కరోనా మళ్ళీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ స్పీడుగా వ్యాపిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... సినీ పరిశ్రమపై మళ్ళీ ప్రభావం చూపుతోంది. దేశంలోకెల్లా కరోనా కేసులు ఎక్కువున్న... మహారాష్ట్ర సినిమా హాళ్ళు పూర్తిగా మూసేసింది. హిందీ రిలీజులు వాయిదా పడుతున్నాయి. కర్ణాటక సహా దేశంలోని అనేక రాష్ట్రాలేమో... 50 శాతం సీటింగ్ కెపాసిటీకి దిగి వచ్చాయి. కన్నడ పునీత్ రాజ్‌కుమార్ ‘యువరత్న’ రిలీజైన వారం రోజులకే ఇవాళ్టి నుంచి ఓటీటీ బాట పట్టింది. తమిళ సర్కార్ నేటి నుంచే సీటింగ్ తగ్గించేసింది. ఫుల్ కెపాసిటీ ఉన్నా... తెలుగునాట హాళ్ళలో జనం పలచబడుతున్నారు. ‘లవ్‌స్టోరీ’ పోస్ట్‌పోన్ అయింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలంగాణ హైకోర్టు అడుగుతోంది. మరి, ఇప్పుడిక... మన సినిమా హాళ్ళ సంగతేమిటి? రిలీజవ్వాల్సిన మిగతా తెలుగు సిన్మాల భవిత ఏమిటి?
సరిగ్గా ఏడాది క్రితం... కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్ డౌన్‌లో ఉంది. హాళ్ళు మూసేశారు. సినిమాలు లేవు. సమ్మర్ మొదలు గత డిసెంబర్ దాకా సినీ వ్యాపారమే తుడుచుకుపోయింది. ఏడాది తరువాత... ఇప్పుడు లాక్ డౌన్ లేదు. కరోనా మాత్రం బలంగానే ఉంది. హాళ్ళు తెరిచారు. సినిమాలు వస్తున్నాయి. కానీ, సెకండ్ వేవ్ దెబ్బతో ఇప్పుడు క్రమంగా హాలుకు వచ్చే జనమే తగ్గుతున్నారు. రెండువారాలుగా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో తెలుగు నాట కూడా సినిమా హాళ్ళపై షరతులు తప్పేలా లేవు. దాంతో, భారీ ఖర్చు పెట్టి తీసి, అంతే భారీగా వ్యాపారమూ జరుపుకొన్న పెద్ద సినిమాల రిలీజులు డోలాయమానంలో పడ్డాయి. తాజాగా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా తాజా పరిస్థితికి నిదర్శనం.
టెస్టుల నడుమే... తెగ షూటింగ్స్
నిజానికి, లాక్‌డౌన్ ఎత్తేశాక∙ఒక దశలో తెలుగునాట షూటింగులు పీక్‌కి వెళ్ళాయి. రోజూ ఏకంగా 120కి పైగా షూటింగులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేప్‌తో ఆ జోరూ కొంత తగ్గింది. అయితేనేం... ఇప్పటికీ సినిమాలైతేనేం, వెబ్ సిరీస్‌లైతేనేం... రోజుకు సగటున 80 షూటింగులైతే తెలుగునాట జరుగుతున్నాయి. ‘‘షూటింగుల కోసం తగినంత మంది టెక్నీషియన్లైనా దొరకని పరిస్థితి. చివరకు, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న మా భారీ చిత్రానికి కావాల్సినంత మంది మేకప్‌మ్యాన్లు కూడా దొరకడం లేదంటే నమ్మండి’’ అని ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అయితే, ఈ షూటింగుల్లో శానిటైజేషన్, పదే పదే టెస్టులకే శ్రమ, ఖర్చు తడిసిమోపెడవుతున్నాయి.
