. థియేటర్స్ నడిపేవారికి ఆనందం. థియేటర్ గేట్‌కి హౌస్‌ఫుల్ బోర్డ్‌కి మించిన మెడల్ ఏముంటుంది? అయితే కరోనా థియేటర్స్ బిజినెస్‌ను బాగా దెబ్బకొట్టింది. ఏడు నెలలు ఖాళీగా, సందడి లేకుండా ఉండిపోయాయి హాళ్లు. థియేటర్స్ మళ్లీ తెర్చుకోండి, కానీ కొన్ని షరతులు అంది ప్రభుత్వం. 50 శాతం మించి ఆడియన్స్‌కు అనుమతి లేదు. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. మరి థియేటర్స్‌కి ప్రేక్షకులు వచ్చారా? పరిస్థితి ఏంటి? చూద్దాం. లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లు మూసివేసి ఉన్నప్పుడు, ప్రేక్షకులు వస్తారో రారా అనేది పక్కనపెడితే ముందైతే థియేటర్స్ తెరవాలి, దాన్ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? అనే వాదనలు వినిపించాయి. జాగ్రత్తలు తీసుకుందాం, జనమే అలవాటు పడతారు అనే ధైర్యం కూడా ఉంది థియేటర్స్ యాజమాన్యంలో. అక్టోబర్ 15నుంచి థియేటర్స్ తెరుచుకోమని, గైడ్‌లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి ఉండడంతో కొత్త చిత్రాలేవీ రిలీజ్ చేయలేదు. గతంలో విడుదలైన చిత్రాలనే మళ్లీ ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో మునుపటికంటే టికెట్ రేట్ చాలా తగ్గించారు. ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షించే భాగంలో ఇదొకటì . అయితే థియేటర్స్‌కి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం షాక్‌కి గురి చేస్తోంది. పలు చోట్ల పట్టుమని పదిమంది కూడా కనిపించలేదట. ఢిల్లీలో... ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో కోవిడ్ గైడ్‌లైన్స్‌తో థియేటర్ గేట్లు తెరిచారు. 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో 150 వరకు అనుమతిస్తూ, టికెట్ కౌంటర్ వద్ద సిబ్బంది టికెట్లు తెంచడానికి రెడీ అయ్యారు. ఏడు నెలలవుతోంది, టికెట్లు చింపి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవాళ్లకు చిన్న షాక్ తగిలింది. కేవలం ఐదుగురు మాత్రమే సినిమా చూడటానికి వచ్చారు. ఇంకెవరైనా వస్తారని అరగంట ఆగారు. ఉహూ... వచ్చిన ఆ ఐదుగురికి సినిమా వేశారు. ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే కుతూహలంతోనే వచ్చాను’ అని సమాధానమిచ్చాడో ప్రేక్షకుడు. గురువారం మ్యాట్నీ షో పరిస్థితి ఇది. శుక్రవారం కుటుంబంతో కలసి సినిమా చూడాలని ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆ థియేటర్‌కి వచ్చిన వ్యక్తి, ‘ఇంకా ఇంట్లోనే ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందుకే థియేటర్లో సినిమా చూడాలనుకున్నాం’ అనడం విశేషం. వైజాగ్‌లో.. వైజాగ్‌లో వరుణ్ ఐనాక్స్, పూర్ణ అనే థియేటర్‌ను ఓపెన్ చేశారు. ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల సంఖ్య పదికి దాటలేదు. వైజాగ్‌లో రాత్రి 7 గంటల షో ఎప్పుడూ హౌస్‌ఫుల్. అది కూడా ఏడుగురుకంటే ఎక్కువ మంది లేరట. ఇలా షోకి వెయ్యి రూపాయిల వసూళ్లు కూడా రావడంలేదట. ఓ మూడు పాత ఇంగ్లిష్ సినిమాలను రిలీజ్‌కి రెడీ చేసి, ప్రేక్షకులు రాకపోవడంతో షోలు రద్దు కూడా చేశారని సమాచారం. ఖర్చులు కూడా మిగలవు థియేటర్స్‌లో ఒక్క షో వేస్తే... తెగిన టికెట్లు, కరెంటు బిల్లులు, థియేటర్ రెంటు ఇలా ప్రతీది లెక్క కట్టుకుని మిగిలినది లాభం. ఇక వసూళ్లు వెయ్యి రూపాయిలైతే కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావు. ఇలా నడపడమెందుకు? అనే ఆలోచన కూడా రాకమానదు. ఈ క్లిష్ట పరిస్థితి గురించి చర్చించడానికి థియేటర్స్ యూనియన్‌కి సంబంధించి త్వరలో ఓ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. పాత సినిమాలు కదా, థియేటర్స్‌కి ఏం వెళ్తాం అని ప్రేక్షకులు భావిస్తున్నారా? కరోనా టైమ్‌లో ఇంటిపట్టున ఉండటం బెటర్ అనుకుంటున్నారా? కొత్త సినిమాలు పడితే థియేటర్స్ వైపు నడుస్తారా? థియేటర్స్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు? ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే. -
పాత సినిమాలు... కొత్త సందడి
నేటి నుంచి థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. థియేటర్స్‌ను నమ్ముకున్నవాళ్లకు సందడి మొదలుకానుంది. అయితే థియేటర్స్‌కి ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారా? కొత్త సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? ప్రస్తుతానికి ప్రశ్నలే. పరిస్థితిని బట్టి సమాధానాలు దొరుకుతాయి. అయితే థియేటర్స్ తిరిగి ఓపెన్ అవుతున్న సందర్భంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్లో రీ–రిలీజ్ కాబోతున్న చిత్రాల విశేషాలు. ఆ సినిమాలను ప్రదర్శించం లాక్డౌన్ సమయంలో పలు సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. థియేట్రికల్ విడుదల కాకుండా ఓటీటీలో విడుదలయిన సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించం అని ప్రకటించాయి పలు మల్టీప్లెక్స్ సంస్థలు. ఆ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పుడే మల్టీప్లెక్స్ సంస్థలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్ ‘శకుంతలా దేవి’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’, జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’, ‘సడక్ 2’ వంటి సినిమాలను తమ థియేటర్స్‌లో ప్రదర్శించేది లేదని ఐనాక్స్, పీవీఆర్, సినీపోలీస్, కార్నివాల్ వంటి మల్టీప్లెక్స్ అధినేతలు నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం మోదీ’. వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. 