శుక్రవారం సినీప్రియులకు ప్రియమైన రోజు. శుక్రవారమైతే కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. అయితే కొన్ని నెలలుగా శుక్రవారం కిక్ మిస్ అయింది. కోవిడ్ వల్ల థియేటర్స్ మూసేశారు. ఈ శుక్రవారం తెలంగాణలో థియేటర్స్ తెరచుకున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ విడుదలైంది. థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంది అన్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ విశేషాలు.
సినిమాలో ఉన్న మజా తెలిసేది పెద్ద తెర మీదే. సినిమాను పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేయగలిగేది థియేటర్స్‌లోనే. సినిమాలో ఉన్న ఎనర్జీ తాలూకు రీసౌండ్ వినిపించేదీ థియేటర్స్‌లోనే. 50 శాతం సీటింగ్ కెపాసిటితో తెలంగాణాలో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. ‘థియేటర్స్‌కు రండి. భద్రమైన మూవీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాం’ అంటూ థియేటర్స్ ఓపెన్ చేశారు. అసలు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూస్తాడా? ఎన్ని టిక్కెట్లు తెగుతాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్ సంఖ్య ఆశాజనకంగా ఉంది అంటున్నారు థియేటర్స్ ఓనర్లు. ‘ఇంత సంఖ్యలో ప్రేక్షకులు రావడం చాలా సంతోషమైన విషయం. ఇది ఇలా కొనసాగితే థియేటర్స్ సిస్టమ్ త్వరగా కోలుకుంటుంది’ అన్నారు కొందరు ఎగ్జిబిటర్స్.
∙ఏయంబీ మల్టీప్లెక్స్‌లో 22 షోలు వేస్తే, అన్ని షోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో మొత్తం 650 సీటింగ్ అంటే.. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో 50 శాతం టిక్కెట్లే అమ్మాలి. అంటే 325 మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. ఆ థియేటర్లో సుమారు 300 టిక్కెట్లు తెగాయని తెలిసింది. అంటే అటూ ఇటూగా స్క్రీన్ నిండినట్లే. ఎల్బీ నగర్‌లోని విజయలక్ష్మీ థియేటర్‌లో ఉదయం ఆటకు 117 మంది, మధ్యాహ్నం ఆటకు 63 మంది ప్రేక్షకులు కనిపించారని ఓ ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. అలాగే సింగిల్ స్క్రీన్‌లో దేవి థియేటర్‌ను రీ ఓపెన్ చేశారు. ఒక ఆటకు 130 మంది వరకూ వచ్చారట.
‘‘ఇది (‘టెనెట్’) హాలీవుడ్ సినిమా కాబట్టి మాస్ ఏరియాల్లో తక్కువ ఆడియన్స్ కనిపించారు. అదే తెలుగు సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా అసలు ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం మాత్రం తీరిపోయింది. వస్తారని తేలిపోయింది. ఇది శుభపరిణామం. పైగా నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ వంటివాళ్లు థియేటర్లకు వెళ్లడం ఆనందించదగ్గ విషయం. సెలబ్రిటీలు కూడా థియేటర్లకి వెళ్లడంతో ప్రేక్షకుల్లో భయం తగ్గుతుంది. ఇక థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు జాగ్రత్తల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భార్యాభర్తలు మాత్రం ఒక సీటు గ్యాప్ తర్వాత కూర్చుని చూడ్డానికి ఇబ్బందిపడ్డట్లు చెప్పారు’’ అన్నారు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.
స్టార్స్ సందడి
‘‘సినిమా ప్రేమికుడికి థియేటర్‌ను మించిన హ్యాపీ ప్లేస్ ఏంటి? థియేటర్స్‌కు రండి. సినిమాలను ఎంజాయ్ చేయండి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. శానిటైజర్‌ను ఎప్పటికప్పుడు వాడండి’’ అని థియేటర్స్‌కు ప్రేక్షకులను రమ్మంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు సాయిధరమ్ తేజ్. ‘‘9 నెలల తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చాను. థియేటర్స్ సార్... థియేటర్స్ అంతే!’ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. నాగచైతన్య, నిఖిల్, విశ్వక్ సేన్, మారుతి కూడా థియేటర్స్‌కు వెళ్లి సినిమాని వీక్షించినవారిలో ఉన్నారు.
ధైర్యంగా అనిపించింది
సినిమాకు వచ్చే ప్రేక్షకుడికి భద్రతతో పాటు ధైర్యం కూడా కలిగించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. థియేటర్‌కు వచ్చిన కొందరు ప్రేక్షకుల అనుభవాన్ని పంచుకోమంటే ఇలా అన్నారు. ‘‘శానిటైజేషన్, సీటింగ్‌లో దూరం పాటించడం, ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేయడం బావుంది. ధైర్యంగా అనిపించింది’’ అన్నారు కొందరు. ‘‘సీట్‌కి సీట్‌కి గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రేమికులకు కాస్త ఇబ్బంది అనిపించే అవకాశం ఉంది’’ అన్నారు కొందరు.
Comments
Please login to add a commentAdd a comment