ఇటీవల అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ షూటింగు కోసం 100 మంది జూనియర్ ఆర్టిస్టులకు టెస్టులు చేస్తే, 45 మందికి పాజిటివ్ వచ్చింది. గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ సహా తెలుగునాట పలు సినిమా యూనిట్లు ముంబయ్, చెన్నైల నుంచి వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించి కానీ, షూటింగుకు అనుమతించడం లేదు. ‘‘రోజూ భారీ యూనిట్‌తో షూటింగ్ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్ళను ఒక రోజు ముందే వచ్చి, పరీక్ష చేయించుకోమంటున్నాం. స్థాని కులకు సైతం రెండు రోజులకు ఒకసారి ర్యాపిడ్ టెస్టులు చేయిస్తున్నాం’’ అని ‘శాకుంతలం’ చిత్ర వర్గాలు తెలిపాయి.
హిందీలో వాయిదా పర్వం
టెస్టులు, షూటింగుల మాటెలా ఉన్నా – కరోనా విజృంభణ ఆగడం లేదు. సామాజిక దూరంతో షూటింగులు జరుపుకొంటున్న హిందీ చిత్రసీమ చివరకు మూతపడ్డ హాళ్ళు, వివిధ ప్రాంతాల్లోని కర్ఫ్యూ, లాక్‌డౌన్, 144 సెక్షన్ల నిబంధనలతో ఏకంగా రిలీజులు వాయిదా వేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు హిందీ సినిమాలు వాయిదా బాట పట్టాయి. రానా నటించిన తెలుగు వెర్షన్ ‘అరణ్య’ రిలీజైంది కానీ, దాని రిలీజుకు మూడు రోజుల ముందే మార్చి 23న హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ రిలీజ్’ను చిత్రనిర్మాణ సంస్థ ఈరోస్ నిరవధికంగా వాయిదా వేసింది.
ఇక, అమితాబ్ ‘చెహరే(’ ఏప్రిల్ 9న విడుదల కావాల్సింది. దాన్నీ వాయిదా వేశారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈ నెల 30న రిలీజు చేద్దామనుకున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశి’ సైతం తాజా పరిస్థితుల్లో మళ్ళీ నిరవధికంగా వాయిదా పడింది. ‘బబ్లీ ఔర్ బంటీ 2’ సహా అనేకం ఇప్పటికే పోస్ట్‌పోనయ్యాయి. కరోనా సెకండ్, ఆపై థర్డ్‌వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ సినిమాలు కానీ, వీటి తరువాత రిలీజనుకున్న ఇతర సినిమాలు కానీ అను కున్నట్టు రిలీ జవడం కచ్చితంగా అనుమానమే! పచ్చిగా చెప్పాలంటే, అసంభవమే!!
మూడు నెలల ముచ్చటేనా?
నిజానికి, అన్–లాక్‌డౌన్ తరువాత సినీరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హాలీవుడ్‌లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ వేల కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క గత డిసెంబర్‌లో హాళ్ళు తెరవడానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. సగం థియేటర్ కెపాసిటీలో సైతం సంక్రాంతి సిన్మాలు ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’ లాంటివి వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ తరువాత ఫిబ్రవరి 5 నుంచి పూర్తి కెపాసిటీకి అనుమతి ఇచ్చాక, తెలుగులో చిన్న, పెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చాయి. ఫిబ్రవరి 12న వచ్చిన ‘ఉప్పెన’తో హాళ్ళు పూర్తిగా హౌస్ ఫుల్ అయి, కరోనా మునుపటి రోజుల్ని గుర్తు చేశాయి.
ఇక కరోనాతో జీవితంలో నవ్వు కరవైన జనాన్ని మార్చి 11న వచ్చిన ‘జాతిరత్నాలు’ నవ్వించి, అనూహ్య విజయంతో పాటు, అద్భుతమైన షేర్లు రాబట్టింది. తాజా హాలీవుడ్ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అయితే ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు భాషల్లోనూ తెలుగునాట బాగా ఆడుతోంది. అందుకే, ‘‘గడచిన మూడున్నర నెలల్లో మన దేశం మొత్తం మీద మిగతా సినీపరిశ్రమలతో పోలిస్తే, తెలుగు సినిమాయే బాగుంది. తెలుగు స్ఫూర్తితో తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రసీమల్లోనూ ఉత్సాహం పుంజుకుంది’’ అని తమిళ హీరో కార్తీ, కన్నడ పునీత్ రాజ్ కుమార్ సైతం ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.