2019లో విడుదలైన ఈ సినిమా నేడు మళ్లీ థియేటర్స్‌లోకి రానుంది. ‘ఈ సినిమా మరింత మందికి చేరువ అవ్వడానికి ఇదో మంచి అవకాశం’ అని అన్నారు చిత్రనిర్మాతలు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘వార్’. గత ఏడాది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా సాధించింది. ఈ సినిమాను మళ్లీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు నిర్మాతలు. అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘తన్హాజీ’, ఆయుష్మాన్ ఖురానా నటించిన సందేశాత్మక చిత్రం ‘శుభమంగళ్ సావధాన్’, తాప్సీ లీడ్ రోల్ చేసిన ‘థప్పడ్’, ఆదిత్యా రాయ్ కపూర్, దిశా పటానీ నటించిన ‘మలంగ్’ సినిమాలు కూడా మళ్లీ విడుదల కానున్నాయి. వీటికి తోడు ఇటీవలే ‘పే ఫర్ వ్యూ’ (డబ్బుకట్టి సినిమా చూడటం) పద్ధతిలో విడుదలయిన హిందీ చిత్రం ‘ఖాలీ పీలీ’, తమిళ చిత్రం ‘కాపే రణసింగం’ అక్టోబర్ 16 నుంచి థియేటర్స్‌లోకి రానున్నాయి. -
తమిళనాడులో థియేటర్స్ తెరవరా?
థియేటర్స్ తెరవాలని ఏడు నెలలుగా థియేటర్స్ ఓనర్స్, నిర్మాతలు.. ఇలా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 15 నుంచి థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే పాటించాల్సిన గైడ్‌లైన్స్ కూడా సూచించింది. కానీ తమిళనాడులో థియేటర్స్ ప్రారంభం అవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. తమిళనాడు రాష్ట్ర మంత్రి కడంబూర్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. సినిమా థియేటర్స్ ప్రారంభించే అవకాశం లేదని పేర్కొన్నారు. ‘థియేటర్స్ అంటే ఎక్కువమంది జనం చేరే చోటు. ఇప్పుడు అది అంత శ్రేయస్కరం కాదు. అందుకని త్వరలో థియేటర్స్ ఓపెన్ చేయడానికి కుదరకపోవచ్చు. ఏదైనా ముఖ్యమంత్రితో చర్చించి ప్రకటిస్తాం’ అని తెలిపారు. -
సినిమా థియేటర్లను ఆదుకోవాలి
‘‘కోవిడ్ కారణంగా ఆర్నెళ్లుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ నెల 15 నుంచి 50 శాతం సీట్లు నిండేలా థియేటర్లు ప్రారంభించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా థియేటర్లు తెరుచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పెద్ద మనసుతో అనుమతించాలి’’ అని ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం పలువురు థియేటర్ యజమానులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘థియేటర్లు మూత పడటంతో తీవ్రంగా నష్టపోయాం. ఎన్నో వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపరు. కనీసం సగం సీట్లు నిండినా మాకు సంతోషమే. ప్రేక్షకులకు కోవిడ్ సోకకుండా శానిటైజర్లతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. టికెట్లు చేతితో తాకకుండా చూసుకుంటాం. విశ్రాంతి సమయంలో ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు చేపడతాం. థియేటర్లకు ఎక్కువ కరెంటు బిల్లులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఆదుకుంటేనే సినిమా థియేటర్ల పరిశ్రమ పూర్వవైభవం తెచ్చుకుంటుంది’’ అన్నారు. -
పారితోషికం కట్
‘‘కరోనా ప్రభావం నుంచి అందరం కోలుకోవడం ప్రారంభించాం. ఇండస్ట్రీ పనులు మెల్లిగా మొదలయ్యాయి. థియేటర్స్ తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్లు నిండుతాయా? ఫారిన్ మార్కెట్ సంగతి ఏంటి? ఇలా మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు, ప్రశ్నలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొంది యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. శనివారం ఓ ప్రెస్‌నోట్‌ని కూడా విడుదల చేశారు. పారితోషికం తగ్గించుకునే విషయం ఇందులో ఓ ముఖ్యాంశం. ఆ ప్రెస్‌నోట్ వివరాలు. ‘‘కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఆర్టిస్టులు ఎప్పుడూ మొదటి అడుగు వేస్తూ ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరియు గిల్డ్ కలసి ఆర్టిస్టులు పారితోషికాన్ని (లాక్డౌన్ ముందు తీసుకుంటున్న లెక్క ప్రకారం) 20 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించాం. రోజుకి ఇరవై వేలు వరకూ తీసుకుంటున్న ఆర్టిస్టులను ఇందులో నుంచి మినహాయించాం. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... సినిమాకు 5 లక్షలు వరకు తీసుకుంటున్న వారిని 20 శాతం తగ్గించుకోవడం నుంచి మినహాయించాం. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఎప్పటిలానే పారితోషికాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ నిర్ణయం అందరికీ వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
బొమ్మొచ్చె వేళాయెరా
అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్‌తో సినిమాలు ప్రదర్శించుకోవచ్చు ఏడు నెలల నిరీక్షణ ఫలించింది. ఇన్ని రోజులూ తాళాలేసిన థియేటర్స్‌ని తెరవబోతున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ బ్రేక్ ముగిసింది. ప్రొజెక్టర్ల దుమ్ము దులపబోతున్నారు. పాప్ కార్న్ ఎప్పటిలానే పొంగబోతోంది. నిశ్శబ్దంగా మారిన సినిమా హాళ్లలో సందడి మొదలవ్వనుంది. సినిమాను సినిమాలా చూసే అసలైన మజా మళ్లీ రానుంది. కొంత గ్యాప్ తర్వాత తెరపై బొమ్మొచ్చె వేళయింది. సినీ ప్రేమికుల పండగ మొదలవ్వనుంది. ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారో చూద్దాం... కరోనా వైరస్.. లాక్డౌన్ వల్ల చాలా సినిమాలు చిత్రీకరణ ఆగిపోయాయి. కానీ లాక్‌డౌన్‌లోనే రామ్‌గోపాల్ వర్మ పలు సినిమాలను చిత్రీకరించారు. అందులో ‘కరోనా వైరస్’ ఒకటి. లాక్డౌన్ వల్ల ఇంట్లో చిక్కుకుపోయిన ఓ కుటుంబం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ తెరుచుకున్న తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే అని ట్వీట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ. లాక్డౌన్ 5లో భాగంగా థియేటర్స్ రీఓపెన్ చేయటం ఆనందమే. కానీ, దీనికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి థియేటర్ యాజమాన్యాలు కరెంట్ బిల్లులు కట్టని కారణంగా అందరి పవర్ ఫ్యూజ్‌లు తీసుకుని వెళ్లారు సంబంధిత అధికారులు. అలాగే థియేటర్లు నడవాలంటే కంటెంట్ కావాలి. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎవ్వరి దగ్గరా కంటెంట్ లేదు. ఒకవేళ ఏదైనా సినిమా కంటెంట్ ఉన్నా డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని డబ్బులు ఇచ్చి కొనరు. కేంద్రప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. గతంలో ఉన్న ఖర్చులకంటే ఇప్పుడు థియేటర్లకు శానిటైజేషన్ రూపంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా అరికట్టాలి? అసలు జనాలు వస్తారా, రారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ థియేటర్లు ఆరంభించాకే సమాధానం దొరుకుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. – డి.సురేశ్‌కుమార్, సాయి సినీచిత్ర (వెస్ట్‌గోదావరి డిస్ట్రిబ్యూటర్) థియేటర్లు ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నాం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాలిడే. తర్వాత శని, ఆదివారం కావటంతో సోమవారం గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకటిస్తుందనుకుంటున్నాం. మా థియేటర్‌ను పూర్తి స్థాయిలో రెడీ చేయటానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మా థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని షోలకు థియేటర్‌ను ఎలా శానిటైజ్ చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. – అరుణ్, శ్రీరాములు థియేటర్, హైదరాబాద్ బుధవారం సెంట్రల్ గవర్నమెంట్ వారు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పగానే గురువారం మా స్టాఫ్ అందరినీ పనుల్లోకి రమ్మని చెప్పాం. థియేటర్లో సీటు సీటుకి మధ్య గ్యాప్‌కోసం థర్మాకోల్ షీట్‌ను అమరుస్తున్నాం. ప్రతి షోకి శానిటైజేషన్ చేయటానికి మా స్టాఫ్‌కి తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం సినిమాలను కొనే పరిస్థితుల్లో లేం. మా డిస్ట్రిబ్యూటర్స్ ఏ సినిమా ఇచ్చి ఆడించమంటే ఆ సినిమా ఆడిస్తాం. – కుమార్, దేవి 70 ఎం.ఎం థియేటర్ మేనేజర్, హైదరాబాద్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి షోకు శానిటేజైషన్ చేయటం వల్ల నెలకు దాదాపు 40 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఖర్చు అదనంగా పెరుగుతుంది. అలాగే థియేటర్‌కి వచ్చి టికెట్ తీసుకునే ప్రేక్షకుల నుంచి డబ్బును తీసుకోవడానికి కూడా సెపరేట్‌గా శానిటైజ్ చేయటానికి కొత్త మిషన్లను తీసుకోవాలనుకుంటున్నాం. – శ్రీనివాసరెడ్డి -
15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 15 నుంచి అనుమతించేవి.. ► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది. ► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు. ► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది. ► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు.. ► అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి. ► ఆన్లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు. ► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. ► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు. ► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి. ► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లోని పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. 50 శాతం భర్తీకి అనుమతి.. ► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి. ► హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం.. ► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. ► కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ► కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్ విధించరాదు. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