దానికి తగ్గట్టే క్రమంగా మిగతాచోట్లా వసూళ్లు పెరిగాయి. మాలీవుడ్‌లో మమ్ముట్టి ‘ది ప్రీస్ట్’ కరోనా తర్వాత ఫస్ట్ బ్లాక్‌బస్టరైంది. కోలీవుడ్‌లో ఈ నెల 2న రిలీజైన కార్తీ ‘సుల్తాన్’ మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా గ్రాస్ సాధిం చింది. టాలీవుడ్‌లోనూ భారీ బిజినెస్ జరుగుతోంది. ఏడాది తర్వాత బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతున్నవేళ, ఇదంతా మూడునెలల ముచ్చటేనా అనిపించేలా సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్ళీ కలవరంలోకి నెట్టింది.
సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జనంపైనా, సరిగ్గా కరోనా నిబంధనలు పాటించని థియేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి, సుదర్శన్ థియేటర్ల ఓనరైన బాలగోవిందరాజు అంగీకరించారు.
అయితే, ‘‘అలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా, ఎకాఎకిన హాళ్ళ కెపాసిటీ 50 శాతం తగ్గించడం మొదలు మూసివేత దాకా సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సినీపరిశ్రమకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో హాళ్ళలో యాభై శాతం కెపాసిటీకే అనుమతి అని షరతు పెడితే వ్యాపారం దాదాపు సున్నాయే. ‘‘ఆ షరతు మళ్ళీ పెడితే – జనం లేకుండా హాళ్ళు నామ్ కే వాస్తే నడుస్తాయే తప్ప, నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రతినిధి అన్నారు. ‘‘కెపాసిటీ 50 శాతమే ఐనా, ఖర్చు మాత్రం ఎప్పటిలానే వంద శాతం తప్పదు’’ అని శాలిబండ సుధా మల్టీప్లెక్స్ ఓనర్ కె. అనుపమ్ రెడ్డి వాపోయారు. కానీ, వ్యాపారం కన్నా జనం క్షేమం బాగుండాలని కోరుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
మూసినా... సగమే తెరిచినా... దెబ్బ మీద దెబ్బే!
గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 నెలలకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్న నేపథ్యంలో సహజంగానే అడ్వా¯Œ ్స బుకింగులు జోరుగా సాగుతున్నాయి. కోర్టు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా తెచ్చుకుంటున్న ఉత్తర్వులతో తెలంగాణలో టికెట్ రేట్లూ సింగిల్ స్క్రీన్లలో రూ. 150కి, మల్టీప్లెక్సుల్లో రూ. 200కి ఎగబాకాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో ఓ హౌస్ ఫుల్ స్టార్ సినిమా రిలీజైతే, ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడేవారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే ఉంది. కొందరు ఎగ్జిబిటర్లే అది ఒప్పుకుంటున్నారు.
అందుకే లాక్‌డౌన్ ఉండదనీ, హాళ్ళను మూయబోమనీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా – గుంపుల కొద్దీ జనంతో, వ్యాప్తికి కారణమయ్యే థియేటర్లపై ఆంక్షలు విధించడం పెద్ద పనేమీ కాదు. కర్ణాటక, తమిళనాడు బాటలో ఇతర రాష్ట్రాల్లో సైతం మళ్లీ 50 పర్సెంట్ కెపాసిటీతోనే థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు ఆదేశించేంచే ఛాన్స్ బలంగా ఉంది.
తమిళ సర్కారు సైతం ఎన్నికలు ముగిశాక సరిగ్గా ధనుష్ ‘కర్ణన్’ రిలీజు రోజు నుంచి షరతులు పెట్టింది. ‘వకీల్ సాబ్’ సహా తెలుగులోనూ పలుకుబడి గల పెద్దల సినిమాలు రిలీజైపోతాయి గనక, ఇక్కడా హాళ్ళపై ఆంక్షలు రావడం ఖాయం. అదే జరిగితే... కలెక్షన్లే కీలకమైన ‘ఆచార్య’ సహా అనేక స్టార్ సినిమాల రిలీజ్ ప్రశ్నార్థకమే. అదే ఇప్పుడు ఎగ్జిబిటర్లకూ, వారి అడ్వాన్సుల మీద ఆధారపడ్డ బయ్యర్లకూ, వారితో వ్యాపారం చేసి సిన్మా రిలీజు చేసే నిర్మాతలకూ కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. ఒక్కమాటలో – ఇదంతా ఓ చెయిన్ రియాక్షన్. వెరసి, ఇప్పుడిప్పుడే కాళ్ళూ చేతులూ కూడదీసుకుంటున్న సినీ పరిశ్రమపై ఈ సెకండ్ వేవ్‌తో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.
తగ్గుతున్న జనం... తరిగిపోతున్న కలెక్షన్లు...
కరోనా సెకండ్ వేవ్ సమాజంతో పాటు సినిమా మీదా గట్టిగా ప్రభావం చూపెడుతోంది. ‘‘కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, హాళ్ళకొచ్చే జనం రెండు వారాలుగా తగ్గుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తేశాక... ఫరవాలేదనుకున్న సినిమాలకు సైతం మంచి కలెక్షన్లే వస్తే, ఇప్పుడు బాగున్న సినిమాలకు కూడా ఫరవా లేదనే స్థాయి కలెక్షన్లయినా రావట్లేదు. అలా కొన్ని సినిమాలు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్‌లో బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోయాయి’’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ టి. బాలగోవిందరాజు వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెల మధ్య దాకా హౌస్ ఫుల్ బోర్డులు చూసిన ఏసీ హాళ్ళలో ప్రస్తుతం సగటున ఆటకు 30 నుంచి 40 శాతం ప్రేక్షకులే ఉంటున్నారు. గత నెల మొదట్లో ఫ్యామిలీలు, ఆడవాళ్ళు, పిల్లలతో కళకళలాడి పూర్వవైభవం వస్తోందని ఆశలు రేపిన హాళ్ళు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.
మూడు రాష్ట్రాల మార్కెట్ పాయె!
తెలుగులో కూడా సినిమాలు ముందుగా ప్లాన్ చేసిన తేదీలకు వస్తాయా అన్నది సందేహమే. మహారాష్ట్రలో హాళ్ళు మూసేస్తే, కన్నడనాట ఈ నెల 7 నుంచి సినిమా హాళ్ళను సగం సీటింగుకే పరిమితం చేశారు. తాజాగా, తమిళనాడులో సైతం ఇవాళ (ఏప్రిల్ 9) నుంచి థియేటర్లలో 50 శాతం సీటింగే అని అక్కడి సర్కారు ప్రకటించింది. అలా ఇప్పుడు మన తెలుగు సినిమాకు ఈ మూడు పొరుగు రాష్ట్రాల మార్కెట్ పోయింది. ఆ దెబ్బ తెలుగు సిన్మా వ్యాపారం పైనా ఉంటుంది. ‘‘మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో హాళ్ళపై వచ్చిన నిర్ణయాల ప్రభావం మన సినీసీమపై ఇప్పటికే పడింది.
రేపు పొద్దున మన దగ్గర థియేటర్లు ఎంత కెపాసిటీతో నడుస్తాయి, హాళ్ళు తెరిచి ఉన్నా జనం వస్తారా – ఇలా అందరం రకరకాల అనుమానాలతో ఉన్నాం’’ అని పేరు ప్రచురించవద్దంటూ ఓ సినీ నిర్మాత చెప్పారు. హాళ్ళు మూసిన మరాఠ్వాడా, ఢిల్లీ లాంటి చోట్ల మన సినిమానే రిలీజు కాదు. పెద్ద హీరోల సినిమాలకు బలమైన మార్కెటైన కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల రిలీజైనా సగం కెపాసిటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మారిన పరిస్థితుల్లో బయ్యర్లు సైతం ఒకప్పుడు తాము ఒప్పుకున్న రేట్లకు సినిమా కొంటారా, డబ్బు మొత్తం నిర్మాతలకు కడతారా అన్నదీ అనుమానమే. ఆ మేరకు రిలీజుకు ముందే వ్యాపారం, రిలీజయ్యాక సీటింగ్ తగ్గుదలతో కలెక్షన్లు తెలుగు సినిమా నష్టపోయినట్టే!