ఆరు నెలల గరిష్టానికి మార్కెట్
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు పుంజుకొని 74.32కు చేరడం, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, వినోద రంగ పరిశ్రమ (సినిమా హాళ్లు తెరవడానికి)మరిన్ని వెసులుబాట్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం, మూడు ప్రైవేట్ బ్యాంక్‌లను ఎఫ్టీఎస్ఈ గ్లోబల్ ఇండెక్స్‌లో చేర్చడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 38,799 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,466 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అప్రమత్తత అవసరం... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ లాభాలు అంతకంతకూ పెరుగుతూనే పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 125 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. నిధుల వరద పారుతుండటంతో మార్కెట్ జోరుగా పెరుగుతోందని, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్మా చికిత్సకు అమెరికా ఎఫ్‌డీఏ ఓకే... కరోనా వైరస్ సోకిన రోగులకు ప్లాస్మా చికిత్స చేయడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ను ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవడానికి కొన్ని నిబంధనలను సడలించాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఫలితంగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం యూరప్ మార్కెట్లు 2 శాతం రేంజ్లో లాభపడ్డాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 3.5% లాభంతో రూ.1,387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. హీరో మోటొకార్ప్, ఆఫిల్ ఇండియా, ఇమామి, సనోఫి ఇండియా, ఎస్ఆర్ఎఫ్, ఆర్తి డ్రగ్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ముంబై ఇంటర్నేషనల్ ఏయిర్‌పోర్ట్‌లో 74 శాతం వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 7 శాతం లాభంతో రూ.249 వద్ద ముగిసింది. ఈ గ్రూప్‌లోని ఇతర షేర్లు కూడా లాభపడ్డాయి. ► రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ. 1 ముఖ విలువ పది షేర్లుగా విభజన చేసిన నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేర్ ఇంట్రాడేలో 10 శాతం ఎగసింది. చివరకు 0.36 శాతం లాభంతో రూ.2,178 వద్ద ముగిసింది. ► దాదాపు 450కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, రెప్కో హోమ్ ఫైనాన్స్, అరవింద్ ఫ్యాషన్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఓటీటీకే ఓటు
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో దక్షిణాదిన ఓటీటీ బాట పట్టిన తొలి సినిమా సూర్య నిర్మించిన ‘పొన్ మగళ్ వందాళ్’. జ్యోతిక లీడ్ రోల్లో నటించారు. ఈ నిర్ణయం వల్ల తమిళ డిస్ట్రిబ్యూటర్స్ సంఘం నుంచి సూర్యకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఇకపై సూర్య నటించే సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించమన్నారు. ఇది జరిగి ఆల్రెడీ మూడు నెలలయింది. కానీ ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు ఓటీటీలో విడుదలకు రెడీ కావడంతో పంపిణీదారుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. మీడియమ్ బడ్జెట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ చిత్రాలు కూడా రాబోతున్నాయి. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారు? తెరిస్తే ప్రేక్షకులు థియేటర్స్ వరకూ వస్తారా? రారా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. అందుకే సూర్య మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటించిన పెద్ద బడ్జెట్ సినిమా ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’) చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సూర్య బాటలోనే పలువురు తమిళ స్టార్ హీరోలు తమ సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. విజయ్ నటించిన ‘మాస్టర్’, విశాల్ నటించిన ‘చక్ర’, ధనుష్ ‘జగమే తందిరం’, ‘జయం’ రవి ‘భూమి’ కూడా ఓటీ టీలో విడుదలవుతాయని టాక్. ఈ చిత్రాల వివరాలు చూద్దాం. మాస్టర్ తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించారు విజయ్. ఆ మధ్య ‘మాస్టర్’ ఓటీటీలో వస్తోందనే వార్తలను ఈ చిత్రనిర్మాత గ్జేవియర్ బ్రిట్టో కొట్టిపారేశారు. ‘మాస్టర్’ కచ్చితంగా థియేటర్స్‌లోనే వస్తాడని స్పష్టం చేశారు. కానీ ఈ సినిమా ఓటీటీలోనే విడుదల కానుందనే వార్త మరోసారి ప్రచారంలోకి వచ్చింది. మరి.. ‘మాస్టర్’ ప్లాన్ ఏంటో చూడాలి. జగమే తందిరం ధనుష్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘జగమే తందిరం’. తెలుగులో ‘జగమే తంత్రం’గా విడుదల కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. యస్. శశికాంత్ నిర్మాత. ఈ చిత్రం మే 1న విడుదల కావాలి. అయితే కరోనా వల్ల వాయిదా పడింది. మీకు ఇబ్బంది అయితే ఓటీటీలో అయినా విడుదల చేసుకోండి అని ధనుష్ తన నిర్మాతలకు చెప్పినట్టు చిత్రబృందం ఆ మధ్య తెలిపింది. భూమి ‘జయం’ రవి, నిధీ అగర్వాల్ నటించిన చిత్రం ‘భూమి’. రైతుల సమస్యల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా మే 1న విడుదల కావాలి. కానీ వాయిదా సూరరై పోట్రు సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలవుతుంది. పైలట్ కావాలని కలలుకనే వ్యక్తిగా సూర్య కనిపించనున్నారు. ఆయన గురువుగా మోహన్‌బాబు నటించారు. సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సూర్య. ‘‘సినిమాను ప్రేక్షకుల వద్దకు సరైన సమయంలో తీసుకెళ్లడం నిర్మాత పని. ఈ నిర్ణయాన్ని నటుడిగా కాదు.. నిర్మాతగా తీసుకున్నాను. మళ్లీ థియేటర్స్ ప్రారంభం అయి అందరూ సంతోషంగా థియేటర్స్‌కి వెళ్లే సమయానికి మరో సినిమాతో సినిమా హాళ్లలో వినోదం అందిస్తాను’’ అన్నారు సూర్య. అలాగే కోవిడ్ కోసం కష్టపడుతున్న వారికి 5 కోట్లు విరాళాన్ని (ఈ చిత్రం రిలీజ్ ఖర్చులలో నుంచి) కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. చక్ర విశాల్ హీరోగా నటించి, నిర్మించిన యాక్షన్ చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. యంయస్ ఆనందన్ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలయిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ అని సమాచారం. థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకూ వేచి చూడటం కన్నా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీయే బెస్ట్ అనే ఆలోచనతో ఓటీటీకే స్టార్స్ ఓటు వేస్తున్నారని ఊహించవచ్చు. నిర్మాతకు లాభసాటిగా ఉంటే ఓటీటీయే బెస్ట్ అని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మళ్లీ థియేటర్స్‌కి వెళ్లడం సాధారణం అయ్యాక సినిమాలను ఎప్పటిలానే నేరుగా థియేటర్స్‌లోనే విడుదల చేస్తారు. ఎందుకంటే ‘బిగ్ స్క్రీన్’లో సినిమా చూస్తే ఆ అనుభూతే వేరు. ఇది మొత్తం సినిమా పరిశ్రమ అంటున్న మాట. -
మరో ఏడాది థియేటర్లు ఉండవు
‘‘మరో ఏడాది వరకూ థియేటర్లు రీ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మొదటివారం మా సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందనే టాక్ ఇక వినిపించనట్లే. ‘స్టార్ సిస్టమ్’ (స్టార్ హీరోలను ఉద్దేశించి) ఇక నశించినట్లే’’ అని బాలీవుడ్ ప్రముఖ దర్శక–నిర్మాత–నటుడు శేఖర్ కపూర్ సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘2020 మార్చి నుండి సినిమాల మొదటి వారం వ్యాపారం గురించి ఊసే లేదు. మరో ఏడాది వరకు సినిమాలు థియేటర్లో విడుదలయ్యే పరిస్థితి లేదు. అసలు ఆ అవకాశం కనుచూపు మేరలో లేదు. అందుకే స్టార్స్ తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసుకోవడానికి రెడీ అయిపోవాలి. సొంత యాప్‌లతో వాళ్లు సిద్ధంగా ఉండాలి. ఇవాళ టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉంది’’ అని కూడా అన్నారు శేఖర్ కపూర్. ఇప్పటికే అక్షయ్ కుమార్ (‘లక్ష్మీ బాంబ్’), అజయ్ దేవగన్ (భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా) వంటి స్టార్స్ చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శేఖర్ కపూర్ అన్నట్లు భవిష్యత్తులో సినిమా బాక్సాఫీస్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లను చూసే అవకాశం లేదా? కాలమే చెప్పాలి. -
సినీ పరిశ్రమ అభివృద్ధికి బెస్ట్ పాలసీ
‘‘సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టబోతున్నాం’’ అని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినిమా, టీవీ షూటింగ్ అనుమతులు, థియేటర్ల రీ ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్ల ప్రతినిధులతో తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్‌బాబు గురువారం సమావేశం నిర్వహించారు. సినిమా థియేటర్లకు ప్రత్యేక విద్యుత్ టారిఫ్, ఫ్లెక్సీ టికెటింగ్ ధరలు, ఆన్లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. ‘‘సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీలో ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. సమావేశంలో చర్చించిన అంశాలు, నిర్ణయాలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం కొరకు పంపించడం జరగుతుంది’’ అని తలసాని చెప్పారు. సినీ రంగానికి చెందిన ప్రతినిధులు షూటింగ్ ప్రదేశాలలో, థియేటర్లలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొనగా, పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. ఈ సమావేశంలో నటుడు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్. శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సి. కళ్యాణ్, కేఎస్ రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ల ప్రతినిధులు బాపినీడు, పి. కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళీ మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవ్–ఇన్–సినిమా?
థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుందనే మాట వినిపిస్తూనే ఉంది. తాజాగా కరోనా వల్ల థియేటర్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. దాంతో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో (అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటివి) విడుదలకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పలువురి అభిప్రాయం. ఆడియన్స్‌ని ఎలా రప్పించాలి అని ఆలోచిస్తున్నారు దర్శక–నిర్మాతలు. ఈ విషయమై ‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీటర్ లో తన అభిప్రాయాలను పంచుకుంటూ, నెటిజన్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ‘‘థియేటర్స్ లో కుడా మద్యం అనుమతి ఇస్తే ఎక్కువ మంది థియేటర్ కి వస్తారా?’’, ‘డ్రైవ్ ఇన్స్ లో సినిమా ఐడియా ఎలా ఉంటుంది. బయటే అందరూ కార్లు, బైక్‌లు పార్క్ చేసుకొని సినిమా చూడొచ్చు. పాత కాలం టూరింగ్ టాకీస్ లాగా?’’ అని ట్వీట్ చేశారు నాగ్ అశ్విన్. మద్యం అనుమతి అనే ఆలోచనకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఏది ఏమైనా లాక్ డౌన్ పూర్తయ్యాక ఎలా ఉంటుందో? ఆడియన్స్ ను థియేటర్ కి ఎలా రప్పించాలో అని కొత్త కొత్త ఆలోచనలతో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. -
మూడు నెలలు థియేటర్లు మూత
కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి, థియేటర్స్ మూత పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇకౖపై కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులను అలవాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మరి... ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌ను మళ్లీ ఓపెన్ చేయడమనే విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. (నాడు మోసం.. నేడు మౌనం!) ‘‘ఈ పరిస్థితుల్లో థియేటర్స్‌ను ఓపెన్ చేస్తే సమస్యలు వస్తాయి. ఒకవేళ థియేటర్స్‌ను ఓపెన్ చేసినప్పటికీ కరోనా భయంతో ప్రేక్షకులు రాకపోవచ్చు. అలాగే సామాజిక దూరం పాటించడం కోసం థియేటర్స్‌లోని సీటింగ్ విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సీటింగ్ విషయంలో వీలైనంత త్వరగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ జిల్లా స్థాయి థియేటర్స్‌లో సీటింగ్‌లో మార్పులు చేస్తే వారు ఆర్థికంగా ఇబ్బందిపడొచ్చు. ప్రస్తుతానికైతే మరో రెండు నుంచి మూడు నెలలపాటు థియేటర్స్‌ను రీ ఓపెన్ చేయడం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేదు. కొన్ని షరతులతో థియేటర్స్ ఓపెన్ చేయమని కొందరు అంటుంటే మరికొందరు కొంత కాలం వేచి చూద్దాం అంటున్నారు. అలాగే షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం పట్ల కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు తలసాని శ్రీనివాస యాదవ్. సో.. మరో మూడు నెలల వరకూ థియేటర్ల మూత ఖాయం అనుకోవచ్చు. -
బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు
‘‘ప్రస్తుతం అందరూ ఓటీటీ వేదికల్లో సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రభావం థియేటర్స్ మీద ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్‌కి ప్రత్యామ్నాయం థియేటరే. బిగ్ స్క్రీన్ అనుభూతే వేరు’’ అన్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్. ‘టాటా బిర్లా మధ్యలో లైలా, ప్రేమ ఇష్క్ కాదల్, హుషారు’ వంటి సినిమాలు నిర్మించారాయన. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోవాలని కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీలపై ఉంది. దీన్ని అందరూ బాధ్యతగా భావించి పోరాడాలి. ఓటీటీ ప్రభావం థియేటర్స్ మీద ఉండదు. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో సినిమాలకు రారు అన్నారు. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్‌తో ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నాను. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెడతాం. ఆ తర్వాత శ్రీ విష్ణుతో కూడా ఓ సినిమా ప్లాన్ చేశాం. ‘రోటీ– కపడా– రొమాన్స్’ అనే మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ‘దిల్’ రాజుగారితో కొన్ని సినిమాలు కలసి చేయబోతున్నాను’’ అని తెలిపారు. -
ఎల్ఈడీ సినిమా తెర
ఇప్పటి వరకు ఎల్ఈడీ టీవీలనే చూశాం. ఇకపై సినిమా థియేటర్లలో కూడా ఎల్ఈడీ తెరను చూడవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ఎల్ఈడీ తెరను ఇటీవల ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఈడీ సినిమా తెర ఇదే. శామ్సంగ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. మామూలు తెరతో పోలిస్తే ఎల్ఈడీ తెరపై సినిమా మరింత ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపిస్తుందని, శబ్దం కూడా క్లియర్‌గా ఉంటుందని పీవీఆర్ మల్లీప్లెక్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. ఎల్ఈడీ తెరకు ప్రొజెక్టర్ అవసరం ఉండదు. మామూలుగా సినిమా నడిచేటప్పుడు హాల్లో లైట్లన్నీ ఆర్పేస్తారు. అయితే, ఎల్ఈడీ తెర ఉంటే లైట్లు ఆర్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో లైట్లు ఉన్నా సినిమా చూడటా నికి ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు. ఈ తెర ఏర్పాటుకు రూ.7 కోట్లు ఖర్చయింది. 2017లో తొలిసారిగా కొరియాలో ఎల్ఈడీ తెర(ఆనిక్స్ స్క్రీన్)ను పరిచయం చేశామని, ఇంతవరకు ప్రపంచంలో 12 చోట్ల ఈ తెర లున్నాయని శామ్సంగ్ ప్రతినిధి చెప్పారు. -
తెరతరాల చరిత
సినిమా అంటే ఓ క్రేజ్.. ఓ అద్భుత ప్రపంచం. సామాన్యుడి నుంచి స్థితిమంతుడి వరకు తమ జీవితాలను సినిమాల్లోని పాత్రలకు అన్వయించుకుని మురిసిపోతుంటారు. హీరో, హీరోయిన్లను అనుకరిస్తూ ముందుకుసాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రజల జీవితాల్లో సినిమాలు ఓ భాగమైపోయాయి. సినిమాలు ప్రదర్శించే థియేటర్లలో కాలక్రమేణా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పటి టూరింగ్ టాకిస్ల నుంచి నేటి మల్టీఫ్లెక్స్‌ల స్థాయికి చేరుకున్నాయి. అడుగడుగునా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అబ్బురపరుస్తున్నాయి. సాంకేతికత పుణ్యమా అని భారీనష్టాల నుంచి లాభాల దిశగా థియేటర్లు పయనిస్తున్నాయి. సినిమా థియేటర్ల ప్రస్థానంపై ఈ వారం సండే స్పెషల్. కొవ్వూరు రూరల్ : జిల్లాలో ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లిన సినిమా థిథియేటర్లు దశాబ్ద కాలం నుంచి రెండేళ్ల కిందటి వరకు భారీ నష్టాలతో మూతపడ్డాయి. చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్‌లుగా, రైస్‌మిల్లులుగా రూపాంతరం చెందాయి. పాతతరంలో ఎన్ని థియేటర్లు ఉన్నా తక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవడం వల్ల ఎక్కువ రోజులు ఆడి థియేటర్ల యజమానులకు లాభాలు పండించేవి. రానురాను వారం ఆడితే చాలు అనే స్థాయికి సినిమాలు మారిపోవడంతో థియేటర్ల యజమానులకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం 100 థియేటర్లు ఒకప్పుడు పల్లెటూళ్లలో టూరింగ్ టాకిస్లు ఉండేవి. చుట్టూ తడికలు కట్టి రాత్రిపూట మాత్రమే సినిమా ప్రదర్శించేవారు. వాటిస్థానంలో సినిమా థియేటర్లు వచ్చాయి. ఇరవై ఏళ్ల కిందట సుమారుగా 200 సినిమా థియేటర్లు జిల్లాలో ఉండేవి. అయితే రానురాను వీటి నిర్వహణ తలకుమించిన భారం కావడంతో పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 100 థియేటర్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 75 శాతం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ప్రేక్షకుల సౌకర్యార్థం సెంట్రల్ ఏసీ, ఈజీ చైర్స్, డీటీఎస్డాల్బీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా ప్రదర్శించడంతో తిరిగి సినిమా థియేటర్లు పూర్వ వైభవాన్ని పొందుతున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో కొత్తగా థియేటర్లు నిర్మాణంలో ఉన్నాయంటే లాభాలు బాగున్నాయని అర్థం చేసుకోవచ్చు. రీల్ నుంచి శాటిలైట్ వైపు సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో రీల్ నుంచి శాటిలైట్‌కు మార్పు చెంది నేడు సినిమా ప్రదర్శన జరుగుతోంది. థియేటర్ యాజమాన్యాలకు కూడా కొంత నిర్వహణ ఖర్చులు తగ్గడంతో ప్రస్తుతం లాభసాటిగానే ఉందని పలువురు యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమా రిలీజ్ అయితే శాటిలైట్ ద్వారా యూఎఫ్ఓ, క్యూబ్, ఆర్గవిస్ట్న్ వంటి సంస్థలు నేరుగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు హెల్పర్లు పనిచేసే స్థానంలో ఇప్పుడు ఇద్దరు పనిచేస్తే చాలు. దీంతో సిబ్బంది వేతనాల ఖర్చు తగ్గింది. శాటిలైట్ ద్వారా సినిమాలను ప్రదర్శిస్తుండడంతో ఎన్నిసార్లు వేసినా క్వాలిటీలో ఎటువంటి మార్పు రాదు. అదే రీల్ ద్వారా ప్రదర్శిస్తే రీల్ నలిగి క్వాలిటీలో తేడా వచ్చేది. సాంకేతిక మార్పులకు రూ.కోటి ఖర్చు ప్రేక్షకుడికి సౌకర్యంగా ఉండేలా నేటి సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని థియేటర్లను మార్చు చేయాలంటే ప్రస్తుతం రూ. కోటి వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ (డీటీఎస్) మార్పుకు రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ ఖర్చవుతుంది. అంతే కాకుండా పాత థియేటర్లలో ఉన్న సీట్లను తొలగించి సౌకర్యవంతంగా ఉండే సీట్లు ఏర్పాటు చేయాలంటే ఒక్కో సీటుకు సుమారుగా రూ.5 వేలు ఖర్చవుతుంది. 300 నుంచి 400 వరకూ ప్రేక్షకులు కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిని బట్టి సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల మొత్తం అవసరమవుతుంది. అంతే కాకుండా థియేటర్ ముందుభాగం ఆకట్టుకునే విధంగా చేసేందుకు, ఇతర మరమ్మతులకు మిగిలిన మొత్తం అవసరం అవుతుంది. పర్సంటేజ్‌ల నుంచి అద్దెల విధానానికి మార్పు గతంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా పర్సంటేజ్ రూపేణా థియేటర్ యాజమాన్యానికి నిర్మాతలు చెల్లించేవారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పర్సంటేజ్‌ల వల్ల ఒక్కోసారి నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి. సినిమా సక్సెస్ అయినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ థియేటర్ల యాజమాన్యాలకు ఇవ్వాల్సి వస్తుందన్న భావన నిర్మాతల్లో కలగడంతో మార్పు అనివార్యమైంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలు థియేటర్లు ఎగ్జిబిటర్లతో అద్దె చెల్లించే విధంగా ఏడాది, ఆపై రోజులకు యాజమాన్యాలు ఆగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెద్ద పట్టణాల్లో రోజుకు రూ.15 వేల వరకూ, చిన్న పట్టణాల్లో రూ.10 వేల వరకూ అద్దె చెల్లిస్తున్నారు. సినిమా ప్రదర్శన బాధ్యత ఎగ్జిబిటర్లే తీసుకుంటున్నారు. నిర్వహణ పోను లాభ, నష్టాలతో సంబంధం లేకుండా అద్దె చెల్లిస్తుండంతో కొంత మేరకు ప్రస్తుతం థియేటర్ల యజమానులకు అనుకూలంగానే ఉంది. థియేటర్లు తగ్గినా పెరిగిన స్క్రీన్లు ప్రస్తుతం ఒకే థియేటర్లో రెండు లేదా మూడు స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయి. ఒకే రోజు మూడు చిత్రాలను ప్రదర్శించగలుగుతున్నాయి. ఉదాహరణకు ఏలూరులో రెండు థియేటర్లలో మూడు స్క్రీన్లు, మరో రెండింటిలో రెండేసి స్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవి గతంలో ఒకే స్క్రీన్‌తో సినిమాను ప్రదర్శించిన థియేటర్లే. అధిక ధరలతో ప్రేక్షకుడికి భారం ప్రస్తుతం పలు చోట్ల టిక్కెట్ ధరలు ప్రేక్షకుడికి భారంగా మారాయి. సినిమాకు నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే సుమారుగా రూ.వెయ్యి వదిలించుకోవాల్సిందే. రిలీజ్ సినిమాకు ప్రభుత్వ ధరలతో సంబంధం లేకుండా టిక్కెట్‌కు రూ.100 నుంచి రూ.150 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా తినుబండారాల ధరలు కూడా బయటకన్నా ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తుండడంతో నేటికీ సినిమాకు సామాన్యుడు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.