హాట్‌స్పాట్‌గా హాళ్లు?
ఒక హౌస్‌ఫుల్ స్టార్ సినిమా ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో రిలీజవుతుంది. ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడే వారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే పొంచి ఉంది. జనంలో భయం పోయి, నిర్లక్ష్యం పెరిగిందని గమనిస్తున్న కొందరు ఎగ్జిబిటర్లే ఆ సంగతి బాహాటంగా ఒప్పుకుంటున్నారు.
పెరుగుతున్న పాజిటివ్‌లు
హిందీ, తెలుగు సీమల్లో రోజూ పలువురు ‘పాజిటివ్’గా తేలుతున్నారు. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న నటి నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. దాంతో, ఆమెతో కలసి టీవీ ఇంటర్వ్యూలిచ్చిన అంజలి, అనన్య, దర్శకుడు శ్రీరామ్ వేణు సహా అందరూ టెస్టుల హడావిడి పడ్డారు. హిందీలో పలువురి పేర్లు బయటకు వస్తుంటే, మన దగ్గరేమో బయటపడి చెప్పకుండా హోమ్ క్వారంటైన్‌లో గడిపేస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. నివేదా ఎఫెక్ట్‌తో అంజలి స్టాఫ్‌కూ కరోనా సోకిందనీ, తనకూ తప్పదని అంజలి సైతం క్వారంటైన్‌లోకెళ్ళారనీ భోగట్టా. ఆమె మాత్రం తనకు కరోనా రాలేదని ఖండించారు. ఏమైనా, షూటింగుల్లో ఇప్పటికీ పదులమంది కరోనా పాజిటివ్‌గా తేలుతు న్నారు. ఇటీవలే టీజర్ రిలీజైన ఓ భారీ ‘స్టయిలిష్’ సిన్మా సెట్స్‌లో ఒకటికి, రెండు సెట్ల అసిస్టెం ట్లను పెట్టుకొని, ఒకరికి వస్తే మరొకర్ని దింపి, షూటింగ్ కానిచ్చేస్తున్నారు.
తెలుగులోనూ... వాయిదాలు షురూ!
తాజా పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు దర్శక,నిర్మాతలు గురువారం సాయంత్రం ప్రకటించారు. కానీ,ఈ సెకండ్ వేవ్‌లోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. తెలుగునాట రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి వెళుతుండడంతో రానున్న రోజుల్లో మళ్ళీ షరతులు విధించే అవకాశం ఉంది. నేడో, రేపో తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లలో సగం మందినే అనుమతించే సూచనలున్నాయి. అదే గనక జరిగితే, ‘వకీల్ సాబ్’ మొదలు ఈ నెలలోనే రిలీజు కావాల్సిన రానా ‘విరాటపర్వం’, మే నెలలో వస్తామన్న చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’ లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు ఇరుకున పడడం ఖాయం. పెట్టిన ఖర్చు మేరకు వ్యాపారం జరిగి, వసూళ్ళూ రావాలంటే – పరిస్థితులు చక్కబడే దాకా రిలీజు వాయిదా మినహా మరో మార్గం లేదు. ఈ నెలలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రావాల్సిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ సైతం ఇప్పటికే రిలీజు వాయిదా రూటు పట్టింది. కరోనాకు తోడు గ్రాఫిక్స్ సహా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది గనక ‘ఆచార్య’ వాయిదా ఖాయమైందని ఆంతరంగిక వర్గాల సమాచారం. వెరసి, ఈ డోలాయమాన పరిస్థితిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందో, ఏం జరుగుతుందో సినీరంగంలో ఎవరూ ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
– డాక్టర్ రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment