Rentala Jayadeva
-
తెలుగు సినిమా పండగ రోజు
సమాజంపై అమితంగా ప్రభావితం చూపుతున్న మాధ్యమం సినిమా! అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పండగ రోజు. తొలి పూర్తి నిడివి తెలుగు చలనచిత్రం ‘భక్త ప్రహ్లాద’ఇప్పటికి 93 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై, 1932 ఫిబ్రవరి 6న రిలీజైన ఆ సినిమాతో పూర్తి నిడివి తెలుగు టాకీల నిర్మాణం శ్రీకారం చుట్టుకుంది. దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది.అంతకు ముందు దాకా భాషతో ప్రమేయం లేని మూగచిత్రాలు (మూకీలు) వచ్చేవి. 1931 మార్చి 14న తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ విడుదలతో క్రమంగా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలోనే, ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌ను ఉపయోగించుకుంటూ తీశారు! ఆ ‘కాళిదాస్’ కేవలం 4 రీళ్ళ లఘు చిత్రం. నిజానికి, తెరపై తొలిసారిగా మన తెలుగు మాటలు, పాటలు వినిపించింది ఆ ‘కాళిదాస్’ సినిమాలోనే! తీరా పూర్తిగా తెలుగు డైలాగులతో తీసిన ఆ ‘కాళిదాస్’ చిత్రం నిడివి తక్కువైంది. దాంతో ‘కాళిదాస్’ ఫిల్ముకు ముందు 3 రీళ్ళ తమిళ దేశభక్తి గీతాలు – ప్రణయ గీతాలు – తెలుగు త్యాగరాయ కీర్తనల లఘుచిత్రం జోడించారు. అలాగే ‘కాళిదాస్’ ఫిల్మ్ తర్వాత 2 రీళ్ళ తమిళ కురత్తి (కురవంజి) డ్యాన్స్ లఘు చిత్రాన్ని కలిపారు. అలా మొత్తం మూడు చిన్న నిడివి చిత్రాలనూ కలిపి, ఒకే కదంబ కార్యక్రమ ప్రదర్శన (ప్రోగ్రామ్)గా ‘కాళిదాస్’ అనే టైటిల్‌తోనే రిలీజ్ చేశారు. అది 1931 అక్టోబర్ 31న మద్రాసులో విడుదలైంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు దర్శక – నిర్మాతలు అప్పట్లో తెలివిగా ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. అయితే, మొత్తం తెలుగు డైలాగుల ‘కాళిదాస్’ చిత్రాన్ని తెలుగువాళ్ళం వదిలేస్తే, అది తమ తొలి టాకీ అంటూ తమిళులు దాన్ని తమ చరిత్రలో కలిపేసుకోవడం విడ్డూరం. మరుగునపడ్డ ఈ వాస్తవాలన్నీ జర్నలిస్టు, పరిశోధకుడు రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, ఆ చిత్ర హీరోయిన్ ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆ సినిమా సమీక్ష, పాటల పుస్తకం తదితర సాక్ష్యాలతో ఆ మధ్య నిరూపించారు.అప్పట్లో ‘కాళిదాస్’ విజయవంతం కావడంతో, పూర్తి నిడివి తెలుగు చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే ఏకంగా 10 రీళ్ళ తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే! ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న జనం ముందుకొచ్చింది. ఆ తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ విడుదలై, నేటితో 93 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ తేదీని కొన్నేళ్ళుగా ‘తెలుగు సినిమా దినోత్సవం’గా చేస్తున్నారు.మన ‘భక్త ప్రహ్లాద’ కేవలం 18 వేల రూపాయలతో, 18 రోజుల్లో నిర్మాణమైంది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. బొంబాయిలోనే కృష్ణా సినిమా హాలులో ఈ ‘భక్త ప్రహ్లాద’ ముందుగా విడుదలైంది. అక్కడ రెండు వారాలు ఆడాక, అటుపైన తెలుగు నేల పైకొచ్చింది. విజయవాడ (శ్రీమారుతి హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా హాలు)ల్లో ప్రదర్శితమైంది. తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెరపై బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆడడం, పాడడం పెద్ద విడ్డూరమైంది. దాంతో, ‘కాళిదాస్’, ఆ వెంటనే ‘భక్త ప్రహ్లాద’ టాకీల విడుదల సంచలనం సృష్టించింది. అలా మొదలైన మన తెలుగు సినిమా ప్రభ ఇవాళ దేశాల సరిహద్దుల్ని దాటి, అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డు అందుకొనే దాకా వెళ్లింది. ఇలా మన ఘన చరిత్ర అప్రతిహతంగా సాగడం అందరికీ గర్వకారణం. -
లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా
సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేశిర్ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్ ఇండియన్ తమిళ్ అండ్ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్’. అక్కడే... ఆ సెట్స్‌లోనే!‘ఆలమ్ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్.ఎం.రెడ్డి ‘కాళిదాస్’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్ ‘ఆలమ్ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటుడెవరు? అసలు హీరో తెలుగువాడే!కాళిదాస్ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్. గంగాధర్. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్’కి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!‘కాళిదాస్’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. కురత్తి డ్యాన్స్ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. ‘కాళిదాస్’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ ‘కాళిదాస్’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్’ తెలుగు ఫిల్మ్ అని చెప్పకనే చెప్పారు.మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘కాళిదాస్’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్’ 1931 నవంబర్ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’. ఆ ‘కాళిదాస్’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్’ ప్రోగ్రామ్‌లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!! దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకంమూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్లో సినిమా రిలీజ్ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్ అంతటా కనిపించే ‘కాళిదాస్’ పోస్టర్ అదే! తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.రీలు బాక్సుకు పూజలు, హారతులు‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సినిమా హాలు దాకా వాల్‌ట్యాక్స్ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్ హిట్. ‘కాళిదాస్’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్ చేసిన ‘కాళిదాస్’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్’ తీసిన హెచ్.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. అలా ‘కాళిదాస్’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ఆధారంగా)-రెంటాల జయదేవrjayadev@yahoo.com -
కనుమరుగవుతున్న గంగమ్మ జాతర పుష్పాతో మళ్లీ తెరపైకి
-
Swathi Muthyam@38: మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 38 వసంతాలు. మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
అక్షరాల... టైమ్ ట్రావెల్!
ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి... చిరంతనంగా నిలవాలంటే సాహిత్యం సుసంపన్నంగా వెలగాలి. ముద్రణ లేని రోజుల్లో మౌఖికం, తాళపత్ర బంధితంగానే మిగిలిన అపార మైన, అపురూప సాహిత్యాన్ని ఆ తర్వాత పుస్తక రూపంలో అందరికీ దగ్గర చేసి, అక్షరాస్యతా ఉద్యమంలో భాగమైన పుణ్యమూర్తులైన ప్రచురణకర్తలు ఎందరెందరో! ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించి ఇవాళ వందేళ్ళ గోరఖ్‌పూర్ గీతాప్రెస్ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం. కానీ, అంత కన్నా కొన్ని దశాబ్దాల ముందే ఒక తెలుగు ప్రచురణ సంస్థ అంతకు మించిన భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవ చేసిందని ఈ తరంలో ఎంత మందికి తెలుసు? తెలుగు ప్రచురణల ద్వారా అక్షర యాగం చేసి, మన జాతి సాహితీ సంస్కృతులకు ఎనలేని సేవ చేసినసంస్థ – వావిళ్ళ సంస్థ. ఇప్పటికి దాదాపు 170 ఏళ్ళ క్రితం... 1854లోనే పుస్తక ప్రచురణ రంగంలో ప్రవేశించి, అఖండ విజయం సాధించిన మహనీయులు వావిళ్ళ వారు. పురాణాలు, ప్రబంధాలు, స్తోత్రాలు, వేదాంత శాస్త్రాలు, శతకాలు, వ్రతకల్పాలు, వ్యాకరణాలు, నిఘంటువులు... ఇలా వారు ప్రచురించనిది లేదు. అనేక తాళపత్ర గ్రంథా లనూ, చేతిరాతలనూ, ప్రాచీన కావ్యాలనూ పండితులతో పరిష్కరింపజేసి, సవివరమైన పీఠికలతో సప్రామాణికంగా అందించిన ప్రచురణకర్తలు, కవిపండిత పోషకులు, దేశభక్తులు వారు. సంస్థాపకులు వావిళ్ళ రామస్వామి శాస్త్రి సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు చేసిన సేవ అనుపమానం. ఆరు పదులైనా నిండక ముందే ఆయన పరమపదిస్తే, అనంతరం ఆయన కుమారుడు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ఆ కృషిని కొనసాగించారు. తండ్రి నాటిన మొక్కను మహావృక్షంగా పెంచారు. తెలుగుకే కాదు... సంస్కృత, తమిళ, కన్నడ భాషా రచనల్ని కూడా ప్రచురించి, ఆ సాహిత్యాలకు విశేష సేవలందించారు. తెలుగులో ‘త్రిలిఙ్గ’, ఇంగ్లీషులో ‘ఫెడరేటెడ్ ఇండియా’, తమిళంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి సహ కారంతో ‘బాల వినోదిని’ మాసపత్రిక... ఇలా పలు పత్రి కలూ నడిపారు. ఇవాళ్టికీ వావిళ్ళ వారి ప్రచురణ అంటే ప్రామాణికతకూ, సాధికారికతకూ, సాహితీ విలువలకూ ఐఎస్ఐ మార్క్. ముద్రణ దశలోని ప్రూఫ్ గ్యాలీలను తమ ప్రెస్ బయట అంటించి, ప్రచురిస్తున్న పుస్తకంలో అక్షర దోషం పట్టుకుంటే తప్పుకు ఇంత చొప్పున డబ్బులిస్తామని వావిళ్ళ వారు ధైర్యంగా ప్రకటించేవారని పాత తరంవారు చెప్పేవారు. అందుకే, ప్రస్తుతం పలు సంస్థలు చలామణీలోకి తెస్తున్న అనేక పాత పుస్తకాల కొత్త ప్రింట్లు వావిళ్ళ ప్రతులకు సింపుల్ జిరాక్స్ కాపీలే! ఈ తరం పాఠకులకు వావిళ్ళ సంస్థ కృషిని పరిచయం చేయాల్సిన పరిస్థితుల్లో, అదే లక్ష్యంగా వచ్చిన పుస్తకం–‘వావిళ్ళ సాహితీ వికాసం.’ సాంకేతిక విద్యానైపుణ్యం పుష్కలంగా ఉండి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసిన డాక్టర్ వి.వి. వేంకటరమణ ఈ పుస్తక రచయిత. కంప్యూటర్ విజ్ఞానం నుంచి కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని రచనల దాకా వివిధ అంశాలపై ఇప్పటికే 15 ప్రామా ణిక రచనలు చేసిన నిరంతర జిజ్ఞాసి. ఆయన పుష్కర కాలం శ్రమించి, పరిశోధించి మరీ చేసిన రచన ఇది. దాదాపు 700 పేజీల పుస్తకంలో ఎన్నో తెలియని విషయాలనూ, ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రాలనూ అందించారు. వెయ్యికి పైగా వావిళ్ళ ప్రచురణల్ని పట్టికలు, తేదీలతో సహా పాఠక లోకం ముందుంచారు. ప్రపంచంలో ముద్రణారంభం, బ్రిటీషు కాలంలో మన దేశంలో ముద్రణ, మద్రాసులో ముద్రణ తొలినాళ్ళు, పుదూరు ద్రావిడులైన వావిళ్ళవారు ముద్రణా రంగం లోకొచ్చిన తీరు, వారు నడిపిన పత్రికలు, చేసిన సాహిత్య సేవ, అప్పట్లో జరిగిన వాదవివాదాలు, వావిళ్ళపై వచ్చిన ప్రత్యేక సంపుటాల విశేషాలు... ఇలా ఈ పుస్తకం ఓ సమా చార గని. ‘కన్యాశుల్కం’ రచన గురజాడదా? గోమఠం శ్రీని వాసాచార్యులదా? అంటూ అప్పట్లో వావిళ్ళ చుట్టూ నడిచిన వివాదం ఆసక్తిగా చదివిస్తుంది. తండ్రి ఆరంభించిన ‘ఆది సరస్వతీ నిలయం’ నుంచి కుమారుడు నడిపిన వావిళ్ళ ప్రెస్ దాకా, ఆ తర్వాత జరిగిన చరిత్రకు అద్దం ఈ రచన. అలా ఇది వావిళ్ళ వారు చేసిన బృహత్తర యజ్ఞంపై ఓ అరుదైన లో చూపు. బోలెడుశ్రమతో ఈ రచనలో పునర్ముద్రించిన వావిళ్ళ వారి ప్రచురణల ముఖచిత్రాలు, ఫోటోలు, వార్తల్ని చూస్తూ పేజీలు తిప్పినా ఇది అక్షరాలా 170 ఏళ్ళ టైమ్ ట్రావెల్! – రెంటాల జయదేవ(నేడు నెల్లూరులో ‘వావిళ్ళ సాహితీ వికాసం’ ఆవిష్కరణ) -
మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?
విస్తృత ప్రజాదరణ, ప్రాచుర్యం ఉన్న క్రికెట్, సినిమా ఈ దేశంలో మతాన్ని మించినవని అంటారు. జాతీయ గుర్తింపును తీర్చిదిద్ది, భారతదేశపు ‘సాఫ్ట్‌పవర్’కు ప్రతీకగా నిలిచే ఈ రెంటి గురించి ఎవరి అభిప్రాయం వారిదే! పబ్లిక్‌లోకి వచ్చాక... వీటిపై మాట్లాడద్దని ఎవరన్నా అంటే అది అజ్ఞానం, అర్థరహితం. సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితి, మితిమీరిన పారితోషికాలు, అదుపు తప్పిన చిత్ర నిర్మాణవ్యయం, అందుకుంటున్న పారితోషికాలకు తారలు లెక్కలు సరిగ్గా చూపుతున్నారా, ప్రభుత్వానికి పన్ను కడుతున్నారా, ఆడని సినిమాలకు సైతం శత – ద్విశతదినోత్సవ ‘వీర’ రికార్డులు లాంటి అనేక అంశాలపై ఇటీవల జరుగుతున్న చర్చను ఈ దృష్టితో చూడాలి. పార్లమెంట్లో వచ్చిన పారితోషికాల ప్రస్తావనను ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ అగ్రతార చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర ద్విశత దినోత్సవ వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు రచ్చను పెంచాయి. (చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!) ‘భోళా శంకర్’ చిత్రం రిలీజ్‌కు కొద్దిరోజుల వ్యవధి ఉండగా, ప్రత్యేక ఆహ్వానితులతో ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల విజయోత్సవ వేడుక జరిగింది. ఆ వేదికపై ఆయన ఆచితూచి తన తమ్ముడు పవన్ కల్యాణ్ పేరెత్తకుండానే తారల వివాదాస్పద పారితోషికాల అంశాన్ని ప్రస్తావించారు. సినిమా వాళ్ళకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నారనే అంశం పార్లమెంట్లో చర్చించాల్సిన విషయం కాదనీ, వరుసగా సినిమాలు చేస్తున్నది పరిశ్రమలోని వారికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతోనే అనీ అన్నారు. పాత రాజకీయ వాసనలు పోని చిరంజీవి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ – ఉపాధి అవకాశాలపై రాజకీయ నేతలు దృష్టి సారించాలనీ సలహా ఇచ్చారు. పారితోషికాల విషయాన్ని పెద్దది చేసి దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయద్దనీ అభ్యర్థించారు. గమనిస్తే – ‘ఆచార్య’ చిత్ర సమయంలో జరిగిన పరిణామాలు, ఆ చిత్రానికి ఆరంభ వసూళ్ళు సైతం ఆశించినంతగా రాని పరిస్థితితో అక్కడ నుంచి చిరు కొత్త ధోరణిలోకి దిగారు. కారణాలు ఏమైనా ఆ తరువాత నుంచి తన ప్రతి కొత్త సినిమా రిలీజు ముందు అనివార్యంగా అన్నయ్య నోట తమ్ముడి మాట వినిపిస్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమే అనుకోగ లమా? ఇదీ విశ్లేషకుల ప్రశ్న. దానికి జవాబు లోతైన వేరే చర్చ. (చదవండి: సీఎం పాదాలకు మొక్కిన తలైవా.. మండిపడుతున్న నెటిజన్స్!) అది అటుంచితే... పరిశ్రమ బాగు కోసమే సినిమాలు చేస్తున్నామని పైకి ఎవరు ఎంతగా చెబుతున్నా, అసలు చిత్ర నిర్మాణ వ్యయంలో అత్యధిక భాగం అగ్రతారలు, అగ్ర టెక్నీషియన్ల జేబులోకే చేరుతుందనేది నిష్ఠుర సత్యం. తారల ఈ భారీ పారితోషికాల వ్యవహారంపై చర్చ ఇవాళ కొత్తది కాదు. ఆ మాటకొస్తే తీసుకొనే రెమ్యూనరేషన్లో మనమే జాతీయ స్థాయిలో ఘనులమంటూ, ‘బిగ్గర్ దేన్ (అమితాబ్) బచ్చన్’ అని జాతీయ ఆంగ్లపత్రికల్లో సైతం మన హీరోలే రాయించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, అంతకంతకూ సినిమాల సక్సెస్ శాతం తగ్గి, భారీ నష్టాలు పెరుగుతున్నందున... పారితోషికాల లాంటి అనుత్పాదక వ్యయం తగ్గాలనీ, సినిమా మేకింగ్ కోసం పెట్టే ఉత్పాదక వ్యయం పెరగాలనీ సాక్షాత్తూ పరిశ్రమలో పెద్దలే ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఇవాళ తెలుగులో పెద్ద సినిమాల బడ్టెట్‌లో సగటున మూడింట రెండొంతులు, మరోమాటలో 65 నుంచి 70 శాతం దాకా రెమ్యూనరేషన్లకే పోతోంది. అదేమంటే మార్కెట్లో ఉన్న డిమాండ్, సినిమాకు జరిగే వ్యాపారాన్ని బట్టే అంతంత పారితోషికాలు ఇస్తున్నారని వాదిస్తున్నారు. సమర్థించుకోవాలని చూస్తున్నారు. కానీ, ఈ ధోరణి పరిశ్రమ దీర్ఘకాలిక ప్రయోజనాలకూ, పైకి చెబుతున్న సోకాల్డ్ కార్మిక ఉపాధికీ పనికొచ్చేదైతే కానేకాదు. (చదవండి: రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు..) అసలు ఇంతంత పారితోషికాలకూ ఓ కథ ఉంది. పైరసీ సినిమా చూడడం రక్తపుకూడు లాంటిదని మన స్టార్లు డైలా గులు చెబుతారు. కానీ, కొత్త సినిమా రిలీజంటే అధికారికంగా, అనధికారికంగా టికెట్ రేట్లు పెంచుకొని, పబ్లిక్ బ్లాక్‌మార్కెటింగ్ చేసే ధోరణిని ఆరంభించినదే మన మెగా తారలు. పైగా ఆ అధిక రేట్లతో సహజంగానే వచ్చే వసూళ్ళ లెక్క వేరు, ప్రభుత్వానికి చూపి పన్నుకట్టే లెక్క వేరు! ప్రభుత్వ ఖజానాకు వేస్తున్న ఈ కన్నానికి తోడు... బలుపు కాక వాపు అయిన ఆ ఓపెనింగ్ కలెక్షన్లే గీటురాయిగా టాప్‌స్టార్స్ పారితోషికాలను పెంచేస్తూ... నిర్మాతల జేబుకు పెడుతున్న చిల్లు అదనం. వెరసి... పైరసీ పెరగడానికీ, థియేటర్లలో సినిమా ఆడే రోజులు తగ్గి అన్ని సెక్టార్లలో పరిశ్రమ ఇక్కట్లలో పడడానికీ పరోక్షంగా కారణమయ్యారు. అధిక టికెట్ రేట్లకూ, పారితోషికాలకూ జరుగుతున్న ఆ పన్నుల ఎగవేత మాట అటుంచుదాం. ఇటీవల 100 – 200 రోజులు బలవంతాన లాగించి ఆడిస్తున్న అగ్రతారల సినిమాలకు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా దక్కట్లేదు. ఆశ్చర్యపరిచే ఈ లోగుట్టు ఇన్ని పెద్ద కబుర్లు చెబుతున్నవారికి తెలుసా? చాలామందికి తెలియనిదేమిటంటే... వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల లోపుంటే, జీఎస్టీ కట్టనక్కర్లేదని చట్టం. ఈ లొసుగును అడ్డం పెట్టుకొంటూ... సినిమాలు రిలీజయ్యే చిన్న సెంటర్లలోని పలు నాన్–ఏసీ థియేటర్లు తమ వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షల లోపేనని బొంకుతున్నాయి. అలా అవి తాము ప్రదర్శించే సిన్మాలకు ప్రభుత్వానికి దఖలు పరచాల్సిన ‘డైలీ కలెక్షన్ రిపోర్ట్’ (డీసీఆర్) రాయనక్కర్లేదు, జీఎస్టీ కట్టనూ అక్కర్లేదు. జీఎస్టీ లేని ఆ థియేటర్లను వాటంగా చేసుకొని, ఆడని సినిమాకు సైతం శత, ద్విశత దినోత్సవాలు చేసే సంస్కృతికి పలువురు హీరోలు, వారి భజన బృందాల వారు తెర తీశారు. ఇటీవల జరుగుతున్న పెద్ద హీరోల సినిమాల విజయోత్సవాల తెర వెనుక భాగోతం ఇదే! అలాంటి వేదికపై నిల్చొని చిరు సుద్దులు చెప్పడం పెను చోద్యం! పిచ్చుక లాంటి పరిశ్రమపై బ్రహ్మాస్త్రం వేస్తున్నారనడం విడ్డూరం. జీఎస్టీ చట్టాన్ని సందు చేసుకొని... స్టార్ హీరోల సినిమాకు దొంగ రికార్డుల వీరతాళ్ళు వేసేందుకు ఈ నాన్–జీఎస్టీ సినీ థియేటర్లు భలే అక్కరకొస్తున్నాయి. ఇన్ని రోజులకు ఇంత అని ఫ్యాన్స్ దగ్గర ఎంతో కొంత మొత్తం గుత్తగా మాట్లాడుకొంటూ, ఆ హాళ్ళు అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. వెరసి, మూసేసిన చాలా థియేటర్లకు బయట మాత్రం వాల్‌పోస్టర్లు ప్రదర్శిస్తూ, ఆడని సినిమాను సైతం శతదినోత్సవ విజయంగా ప్రకటిస్తున్నారు. కొద్దికాలంగా ఇద్దరు, ముగ్గురు అగ్ర హీరోల సినిమాలకు ఎక్కువగా జరుగుతున్నది ఇదే! గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒక సూపర్తార అభిమానులు ఆయన ఫ్లాప్ సినిమాలన్నిటికీ ఇలానే శతదినోత్సవాలు చేస్తుంటారు. ఇక, ఒక దివంగత నటుడి సినిమా చిత్తూరు జిల్లా అరగొండలో ఆడింది ఒక్కరోజు ఒకే ఒక్క ఆట అయినా, 100 రోజులు గడిచాక ఈ ఏడాది శతదినోత్సవం చేయడం ఈ పెడ ధోరణికి తాజా పరాకాష్ఠ. అంతెందుకు... ఈ ఏడాదే సంక్రాంతికి రిలీజైన అగ్రతారల చిత్రాలూ తాజాగా ఇదే పద్ధతిలో 200 రోజులంటూ హంగామాగా షీల్డులు అందుకున్నవే! ఒకరు కర్నూలు జిల్లా ఆలూరులో చేస్తే, మరొకరు కృష్ణాజిల్లా అవనిగడ్డలో చేశారు. సెంటర్లు తేడానే తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్! నిజానికి, కింది సెంటర్ల నాన్–జీఎస్టీ థియేటర్లు సైతం ప్రతి పెద్ద సినిమానూ దాదాపు రూ. 3 – 4 లక్షల డబ్బు పెడుతూ ప్రదర్శిస్తున్నాయి. ఏటా కనీసం అలాంటి ఆరేడు సినిమాలు ఆడుతూ, 20 లక్షల నాన్–జీఎస్టీ టర్నోవర్ పరిధి దాటి మరీ వార్షిక లాభాలూ గడిస్తున్నాయి. పైకి మాత్రం జీఎస్టీ పరిధిలో లేమంటూ పన్ను ఎగవేస్తున్నాయనేది చిదంబర రహస్యం. చిరు దుకాణాలకు ఊరటగా ప్రభుత్వమిచ్చిన ఈ 20 లక్షల నాన్– జీఎస్టీ రూల్‌ను సినిమా హాళ్ళు మోసానికి వాడుకోవడం దుర దృష్టకరం. నిజానికి, ట్యాక్స్ లేని హాళ్ళలో డీసీఆర్ ఉండదు గనక, అక్కడ సినిమా ఆడినా సరే బాక్సాఫీస్ పరిధిలో ఆడనట్టే లెక్క. ఇవాళ ప్రముఖులు ఇళ్ళల్లోనే క్యూబ్ కనెక్షన్లు పెట్టుకొని కొత్త సినిమాలు చూసుకుంటున్న ప్రదర్శనలతో అదీ ఒక రకంగా సమానం. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి, ఒకపక్క అభిమాన హీరోకు లేని రికార్డ్ తేవాలనే వెర్రి ప్రేమతో సామాన్య ఫ్యాన్స్ జేబులో సొమ్ము పోగొట్టుకుంటుంటే... మరోపక్క ప్రభుత్వానికి సినిమాహాళ్ళ పన్ను ఎగవేత సాక్షిగా హీరోలు విజయోత్సవ వేలంవెర్రిలో సాగడం విచారకరం. తెలిసో తెలియకో ఈ తప్పులో భాగమవుతున్న మన పెద్ద హీరోలు ముందు కళ్ళు తెరవాలి. ఈ అవాంఛనీయ వైఖరిని ఇకనైనా సరిచేసుకోవాలి. చాలామంది గ్రహించని మరొక్క సంగతి – ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500కు పైగా థియేటర్లుంటే, ఇవాళ వాటిలో ఏడాదంతా సినిమాలు ప్రదర్శిస్తున్న హాళ్ళు రెండొంతులే! సుమారు 500కు పైగా హాళ్ళు ఏటా కొన్ని నెలలు మూసివేసే ఉంటున్నాయి. ఇటు సక్సెస్ఫుల్ సినిమాలూ, అటు కరోనా అనంతర కాలంలో హాళ్ళకు ప్రేక్షకులు రావడమూ తగ్గిపోయాక అదీ వర్తమాన సినీ పరిశ్రమ దుఃస్థితి. అందుకే, అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులతో బంగారు బాతును ఒకేసారి కోసుకుతినాలని చూస్తే అది యావత్ సినీ పరిశ్రమకే మెగా కష్టం. ఇది పిచ్చుకలు తమ గూటిపై తామే వేస్తున్న బ్రహ్మాస్త్రం. ప్రభుత్వానికి పన్ను ఎగవేతతో లేని హైప్ సృష్టిస్తూ, ఏకంగా పరిశ్రమ నెత్తిన పెడుతున్న భస్మాసుర హస్తం! – రెంటాల జయదేవ -
హైదరాబాద్‌లో సినిమా కథ!
బ్రిటీష్ వారికి నిజామ్ రాజు ధారాదత్తం చేయగా అటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన సర్కారు జిల్లాలు, దత్తమండలాల ప్రాంతంలో కానీ, ఇటు నిజామ్ సొంత ఏలుబడిలో మరాఠ్వాడా, హుబ్లీ ప్రాంతాలతో కలసిన హైదరాబాద్ సంస్థానంలో కానీ సాగిన తెలుగు వారి సైలెంట్ సినిమా ప్రయాణం ఇవాళ్టికీ పూర్తిగా వెలుగులోకి రాని సమాచారఖని. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తితో సినీ వ్యాసకర్త, పలు సినీ గ్రంథాల రచయిత హెచ్. రమేశ్‌బాబు ఇప్పుడు హైదరాబాద్ ప్రాంత మూకీ యుగ అంశాలను తవ్వి తీశారు. స్టీఫెన్ హ్యూస్ లాంటి విదేశీయుల నుంచి బి.డి. గర్గ లాంటి స్వదేశీయులు, స్థానిక విశ్వవిద్యాలయ పరిశోధకుల దాకా ఇప్పటికే పలువురు చేసిన శోధనలు, రచనల నుంచి కావాల్సినంత తీసుకొంటూ... అరుదైన ఫోటోలతో సహా అనేక పాత పుస్తకాల సమాచారాన్ని కలబోసి ఒకచోట అందించారు. ఈ పరిశ్రమ అభినందనీయం. అదే సమయంలో పరస్పర వైరుద్ధ్యాలనూ, పాత తప్పులనూ సరిచేసుకోవాలని మర్చిపోయి రచయిత తడబడ్డారు. చిత్రంగా ఈ రచనలో మద్రాసు ప్రాంత సినీచరిత్రను ఎత్తిరాయడంలోనూ తప్పులు దొర్లాయి. మద్రాస్‌లో తొలి సినిమా థియేటర్ (పేజీ 47), రఘుపతి వెంకయ్య ఆ హాళ్ళలో సిన్మాలు చూసి సినీరంగం వైపు వచ్చారనడం, ఆయన కుమారుడు ఆర్. ప్రకాశ్ హాలీవుడ్ దిగ్గజం సిసిల్ బి. డిమిలీ దగ్గర శిక్షణ పొందారనే (పేజీ 53) మాట... ఇలా అనేక తప్పుడు పాత పుకార్లనే మళ్ళీ అచ్చేశారు. హైదరాబాద్‌లో సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలు ఎప్పుడు మొదలయ్యాయన్న విషయంలోనూ పొరబడ్డారు. మద్రాసులో తొలి సినీ ప్రదర్శనలు 1896 డిసెంబర్లో ఇచ్చిన స్థానికుడు టి.జె. స్టీవెన్సన్ ఆపై దక్షిణాది అంతటా పర్యటిస్తూ వచ్చి, తెలంగాణ గడ్డపై 1897 ఆగస్ట్‌లో ప్రదర్శనలు ఇచ్చారన్నది చరిత్ర. కానీ, అంతకు ఏడాది ముందే 1896 ఆగస్ట్‌లో జరిగాయని ఈ పుస్తకంలో చెబుతున్నవి– ఒక్కరే కంతలో నుంచి చూసే ‘పీప్ హోల్ షో’లు. అవి సినిమాకు ముందు రూపాలు. అందరూ ఏకకాలంలో చూసే సినిమాటోగ్రాఫ్లు కావని గ్రహించాలి. ‘1897 నాటికే సికిందరాబాదు నుండి మదరాసుకు ముడి ఫిలిం సరఫరా అయినట్టు పేర్కొన్నారు స్టీఫెన్ హ్యూస్’ (పేజీ 35) అని రమేశ్‌బాబు ఉట్టంకించారు. కానీ, ఆంగ్ల మూల రచనలో ఎక్కడా ఆ ఊసే లేదు. అలాగే, మూసీ వరదలపై టాపికల్ తీసింది ముంబయ్ కంపెనీ అని చరిత్ర చెబుతున్నా, సంబంధం లేని కలకత్తా మదన్ కంపెనీకీ, ధీరేన్ గంగూలీకీ ఊహల ముడి వేశారీ రచనలో. తెలుగు సినీ పితామహత్వం విషయంలోనూ ఈ పుస్తక రచయితకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి. ఆ స్థానిక భావోద్వేగాలనూ, భిన్నాభిప్రాయాలనూ సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే! కానీ, ‘‘తెలుగు సినిమా మూలాలు తమిళనాట ఉన్నప్పుడు, తెలంగాణ సినీ పితామహుడు బెంగాలీయుడు (ధీరేన్ గంగూలీ) కావడంలో తప్పు లేదు’’ (పేజీ 22) అని పుస్తక రచయిత వాదన, అసలు మద్రాసు (చెన్నపట్నం) సహా నేడు తమిళనాడు అంటున్న ప్రాంతంలో సింహభాగం ఒకప్పుడు మన తెలుగు వారిదే! మన ఏలుబడిలోదే! ఆ చరిత్ర మర్చిపోతే ఎలా? ప్రదర్శన, స్టూడియో, పంపిణీ, చిత్రనిర్మాణం – నాలుగు సెక్టార్లలోనూ మూకీ యుగంలోనే కాలుమోపి, నాలుగింటా తెలుగువారిలో ప్రప్రథముడిగా నిలిచాడు గనకే వెంకయ్యను తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడన్నారు. దేశవిదేశాలకు తన సినీ ప్రదర్శన కృషిని విస్తరించి, మూకీ సినిమా తీసిన తొలి తెలుగువాడైన అలాంటి వ్యక్తిని కేవలం మద్రాసుకే పరిమితమన్నట్టుగా తగ్గించి చెప్పడం (పేజీ 51) భావ్యమా? అలాగే, ‘... మదరాసు రాష్ట్రానికి సంబంధించిన సినిమా విశేషాలన్నీ కూడా ఆ ప్రాంతానికే చెందుతాయి. కానీ, సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత అక్కడి పరిణామాలను తెలుగు సినిమా చరిత్రకు తొలిరోజులుగా చరిత్రకెక్కించారు’ (పేజీ 23) అని రచయిత నిందారోపణ చేశారు. నిజామ్ వదిలేశాక బ్రిటీషు ఏలుబడిలో, ప్రెసిడెన్సీలో, మద్రాస్ రాజధానిగా తెలుగు వారు గడిపినకాలం తెలుగువారిది కాకుండా ఎలా పోతుంది? తమిళుల చరిత్రను తెచ్చి తెలుగు సినిమా చరిత్ర అంటే తప్పు. అంతేకానీ, మద్రాసులో జరిగింది గనక తెలుగు వారి కృషైనా సరే తెలుగు సినీ చరిత్రే కాదని అనడం సబబా? ఒక్కమాటలో... ఇప్పుడు చేయాల్సింది ఆరోపణలు కాదు. ఆలోచనతో... మరుగునపడ్డ స్థానిక చరిత్రల పునర్నిర్మాణం. హైదరాబాద్ రాష్ట్రం సహా అంతటా తెలుగు వారి సినిమా ప్రస్థానంపై నిర్విరామ కృషి. నిరంతరం సాగాల్సిన ఆ ప్రయత్నంలో మన సినీ చరిత్రకు ఈ పుస్తకం అనేక లోపాలున్నా సరే ఓ కొత్త చేర్పు. మూకీల కాలంలోనే హైదరాబాద్ నుంచి బొంబాయికీ, సినీ రంగానికీ వెళ్ళిన పైడి జైరాజ్ సహా పలువురి సమాచారమే అందుకు సాక్ష్యం. లోటస్ ఫిలిం కంపెనీ – హైదరాబాదు (తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 –1932) రచన – హెచ్. రమేష్‌బాబు ప్రతులకు – అన్ని ప్రధాన పుస్తక విక్రయశాలల్లో. పేజీలు – 160, వెల – రూ. 150 – రెంటాల జయదేవ -
తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!
అభిరుచి గల మురారి... ఆద్యంతం సాహిత్య సంగీతాల్ని ప్రేమించిన మురారి... మంచి చిత్రాల నిర్మాత ‘యువచిత్ర’ మురారి వెళ్ళిపోయారు. మూడు దశాబ్దాల స్నేహంలో ఎన్నో ఘటనలు మనసులో రీళ్ళు తిరిగాయి. మురారిది కమ్యూనిస్ట్ కుటుంబం. బెజవాడలో బాగా డబ్బున్న కాట్రగడ్డ కుటుంబం. సినీ నిర్మాణానికి పంపిణీ వ్యవస్థే మూలస్తంభమైన రోజుల్లో ప్రతిష్ఠాత్మక నవయుగ ఫిల్మ్స్ అధినేతకు అన్న కొడుకు. ఆ కొంగుచాటులన్నీ దాటుకొని, కష్టపడి, ఒక్కో మెట్టూ పేర్చు కుంటూ మురారి తనదైన కీర్తి, అపకీర్తుల సౌధం కట్టుకు న్నారు. వి. మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడైన మురారికి అనంతరకాల అగ్ర దర్శకుడు కోదండరామి రెడ్డి సహపాఠీ. జెమినీ వాసన్, విజయా చక్రపాణి వద్ద నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. కొట్లాడే దర్శకుడు కాబోయి, తిట్టి మరీ చెప్పి చేయించుకొనే నిర్మాతగా మారడమే తెలివైన పని అని గ్రహించారు. తనకు నచ్చిన సినిమాలే తీశారు. తనకు నచ్చినట్టే తీశారు. పంతం పట్టి రీషూట్లూ చేశారు. పారితోషికం పెంచి ఇస్తూ, పని చేయించుకున్నారు. ‘తిడతాడు.. డబ్బుతో కొడతాడు’ అనిపించుకున్నారు. సమకాలికుల్లో విలక్షణంగా నిలిచారు. బ్యానరే ఇంటిపేరైన కొద్ది నిర్మాతల్లో ఒకరయ్యారు. మద్రాస్ మెరీనా బీచ్‌లోని దేవీప్రసాద్‌రాయ్ చౌధురి ‘శ్రామిక విజయం’ శిల్పం తమ సంస్థకు చిహ్నంగా పెట్టుకో వడం మురారి పెరిగిన వాతావరణపు ఆలోచన. నవలల్ని తెరపైకి తెచ్చినా, ఇంగ్లీష్ ఇతివృత్తాల్ని తెలుగు కథలుగా మలిచినా అది ఆయన పెంచుకున్న అభిరుచి. ‘సీతామాలక్ష్మి, గోరింటాకు, త్రిశూలం, సీతారామ కల్యాణం’ వగైరా అన్నీ కలిపి తీసినవి 9 సినిమాలే! విజయ బాపినీడుతో కలసి నిర్మించిన ‘జేగంటలు’ తప్ప అన్నీ సక్సెస్‌లే. నందులతో సహా అనేక అవార్డులు తెచ్చినవే. ఆయన పాటలు అందమైన హిందోళాలు. ఎవర్గ్రీన్ హిట్లు. ఒకే నిర్మాత సినిమాల్లోని సాహిత్య విలువలపై 20 ఏళ్ళక్రితమే విశ్వవిద్యాలయ పరిశోధన జరిగింది ఒక్క ‘యువచిత్ర’ సినిమాలకే! ‘మామ’ మహదేవన్ లేకుండా సినిమా తీయనన్న మురారి, మామ పోయాక నిజంగానే సినిమా తీయలేకపోయారు. కీరవాణి సంగీతంతో కథ, సంగీత చర్చలు జరిగినా ముందుకు సాగలేదు. మూగబోయిన కృష్ణశాస్త్రిని ఆరాధిస్తూ బాంబే బ్రెడ్ టోస్ట్ చేసిచ్చినా, ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కని పాలగుమ్మి పద్మ రాజును ఆస్థాన రచయితగా పోషించినా, కనుమరుగైన మహా నటి సావిత్రితో ‘గోరింటాకు’లో పట్టుబట్టి వేషంవేయించినా, జగ్గయ్య సారథ్యంలో ‘మనస్విని’ ట్రస్ట్–అవార్డులతో మరణిం చిన ఆత్రేయను కొన్నేళ్ళు ఏటా స్మరించినా, ఎస్పీబీ – సత్యానంద్ – జంధ్యాల – ఓంకార్‌లతో గాఢంగా స్నేహిం చినా... అది మురారి మార్క్ ప్రేమ. కృష్ణశాస్త్రి మరణించాక ‘ఇది మల్లెల వేళ’ అంటూ ఎంపిక చేసిన 11 పాటల్ని ఎల్పీ రికార్డుగా హెచ్ఎంవీతో పట్టుబట్టి రిలీజ్ చేయించారు. ఆత్రేయ సాహిత్యం వెలికి రావడంలో పాత్ర పోషించారు. ప్రొడ్యూసరంటే కాంబినేషన్లు కుదిర్చే క్యాషియరనే కాలం వచ్చాక, అభిరుచి చంపుకోలేక మూడు దశాబ్దాల క్రితమే నిర్మాతగా స్వచ్ఛంద విరమణ చేశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లో ‘సన్’ స్ట్రోక్‌కు ఆవిరి కారాదని తంటాలు పడ్డారు. ప్రతిభను గుర్తించి, నెత్తికెత్తుకోవడం మురారి నైజం. 22 ఏళ్ళ క్రితం ఓ సికింద్రాబాద్ కుర్రాడు సినిమా తీస్తే, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. వార్త చదివిన మురారి ఆ కుర్రాణ్ణి చెన్నైకి పిలిపించి, అభినందించి, ఆతిథ్య మిచ్చి మరీ పంపారు. ఆ సినిమా ‘డాలర్ డ్రీమ్స్’. ఆ సంగతి నేటికీ తలుచుకొనే అప్పటి ఆ కుర్రాడే – ఇవాళ్టి శేఖర్ కమ్ముల. హీరోయిన్లు తాళ్ళూరి రామేశ్వరి, వక్కలంక పద్మ, గౌతమి, రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి), కళా దర్శకుడు రాజులను మురారే తెరకు పరిచయం చేశారు. అగ్ర హీరోలు, దర్శకులతో పని చేసినా వారి కన్నా రచయితలతోనే ఆయనకు స్నేహం. డాక్టర్ జివాగో లాంటి నవలలు, వాటిని తెరకు మలి చిన తీరు గురించి మురారి చెబుతుంటే, డబ్బులు కాదు.. మనసు పెట్టినవాడే మంచి నిర్మాతనే మాటకు సాక్ష్యం అనిపిం చేది. నాటి ‘వేయిపడగలు’ నుంచి నేటి ‘అర్ధనారి’ దాకా బాగున్న ప్రతి నవల మురారి చదవాల్సిందే. చర్చించాల్సిందే. సందేహనివృత్తికి జగ్గయ్య, విఏకె రంగారావు, గొల్లపూడి, పైడి పాల, కాసల నాగభూషణం లాంటి వార్ని సంప్రతించాల్సిందే. మురారితో మాటలన్నీ పోట్లాటలే! మాట తీరే అంత. చూపులకు కోపధారి. తెలియనివాళ్ళకు తిక్క మనిషి. సన్నిహితమైతే తెలిసేది– మాటలోనే కారం కానీ మనసు నిండా మమకారమే అని! ఒక దశ దాటాక... ఆయన ప్రేమించి, గౌరవించే హీరో శోభన్‌బాబు, దర్శకుడు దాసరి లేరు. సలహా చెప్పే స్నేహశీలి ఓంకార్ ముందే వెళ్ళి పోయారు. చెన్నైగా మారిన మద్రాసులో తెలుగు చిత్రసీమ ఖాళీ అయింది. పాత మిత్రులు లేరు. కొత్తగా మిత్రులు కారు. ఊరవతల సముద్రపుటొడ్డు నివాసంలో విచిత్రమైన ఒంటరి తనం. సోషల్ మీడియాలో స్నేహాన్నీ, సాహిత్యంలో సాంత్వ ననూ వెతుక్కున్నారు. తోటలో తామరలు, ఇంట్లో కుక్కలతో సేద తీరాలనుకున్నారు. ఎఫ్బీలో నోరు చేసుకుంటూ వచ్చారు. దశాబ్దిన్నర క్రితం ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ కళ్ళు చెదిరే ఖరీదైన గ్రంథంగా రావడంలోనూ మురారి సంపా దకత్వ అభిరుచి కనిపిస్తుంది. తెలుగు నిర్మాతల వెల్ఫేర్ ట్రస్ట్ చేపట్టిన ఆ బరువైన రచనలో బలమైన ఆయన ఇష్టానిష్టాలు, చెలరేగిన వాదాలు, వివాదాలు మరో పెద్ద కథ. తోచుబడి కావట్లేదన్నప్పుడు, తరచూ చెప్పే పాత కబుర్లనే కాగితంపై పెట్టమన్న సలహా మురారిలోని రచయితను నిద్ర లేపింది. ఎన్నో చేదునిజాలు, నాణేనికి ఒకవైపే చూపిన కొన్ని అర్ధ సత్యాలను గుదిగుచ్చిన ఆయన జ్ఞాపకాల కలబోత ‘నవ్విపోదురు గాక’ సంచలనమైంది. పదేళ్ళలో 12 ముద్రణలు జరుపుకొంది. డ్రాఫ్ట్ రీడింగ్‌లో పలువురు ప్రముఖులు సందేహించినా, ఆటో బయోగ్రఫీల్లో అది నేటికీ టాప్సెల్లర్. ఆ రచనకు ప్రేరకులం, తొలి శ్రోతలమైన ఓంకార్‌నూ, అస్మదీయుడినీ పదుగురిలో పదేపదే గుర్తుచేసుకోవడం మురారి సంస్కారం. ఆవేశభరిత మురారిది జీవితంలో, సినిమాల్లోనూ ముళ్ళ దారి. ముక్కుసూటి తత్వం, మార్చుకోలేని అభిప్రాయాలు, మాట నెగ్గించుకొనే ఆభిజాత్యంతో సహచరుల్ని దూరం చేసు కోవడం మురారి జీవలక్షణాలు. చరమాంకంలో తప్పు తెలుసుకున్నారు. ‘ఆఖర్న మోయడానికి నలుగురినైనా మిగుల్చుకో వాలయ్యా’ అనేవారు. అప్పటికే లేటైంది. ఆయన పోయారు. ఆయన దర్శక, హీరోలెవరూ రాలేదు. సంతాపాలూ చెప్ప లేదు. అవసరాలే తప్ప అభిమానాలు తక్కువైన రంగుల లోకంలోని ఆ సంగతీ మురారికి ముందే తెలుసు. ‘‘ఏవయ్యా రేపు నే పోయాక పేపర్లో రాస్తావా? చదవడానికి నేనుండను కానీ, నా గురించి ఏం రాస్తావో ఇప్పుడే చెప్పచ్చుగా!’’ అనేవారు. ఇంత తొందరగా ఆయన కోరిక నెరవేరుస్తానను కోలేదు. రాశాను... చదివి చీల్చిచెండాడడానికి ఆయన లేరు. మద్రాస్ తెలుగు సినిమా ఆఖరి అనుబంధాల్లో మరొకటి తెగిపోయింది. చిన్ననాటి నుంచి చివరి రోజుల దాకా జీవి తంతో నిత్యం సంఘర్షిస్తూ, అలసిపోయిన డియర్ మురారి గారూ... రెస్ట్ ఇన్ పీస్ ఎట్లీస్ట్ ఇన్ దిస్ లాస్ట్ జర్నీ! – రెంటాల జయదేవ -
Jean Luc Godard: సినీ నవ్య పథగామికి సెలవ్!
‘‘సంగీతానికి బాబ్ డిలాన్ ఎంతో... సినిమాకు గొడార్డ్ అంత!’’ – నేటి మేటి హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో అవును... గొడార్డ్ అంతటి సినీ దిగ్గజమే! వెండితెర విప్లవమైన ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమా ఉద్యమాన్ని తెచ్చిన ఆరేడుగురు మిత్రబృందంలో అగ్రగామి. సినీ రూపకల్పన సూత్రాలను తిరగరాసిన అనేక చిత్రాలకు తన తొలి సినిమాతోనే బీజం వేసిన పెద్దమనిషి. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన సినీ మేధావి. ఈ 91 ఏళ్ళ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీ దర్శక వరేణ్యుడు విషాదభరిత రీతిలో సెప్టెంబర్ 13న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆత్మహత్యకు సాయం తీసుకొని అంతిమ ప్రయాణం చేశారు. అవయవాలేవీ పనిచేయనివ్వని అనేక వ్యాధుల పాలైన ఆయనకు స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధమైన ఆ రకమైన తుది వీడ్కోలు సాంత్వన చూపింది. అంతేకాదు... ఆ రకమైన ఆత్మహత్య సంగతి అధికారికంగా చెప్పాలనీ ముందే ఆయన మాట తీసు కున్నారు. అలా ఆఖరులోనూ గొడార్డ్ది నవ్య పంథాయే! 1930 డిసెంబర్లో పుట్టిన గొడార్డ్ 1950లో కొందరితో కలసి ‘గెజెట్ డ్యూసినిమా’ అనే సినిమా పత్రిక స్థాపించి, అనేక వ్యాసాలు రాశారు. 1952 నుంచి ఆ మిత్ర బృందంతో గొంతు కలిపి, న్యూవేవ్ సినిమాకు దన్నుగా విమర్శ వ్యాసాలు వెలువరించారు. మొదట లఘుచిత్రాలు, ఆనక 1959లో తొలి సినిమా తీశారు. దాన్ని ఖండఖండాలుగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు, అవసరానికి ఆయన మొదలెట్టినదే ‘జంప్ కట్’ ఎడిటింగ్. ఇవాళ అదే ప్రపంచ సినిమాలో ఓ వ్యవస్థీకృత విధానమైంది. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన ఈ సినీ మేధావి రూటే సెపరేటు. నటీనటులు సహజంగా ప్రవర్తిస్తుంటే, కెమేరా నిరంతరం కదులుతూ పోతుంటే, స్క్రిప్టు అక్కడికక్కడ స్పాట్లో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే, ఎడిటింగ్‌లో మునుపెరుగని వేగం ఉంటే... అదీ గొడార్డ్ సినిమా. స్టయిలిష్‌గా సాగే తొలి చిత్రం ‘బ్రెత్లెస్’తోనే ఇటు విమర్శక లోకాన్నీ, అటు బాక్సాఫీస్ ప్రపంచాన్నీ కళ్ళప్పగించి చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆ పైన ‘కంటెప్ట్’ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. మలి చిత్రంలో నటించిన డ్యానిష్ మాడల్ అన్నా కరీనాను పెళ్ళాడి, ఆమెతో హిట్ సినిమాలు చేశారు. 1968లో ఫ్రాన్స్‌లో విద్యార్థుల, శ్రామికుల నిరసనకు సంఘీభావంగా నిలబడి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రద్దు చేయించారు. ఆ ఏడాదే ఓ మార్క్సిస్ట్ సినీ బృందాన్ని స్థాపించి, సామ్యవాదాన్ని అక్కున చేర్చుకోవడం మరో అధ్యాయం. 1960లలో విరామం లేకుండా వరుసగా సినిమాలు తీసిన గొడార్డ్ 1970లకు వచ్చేసరికి స్విట్జర్లాండ్‌లోని ఓ టీవీ స్టూడియోలో పనిచేస్తూ, కొత్త మీడియమ్ వీడియో వైపు దృష్టి మళ్ళించారు. 1980లలో సినీ రూపకల్పనకు తిరిగొచ్చి, ’94 వరకు అనేక చిత్రాలు తీశారు. దర్శకుడిగా గొడార్డ్లో మూడు దశలు. న్యూవేవ్ గొడార్డ్ (1960–67)గా మొదలైన ఆయన ర్యాడికల్ గొడార్డ్ (1968–72)గా పరిణామం చెంది, 1980ల అనంతరం వీటన్నిటికీ భిన్నమైన దర్శకుడిగా పర్యవసించారు. వస్తువుకూ– శిల్పానికీ, మనసుకూ – మెదడుకూ సమరస మేళవింపు ఆయన సినిమాలు. ఆయన రాజకీయాలు చూపెడతారు. కానీ ప్రబోధాలు చేయరు. సినిమానే శ్వాసించి, జీవించడంతో తెరపై అణువణువునా దర్శనమిస్తారు. ప్రతి సినిమాతో సినీ ప్రేమికుల మతి పోగొడతారు. సినిమాలో కవిత్వాన్నీ, తనదైన తాత్త్వికతనూ నింపేసిన ఆయన, నిర్ణీత పద్ధతిలోనే కథాకథనం సాగాలనే ధోరణినీ మార్చేశారు. స్థల కాలాదులను అటూ ఇటూ కలిపేసిన కథాంశాలతో సినిమాలు తీశారు. ‘కథకు ఆది మధ్యాంతాలు అవసరమే. కానీ, అదే వరుసలో ఉండాల్సిన పని లేద’ని నమ్మారు. దాదాపు 100కు పైగా సినిమాలు తీసినా, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసమే పరితపించారు. ఆయన సినిమాల్లో రిలీజ్ కానివి, సగంలో ఆగినవి, నిషేధానికి గురైనవీ అనేకం. నాలుగేళ్ళ క్రితం 87 ఏళ్ళ వయసులో 2018లోనే గొడార్డ్ తాజా చిత్రం రిలీజైంది. కెరీర్లో ఒక దశ తర్వాత ఆలోచనాత్మకత నుంచి అర్థం కాని నైరూప్య నిగూఢత వైపు ఆయన కళాసృష్టి పయనించిందనే విమర్శ లేకపోలేదు. అయితేనేం నేటికీ పాత చలనచిత్ర ఛందోబంధాలను ఛట్ఫట్మనిపించిన వినిర్మాణ శైలి దర్శకుడంటే ముందు గొడార్డే గుర్తుకొస్తారు. అందుకే, 2011లో గొడార్డ్కు గౌరవ ‘ఆస్కార్’ అవార్డిస్తూ ‘సినిమా పట్ల మీ అవ్యాజమైన ప్రేమకు.. నిర్ణీత సూత్రాలపై మీ పోరాటానికి.. నవీన తరహా సినిమాకు మీరు వేసిన బాటకు..’ అంటూ సినీ ప్రపంచం సాహో అంది. రచయితల్లో జేమ్స్ జాయిస్, రంగస్థల ప్రయోక్తల్లో శామ్యూల్ బెకెట్లా సినిమాల్లో గొడార్డ్ కాలాని కన్నా ముందున్న మనిషి. సమకాలికులు అపార్థం చేసుకున్నా, భావి తరాలపై ప్రభావమున్న సృజనశీలి. నవీన మార్గం తొక్కి, ఇతరులు తమ ఆలోచననూ, ఆచరణనూ మార్చుకొనేలా చేసిన ఘనుడు. ఏ రోజు సీన్లు ఆ రోజు సెట్స్‌లో రాస్తూ, చేతిలో పట్టుకొనే చౌకరకం కెమెరాలతో, ఎదురెదురు అపార్ట్మెంట్లలో, తెలిసిన బంధుమిత్రులే నటీనటులుగా సినిమా తీస్తూ అద్భుతాలు సృష్టించిన జీనియస్. ఆయన ర్యాడికల్ శైలి ఎందరిలోనే సినీ సృజనకు ఉత్ప్రేరకం. ఆ ప్రభావం అనుపమానం. అది ఎంత గొప్పదంటే... ఆయన సినిమాలు చూస్తూ వచ్చిన హాలీవుడ్ కుర్రకారులో అసంఖ్యాకులు కెమేరా పట్టి, లోబడ్జెట్, స్వతంత్ర చిత్రాలు తీయసాగారు. ఆయన టెక్నిక్లే వారి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల రూపకల్పనకు తారకమంత్రమయ్యాయి. సంప్రదాయంపై తిరుగుబాటు చేసి, హాలీవుడ్‌నే ధిక్కరించిన ఓ దర్శకుడిని ఆ హాలీవుడ్డే అలా ఆరాధించడం వింతల్లో కెల్లా వింత. మరెవరికీ దక్కని ఘనత. హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో పైనా ‘అమితంగా ప్రభావం చూపిన దర్శకుడు’ గొడార్డే! తన గురువు కాని గురువు తీసిన ‘బ్యాండ్ ఆఫ్ అవుట్‌సైడర్స్’ స్ఫూర్తితోనే టరంటినో తన స్వీయ సినీ నిర్మాణ సంస్థకు ‘ఎ బ్యాండ్ ఎపార్ట్’ అని పేరు పెట్టారు. అన్ని వ్యవస్థలనూ ప్రతిఘటించిన గొడార్డ్ తనకు తెలియకుండా తానే ఒక వ్యవస్థ కావడం ఓ విరోధాభాస. ఆయన తన సినిమాల్లో చెప్పిన అంశాలు ముఖ్యమైనవే. కానీ, చెప్పీచెప్పకుండా అంతర్లీనంగా అలా వదిలేసినవి మరీ ముఖ్యమైనవి. ‘ఫోటోగ్రఫీ సత్యం. సినిమా సెకనుకు 24 సార్లు తిరిగే సత్యం. ఎడిట్ చేసిన ప్రతిదీ అసత్యమే’ అనేవారాయన. ఆ సత్యాసత్యాల సంఘర్షణలే ఆయన చిత్రాలు. ఒక్కమాటలో సినిమాను తన సెల్యులాయిడ్ రచనగా మలుచుకున్న అరుదైన దర్శకుడు గొడార్డ్. (క్లిక్ చేయండి: బొమ్మలు చెక్కిన శిల్పం) బతికుండగానే ఆయనపై ఆయన శైలిలోనే ఒక సినిమా రావడం విశేషం. గొడార్డంటే ఫ్రెంచ్ న్యూవేవ్ అంటాం. కానీ, జాగ్రత్తగా గమనిస్తే 1960ల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ప్రతి నవ్యధోరణిలో ఆయన దర్శనమిస్తారు. ఆయన శైలి, సంతకాలు మన బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపిస్తాయి. సినిమా సరిహద్దుల్ని విస్తరించిన గొడార్డ్తో ప్రభావితుడైన దర్శకుడు మార్టిన్ స్కొర్సెసే అన్నట్టు ‘‘సినీ రంగంలో అతి గొప్ప ఆధునిక దృశ్యచిత్రకారుడు.’’ చిత్రకళకు ఒక పికాసో. సినిమాకు ఒక గొడార్డ్! రాబోయే తరాలకూ ఆయన, ఆయన సినిమా గుర్తుండిపోయేది అందుకే! (క్లిక్ చేయండి: నడిచే బహు భాషాకోవిదుడు) – రెంటాల జయదేవ -
అడగకపోతే... అవార్డులూ రావు!
2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్‌లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి? జాతీయ అవార్డ్స్‌లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్‌ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్‌లకు ఒక్కొక్కటీ, సౌత్‌కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి. ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్‌కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా. ► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా? చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్‌గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం. ► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం? ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్‌లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం. ► తప్పు ఎక్కడ జరిగిందంటారు? అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్‌కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు? ► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా? నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది. ► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం. ► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...? (నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్‌కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా! ► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా? జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్‌లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం! – రెంటాల జయదేవ -
శోభన్ ‘బాబు’ను చేసిన తాసిల్దారు గారి అమ్మాయి
‘అవకాశం వస్తే, మీ నాన్న గారి సినిమాల్లో ఏది రీమేక్ చేస్తారు?’ ‘ప్రేమనగర్’ లాంటి సూపర్ హిట్లు తీసిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు గురించి, కమర్షియల్ విజయాలలో తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన దర్శకుడు కె. రాఘవేంద్రరావును కొన్నేళ్ళ క్రితం అడిగాం. దానికి, రాఘవేంద్రరావు ఊహకందని జవాబిచ్చారు. ‘‘ఏయన్నార్ నటించిన ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24)ను ఇవాళ మారిన టెక్నాలజీతో బ్రహ్మాండంగా తీసే అవకాశం ఉన్నా... ఆ కథను మా నాన్న గారు తీసినదాని కన్నా గొప్పగా ఎవరూ తీయలేరు. గతంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నేను, హీరో నాగార్జున, నిర్మాత రామానాయుడు గారు అనుకున్నా, మళ్ళీ వదిలేశాం. అయితే, నాన్న గారు తీసిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’ చాలా మంచి స్క్రిప్టు. వీలుంటే, అది రీమేక్ చేయాలని ఉంది’’ – ఇదీ ‘అడవి రాముడు’ లాంటి అనేక ఇండస్ట్రీ హిట్స్ తీసిన రాఘవేంద్రుడి ‘సాక్షి’కి చెప్పిన మనసులో మాట. తండ్రి కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో, తనయుడు కె. రాఘవేంద్రరావు సహాయ దర్శకుడిగా పనిచేసిన అలనాటి శతదినోత్సవ చిత్రం ‘తాసిల్దారు గారి అమ్మాయి’ (రిలీజ్ 1971 నవంబర్ 12). ఆ చిత్రానికి ఇప్పుడు 50 వసంతాలు. ఇంతకీ, శోభన్‌బాబు వర్ధమాన నటుడిగా ఉన్న రోజుల్లో, జమున టైటిల్ రోల్ పోషించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’లో అంత ప్రత్యేకత ఏముంది? చరిత్ర తరచి చూస్తే – చాలానే ఉంది. సోలో హీరోగా... కెరీర్‌కు కొత్త మలుపు! శోభన్‌బాబు సినీరంగానికి వచ్చి అప్పటికి పుష్కరకాలం. చిన్న వేషాల నుంచి పెద్ద వేషాలు, కథానాయక పాత్రల దాకా ఆ పన్నెండేళ్ళలో 70కి పైగా సినిమాల్లో చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి స్టార్ల పక్కన, సమకాలీన హీరో కృష్ణతోనూ కలసి నటిస్తున్నారు. ‘వీరాభిమన్యు’ (1965), విడిగా ‘మనుషులు మారాలి’ (1969), ‘కల్యాణమంటపం’ (1971) లాంటి హిట్లొచ్చినా, సోలో హీరోగా నిలదొక్కుకోలేదు. అలాంటి పెద్ద బ్రేక్ కోసం ఈ అందగాడు నిరీక్షిస్తున్నారు. సరిగ్గా అప్పుడు శోభన్ కెరీర్లో 80వ సినిమాగా రిలీజైన ‘తాసిల్దారు గారి అమ్మాయి’తో ఆ నిరీక్షణ ఫలించింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా, సింగిల్ హీరోగా నిలబెట్టేసింది. ‘తాసిల్దారు..’లో తండ్రి – కండక్టర్. కొడుకు – కలెక్టర్. తండ్రీకొడుకులుగా శోభన్ ద్విపాత్రధారణ ప్రజలకు నచ్చింది. చిత్ర విజయానికి కారణమైంది. ఒకేసారి తెరపై రెండు విభిన్న పాత్రల్ని సమర్థంగా చేయడం... నటుడిగా ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచింది. జమున – చంద్రకళ హీరోయిన్లుగా మెప్పించారు. నాగభూషణం, రావికొండలరావు, సాక్షి రంగారావు, హాస్యపాత్రలో రాజబాబు అలరించారు. వయసు 34... పాత్ర 64... శోభన్ తన కెరీర్లో పలుమార్లు ద్విపాత్రాభినయం చేశారు. కానీ, ఆయన ద్విపాత్రాభినయానికీ, విభిన్న పాత్రపోషణకూ మొట్టమొదట గుర్తింపు తెచ్చింది ‘తాసిల్దారు...’ చిత్రమే! నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందే కమెడియన్ పద్మనాభం నిర్మించిన ‘పొట్టి ప్లీడరు’ (1966)లో అన్నదమ్ములుగా తొలిసారి రెండు రోల్స్ పోషించారు శోభన్. కానీ, పెద్ద వయసు తండ్రి ప్రసాదరావుగా – కుర్రకారు కొడుకు వాసుగా రెండు భిన్న వయసు పాత్రలు... అదీ కథకు కీలకమైన కథానాయక పాత్రలు పూర్తిస్థాయిలో పోషించి, మెప్పించారీ చిత్రంలో! మనిషి తీరు, మాట, నడక – అన్నీ వేర్వేరైన ఆ పాత్రలను ఏకకాలంలో తెరపై రక్తికట్టించేందుకు శారీరకంగా, మానసికంగా చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా – తండ్రీ కొడుకులు పాత్రలు పరస్పరం సంభాషించుకొనే ఘట్టాలలో! ఒక రోజునైతే... ఒక పూటంతా శ్రమపడ్డా ఒక్క షాట్ కూడా ఓకే కాలేదు. ఇక ఆ రోజు చేయలేనని వెళ్ళిపోయి, రాత్రంతా రిహార్సల్ చేసుకున్నారు. మరునాడు వెళ్ళీ వెళ్ళడంతోనే ఫస్ట్ టేక్ ఓకే చేశారు. అదీ ఆయన పట్టుదల. అలా 34 ఏళ్ళ నిజజీవిత ప్రాయంలో చత్వారపు కళ్ళజోడు, చేతిలో కర్రతోడు ఉన్న అరవై ఏళ్ళు దాటిన ముసలి తండ్రి పాత్రలోనూ జనాన్ని మెప్పించారు. దటీజ్ శోభన్! కాలేజీ కలలరాణి సరసనే హీరోగా... కాలేజీ రోజుల నుంచి శోభన్ పిచ్చిగా ప్రేమించి, ఆరాధించి, అభిమానిగా జవాబు రాని ఉత్తరాలెన్నో రాసి, నిద్ర పట్టని కలలతో మద్రాసు వాహినీ స్టూడియోలో అష్టకష్టాలు పడి ‘ఇల్లరికం’ (1959) సెట్స్‌లో దగ్గర నుంచి చూసిన ఆనాటి స్టార్ హీరోయిన్ జమున. హృదయరాణి జమున సరసన జంటగా నటించాలని తపించిన ఆయనకు తొలిసారిగా ఆమెతో నటించే అదృష్టం వరించింది ‘తాసిల్దారు గారి అమ్మాయి’లోనే. నిర్మాతలు కొత్తవాళ్ళయినా, పేరున్న దర్శకుడు ప్రకాశరావు అడగడంతో వర్ధమాన హీరో శోభన్ పక్కన నటించేందుకు జమున కాదనలేకపోయారు. అలా తెరపై తొలిసారే ఆమెకు భర్తగా, కొడుకుగా రెండు పాత్రలు పోషించే అవకాశం శోభన్‌కు దక్కింది. 1971 మార్చి 15న మద్రాసు వాహినీ స్టూడియోలో ప్రసిద్ధ నిర్మాత బి. నాగిరెడ్డి క్లాప్ ఇవ్వగా, పంపిణీదారులు ‘లక్ష్మీఫిలిమ్స్’ అధినేత బి. శివరామయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, జమున మీద మొదటి షాట్‌తో చిత్రీకరణ మొదలైంది. సెట్స్‌లో మొదట ఒకటి రెండు సీన్లకు భయపడ్డా, జమున సహకారంతో శోభన్∙విజృంభించారు. భర్తను అనుమానించి, బంధానికి దూరంగా బతికిన భార్యగా, కష్టపడి కొడుకును ప్రయోజకుడిగా పెంచే తల్లిగా బరువైన మధుమతి పాత్రను జమున రక్తి కట్టించారు. జనం మెచ్చిన ఈ జంట అభినయంతో సినిమా దిగ్విజయం... సభలు– సమావేశాలు... శతదినోత్సవాలు. కానీ, మారిన సినిమా గ్లామర్, గ్రామర్‌తో ఆ తరువాత ఆరేళ్ళకు కానీ వారిద్దరి కాంబినేషన్లో మరో సినిమా (‘గడుసు పిల్లోడు’– 1977) రాకపోవడం విచిత్రం! శోభన్ – జమున కాంబినేషన్లో ఆఖరి సినిమా కూడా అదే! తండ్రి శిక్షణలో... రాటుదేలిన రాఘవేంద్రుడు! యాభై ఏళ్ళ క్రితం... ఈ సినిమా తీస్తున్ననాటికి... రాఘవేంద్రరావు ఇంకా దర్శకుడు కాలేదు. దర్శకులు పి. పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు, వి. మధుసూదనరావు లాంటి వారి వద్ద పనిచేసి, కన్నతండ్రి వద్ద ఆయన దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్న రోజులవి. ఆ సమయంలో ‘తాసిల్దారు గారి అమ్మాయి’ సెట్స్‌లో కె.ఎస్. ప్రకాశరావు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాధ్యతను కుమారుడికి అప్పగించి, తాను దూరంగా కుర్చీలో కూర్చొని పరిశీలిస్తూ, ప్రాక్టికల్ శిక్షణనిచ్చారు. అలా దర్శకుడు కాక ముందే రాఘవేంద్రరావు కొన్ని సీన్లకు దర్శకత్వ బాధ్యత వహించారీ చిత్రానికి. ఆ రకంగా ఈ చిత్రం ఆయన కెరీర్లో ఓ మధుర జ్ఞాపకం. ఆ తరువాత సరిగ్గా ఆరేళ్ళలో అదే ‘సత్యచిత్ర’ పతాకంపై, అదే నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలకు అగ్ర హీరో ఎన్టీఆర్‌తో ‘అడవి రాముడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ రూపొందించే స్థాయికి రాఘవేంద్రరావు ఎదగడం విశేషం. ఆ మాటకొస్తే, ఇవాళ శతాధిక చిత్ర దర్శకుడైన ఆయనను అసలు డైరెక్టర్ని చేసిన తొలి చిత్రం ‘బాబు’ (1975)కు ఛాన్స్ ఇచ్చింది శోభన్‌బాబే! అప్పటికే నూటికి పైగా సినిమాల్లో నటించి, వరుస విజయాలతో స్టార్ హీరోగా వెలుగుతున్నారు శోభన్. కలవడానికి కూడా భయపడుతూ, తండ్రి ప్రకాశరావు ప్రోద్బలంతో వచ్చిన రాఘవేంద్రరావు భుజం తట్టి, తొలి చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించిన పెద్దమనసు శోభన్‌బాబుది. అలా ఇన్నేళ్ళ దర్శకేంద్రుడి కెరీర్‌కు అప్పట్లో కొబ్బరికాయ కొట్టిన హీరో ఈ ఆంధ్రుల అందాల నటుడు. రెండు నవలలు – రెండూ హిట్టే! ఒక వైపు ‘ప్రేమనగర్’, మరోవైపు ‘తాసిల్దారు గారి అమ్మాయి’ – రెండు చిత్రాలనూ ఏకకాలంలో, ఏకాగ్రతతో తీర్చిదిద్దారు దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు. రెండూ నవలా చిత్రాలే! రెండు నవలలూ ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో హిట్ సీరియల్సే! మొదటిది – కోడూరి కౌసల్యాదేవి ‘ప్రేమనగర్’. రెండోది – కావిలిపాటి విజయలక్ష్మి ‘విధి విన్యాసాలు’. ‘కండక్టరు కొడుకు కలెక్టరవుతాడా?’ అనే ఆసక్తికరమైన ప్రశ్న ఉపశీర్షికగా ‘విధి విన్యాసాలు’ వారం వారం పాఠకులను పట్టువిడవకుండా చదివించింది. కమర్షియల్ ఎలిమెంట్లున్న ఆ నవల హక్కులు కొనుక్కొని, సినిమా తీద్దామని వచ్చారు నిర్మాతలు. దర్శకుడు ప్రకాశరావు వారికి అండగా నిలిచారు. వెండితెరకు కావాల్సిన పాత్రోచిత మార్పులతో స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు. అందుకు తోడ్పడ్డ నవలా – నాటక రచయిత ఎన్.ఆర్. నందిని మాటల రచయితగా పెట్టుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కండక్టర్ కొడుకైన హీరో చివరకు అసామాన్యుడైన కలెక్టర్‌గా ఎదిగి, తండ్రి ఆశ నెరవేర్చడమనే ఇతివృత్తం ఆ తరంలో చిగురిస్తున్న ఆశలకు తగ్గట్టు, మధ్యతరగతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుమానించి, అహంకారంతో అవమానించి, భర్తకు దూరమైన ఇల్లాలి జీవితం – చివరకు తన తప్పును తెలుసుకొన్న ‘తాసిల్దారు గారి అమ్మాయి’గా టైటిల్ రోల్లో జమున అభినయం మహిళా ప్రేక్షకులకు పట్టేసింది. వెరసి, సినిమా విజయవంతమైంది. భార్యాభర్తల మధ్య అపోహలు – అపార్థాలు, కన్నబిడ్డ పెరిగి పెద్దయ్యాక చాలా ఏళ్ళకు వారు తిరిగి కలుసుకోవడం అనే ఈ సెంటిమెంటల్ ఫ్యామిలీ కమర్షియల్ కథాంశం ఆ తరువాత మరిన్ని సినిమాలకు స్ఫూర్తినిచ్చింది. పాపులర్ పాటల అదే కాంబినేషన్! ‘ప్రేమనగర్’ కలిసొచ్చిన దర్శక – సంగీత దర్శక – గీత రచయితల త్రయమే (ప్రకాశరావు – కె.వి. మహదేవన్ – ఆత్రేయ) ‘తాసిల్దారు...’కీ పనిచేసింది. ‘ప్రేమనగర్’ రిలీజైన సరిగ్గా 50వ రోజున ‘తాసిల్దారు...’ జనం ముందుకు వచ్చింది. కలర్ సినిమాల హవా మొదలైపోయిన ఆ రోజుల్లో అన్ని రకాల కలర్‌ఫుల్ ‘ప్రేమనగర్’ సంగీతపరంగానూ అపూర్వ విజయం సాధించింది. ఏటికి ఎదురీది బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ‘తాసిల్దారు...’ అంత మ్యూజికల్ హిట్ కాలేదు. అయితేనేం, శతదినోత్సవ చిత్రమై, కొన్ని పాపులర్ పాటలను అందించింది. పెద్ద శోభన్‌బాబుపై వచ్చే ‘కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం...’ (గానం కె.బి.కె. మోహనరాజు) తాత్త్విక రీతిలో సాగుతూ, తరచూ రేడియోలో వినిపించేది. అలాగే, పెద్ద శోభన్‌బాబు – జమునలపై వచ్చే యుగళగీతం ‘నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ...’ పాట ‘కలసిపోయాము ఈనాడు, కలసి ఉంటాము ఏనాడు’ అనే క్యాచీ లైన్‌తో ఇవాళ్టికీ ఆకర్షిస్తుంది. చిన్న శోభన్‌బాబు – చంద్రకళ జంటపై వచ్చే డ్యూయట్ ‘అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి...’ (గానం పి. సుశీల, జేవీ రాఘవులు) ఆనాటి కుర్రకారు పాట. తొలి తెలుగు లేడీ ఆర్ట్ డైరెక్టర్‌తోనే..! సినీరంగంలో కెమేరా, కళ లాంటి కొన్ని శాఖల్లో ఆడవాళ్ళు ఇవాళ్టికీ చాలా అరుదు. అలాంటిది – 50 ఏళ్ళ క్రితమే ఓ తెలుగు మహిళ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ‘తాసిల్దారు గారి అమ్మాయి’. శ్రీమతి మోహన ఆ సినిమాకు కళా దర్శకురాలు. ఆమె కె.ఎస్. ప్రకాశరావుకు దూరపు బంధువు. మేనకోడలు వరుస. అంతేకాదు... తెలుగు సినీ చరిత్రలో తొలి లేడీ ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆవిడే! మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లమో పట్టా సాధించిన మోహన తన విద్యార్థి దశలోనే సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ కావడం చెప్పుకోదగ్గ విషయం. కె.ఎస్. ప్రకాశరావు రూపొందించిన ‘రేణుకాదేవి మహాత్మ్యం’ (1960)తో ఆమె కళాదర్శకురాలయ్యారు. ఆ తరువాత ప్రకాశరావు, జి. వరలక్ష్మిల తమిళ చిత్రం ‘హరిశ్చంద్ర’కూ, అలాగే మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన ‘చిన్నారిపాపలు’, ‘ప్రాప్తమ్’ (ఏయన్నార్ ‘మూగ మనసులు’కు తమిళ రీమేక్) చిత్రాలకూ కళాదర్శకురాలిగా పనిచేశారు. ఆ రోజుల్లో వివిధ మ్యాగజైన్లకు బొమ్మలు కూడా వేసిన మోహన, ప్రముఖ కమెడియన్ – మెజీషియన్ అయిన రమణారెడ్డికి మేజిక్ ప్రదర్శనల్లో సహాయకురాలిగానూ వ్యవహరించేవారు. తమిళ నటుడు టి.ఎస్. బాలయ్య కుమారుణ్ణి ఆమె వివాహమాడారు. దురదృష్టవశాత్తూ, చిన్న వయసులోనే అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. తొలి తెలుగు లేడీ ఆర్ట్ డైరెక్టర్ ప్రస్థానం అలా అర్ధంతరంగా ముగిసిపోయింది. ఉత్తమ నటుడిగా... తొలి గుర్తింపు! కలర్ సినిమాలు జోరందుకుంటున్న ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్‌లోనే చేసిన సాహసం ‘తాసిల్దారు..’. ఈ సెంటిమెంటల్ కుటుంబ కథాచిత్రం అప్పట్లో 29 కేంద్రాల్లో రిలీజైంది. 5 (విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు) కేంద్రాల్లో డైరెక్టుగా, మరో కేంద్రం (హైదరాబాద్)లో షిఫ్టుతో – మొత్తం 6 కేంద్రాల్లో ఈ చిత్రం వంద రోజులు ఆడింది. విశేష మహిళాదరణతో విజయవాడ విజయా టాకీస్‌లో, గుంటూరు లిబర్టీలో, రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్‌లో అత్యధికంగా 105 రోజులు ఆడింది. ఆరు కేంద్రాలలో వందరోజులు ఆడిన సందర్భంగా, రాజమండ్రిలోని నవభారతి గురుకులం ఆవరణలో 1972 ఫిబ్రవరి 19న చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం, పంపిణీదారులు, థియేటర్ యజమానుల మధ్య ఘనంగా శతదినోత్సవం జరిపారు. స్టార్ హీరో అక్కినేని ఆ సభకు అధ్యక్షుడిగా రావడం విశేషం. రివార్డులే కాదు అవార్డులూ ‘తాసిల్దారు గారి అమ్మాయి’కి దక్కాయి. ప్రసిద్ధ జాతీయ సినీ పత్రిక ‘ఫిల్మ్‌ఫేర్’ ఆ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డుకు ఈ సినిమానే ఎంపిక చేసింది. అలాగే, ఈ చిత్రం అందాల నటుడు శోభన్‌బాబు అభినయానికీ గుర్తింపునిచ్చింది. అవార్డులు తెచ్చింది. ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా ఆయన అందుకున్న తొలి అవార్డు అదే. ఈ చిత్ర నిర్మాతలు ఆ తర్వాత అయిదేళ్ళకు మళ్ళీ శోభన్‌బాబుతోనే తమ ‘సత్యచిత్ర’ బ్యానర్‌పై, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ప్రేమబంధం’ (1976) అనే కలర్ సినిమా తీయడం గమనార్హం. ముందు శోభన్‌బాబు... తర్వాత చిరంజీవి – నిజమైన ఆ జోస్యం! అప్పట్లో అక్కినేని, వర్ధమాన హీరో శోభన్‌బాబును మెచ్చుకుంటూ ‘హి ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ’ అన్నారు. ఆ జోస్యం ఫలించింది. ఒక్క 1971లోనే ఏకంగా 16 చిత్రాల్లో నటించిన శోభన్‌బాబుకు సోలో హీరోగా దశ తిరిగింది – ‘తాసిల్దారు...’తోనే. ఆ వెంటనే కె. విశ్వనాథ్ ‘చెల్లెలి కాపురం’ (1971), మరుసటేడు ‘సంపూర్ణ రామాయణం’, ‘మానవుడు – దానవుడు’ – ఇలా వరుస హిట్లతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరో అయ్యారు. దశాబ్దిన్నర పైగా ఆ హోదాలో అలరించారు. ‘తాసిల్దారు...’ విడుదలైన సరిగ్గా పదేళ్ళకు... 1981లో లక్ష్మి – చిరంజీవి అక్కాతమ్ముళ్ళుగా ‘చట్టానికి కళ్ళు లేవు’ రిలీజైంది. హైదరాబాద్‌లో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్. మద్రాసు నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన శోభన్‌బాబు నోట యాదృచ్ఛికంగా సరిగ్గా పదేళ్ళ క్రితం అక్కినేని అన్న మాటే వచ్చింది. ‘ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి’ అన్నారు ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు. శోభన్ మనస్ఫూర్తిగా అన్న ఆ మాటే నిజమైంది. వర్ధమాన నటుడు చిరంజీవిని సోలో హీరోగా ‘చట్టానికి కళ్ళు లేవు’ నిలబెట్టింది. ఆయన దశ తిరిగింది. బ్లాక్‌బస్టర్ ‘ఖైదీ’ (1983) మీదుగా ఆయన మెగాస్టార్ దాకా ఎదిగారు. సినిమా చరిత్రలో ఊహకందని ‘విధి విన్యాసాలు’ అలానే ఉంటాయి మరి! – రెంటాల జయదేవ -
Children's Day 2021: తొలి బాలల టాకీ తెలుగువారిదే!
సినిమా అంతా బాల నటీనటులతోనే తీస్తే? భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని ఈ ప్రయోగాన్ని తెలుగు వాళ్ళు మొదట చేశారు. 85 ఏళ్ళ క్రితం విడుదలైన ఈస్టిండియా వారి ‘సతీ అనసూయ’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. నిడివి రీత్యా చిన్నవైన ‘సతీ అనసూయ – ధ్రువవిజయము (1936)– ఈ రెండు వేర్వేరు టాకీలను ఒకే టికెట్‌పై చూపి, దర్శకుడు సి. పుల్లయ్య అప్పట్లో చేసిన విన్యాసం నేటికీ విశేషమే! మన దేశంలో మూగ సినిమాలు పోయి, వెండితెర మాట్లాడడం మొదలుపెట్టిన తొలి రోజులవి. తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) రిలీజై, నాలుగేళ్ళవుతోంది. బొంబాయి, కలకత్తా స్టూడియోలలో అక్కడి నిర్మాతలే ఎక్కువగా తెలుగులో సినిమాలు తీస్తున్నారు. కలకత్తా సంస్థ ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ అప్పటికే చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ (1933 ఫిబ్రవరి 5), ‘లవకుశ’ (1934 డిసెంబర్ 22)– రెండు తెలుగు టాకీలు తీసి, రెండింటితోనూ లాభాలు గడించింది. రామాయణ కథ ‘లవ–కుశ’ తెలుగులో తొలి బాక్సాఫీస్ బంపర్ హిట్. లవ, కుశులుగా నటించిన చిన్న పిల్లలు (మాస్టర్ భీమారావు, మాస్టర్ మల్లేశ్వరరావు) – ఇద్దరూ జనంలో స్టార్లయిపోయారు. ఇద్దరుంటేనే జనం ఇంతగా అక్కున చేర్చుకుంటే, మొత్తం పిల్లలతోనే సినిమా తీస్తేనో? అలా బాలలతో ‘సతీ అనసూయ’కు బీజం పడింది. కలకత్తా ఇంట్లో... పిల్లల తండ్రిలా పుల్లయ్య మూకీల కాలం నుంచి సినీ ప్రదర్శన, నిర్మాణ, దర్శకత్వ శాఖల్లో అనుభవం గడించిన ప్రతిభాశాలి – కాకినాడకు చెందిన సి. పుల్లయ్య. పూర్తిగా పిల్లలతోనే ‘సతీ అనసూయ’ తీస్తే అనే ఆయన ఆలోచన ఓ విప్లవమే. ఆయన డైరెక్టర్ గానే ఉండిపోలేదు. ఆ పిల్లలందరినీ ఆయన, ఆయన భార్య రంగమ్మ సొంత తల్లితండ్రులలాగా చూసుకునేవారు. పిల్లల్లో ఎవరైనా అలిగితే, ఆయన బతిమాలి అన్నం తినిపించేవారు. షూటింగ్ సమయంలో కలకత్తాలో ఆయన ఓ మూడంతస్థుల బంగళా తీసుకున్నారు. చదువు పోకూడదని... పిల్లలకంతా అక్కడే స్కూలు, క్లాసులు ఏర్పాటు చేశారు. ‘‘అనసూయ’లో అందరం పిల్లలమే. ‘ధ్రువ’లో మాత్రం బాలపాత్రలు మినహా మిగతా అందరూ పెద్దవాళ్ళే చేశారు. పద్యాలు, పాటలు మేమే పాడుకొనేవాళ్ళం. మేము పాడుతూ నటిస్తుంటే, పక్కనే ఆర్కెస్ట్రా వాళ్ళు మమ్మల్ని అనుసరిస్తూ సంగీతమందించేవారు’’ అని 90వ పడిలోవున్న నటి, నిర్మాత, అనసూయ పాత్రధారిణి సి. కృష్ణవేణి ‘సాక్షి’తో గుర్తుచేసుకున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా... రేలంగి! తరువాతి కాలంలో కమెడియన్ గా పేరుతెచ్చుకున్న రేలంగి అప్పట్లో ‘ధ్రువవిజయము’లో ఇంద్రుడిగా నటించడం మొదలు క్యాస్టింగ్ ఏజెంట్, ప్రొడక్షన్ మేనేజర్, డైరెక్టర్ కి అసిస్టెంట్ – ఇలా అన్నీ అయ్యారు. షూటింగ్ లేనప్పుడు వారానికి రెండుసార్లు పిల్లలందరినీ ‘జూ’కో, సినిమాకో తీసుకెళ్ళేవారు. తొలి ఆర్ట్ డైరెక్టర్ అడివి బాపిరాజు ప్రముఖ రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు ఈ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలకు ఓ తెలుగు వ్యక్తి పూర్తిస్థాయిలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం అదే మొదలు. అలా ‘తొలి తెలుగు ఆర్ట్ డైరెక్టర్’గా చరిత్ర కెక్కారు. అప్పటికే బాపిరాజు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాల్. ‘అనసూయ’ కోసం ఆయన వేసిన కైలాసం సెట్, చాక్పౌడర్తో కైలాసంపై మంచు పడే ఎఫెక్ట్ అపూర్వం. తెరపై తొలిసారి అన్నమయ్య గీతం... తెలుగు తెరపై తొలిసారి అన్నమయ్య కీర్తన వినిపించిన సినిమా కూడా బాలల చిత్రం ‘సతీ అనసూయే’. అన్నమయ్య రచన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ను త్రిమూర్తులను పసిపాపలుగా చేసి, అనసూయా సాధ్వి జోల పాడే చోట వాడుకున్నారు. కొన్ని పదాలను మాత్రం రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం మార్చి, మిగతాదంతా జనబాహుళ్యంలో ఉన్న అన్నమయ్య కీర్తననే యథాతథంగా ఉంచారు. అలా తెరపైకి తొలిసారి అన్నమయ్య కీర్తన ఎక్కింది. ఒకే టికెట్‌పై... రెండు సినిమాలు! భక్తితో దైవప్రార్థన చేస్తే, సాధించలేనిది ఏదీ లేదని ఈ ‘సతీ అనసూయ’, ‘ధ్రువ విజయము’ చిత్రాలు రెండింటిలో చక్కగా చూపెట్టారు. నిజానికి, ఇవి రెండు వేర్వేరు చిత్రాలు. ఆ రెండు చిత్రాలనూ కలిపి, ఒకే పూర్తి ప్రోగ్రామ్‌గా హాళ్ళలో ప్రదర్శించారు. రెండు చిత్రాలూ కలిపినా మొత్తం ప్రదర్శన ‘‘2 గంటల 40 నిమిషా’’లే! ఈ ‘అనసూయ – ధ్రువ’ డబుల్ ప్రోగ్రామ్‌లో ఇంటర్వెల్ దాకా ఒక సినిమా, ఇంటర్వెల్ తరువాత రెండో సినిమా ప్రదర్శించేవారు. గమ్మత్తేంటంటే, ‘1936లో సినీ అద్భుతం’గా పేర్కొన్న ఈ ‘‘డబుల్ ప్రోగ్రాముల’’తో పాటు కాశీ పుణ్యక్షేత్రం, హరిద్వార్ ల గురించి తెలుగు వ్యాఖ్యానంతో ఒక రీలు టాపికల్ చిత్రాన్నీ ప్రదర్శించారు. ఆ సినిమా హాలుకు 105 ఏళ్ళు! తొలివిడతగా బెజవాడ, రాజమండ్రి, కాకినాడల్లో మే 8న ఈ చిత్ర ద్వయం రిలీజైంది. మే 11న మద్రాస్‌లో విడుదలైంది. విశేషమేమిటంటే చెన్నైలో ఇప్పటికి 105 ఏళ్ళుగా నడుస్తున్న ‘మినర్వా’ టాకీస్ (జార్జ్‌టౌన్‌లో నేటికీ ‘బాషా’ ఏ.సి పేరుతో నడుస్తోంది) ఈ డబుల్ ప్రోగ్రామ్‌తోనే టాకీ హాలు అయింది. బాలల చిత్రాల్లో... శోభన, చిన్న ఎన్టీఆర్ ఇలా బాలలతోనే సినిమాలు తీసే ప్రయోగాలు తర్వాత మరికొన్ని జరిగాయి. దర్శక – నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు మూడు చిన్న చిత్రాల సమాహారంగా ‘బాలానందం’ (1954 ఏప్రిల్ 24)పేర ఒకే ప్రోగ్రాంగా రిలీజ్ చేశారు. ‘బూరెలమూకుడు’, ‘రాజయోగం’, ‘కొంటె కిష్టయ్య’ అనే ఆ 3 చిత్రాలలోనూ పిల్లలే నటులు. అంతా ‘బాలానందసంఘ’ సభ్యులే! నటి, దర్శక, నిర్మాత భానుమతి ‘భక్త ధ్రువ మార్కండేయ’ (1982 నవంబర్ 19) రూపొందించారు. జాతీయ ఉత్తమ నటి–కళాకారిణి శోభన (చిరంజీవి ‘రుద్రవీణ’ హీరోయిన్)కు ఇదే తొలి తెలుగు చిత్రం. తర్వాత ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా, దర్శకుడు గుణశేఖర్ పూర్తిగా బాలలతోనే ‘రామాయణం’ (1997) తీశారు. రాముడిగా నేటి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం జాతీయ అవార్డు గెలిచింది. తర్వాత పెద్ద ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’ (1977) స్ఫూర్తితో, అదే కథ – అదే టైటిల్‌తో 2015 ఆగస్టు 15న ఓ బాలల చిత్రం వచ్చింది. జయాపజయాలెలా ఉన్నా ఇలా మొత్తం బాలనటులతోనే కష్టించి సినిమా తీసిన ఈ ప్రయత్నాలు అభినందనీయం! – రెంటాల జయదేవ -
‘కొండవీటి సింహం’ @ 40 ఇయర్స్
ఫ్యాషన్... సినిమా... ఈ రెండు రంగాల్లో కాలాన్ని బట్టి ట్రెండ్ మారిపోవడం సహజం. అలా ట్రెండ్ మార్చినవీ, మార్చిన ట్రెండ్‌లో వచ్చినవీ సంచలన విజయం సాధిస్తాయి. తెలుగు వాణిజ్య సినిమాకు ‘అడవి రాముడు’ ఓ ట్రెండ్‌సెట్టర్. అక్కడ నుంచి ‘వేటగాడు’ (1979) దాకా వరుసగా ఆరు పాటలు, 3 ఫైట్ల ఆ కమర్షియల్ ధోరణిదే రాజ్యం. ఆ వైఖరిని మార్చింది – కె. విశ్వనాథ్ ‘శంకరాభరణం’ (1980). ఆ సంగీతభరిత కళాత్మక చిత్రం తరువాత ‘గజదొంగ’ లాంటి కమర్షియల్ సినిమాలకు మునుపటి జోరు తగ్గింది. దాంతో, మాస్ హీరోల వాణిజ్య సినిమా పాత పద్ధతి మార్చుకోవాల్సి వచ్చింది. కొత్త దారి తొక్కి, తనను తాను పునరావిష్కరించుకొనే పనిలో పడింది. ఆ మథనంలో నుంచి వచ్చినదే – మెలోడ్రామా నిండిన పెద్ద వయసు హీరో పాత్రల ట్రెండ్. తండ్రీ కొడుకుల పాత్రలు అంతఃసంఘర్షణ పడే స్టార్ హీరో డ్యుయల్ రోల్ ఫార్ములా. ఎన్టీఆర్ – దాసరి ‘సర్దార్ పాపారాయుడు’ నుంచి తెలుగు తెరపై ఇది బాక్సాఫీస్ విజయసూత్రమైంది. పాపారాయుడు సంచలన విజయం తరువాత ఎన్టీఆర్ చేసిన అలాంటి మరో తండ్రీ కొడుకుల డ్యుయల్ రోల్ బాక్సాఫీస్ హిట్ – ‘కొండవీటి సింహం’. 1981 అక్టోబర్ 7న రిలీజైన ఈ బాక్సాఫీస్ హిట్‌కు నేటితో 40 ఏళ్ళు. శివాజీ అడ్డుపడ్డ తమిళ ‘తంగపతకం’తోనే... బాక్సాఫీస్ హిట్ ‘కొండవీటి సింహం’ కథకు మూలం శివాజీగణేశన్ నటించిన తమిళ ‘తంగపతకం’ (1974 జూన్ 1). అదే పేరుతో వచ్చిన ఓ తమిళ నాటకం ఆ సినిమాకు ఆధారం. తమిళనాట సూపర్ హిట్టయిన ఆ కర్తవ్యదీక్షా పరుడైన పోలీసు అధికారి సెంటిమెంటల్ కథాచిత్రం తెలుగు రైట్స్ నటుడు అల్లు రామలింగయ్య కొన్నారు. అప్పటికే ఆయన ‘బంట్రోతు భార్య’ (1974), ‘దేవుడే దిగివస్తే’ (1975)తో చిత్ర నిర్మాతగానూ ఎదిగారు. తెలుగులో ఎన్టీఆర్‌తో ఈ రీమేక్ నిర్మించాలని అల్లు రామలింగయ్య అనుకున్నారు. నిజానికి, శివాజీ గణేశన్ కెరీర్ బెస్ట్ సినిమాలు అనేకం తెలుగులో ఎన్టీఆరే చేశారు. ‘కలసి ఉంటే కలదు సుఖం’ (తమిళ ‘భాగ పిరివినై’), ‘గుడిగంటలు’ (‘ఆలయమణి’), ‘రక్తసంబంధం’ (‘పాశమలర్’), ‘ఆత్మబంధువు’ (‘పడిక్కాదమేదై’) – ఇలా అనేకం అలా సూపర్ హిట్ రీమేక్స్ అయ్యాయి. కానీ, ఎందుకనో ఈసారి శివాజీగణేశన్‌కు మనస్కరించలేదు. ‘తంగపతకం’ తనకే మిగిలిపోవాలని అనుకున్నట్టున్నారు. అందుకే, ఆ చిత్రాన్ని శివాజీయే సమర్పిస్తూ, అల్లుతో ‘బంగారు పతకం’ (1976) పేరిట తెలుగులో డబ్బింగ్ చేయించారు. ఆ డబ్బింగ్ చిత్రం కూడా హిట్టే. కానీ, అలా మిస్సయిన ఆ సెంటిమెంట్ కథలోని అంశాలే సరిగ్గా మరో ఏడేళ్ళకు ‘కొండవీటి సింహం’కి పునాది అయ్యాయి. ‘వేటగాడు’ హిట్ తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా కోసం రోజా మూవీస్ అధినేత ఎం. అర్జునరాజు రెండేళ్ళు నిరీక్షించారు. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ ఓకే కాగానే, దర్శక, రచయితలతో ఆ పాత తమిళ హిట్ మళ్ళీ చర్చకు వచ్చింది. రైట్స్ సమస్య వచ్చే ‘తంగపతకం’ రీమేక్‌లా కాకుండా, అదే కథను వేరే పద్ధతిలోకి మార్చారు. మాస్, సెంటిమెంట్ రెండూ పండేలా రచయిత సత్యానంద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘కొండవీటి సింహం’ కథను తీర్చిదిద్దారు. శివాజీ కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటైన ఆ పోలీసు కథ, ఆ పాత్ర, అదే క్యారెక్టరైజేషన్ తెలుగులో మళ్ళీ ఎన్టీఆరే చేశారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల చరిత్ర సృష్టించారు. (చదవండి: Prabhas: ప్రభాస్‌కు అబద్ధం ఎందుకు చెప్పావు? నటుడికి యంగ్ హీరో క్వశ్చన్) చిరంజీవిని అనుకొని మోహన్‌బాబుతో...ఎన్టీఆర్ ‘వేటగాడు’ హిందీ రీమేక్ ‘నిషానా’ రజతోత్సవం జరిపిన రోజునే, 1981 మే 21న మద్రాసు ప్రసాద్ స్టూడియోలో‘కొండవీటి సింహం’ షూటింగ్ ప్రారంభమైంది. తమిళ కథకు భిన్నంగా తెలుగులో సిన్సియర్ పోలీసాఫీసర్ తండ్రికి ఇద్దరు కొడుకులు. ఒకడు మంచివాడు, రెండోవాడు చెడ్డవాడు. తండ్రి, మంచి కొడుకు పాత్రల్లో హీరో ద్విపాత్రాభినయం. అదీ ప్రధానమైన మార్పు. ఎస్పీ రంజిత్ కుమార్‌గా, కొడుకు రాముగా ఎన్టీఆర్ జీవం పోశారు. ఇక, తండ్రికి తలవంపులు తెచ్చే చెడ్డ కొడుకుగా మోహన్‌బాబు నటనకు మంచి పేరొచ్చింది. నిజానికి, ఈ చెడ్డ కొడుకు పాత్రకు దర్శక, నిర్మాతలు మొదట అనుకున్న నటుడు – నేటి మెగా హీరో చిరంజీవి. పాటలు, డ్యాన్సులు, విలన్ తరహా పాత్రలతో పేరు తెచ్చుకుంటున్న చిరంజీవి పేరుతో సహా తారాగణం వివరాల పత్రికా ప్రకటన కూడా చేశారు. స్క్రిప్టులో హీరోయిన్ గీత టైప్మిషన్ దగ్గర ఐ లవ్యూ చెప్పే సీన్లో ఒక డ్యూయెట్ కూడా అనుకున్నారు. అంతకు ముందు అంతగా ఆడని ‘తిరుగులేని మనిషి’లో తొలిసారిగా ఎన్టీఆర్‌తో కలసి చిరంజీవి నటించారు. సెంటిమెంట్లు బలంగా పనిచేసే సినీరంగంలో చివరకు ‘కొండవీటి సింహం’లోని నెగటివ్ పాత్రకు చిరంజీవి బదులు మోహన్‌బాబును తీసుకున్నారు. చిరంజీవి కోసం అనుకున్న డ్యూయెట్‌ను కూడా స్క్రిప్టులో నుంచి తొలగించేశారు. ఎన్టీఆర్‌తో కొత్త క్లైమాక్స్... రీషూట్! చెడ్డవాడైన కొడుకును పోలీసు విధి నిర్వహణలో తండ్రే చంపేయడం, ఆ అంకితభావానికి మెచ్చి ప్రభుత్వం బంగారు పతకం ఇవ్వడం – శివాజీ ‘తంగపతకం’ క్లైమాక్స్. ‘కొండవీటి సింహం’కి కూడా మొదట ఎన్టీఆరే, కొడుకు మోహన్‌బాబును చంపినట్టు, అదే రకం క్లైమాక్స్ తీశారు. కానీ, ఆ తర్వాత ఎందుకనో దర్శక, రచయితలు పునరాలోచనలో పడ్డారు. కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్టు తీస్తే, సెంటిమెంట్ మరింత పండుతుందని భావించారు. నిజానికి, అప్పటికే 3 షెడ్యూళ్ళలో 30 రోజుల్లో సినిమా అయిపోయింది. అలాంటిది మళ్ళీ ఆ ఏడాది ఆగస్టు చివరలో ఒక వారం అదనపు డేట్లు తీసుకొని, హొగెనకల్ వెళ్ళి, కొత్త క్లైమాక్స్ తీశారు. అలా ఇప్పుడు సినిమాలో ఉన్న రెండో క్లైమాక్స్ వచ్చింది. క్రాంతికుమార్ అంచనా తప్పింది! అయిపోయిన చిత్రాన్ని రీషూట్ చేస్తున్నారనే సరికి, ఎన్నో అనుమానాలు, సినిమా బాగా లేదనే పుకార్లు షికారు చేశాయి. కొత్త క్లైమాక్స్‌తో సినిమా సిద్ధమయ్యాక, సలహా కోసం సీనియర్ దర్శక – నిర్మాత క్రాంతికుమార్‌కు ప్రివ్యూ చూపించారు. ‘మొదటి 10 నిమిషాలు, చివరి 10 నిమిషాలే ఇది ఎన్టీఆర్ సినిమా. మిగతా అంతా ఏయన్నార్ సినిమాలా ఉంది. జనం మెచ్చరు’ అంటూ ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రంపై పెదవి విరిచారు. దాంతో, నిర్మాతలూ కొంత భయపడి, రిలీజుకు ముందే అన్ని ఏరియాలూ సినిమా అమ్మేశారు. తీరా రిలీజయ్యాక ‘కొండవీటి సింహం’ ఆ భయాలు, అనుమానాలను బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టింది. 1981 అక్టోబర్ 7న విజయదశమి కానుకగా రిలీజైన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. సినిమా ప్రదర్శన హక్కులు కొన్న ప్రతి ఒక్కరికీ పెట్టిన రూపాయికి అయిదు నుంచి పది రూపాయల లాభం రావడం అప్పట్లో సంచలనం. కన్నీటికి... మహిళల కలెక్షన్ల వాన పెద్ద వయసు భార్యాభర్తల అనురాగాలు, అనారోగ్యంతో చక్రాల కుర్చీకే భార్య పరిమితమైతే భర్తే ఆమెకు సేవలు చేసే అనుబంధాలు, దారితప్పిన కొడుకుతో తల్లితండ్రుల అంతఃసంఘర్షణ, కన్నతల్లి కడచూపునకు కూడా రాని కొడుకు అమానవీయత – ఇవన్నీ ‘కొండవీటి సింహం’ కథకు ఆయువుపట్టు. మాస్ అంశాలకు, మనసును ఆర్ద్రంగా మార్చే ఈ లేడీస్ సెంటిమెంట్ తోడవడంతో మహిళలు తండోపతండాలుగా వచ్చి, ఈ సినిమాను మెచ్చారు. ‘మా ఇంటిలోన మహలక్ష్మి నీవే...’ అంటూ ఎన్టీఆర్, జయంతిపై వచ్చే కరుణ రస గీతం జనం గుండెల్లో నిలిచిపోయింది. కన్నీళ్ళతో కరిగిన రిపీట్ లేడీ ఆడియన్స్ ఘన నీరాజనంతో కలెక్షన్ల వర్షం కురిసింది. బాక్సాఫీస్ సింహగర్జన కర్తవ్యనిర్వహణ అనే మాస్ ఎలిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ – రెండింటినీ రంగరించిన చిత్రం ఇది. ఎస్పీ రంజిత్ కుమార్‌గా తండ్రి పాత్రలో ఎన్టీఆర్ గంభీరమైన నటనకు జనం జేజేలు పలికారు. ఆ రోజుల్లో 47 ప్రింట్లతో, 43 కేంద్రాల్లో ‘కొండవీటి సింహం’ రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో క్రిక్కిరిసిన ప్రేక్షకులతో 70 రోజులాడింది. అప్పటికి అత్యధికంగా 37 కేంద్రాలలో వంద రోజులు జరుపుకొంది. ఏకంగా 15 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. వైజాగ్‌లో షిఫ్టులతో 315 రోజులు ప్రదర్శితమైంది. అలాగే, లేట్ రన్లో సైతం ఈ బాక్సాఫీస్ సింహం దాదాపు 200 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 15 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఫస్ట్ రిలీజుకు నాలుగు నెలల తర్వాత రిలీజైన అనకాపల్లిలో నేరుగా 178 రోజులు ఆడి, లేట్ రన్లో ఇప్పటికీ స్టేట్ రికార్డుగా నిలిచి ఉంది. (చదవండి: ChaySam: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్ వైరల్) సీమలో 4 ఆటల సంస్కృతి విశేషం ఏమిటంటే, సాధారణంగా వారం, రెండు వారాలు మాత్రమే సినిమాలు ఆడే మారుమూల ‘సి’ క్లాస్ సెంటర్లలో సైతం విపరీతమైన మహిళాదరణ ఫలితంగా ‘కొండవీటి సింహం’ 50 రోజులు ఆడింది. పలు కేంద్రాల్లో మునుపటి రికార్డ్ చిత్రాల వంద రోజుల వసూళ్ళను, నాలుగంటే 4 వారాలకే దాటేసింది. ఒకప్పుడు రాయలసీమ ఏరియాలో సాధారణంగా ఫస్ట్ షో, సెకండ్ షోలే ఎక్కువ రోజులు వేసేవారు. ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ చిత్రం సీమలో మ్యాట్నీతో సహా 3 ఆటలను రెగ్యులర్ షోల పద్ధతిగా అలవాటు చేసింది. ఇక, రెగ్యులర్ గా మార్నింగ్ షోల సంస్కృతిని ప్రవేశపెట్టి, రోజూ 4 ఆటల పద్ధతిని నేర్పింది – ఎన్టీఆర్‌దే ‘కొండవీటి సింహం’. ఆనాటి ఇండస్ట్రీ రికార్డ్... ఇదే! వసూళ్ళపరంగా ఇండస్ట్రీ రికార్డుల్లోనూ ఎన్టీఆర్ కాలంతో పోటీపడ్డారు. యాభై రోజులకు ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ రూ. 81 లక్షలతో రికార్డు. తరువాత ఎన్టీఆర్‌దే ‘వేటగాడు’ రూ. 96 లక్షలతో కొత్త రికార్డయింది. ఇక, ‘కొండవీటి సింహం’ యాభై రోజులకు కనివిని ఎరుగని రీతిలో రూ. 1.21 కోట్ల గ్రాస్ సంపాదించింది. అప్పటికి సరికొత్త ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. అప్పట్లో వంద రోజులకు సింగిల్ థియేటర్ కలెక్షన్లలో స్టేట్ రికార్డులూ పెద్ద ఎన్టీఆర్వే. ‘అడవి రాముడు’ (1977 – హైదరాబాద్ ‘వెంకటేశా’ థియేటర్లో) రూ. 9.40 లక్షలు ఆర్జించింది. ఆ వెంటనే ‘వేటగాడు’ (హైదరాబాద్ ‘సంగమ్’లో) రూ. 9.90 లక్షలు సంపాదించింది. ‘కొండవీటి సింహం’ (వైజాగ్ ‘శరత్’లో) రూ. 9.95 లక్షలు తెచ్చింది. దాసరి – ఎన్టీఆర్ కాంబినేషన్లోని ‘బొబ్బిలిపులి’ (1982– హైదరాబాద్ ‘సుదర్శన్’లో) ఏకంగా రూ. 10.06 లక్షలు సంపాదించి, పై మూడు రికార్డులనూ దాటేసింది. అలా 1977 నుంచి 1982 దాకా ఆరేళ్ళ పాటు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలుకొడుతూ దూసుకెళ్ళి, ఏకంగా రాజకీయ సింహాసనాన్నే అధిష్ఠించేశారు. జయంతి సెకండ్ ఇన్నింగ్స్ షురూ! తమిళంలో కె.ఆర్. విజయ చేసిన తల్లి పాత్రకు ఇటీవలే కన్నుమూసిన సీనియర్ నటి జయంతి తెలుగులో ప్రాణం పోశారు. చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యంతో ఈ సినిమాలోని 7 పాటలూ హిట్టే. శ్రీదేవితో వచ్చే ‘బంగినపల్లి మామిడిపండు..’, ‘అత్త మడుగు వాగులోన..’, ‘వానొచ్చే వరదొచ్చే..’, ‘పిల్ల ఉంది..‘ లాంటి మాస్ పాటలతో పాటు జయంతితో వచ్చే ‘ఈ మధుమాసంలో ఈ దరహాసంలో..’ లాంటి హుందా డ్యూయట్ కూడా నేటికీ నాటి ప్రేక్షక జనం నోట నానుతుండడం గమనార్హం. ఎన్టీఆర్ ‘జగదేక వీరుని కథ’ (1961)తో మొదలైన జయంతి ప్రస్థానం సరిగ్గా ఇరవై ఏళ్ళ తరువాత అదే ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘కొండవీటి సింహం’తో కొత్త మలుపు తిరిగింది. ఈ తరహా సెంటిమెంటల్ భార్య, అమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరయ్యారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో కృష్ణ ‘రక్తసంబంధం’ సహా పలువురు పెద్ద హీరోల ఓల్డ్ క్యారెక్టర్లకు ఆమె సరిజోడీ అయ్యారు. ఈ కథ సత్తా అది... కొన్ని కథలు ఏ భాషలోకి వెళ్ళినా సార్వజనీనంగా మెప్పిస్తాయి. ‘తంగపతకం’ డ్రామా హిట్. అదే పేరుతో సినిమాగా (1974) తమిళంలో పెద్ద హిట్. దాన్ని తెలుగులో ‘బంగారుపతకం’ (1976)గా అనువదిస్తే, అదీ హిట్టు. రైట్స్ లేని ఆ కథనే కొంతమార్చి, ‘కొండవీటి సింహం’ (1981) చేస్తే బాక్సాఫీస్ రికార్డు. హిందీలో ఈ కొత్త కథను జితేంద్ర, హేమమాలినితో ‘ఫర్జ్ ఔర్ కానూన్’ (1982 ఆగస్ట్ 6)గా ఇదే దర్శక, నిర్మాతలు చేస్తే అదీ ఓకే. మరోపక్క ‘తంగపతకం’ అధికారిక హిందీ రీమేక్‌గా దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్లు కలసి నటించిన ఏకైక చిత్రం ‘శక్తి’ (1982 అక్టోబర్ 1) రిలీజైంది. రమేశ్ సిప్పీ దర్శకత్వంలో అదీ బంపర్ హిట్. అన్నయ్య పోలీసు – తమ్ముడు దొంగ – వారి మధ్య ఘర్షణ, పిల్లల మధ్య నలిగిన తల్లి ఆత్మసంఘర్షణగా వచ్చిన అమితాబ్ సూపర్‌హిట్ ‘దీవార్’ (1975)లోనూ ఈ కథ ఛాయలు కనిపిస్తాయి. వెరసి, అనేక భాషల్లో, అనేక కోణాల్లో తిరిగి, వెళ్ళిన ప్రతిచోటా విజయవంతం కావడం ఈ సెంటిమెంటల్ పోలీసు కథ బాక్సాఫీస్ సత్తా. ఒకే వేదికపై... రెండు సింహాలు 1982 జనవరి 21వ తేదీ సాయంత్రం మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలులో ‘కొండవీటి సింహం’ శతదినోత్సవం జరిగింది. షావుకారు జానకి వ్యాఖ్యాత్రిగా సాగిన ఉత్సవానికి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ అధ్యక్షత వహిస్తే, ఎన్టీఆర్‌కు సమకాలికుడైన మరో స్టార్ హీరో ఏయన్నార్ ముఖ్య అతిథిగా వచ్చి, జ్ఞాపికలు అందజేశారు. ఎన్టీఆర్‌పై సభాంగణం బాల్కనీ నుంచి అభిమానులు పుష్పవృష్టి కురిపించడం విశేషం. ఎన్టీఆర్, ఏయన్నార్లను రెండు సింహాలుగా ప్రస్తావిస్తూ, 'ఈ ఇద్దరు ఉన్నంత కాలం తెలుగు సినీ పరిశ్రమకు ఏ బాధా లేద'ని ఎల్వీ ప్రసాద్ పేర్కొనడం విశేషం. ఎన్టీఆర్ సింహమే కానీ, శారీరకంగా తాను సింహం కాదని ఏయన్నార్ అంటే – దానికి ఎన్టీఆర్ తన ప్రసంగంలో బదులిచ్చారు. శారీరకంగా సింహం కాకపోవచ్చేమో కానీ, మేధాపరంగా అలాంటివాడే ఏయన్నార్ అన్నారు. 'చిన్న విగ్రహమైనప్పటికీ గాంధీ ప్రజల్ని సమీకరించి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు కదా' అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఇక, ఒకానొకప్పుడు తాను రిటైర్ అవుతానంటే, ‘బ్రదర్! ఆర్టిస్టు రిటైర్ కాకూడదు’ అని సలహా ఇచ్చింది ఎన్టీఆరే అని వేదికపై ఏయన్నార్ వెల్లడించారు. ‘ప్రేక్షకులు ఆదరించినంత కాలం మేమిద్దరం సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు’ అని తమ ఇద్దరి తరఫున ఎన్టీఆర్ ఆ సభలో ప్రకటించడం విశేషం. మొత్తానికి, ‘కొండవీటి సింహం’ శతదినోత్సవ సంరంభం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం. రాజకీయాల్లోకి... ఘనమైన సినీ వీడ్కోలు ఎంట్రీ ఎంత గొప్పగా ఉంటుందో, ఎగ్జిట్ కూడా అంతే హుందాగా, గౌరవంగా ఉండాలంటారు. జనాదరణతో ముడిపడిన సినీరంగంలో ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు. మరీ ముఖ్యంగా స్టార్లు. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు నటరత్న ఎన్టీరామారావుకు అలాంటి అద్భుతమైన విజయాలతో తెలుగు సినీ పరిశ్రమ నుచి ఘనమైన వీడ్కోలు దక్కింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ముందు వరుసగా దక్కిన నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్లలో ‘కొండవీటి సింహం’ రెండోది. దేశభక్తి, స్వాతంత్య్ర సమర నేపథ్యంలో ‘సర్దార్ పాపారాయుడు’, చట్టం – పోలీసు వ్యవస్థతో ‘కొండవీటి సింహం’, న్యాయవ్యవస్థతో ‘జస్టిస్ చౌదరి’, సైన్యం – విప్లవ నేపథ్యంతో ‘బొబ్బిలిపులి’ – ఇలా నాలుగూ నాలుగు వేర్వేరు నేపథ్యాలతో, విభిన్నమైన చిత్రాలు కావడం విశేషం. అన్నీ సంచలన విజయాలే. ఆ రోజుల్లో ఈ 4 సినిమాల డైలాగులూ ఎల్పీ రికార్డులుగా రావడం మరో విశేషం. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన కొత్తల్లో ‘కొండవీటి సింహం’ డైలాగ్‌లు క్యాసెట్లుగా వచ్చి, ఊరూవాడా మారుమోగడం మరీ విశేషం. వెరసి, ఎన్టీఆర్ కెరీర్లో, అలాగే తెలుగు బాక్సాఫీస్ చరిత్రలో ‘కొండవీటి సింహం’ అప్పటికీ, ఇప్పటికీ స్పెషల్. – రెంటాల జయదేవ -
త్రివిక్రమ్ వల్లే... శంకర్ సినిమా వచ్చింది
‘సామజ వరగమన...’ అన్నారు తమన్.. అన్ని వర్గాల పాటల ప్రేమికులు... ‘ఏం ట్యూన్ అన్నా’ అన్నారు. ఇదొక్కటేనా? అంతకుముందు ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు. అయితే ‘సామజ..’ వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. శంకర్ ‘బాయ్స్’లో నటించిన తమన్ ఇప్పుడు రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రానికి సంగీతదర్శకుడు. ‘సాక్షి’కి తమన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. ► శంకర్ డైరెక్షన్లో నటించిన ‘బాయ్స్’ తర్వాత ఇన్నేళ్లకు ఆయన సినిమాకి సంగీతం అందిస్తున్నారు... ఈ స్థాయికి రావడానికి ఇరవయ్యేళ్లు పట్టింది. నిజానికి సంగీతం అంటేనే నాకు ఆసక్తి. ‘బాయ్స్’ అçప్పుడే శంకర్ సార్‌తో మ్యూజిక్ గురించి మాట్లాడేవాణ్ణి. నా ట్యూన్స్‌ని ఫస్ట్ విన్నది ఆయనే. నిజానికి ‘బాయ్స్’ సినిమాలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌ను నేనే. అయినప్పటికీ మ్యూజికల్‌గానే నా లైఫ్‌ను మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ముందు గా నేను సినిమాల నుంచి నేర్చుకోవాలనుకున్నాను. శంకర్‌గారు పాటలు ఎలా తీయిస్తున్నారు? కెమెరామేన్ రవిచంద్రన్‌గారు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారనే విషయాలను తెలుసుకున్నా. అలా నా కెరీర్లో ఓ ఏడాది శంకర్ సార్‌కు కేటాయించాను. ‘బాయ్స్’లో మాత్రమే యాక్ట్ చేశాను. యాక్టింగ్ నా స్పేస్ కాదనిపించింది. ► శంకర్‌ని తరచూ కలుస్తుంటారా? నటుడిగా ఎందుకు కొనసాగలేదు? చాన్స్ రాలేదా? ‘బాయ్స్’ చిత్రయూనిట్‌లోని యాక్టర్స్‌లో ఇప్పటికీ ఆయన్ను తరచూ కలుస్తుండేది నేనే. ఆ సినిమా విడుదలైన ఓ రెండు, మూడేళ్ల తర్వాత .. ‘నువ్వు యాక్ట్ చేయనన్నావని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. అజిత్, విజయ్ సినిమాల్లో యాక్ట్ చేయనన్నావట? ఏడాది పాటు కష్టపడ్డావు? నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు?’ అని శంకర్‌గారు అడిగారు. ‘‘వారికి ఏదో ఒక రోజు మ్యూజిక్ చేస్తాను కానీ వారి సినిమాల్లో యాక్ట్ చేయాలనుకోవడంలేదు’’ అని ఆయనకు చెప్పాను. ‘సరే.. మ్యూజిక్కే చేస్తావా?’ అన్నారు. అవునన్నాను. ‘నా ప్రొడక్షన్లో రూపొందుతున్న ‘ఈరమ్’ (2009) (తెలుగులో ‘వైశాలి’) సినిమాకు సంగీతం ఇస్తావా?’ అని అడిగారు.. చేశాను. ఆ తర్వాత ‘మాస్కోవిన్ కావేరి’ సినిమాకు సంగీతం అందించే చాన్స్ వచ్చింది. ఎస్ పిక్చర్స్ (ఈరమ్), ఆస్కార్ ఫిలింస్ (మాస్కోవిన్ కావేరి) చెన్నైలో అప్పటికే పెద్ద బ్యానర్స్. నేను మ్యూజిక్ అందించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాకుండానే.. రెండు సినిమాలకు మ్యూజిక్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మ్యూజిక్ డైరెక్టర్‌గా నా ఫస్ట్ ఫిల్మ్ శంకర్గారిదే. ► ఇప్పుడు హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లోని సినిమాకు చాన్స్ ఎలా వచ్చింది? శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మాణంలో సినిమా ఓకే అయ్యిందని తెలియగానే ... ‘దిల్’ రాజుగారితో ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఏఆర్ రెహమాన్‌గారు తొలిసారి మ్యూజిక్ చేయనున్నారు.. అదీ శంకర్‌సార్ దర్శకత్వంలో.. కంగ్రాట్స్ సార్’ అన్నాను. కానీ ఆయనేమో ‘ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నాకు శంకర్ వేరే ఆప్షన్ ఇవ్వడం లేదు. నిన్నే కావాలంటున్నారు, మార్చి 1న ఆయన్ను వెళ్లి కలువు’ అన్నారు. షాకయ్యాను. ► మరి.. ఏఆర్ రెహమాన్ మీ సినిమాకు సంగీతం చేయడం లేదా అని శంకర్‌ను అడిగారా? అడగలేదు. ఆయనకు ఫోన్ చేస్తే, ‘15 రోజుల్లో ఓ సాంగ్ చేయాలి.. నువ్వు ఎప్పుడొస్తావ్?’ అని అడిగారు. ‘ఒక వారం టైమ్ ఇవ్వండి.. వస్తాను’ అన్నాను. ఇప్పటివరకు మూడు పాటలు పూర్తి చేశాను. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయి. ► ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులతో వర్క్ చేసిన శంకర్ టేస్ట్‌కు తగ్గట్లు మ్యూజిక్ అందించగలనా అనే ఆందోళన లేదా? భయం ఉంటే మనం ముందుకు వెళ్లలేం. చాలెంజింగ్‌గా తీసుకున్నాను. దర్శకులు శంకర్, త్రివిక్రమ్ ఒకేలా ఆలోచిస్తారని నా అభిప్రాయం. ఇద్దరూ పదేళ్లు ముందుగా ఆలోచిస్తారు. వారిద్దరినీ పట్టుకోవాలి. దాని కోసం కొంచెం ఎక్కువగా పరిగెడతాను అంతే. ► త్రివిక్రమ్‌తో ఆల్రెడీ వర్క్ చేయడం వల్ల మీ పని ఈజీ అయ్యిందనుకోవచ్చా? త్రివిక్రమ్ నాకో ప్రొఫెసర్లాంటి వారు. ఆయన దర్శకత్వంలో ‘అరవిందసమేత వీరరాఘవ’ చేశాక మ్యూజిక్ పట్ల నా దృష్టి కోణం మారింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ త్రివిక్రమ్‌గారి వల్లే వచ్చిందను కుంటున్నాను. ‘అల.. వైకుంఠపురములో..’ సక్సెస్ వల్లే శంకర్‌గారితో సినిమా చేసే చాన్స్ వచ్చిందని నమ్ముతున్నాను. ► నా హార్ట్‌కు, బ్రెయిన్‌కు మధ్య త్రివిక్రమ్ ఓ కొత్త నర్వ్ వేశారని అన్నారు ఓ సందర్భంలో.. వివరిస్తారా? అది నిజమే. కొంతమందిని కలిసినప్పుడు మనం మారిపోతుంటాం... కనీసం ఒక శాతం అయినా. అది పెళ్లైన తర్వాత భార్య వల్ల కావొచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక బాస్ వల్ల కావొచ్చు.. మనం మారవచ్చు. త్రివిక్రమ్‌గారి వల్ల నేను మారిపోయాను. సినిమాకు ఉన్న వేరే కోణాలు ఏంటో ఆయన చెప్పారు. ఇదివరకు నేను సినిమా ముందు ఉండేవాణ్ణి. ఆయనతో వర్క్ చేసిన తర్వాత సినిమా వెనక్కి వెళ్లాను. ఇప్పుడు స్క్రీన్ వెనకాల నుంచి వర్క్ చేస్తున్నాను. ► త్రివిక్రమ్ ఒక నర్వ్ వేశారు. మరి.. శంకర్? ఆ నరాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాను. ► మీ అమ్మగారితో పాడించాలని ఎప్పుడూ అనుకోలేదా? నాన్న చనిపోయాక 27 ఏళ్లుగా అమ్మ బాధ్యత అంతా నాదే. పాడతానని అమ్మ అడుగుతుంటారు. అయితే ఫ్యామిలీ చేత ఎక్కువ పాడిస్తున్నానంటారేమో అని ఆగాను. నా భార్య శ్రీవర్ధిని ‘కిక్’ , ‘ఆంజనేయులు’ వంటి సినిమాల్లో పాడారు. అలాగే విశాల్ సినిమాకీ పాడుతున్నారు. ► మ్యూజిక్ పరంగా చెన్నైతో పోలిస్తే హైదరాబాద్..? హైదరాబాద్ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోంది. మ్యూజిక్‌కి పెద్ద బేస్ ఇది. చెన్నై ముంబై నుంచి కూడా తరచుగా రాకపోకలు సాగించే మ్యుజిషియన్స్ ఉన్నారు. లోకల్‌గా ఎక్కువ సింగర్స్ ఉన్నారు. కీరవాణి, మణిశర్మ, కోటి వంటివారు చాలా ట్రైన్ చేసేశారు. అలాగే ఇక్కడ బ్యాండ్ కల్చర్ బాగా ఉండడం వల్ల చాలామంది ఇతర వాద్య కళాకారులు కూడా బాగా వచ్చేశారు. ► రీ– రికార్డింగ్ అంటే ఒకప్పుడు చెన్నై కేరాఫ్? అవును.. అయితే ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. ► క్రికెట్ బాగా ఆడతారు కదా? అవును శని, ఆదివారాల్లో పూర్తిగా క్రికెట్ ఆడుతూ ఉంటా. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులో మరొకరో ఉండరు. అక్కడా సింగర్స్, ఇతర మ్యుజిషియన్స్ ఉంటారు. హైదరాబాద్, చెన్నైలలో 2 టీమ్స్ ఏర్పాటు చేశాం. ► డైరెక్టర్ శంకర్ ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం.. ఇప్పుడు శంకర్ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్... శంకర ప్రియతమన మ్యూజిక్ డైరెక్టర్... తమన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఈరోజు ఉదయం 9:30 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గంటలకు ‘సాక్షి’ టీవీలో – రెంటాల జయదేవ -
మెరీనా క్యాంపస్ మూగబోయింది
మద్రాసులో మరో తెలుగు దివ్వె కనుమరుగైంది. మూల ద్రావిడ భాషల్లో బహువచన ప్రత్యయమే లేదని పరిశోధనాత్మకంగా తేల్చిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జీవీయస్సార్ కృష్ణమూర్తి మరణంతో ప్రతిష్ఠాత్మక మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ తెలుగు శాఖ చిన్నబోయింది. తొంభై నాలుగేళ్ళ ఆ శాఖతో దాదాపు సగం కాలం అనుబంధం, అధ్యాపకత్వం మాస్టారివి. ఇన్నేళ్ళుగా మద్రాసులో తెలుగు భాషా పరిశోధనకూ, విద్యార్థులకూ పెద్దదిక్కుగా నిలి చిన మంచి మనిషిగా... మూల ద్రావిడ పదాలను ఎలా గుర్తించాలి, ఆ పదాల అర్థాలు, అర్థవిపరిణామానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన అరుదైన భాషావేత్తగా... జీవీయస్సార్ ఓ కొండగుర్తు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ళలో బతికిచెడ్డ కుటుంబంలో పుట్టిన జీవీయస్సార్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తూమాటి దొణప్ప వద్ద భాషాశాస్త్ర అధ్యయనం చేశారు. ‘ద్రావిడ భాషల్లో సమాన పదజాలం’పై పరిశోధించారు. అది ఆయనను పాండిత్యంలో సానబెట్టింది. చెన్నపురికి చేర్చింది. 1978 నుంచి ఇప్పటి దాకా మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు ఊపిరిగా నిలి పింది. ఆ శాఖలో దశాబ్దాల క్రితమే తెలుగు సాహితీ అధ్యయనాన్ని ప్రాయోగికంగా మారుస్తూ, జర్నలిజమ్ పేపర్‌ను ప్రవేశపెట్టడంలో కీలక భాగస్వామి ఆయన. భాషావికాసం - జర్నలిజాల బోధన, ద్రావిడభాషా పరిశోధన–రెండూ చివరి దాకా ఆయనకు రెండు కళ్ళు. జీవనపోరాటంలో కష్టనష్టాలెన్నో చూసిన అనుభవం ఆయనది. అందుకే, సుదూరం నుంచి వచ్చిన విద్యార్థుల ఈతిబాధలు మాస్టారికి తెలుసు. అలా 4 దశాబ్దాల్లో కొన్ని వందల మంది తెలుగు పిల్లలకు ఆయన గురువే కాదు, తల్లి- తండ్రి- ఆత్మబంధువయ్యారు. అవస రానికి సలహాల నుంచి అడిగిందే తడవుగా ఆర్థికసాయాల దాకా అన్నీ చూసే స్నేహితుడయ్యారు. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనంలో కొన్ని పదుల మంది పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు. కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వెంకటరావుల పరంపరలో ఆచార్య గంధం అప్పారావు, రామచంద్ర చౌదరి, అక్కిరెడ్డి తర్వాత తెలుగుశాఖకు అధ్యక్షులయ్యారు. ఏ హోదాలో ఉన్నా సరే చదువుకోవడానికొచ్చే పిల్లలతో అదే ఆత్మీయత. అదే వాత్సల్యం. రిటైరైన తరువాత కూడా రెండు దశాబ్దాలు రోజూ తెలుగు శాఖకు వచ్చి, విద్యార్థులను తీర్చిదిద్దిన నిష్కామకర్మ, నిబద్ధత జీవీ యస్సార్వి. ఎనిమిది పదులకు దగ్గరవుతున్నా... రోజూ ఉదయాన్నే వచ్చేదీ, పొద్దుపోయాకెప్పుడో రాత్రి ఆఖరున వెళ్ళేదీ ఆయనే. అనేక సార్లు ఆగుతూ వచ్చిన చదువును కొనసాగిస్తూ, సైన్స్ చదివి, ఎమ్మేలో లెక్కలు వేసి, జీవనోపాధికి అనేకానేక చిరు ఉద్యోగాలు చేసి, ఆనక తెలుగులో పరిశోధన రాసి ఆచార్యుడైన జీవీయస్సార్కు జీవితంలోని డబ్బు లెక్కలు తెలియవు. అడిగినవారికి లేదనకుండా, కష్టంలో ఉన్న విద్యార్థికి కన్నీరు విడవకుండా ఆయన చేసిన సాయాలు, దానాలు, చెప్పిన సలహాలు కొల్లలు. కానీ, తనకంటూ అవసరమున్నా ఎవరినీ అర్థించని ఆత్మాభిమాని. అనర్గళంగా ఆయన భాషాశాస్త్ర పాఠం చెబుతుంటే అది వినముచ్చట. పాఠంలో, పరిశోధనలో సీరియస్‌గా అనిపించే మనిషి... కిందకు దిగి, క్యాంటీన్లో కుర్రకారుతో కలసి సర దాగా కబుర్లాడుతుంటే అదో చూడముచ్చట. ఆచార్యుడైనా, శాఖాధ్య క్షుడైనా, ఆఖరుకు ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి పదవి ఆఖరి క్షణంలో అందకుండా పోయినా– ఆయన మాత్రం అంతే సాదా సీదాగా గడిపేయడం ఓ అరుదైన ముచ్చట. నిన్నటి దాకా స్లెట్, యూజీసీ నెట్ నుంచి ఐఏఎస్ దాకా ఏ తెలుగు పరీక్షాపత్రం సిద్ధం చేయాలన్నా మాస్టారి చేయి పడాల్సిందే! భద్రిరాజు కృష్ణమూర్తి, పీఎస్ సుబ్రహ్మణ్యం, దొణప్పల తరువాతి తరంలో భాషాశాస్త్రంలో అవిరళ కృషి చేసిన జీవీయస్సార్ ఎక్కు వగా ఇంగ్లీషులోనే పరిశోధనలన్నీ రాశారు. వాటిని కనీసం పుస్తకంగా నైనా వేయలేదు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే వెళ్ళిపోవడంతో తెలుగు సమాజానికి ఆయన కృషి పూర్తిగా తెలియలేదు. సంపదనూ, సమ యాన్నీ, పరిశోధనా మేధనూ స్వీయప్రతిష్ఠ కోసం కాకుండా విద్యా ర్థుల కోసం వెచ్చించడం గురువుగా ఆయనలోని అరుదైన లక్షణం. ఆయన దగ్గర చదువుకొని కొందరు సినీ రచయితలయ్యారు. ఇంకొం దరు సాహితీవేత్తలయ్యారు. మరికొందరు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఆచార్యులయ్యారు. శాఖలో ఆయన ప్రత్యక్ష శిష్యులు మాడభూషి సంపత్ కుమార్ కూడా అదే శాఖకు అధ్యక్షులవడం సాక్షాత్ గురుకృప. చెన్నపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేసిన మైలాపూర్ భవనంతో, ఆ సొసైటీతో, అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రపంచ తెలుగు సమాఖ్య - బీఎస్సార్కృష్ణ ‘రచన’ లాంటి సంస్థలతో జీవీయస్సార్ సాన్నిహిత్యం, వాటిల్లో ఆయన క్రియాశీలక కృషి చిరకాల జ్ఞాపకాలు. మల్లిక్, ఆచార్య కాసల నాగభూషణంతో కలసి ‘అరసం’ మద్రాసు శాఖ అధ్యక్షుడిగా ఆయన జరిపిన కార్యక్రమాలు వందలు. ‘నిండు మనంబు నవ్య నవనీత సమంబు... పల్కు దారుణ శస్త్ర ఖండనా తుల్యంబు...’ అన్న నన్నయ భారత చిత్రణ... సాహితీ పరిశో ధకుల మౌఖిక పరీక్షా సందర్భంలో మాస్టారికి సరిగ్గా సరిపోలుతుంది. సెమినార్లలో ఎవరు మాట్లాడినా, పరిశోధకులు ఏ తప్పు రాసినా ఆయన ఆత్మీయతను వదిలేసి, సత్యవాదిగా వాదనకు దిగేవారు. కొందరు సన్నిహితులకు సైతం రుచించకపోయినా, అది జీవీయస్సార్ జీవలక్షణం. భాషాశాస్త్రంలో çపట్టుసడలని పరిశోధనా దృష్టి, తెలుగు శాఖాభివృద్ధిలో పట్టువదలని కార్యదీక్ష, ఏదైనా సరే పట్టుకున్నది నెరవేరేలా చూసే వ్యవహార దక్షత, ఏటికి ఎదురీదే సాహసం, ఆప దలో పడితే తార్కికంగా చక్రం అడ్డువేసే శిష్యవాత్సల్యం, అవసరంలో ఉన్నవారికి సాయపడే సద్గుణం - ఇదీ ఆయన వ్యక్తిత్వం. అవన్నీ ఇకపై ప్రతి సందర్భంలోనూ చెన్నై తెలుగు వేదికపై ఆయన లేని లోటును పదే పదే గుర్తుచేస్తాయి. పదిమందీ గుర్తించేలా చేస్తాయి. అభ్యుదయ పరంపరాగత ఆత్మీయ గురువులకు అశ్రునివాళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
70 ఏళ్ల వయసులో 17 ఏళ్ల అమ్మాయితో పారిపోయి..
ఆయన ప్రసిద్ధ కంప్యూటర్ సైంటిస్ట్. యాక్టివిస్ట్. వ్యాపార వేత్త. క్రిప్టో కరెన్సీ సమర్థకుడు. పుస్తక రచయిత. ఇన్ని కోణాలున్న ఆయన సృష్టించిన ‘మెకాఫే యాంటీ వైరస్’ సాఫ్ట్వేర్ పేరు కంప్యూటర్లు వాడే అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లు ఆరాటపడ్డ జాన్ మెకాఫేది చెప్పాలంటే చాలానే ఉన్న జీవితం. ఏకంగా చిత్రంగా తెరకెక్కిన జీవితం. ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ ఈ స్థాయికి రావడం కనీవినీ ఎరుగని చరిత్ర. బార్సిలోనా జైలులో నవమాసాలుగా గడు పుతూ, డెబ్భై ఆరో ఏట ఈ జూన్ 23న నిర్జీవుడై కనిపించే వరకు మెకాఫే తనదైన పద్ధతిలో జీవించిన భోగి. ఆయన చేసిన ప్రతీదీ ఓ వార్తే. క్రిప్టో కరెన్సీని సమర్థించారు. పన్నులు చెల్లించేదేమిటని ధిక్కరించారు. డ్రగ్స్ తీసుకున్నారు. తుపాకీ చేతపట్టారు. వనితలతో కలసి విశృంఖలంగా విహరించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. వివాదాలతో వీధికెక్కారు. చివరకు ఆత్మహత్య అంటున్న ఆయన అర్ధంతర మరణమూ సంచలన వార్తయింది. పన్ను ఎగవేత కేసుల్లో ఆయనను అమెరికాకు అప్పగించడానికి అనుమతిస్తూ స్పెయిన్ కోర్టు ఉత్తర్వు లిచ్చిన కాసేపటికే మెకాఫే జీవితం జైలులో ముగిసింది. సాహసాలన్నా, రహస్యాలన్నా ఇష్టమన్న ఆయన చాలా దుస్సాహసాలే చేశారు. సైద్ధాంతిక కారణాలతో 8 ఏళ్లుగా ఆదాయపు పన్ను ఎగ్గొట్టానని 2019లో ఆయనే చెప్పారు. అప్పటినుంచి అమెరికా న్యాయవిచారణను తప్పించుకోవడం కోసం కాందిశీకుడిగా కాలం గడిపారు. ఓ విలాసవంతమైన నౌకలో కాలక్షేపం చేశారు. భార్య, నాలుగు కుక్కలు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఏడుగురు సిబ్బంది– ఇదే ఆ నౌకలో ఆయన ప్రపంచం. ‘‘స్త్రీలంటే పడిచచ్చే ప్రేమికుణ్ణి’’ అంటూ తనను అభివర్ణించుకున్న ఆయన కనీసం 47 మంది పిల్లల పుట్టుకకు కారణం. మూడేళ్ళ క్రితం ఆయనే ఆ మాట చెప్పు కున్నారు. తెర వెనుక కథలెన్నో ఒప్పుకున్నారు. ఏడు పదులు దాటిన వయసులో పదిహేడేళ్ళ అమ్మాయితో కలసి, ఇంటి నిండా ఆయుధాలతో పోలీసుల కంటపడి పారిపోయారు. డబ్బు, పేరుప్రతిష్ఠలు, వివాదాలు– మెకాఫే చుట్టూ వైఫైలా తిరిగాయి. 1987లో ప్రపంచంలో తొలి కమర్షియల్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఆరంభించింది మెకాఫేనే! ఇవాళ్టికీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైచిలుకు మంది వాడుతున్న సాఫ్ట్వేర్ అది. పదేళ్ళ క్రితమే ఆ సంస్థను ‘ఇన్టెల్’కు అమ్మే సినా, ఆ సాఫ్ట్వేర్ మాత్రం ఇప్పటికీ మెకాఫే పేరుతోనే ప్రపంచ ప్రసిద్ధం. ఒకప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సహా జిరాక్స్ లాంటి సంస్థల్లో పనిచేశారీ బ్రిటిష్–అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. కాలక్రమంలో ఆయన సంపాదన కూడా అపారమైంది. ‘క్రిప్టోకరెన్సీ గురు’గా మారిన ఆయన రోజుకు వేల డాలర్లు సంపాదించారు. ఈ క్రిప్టో కరెన్సీలు, కన్సల్టింగ్ పనులు, నిజ జీవితకథ హక్కుల విక్రయం– ఇలా అనేక విధాలుగా ఆయన లక్షల డాలర్లు ఆర్జిం చారు. చివరకొచ్చేసరికి జైలులోనే జీవిత చరమాంకం గడిచి పోతుందని భయపడి, జీవితం ముగించారు. వివాదాస్పద వ్యాఖ్యల మెకాఫేకు ట్విట్టర్లో ఏకంగా 10 లక్షలమంది ఫాలోయర్లున్నారు. దాన్నిబట్టి ఆయన పెంచు కున్న ప్రాచుర్యం అర్థం చేసుకోవచ్చు. మెకాఫే పుట్టింది బ్రిటన్‌లో అయినా, అమెరికా అధ్యక్ష పదవికి ఒకటికి రెండు సార్లు నామినీగా నిలబడాలని ప్రయత్నించడం మరో కథ. లిబర్టేరియన్ పార్టీ పక్షాన అధ్యక్ష పదవికి పోటీ చర్చల్లోనూ పాల్గొన్న గతం ఆయనది. ‘గంజాయి వాడకాన్ని నేరంగా పరిగణించరాదు... ప్రభుత్వం సైజు తగ్గించాలి... అహింసాత్మక నేరాలకు పాల్పడ్డ వారందరినీ జైలులో నుంచి విడుదల చేయాలి...’ ఇదీ అప్పట్లో ఆయన వాదన. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడాలనుకొనే స్థాయికి వెళ్ళిన ఆ వ్యక్తి, ఇస్తాంబుల్‌కు పారిపోతుండగా బార్సి లోనా విమానాశ్రయంలో పట్టుబడి, జైలుగోడల మధ్య నిరాశలో మగ్గడం ఊహకందని జీవిత వైకుంఠపాళీ. (జాన్ మెకఫీ మృతి.. ముందే అనుమానించిన భార్య) మెకాఫే ఎంతో సంపాదించారు. రియల్ ఎస్టేట్ మొదలు హెర్బల్ యాంటీ బయాటిక్స్, బిట్‌కాయిన్ మైనింగ్– ఇలా ఎన్నో వ్యాపారాల్లో వేలుపెట్టారు. 2007 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఎంతో పోగొట్టుకున్నారు. జీవితం ఆఖరి ఘట్టంలో ఆయన ఆస్తులన్నీ జప్తయ్యాయి. ఏ తంటా వస్తుందో ఏమోనన్న భయంతో స్నేహితులు జారుకున్నారు. మెకాఫే చేతి కింద ఎవరూ, చేతిలో ఏమీ లేని ఒంటరి అయ్యారు. అయినా సరే జీవితంలో చేసిన తప్పొప్పులకు విచారం లేదనేవారు. ‘నాలో ఉదారతా ఉంది. అప్రమత్తతా ఉంది. హాస్యప్రియత్వమూ ఉంది. అన్నిటికీ మించి వేప కాయంత వెర్రీ ఉంది’ అనేవారు. జీవితంలోని విభిన్న రుచులు, అభిరుచుల మిశ్రమం కాబట్టే, మెకాఫే జీవితం ఓ సినిమాస్టోరీ. ఆయనపై ‘గ్రింగో: ది డేంజరస్ లైఫ్ ఆఫ్ జాన్ మెకాఫే’ అంటూ అయిదేళ్ళ క్రితం ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. అనేక ప్రభుత్వాలతో తలపడి, జీవిత చరమాంకంలో పారిపోతూ, ప్రవాసంలో గడిపిన మెకాఫే జీవితం ఎన్నో పాఠాలు చెబుతుంది. మెకాఫే మాటల్లోనే చెప్పాలంటే, 75 ఏళ్ళ ఆయన జీవితం ‘స్వర్గ నరకాల మధ్య సాగిన ఉత్థాన పతనాల ఉయ్యాల’! జైలు జీవితంతో విరాగిగా మారిన ఓ వివాదాస్పద భోగి ఆయన. – రెంటాల జయదేవ -
MAA Elections 2021: మాలో మాకు పడదా?
మరోసారి రచ్చ మొదలైంది. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు మళ్ళీ ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, ఇటు అంతకన్నా సీనియర్ నటుడైన మోహన్‌బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు, ఆ వెంటనే ఉన్నట్టుండి మరో నటి జీవితా రాజశేఖర్ ఒకరి తరువాత ఒకరు ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం ‘‘తోటివాళ్ళ ఒత్తిడితో’’ తానూ పోటీకి దిగుతున్నట్టు నటి హేమ ప్రకటించారు. దాంతో ఇప్పుడు సినీ‘మా’ నాలుగుస్తంభాలాట మొదలైంది. ‘మెగా’ మద్దతు ఎటువైపు? ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ రాజకీయ ప్రశ్నలు సంధించే ప్రకాశ్ రాజ్ పోటీ ప్రకటన నాటకీయంగానే సాగింది. ఆ మధ్య ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ను విమర్శించిన ప్రకాశ్‌రాజ్, ఇటీవల ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో ‘మావి రాజకీయ సైద్ధాంతిక విభేదాలు మాత్రమే’ అంటూ ప్రశంసలు వర్షించారు. ఆ విమర్శలవేళ ప్రకాశ్‌రాజ్‌పై విరుచుకుపడ్డ మెగాబ్రదర్ నాగబాబు సైతం ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ అభ్యర్థిత్వాన్ని బాహాటంగా సమర్థిస్తున్నారు. అంటే మెగాఫ్యామిలీ అండదండలు ప్రకాశ్‌రాజ్‌కు ఉన్నట్టే! నిజానికి, ఎన్నికల బరిలోకి దిగక ముందే చిరంజీవి మద్దతును ప్రకాశ్‌రాజ్ ముందుగా కోరారట. మెగాస్టార్ తమ పూర్తి మద్దతుంటుందని హామీ ఇచ్చారట. అన్న మాటకు తగ్గట్టే తమ్ముడు నాగబాబూ లైన్లోకి వచ్చి, ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తానని ప్రపంచానికి చెప్పీచెప్పగానే సమర్థించేశారు. ‘మెగా మద్దతు’ ఎటువైపు ఉందో సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇగో క్లాష్‌లు... ఎత్తుకు పైయెత్తులు... ఎవరికివారే గొప్పనుకొనే కళారంగంలో ఇగో క్లాష్‌లు కామనే! ఈ పోటాపోటీలోనూ అవి చాలా ఉన్నాయని ఖబర్. గతంలో ‘మా’ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన యువ హీరో మంచు విష్ణు, సీనియర్ ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యర్థిగా దిగడం వెనుక కారణాల్నీ పలువురు చర్చిస్తున్నారు. మోహన్‌బాబు తన పుత్రుడికి మద్దతు కోరి, చిరంజీవికి ఫోన్ చేశారట. అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు హామీ ఇచ్చేశాననీ, మాట తప్పలేననీ చిరంజీవి చెప్పారట. దాంతో మంచు కుటుంబం హర్ట్ అయ్యిందని కృష్ణానగర్ గుసగుస. అందుకే, తండ్రి ఆశీస్సులతో మంచు వారసుడు పోటీకి సై అంటే సై అన్నారని ఓ టాక్. జూన్ 20న మోహన్‌బాబు, విష్ణు స్వయంగా సీనియర్ నటుడు కృష్ణ ఇంటికి వెళ్ళి మద్దతు కోరారు. మరో సీనియర్ కృష్ణంరాజు ఆశీస్సులూ అందుకున్నారు. ఈ వ్యూహాత్మక ఎత్తుగడ సినీరంగంలో చీలిక, సామాజిక వర్గసమీకరణ అనే వాదనకు సోషల్ మీడియాలో తెర లేపింది. అలాగే, ‘మా’ సభ్యుడిగా పోటీకి అన్నివిధాలా అర్హుడైనప్పటికీ, ‘కన్నడిగుడైన ప్రకాశ్‌రాజ్‌కు తెలుగు నటుల సంఘానికి అధ్యక్షుడేమి’టనే ‘లోకల్– నాన్ లోకల్’ చర్చ తెలివిగా తెరపైకొచ్చింది. నిజానికి, బయటకు ‘టామ్ అండ్ జెర్రీ’ ఆటలా ఉన్నా, ఆంతరంగికంగా మెగా, మంచు పెద్దల మధ్య మంచి స్నేహం ఉంది. మరి తాజా పోటాపోటీ, ఇగో క్లాష్ల పర్యవసానం ఏమిటి? పోటీలోకి మరికొందరు! మరోపక్క ప్రస్తుత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి జీవిత, ఇప్పటికే ‘మా’లో వివిధ పదవులు నిర్వహించిన హేమ లాంటి తారలూ అధ్యక్షపదవి పోటీకి దిగడంతో కథ కొత్త మలుపు తిరిగింది. వీరిని ఎటో ఒకవైపు తిప్పుకొనే ప్రయత్నాలూ సాగుతున్నట్టు సమాచారం. ఇక, ఎన్నికల వేళ ఏవో పాత సమస్యలను లేవనెత్తుతూ... బరిలోకి దిగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండనే ఉంటారు. ఇప్పటికైతే పోటీలో ఇన్ని పేర్లు వినిపిస్తున్నా, పోలింగ్ తేదీ నాటికి ఇంతమందీ బరిలో ఉంటారా అన్నదీ అనుమానమే. 2015 ఎన్నికలలో సహా, అనేకసార్లు పెద్ద పోస్టులకు పోటీ దిగినవారు సైతం ఆఖరు నిమిషంలో బరిలో నుంచి తప్పుకున్నారు. ఈసారీ అలాంటివి జరగవచ్చు. ఎందుకింత మోజు... క్రేజు..? ‘మా’ అధ్యక్షపదవికి ఇంత పోటీ, మోజు ఉండడం ఆశ్చర్యమే! సభ్యుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం 1993 అక్టోబర్ 4న మొదలైన ‘మా’కు రెండేళ్ళకోసారి ఎన్నికలవుతాయి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా తదితరులు ‘మా’ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. మురళీమోహన్ అత్యధికంగా 6సార్లు (12 ఏళ్ళు) అధ్యక్షపదవి నిర్వహించారు. అయితే, దాదాపు రూ. 3 కోట్ల చిల్లర కార్పస్ ఫండ్ మినహా ‘మా’కు ఆస్తులూ, అంతస్థులూ లేవు. నిధుల సమీకరణ కోసం ఒకçప్పటి బెనిఫిట్ షోలూ ఇటీవల లేవు. పెన్షన్, బీమా లాంటి సంక్షేమ చర్యల ఖర్చుతో ఆ నిధీ అంతకంతకూ తరిగిపోతోంది. ఎన్నికలొస్తే... గాలిలో సొంత మేడలు! ఇక గడచిన రెండు దశాబ్దాలుగా ఎప్పుడు ‘మా’ ఎన్నికలు జరిగినా వినిపించే హామీ– ‘మా’కు సొంత భవన నిర్మాణం! కానీ ఎంతమంది ప్రెసిడెంట్లు హామీ ఇచ్చినా – అది వట్టి ఎన్నికల హామీగానే మిగిలింది. ప్రతిసారీ ఎన్నికలప్పుడు మాత్రమే సొంత భవనం కల తెర మీదకొచ్చి, ఆ తరువాత అదృశ్యమవడం ఆనవాయితీ అయింది. రానున్న ఎన్నికలకూ అభ్యర్థులందరూ ఆ సొంత ఇంటి పాతపాటనే మళ్ళీ ఎత్తుకున్నారు. అంతా (అ)సమైక్య రాగమే! ఎన్ని వాదవివాదాలైనా ఎన్నికలైపోయాక మళ్ళీ ‘అందరం సినిమాతల్లి ముద్దుబిడ్డలం. మేమందరం ఒకటే. ‘మా’లో మాకు విభేదాలు లేవు’ అంటూ గ్రూప్ ఫోటోలు దిగడం కామన్. లోపల లుకలుకలు, ఇగోలున్నా పైకి మాత్రం ఇలా సమైక్యరాగం ఆలపిస్తుంటారని అందరికీ ఇట్టే అర్థమైపోతుంటుంది. 2015లో పాపులర్ ‘రాజేంద్రప్రసాద్ వర్సెస్ జయసుధ’ పోటాపోటీలో రాజేంద్రప్రసాద్ గెలిచిన తరువాత నుంచి ‘మా’ అనైక్యత తరచూ వీధికెక్కుతోంది. ప్రస్తుతం సీనియర్ నరేశ్ ప్రెసిడెంటైన కార్యవర్గంలోనైతే కుమ్ములాట తారస్థాయికి చేరింది. ప్రమాణ స్వీకారం రోజున తోటి నటి (హేమ) మైకు లాక్కోవడం దగ్గర నుంచి సాక్షాత్తూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (రాజశేఖర్) వేదికపై విభేదాలను ప్రస్తావించడం, రాజీనామా దాకా ఎన్నో పరిణామాలు – గడచిన రెండేళ్ళలో ‘మా’ను రచ్చకీడ్చాయి. ఒక దశలో నరేశ్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా మెజారిటీ కార్యవర్గ సభ్యులు కలిసి, కనివిని ఎరుగని రీతిలో ‘అభిశంసన తీర్మానం’తో, పదవి నుంచి తొలగించే ప్రయత్నమూ జరిగింది. చివరకు రాజీబాటలో కొన్నాళ్ళు నరేశ్ సెలవు మీద వెళ్ళి, మరో సీనియర్ నటుడు బెనర్జీ తాత్కాలికంగా అధ్యక్షబాధ్యత నిర్వహించాల్సొచ్చింది. ఇక తాజాగా మూడు నెలల తర్వాత జరగాల్సిన ఎన్నికలకు ఇప్పటి నుంచే మొదలైన పోటాపోటీ ఎటు దారితీస్తుందో చూడాలి. కరోనా కష్టకాలంలో ఆర్టిస్టుల కష్టాల కన్నా ఎన్నికల మీద అందరూ దృష్టి పెట్టడమే విచిత్రం! ‘మా’ ప్రతిష్ఠను మసకబార్చే ఈ పోటాపోటీ అసలే థియేటర్లు, సినిమాలు లేని కరోనా వేళ ఆడియన్స్‌కు అనవసర వీధి వినోదాన్ని అందించడమే విషాదం!! ఈసారైనా స్టార్లు వస్తారా? కేవలం 150 మంది సభ్యులతో మొదలైన ‘మా’లో దివంగతుల సంఖ్య పోగా, ఇప్పుడున్నది 828 మంది సభ్యులే! వీరందరూ ఓటర్లే. వీళ్ళలో అధికశాతం మంది చిన్నాచితకా ఆర్టిస్టులే. అందుకే, పోలింగ్ రోజున ఓటేసే యువ హీరో, హీరోయిన్లు తక్కువే. మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి నేటి టాప్ స్టార్లయితే కొన్నేళ్ళుగా వార్షిక సర్వసభ్య సమావేశాల్లో కానీ, పోలింగ్ లో కానీ కనపడనే లేదు. ఒక్క 2004, 2015లలో తప్ప మరెప్పుడూ ‘మా’ ఎన్నికలలో భారీగా ఓటింగూ జరగలేదు. సగటున ప్రతిసారీ పోలయ్యేది 400 ఓట్లే! అయితే, గ్లామర్ నిండిన సినీ సమరం కావడంతో ఈ మాత్రానికే ప్రచారం మాత్రం మీడియాలో హోరెత్తిపోతుంటుంది. – రెంటాల జయదేవ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రివ్యూ: ఇన్ ది నేమ్ ఆఫ్... వెబ్ సిరీస్ ఇలాగా?
వెబ్ సిరీస్: ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’; తారాగణం: ప్రియదర్శి, నందినీ రాయ్; మాటలు: ప్రదీప్ ఆచార్య; కాన్సెప్ట్: ఆదిత్యా ముత్తుకుమార్; రచన, దర్శకత్వం: విద్యాసాగర్ ముత్తుకుమార్; ఓటీటీ: ఆహా ‘బాషా’, ‘మాస్టర్’ లాంటి సూపర్ హిట్స్ అందించిన దర్శకుడు సురేశ్ కృష్ణ తెలుగులో నిర్మించిన తొలి వెబ్‌సిరీస్ ఇది. ట్రైలర్ దశ నుంచి ఆసక్తి రేపింది. క్రైమ్ అండ్ సెక్స్ కలగలిపి కథ రాసుకోవడం డిజిటల్ కంటెంట్‌కు పేయింగ్ ఎలిమెంటే. కానీ, అవి ఉంటే సరిపోతుందా? అసలు కథ, కథనం గాడి తప్పితే? ఏ పాత్రా, ఏ సంఘటనా మనసుకు హత్తుకోకపోతే? సెన్సార్ లేని వెబ్ సిరీస్ కదా అని విశృంఖలంగా తీయాలనుకుంటే? ఇవేమంత జవాబు చెప్పలేని బేతాళ ప్రశ్నలు కాదు. కథేమిటంటే..: మనిషిలో ఉండే సహజమైన మోహం, దురాశ, కామం, పశుప్రవృత్తి లాంటి గుణాలతో అల్లుకున్న కథ ఇది. రాజమండ్రిలో ట్రావెల్స్ డ్రైవర్‌గా పనిచేసే ఆది (ప్రియదర్శి)కి ఓ రిసార్ట్ కొనుక్కోవాలని ఆశ. బూతు ‘బిట్ సినిమాలు’ తీసే అయ్యప్ప (పోసాని). ఆ దర్శకుడు కట్టుకున్న పడుచు పెళ్ళాం మీనా (నందినీరాయ్) వైపు ఆది ఆకర్షితుడవుతాడు. గంజాయి అమ్ముతూ తప్పుదోవ పట్టిన థామస్(వికాస్)తో సంబంధం పెట్టుకున్న మీనా అనుకోని పరిస్థితుల్లో భర్తనే చంపేస్తుంది. అప్పటికే ఓ దాదా ఇచ్చిన హవాలా సొమ్ము తమ్ముడి ద్వారా అయ్యప్పకు చేరి ఉంటుంది. ఇటు అయ్యప్ప హంతకుల కోసం అన్వేషణ. అటు ఆ 5 కోట్ల హవాలా మనీ ఏమైందని దాదాల వెతుకులాట. మీనా మోజులో పడి, అయ్యప్ప హత్యోదంతంలో ఇరుక్కున్న హీరో. అతని చుట్టూ రోసీ (మహమ్మద్ అలీ బేగ్) పాత్రలు. హీరో ఈ సమస్యల నుంచి బయటపడ్డాడా? డబ్బు సూట్కేసేమైంది లాంటి వాటికి జవాబు కోసం 7 భాగాలు చూడాలి. ఎలా చేశారంటే..: తెలంగాణ యాక్టర్‌గా ముద్రపడ్డ ప్రియదర్శి రాజమండ్రి నేపథ్యంలో మొదలై, అక్కడే ఎక్కువగా జరిగే ఈ కథలో కోస్తాంధ్ర యాసతో వినిపించారు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించారు. నందినీ రాయ్ బోల్డ్‌గా చేశారు. పోసాని కనిపించేది ఒక్క ఎపిసోడ్‌లోనే! ఆ పాత్రలో, ఆ రకమైన సంభాషణల్లో ఒదిగిపోయారు. రోసీగా రంగస్థల నటుడు మహమ్మద్ అలీ బేగ్ చేసిందీ, చేయగలిగిందీ లేవు. అలాగే, ఫకీర్ దాదా (ఉమా మహేశ్వరరావు), హత్యకు గురైన దర్శకుడి తమ్ముడు విష్ణు (చంద్రకాంత్) – ఇలా చాలా పాత్రలు తెరపై వస్తుంటాయి. ఆ పాత్రలు, నటీనటులు విగ్రహపుష్టితో ఉన్నా కథలోని కన్ఫ్యూజన్ ఆ పాత్రల్లో, పాత్రధారణలో ఉంది. ఎలా తీశారంటే..: తొలుత టెక్నికల్ ఫాల్ట్‌తో 5 భాగాలే అప్లోడ్ అయి, ఆనక ఆలస్యంగా మొత్తం 7 భాగాలూ నెట్లో కనిపించిన సిరీస్ ఇది. అన్ని భాగాల్లోనూ ఒకటి రెండు శృంగార సన్నివేశాలు, బూతులు, హింస, హత్యాకాండ తప్పనిసరి. ప్రతి పాత్ర నోటా అదుపు లేని అసభ్య భాష. వెబ్ సిరీస్ అంటే ఇలాగే రాయాలని రచయిత ఫిక్సయినట్టున్నారు. పొడి పొడి డైలాగ్స్, అర్థం లేని పాత్రల ప్రవర్తన ఈ సిరీస్‌కు దెబ్బ. ఒకట్రెండు భాగాల తరువాత కథ, కథనం గాడి తప్పేశాయి. దానికి తోడు నిర్ణీతమైన లక్ష్యం, లక్షణం లేని బోలెడన్ని పాత్రలు వచ్చి పడుతుంటాయి. అందుకే, మూడో ఎపిసోడ్ నుంచి బోరెత్తించి, ఆపైన ఈ వెబ్ సిరీస్ ఎటెటో వెళ్ళిపోతుంది. అటు హత్య మీద కానీ, ఇటు డబ్బున్న సూట్‌కేస్ మీద కానీ దృష్టి లేకుండా పోయింది. ఆ బరువంతా ఆఖరి ఎపిసోడ్ మీద పడి, కథను హడావిడిగా ముగించాల్సి వచ్చింది. గతంలో ‘లూజర్’ వెబ్ సిరీస్‌లో చేసిన ప్రియదర్శికి ఇది కొత్త కోణం. కామం, కోపం, భయం అన్నీ పలికించారు. ఆయనే ఈ సిరీస్‌కు రిలీఫ్. కానీ కథలోని లోటుపాట్లు ఆ పాత్రనూ కిందకు గుంజేశాయి. నిర్మాణ విలువలు, కెమేరా వర్క్ బాగున్నాయి. వాటికి తగ్గట్టు స్క్రిప్టులోనూ, ఫైనల్ ప్రొడక్ట్‌లోనూ ఎడిటింగూ ఉండాల్సింది. ఇది కచ్చితంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళే చూడాల్సిన సెక్సువల్, క్రైమ్ సిరీస్. ఓటీటీ వచ్చి జనం అభిరుచిని మార్చినమాట నిజమే కానీ, బోల్డ్‌గా చెప్పడం, చూపించడం అనే ఒక్కదాని మీదే ఆధారపడి వెబ్ సిరీసులు తీస్తే కష్టం. ఆ సంగతి ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ గుర్తు చేస్తుంది. ఈ మధ్య ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్, ‘అర్ధ శతాబ్దం’ లాంటివి ‘ఆహా’లో నిరాశపరిచాయి. ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ఆ కోవలోనే చేరడం ఓ విషాదం. మొత్తం చూశాక ఇంతకూ ఏం చెప్పదలుచుకున్నారో తేల్చిచెప్పడం కష్టమే. ‘సైతాను నీ లోని కోరికను రెచ్చగొట్టి, నువ్వు తప్పు చేసేలా చేసి, కష్టపడుతుంటే చూసి ఆనందిస్తాడు. కానీ, దేవుడు తప్పు చేసినప్పుడే క్షణంలో శిక్షిస్తాడు’ అని హీరో అంటాడు. కానీ, దర్శకుడి అనుభవ రాహిత్యంతో... ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్... కథ అతి నిదానంగా నాలుగున్నర గంటలు సాగి, చూస్తున్న ప్రతి క్షణం శిక్షిస్తుంది. బలాలు: ∙భిన్నమైన పాత్రలో ప్రియదర్శి నటన ♦కెమేరా వర్క్ ♦నిర్మాణ విలువలు బలహీనతలు: రచనా లోపం, స్లో నేరేషన్ ♦కథకూ, పాత్రలకూ తీరూతెన్నూ లోపించడం ♦మితిమీరిన సెక్స్, వయొలెన్స్ కంటెంట్ కొసమెరుపు: సీరియల్ కన్నా స్లో... సిరీస్! – రెంటాల జయదేవ -
‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ
చిత్రం:‘జగమే తంత్రం తారాగణం: ధనుష్, జేమ్స్ కాస్మో, ఐశ్వర్య లక్ష్మి, జోసెఫ్ జార్జ్, శరత్ రవి సంగీతం: సంతోష్ నారాయణన్ స్టంట్స్: దినేశ్ సుబ్బరాయన్; కెమెరా: శ్రేయస్ కృష్ణన్; ఎడిటింగ్: వివేక్ హర్షన్; రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్ రిలీజ్: 2021 జూన్ 18( నెట్ ఫ్లిక్స్) ఇద్దరు వేర్వేరు గ్యాంగ్ లీడర్లు. వాళ్ళ మధ్య పోరు. అనుకోకుండా అందులో ఓ గ్యాంగ్ లీడర్ పక్షాన హీరో నిలబడతాడు. రెండోవాణ్ణి ఏకంగా పైకి పంపేస్తాడు. తీరా ఆ గ్యాంగ్ లీడర్ బాస్ మీద భ్రమలు తొలగి, హీరో అతనికి ఎదురు తిరుగుతాడు. ఆ బాస్ నే ఓడిస్తాడు. ఇలాంటి కథలు కొన్ని వందలు, వేలు చూసేసి ఉంటాం. దీనికి బ్రిటన్ లోని లండన్ నేపథ్యం, శ్రీలంక తమిళ సమస్య, శరణార్థుల వివాదం లాంటి అనేకానేక అంశాలు, లేనిపోని సిద్ధాంతాలు, రాద్ధాంతాలు కలగలిపేస్తే – అది ‘జగమే తంత్రం’. బ్రిటన్ లోని భారీ గ్యాంగ్ లీడర్ కు మదురైలో ఓ పరోటా కొట్టు నడిపే చిన్న గ్యాంగ్ లీడర్ హీరో కాస్తా కాంట్రాక్ట్ దాదాగా కావాల్సి రావడం లాంటివి మన సినిమాల్లోనే జరుగుతాయి. అలాంటి చిత్రాతిచిత్రమైన ఊహలకు వెండి తెర రూపం – ఈ సినిమా. కథేమిటంటే.. లండన్ లో పీటర్ (జేమ్స్ కాస్మో), శివదాస్ (జోసెఫ్ జోజు జార్జ్) - ఇద్దరూ రెండు వేర్వేరు గ్యాంగ్ ల లీడర్లు. ఇద్దరి మధ్య తగాదాలు. ఇరు వర్గాల చెరో హత్యతో సినిమా మొదలవుతుంది. అదే సమయంలో మదురైలో పరోటా కొట్టు నడుపుతూనే, లోకల్ దాదాగా ఎదిగిన వ్యక్తి – సురుళి (ధనుష్). పదుల కొద్దీ హత్యలు చేసిన హీరోను శివదాస్ కు అడ్డుకట్ట వేయడానికి ఓ నెల రోజుల పాటు కాంట్రాక్ట్ దాదాగా లండన్ రప్పిస్తాడు పీటర్. హీరో అక్కడ శివదాస్ నే నమ్మించి, మోసం చేస్తాడు హీరో. శరణార్థుల కోసం పనిచేస్తున్న శివదాస్ అండ్ గ్యాంగ్ చేస్తున్న మంచి పని తెలియకుండానే, తెలుసుకోకుండానే ఆయనను చంపేస్తాడు. జాత్యహంకారి అయిన పీటర్ ఆ దేశంలో శరణార్థులకు చోటు లేకుండా చేసే చట్టాన్ని తీసుకురావడం కోసం అదంతా చేస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. ద్రోహిగా ముద్ర పడి, చివరకు కన్నతల్లి సైతం అసహ్యించుకొనే స్థితికి చేరిన హీరో తన పాప ప్రక్షాళన కోసం ఏం చేశాడు? చివరకు ఏం జరిగిందన్నది జాత్యహంకారం, తమిళుల స్వయం ప్రతిపత్తి పోరాటం లాంటి అతి బరువైన విషయాల్ని అర్థం పర్థం లేకుండా కమర్షియల్ పద్ధతిలో కలిపిన ఈ రెండున్నర గంటల సినిమా. ఎలా చేశారంటే.. ధనుష్ ఎప్పటి లానే తన ఆకారానికి సంబంధం లేని ఆట, పాట, ఫైట్లు, తుపాకీలు పేల్చడాలతో హడావిడి చేశారు. విలన్ ఛాయలుండే ఇలాంటి హీరో పాత్రలు చేయడం ఆయనకూ కొత్త కాదు. చూడడం ప్రేక్షకులకూ కొత్త కాదు. కాకపోతే, ఈసారి ధనుష్ నటన కన్నా హీరోయిజానికే అతిగా ప్రాధాన్యం ఇచ్చినట్టున్నారు. మొదట రైలులో మర్డర్ దగ్గర నుంచి క్లైమాక్స్ లో దీపావళి టపాసులు, తుపాకీలు పేల్చినట్టు మెషిన్ గన్ ఆపరేట్ చేయడం దాకా ఈ తమిళ స్టార్ హీరో... ఏకంగా సూపర్ హీరో అనిపించేస్తారు. ఆ ప్రయాణంలో ఆ పాత్ర, ఆ నటుడు సహజత్వం కోల్పోయారు. లండన్ లోని విలన్ పీటర్ పాత్రలో జేమ్స్ కాస్మో భయంకరుడిగా కనిపించినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి అతి బలహీనుడిగా దర్శనమిస్తారు. హీరో ప్రేమించే అమ్మాయి పాత్రలో ఐశ్వర్య లక్ష్మి చేసిందీ, చేయగలిగిందీ ఏమీ ఉన్నట్టు లేదు. లండన్ లో స్థిరపడ్డ తమిళుడు, శరణార్థుల పాలిట దైవమైన గ్యాంగ్ స్టర్ శివదాస్ పాత్రలో జోసెఫ్ జోజు జార్జ్ చూపులకు బాగున్నారు. కమ్యూనిజమ్ పుస్తకాలు చదువుతూ, శరణార్థుల పాలిట రాబిన్ హుడ్ లాంటి ఆ పాత్రను పండించడానికి వీలైనంత శ్రమించారు. హీరో పక్కన ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విక్కీగా శరత్ రవి ట్రాక్ అక్కడక్కడ నవ్విస్తారు. మిగతావాళ్ళంతా తమ పరిధి మేరకు నటించారు. ఎలా తీశారంటే.. ‘సామాన్యుడినైన నాకు శ్రీలంక తమిళుల సమస్య ఓ న్యూస్ క్లిప్పింగే కానీ, అంతకు మించి నాకు తెలీదు’ అని సినిమాలో ఒకచోట హీరో పాత్ర, హీరోయిన్ తో అంటుంది. ప్రేక్షకుల దృష్టిలోనూ వాస్తవం కూడా అంతే. తమిళులకు సరే కానీ, ఇతర ప్రాంతాల వారికి పెద్దగా తెలియని, పట్టని శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యను స్పృశిస్తూ మణిరత్నం ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (తెలుగులో ‘అమృత’) సహా అనేక సినిమాలు ఇప్పటికే వచ్చాయి. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సిరీస్ లోనూ ఆ నేపథ్యం చూశాం. అయితే, కథలో ఎమోషన్లు ఉంటే ఫరవాలేదు కానీ, అవి లేకుండా ఒక ప్రాంతానికీ, ప్రజానీకానికీ మాత్రమే తెలిసే తమిళ శరణార్థుల సమస్యను ప్రాతిపదికగా తీసుకొని, సినిమా కథంతా నడపడం ఇబ్బందికరమే! ‘జగమే తంత్రం’లో పదే పదే ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంటుంది. గతంలో ‘పిజ్జా’, ‘జిగర్తాండ’ లాంటి సినిమాలతో విభిన్నమైన తమిళ సినీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ తన స్వీయ రచన, దర్శకత్వంలో ఈసారి బాగా నిరాశపరిచారు. లండన్ లో క్రూరమైన మాఫియా లీడర్ లాంటి విలన్ ఎక్కడో మదురైలోని తమిళ దాదా సాయం కోరడం ఓ ఫార్సు. అన్నేళ్ళుగా అక్కడ శివదాస్ అండ్ కో చేస్తున్న దందా ఏమిటో, దాని ఆనుపానులు ఏమిటో – అంత లావు విలన్ కూ హీరో చెప్పేటప్పటి దాకా తెలియదనడం మరో జోక్. వారానికి రెండు మిలియన్ల పౌండ్ల కిరాయికి లండన్ వచ్చిన ఇంగ్లీషైనా రాని మదురై హీరో రెండ్రోజుల్లో శివదాస్ గ్యాంగ్ వ్యవహార శైలి అంతా చెప్పేస్తుంటాడు. అదేమిటో అతనికి అన్నీ అలా తెలిసిపోతుంటాయి. లండన్ వీధుల్లో ‘లిటిల్ మదురై’ అంటూ ఆర్ట్ డైరెక్టర్లు ఓ ఏరియాను తెరపై అందంగా సృష్టించారు. విలన్ తో శివదాస్ రాజీ మీటింగ్ ఘట్టంలోని రెడ్ కలర్ కాంబినేషన్, ఆ చిత్రీకరణ, సినిమాలో చాలా చోట్ల కెమేరా వర్క్ బాగుంది. తమిళ శరణార్థులపై వచ్చే నేపథ్య గీతం మినహా, సినిమా అంతా తమిళ శైలి టప్పాంకుత్తు పాటలే. మాస్ ను మెప్పించడం కోసం పాత హిట్ పాటల్ని సినిమాలో నేపథ్యంలో చాలాసార్లు వాడుకున్నారు. హీరోయిజమ్ మీద చూపిన శ్రద్ధలో కాస్తంత కథ మీదా పెడితే బాగుండేది. కన్వీనియంట్ స్క్రీన్ ప్లే, ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ లాంటి వెన్నో ఈ చిత్రాన్ని కుంగదీశాయి. ‘శ్రీలంకలో తమిళుణ్ణి. తమిళనాడులో నేను శరణార్థిని’ అంటూ ఓ పాత్ర తన ఉనికి కోసం, తన మూలాల కోసం ఆవేదనతో అనే మాటలు ఆలోచింపజేసేవే. కానీ, ఆ బరువైన అంశాల్ని ఎంతో గొప్ప నిర్మాణ విలువలతో తెరకెక్కించినా – కథలో పస లేకపోతే ఏం చేస్తాం! ఏం చూస్తాం!! బలాలు - ధనుష్ స్టార్ ఇమేజ్ - వివిధ లొకేషన్లు, నిర్మాణ విలువలు - కెమెరా, కళా దర్శకత్వం బలహీనతలు లాజిక్ లేని బలహీనమైన కథ, కథనం బోలెడన్ని రచన, దర్శకత్వ లోపాలు, కన్వీనియంట్ స్క్రీన్ ప్లే కథకు అతకని శరణార్థుల అంశం పిచ్చి హీరోయిజం, పొసగని పాటలు కొసమెరుపు: తెరపై విలన్ పదే పదే అడిగినట్టు... ఈ సినిమాకు ‘సే యస్ ఆర్ నో’ అంటే... నిర్మొహమాటంగా... ‘ఎ బిగ్... నో’! ----- రెంటాల జయదేవ -
Vidya Balan: ‘షేర్నీ’ మూవీ రివ్యూ
చిత్రం: ‘షేర్నీ’ తారాగణం: విద్యాబాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా కథ - మాటలు: ఆస్థా టిక్కూ నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ దర్శకత్వం: అమిత్ మసూర్కర్ సంగీతం: బందిష్ ప్రొజెక్ట్, ఉత్కర్ష్ ధోతేకర్ నేపథ్య సంగీతం: బెనిడిక్ట్ టేలర్ కెమెరా: రాకేశ్ హరిదాస్; ఎడిటింగ్: దీపికా కాల్రా రిలీజ్: 2021 జూన్ 18(అమెజాన్ ప్రైమ్) అభివృద్ధి అనేది ఎప్పుడూ సాపేక్షమే! కొన్నిసార్లు అభివృద్ధి పేరిట మనిషి చేసే చర్యలు పురోగతి కన్నా ప్రకృతి వినాశనానికి దారి తీస్తాయి. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటివి ఇప్పుడు విస్తృత ప్రచారంలో ఉన్నా, నిజంగా మనం చేస్తున్నది ఏమిటనేది ఆలోచిస్తే? చిరుతపులుల లాంటి వన్యప్రాణుల విషయంలో మన మాటలకూ, చేతలకూ ఎంత తేడా ఉంది? ఇలాంటి అంశాలన్నిటినీ తీసుకొని, రూపొందిన చిత్రం – ‘షేర్నీ’. మోహన్ లాల్ నటించిన మలయాళ సూపర్ హిట్ ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం పులి’) లాంటివి పులి వేటను జనాకర్షకంగా చూపిస్తే, నాణేనికి రెండు వైపును ‘షేర్నీ’ పరిచయం చేస్తుంది. కథేమిటంటే.. మూడేళ్ళ క్రితం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో అవని అనే ఆడ చిరుతను చంపడం వివాదాస్పదమైంది. అప్పట్లో ప్రమీలా ఇస్తారీ అనే ఆవిడ అడవిలో కొన్ని కిలోమీటర్లు కాలినడకన వెతికి, ఆ ఆడపులి తాలూకు పిల్లల్ని కాపాడింది. ఆ నిజజీవిత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ క్రెడిట్స్ ఏమీ ఇవ్వకుండా ఈ ‘షేర్నీ’ కథను రాసుకున్నారు. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి (హిందీలో షేర్నీ) మనుషుల్ని గాయపరుస్తుంది. పులి బారి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపించి అయినా ఓట్లు కూడగట్టుకోవాలని రాజకీయ నేతల ఆకాంక్ష. రెండు పులికూనల్ని కన్న ఆ ఆడపులిని కాపాడాలనుకొనే ఫారెస్ట్ ఆఫీసర్ హీరోయిన్ (విద్యాబాలన్). పులిని పట్టుకోవడం కన్నా, చంపేసి వీ7రుడినని అనిపించుకోవాలనే వేటగాడు (శరత్ సక్సేనా). ఈ పాత్రల మధ్య షేర్నీ కథ నడుస్తుంది. ఆడపులిని, మహిళా అధికారినీ పోల్చకుండానే పోలుస్తూ, సమాజంలో ఎదురయ్యే కష్టాన్ని సూచనప్రాయంగా చెబుతుందీ కథ. ఎలా చేశారంటే.. ఆడ చిరుతపులి కోసం అన్వేషణ సాగే ఈ చిత్రంలో నిజానికి ప్రధానపాత్ర పులే. కథ అంతా పులి గురించే అయినా, చెప్పదలుచుకున్న పాయింట్ వేరు గనక తెరపై పులి కనిపించే దృశ్యాలు మాత్రం తక్కువే. పులులను కాపాడాలని తపించే కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ విద్యా విన్సెంట్ గా జాతీయ అవార్డు నటి విద్యా బాలన్ బాగా చేశారు. సిల్క్ స్మిత జీవితకథపై వచ్చిన ‘డర్టీ పిక్చర్’ మొదలు గణిత మేధావి ‘శకుంతలా దేవి’ బయోపిక్ దాకా చాలా పాత్రల్లో రాణించిన విద్యాబాలన్ మరోసారి మెప్పించారు. పరిమితులు దాటని అభినయంతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, చివరలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో మనసు కదిలించారు. మానవత్వం లేని మనుషుల కన్నా, మ్యాన్ ఈటర్ అని ముద్ర పడ్డ పులి మీద సానుభూతి కలిగేలా చేశారు. విద్యాబాలన్ తో కలసి పనిచేసే ప్రొఫెసర్ హసన్ నూరానీగా విజయ్ రాజ్ సహజమైన నటనతో మెప్పిస్తారు. చాలాకాలం గుర్తుంటారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన శరత్ సక్సేనా ఇందులో పాతిక పులుల్ని చంపిన వేటగాడు పింటూగా కనిపిస్తారు. విద్యాబాలన్ అత్తగారి పాత్రలో ఇలా అరుణ్, మరీ ముఖ్యంగా విద్యాబాలన్ పై అధికారి బన్సల్ గా చేసిన బ్రిజేంద్ర కాలా తదితరులు ఈ సీరియస్ కథలో రిలీఫ్ ఇస్తారు. ఎలా తీశారంటే.. మన దేశంలో పులుల సంరక్షణకు సంబంధించి వాస్తవ పరిస్థితులను ఈ రెండు గంటల పైచిలుకు సినిమా కళ్ళకు కడుతుంది. మన దగ్గర అటవీ శాఖ ఎలా పనిచేస్తుంటుందో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. అభయారణ్యాల చుట్టుపక్కల గ్రామాలు, అక్కడి ప్రజలు, వాళ్ళ మీద రాజకీయ నాయకుల ప్రభావం లాంటివి ఇందులో చూడవచ్చు. ఒక దశలో పులి కన్నా మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు ఎంత క్రూరమైనవో ఈ కథ గుర్తు చేస్తుంది. పులుల లాంటి వన్యప్రాణుల నివాసాలలో గనుల తవ్వకాల లాంటివి చేపట్టి, వాటి ఇంట్లో చేరిన మానవుడు అవి జనావాసాలకు హాని కలిగిస్తున్నాయంటూ వాటినెలా మట్టుబెడుతున్నాడో చెప్పకనే చెబుతుంది. మనుషులు, జంతువులు సహజీవనం చేయాల్సి ఉంది. అది అటవీ, వన్యప్రాణి సంరక్షకులు పదే పదే చెప్పేమాట. కానీ, దాన్ని గాలికి వదిలేసి పులుల వేట మనిషి వీరత్వానికి ప్రతీక అనుకొంటూ, స్పృహ లేని పనులు చేయడాన్ని చర్చకు పెడుతుంది. నైట్ ఎఫెక్ట్ లో, అందమైన అటవీ ప్రాంతాల చిత్రీకరణలో రాకేశ్ హరిదాస్ పనితనం కనిపిస్తుంది. అయితే, ‘షేర్నీ’ చాలా సందర్భాల్లో సినిమాలా కాకుండా, సెమీ డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. తీసుకున్న అంశం మంచిదైనా, దాన్ని మరింత ఎమోషనల్ గా, ఎఫెక్టివ్ గా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కథ చాలా నిదానంగా నడిచిందనీ అనిపిస్తుంది. మొదట్లో కన్నా పోనూ పోనూ కథ, కథనం చిక్కబడి, చివరకు ఆసక్తి పెరుగుతుంది. అప్పటికి కాస్తంత ఆలస్యమైపోతుంది. అది ఈ సినిమాకు ఉన్న బలహీనత. అయితే, ‘న్యూటన్’ చిత్రం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు అమిత్ మసూర్కర్ ఈసారీ తన మార్కు చూపారు. మనిషికీ, జంతువుకూ మధ్య ఉండే ఘర్షణ నేపథ్యంలోనే అధికారుల అవినీతి, నేతల ఎన్నికల రాజకీయ స్వార్థాలు, అటవీ గ్రామాల్లోని గిరిజనుల మంచితనం – ఇలా చాలా అంశాలను చూపెట్టారు. ఆశావాదం అతిగా చూపకుండా, మనసు చివుక్కుమనే ముగింపుతో ఆలోచింపజేశారు. ఆ మేరకు ‘షేర్నీ’ సక్సెస్. కొసమెరుపు: ఓ సెమీ డాక్యుమెంటరీ శైలి సినిమా! బలాలు ఎంచుకున్న కథాంశం కెమెరా వర్క్ విద్యాబాలన్ సహా పలువురి నటన బలహీనతలు స్లో నేరేషన్ డాక్యుమెంటరీ తరహా కథనం పులికూనల సంరక్షణను హడావిడిగా ముగించడం - రెంటాల జయదేవ -
వెండితెరపై... విజువల్ పొయట్
పదచిత్రాలతో దృశ్యాన్ని బొమ్మకట్టించే ఓ కవి... వెండితెరపై దృశ్యాలను కవిత్వీకరిస్తే ఏమవుతుంది? కవికి ఉండే సహజమైన సున్నితత్వంతో సమాజాన్నీ, మనుషుల్నీ తెరపై చూపెడితే ఆ కళాసృజనలు ఎలా ఉంటాయి? తెలియాలంటే... భారతీయ సినిమా జెండాను అంతర్జాతీయంగా ఎగరేసిన ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా సినిమాలు చూడాలి. జూన్ 10న తన 77వ ఏట బుద్ధదేవ్ దాస్‌గుప్తా కన్నుమూశారనగానే, ఒక్క బెంగాలీలే కాదు... భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగింది అందుకే! వెండితెరపై ఆయనది విజువల్ పొయిట్రీ. దర్శకుడి కన్నా ముందు పేరున్న కవి అయిన బుద్ధదేవ్ ఏకంగా తొమ్మిది కవితా సంపుటాలు, 4 నవలలు రాయడం విశేషం. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దర్శకుడిగా ఆయన తీసినవి అతికొద్ది ఫీచర్ ఫిల్మ్‌లే. అన్నీ ఆణిముత్యాలే. అవార్డు విన్నర్లే! దిగ్దర్శక త్రయం సత్యజిత్ రే, మృణాల్ సేన్, ఋత్విక్ ఘటక్ తరువాత బెంగాలీ చలనచిత్ర చయనికను, ఆ మాటకొస్తే భారతీయ సినిమాను అంతర్జాతీయంగా దీప్తిమంతం చేసిన దర్శకతార బుద్ధదేవ్. అయితే, ఆయన మాత్రం ఆ దర్శక త్రిమూర్తులతో తనను పోల్చవద్దనేవారు. సమకాలికులైన జి. అరవిందన్, అదూర్ గోపాలకృష్ణన్, శ్యామ్ బెనెగల్ల తరానికి చెందినవాడినని వినయంగా చెప్పుకొనేవారు. చిన్నతనంలో రవీంద్రనాథ్ టాగూర్ ప్రభావంతో కవిగా కలం పట్టిన బుద్ధదేవ్‌కు కోల్‌కతా అంటే ప్రాణం. బెంగాల్‌లోని పురూలియా ప్రాంతంలో 1944లో జన్మించిన బుద్ధదేవ్ కోల్‌కతాలోనే చదువుకున్నారు. ఆ నగరాన్ని ఆయన తెరపై చూపించిన తీరు గురించి ఇవాళ్టికీ సినీజనం చెప్పుకుంటారంటే, దాని వెనుక ఉన్న ఆయన ప్రేమే అందుకు కారణం. కోల్‌కతాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన మొదలైంది ఎకనామిక్స్ లెక్చరర్‌గా! కానీ, చెబుతున్న ఆర్థిక సిద్ధాంతానికీ, చూస్తున్న సామాజిక–రాజకీయ వాస్తవికతకూ మధ్య ఉన్న తేడాతో ఆయన మబ్బులు విడిపోయాయి. లెక్కల కన్నా కళల మీద మక్కువే జయించింది. అలా బెంగాల్‌లోని సాంస్కృతిక, కళా జీవితంతో పాటు నక్సల్బరీ ఉద్యమం ఆయనను ప్రభావితం చేసింది. బుద్ధదేవ్ సెల్యులాయిడ్ బాంధవ్యం 1960ల చివరలో డాక్యుమెంటరీలతో మొదలైంది. ఆ తరువాత పదేళ్ళకు ఫీచర్ ఫిల్మ్‌ల స్థాయికి ఎదిగింది. దేశంలో 21 నెలల అంతర్గత ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత బెంగాల్లో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం వచ్చింది. రాజకీయ కార్యకర్తల్ని బేషరతుగా వదిలేయమంటున్న రోజులు. అంతటా రాజకీయ, సాంస్కృతిక సమరోత్సాహం నెలకొన్న సమయం. సరిగ్గా అప్పుడు ముప్పయ్యో పడిలోని బుద్ధదేవ్ తన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘దూరత్వ’ (1978)తో జనం ముందుకు వచ్చారు. సాక్షాత్తూ సత్యజిత్ రే కవితాత్మకంగా ఉందంటూ ఆ చిత్రాన్ని ప్రశంసించారు. ఆ తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించిన బుద్ధదేవ్ ఆ వెంటనే ‘నీమ్ అన్నపూర్ణ’తో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. కార్లోవీ వారీ, లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆ చిత్రానికి అవార్డులు రావడం అందుకు దోహదమైంది. ఆయన ఇక వెనుతిరిగి చూసింది లేదు. బుద్ధదేవ్ సినీ ప్రయాణమంతా సామాన్యులపట్ల అక్కర, కవితా దృష్టి – సంగమమే. అందుకే, ఆయన ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసూ గెలిచారు. వెండితెరను కవితాత్మకంగా తీర్చిదిద్దిన బుద్ధదేవ్ దర్శకత్వంలో ‘బాగ్ బహదూర్’, ‘చరాచర్’, ‘లాల్ దర్జా’, ‘కాల్‌పురుష్’, ‘మోండో మేయేర్ ఉపాఖ్యాన్’, మిథున్ చక్రవర్తి నటించిన ‘తహదేర్ కథ’ (1992) ఎంతో పేరొం దాయి. రియలిజమ్ను దాటి, మ్యాజికల్ రియలిజమ్, సర్రియలిజమ్ వైపు ప్రేక్షకులను ఆయన తన సినిమాతో తీసుకువెళ్ళారు. మ్యాజికల్ రియలిజమ్నూ, కవితాత్మనూ కలగలిపి, తెరపై చూపారు. నిజానికి, ‘సినిమాలో కథ కన్నా కీలకమైనది మనం కళ్ళకు కట్టించే బొమ్మ’ అని ఆయన అభిప్రాయపడేవారు. చివరి దాకా ఆ పద్ధతే అనుసరించారు. ఫీచర్ ఫిల్మ్స్ చేస్తూనే వాటి రూపకల్పనకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం కోసం అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీలు తీయడమూ కొనసాగించారు. సంగీతం సినిమాల్లో అంతర్భాగమని నమ్మిన బుద్ధదేవ్ భారతీయ, పాశ్చాత్య శైలుల్ని మేళవిస్తూ, తరచూ తానే స్వయంగా సంగీతం సమకూర్చుకొనడం మరో విశేషం. రవీంద్రనాథ్ టాగూర్ పెయింటింగ్స్ వల్ల చిత్రకళ మీద ప్రేమ పెంచుకున్న బుద్ధదేవ్‌కు జానపద కళలన్నా, కళారూపాలన్నా అమితమైన ఇష్టం. అందుకు తగ్గట్టే ఆయన తన ‘బాగ్ బహదూర్’ (1989) చిత్రాన్ని మన తెలుగునాట ప్రసిద్ధమైన జానపద కళారూపం పులివేషాల నేపథ్యంలో తీర్చిదిద్దడం గమనార్హం. తెలుగమ్మాయి అర్చన నటించిన ఆ సినిమా ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రం. చిన్నప్పుడు నేతాజీని ఆరాధించి, యౌవనంలో నక్సలిజమ్ వైపు మొగ్గిన ఈ బెంగాలీబాబు తరువాత ఆ ప్రభావం నుంచి బయటపడ్డారు. ‘దూరత్వ’, ‘గృహజుద్ధ’, ‘అంధీగలీ’ (1984) చిత్రాల్లో ఆనాటి సంక్షుభిత సమయాలపై తనదైన సినీ వ్యాఖ్యానం చేశారు. ఆయన చిత్రాల్లో 5 నేషనల్ ఫిల్మ్ అవార్డులు సాధిస్తే, ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మరో 2 సార్లు (‘ఉత్తర’, ‘స్వప్నేర్ దిన్’) జాతీయ అవార్డులు దక్కాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు అన్నీ లెక్క తీస్తే బుద్ధదేవ్ ఖాతాలో ఏకంగా 32 నేషనల్ అవార్డులు చేరడం ఓ రికార్డు ఫీట్! సత్యజిత్ రే మరణానంతరం భారతీయ సినిమాను మళ్ళీ అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఘనత కూడా బుద్ధదేవ్దే!! టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ సినిమా’ విభాగంలో ఏకంగా 8 సార్లు చోటు దక్కించుకున్నారు. ఆయన సృజనాత్మక కృషికి గుర్తింపుగా, 2008లో స్పెయిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జీవన సాఫల్య పురస్కారం దక్కింది. యౌవనంలో బుద్ధదేవ్‌ను మలిచి, సినిమా వైపు మళ్ళించింది కలకత్తా ఫిల్మ్ సొసైటీ. అక్కడ చూసిన చార్లీ చాప్లిన్, అకిరా కురసావా, విటోరియో డెసికా, రొసెల్లినీ లాంటి ప్రసిద్ధుల చిత్రాలు. అంత బలమైన ముద్ర వేసిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో బుద్ధదేవ్ చివరి దాకా సన్నిహితంగా మెలిగారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినా, చివరి వరకు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో సిన్సియర్ యాక్టివిస్ట్‌గానే పనిచేశారు. దేశంలోని ఏ మారుమూల, ఏ ఫిల్మ్ సొసైటీ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా, ఆయన స్వయంగా వెళ్ళేవారు. బుద్ధదేవ్ సతీమణి సోహిణీ దాస్‌గుప్తా కూడా దర్శకురాలే. ఇద్దరమ్మాయిలకు జన్మనిచ్చిన వారిది అన్యోన్య దాంపత్యం. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, కిడ్నీ సమస్యతో కన్నుమూసే వరకు బుద్ధదేవ్ కవిత్వాన్నీ, సినిమానూ శ్వాసిస్తూ వచ్చారు. ఒక్క మాటలో– బుద్ధదేవ్ ఓ అద్భుతమైన దర్శకుడు. అపూర్వమైన కవి. అమోఘమైన టీచర్. అన్నిటికీ మించి మనసున్న మంచి మనిషి. ఆ వ్యక్తిత్వం పరిమళించిన ఆయన సృజనాత్మక కృషి ఎప్పటికీ వసివాడని జ్ఞాపకం. – రెంటాల జయదేవ -
Pachchis Movie: ‘పచ్చీస్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘పచ్చీస్’ తారాగణం: రామ్స్, శ్వేతావర్మ సంగీతం: స్మరణ్; కెమెరా: కార్తీక్ పర్మార్ నిర్మాతలు: కౌశిక్, రామసాయి దర్శకత్వం: శ్రీకృష్ణ, రామ సాయి ఓటీటీ: అమెజాన్ కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్లతో థియేటర్లు మూసేసిన పరిస్థితుల్లో ఇప్పుడు చూపంతా ఓటీటీల పైనే! వరుసగా బోలెడన్ని సినిమాలు, సిరీస్‌లు ఏదో ఒక ఓటీటీలో వస్తున్నాయి. ఖాళీ ఉంటే కాలం ఖర్చు చేయడానికి ఓకే కానీ, వీటిలో క్వాలిటీవి ఎన్ని వస్తున్నాయి? ఇలాంటి ఆలోచనలెన్నో రేకెత్తిస్తుంది – లేటెస్ట్ ఓటీటీ రిలీజ్ ‘పచ్చీస్’. కథేమిటంటే..: కలవారి బిడ్డ అయినా ఈజీ మనీకి అలవాటు పడి, గ్యాంబ్లింగ్‌లో తిరిగే కుర్రాడు అభిరామ్ (రామ్స్). ఎలాగోలా డబ్బు సంపాదించాలనే కాంక్షతో అనేక అబద్ధాలతో, అడ్డదోవలు తొక్కుతుంటాడు. జీవితాన్ని జూదంగా నడిపేస్తుంటాడు. అదే సమయంలో రాజకీయ నాయకులైన గంగాధర్ (‘శుభలేఖ’ సుధాకర్), బసవరాజు (విశ్వేందర్ రెడ్డి) మధ్య ఆధిపత్యం కోసం పోరాటం సాగుతుంటుంది. బెట్టింగ్‌లో ఓడిపోయిన లక్షల కొద్దీ డబ్బు కోసం బసవరాజును ఆశ్రయిస్తాడీ కుర్రాడు. రాజకీయ నేతల మధ్య గొడవలో డబ్బు కొట్టేసి, దాంతో పబ్బం గడుపుకోవాలని అనుకుంటాడు. ఆ క్రమంలోనే కనిపించకుండా పోయిన అన్న కోసం వెతికే చెల్లెలు అవంతి (శ్వేతావర్మ) ఎదురవుతుంది. అక్కడ నుంచి సవాలక్ష మలుపులు, మరిన్ని పాత్రల మధ్య ఈ జూదం ఏమై, ఎవరి పచ్చీస్ (పాచికలు) పారి, చివరికి ఏమైందన్నది సుదీర్ఘమనిపించే 2 గంటల పైగా నిడివి సిన్మా. ఎలా చేశారంటే..: నాగార్జున, విజయ్ దేవరకొండ, రామ్, రానా, అడివి శేషు – ఇలా తెలుగు సినీ తారలెందరికో ఫ్యాషన్ డిజైనరైన భీమవరం కుర్రాడు రామ్స్ ఇందులో జులాయి కుర్రాడిగా, మరో ఇద్దరు స్నేహితుల్ని వెంటేసుకొని కనిపిస్తారు. నటనలో ఈజ్ ఉన్నా, రాసిన పాత్రలో దమ్ము లేకపోవడం లోపమైంది. కొద్ది వారాలుగా కనిపించని అన్నయ్య కోసం వెతికే చెల్లెలి పాత్రలో, తానే ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా ప్రవర్తిస్తుంటారు శ్వేతావర్మ. ఆ పాత్రకూ తీరూతెన్నూ కష్టపడి వెతుక్కోవాల్సి ఉంటుంది. సొంత పవర్ ప్రాజెక్ట్ కోసం శ్రమించే పొలిటీషియన్‌గా ‘శుభలేఖ’ సుధాకర్ ఉన్నంతలో బాగా చేశారు. జయ్‌చంద్ర, క్యాసినో ఓనర్ > రవివర్మ సహా ఇంకా చాలామంది ఉన్నారు. అయితే, చిట్టి పొట్టి మాటల డైలాగులతో లేనిపోని ఉద్విగ్నత రేపాలనే రచనా లోపం భావోద్వేగ నటనకు తావు లేకుండా చేసిందనిపిస్తుంది. ఎలా తీశారంటే..: ఓటీటీ ట్రెండ్‌కు తగ్గట్టే ఇదో క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ చిత్రం అని ప్రకటించారు. కానీ, సస్పెన్స్ మాటెలా ఉన్నా... బోలెడంత గందరగోళం కథలో, కథనంలో మూటగట్టుకున్న చిత్రం ఇది. ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఎప్పటికప్పుడు కొత్త పాత్రలొస్తూ పోతుంటాయి. దేనికీ ప్రాధాన్యం ఉండదు. ప్రతి పాత్రా ఏదో ఫిలాసఫీనో, గంభీరమైన విషయమో చెబుతున్నట్టు మాట్లాడుతుంది. పైగా, ఎక్కడో జరిగే ఏవో విషయాలూ జైలులో ఉన్నవాళ్ళతో సహా అన్ని పాత్రలకూ తెలిసిపోతుంటాయి. పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడానికే దాదాపు సగం సినిమా గడిచిపోతుంది. అలాగే ప్రధాన పాత్రధారి ఒక చోట ఓ పోలీసాఫీసర్‌తో ‘‘ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అంటాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు కలిగే ఫీలింగూ అదే. అభిరామ్ పాత్రను జులాయిలా చూపించారు. కాసేపేమో జర్నలిస్టు అని డైలాగుల్లో అనిపిస్తారు. ఇక, చివరలో వచ్చే పోలీసాఫీసర్ శంకర్ (దయానంద్ రెడ్డి) పాత్రలైతే, పోలీసు పని కాకుండా, నిందితుల వైపు నిలబడినట్టు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఏం జరుగుతున్నా... నోరెళ్ళబెట్టుకొని పోలీసులు చూస్తున్నట్టనిపిస్తుంది. సినిమా అంతా అభిరామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినట్టు అనిపించి, చివరకు వచ్చేసరికి వేరెవరికో ఇన్వెస్టిగేషన్ క్రెడిట్ ఇవ్వడం కూడా వీక్షకులు జీర్ణించుకోలేరు. ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌లో డార్క్‌గా కనిపించే ఈ సినిమాలో కెమేరా వర్క్, ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంటాయి. పాటలేమీ లేవన్న మాటే కానీ, ఆ లోటేమీ పెద్దగా ఫీల్ కాము. ఎడిటర్ తన కత్తెర పదును చూపితే, రచన – దర్శకత్వ లోపాలు కొన్నయినా కవరయ్యేవి. ‘‘ముగించలేనిది ఎప్పుడూ మొదలుపెట్టద్దు’’ అని ఇందులో ఓ పాత్ర అంటుంది. బహుశా, ఆ విషయం ఈ దర్శక, రచయితలకూ వర్తిస్తుంది. కథాకథనాన్ని సరిగ్గా మొదలుపెట్టలేకపోవడంతో పాటు ముగింపూ చేయలేదనిపిస్తుంది. కంటెంట్ లేని సీన్లు సవాలక్ష వచ్చిపోయే నేపథ్యంలో... పాత్రలతో పాటు ప్రేక్షకులనూ కన్ఫ్యూజ్ చేస్తుంది. కొసమెరుపు: ఫాస్ట్ ఫార్వర్డ్లోనూ ముందుకెళ్ళని స్లో నేరేషన్ – ప... ప... ఛీ.. ఛీ...స్. – రెంటాల జయదేవ -
Cab Stories: ‘క్యాబ్ స్టోరీస్’ మూవీ రివ్యూ
వెబ్ సిరీస్: ‘క్యాబ్ స్టోరీస్’; తారాగణం: దివి, శ్రీహాన్, గిరిధర్, ధన్‌రాజ్; సంగీతం: సాయి కార్తీక్; నిర్మాత: ఎస్. కృష్ణ; రచన – దర్శకత్వం: రాజేశ్; రిలీజ్: మే 28; ఓటీటీ: స్పార్క్ చిన్న చిన్న సంఘటనల్ని కూడా మంచి కథగా అల్లుకోవచ్చు. అల్లిక బాగుండి, ఆసక్తిగా తెర మీద చెప్పగలిగితే మనసుకు హత్తుకుంటుంది. అలా ఓ క్యాబ్ ప్రయాణంతో మొదలై... జరిగిన అనేక సంఘటనల సమాహారాన్ని సిరీస్‌గా తీస్తే? కానీ, ‘చూపెట్టాల్సిన’ సంఘటననూ, కథనూ... ‘చెప్పాలని’ ప్రయత్నిస్తే ఏమవుతుంది? తాజా వెబ్ సిరీస్ ‘క్యాబ్ స్టోరీస్’ ఆసాంతం చూస్తే అర్థమవుతుంది. కథేమిటంటే..: హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ గిరి (గిరిధర్). ఓ కస్టమర్‌ను దింపేటప్పుడు అనుకోకుండా అతను వదిలేసిన ఓ డ్రగ్ ప్యాకెట్ కంట పడుతుంది. అదే సమయంలో ఓ పబ్ దగ్గర షాలిని (‘బిగ్‌బాస్4’ ఫేమ్ దివి) అనే అమ్మాయి ఆ క్యాబ్ ఎక్కుతుంది. ఆ డ్రగ్ ప్యాకెట్‌ను దాచడానికి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్‌లో పెడతాడు. ఆ తరువాత జరిగే పరిణామాలతో ఆ ప్యాకెట్ రకరకాల ప్లేసులు మారుతుంది. షాలినిని వాడుకోవాలనుకొనే లవర్ సాగర్ (శ్రీహాన్), షాలిని ఫ్రెండ్ (నందిని), క్యాబ్ డ్రైవర్‌కు ఫ్రెండైన కానిస్టేబుల్ రుద్రనేత్ర (ధన్‌రాజ్) – ఇలా ఇతర పాత్రలూ వస్తాయి. ఆ ప్యాకెట్లో డ్రగ్ కాకుండా ఇంకేముంది? దాన్ని దక్కించుకోవాలని విలన్లు ఎలా ప్రయత్నించారు? ఏమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: ఈ కథలో ప్రధాన పాత్రధారి, కథ నడవడానికి సూత్రధారి క్యాబ్ డైవర్. కథలో ఆద్యంతం కనిపించే నిడివి ఎక్కువున్న ఆ పాత్రలో నటుడు గిరిధర్ కనిపించారు. జనం గుర్తుంచుకొనే పాత్ర ఆయనకు చాలా రోజులకు దక్కింది. పూర్తి మంచివాడూ కాక, అలాగని పూర్తి చెడ్డవాడూ కాక మధ్యస్థంగా ఉండే ఆ పాత్రలోని కన్ ఫ్యూజన్ పాత్రధారణలోనూ ప్రతిఫలించింది. ‘బిగ్‌బాస్–4’ ఫేమ్ దివి మరో ప్రధాన పాత్రధారిణి. ‘మహర్షి’ చిత్రంలో హీరోయిన్ పూజాహెగ్డే ఫ్రెండ్‌గా కాసేపు కనిపించిన దివి, తాజా ఫేమ్ తరువాత చేసిన పెద్ద రోల్ ఇదే. అమాయకంగా ప్రియుణ్ణి నమ్మేసే షాలిని పాత్రలో ఆమె చూడడానికి బాగున్నారు. తొలి పాటలో గ్లామర్ దుస్తుల్లో డ్యాన్సూ బాగా చేశారు. అయితే, ఓవరాల్‌గా ఆ పాత్రలో చేయగలిగింది పెద్దగా లేదు. ఒకమ్మాయితో ఎంగేజ్మెంట్కు సిద్ధమవుతూనే మరోపక్క దివిని ముగ్గులోకి దింపాలని ప్రయత్నించే ప్రేమికుడిగా టీవీ స్టార్ శ్రీహాన్ కనిపిస్తారు. సినిమాలో కమెడియన్లు ధన్ రాజ్, ప్రవీణ్ (హెరాసింగ్ హెచ్.ఆర్. మేనేజర్), ఒకే సీన్లో కనిపించి నవ్వించే అనంత్ (సైకియాట్రిస్ట్ శర్మ) – ఇలా సుపరిచితులూ చాలా మంది ఉన్నారు. కానీ ఏ పాత్రకూ పూర్తి ప్రాధాన్యం, ఓ పరిపూర్ణత ఉండవు. విలన్ పాత్రలనైతే గుర్తుపట్టడం, పెట్టుకోవడం కష్టం. ఎలా తీశారంటే..: దర్శక, నిర్మాత రామ్ గోపాల్‌వర్మ భాగస్వామిగా మొదలైన కొత్త ఓటీటీ ‘స్పార్క్’ వరుసగా సినిమాలు, సిరీస్ లతో ముందుకొస్తోంది. ఇటీవలే ‘డి కంపెనీ’ తరువాత ఇప్పుడీ ‘క్యాబ్ స్టోరీస్’ రిలీజ్ చేశారు. కథ మొదట్లో, చివరల్లో టైటిల్స్ పడుతుండగా వచ్చే ‘కిస్కో పతా హై సాలా...’ పాట విభిన్నమైన చిత్రీకరణతో ఆసక్తి రేపుతుంది. క్యాబ్‌లో కథ మొదలైనప్పుడు బాగున్నా, గతానికీ, వర్తమానానికీ పదే పదే డైలాగుల ప్రయాణం ఒక దశ దాటాక ఆకర్షణ కోల్పోయింది. క్యాబ్ డ్రైవర్ మొదట మంచివాడన్నట్టు మొదలుపెట్టి, కాసేపయ్యే సరికి అతనిలోని అతి తెలివి చూపించి, చివరకు వచ్చేసరికి అతనా డ్రగ్ ప్యాకెట్ మార్పిడి ఎందుకు చేశాడనేది మూడు ముక్కల్లో చెప్పడం – చూసేవాళ్ళకు ఓ పట్టాన ఎక్కదు. అలాగే, మెడికల్ షాపు దగ్గర దివి ఉండగానే, డ్రగ్ మార్చేయడం సినిమాటిక్ కన్వీనియ¯Œ ్సగా సరిపెట్టుకోవాలి. నిర్మాణ విలువలు పరిమితంగానే ఉన్న ఈ సిరీస్‌లో బలమైన లవ్ స్టోరీ లేకపోయినా సినిమాటిక్‌గా ఓ పాట పెట్టారు. అలాగే, సీన్లో లేని ఉద్విగ్నతను కూడా సంగీతం ద్వారా సృష్టించడానికి సంగీత దర్శకుడు సాయి కార్తీక్ శ్రమించారు. కిస్కో... పాట చిత్రీకరణలో కెమేరా వర్క్ బాగుంది. కథలోనూ అక్కడక్కడ మెరుపులున్నాయి. కానీ, మొత్తం మీద కథారంభంలో క్రియేట్ చేసిన ఇంట్రస్ట్‌ని కాస్తా స్లో నేరేషన్, అనవసర సన్నివేశాలు, అవసరం లేని సినిమాటిక్ పోకడలతో దర్శక, రచయితలే జారవిడిచారనిపిస్తుంది. నిడివి గంటన్నరే అయినా, చాలాసేపు చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. అర్ధోక్తిగా ఈ భాగం ముగించి, వాల్యూమ్2 అని టైటిల్ వేయడంతో మరో పార్టు వస్తుందని సిద్ధపడాలి. బలాలు: కొన్ని ఆసక్తి రేపే ట్విస్టులు నటి దివి స్క్రీన్‌ప్రెజెన్స్ ధన్‌రాజ్, ప్రవీణ్, అనంత్ లాంటి సుపరిచిత కమెడియన్లు ‘కిస్కో పతాహై...’ సాంగ్ బలహీనతలు: సాగదీత స్లో నేరేషన్ పండని లవ్ స్టోరీ ఏ పాత్రకూ సమగ్రత లేకపోవడం సినిమాటిక్ సీన్లు, స్క్రీన్ ప్లే కొసమెరుపు: షార్ట్ ఫిల్మ్‌కు ఎక్కువ... సిరీస్‌కు తక్కువ జర్నీ! – రెంటాల జయదేవ -
సినిమాలో బోల్డ్ కంటెంట్ పెరిగిందా?
-
‘బట్టల రామస్వామి బయోపిక్కు’ మూవీ రివ్యూ
చిత్రం: ‘బట్టల రామస్వామి బయోపిక్కు తారాగణం: అల్తాఫ్ హసన్, శాంతీరావు, లావణ్యారెడ్డి, సాత్విక, భద్రం, ధన్ రాజ్ మాటలు - పాటలు: వాసుదేవమూర్తి శ్రీపతి; కళ: ఉపేంద్రరెడ్డి; కెమేరా: పి.ఎస్.కె. మణి; ఎడిటింగ్ – వి.ఎఫ్.ఎక్స్: సాగర్ దాడి నిర్మాతలు: వి. రామకృష్ణ వీరపనేని (‘మ్యాంగో’ రామ్), ఐ. సతీశ్ కుమార్ సంగీతం - దర్శకత్వం: రామ్ నారాయణ్ నిడివి: 137 నిమిషాలు రిలీజ్: 2021 మే 14 ఓటీటీ వేదిక: జీ 5 ప్రతి మనిషికీ ఒక కథ ఉంటుంది. జీవితంలో ఏదో ఒక వ్యధ ఉంటుంది. కాకపోతే, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల మీద తప్ప సామాన్యుల జీవితాలు ఎవరికీ పెద్దగా పట్టవు. పట్టినా, తెరకెక్కవు. అవి ఎవరికి, ఏమంత ఆసక్తిగా ఉంటాయనేది వాళ్ళ లాజిక్. కానీ, రకరకాల ట్విస్టులున్న బట్టల రామస్వామి అనే ఓ సామాన్యుడి జీవితకథ అంటూ అతని జీవితాన్ని తెర కెక్కిస్తే? అలా దర్శక, రచయితలు అల్లుకున్న ఓ కాల్పనిక కథ – ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఎప్పుడో వంశీ ‘లేడీస్ టైలర్’ సినిమా నాటి సీన్లతో, బిగువైన స్క్రిప్టు లేకుండా, సరదా అనుకొంటూ సరసం పాలు ఎక్కువైన సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇది చూసి తెలుసుకోవచ్చు. కథేమిటంటే..: రామస్వామి (అల్తాఫ్ హసన్)ది చిన్నప్పటి నుంచి ఒకటే మాట – తన ఇష్టదైవం శ్రీరాముడిలా ఏకపత్నీ వ్రతంతో ఉండాలి. అలాగే, చీరల వ్యాపారం చేయాలి. అలాంటి పల్లెటూరి రామస్వామి తండ్రిపోయిన క్షణంలోనే పూసలమ్మే జయప్రద (శాంతీరావు)తో ప్రేమలో పడతాడు. కులాలు వేరైనా, మిత్రుడు (కమెడియన్ భద్రం) సాయంతో పెళ్ళి చేసుకుంటాడు. భార్య సొమ్ముతో చీరల వ్యాపారమూ పెడతాడు. కానీ, అనుకోని పరిస్థితుల్లో భార్య మాట కాదనలేక, ఆమె పిచ్చి చెల్లెలు జయసుధ (లావణ్యారెడ్డి)నీ పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఓ గూడెంలో జరిగిన మోసంలో... ‘చీరలు కొనడానికి పిలిచిన పిల్లనే చెరిచాడు’ అనే చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. గూడెం పిల్ల సిరి (సాత్వికా జై)ని పెళ్ళి చేసుకుంటాడు. సవతుల మధ్య పోరాటం మొదలవుతుంది. ఇంటి గుట్టు రచ్చకెక్కుతుంది. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడిగా రామస్వామి ఎలాంటి చిక్కులను ఎదుర్కొన్నాడు, చివరకు ఏమైందన్నది మిగతా కథ. హీరో పాత్రకు పక్కనే అతని స్నేహితుడి సంసార గాథ ఓ సైడ్ ట్రాక్ గా సాగుతుంది. ఎలా చేశారంటే..: బట్టల రామస్వామి పాత్రలో అల్తాఫ్ హసన్ బాగున్నారు. సహజంగా నటించారు. థియేటర్ ఆర్ట్స్ లో పిహెచ్.డి. చేసి, సినిమా నటనలో పలువురికి శిక్షణనిచ్చిన అల్తాఫ్ ఈ సినిమాకు ఆయువుపట్టు. ఇక, అతను పెళ్ళాడిన ముగ్గురు స్త్రీలుగా పూసలమ్మే జయప్రదగా శాంతీ రావు, ఆమె చెల్లెలైన పిచ్చిపిల్ల జయసుధగా లావణ్యారెడ్డి, గూడెం అమ్మాయి సిరి పాత్రలో సాత్వికా జై కనిపిస్తారు. వాళ్ళు తమకిచ్చిన పాత్రలకు ఉన్నంతలో న్యాయం చేశారు. కథానాయకుడి ఫ్రెండ్ అయిన ఆర్.ఎం.పి. డాక్టర్ పాత్రలో భద్రం కాసేపు కామెడీ చేస్తారు. కైలాసం నుంచి వచ్చిన భృంగిని అంటూ కమెడియన్ ధన్ రాజ్ కాసేపు తెరపై దర్శనమిస్తారు. చాలామంది రంగస్థల నటులు ఈ సినిమాతో వెండితెరకెక్కారు. ఎలా తీశారంటే..: మనమొకటి అనుకుంటే దేవుడొకటి ఇస్తాడు. ఏది ఇచ్చినా జీవితాన్ని ఫిర్యాదులు లేకుండా హాయిగా సాగించాలనే కాన్సెప్టును బట్టల రామస్వామి కథ ద్వారా చెప్పాలనుకున్నట్టున్నారు దర్శకుడు రామ్ నారాయణ్. తీసేవాడుండాలే కానీ... ప్రతి ఒక్కడి జీవితం ఓ బయోపిక్కు అని సినిమా ప్రారంభంలోనే ఓ పాత్రతో అనిపిస్తారు – దర్శక, రచయితలు. ఆ రకంగా తాము చూపించనున్న బట్టల రామస్వామి అనే వ్యక్తి తాలూకు జీవితానికి ఓ ప్రాతిపదిక వేస్తారు. అయితే, అనేక ట్విస్టులున్న రామస్వామి కథను తెరపై చూపించడంలోనే రకరకాల పిల్లిమొగ్గలు వేశారు. ఒకే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ముగ్గురిని పెళ్ళాడాల్సిన సందర్భం వస్తే – ఎలా ఉంటుందనే అంశాన్ని బయోపిక్కు అనే జనానికి తెలిసిన టైటిల్ తో బాగానే మార్కెట్ చేసుకున్నారు. అయితే, భార్యాభర్తలు - వాళ్ళ మధ్య శారీరక సంబంధాల మీద కాస్తంత ఎక్కువగానే ఫోకస్ చేయడంతో... కథలో కాస్తంత శృంగారం పాలు హెచ్చింది. ‘ఒక రోజు నీళ్ళయితే తోడచ్చు... రెండు రోజుల నీళ్ళయితే తోడచ్చు... నెల రోజుల నీళ్ళు ఎలా తోడాలి’ (హీరోతో కమెడియన్ భద్రం) అంటూ సభ్యత దాటిన డైలాగులూ పెట్టారు. ఒకరికి ముగ్గురిని పెళ్ళాడిన ఈ కథానాయకుడి కథ... ఒకేసారి ముగ్గురితో సంసారం లాంటి ఎడల్ట్ కామెడీ సీన్లతో కొంతసేపయ్యాక పిల్లలతో సహా ఇంట్లో అందరితో కలసి చూడడం కొద్దిగా ఇబ్బందే. రెండో పెళ్ళి తరువాత నుంచి కథలో, కథనంలో పట్టుసడలింది. స్లో నేరేషన్ సరేసరి. దానికి తోడు నిజాయతీగా చెప్పాల్సిన కథలో కొంత అనవసరమైన సినిమాటిక్ అంశాలు కూడా జొప్పించారు. గూడెంలో హీరో మూడో పెళ్ళిలో జానపద గీతంలా ‘లాయి లాయి లబ్జనకా...’ అంటూ ఐటమ్ సాంగ్ లాంటి పాట, డ్యాన్సు పెట్టడం అందుకు ఓ ఉదాహరణ. పెళ్ళికీ, శోభనానికీ కూడా తుపాకీలతో అడవిలో అన్నల సందడి ఓ ఫార్సు. ఒకరకంగా అది కొందరి ఉద్యమ సిద్ధాంతాలను పలచన చేసిన చూపిన అతి సినిమాటిక్ కల్పన. అలాగే, ఆర్.ఎం.పి. డాక్టర్ (కమెడియన్ భద్రం) కాస్తా అనార్కలీ బాబాగా అవతారమెత్తే ట్రాక్ ఓ పిట్టకథ. అది కూడా అసలు కథకు అనుకోని అడ్డంకే. ఇలాంటివి సహజంగానే ప్రధాన కథనూ, పట్టుగా సాగాల్సిన కథనాన్నీ పలచనచేస్తాయి. అందుకే, ఒకరకంగా మంచి టేకాఫ్ తీసుకున్న ‘బట్టల రామస్వామి బయోపిక్కు’... కాసేపయ్యాక క్రమంగా జావ కారిపోయింది. ఆ లోటుపాట్లు లేకుండా చూసుకొని, అనవసరపు హాస్యం కోసం పాకులాడకుండా ఉంటే బాగుండేదనీ అనిపిస్తుంది. ఒక దశ దాటాక సినిమా బోరనిపించడానికీ అదే కారణం. ఫీల్ గుడ్ సినిమా అన్నట్టుగా మొదలై... ఎడల్ట్ కామెడీ లోగి జారి... చివరకు పాప్ సాంగ్ తరహా మేకింగ్ వీడియోతో ముగిసిపోయే ఈ సినిమా ఏ ఫీల్ నూ మిగల్చదు. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి. దర్శకుడు రామ్ నారాయణే సంగీత దర్శకత్వం, ఒకటి రెండు పాటల్లో గానం కూడా చేశారు. సినిమా మొదట్లో వచ్చే ‘ఏలోరి ఏలిక...’, అలాగే సినిమా చివరలో వచ్చే ‘సామీ సంద్రంలో దూకరా నీకు ఈతొస్తే బతుకుతావురా... సంసారంలో దూకితే నువ్వు చేపవైన ఈదలేవురా’ అనే రెండు పాటలు తాత్త్విక ధోరణిలో కొంత బాగున్నాయి. అపరిచిత ముఖాలతో తీసిన ఈ చిన్న సినిమాను సరసం మీద ఆధారపడకుండా, సరైన కథ, కథనంతో ఫీల్ గుడ్ సినిమాగా తీర్చిదిద్ది ఉంటే వేరేలే ఉండేదేమో! భావోద్వేగాలూ ఉండి ఉంటే, ఈ బట్టల రామస్వామి జీవితం ప్రేక్షకుల మనసుకు మరింత హత్తుకొనేదేమో! బలాలు టైటిల్ పాత్రధారి సహజ నటన, కామిక్ టైమింగ్ కొన్ని సరదా సన్నివేశాలు, కొన్ని చోట్ల డైలాగులు తత్త్వం చెప్పే రెండు పాటలు, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బలహీనతలు అనవసర సినిమాటిక్ అంశాలు స్లో నేరేషన్, సెకండాఫ్ కొన్నిచోట్ల పరిమితి దాటిన అసభ్యత మనసుకు పట్టే ఎమోషన్స్ లేకపోవడం కొసమెరుపు: దశ – దిశ తప్పిన ఎడల్ట్ కామెడీ ‘భయో’పిక్కు! - రెంటాల జయదేవ -
Cinema Bandi: సినిమా బండి మూవీ రివ్యూ
చిత్రం: ‘సినిమా బండి’; రచన: వసంత్; నిర్మాతలు: రాజ్ అండ్ డి.కె; దర్శకత్వం: ప్రవీణ్; సిన్మాను ప్రేమించని వాళ్ళు అరుదే. ‘‘మూడు పొద్దులూ భోజనంచేసేదానికే దుడ్లు లేని మనుషులు’’ అనుభవం, పరిజ్ఞానం లేకున్నా పల్లె అమాయకత్వంతో సిన్మా తీయాలని చూస్తే? ఇలాంటి ఘటనలు అనేక చోట్ల చూశాం. యూ ట్యూబ్‌లో వైరల్ చేశాం. హిందీ మొదలు కొన్ని భారతీయ భాషల్లో ఇలాంటి ప్రయత్నాలు గతంలోనే వచ్చినా, తెలుగుదనం నిండి ఉండడం ‘సినిమా బండి’కున్న ప్రత్యేకత. కథేమిటంటే..: గొల్లపల్లిలో ఆటోడ్రైవర్ వీరబాబు (వికాస్ వశిష్ఠ). ఎవరో తన ఆటోలో మర్చిపోయిన కెమెరాతో తమ పల్లెకు పేరొచ్చేలా ఓ సినిమా తీయాలనుకుంటాడు. స్థానిక పెళ్ళిళ్ళ ఫోటోగ్రాఫర్ గణపతి (సందీప్ వారణాసి) సాయం తీసుకుంటాడు. సెలూన్ షాపు మరిడేశ్ (రాగ్ మయూర్)నూ, కూరలమ్మే మంగ (ఉమ)నూ హీరో, హీరోయిన్లుగా ఎంచుకుంటారు. కాస్ట్యూమ్స్ కంటిన్యుటీ దగ్గర నుంచి క్లోజప్, లాంగ్ షాట్ల తేడా కూడా తెలియని ఆటోడ్రైవరే డైరెక్టర్ అవతారమెత్తుతాడు. అతనికి ఎదురైన కష్టనష్టాలు, ఆ ఊరి జనం స్పందనతో సినిమా నడుస్తుంది. ఎలా చేశారంటే..: ఇలాంటి ఓ ఉత్తరాది గ్రామీణ జీవితం ఏళ్ళక్రితమే ‘సూపర్‌మెన్ ఆఫ్ మాలేగా(వ్’ పేరిట డాక్యుమెంటరీగా వచ్చింది. ఇదీ అలాంటి ఇతివృత్తమే. అందుకే కొన్నిసార్లు ఇది సినిమాగా కన్నా సహజత్వం ఎక్కువైన డాక్యు –డ్రామాగా అనిపిస్తుంది. కానీ, పాత్రల్లోని అమాయకత్వం, సహజ నటన, డైలాగ్స్ గంటన్నర పైచిలుకు కూర్చొని చూసేలా చేస్తాయి. ప్రధాన పాత్రధారి వికాస్‌ను పక్కన పెడితే, అత్యధికులకు ఇదే తొలి చిత్రం. షార్ట్ ఫిల్ముల్లో నటించినవాళ్ళే కాబట్టి, కెమేరా కొత్త లేదు. కెమేరామన్ గణపతిగా చేసిన సందీప్ వారణాసి మొదలు కూరగాయలమ్ముతూ హీరోయిన్గా నటించడానికి ముందుకొచ్చే మంగ పాత్రధారిణి ఉమ దాకా అందరూ సహజంగా నటించారు. సినిమా లాభాలతో, ఊరిని బాగు చేయాలనుకొనే ఆటోడ్రైవర్, అతని భార్య (గంగోత్రిగా సిరివెన్నెల)ను చూస్తే, ముచ్చటైన ఓ గ్రామీణ జంటను చూసినట్టనిపిస్తుంది. ఆ కెమిస్ట్రీని తెరపై తేవడంలో దర్శకుడూ బాగా సక్సెస్. ఎలా తీశారంటే..: బాలీవుడ్లో పదేళ్ళ పైగా పనిచేస్తూ, తమదైన మార్కు వేసిన మన తెలుగుబిడ్డలు – ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డి.కె! వారే ఈ చిన్న దేశవాళీ భారతీయ చిత్రాన్ని ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో నిర్మించారు. దర్శకుడు ముందుగా ఇదే కథను ఓ షార్ట్ ఫిల్మ్ ఫక్కీలో పైలట్ వెర్షన్‌లా తీసి నిర్మాతలకు చూపారు. ఆ తారాగణమే వెండితెరకూ ఎక్కింది. ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో జరిగే కథకు ఆ రకమైన యాసతో వసంత్ మరింగంటి డైలాగ్స్ బాగున్నాయి. నటీనటులూ బాగా చేశారు. సింక్ సౌండ్‌లో ఈ చిత్రాన్ని తీశారు. అయితే, రాసుకున్న విధానం నుంచి, తీసిన తీరు దాకా కొన్నిచోట్ల షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ... సినిమాకు తక్కువ అనిపిస్తుంది. సినిమా మీద అపరిమిత ఇష్టం కానీ, తెరపై కథ చెప్పాలనే కోరిక కానీ ఆటోడ్రైవర్లో ఆది నుంచి ఉన్నట్టు కథలో ఎక్కడా కనిపించదు. అతను ఉన్నట్టుండి సినిమా రూపకల్పన వైపు రావడం అతికినట్టు అనిపించదు. అలాగే, కెమేరా పోగొట్టుకున్న వారి కథను ఎఫెక్టివ్ గా స్క్రిప్టులో మిళితం చేయలేకపోయారు. హాస్య సంఘటనలు కొన్ని బాగున్నా అనవసరపు సీన్లు, నిదానంగా సాగే కథనం ఇబ్బంది పెడతాయి. ‘ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఎట్ హార్ట్’ అని చెప్పదలుచున్న విషయం బాగున్నా, మరిన్ని భావోద్వేగ సంఘటనలుంటే బాగుండేది. ఆ లోటుపాట్లని అంగీకరిస్తూనే, ఓటీటీ ఫీల్ గుడ్ కాలక్షేపంగా, ఈ దేశవాళీ దర్శక – రచయితల తొలియత్నాన్ని అభినందించవచ్చు. బలాలు: ► దేశవాళీ భారతీయ చిత్రం కావడం ► ఇతివృత్తం, హాస్య సంఘటనలు ► పాత్రల్లోని సహజత్వం, అమాయకత్వం ► డైలాగులు, దర్శకత్వం బలహీనతలు: ► స్లో నేరేషన్ ► పరిమిత నిర్మాణ విలువలు ► అపరిచిత ముఖాలు ► భావోద్వేగాలు పెద్దగా లేకపోవడం కొసమెరుపు: ఆకర్షించే అమాయకత్వం, సహజత్వం కోసం... గంటన్నర జర్నీ! – రెంటాల జయదేవ -
నంబర్ వన్‌గా నిలబెట్టిన...గ్యాంగ్ లీడర్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర ఉంటుంది. నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగి, మెగాస్టార్‌గా, ఆపై నంబర్ వన్‌గా మారే క్రమంలో హీరో చిరంజీవి చూసిన అలాంటి ఓ బాక్సాఫీస్ శిఖరం – ‘గ్యాంగ్ లీడర్’. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి నటించగా బాక్సాఫీస్‌ను రప్ఫాడించి, చిరు మెగా ఇమేజ్ను సుస్థిరం చేసిన ‘గ్యాంగ్ లీడర్’ (1991 మే 9)కు నేటితో 30 వసంతాలు. అచంచల అగ్రపీఠికపై... తెలుగు సినీసీమలో తన తరంలో నంబర్ వన్ హీరోగా చిరంజీవిని ఆ స్థానంలో స్థిరంగా నిలబెట్టిన సినిమా అంటే ‘గ్యాంగ్ లీడర్’. ఫ్లాష్ బ్యాక్‌కి వెళితే.. ‘ప్రాణం ఖరీదు’(1978)తో తెర మీదకొచ్చిన చిరు ‘ఖైదీ’ (1983 అక్టోబర్ 28)తో స్టార్ హీరో అయ్యారు. తర్వాత అనేక సక్సెస్‌లు! తోటి హీరోలతో పోటీలు!! బిగ్ హిట్ ‘పసివాడి ప్రాణం’ (1987)తో పరిశ్రమ రేసులో చిరంజీవి ముందంజలోకి వచ్చారు. అయితే, నాగార్జున ‘శివ’ (1989 అక్టోబర్ 5) లాంటి హిట్లు ఆయనకు మళ్ళీ సవాలు విసిరాయి. దాన్ని విజయవంతంగా ఎదుర్కొని, ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ (1990 మే 9)తో తన లీడ్‌ను నిలబెట్టుకున్నారు చిరు. కానీ, ‘రాజా విక్రమార్క’(1990), ‘స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్’ (1991 జనవరి 9) – వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడొచ్చింది. ‘జగదేక...’ రిలీజైన ఏడాదికి సరిగ్గా అదే తేదీన వచ్చింది. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. చిరంజీవి తిరుగులేని నంబర్ వన్ అని సుస్థిరపరిచింది. దటీజ్ ది హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ ‘గ్యాంగ్ లీడర్’! టైటిల్ ఎలా వచ్చిందంటే.. నిజానికి, ముందు విజయ బాపినీడు తీయాలనుకున్న సినిమా ఇది కాదు. ఒకప్పుడు తాను తీసిన, మనసుకు బాగా నచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ డ్రామా ‘బొమ్మరిల్లు’ (’78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ‘షోలే’లోని గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్ పెట్టాలనుకున్నారు. తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి, అది పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ జోడించి ఈ కొత్త సినిమా తీశారు. అప్పటికే హీరో చిరంజీవికీ, ఫ్యా¯Œ ్సకూ వారధిగా నిలిచేలా ‘మెగాస్టార్ చిరంజీవి’ అనే ఓ మాసపత్రికను బాపినీడు నడుపుతున్నారు. సినీ రచయిత సత్యమూర్తి (సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అందులో ‘గ్యాంగ్ లీడర్’ అనే ఓ సీరియల్ రాస్తున్నారు. ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు, చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్‌గా పెట్టారు. ప్రజాభిప్రాయం తీసుకొని, వారు ఎంపిక చేసిన లోగో డిజైనే వాడారు. మధ్యతరగతి కుటుంబ కథ... పేరు యాక్షన్ సినిమాలా అనిపించినా, ఇది రఘుపతి (మురళీమోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) – అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ. స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక, సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం. మధ్యతరగతి యువకుడికి తగ్గట్టు రంగురంగుల కాటన్ షర్ట్స్, ఫేడెడ్ జీ¯Œ ్సతో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్ అప్పట్లో ఓ క్రేజ్. సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ ప్రివ్యూ చూసినప్పుడు, లె¯Œ ్త ఎక్కువైందని అరవింద్ బృందం భావించింది. అప్పటికప్పుడు నిడివి తగ్గించారు బాపినీడు. దానికి తగ్గట్టు చిరంజీవి మళ్ళీ డబ్బింగ్ చెప్పారు. ఇలా సమష్టి కృషి ‘గ్యాంగ్ లీడర్’. వాళ్ళందరికీ... కెరీర్ బ్రేక్ ఫిల్మ్! తెలుగులో బప్పీలహరి హవా ఓ ప్రభంజనమైంది ‘గ్యాంగ్ లీడర్’తోనే! దీంతోనే భువనచంద్ర క్రేజీ రచయిత య్యారు. అంతకు ముందు ‘జగదేక..’కి తండ్రి సుందరంకి సహాయకుడిగా ఉంటూ, సర్వం తానే అయి స్టెప్పులు సమకూర్చిన యువ ప్రభుదేవా ఈ చిత్రానికి అధికారిక డ్యా¯Œ ్స మాస్టర్ హోదాలో వాన పాట లాంటివాటితో కనువిందు చేశారు. సీనియర్ డ్యా¯Œ ్స మాస్టర్ తార అయితే సరేసరి... విశ్వరూపం చూపారు. బాపినీడుకు అల్లుడైన వల్లభనేని జనార్దన్‌కు నటుడిగా వరుస పాత్రలు అందించిందీ ‘గ్యాంగ్ లీడ’రే! ఒకే రోజు 4చోట్ల శతదినోత్సవం! అప్పట్లో స్పెషల్ ఫ్లైట్ ఆసరాగా ఒకే రోజున (చిరంజీవి బర్త్‌డే 1991 ఆగస్ట్ 22న) నాలుగు కేంద్రాల్లో (తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయ వాడ) ‘గ్యాంగ్ లీడర్’ శతదినోత్సవం ఓ అరుదైన విన్యాసం. అతిరథ మహారథులు రాగా, బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణకిరీట ధారణ చేసి, చేతికి రాజదండమిచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం. అప్పట్లో ‘అప్పుల అప్పారావు’ చిత్రకథలో నటి అన్నపూర్ణది చిరంజీవి ఫ్యా¯Œ ్స అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్ర. ఏలూరు శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను, వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఆ చిత్రంలో వాడారు. హ్యాట్రిక్ హిట్ల చిరంజీవితం! ‘గ్యాంగ్ లీడర్’ తరువాత ‘రౌడీ అల్లుడు’, ఆ వెంటనే ‘ఘరానా మొగుడు’ – ఇలా హ్యాట్రిక్ హిట్లు చిరంజీవి సాధించారు. వాటిలో ‘ఘరానా మొగుడు’ బాక్సాఫీస్ వద్ద çసృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ. హీరోగా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టినఫిల్మ్గా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్‌కు సదా ఓ ఆకుపచ్చ జ్ఞాపకం. సూపర్ హిట్ సాంగ్స్ అప్పట్లో కొన్నేళ్ళ పాటు ‘గ్యాంగ్ లీడర్’ పాటలు వినపడని ఊరు, ఊగిపోని కుర్రకారు లేదు. తెలుగులో ‘సింహాసనం’ (1986) లాంటి చిత్రాలతో పాపులరైన బప్పీలహరి కూర్చిన బాణీలవి. ‘స్టేట్ రౌడీ’ (1989) తర్వాత చిరంజీవితో ఆయన పనిచేసిన రెండో సినిమా ఇది. వేటూరి, భువనచంద్ర సాహిత్యం సమకూర్చారు. విజయ బాపినీడు ‘నాకూ పెళ్ళాం కావాలి’ (’87) ద్వారా పరిచయమైన రచయిత భువనచంద్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రెండు పాటలు (‘పాలబుగ్గ..’, ‘వయసు వరసగున్నది వాటం..’) వేటూరి రాస్తే, మిగతావన్నీ భువనచంద్ర రచనలు. టైటిల్ సాంగ్ మొదలు ‘వానా వానా వెల్లువాయె..’, ‘భద్రాచలం కొండ..’, ‘సండే అననురా...’ – ఇలా అరుదైన రీతిలో... ఆల్బమ్‌లోని ఆరు పాటలూ హిట్టే. బప్పీలహరి సంగీతం, చిరంజీవి స్టెప్పులు, విజయశాంతి గ్లామర్, ఎస్పీబీ – చిత్ర గాత్రంలోని భావవ్యక్తీకరణ అన్నీ ఈ పాటల్లో హైలైటే! ఈ తరం మోస్ట్ పాపులర్ వానపాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ ‘వాన వాన వెల్లువాయె..’ భువనచంద్రకు తొలి సినీ వాన పాట. హైదరాబాద్ నుంచి మద్రాసుకు రైలులో బయలుదేరిన భువనచంద్ర పొద్దున్న రైలు దిగే లోగా... ఈ పాటతో సహా నాలుగు పాటలూ రాసేశారు. ఆడియో రిలీజయ్యాక ఆ పాటలన్నీ ఛార్ట్ బస్టర్ గా నిలిచిపోవడం ఓ చరిత్ర. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలూరి వాసూరావు సమకూర్చారు. సరిగ్గా 21 ఏళ్ళకు ‘గ్యాంగ్ లీడర్’లోని అదే ‘వాన వాన వెల్లువాయె...’ పాటను మళ్ళీ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ (2012)లో మణిశర్మ రీమిక్స్ చేశారు. ‘వాన..’ పాటలో సెట్స్‌పై మెగా జోడీ, యువ ప్రభుదేవా హిందీలోనూ..! ఆకాశానికెత్తిన మీడియా!! ‘గ్యాంగ్‌లీడర్’ అదే పేరుతో తమిళంలోకి అనువాదమై, 1991 లోనే నవంబర్ 30న తమిళనాట రిలీజై, సక్సెస్ సాధించింది. తమిళంలో చిరంజీవికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. కేరళలో తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేస్తే, అక్కడా మంచి వసూళ్ళు సాధించింది. తరువాత హిందీ నిర్మాత ఎన్.ఎన్. సిప్పీ ఇదే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్ చేశారు. చిరంజీవికి ఇది రెండో హిందీ సినిమా. తొలి హిందీ సినిమా ‘ప్రతిబంధ్’ (తెలుగు ‘అంకుశం’కి రీమేక్ – 1990 సెప్టెంబర్ 28) లానే ఈ రీమేక్‌కీ రవిరాజా పినిసెట్టి దర్శకులు. చిరంజీవి సరసన మీనాక్షీ శేషాద్రి నటించగా, ఆనంద్ – మిళింద్ సంగీతంలో ఈ రీమేక్ ‘ఆజ్కా గూండా రాజ్’ (1992 జూలై 10) పేరుతో విడుదలైంది. తెలుగులో చిరంజీవి పిన్ని కొడుకు దుర్గబాబు నటించిన ఫ్రెండ్ పాత్రను ఆ హిందీ వెర్షన్లో నేటి తరం హీరో రవితేజ పోషించడం విశేషం. గమ్మత్తేమిటంటే, తెలుగునాట చిరుకు ఉన్న క్రేజ్ దష్ట్యా ఆ కొత్త హిందీ బాణీలకు తెలుగులో పాటలు రాయించి, ఆ డబ్బింగ్ సాంగ్స్‌ను ఇక్కడ రిలీజ్ చేయడం. అప్పట్లో ‘గూండా రాజ్’ పేరిట లియో సంస్థ ద్వారా ఆ డబ్బింగ్ పాటల క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక హీరో తెలుగు సినిమా హిందీలో రీమేకై, మళ్ళీ ఆ హిందీ రీమేక్ పాటలు తెలుగులోకి డబ్బింగ్ అవడం అరుదైన ఘటన. డ్యాన్స్, ఫైట్లలో ఉత్తరాదినీ సమ్మోహనపరచిన చిరంజీవి గురించి ఇంగ్లీష్ మేగజైన్లు ముఖచిత్ర కథనాలు రాసి, ఆకాశానికెత్తాయి. ‘ఆజ్ కా గూండారాజ్’లో మీనాక్షీ శేషాద్రితో... 50 కేంద్రాలు... 100 రోజులు... ‘గ్యాంగ్ లీడర్’ పెద్ద హిట్. దాని రిలీజ్‌కు 5 వారాల ముందు తెలుగునాట టికెట్ రేట్లు పెరిగాయి. అదే సమయంలో తెలుగుగడ్డపై తీసిన చిత్రాలకు వినోదపన్నులో భారీ రాయితీ కల్పించింది ప్రభుత్వం. అప్పటికి ఉన్న ట్యాక్స్‌లో ఏకంగా పెద్ద సినిమాలకు దాదాపు 40 శాతం, చిన్న సినిమాలకు 70 శాతం మేర రాయితీ ఇచ్చారు. అలా టికెట్లు రేట్లు పెరిగాక, రాయితీలిచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్ ఇదే! నిజానికి, పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం తెలియక ముందే, ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు. తీరా రిలీజయ్యాక పెరిగిన టికెట్ రేట్లలోనూ జనాదరణ బ్రహ్మాండంగా ఉండడంతో, ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్ళ వర్షం కురిపించింది. బయ్యర్లందరికీ లాభాల పంట చేతికి అందింది. 75కి పైగా ప్రింట్లతో రిలీజై, ఏకంగా 30 కేంద్రాలలో నేరుగా, మరో 15 – 20 కేంద్రాలలో నూన్‌షోలతో... అన్నీ కలిపి 50 సెంటర్లలో ‘గ్యాంగ్ లీడర్’ వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ సుదర్శన్ 70 ఎం.ఎంలో ఏకంగా 162 రోజులు ఆడింది. చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ వచ్చి, సిల్వర్ జూబ్లీ మిస్సయింది. తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్‌ను శాంతి, ప్రశాంతి అంటూ రెండుగా చేశాక, వాటిలో వచ్చిన తొలి సినిమా ‘గ్యాంగ్ లీడ’రే! ఏకకాలంలో ఆ రెండిట్లోనూ 6 వారాలాడింది. అంతకు ముందు శారద– శోభన్‌బాబుల ‘మనుషులు మారాలి’(’69) ఇలాగే విజయవాడలో ఒకేసారి రెండు (లీలామహల్, శేష్ మహల్) హాళ్ళలో 6 వారాలాడిన ఘనత దక్కించుకుంది. తర్వాత మళ్ళీ 22ఏళ్ళకు గ్యాంగ్‌లీడర్ సినీలవర్ల బెజవాడలో ఆ అరుదైన విన్యాసం చేసింది. ఇటు మెగాస్టార్... అటు లేడీ అమితాబ్... ‘గ్యాంగ్‌లీడర్’కు చిరంజీవితో పాటు విజయశాంతి పెద్ద ప్లస్. ‘కర్తవ్యం’ (1990 జూన్ 29) హిట్టయ్యాక, యాక్షన్ హీరోలకు దీటుగా విజయశాంతికి ‘లేడీ అమితాబ్’ అనే ఇమేజ్ ఉన్న రోజులవి. ‘కర్తవ్యం’ నుంచి ప్రేక్షక, ట్రేడ్ వర్గాలు రెండూ ఆమెను ఒక హీరోలా చూడడం మొదలెట్టాయి. అలా ఆ కాలంలోనే ‘ఆశయం’, ‘పోలీస్ లాకప్’ లాంటివి ఆమెతో వచ్చాయి. అందుకే, ట్రేడ్ వర్గాల దృష్టిలో ‘గ్యాంగ్ లీడర్’ ఏకంగా ‘డబుల్ స్టారర్’గా నిలిచింది. ఊటీలో ‘గ్యాంగ్ లీడర్’లోని ‘భద్రాచలం కొండ...’ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే, ‘కర్తవ్యం’లో ఉత్తమ నటిగా విజయశాంతికి నేషనల్ అవార్డ్ వరించింది. వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఆమెను అభినందించి, అందరికీ పార్టీ ఇచ్చారు. ‘గ్యాంగ్ లీడర్’లో చిరు, విజయశాంతి పోటీ పడి నటించారు. ఆ ముందు ‘యముడికి మొగుడు’ (’88), ‘స్టేట్‌రౌడీ’(’89)లాంటి వాటితో చిరంజీవి పక్కన డ్యా¯Œ ్స అంటే హీరోయిన్ రాధ తప్ప మరొకరు లేరనే భావన ఉండేది. కానీ ‘గ్యాంగ్ లీడర్’తో డ్యాన్సులో చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్నారు విజయశాంతి. టైటిల్ సాంగ్ మినహా, 5 పాటలూ హీరో, హీరోయిన్ మధ్యే ఉండడం, అన్నీ మ్యూజిక్ – డ్యాన్సుల్లో హిట్టవడం మరో అరుదైన ఘటన. అది ఈ జంటకే సాధ్యమైంది. అయితే, ‘గ్యాంగ్ లీడర్’ ఘనత తమదంటే తమదని వారిద్దరూ అనుకున్నట్టు గుసగుసలొచ్చాయి. ∙చిరంజీవి, విజయశాంతి పరుచూరి బ్రదర్స్ శకంలో... ‘గ్యాంగ్ లీడర్’ సూపర్ హిట్‌కు డైలాగ్స్ కూడా కారణం. బాపినీడు తొలిసారిగా పరుచూరి బ్రదర్స్‌ను డైలాగ్ రైటర్స్‌గా పెట్టుకున్నారు. బాపినీడు తన మనసుకు దగ్గరైన పాత ‘బొమ్మరిల్లు’ కథకు, సెకండాఫ్‌లో హిందీ ‘ఘాయల్’ను అనుసరిస్తూ ఈ కథ సిద్ధం చేసుకున్నారు. కథ సిద్ధం కావడంలో ఎం.వి.వి.ఎస్. బాబూరావు సహకరించారు. కథలో, స్క్రీన్‌ప్లేలో పరుచూరి సోదరుల సలహాలూ ఉపకరించాయి. అప్పట్లో ఆ అన్నదమ్ములు రాసిందల్లా బాక్సాఫీస్ బంగారమైంది. ముఖ్యంగా, 1990 – 91 కాలంలో ఇండస్ట్రీలో సంచలనమైన – విజయశాంతి ‘కర్తవ్యం’, వెంకటేశ్ ‘బొబ్బిలిరాజా’, బాలకృష్ణ ‘లారీ డ్రైవర్’, శోభన్‌బాబు – సుమన్‌ల ‘దోషి – నిర్దోషి’, హరీశ్ – మాలాశ్రీల ‘ప్రేమఖైదీ’, మోహన్‌బాబు ‘అసెంబ్లీ రౌడీ’, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’– ఈ ఏడు సినిమాలూ రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కలం చేసుకున్నవే. వేర్వేరు ఇమేజ్లున్న ఆ ఏడు చిత్రాల హీరోలనూ ఆ సినిమాలు కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళడం మరో చరిత్ర. ‘గ్యాంగ్ లీడర్’లో రావు గోపాలరావుతో ‘‘కన్నాంబకు ఎక్కువ – కాంచనమాలకు తక్కువ’’అంటూ చిత్రమైన మేనరిజమ్ డైలాగ్స్ పెట్టారు. జనజీవితంలో ఈ ఫక్కీలో డైలాగ్స్ చెప్పుకోవడం అప్పట్లో ఓ క్రేజ్. అసలీ తరహా డైలాగ్ మూలసృష్టికర్త– సినీ రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు. ‘నవయుగం’(’90) చిత్రంలో ‘‘వీడు కత్తికి ఎక్కువ, బాంబుకు తక్కువ’’ అని ఒకే ఒక్క డైలాగ్ రాశారాయన. అదిచూసి ముచ్చట పడ్డ పరుచూరి గోపాలకృష్ణ, ‘గ్యాంగ్ లీడర్’లో పాత్రకు సినిమా అంతటా ఈ తరహా డైలాగ్స్ పెట్టడం హిట్ పాయింటైంది. అలాగే, చిరంజీవి సొంత ఐడియా ‘రప్ఫాడిస్తా’ అనే ఊతపదం మోస్ట్ పాపులరైంది. బామ్మ నిర్మలమ్మతో ఫోటోలో నుంచి వచ్చినట్టు తాత గెటప్‌లో చిరంజీవి మాట్లాడే సీన్లు, ‘శబరీ’ డైలాగ్ ట్రాక్ చిరంజీవి చేసిన ఇంప్రొవైజేషన్లే! అవీ హిట్! సెట్స్‌పై బాపినీడు, పరుచూరి గ్యాంగ్‌తో... – రెంటాల జయదేవ -
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్‌లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్‌గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్‌గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్‌తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్‌తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్‌లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్‌కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్‌తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్‌బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్‌గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్‌లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
రంగుల రాజకీయం బ్రహ్మర్షి విశ్వామిత్ర
సూపర్ హిట్ సినిమాలకే కాదు... కొన్ని సూపర్ ఫ్లాప్ సినిమాలకూ రకరకాల కారణాల రీత్యా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి ఓ సినిమా ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. కళనూ, రాజకీయాన్నీ కలగలపాలని చూస్తే – పులగం కాదు కలగాపులగం అవుతుందని ఎన్టీఆర్ లాంటి స్టార్‌కు అవగతమైన అరుదైన సందర్భం అది. సి.ఎం. హోదాలో ఉంటూనే, మళ్ళీ తెరపై నటించి ఎన్టీఆర్ జాతీయస్థాయి సంచలనం రేపిన ఘట్టమూ అదే! అప్పట్లో రోజూ వార్తల్లో నిలిచిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’కు ఈ ఏప్రిల్‌తో 30 వసంతాలు. అది 1989. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన వత్సరం. ఎన్టీఆర్ అప్పటికే ‘నేషనల్ ఫ్రంట్’ ఛైర్మన్‌గా, దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెస్తూ, జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో సి.ఎం.గా మాత్రం ఆయనకు బోలెడు తలనొప్పులు. అప్పటికే వంగవీటి రంగా హత్య, కోర్టు కేసులు, నక్సలైట్లు పెచ్చుమీరడం, వారి చేతిలో కరీంనగర్ జిల్లా తాడిచర్ల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మల్హర్రావు హత్యకు గురవడం, 1989 ఫిబ్రవరిలో క్యాబినెట్ మొత్తాన్నీ ఎన్టీఆర్ రద్దు చేయడం లాంటి అనేక అంశాలు ఆయన జనాదరణకు గండికొడుతున్నాయి. ఆలోచించిన ఎన్టీఆర్ ఎన్నికల ముందు ఇటు తెలుగునేలతో పాటు దేశవ్యాప్తంగా తన ఇమేజ్ మళ్ళీ పెంచుకోవాలనుకున్నారు. అందుకు తనకు అలవాటైన సినిమా రంగాన్నీ, అదీ జనంలో తనను ఆరాధ్యదైవంగా మార్చిన పౌరాణిక పాత్రపోషణనూ అస్త్రంగా ఎంచుకున్నారు. 1981లోనే ప్రకటించిన తన కలకు ఎన్టీఆర్ ఎనిమిదేళ్ళ తర్వాత రూపమిచ్చారు. అదీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’! స్టూడియోలో సి.ఎం... ఓ సరికొత్త చరిత్ర ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య పదవిలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఒకప్పటి తన రంగుల లోకంలో విహరించాలనుకోవడం అంతకు మునుపెన్నడూ చరిత్రలో జరగలేదు. అమెరికా అధ్యక్షుడు రీగన్ నుంచి తమిళనాడు సి.ఎం. ఎమ్జీఆర్ దాకా ఎవరూ మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. నటించనూలేదు. సి.ఎంగా అప్పటికీ, ఇప్పటికీ ఆ పని చేసింది ఎన్టీఆర్ ఒక్కరే! ముఖ్యమంత్రి నటనపై కోర్టులో వివాదం ‘ముఖ్యమంత్రి ప్రభుత్వోద్యోగి కాబట్టి, ఆర్థిక ప్రయోజనమిచ్చే సినిమాల్లో నటించకూడ’దంటూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ వేసింది. కానీ, పి.వి. నరసింహారావు ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువదించడాన్నీ, జలగం వెంగళరావు కోళ్ళఫారమ్ నిర్వహించడాన్నీ, సంజీవరెడ్డి వ్యవసాయం చేయడాన్నీ ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ తరఫు వకీలు వాదనలు వినిపించారు. రాష్ట్రపతిగా ఉండగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గోల్ఫ్ ఆడేవారనీ, సి.ఎం.గా ఉండగా బి.సి. రాయ్ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసేవారనీ గుర్తుచేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో నటించడం వీటికి భిన్నమైనది కాదని వకీలు వాదించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు చివరకు సినిమాల్లో సి.ఎం నటించవచ్చా లేదా అని పరిశీలించేందుకు కానీ, నటించకుండా నిషేధించే అధికారం కానీ తమకు లేదని తీర్పు చెప్పింది. నిర్ణయాన్ని ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేసింది. 1989 జూన్ 18న ‘విశ్వామిత్ర’ చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్ రామకృష్ణా స్టూడియోస్‌లోని అతి పెద్ద ఫ్లోర్లో ఆ రోజు జరిగిన ప్రారంభోత్సవానికి అతిథులుగా వి.పి. సింగ్, ముఖ్యమంత్రులు కరుణానిధి, దేవీలాల్, పి.కె. మహంతా – ఇలా నేషనల్ ఫ్రంట్ నేతలు ఎందరో వచ్చారు. విశ్వామిత్రుడిగా దండ, కమండలాలతో ఎన్టీఆర్, మేనకగా మీనాక్షీ శేషాద్రి సెట్లోకి అడుగుపెడుతుంటే, నేతలందరూ ఫ్లోర్లో కింద పరచిన పరుపులపై కూర్చొని చూడడం చర్చ రేపింది. రాజకీయాల వేడిలో... కరిగిపోయిన రంగులు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ కథ, స్క్రీన్‌ప్లే, కూర్పు, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలన్నీ ఎన్టీఆర్వే! వశిష్టుడితో పంతం పట్టి, రాజర్షిగా, చివరకు బ్రహ్మర్షిగా మారిన చక్రవర్తి కౌశికుడి కథలో తనను తాను చూసుకున్నారు ఎన్టీఆర్. రావణ, దుర్యోధన పాత్రలను ‘సీతారామ కల్యాణం’, ‘దానవీరశూర కర్ణ’ లాంటి చిత్రాలలో పాపులర్ కోణానికి భిన్నంగా చూపి, సక్సెసైన రికార్డు ఆయనది. ఈసారీ ఆ బాటే పట్టారు. ‘‘బొందితో స్వర్గానికి పోదలచిన కడజాతి వాడైన త్రిశంకు కోసం స్వర్గానికి మారుగా త్రిశంకుస్వర్గాన్ని సృష్టించిన స్రష్ట’’ లాంటి అంశాలతో వెనుకబడిన వర్గాల్ని ఆకర్షించడం లక్ష్యంగా చేసుకున్నారు. విశ్వామిత్రుడి పూర్వాశ్రమ పుత్రుడైన ఆంధ్రుడికీ, తెలుగువారికీ ముడిపెట్టారు. సినిమాలో కాసేపే కనిపించినా, విశ్వామిత్రుడిగా ఎన్టీఆర్ సరసన సరసమాడే కీలకమైన మేనక పాత్రధారి ఎవరన్నది అప్పట్లో ఓ ఆసక్తికరమైన చర్చ. శ్రీదేవి మొదలు రకరకాల పేర్లు వినిపించాయి. నటి లక్ష్మి సైతం అప్పటికి తెరంగేట్రం చేయని తన కుమార్తె ఐశ్వర్య కోసం ఎన్టీఆర్‌ను సంప్రతించారు. చివరకు హిందీ స్టార్ మీనాక్షీ శేషాద్రికి ఆ పాత్ర దక్కడం సంచలనమైంది. ఆమె హైదరాబాద్‌లో కాలు మోపినప్పటి నుంచి సెట్లో మేనక గెటప్ దాకా ఆమె ఫోటోలు పత్రికల ఫస్ట్ పేజీలకెక్కాయి. ‘భూకైలాస్’ (1958)లో తొలిసారి రావణపాత్ర ధరించిన ఎన్టీఆర్ 33 ఏళ్ళ తరువాత తన కెరీర్లో 5వసారి, ఆఖరుసారి ‘విశ్వామిత్ర’లో కూడా రావణాసురుడి పాత్ర పోషించడం విశేషం. అలా విశ్వామిత్ర, రావణ పాత్రలు రెంటిలో తెరపై కనిపించారు ఎన్టీఆర్. ఇక, కుమారుడైన హీరో బాలకృష్ణతో రాముడు, సత్య హరిశ్చంద్రుడు, దుష్యంతుడు – 3 పాత్రలు వేయించాలనుకున్నారు ఎన్టీఆర్. చివరకు శ్రీరాముడు మినహా మిగతా రెండు పాత్రలు వేయించారు. టీవీ ‘రామాయణ్’కి సంగీతం అందించిన ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, అంధ గాయకుడు, గీత రచయిత రవీంద్ర జైన్ బాణీలు కూర్చారు. ట్రైలర్ మంత్రానికి ఓట్లు రాలతాయా? అనుకోకుండా 1989 ఎన్నికలు ముందుకు తోసుకువచ్చాయి. ఆ లోపల ‘విశ్వామిత్ర’ చిత్రం పూర్తి కాలేదు. దాంతో, ఎన్నికల ప్రచారం కోసం ఈ సినిమా ట్రైలర్లను వాడుకున్నారు ఎన్టీఆర్. సినిమా హాళ్ళలో 1989 నవంబర్‌లో సుదీర్ఘమైన ట్రైలర్ వదిలారు. అదీ దాదాపు 300 ప్రింట్లు! ఒక సినిమాకు అంత పెద్ద నిడివి ట్రైలర్, పైపెచ్చు అన్ని ప్రింట్లు వేయడం తెలుగులో అదే తొలిసారి, చివరిసారి. అలాగే, సినిమా పాటలూ వదిలారు. లతా మంగేష్కర్ సహా పేరున్న గాయకులు పాడిన ఈ సినిమా ఆడియోను అప్పట్లో ‘లహరి’ సంస్థ దక్షిణాదిలోనే అత్యధిక రేటుకు కొన్నది. 1989 ఆగస్ట్ 15న పాటలు రిలీజ్ చేసింది. మామూలు కన్నా ఎక్కువ రేటు పెట్టి పాటల క్యాసెట్లు అమ్మింది. ఊరూరా ఎన్నికల ప్రచారంలో 22 నిమిషాల ‘చైతన్యరథం’ లఘుచిత్రం, అసంపూర్తి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లోని పాటలు, డ్యాన్సులతో ఏకంగా 18 నిమిషాల ట్రైలర్ ప్రదర్శించారు. జనం ఎగబడి చూసినా, అందులోని దృశ్యాలపై విమర్శలు వచ్చాయి. ఆ ఫీడ్ బ్యాక్‌తో ఆ తర్వాత రీషూట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక, సి.ఎం. హోదాలో ఉన్నా సెట్లో విశ్వామిత్రుడి వేషంలో ప్రభుత్వ ఫైళ్ళపై ఎన్టీఆర్ సంతకాలు పెట్టడంతో దక్కిన విపరీత పబ్లిసిటీ జనంలో వ్యతిరేకత తెచ్చింది. 1989 ఎన్నికలలో కేంద్రంలో ‘నేషనల్ ఫ్రంట్’ అధికారంలోకి వచ్చింది కానీ, రాష్ట్రంలో ఎన్టీఆర్ అధికారం కోల్పోయారు. కల్వకుర్తిలో తానే ఓటమి పాలయ్యారు. రిజల్ట్స్‌కు ముందు ప్రధానమంత్రి పీఠానికి పోటీదారు అవుతారనుకున్న ఆయన చివరకు ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికే పరిమితం కావాల్సొచ్చింది. సినిమా ఫ్లాప్... ఎన్నికల తొలిదశ హిట్! రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటూనే, అనేక పనుల మధ్యలోనే ఆ తరువాత ‘విశ్వామిత్ర’ పూర్తి చేశారు ఎన్టీఆర్. 1991 మే నెలలో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దేశంలో రాజకీయ అనిశ్చితి చూసి, ఎన్టీఆర్ ఈసారి త్వరపడ్డారు. ఎన్నికలకు ముందే 1991 ఏప్రిల్ 19న ‘విశ్వామిత్ర’ను రిలీజు చేసేశారు. సిన్మాను జనం ఫ్లాప్ చేశారు. సరిగ్గా నెల తర్వాత రాజీవ్ హత్య ముందు మేలో జరిగిన తొలిదశ ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ వైపే నిలిచారు. అధిక స్థానాల్లో పట్టం కట్టారు. ఎన్టీఆర్‌ను తామెలా చూస్తున్నదీ చెప్పకనే చెప్పేశారు. కానీ, జూన్‌లో జరిగిన రెండో దశ ఎన్నికల్లో రాజీవ్ హత్యానంతర సానుభూతి ప్రభంజనం ఎన్టీఆర్ గెలుపు గుర్రానికి కళ్ళెమేసింది. క్యాన్సర్ ఆసుపత్రికి డబ్బులు తగ్గడంతో... ‘ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్’ పేర ఈ చిత్రం నిర్మాణమైంది. ‘‘వచ్చే ప్రతి పైసా నా ధర్మపత్ని బసవరామ తారకం మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ నిర్వహించే మాతా శిశు ఆరోగ్య కేంద్రానికే అర్పితం, సమర్పితం’’ అని ఎన్టీఆర్ ప్రకటించారు. తీరా సిన్మా ఫ్లాపై, బయ్యర్లకు కొంత వెనక్కి ఇవ్వాల్సి వచ్చేసరికి బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ నిర్మాణానికి డబ్బులు తగ్గాయి. దాంతో, తర్వాత ‘మేజర్ చంద్రకాంత్’(1993 ఏప్రిల్ 23)కు తీసుకున్న పారితోషికంతో ఆ ఆర్థికలోటును భర్తీ చేశారు ఎన్టీఆర్. మోతబరువైన మైనస్‌లు! విశ్వామిత్రుడితో పాటు సీతారామకల్యాణం, హరిశ్చంద్ర, దుష్యం తుల కథల మూడింటి కదంబంగా నడిచే మూడు గంటల సినిమా ఇది. కవి నాగభైరవ కోటేశ్వరరావు తన ఈ తొలి సినీరచనలో గ్రాంథికం, వ్యవహారికం కలగలిపేసి, ఎన్టీఆర్ మనసెరిగి డైలాగులు రాసిచ్చారు. కానీ, అవేవీ జనానికి పట్టలేదు. విశ్వామిత్రుడి ఇమేజ్ పెంచుకొనేందుకు పురాణ కథలను తెరపై యథేచ్ఛగా మార్చారు. రాజీవ్ గాంధీ సహా పలువురిని ఉద్దేశిస్తూ ఇంద్రుడు (నటుడు అశోక్ కుమార్), తదితర పాత్రలను చిత్రించారు. మొత్తానికి అనేక పనుల మధ్యలో మునిగి, అనుకున్న రీతిలో ఎన్టీఆర్ ఈ సినిమాను తీర్చిదిద్దలేకపోయారు. ఎన్టీఆర్‌కు లాస్..! వాళ్ళకు గెయిన్..!! విశ్వామిత్ర ఎన్టీఆర్‌కు దెబ్బకొట్టినా, ఆయన ప్రయత్నం అప్పట్లో చాలామందికి అడగని వరమైంది. అప్పటికే శివాజీ గణేశన్‌తో వచ్చిన తమిళ ‘రాజ ఋషి’ (1985) తెలుగులో హడావిడిగా ‘రాజ ఋషి విశ్వామిత్రుడు’గా డబ్బింగై, డబ్బులు చేసుకుంది. ఎన్టీఆర్ మీద పొలిటికల్ సెటైర్‌గా విజయచందర్తో ‘1990 – కలియుగ విశ్వామిత్ర’ (1989) వచ్చింది. మరోపక్క ఎన్టీఆర్ ‘విశ్వామిత్ర’ను దెబ్బతీసేందుకు అప్పటి రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండతో, దర్శక–నిర్మాత దాసరి నారాయణరావు దూరదర్శన్కోసం హిందీలో ‘విశ్వామిత్ర’ (1989) పేరిట ఓ వీక్లీ సీరియల్ భారీగా తీశారు. అందులో ‘మహాభారత్’ సీరియల్ భీష్ముడు ముఖేశ్ ఖన్నా టైటిల్ రోల్ పోషించగా, సినీ నటి భానుప్రియ మేనకగా నటించడం ఓ సంచలనమైంది. అప్పట్లో అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దాసరికి ఆదివారం ఉదయం ప్రైమ్ టైమ్‌లో ప్రసారమైన ఆ సీరియల్ లాభాలు తెచ్చి, కొత్త ఊపిరి పోసింది. ఏమైనా, అటు ఎన్టీఆర్ సినీ జీవితంలో అత్యధికంగా హైప్ వచ్చిన సినిమా, ఇటు అత్యంత తీవ్రంగా నిరాశపరచిన సినిమా కూడా ఈ ‘విశ్వామి’త్రే! అయితే, ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ ఘనవిజయంతో ఆయన ఫ్యాన్స్‌కు ఊరట కలిగింది. వెరసి సినీ, రాజకీయ రంగాల్లోనూ, అలాగే వ్యక్తిగతంగానూ ఎన్టీఆర్ జీవితాన్ని పెను మలుపు తిప్పినందుకు ‘విశ్వామిత్ర’ చిత్రం, దాని ఫలితం చరిత్రలో గుర్తుండిపోతాయి. రికార్డ్బిజినెస్! సినిమా రిలీజయ్యాక స్పందన మాటెలా ఉన్నా – అయిదున్నర కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌తో ‘విశ్వామిత్ర’ ముక్కున వేలేసుకొనేలా చేసింది. అప్పటి దాకా ఏ తెలుగు సినిమా వ్యాపారమైనా రెండు కోట్ల రూపాయల రేంజ్ లోపలే జరిగేది. బాక్సాఫీస్ చరిత్ర చూస్తే – తెలుగునాట 1984 జనవరి 1న సినిమా టికెట్ రేట్లు పెంచారు. చాలా కాలం అవే రేట్లు కొనసాగాయి. దాదాపు ఏడున్నరేళ్ళ తరువాత 1991 ఏప్రిల్ 1న మళ్ళీ టికెట్ రేట్లు పెరిగాయి. ఒక్కదెబ్బకు 35 శాతం మేర టికెట్ రేట్లు పెంచారు. అలా రేట్లు పెంచాకే మిగతా సినిమాల మార్కెట్ పెరిగింది. కానీ, వాటన్నిటి కన్నా ముందెప్పుడో ఎన్టీఆర్ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ (1984 నవంబర్ 29) ఒక్కటే రూ. 2.5 కోట్ల రేంజ్లో ప్రీరిలీజ్ వ్యాపారం చేయడం విశేషం. తర్వాత మళ్ళీ ‘విశ్వామిత్ర’ ఏకంగా రూ. 5.5 కోట్ల స్థాయిలో వ్యాపారం జరుపుకోవడం మరో విశేషం. బెనిఫిట్ షో సంస్కృతికి శ్రీకారం అంతకుముందు స్పెషల్ షోలు ఉన్నా, తెలుగునాట అన్ని ఏరియాలకూ తొలిసారిగా బెనిఫిట్ షో సంస్కృతి తెచ్చింది మాత్రం ‘విశ్వామిత్ర’. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రే ‘విశ్వామిత్ర’కు భారీగా బెనిఫిట్ షోలు పడ్డాయి. టికెట్ రేట్లు భారీయెత్తున పెట్టి అమ్మారు. కొన్నిచోట్ల అయితే ఏకంగా వేలంపాట పెట్టి మరీ ఒక్కో షో అమ్మితే, కార్యకర్తలు ఎగబడి కొన్నారు. అప్పట్లో సినిమాకు ఒక వారానికొచ్చే షేర్ ఈ బెనిఫిట్ షోలతోనే వచ్చిందట! ‘విశ్వామిత్ర’ శ్రీకారం చుట్టిన ఈ భారీ టికెట్ల బెనిఫిట్ షో సంస్కృతి పదేళ్ళ తర్వాతే పెద్ద సిన్మాలన్నిటికీ ఆనవాయితీగా మారి, నేటికీ కొనసాగుతోంది. ఓటర్లకు సినిమా గాలం! ‘‘ఎన్నికల కోసం సినిమా తీయడం లేదు’’ అని ఎన్టీఆర్ చెప్పినా, ఎన్నికల ముందు ఇలా సినిమాతో జనం ముందుకు రావడం అంతకు ముందూ ఆయన చేసినదే! ‘తెలుగుదేశం’ పేరిట పార్టీని స్థాపించిన వెంటనే ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘నా దేశం’ తీశారు. రాజకీయ డైలాగులు పెట్టారు. ఎన్నికలకు రెండున్నర నెలల ముందే 1982 అక్టోబర్ 27న రిలీజ్ చేశారు. ఇక, రాజకీయా ల్లోకి రాక ముందే తీసిన ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సెన్సార్ వివాదాలతో, చివరకు 1984 లోక్‌సభ ఎన్నికలకు ముందు నవంబర్ 29న రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించిన ఆ రెండు చిత్రాలూ జనంలో ఎన్టీఆర్ ఇమేజ్ను పెంచాయి. 1989 సార్వత్రిక ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా ఇమేజ్ పెంచుకోవాలనుకొన్న ఎన్టీఆర్ ఏకకాలంలో తెలుగుతో పాటు, హిందీలోనూ ‘విశ్వామిత్ర’ తీశారు. కలసిరాని విశ్వామిత్రుడు అందరినీ కష్టాలకు గురిచేస్తాడని విశ్వామిత్రుడి పాత్రపై ఓ ముద్ర ఉంది. ఏ పనికి ఆ పనిగా క్రమశిక్షణతో ఉండే ఎన్టీఆర్ ఆ పాత్ర మోజులో పడి తొలిసారి అలసత్వం వహించారు. 1990 మార్చిలో జరగాల్సిన ఏ.పి. అసెంబ్లీ ఎన్నికలను 1989లో లోక్‌సభ ఎన్నికలతో పాటు పెట్టించేశారు. అనేక పనుల మధ్య షూటింగ్ ఒత్తిడితో రెండుసార్లు వేర్వేరుగా ప్రచారానికి బద్ధకించి ఎన్టీఆర్ తీసుకున్న ఆ జమిలి ఎన్నికల నిర్ణయం బెడిసికొట్టి, రాష్ట్రంలో అధికారానికి దూరం పెట్టింది. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితాన్నీ వేరే మార్గం పట్టించింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌కు కానీ, తరువాత ఆ మధ్య ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ బ్యానర్ పెట్టి ‘యమదొంగ’ (2007) చిత్రం నిర్మించిన దర్శకుడు రాజమౌళికి కానీ, ఆ బ్యానర్ లోగో కోసం విశ్వామిత్రుడి గెటప్ వేసిన హీరో ప్రభాస్‌కు కానీ కొన్నాళ్ళు కలసి రాలేదని సినీరంగంలో ఇప్పటికీ ఓ బలమైన సెంటిమెంట్! దాసరి సీరియల్ జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ తెలుగు వెర్షన్ ఒక్కటే 1991 ఏప్రిల్ 19న రిలీజ్ చేశారు. తమిళంలోనేమో డబ్బింగ్ చేసి, ఏకనాథ్ వీడియోస్ వారికి విక్రయించి, విడుదల చేయించారు. తెలుగు, తమిళ రెండు చోట్లా ఫ్లాప్. ఇంతలో ఎన్టీఆర్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. కన్నబిడ్డ శకుంతలకే విశ్వామిత్రుడు తన కథ చెప్పినట్టు చూపిస్తే బాగుంటుందని భావించి, హిందీ వెర్షన్ రీషూట్ చేశారు. ఆ క్రమంలో బాలకృష్ణ బదులు హిందీలో దుష్యంతుడి పాత్రకు బుల్లితెర ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్నూ, అలాగే ఇక్కడ మధుమిత (తొలి పరిచయం) చేసిన శకుంతల పాత్రకు అక్కడ అర్చనా జోగ్లేకర్నూ పెట్టి, 1992 అక్టోబర్ ప్రాంతంలో ఆ ఎపిసోడ్ మళ్ళీ తీశారు. హరికృష్ణ కుమారుడైన పసివాడైన తారక్‌తో ఆ హిందీ వెర్షన్లోనే శకుంతల, దుష్యంతుల సంతానమైన చిన్నారి భరతుడి వేషం వేయించారు ఎన్టీఆర్. అలా పెద్ద ఎన్టీఆర్ చేతుల మీదుగా చిన్న ఎన్టీఆర్ సినీ రంగప్రవేశం జరిగింది. కానీ, విచిత్రంగా హిందీ సినీ వ్యాపార ఏరియాలలో ఒకటైన ‘సి.పి – బేరార్’ (‘సెంట్రల్ ప్రావిన్సెస్ – బేరార్’ అని పిలిచే మహారాష్ట్రలోని విదర్భ, దక్షిణ – తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలు) సర్క్యూట్‌కు మాత్రం హిందీ వెర్షన్‌ను అమ్మారట. అక్కడ మాత్రం అది రిలీజైందనీ, మిగిలిన చోట్ల రైట్స్ అమ్మలేదనీ, నేటికీ రిలీజ్ కాలేదనీ ట్రేడ్ వర్గాల ఉవాచ. సినీ, నిజజీవిత తాతా మనుమళ్లు సెట్లోనే సి.ఎం.గా సంతకాలు – రెంటాల జయదేవ -
శోభన్‌బాబు చేసిన ఏకైక వ్యాపారం ఏంటో తెలుసా?
సృష్టిలో తియ్యనిది తల్లి ప్రేమ! ఒకరు కన్నతల్లి! మరొకరు తల్లి కాని తల్లి! ఇద్దరమ్మల ముద్దుల బిడ్డ మమతల కథ... ‘ఇల్లాలు’. శోభన్‌బాబు, జయసుధ, శ్రీదేవి నటించిన ఈ కుటుంబ కథాచిత్రం అప్పట్లో సూపర్ హిట్ సినిమా. ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి..’, ‘అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా...’ లాంటి పాటలతో గుర్తుండిపోయిన సినిమా. లేడీ ఫ్యాన్స్ అమితంగా ఉన్న హీరో శోభన్‌బాబుకూ, నటనలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్న సమయంలో హీరోయిన్లు జయసుధ, శ్రీదేవికీ కెరీర్లో అది ఓ మైలురాయి సినిమా. 1981 ఏప్రిల్‌లో రిలీజైన ‘ఇల్లాలు’కు ఇప్పుడు 40 వసంతాలు. ఇల్లాలు.. భర్తకు ప్రేమమూర్తి. బిడ్డకుమాతృమూర్తి! సృష్టికే దేవతామూర్తి!!! భార్యాభర్తల అనుబంధానికీ, కుటుంబ బంధానికీ నిర్వచనమైన ఈ అంశాన్నే తెరపై సెంటిమెంట్ నిండిన కుటుంబకథగా చెప్పింది ‘ఇల్లాలు’ చిత్రం. బాబు ఆర్ట్స్ పతాకంపై జి. బాబు నిర్మాతగా, అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో, తాతినేని రామారావు దర్శకత్వంలో తయారైందీ సినిమా. ఈ ముగ్గురూ స్నేహితులు, వ్యాపార భాగస్వాములు. ఆ రకంగా ఇది ఆ ముగ్గురి సినిమా. ఇంకా గమ్మత్తేమిటంటే, శోభన్‌బాబు ఆర్థిక అండదండలతో ఏర్పాటైన అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ లక్ష్మీచిత్ర (నైజామ్‌లో శ్రీలక్ష్మీచిత్ర)యే ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అలా మిత్రులందరి సమష్టి సినీ ప్రాజెక్టుగా ‘ఇల్లాలు’ ముందుకు నడిచింది. ఇద్దరు తల్లుల కథ – ‘ఇల్లాలు’! సంసారం సవ్యంగా సాగాలంటే, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. ఆ విషయాన్ని ఈ చిత్రం అర్థవంతంగా చెప్పింది. ఆస్తిపాస్తులతో, ధనవంతుల ఇంట్లో పుట్టిపెరిగిన, అహంకారపూరితమైన అమ్మాయి కల్పన (జయసుధ). సామాన్య జీవితాన్ని సాగిస్తున్న కథానాయకుడు కిరణ్ (శోభన్ బాబు)ను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటుంది. ఓ బిడ్డ పుట్టాక, భర్తతో ఇమడలేనంటూ, అహంభావంతో కాపురాన్ని కాలదన్నుకుంటుంది. ఆ పరిస్థితుల్లో మరో అమ్మాయి జ్యోతి (శ్రీదేవి)ని పెళ్ళి చేసుకుంటాడు. అతని బిడ్డను కన్నతల్లిలా పెంచుతుంటుంది ఆమె. మొదటి భార్య కల్పన తాను పోగొట్టుకున్నదేమిటో గ్రహించి, వెనక్కివచ్చి తన కన్నబిడ్డను ఇమ్మని హీరోను అడుగుతుంది. కన్నపాశం, పెంచిన మమకారం మధ్య నడిచే ఈ చైల్డ్ సెంటిమెంట్ కథ విశేష ప్రేక్షకాదరణ పొందింది. అహంకారంతో కాపురాన్నీ, కన్నబిడ్డనూ కాదనుకున్న సెంటిమెంటల్ పాత్రలో జయసుధ, ఒద్దికైన ఇంటి ఇల్లాలుగా శ్రీదేవి, భర్త పాత్రలో శోభన్‌బాబు రాణించారు. సంసార సూత్రాలు గొల్లపూడి రచనలో వినిపిస్తాయి. హిందీ హిట్ కథకు ఇది రీమేకైనప్పటికీ, మూలాన్ని అనుసరిస్తూనే, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. కథనంలోని ఇలాంటి మార్పులు, సెంటిమెంట్ బాగా పండించడం ‘ఇల్లాలు’ విజయానికి తోడ్పడ్డాయి. ఒకే దర్శకుడు – రెండు హిట్లు! ఆ ఏడాది మొదట్లో వచ్చిన శోభన్‌బాబు చిత్రాలు ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’ – రెండింటికీ దర్శకుడు తాతినేని రామారావే. ఆయన దర్శకత్వంలో అంతకు ముందెప్పుడో అక్కినేనితో వచ్చిన ‘ఆలుమగలు’కే పాత్రలతో సహా కొన్ని కీలక మార్పులు చేసి, ‘పండంటి జీవితం’ అందించారాయన. ‘ఇల్లాలు’ ఏమో హిందీ సూపర్ హిట్ చిత్రం ‘అప్నాపన్’ (చుట్టరికం అని అర్థం – 1977)కు రీమేక్. జితేంద్ర, రీనారాయ్, సులక్షణా పండిట్ నటించగా దర్శక, నిర్మాత జె. ఓం ప్రకాశ్ రూపొందించిన ఆ చిత్రం పెద్ద హిట్. హిందీ మాతృకలో లక్ష్మీకాంత్ – ప్యారేలాల్ సంగీతంలో ‘ఆద్మీ ముసాఫిర్ హై...’ అంటూ మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడే పాట పెద్ద హిట్. తెలుగు రీమేక్‌లోనూ జేసుదాస్, ఎస్పీ శైలజ పాడిన సందర్భోచిత ఆత్రేయ రచన ‘ఓ బాటసారీ ఇది జీవిత రహదారి...’ మారుమోగిపోయింది. ఈ పాట సినిమాలో పలు సందర్భాల్లో పదే పదే వినిపిస్తూ, కథలోని మూడ్‌ను పెంచింది. తోటి హీరోల్లో... ఆయనదే రికార్డు! అప్పట్లో ‘ఇల్లాలు’ చిత్రం 6 కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, తెనాలి, హైదరాబాద్) డైరెక్టుగా వంద రోజులు ఆడింది. 2 కేంద్రాలలో (కాకినాడ, చీరాల) షిఫ్టుతో, రోజుకు మూడు ఆటలతో శతదినోత్సవం చేసుకుంది. అలా 8 కేంద్రాలలో రెగ్యులర్ షోలతో శతదినోత్సవం జరుపుకొన్న చిత్రమైంది. ఇవి కాక, మరో 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తంగా 12 కేంద్రాలలో ఈ ఫ్యామిలీ డ్రామా వంద రోజుల పండగ చేసుకుంది. 1981 ఆగస్టు 16న మద్రాసులోని చోళా హోటల్లో శతదిన ఘనమహోత్సవం జరిపారు. ప్రేక్షకాదరణతో ఆపైన ‘ఇల్లాలు’ రజతోత్సవమూ చేసుకుంది. బాక్సాఫీస్ లెక్క చూస్తే – ఇలా ఎనిమిది, అంతకు మించి కేంద్రాలలో రెగ్యులర్ షోలతో వంద రోజులు ఆడిన సినిమాలు శోభన్‌బాబు కెరీర్లో ఏకంగా పది ఉన్నాయి. ‘ఇల్లాలు’కు ముందు ఆయన కెరీర్లో 8 చిత్రాలు కనీసం 8 కేంద్రాల్లో వంద రోజులాడాయి. ‘సంపూర్ణ రామాయణం’ (10 కేంద్రాలు), ‘జీవన తరంగాలు’(12), ‘శారద’ (8), ‘మంచి మనుషులు’(11), ‘జీవనజ్యోతి’ (12), ‘జేబుదొంగ’(10), ‘సోగ్గాడు’ (19), ‘గోరింటాకు’ (8), తర్వాత ‘ఇల్లాలు’ (8 కేంద్రాలు) 9వ సినిమా అయింది. ఆ తర్వాత ‘దేవత’ చిత్రం (9 కేంద్రాలు) ఆ శతదినోత్సవ విజయాల జాబితాలో పదోది అయింది. గమ్మత్తేమిటంటే, తన సమకాలీన హీరోలలో అలాంటి శతదినోత్సవ చిత్రాలు అత్యధికంగా ఉన్నది శోభన్‌బాబుకే! ఇలా పది చిత్రాలతో శోభన్‌బాబు హయ్యస్ట్‌గా నిలిస్తే, ఆయన సమకాలీన హీరోల సెకండ్ హయ్యస్ట్ 4 చిత్రాలే కావడం గమనార్హం! ఆ రోజుల్లో హీరోల్లో శోభన్ బాబుకు మహిళాదరణ ఎక్కువ. ఆ కారణంగా ఆయన సినిమాలు బాగా ఆడేవి. ఎక్కువ రోజుల రన్ కూడా వచ్చేది. సమకాలీన హీరోలకు మించి ఆయనకు శతదినోత్సవ చిత్ర రికార్డుకు అది ఓ ప్రత్యేక కారణం. శోభన్‌బాబు ఈ పది శతదినోత్సవ చిత్రాల విజయయాత్ర సాగించిన 1972 – 1982 మధ్య కాలానికి సంబంధించి మొత్తం తెలుగు సినీపరిశ్రమ పరంగా గమనిస్తే – ఎన్టీఆర్ (15 చిత్రాలు) తరువాత శోభన్ బాబుదే (10 చిత్రాలు) అగ్రస్థానం. చివరకు సీనియర్ హీరోలతో సహా మిగతా హీరోలెవరూ శోభన్బాబులో సగం మార్కును కూడా దాటలేకపోయారు. అదీ ఆ కాలఘట్టంలో హీరో శోభన్బాబుకున్న సక్సెస్ స్టామినా! ముగ్గురు మిత్రుల ‘దీపారాధన’ ఒకపక్కన ‘ఇల్లాలు’ క్రిక్కిరిన ప్రేక్షకులతో ఆడుతుంటే, అదే సమయంలో... ఆ పక్కనే కూతవేటు దూరంలో... వేరే హాలులో శోభన్‌బాబు సినిమా ‘దీపారాధన’ సక్సెస్‌ఫుల్‌గా నడవడం ఆ రోజుల్లోని ఓ విశేషం. ‘బలిపీఠం’, ‘గోరింటాకు’ తరువాత దర్శకుడు దాసరి – శోభన్‌బాబుల కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. స్నేహం విలువను చాటే ఈ సినిమా నిరుద్యోగులైన ముగ్గురు ప్రాణమిత్రుల (శోభన్, మోహన్‌బాబు, మురళీమోహన్) కథ. వారిలో ఒకరైన హీరోకు పెళ్ళి కావడం... ఎదురైన సంఘటనలు... త్యాగాలు... ఇలా సెంటిమెంటల్‌గా సాగే, సంభాషణల ప్రధానమైన సినిమా ఇది. ‘వచ్చే జన్మంటూ ఉంటే మీ భార్యగా కాకుండా, స్నేహితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ కన్నుమూసే త్యాగభరిత కథానాయికగా జయప్రద కనిపిస్తారు. చక్రవర్తి బాణీల్లో ‘సన్నగా సనసన్నగా...’, ‘తూరుపు తిరిగి దణ్ణం పెట్టు అన్నారండి మావారు...’ పాటలు అప్పట్లో పదే పదే వినిపించేవి. ‘దీపారాధన’ మధ్యతరగతి మహిళలను ఆకట్టుకుంది. ‘ఇల్లాలు’ తర్వాత రెండు రోజుల తేడాలో ‘దీపారాధన’ షిఫ్టులు, నూన్ షోలతో 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొంది. వంద రోజుల్లో...3 వంద రోజులు నిజం చెప్పాలంటే, శోభన్ బాబుకు ఒకటికి మూడు శతదినోత్సవ చిత్రాలు అందించి, బాగా కలిసొచ్చిన సంవత్సరాల్లో ఒకటి – 1981. ఆ ఏడాది జనవరి 1న వచ్చిన ‘పండంటి జీవితం’ వంద రోజులు ఆడింది. అప్పట్లో విజయవాడ (కల్యాణచక్రవర్తి థియేటర్) సహా 4 కేంద్రాలలో ‘పండంటి జీవితం’ చిత్రాన్ని 98 రోజులకే ఎత్తేసి, 99వ రోజున ఏప్రిల్ 9న అదే శోభన్‌బాబు నటించిన కొత్త చిత్రం ‘ఇల్లాలు’ రిలీజ్ చేశారు. గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ కూడా సూపర్ హిట్టయి, వంద రోజులు దాటేసింది. ఇంకా గమ్మత్తేమిటంటే, ‘ఇల్లాలు’ రిలీజయ్యాక రెండు రోజుల తేడాతో ఏప్రిల్ 11న శోభన్‌బాబు నటించినదే ‘దీపారాధన’ రిలీజైంది. ఒక పక్కన ‘ఇల్లాలు’ విపరీతమైన ఆదరణతో నడుస్తుండగానే, మరోపక్క ‘దీపారాధన’ కూడా హిట్టయింది. శతదినోత్సవమూ జరుపుకొంది. మొత్తానికి, వంద రోజుల వ్యవధిలో 3 వంద రోజుల సినిమాలు రావడం ఏ హీరోకైనా అరుదైన సంఘటన. ఆ మూడూ కుటుంబ కథలు, సెంటిమెంట్ చిత్రాలే తప్ప, మాస్ యాక్షన్ సినిమాలు కావు. అది గమనార్హం. అప్పట్లో శోభన్‌బాబు సినిమాకున్న మహిళాదరణకు అది ఓ నిదర్శనం. శోభన్‌బాబు చేసిన ఏకైక సినీ వ్యాపారం! అప్పట్లో దర్శకుడు తాతినేని రామారావు, నిర్మాణ సారథులు అట్లూరి పూర్ణచంద్రరావు, జి. బాబు, తరువాతి కాలంలో నిర్మాతగా పేరు తెచ్చుకున్న వై. హరికృష్ణ (మేనేజింగ్ పార్ట్నర్) – నలుగురూ కలసి చిత్రనిర్మాణం చేసేవారు. కేంద్రీకృత సినీ పంపిణీ వ్యవస్థ ఇంకా పట్టుసడలని సమయం అది. ఆ పరిస్థితుల్లో ఆ నలుగురూ, హరికృష్ణ మేనల్లుడైన కాట్రగడ్డ ప్రసాద్, హైదరాబాద్ ‘వెంకటేశా’ థియేటర్ బి.వి. రాజు, తర్వాత టి.టి.డి చైర్మనైన ఆదికేశవులునాయుడు భాగస్వాములుగా ‘లక్ష్మీచిత్ర’ అనే ఓ కొత్త పంపిణీ సంస్థను ప్రారంభించారు. హీరో శోభన్‌బాబు ఆర్థికంగా అండగా నిలిచారు. తన సతీమణికి అన్నగారైన గోపిని అందులో భాగస్వామిని చేశారు. ఒకరకంగా శోభన్‌బాబు సినీ వ్యాపారమంటూ చేసింది – ఈ పంపిణీ సంస్థలో చేతులు కలపడమొక్కటే! 1979 మార్చి 29న విజయవాడలో ‘లక్ష్మీచిత్ర’ కార్యాలయం ప్రారంభమైంది. ఆంధ్రాలో ‘లక్ష్మీచిత్ర’గా, నైజామ్‌లో ‘శ్రీలక్ష్మీచిత్ర’గా వ్యాపారం నడిచింది. శోభన్ హీరోగా నటించిన ‘కార్తీకదీపం’ తొలి ప్రయత్నంగా విడుదలైంది. అది సూపర్ హిట్. అక్కడ నుంచి ‘లక్ష్మీచిత్ర’ వెనుదిరిగి చూడలేదు. వరుసగా కొన్నేళ్ళు శోభన్ సినిమాలన్నీ ఆ సంస్థే పంపిణీ చేసింది. 1981 మొదట్లో రిలీజైన ‘పండంటి జీవితం’, ‘ఇల్లాలు’– లక్ష్మీచిత్ర రిలీజ్లే. శోభన్‌తో చిత్రాలు నిర్మించే స్థాయికి వై. హరికృష్ణ ఎదిగారు. కాట్రగడ్డ ప్రసాద్ ‘వసుధాచిత్ర’తో డిస్ట్రిబ్యూషన్ నడిపి, మేనమామ బాటలో నిర్మాత అయరు. ఇప్పుడు సౌతిండియన్ ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షుడయ్యారు. మహిళలు మెచ్చిన అందాల నటుడు సినిమాల్లోనే కాదు... చదువుకొనే రోజుల నుంచి అందగాడు శోభన్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. చదువుకొనే రోజుల్లో ఆఖరు నిమిషంలో కాలేజీ ఎన్నికల్లో అనుకోకుండా పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకు లేడీ స్టూడెంట్స్ ఓట్లు మూకుమ్మడిగా పడ్డాయి. అనూహ్యంగా ఆయన గెలిచారు. ఆ సంగతి శోభన్‌బాబే స్వయంగా రాశారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయనకు మహిళా అభిమానులే ఎక్కువ. ‘శారద’, ‘జీవన తరంగాలు’, ‘జీవనజ్యోతి’ చిత్రాల రోజుల నుంచి ఆ ఫాలోయింగ్ అలా కొనసాగుతూ వచ్చింది. అందుకే, ఒక దశ దాటిన తరువాత నుంచి ఆయన తన ప్రధాన అభిమాన వర్గమైన మహిళా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేసేవారు. మహిళలు మెచ్చే అంశాలు, సెంటిమెంట్ ఉండేలా చూసుకొనేవారు. 1979 నాటి ‘కార్తీక దీపం’ మొదలు ‘గోరింటాకు’, ‘ఇల్లాలు–ప్రియురాలు’, ‘శ్రావణసంధ్య’(’86) – ఇలా అన్నీ అశేష మహిళాదరణతో ఆయన కెరీర్‌ను అందంగా తీర్చిదిద్దినవే. మరణానంతరం కూడా ఇవాళ్టికీ ఆయనకు ఒక వర్గం అభిమానులు ఉన్నారంటే, దానికి ఆ కథలు, ఆ సినిమాలు అందించిన ఇమేజే కారణం. – రెంటాల జయదేవ -
సెకండ్ వేవ్ సినిమా.. మూడు నెలల ముచ్చటేనా?
కరోనా మళ్ళీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ స్పీడుగా వ్యాపిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... సినీ పరిశ్రమపై మళ్ళీ ప్రభావం చూపుతోంది. దేశంలోకెల్లా కరోనా కేసులు ఎక్కువున్న... మహారాష్ట్ర సినిమా హాళ్ళు పూర్తిగా మూసేసింది. హిందీ రిలీజులు వాయిదా పడుతున్నాయి. కర్ణాటక సహా దేశంలోని అనేక రాష్ట్రాలేమో... 50 శాతం సీటింగ్ కెపాసిటీకి దిగి వచ్చాయి. కన్నడ పునీత్ రాజ్‌కుమార్ ‘యువరత్న’ రిలీజైన వారం రోజులకే ఇవాళ్టి నుంచి ఓటీటీ బాట పట్టింది. తమిళ సర్కార్ నేటి నుంచే సీటింగ్ తగ్గించేసింది. ఫుల్ కెపాసిటీ ఉన్నా... తెలుగునాట హాళ్ళలో జనం పలచబడుతున్నారు. ‘లవ్‌స్టోరీ’ పోస్ట్‌పోన్ అయింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలంగాణ హైకోర్టు అడుగుతోంది. మరి, ఇప్పుడిక... మన సినిమా హాళ్ళ సంగతేమిటి? రిలీజవ్వాల్సిన మిగతా తెలుగు సిన్మాల భవిత ఏమిటి? సరిగ్గా ఏడాది క్రితం... కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్ డౌన్లో ఉంది. హాళ్ళు మూసేశారు. సినిమాలు లేవు. సమ్మర్ మొదలు గత డిసెంబర్ దాకా సినీ వ్యాపారమే తుడుచుకుపోయింది. ఏడాది తరువాత... ఇప్పుడు లాక్ డౌన్ లేదు. కరోనా మాత్రం బలంగానే ఉంది. హాళ్ళు తెరిచారు. సినిమాలు వస్తున్నాయి. కానీ, సెకండ్ వేవ్ దెబ్బతో ఇప్పుడు క్రమంగా హాలుకు వచ్చే జనమే తగ్గుతున్నారు. రెండువారాలుగా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో తెలుగు నాట కూడా సినిమా హాళ్ళపై షరతులు తప్పేలా లేవు. దాంతో, భారీ ఖర్చు పెట్టి తీసి, అంతే భారీగా వ్యాపారమూ జరుపుకొన్న పెద్ద సినిమాల రిలీజులు డోలాయమానంలో పడ్డాయి. తాజాగా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా తాజా పరిస్థితికి నిదర్శనం. టెస్టుల నడుమే... తెగ షూటింగ్స్ నిజానికి, లాక్డౌన్ ఎత్తేశాక∙ఒక దశలో తెలుగునాట షూటింగులు పీక్‌కి వెళ్ళాయి. రోజూ ఏకంగా 120కి పైగా షూటింగులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేప్తో ఆ జోరూ కొంత తగ్గింది. అయితేనేం... ఇప్పటికీ సినిమాలైతేనేం, వెబ్ సిరీస్లైతేనేం... రోజుకు సగటున 80 షూటింగులైతే తెలుగునాట జరుగుతున్నాయి. ‘‘షూటింగుల కోసం తగినంత మంది టెక్నీషియన్లైనా దొరకని పరిస్థితి. చివరకు, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న మా భారీ చిత్రానికి కావాల్సినంత మంది మేకప్మ్యాన్లు కూడా దొరకడం లేదంటే నమ్మండి’’ అని ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అయితే, ఈ షూటింగుల్లో శానిటైజేషన్, పదే పదే టెస్టులకే శ్రమ, ఖర్చు తడిసిమోపెడవుతున్నాయి. ఇటీవల అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ షూటింగు కోసం 100 మంది జూనియర్ ఆర్టిస్టులకు టెస్టులు చేస్తే, 45 మందికి పాజిటివ్ వచ్చింది. గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ సహా తెలుగునాట పలు సినిమా యూనిట్లు ముంబయ్, చెన్నైల నుంచి వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించి కానీ, షూటింగుకు అనుమతించడం లేదు. ‘‘రోజూ భారీ యూనిట్‌తో షూటింగ్ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్ళను ఒక రోజు ముందే వచ్చి, పరీక్ష చేయించుకోమంటున్నాం. స్థాని కులకు సైతం రెండు రోజులకు ఒకసారి ర్యాపిడ్ టెస్టులు చేయిస్తున్నాం’’ అని ‘శాకుంతలం’ చిత్ర వర్గాలు తెలిపాయి. హిందీలో వాయిదా పర్వం టెస్టులు, షూటింగుల మాటెలా ఉన్నా – కరోనా విజృంభణ ఆగడం లేదు. సామాజిక దూరంతో షూటింగులు జరుపుకొంటున్న హిందీ చిత్రసీమ చివరకు మూతపడ్డ హాళ్ళు, వివిధ ప్రాంతాల్లోని కర్ఫ్యూ, లాక్డౌన్, 144 సెక్షన్ల నిబంధనలతో ఏకంగా రిలీజులు వాయిదా వేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు హిందీ సినిమాలు వాయిదా బాట పట్టాయి. రానా నటించిన తెలుగు వెర్షన్ ‘అరణ్య’ రిలీజైంది కానీ, దాని రిలీజుకు మూడు రోజుల ముందే మార్చి 23న హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ రిలీజ్’ను చిత్రనిర్మాణ సంస్థ ఈరోస్ నిరవధికంగా వాయిదా వేసింది. ఇక, అమితాబ్ ‘చెహరే(’ ఏప్రిల్ 9న విడుదల కావాల్సింది. దాన్నీ వాయిదా వేశారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈ నెల 30న రిలీజు చేద్దామనుకున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశి’ సైతం తాజా పరిస్థితుల్లో మళ్ళీ నిరవధికంగా వాయిదా పడింది. ‘బబ్లీ ఔర్ బంటీ 2’ సహా అనేకం ఇప్పటికే పోస్ట్పోనయ్యాయి. కరోనా సెకండ్, ఆపై థర్డ్‌వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ సినిమాలు కానీ, వీటి తరువాత రిలీజనుకున్న ఇతర సినిమాలు కానీ అను కున్నట్టు రిలీ జవడం కచ్చితంగా అనుమానమే! పచ్చిగా చెప్పాలంటే, అసంభవమే!! మూడు నెలల ముచ్చటేనా? నిజానికి, అన్–లాక్డౌన్ తరువాత సినీరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హాలీవుడ్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ వేల కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క గత డిసెంబర్లో హాళ్ళు తెరవడానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. సగం థియేటర్ కెపాసిటీలో సైతం సంక్రాంతి సిన్మాలు ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’ లాంటివి వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ తరువాత ఫిబ్రవరి 5 నుంచి పూర్తి కెపాసిటీకి అనుమతి ఇచ్చాక, తెలుగులో చిన్న, పెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చాయి. ఫిబ్రవరి 12న వచ్చిన ‘ఉప్పెన’తో హాళ్ళు పూర్తిగా హౌస్ ఫుల్ అయి, కరోనా మునుపటి రోజుల్ని గుర్తు చేశాయి. ఇక కరోనాతో జీవితంలో నవ్వు కరవైన జనాన్ని మార్చి 11న వచ్చిన ‘జాతిరత్నాలు’ నవ్వించి, అనూహ్య విజయంతో పాటు, అద్భుతమైన షేర్లు రాబట్టింది. తాజా హాలీవుడ్ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అయితే ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు భాషల్లోనూ తెలుగునాట బాగా ఆడుతోంది. అందుకే, ‘‘గడచిన మూడున్నర నెలల్లో మన దేశం మొత్తం మీద మిగతా సినీపరిశ్రమలతో పోలిస్తే, తెలుగు సినిమాయే బాగుంది. తెలుగు స్ఫూర్తితో తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రసీమల్లోనూ ఉత్సాహం పుంజుకుంది’’ అని తమిళ హీరో కార్తీ, కన్నడ పునీత్ రాజ్ కుమార్ సైతం ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టే క్రమంగా మిగతాచోట్లా వసూళ్లు పెరిగాయి. మాలీవుడ్‌లో మమ్ముట్టి ‘ది ప్రీస్ట్’ కరోనా తర్వాత ఫస్ట్ బ్లాక్‌బస్టరైంది. కోలీవుడ్‌లో ఈ నెల 2న రిలీజైన కార్తీ ‘సుల్తాన్’ మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా గ్రాస్ సాధిం చింది. టాలీవుడ్‌లోనూ భారీ బిజినెస్ జరుగుతోంది. ఏడాది తర్వాత బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతున్నవేళ, ఇదంతా మూడునెలల ముచ్చటేనా అనిపించేలా సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్ళీ కలవరంలోకి నెట్టింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జనంపైనా, సరిగ్గా కరోనా నిబంధనలు పాటించని థియేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి, సుదర్శన్ థియేటర్ల ఓనరైన బాలగోవిందరాజు అంగీకరించారు. అయితే, ‘‘అలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా, ఎకాఎకిన హాళ్ళ కెపాసిటీ 50 శాతం తగ్గించడం మొదలు మూసివేత దాకా సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సినీపరిశ్రమకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో హాళ్ళలో యాభై శాతం కెపాసిటీకే అనుమతి అని షరతు పెడితే వ్యాపారం దాదాపు సున్నాయే. ‘‘ఆ షరతు మళ్ళీ పెడితే – జనం లేకుండా హాళ్ళు నామ్ కే వాస్తే నడుస్తాయే తప్ప, నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రతినిధి అన్నారు. ‘‘కెపాసిటీ 50 శాతమే ఐనా, ఖర్చు మాత్రం ఎప్పటిలానే వంద శాతం తప్పదు’’ అని శాలిబండ సుధా మల్టీప్లెక్స్ ఓనర్ కె. అనుపమ్ రెడ్డి వాపోయారు. కానీ, వ్యాపారం కన్నా జనం క్షేమం బాగుండాలని కోరుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. మూసినా... సగమే తెరిచినా... దెబ్బ మీద దెబ్బే! గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 నెలలకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్న నేపథ్యంలో సహజంగానే అడ్వా¯Œ ్స బుకింగులు జోరుగా సాగుతున్నాయి. కోర్టు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా తెచ్చుకుంటున్న ఉత్తర్వులతో తెలంగాణలో టికెట్ రేట్లూ సింగిల్ స్క్రీన్లలో రూ. 150కి, మల్టీప్లెక్సుల్లో రూ. 200కి ఎగబాకాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో ఓ హౌస్ ఫుల్ స్టార్ సినిమా రిలీజైతే, ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడేవారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే ఉంది. కొందరు ఎగ్జిబిటర్లే అది ఒప్పుకుంటున్నారు. అందుకే లాక్డౌన్ ఉండదనీ, హాళ్ళను మూయబోమనీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా – గుంపుల కొద్దీ జనంతో, వ్యాప్తికి కారణమయ్యే థియేటర్లపై ఆంక్షలు విధించడం పెద్ద పనేమీ కాదు. కర్ణాటక, తమిళనాడు బాటలో ఇతర రాష్ట్రాల్లో సైతం మళ్లీ 50 పర్సెంట్ కెపాసిటీతోనే థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు ఆదేశించేంచే ఛాన్స్ బలంగా ఉంది. తమిళ సర్కారు సైతం ఎన్నికలు ముగిశాక సరిగ్గా ధనుష్ ‘కర్ణన్’ రిలీజు రోజు నుంచి షరతులు పెట్టింది. ‘వకీల్ సాబ్’ సహా తెలుగులోనూ పలుకుబడి గల పెద్దల సినిమాలు రిలీజైపోతాయి గనక, ఇక్కడా హాళ్ళపై ఆంక్షలు రావడం ఖాయం. అదే జరిగితే... కలెక్షన్లే కీలకమైన ‘ఆచార్య’ సహా అనేక స్టార్ సినిమాల రిలీజ్ ప్రశ్నార్థకమే. అదే ఇప్పుడు ఎగ్జిబిటర్లకూ, వారి అడ్వాన్సుల మీద ఆధారపడ్డ బయ్యర్లకూ, వారితో వ్యాపారం చేసి సిన్మా రిలీజు చేసే నిర్మాతలకూ కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. ఒక్కమాటలో – ఇదంతా ఓ చెయిన్ రియాక్షన్. వెరసి, ఇప్పుడిప్పుడే కాళ్ళూ చేతులూ కూడదీసుకుంటున్న సినీ పరిశ్రమపై ఈ సెకండ్ వేవ్‌తో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. తగ్గుతున్న జనం... తరిగిపోతున్న కలెక్షన్లు... కరోనా సెకండ్ వేవ్ సమాజంతో పాటు సినిమా మీదా గట్టిగా ప్రభావం చూపెడుతోంది. ‘‘కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, హాళ్ళకొచ్చే జనం రెండు వారాలుగా తగ్గుతున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక... ఫరవాలేదనుకున్న సినిమాలకు సైతం మంచి కలెక్షన్లే వస్తే, ఇప్పుడు బాగున్న సినిమాలకు కూడా ఫరవా లేదనే స్థాయి కలెక్షన్లయినా రావట్లేదు. అలా కొన్ని సినిమాలు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్‌లో బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోయాయి’’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ టి. బాలగోవిందరాజు వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెల మధ్య దాకా హౌస్ ఫుల్ బోర్డులు చూసిన ఏసీ హాళ్ళలో ప్రస్తుతం సగటున ఆటకు 30 నుంచి 40 శాతం ప్రేక్షకులే ఉంటున్నారు. గత నెల మొదట్లో ఫ్యామిలీలు, ఆడవాళ్ళు, పిల్లలతో కళకళలాడి పూర్వవైభవం వస్తోందని ఆశలు రేపిన హాళ్ళు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మూడు రాష్ట్రాల మార్కెట్ పాయె! తెలుగులో కూడా సినిమాలు ముందుగా ప్లాన్ చేసిన తేదీలకు వస్తాయా అన్నది సందేహమే. మహారాష్ట్రలో హాళ్ళు మూసేస్తే, కన్నడనాట ఈ నెల 7 నుంచి సినిమా హాళ్ళను సగం సీటింగుకే పరిమితం చేశారు. తాజాగా, తమిళనాడులో సైతం ఇవాళ (ఏప్రిల్ 9) నుంచి థియేటర్లలో 50 శాతం సీటింగే అని అక్కడి సర్కారు ప్రకటించింది. అలా ఇప్పుడు మన తెలుగు సినిమాకు ఈ మూడు పొరుగు రాష్ట్రాల మార్కెట్ పోయింది. ఆ దెబ్బ తెలుగు సిన్మా వ్యాపారం పైనా ఉంటుంది. ‘‘మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో హాళ్ళపై వచ్చిన నిర్ణయాల ప్రభావం మన సినీసీమపై ఇప్పటికే పడింది. రేపు పొద్దున మన దగ్గర థియేటర్లు ఎంత కెపాసిటీతో నడుస్తాయి, హాళ్ళు తెరిచి ఉన్నా జనం వస్తారా – ఇలా అందరం రకరకాల అనుమానాలతో ఉన్నాం’’ అని పేరు ప్రచురించవద్దంటూ ఓ సినీ నిర్మాత చెప్పారు. హాళ్ళు మూసిన మరాఠ్వాడా, ఢిల్లీ లాంటి చోట్ల మన సినిమానే రిలీజు కాదు. పెద్ద హీరోల సినిమాలకు బలమైన మార్కెటైన కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల రిలీజైనా సగం కెపాసిటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మారిన పరిస్థితుల్లో బయ్యర్లు సైతం ఒకప్పుడు తాము ఒప్పుకున్న రేట్లకు సినిమా కొంటారా, డబ్బు మొత్తం నిర్మాతలకు కడతారా అన్నదీ అనుమానమే. ఆ మేరకు రిలీజుకు ముందే వ్యాపారం, రిలీజయ్యాక సీటింగ్ తగ్గుదలతో కలెక్షన్లు తెలుగు సినిమా నష్టపోయినట్టే! హాట్‌స్పాట్‌గా హాళ్లు? ఒక హౌస్‌ఫుల్ స్టార్ సినిమా ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో రిలీజవుతుంది. ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడే వారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే పొంచి ఉంది. జనంలో భయం పోయి, నిర్లక్ష్యం పెరిగిందని గమనిస్తున్న కొందరు ఎగ్జిబిటర్లే ఆ సంగతి బాహాటంగా ఒప్పుకుంటున్నారు. పెరుగుతున్న పాజిటివ్‌లు హిందీ, తెలుగు సీమల్లో రోజూ పలువురు ‘పాజిటివ్’గా తేలుతున్నారు. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న నటి నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. దాంతో, ఆమెతో కలసి టీవీ ఇంటర్వ్యూలిచ్చిన అంజలి, అనన్య, దర్శకుడు శ్రీరామ్ వేణు సహా అందరూ టెస్టుల హడావిడి పడ్డారు. హిందీలో పలువురి పేర్లు బయటకు వస్తుంటే, మన దగ్గరేమో బయటపడి చెప్పకుండా హోమ్ క్వారంటైన్లో గడిపేస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. నివేదా ఎఫెక్ట్‌తో అంజలి స్టాఫ్‌కూ కరోనా సోకిందనీ, తనకూ తప్పదని అంజలి సైతం క్వారంటైన్లోకెళ్ళారనీ భోగట్టా. ఆమె మాత్రం తనకు కరోనా రాలేదని ఖండించారు. ఏమైనా, షూటింగుల్లో ఇప్పటికీ పదులమంది కరోనా పాజిటివ్‌గా తేలుతు న్నారు. ఇటీవలే టీజర్ రిలీజైన ఓ భారీ ‘స్టయిలిష్’ సిన్మా సెట్స్‌లో ఒకటికి, రెండు సెట్ల అసిస్టెం ట్లను పెట్టుకొని, ఒకరికి వస్తే మరొకర్ని దింపి, షూటింగ్ కానిచ్చేస్తున్నారు. తెలుగులోనూ... వాయిదాలు షురూ! తాజా పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు దర్శక,నిర్మాతలు గురువారం సాయంత్రం ప్రకటించారు. కానీ,ఈ సెకండ్ వేవ్‌లోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. తెలుగునాట రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి వెళుతుండడంతో రానున్న రోజుల్లో మళ్ళీ షరతులు విధించే అవకాశం ఉంది. నేడో, రేపో తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లలో సగం మందినే అనుమతించే సూచనలున్నాయి. అదే గనక జరిగితే, ‘వకీల్ సాబ్’ మొదలు ఈ నెలలోనే రిలీజు కావాల్సిన రానా ‘విరాటపర్వం’, మే నెలలో వస్తామన్న చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’ లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు ఇరుకున పడడం ఖాయం. పెట్టిన ఖర్చు మేరకు వ్యాపారం జరిగి, వసూళ్ళూ రావాలంటే – పరిస్థితులు చక్కబడే దాకా రిలీజు వాయిదా మినహా మరో మార్గం లేదు. ఈ నెలలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రావాల్సిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ సైతం ఇప్పటికే రిలీజు వాయిదా రూటు పట్టింది. కరోనాకు తోడు గ్రాఫిక్స్ సహా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది గనక ‘ఆచార్య’ వాయిదా ఖాయమైందని ఆంతరంగిక వర్గాల సమాచారం. వెరసి, ఈ డోలాయమాన పరిస్థితిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందో, ఏం జరుగుతుందో సినీరంగంలో ఎవరూ ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. – డాక్టర్ రెంటాల జయదేవ -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
అక్కడ ఇందిరాగాంధీ, ఇక్కడ వాణిశ్రీ
మగాళ్ళదే పెత్తనమైన రోజుల్లో... అదీ హీరోలదే రాజ్యమైన సినిమా రంగంలో... హీరోయిన్ ప్రాధాన్యంతో సినిమా వస్తే? అదీ ఓ అప్‌కమింగ్ తారతో? పైపెచ్చు, హీరోయిన్ ఓరియంటెడ్ టైటిల్‌తో..అదీ ఏ క్రైమ్ సినిమానో కాకుండా సాంఘికమైతే? ఇప్పుడంటే ఓకే కానీ, బ్లాక్ అండ్ వైట్ కాలంలో... యాభై ఏళ్ళ క్రితం ఇలాంటివి ఆర్థికంగానూ, ఆదరణ రీత్యా కష్టమే. కానీ, వాణిశ్రీ నాయికగా, శోభన్‌బాబుతో దర్శక–నిర్మాత గిడుతూరి సూర్యం చేసిన ప్రయత్నం 1971 మార్చి 25న రిలీజైన ‘కథానాయకురాలు’. ‘తనువా హరిచందనమే...’ లాంటి పాపులర్ పాటలు, విలక్షణమైన విలనీ డైలాగులతో ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తే. అభ్యుదయ భావాలతో, సామ్యవాదాన్ని ప్రబోధించే భావాలతో సాటి అభ్యుదయ కవులు, రచయితలైన శ్రీశ్రీ, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి, రెంటాల గోపాలకృష్ణ తదితరుల సృజనాత్మక భాగస్వామ్యంతో గిడుతూరి చేసిన ఆ ప్రయోగానికి ఇప్పుడు 50 వసంతాలు. లేచింది... నిద్రలేచింది మహిళాలోకం! అది 1971. అప్పుడప్పుడే సమాజంలో మార్పు వస్తోంది. వివిధ రంగాలలో స్త్రీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఇందిరా గాంధీ సారథ్యంలో సరికొత్త కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 1966 జనవరిలోనే తొలిసారి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ, తాజాగా మధ్యంతర ఎన్నికలతో దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు. అప్పటికే ఆమె రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో నెహ్రూ మార్కు సోషలిజానికి తన దూకుడును జోడించారు. ఓ పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మహిళ నాయకురాలై, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్న వేళ అది. సమాజంలోని మార్పులకు తగ్గట్టుగా సినిమాల్లో కథలు, స్త్రీ పాత్రలు మారాల్సిన సమయం వచ్చింది. స్త్రీలను చేతకానివాళ్ళుగా, వంటింటి కుందేళ్ళుగా చూపిస్తే ఇష్టపడరనే ఆలోచన మొదలైంది. సినీ విశ్లేషకుడు, సినీ పంపిణీ రంగ నిపుణుడు స్వర్గీయ కాట్రగడ్డ నరసయ్య మాటల్లో చెప్పాలంటే, ‘‘సమాజ అభివృద్ధిలో, సంఘంలోని కుళ్ళును కడిగేయడంలో ముఖ్యపాత్ర వహించేవారిగా స్త్రీలను చూపించాల్సిన అవసరం వచ్చింది. తెరపై వీరోచిత చర్యలను కథానాయకులు చేసినట్లే స్త్రీలే ప్రాముఖ్యం వహించే పాత్రలు అవసర’’మయ్యాయి. సరిగ్గా ఆ పరిస్థితుల్లో వచ్చినవే – భానుమతి నటించిన ‘మట్టిలో మాణిక్యం’. ఆ వెనువెంటనే వాణిశ్రీ ‘కథానాయకురాలు’. సూపర్‌హిట్ శోభన్‌బాబు– వాణిశ్రీ ఇందిరా గాంధీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సరిగ్గా వారం రోజులకు వచ్చిన చిత్రం ‘కథానాయకురాలు’. సామ్యవాదాన్ని ప్రబోధిస్తూ, లేడీ ఓరియంటెడ్ టైటిల్‌తో అలా ఓ సినిమా రావడం అప్పట్లో విశేషం. గిడుతూరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూర్చి, నల్ల వెంకట్రావుతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాధారణంగా హీరోను విప్లవ నాయకుడిగా చూపించడం బాక్సాఫీస్ ఫార్ములా. కానీ, కార్మిక సంఘ నాయకురాలిగా హీరోయిన్ను చూపించడం, ఆమె ఓ ధనిక యజమానితో కార్మిక ప్రయోజనాల కోసం పోరాడడం వెరైటీ. ‘మనుషులు మారాలి’ (1969) లాంటి హిట్స్‌తో పేరు తెచ్చుకొని, హీరోగా స్థిరపడుతున్న రోజుల్లో శోభన్‌బాబు కథానుగుణమైన ఆ టైటిల్‌కి ఒప్పుకోవడం విశేషం. శోభన్–వాణిశ్రీ జంట తర్వాతి కాలంలో ‘చెల్లెలి కాపురం’, ‘జీవన తరంగాలు’, ‘ఖైదీ బాబాయ్’, ‘జీవనజ్యోతి’తో హిట్ పెయిర్‌గా నిలవడం గమనార్హం. ‘కథానాయకురాలు’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ కథలో చేసిన శోభన్ ఆనక హీరోయిన్ల హీరోగా, హీరోలు సైతం అసూయపడే అందాల నటుడిగా ఇమేజ్ సాధించడం ఓ చరిత్ర. తారాపథానికి... ‘కథానాయకురాలు’ వాణిశ్రీ అనాథైన ఒక పేదపిల్ల చదువు – సంస్కారం అలవరచుకొని, నాయకురాలై, కార్మిక ఉద్యమాన్ని ఎలా జయప్రదంగా నడిపిందీ, సంఘవిద్రోహుల్ని ఎలా ఎదిరించిందీ కార్మిక విప్లవ ప్రబోధ చిత్రం ‘కథానాయకురాలు’ చూపెడుతుంది. కార్మికుల హక్కుల కోసం ప్రాణాలకు తెగించే హీరోయిన్, ధనికుల బిడ్డ అయినా తానెవరో చెప్పకుండా హీరోయిన్ పోరాటానికి అండగా నిలిచే హీరో, కార్మికలోకాన్ని అణచివేయాలనుకొనే మిల్లు నిర్వాహకుడు – ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ మూడు పాత్రల్లో వాణిశ్రీ, శోభన్‌బాబు, నాగభూషణం ఆకట్టుకుంటారు. ఇంకా అల్లు రామలింగయ్య, కాకరాల, ఛాయాదేవి, రామ్మోహన్, రావుగోపాలరావు, కామెడీకి రాజబాబు– ఇలా పేరున్న తారాగణమే ఉంది. ‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చిన్న పాత్రలో నటించారు. అప్పటికే వాణిశ్రీ తారాపథానికి పరుగులు తీస్తున్నారు. ఎన్టీఆర్ ‘కోడలు దిద్దిన కాపురం’, అక్కినేని ‘దసరా బుల్లోడు’ హిట్స్ తరువాత ‘కథానాయకురాలు’ వస్తే, ఆ వెంటనే కృష్ణ ‘అత్తలూ – కోడళ్ళు’, ఆ ఏడాదే శోభన్‌తోనే ‘చెల్లెలి కాపురం’ – ఇలా హీరోలందరి పక్కనా వాణిశ్రీ మెరిశారు. అయితే, ఒక రకంగా ఈ సినిమా వాణిశ్రీ బహుముఖ నటనను తెరపై చూపే రకరకాల గెటప్పులకు అవకాశమిచ్చింది. కార్మికనేతగా, ప్రేయసిగా, హిరణ్యకశిపుడిగా, తమిళ యువతిగా – విభిన్న వేషాలలో ఆమె తన ప్రతిభను ప్రదర్శించారు. ఎన్టీఆర్ ‘సంగీతలక్ష్మి’ తీసిన సూర్యమే... దర్శకుడు గిడుతూరి సూర్యం పేరు చెప్పగానే ఎన్టీఆర్ – జమునల ‘సంగీతలక్ష్మి’, యస్వీఆర్ – రామకృష్ణల ‘విక్రమార్క విజయం’, కాంతారావు ‘రణభేరి’, విజయలలిత ‘పంచకల్యాణి– దొంగల రాణి’, మంజుభార్గవి ‘అమృతకలశం’ లాంటి వేర్వేరు కోవల సినిమాలు సినీ ప్రియులకు గుర్తుకొస్తాయి. ప్రసిద్ధ సినీ దర్శకులు కృష్ణన్ – పంజు, భీమ్సింగ్లకు ఆయన శిష్యుడు. లేఖా జర్నలిస్టుగా, రచయితగా జీవితం ప్రారంభించి సినిమాల్లో ఎదిగిన ఆయన ఆ తరం అభ్యుదయ కవి, రచయిత. విశ్వనాథ సత్యనారాయణ, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, నాట్యాచార్యులు పసుమర్తి కృష్ణమూర్తి – డి. వేణుగోపాల్‌ల వద్ద కథారచన, చిత్రలేఖనం, కవిత్వం, నాటక రచన, నృత్యం – ఇలా అనేక కళలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కళారాధనలో... కమ్యూనిస్టులు అభ్యుదయ కవులు బెల్లంకొండ రామదాసు, అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరిసుబ్రహ్మణ్యం,రెంటాల గోపాల కృష్ణ తదితరులు గిడుతూరికి మిత్రులు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ చదివి, ‘ప్రజానాట్యమండలి’లో, ‘ఇండియన్ నేషనల్ ఆర్ట్ థియేటర్’లో గిడుతూరి నాటక రచన, దర్శకత్వం చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు. బలిజేపల్లి వద్ద నాటక, సినీ రచన నేర్చిన ఆయన రష్యా వెళ్ళి, అక్కడి మాస్కో మాస్ ఫిలిమ్ స్టూడియోలో శిక్షణ పొంది వచ్చాక, ఎన్టీఆర్ ‘సంగీత లక్ష్మి’ (1966)తో మొదలుపెట్టి పలు చిత్రాలను రూపొందించారు. ‘సంగీత లక్ష్మి’ అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి, ‘సంగీత లక్ష్మి’, ‘కథానాయకురాలు’ రెండూ గిడుతూరి నవలల ఆధారంగా వచ్చిన సినిమాలే. భార్య సరస్వతీదేవి పేరిట ‘శ్రీ సరస్వతీ చిత్ర’ పతాకం నెలకొల్పి, ఆయన సినిమాలు తీశారు. ఏంచేసినా అభ్యుదయ భావాల్ని వదిలిపెట్టలేదు. సినిమాలతో సహా తన ప్రతి సృజనలోనూ వాటిని వీలైనంతగా జొప్పించేవారు. ‘కథానాయకురాలు’ కూడా ఆ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే. ఆ గీతాలన్నీ అభ్యుదయ రచయితలవే! అభ్యుదయ కవులు శ్రీశ్రీ,ఆరుద్ర,ఏల్చూరితో ‘కథానాయకురాలు’కి పాటలు రాయించారు గిడుతూరి. ‘‘సోషలిస్టు విధానాల కోసం మన ఇందిరాగాంధీ బడా నాయకుల్ని ఎదిరించి, ఘనవిజయం సాధించింది! కార్మిక సంక్షేమం కోసం మన కథానాయకురాలు దుష్టశక్తుల నెదిరించి, అపూర్వ విజయం సాధించింది!’’ అని ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ప్రముఖంగా ప్రకటించారు. ‘అభినవ ప్రహ్లాద చరితం’ అంటూ దరిద్ర నారాయణుడే దేవుడిగా శ్రీశ్రీ రాసిన నాటకం హైలైట్. అలాగే, ‘మాభూమి’ నాటకకర్త సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ మరో హైలైట్. తర్వాతి కాలంలో ‘ఆంధ్రభూమి’ వీక్లీ ఎడిటర్‌గా పాపులరైన సికరాజు కూడా సినిమాలో జ్యోతిలక్ష్మిపై వచ్చే ‘చూడు షరాబీ...’ అనే శృంగార గీతం రాశారు. సెక్సప్పీల్ వల్లే సక్సెస్‌లా? ‘‘ధనస్వామ్యమా, జనస్వామ్యమా? ఈనాడు దేశానికేది కావాలి?’’ అని కథానాయకురాలు ద్వారా దర్శక – నిర్మాత ప్రశ్న సంధించారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అందమైన లోగో, డిజైన్లతో ఉగాది కానుకగా, 1971 మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి, ఆ ఫిబ్రవరిలోనే గిడుతూరి దర్శకత్వంలోనే ‘విక్రమార్క విజయం’ వచ్చింది. సక్సెస్ అయింది. ఆ వెంటనే స్వీయ నిర్మాణమైన ఈ సాంఘికంతో పలకరించారు గిడుతూరి. దేశంలో సెక్స్, క్రైమ్ చిత్రాలకే తప్ప, చక్కనికథతో సినిమా తీస్తే, దానికి డబ్బు రావడం లేదని అప్పటికే ఆయన ఆవేదన చెందుతూ ఉండేవారు. అందుకు తగ్గట్టే ‘కథానాయకురాలు’ పేరు తెచ్చినంత, డబ్బు తేలేదు. కాకపోతే, బి, సి సెంటర్లలో రిపీట్ రన్లతో ఎంతో కొంత లాభమే తెచ్చింది. అప్పటికే ఆడుతున్న ‘దసరా బుల్లోడు’, ‘రాజకోట రహస్యం’ లాంటి వాణిజ్య సినిమాల మధ్య కార్మిక విప్లవం లాంటి ప్రబోధాలిచ్చిన ‘కథానాయకురాలు’ నలిగిపోయింది. అయితే ‘తనువా...’ లాంటి పాటలతో, మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని చాటిన చిత్రంగా ‘కథానాయకురాలు’ ఇప్పటికీ ప్రత్యేకమే! ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ సాంగ్! అన్ని రకాల పాటలున్న ‘కథానాయకురాలు’లో ‘తనువా హరిచందనమే...’ పాట మాత్రం ఇవాళ్టికీ హైలైట్. హీరో శోభన్ బాబు, హీరోయిన్ వాణిశ్రీల కెరీర్లో పాపులర్ క్లాసికల్ హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా రిలీజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందరే 1971 మార్చి 21న ఆలిండియా రేడియో హైదరాబాద్, విజయవాడల్లో వివిధ భారతి – వాణిజ్య ప్రసారాలను ప్రారంభించారు. రేడియోలో తరచూ సినీగీతాలు వినే సావకాశం తెలుగునాట దక్కింది. ఆ వెంటనే ఆ నెలాఖరునే వాణిశ్రీయే హీరోయిన్ గా నటించిన ఎన్టీఆర్ ‘జీవితచక్రం’తో తెలుగు సినిమాలకు రేడియో పబ్లిసిటీ కూడా తొలిసారిగా మొదలైంది. మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా ‘తనువా హరిచందనమే’ పాట ఎస్పీబీ, పి. సుశీల గళాల్లో రేడియోలో తరచూ వినిపిస్తూనే ఉంది. టీవీలో, యూ ట్యూబుల్లో కనిపిస్తూనే ఉంది. ప్రసిద్ధ సినీ గాయని చిత్ర సైతం ఇటీవలే ఓ టీవీ షోలో ఈ పాట పాడడం దీనికున్న పాపులారిటీకి తాజా నిదర్శనం. సినీ రంగంలో ఎ.ఎ. రాజ్ గా ప్రసిద్ధుడైన మ్యూజిక్ డైరెక్టర్ ఆకుల అప్పలరాజుకు ఇది కెరీర్ బెస్ట్ సాంగ్. గమ్మత్తేమిటంటే, తక్కువ పాటలే రాసినా, ఈ ఒక్క పాట సినీ గీత రచయితగా గోన విజయరత్నాన్ని చిరంజీవిని చేసింది. డైలాగుల్లో... విప్లవతత్వం! విలనీ!! గిడుతూరి సూర్యం తన ఆప్తమిత్రుల్లో ఒకరైన ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత, నాటకకర్త రెంటాల గోపాలకృష్ణకు సినిమా సంభాషణల రచన బాధ్యత అప్పగించారు. అప్పటికే ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక వర్గంలో కీలక బాధ్యతల్లో ఉన్న రెంటాల అనేక అనువాదాలు, రచనలు చేసిన సుప్రసిద్ధులు. సినీ రంగంతో అనుబంధం, సినీ విమర్శకుడిగా పేరూ ఉన్నవారు. రంగస్థలంపై పేరున్న రెంటాల అంతకు ముందు గిడుతూరి తీసిన జానపదం ‘పంచకల్యాణి – దొంగలరాణి’ (1969 ఆగస్టు 2)కి డైలాగ్స్ రాశారు. ప్రజానాట్యమండలిలో, బెజవాడ హనుమంతరాయ గ్రంథాలయం ఆంధ్ర ఆర్ట్ థియేటర్లో నటుడిగా, నాటకకర్తగా కృషిచేసిన రెంటాల సామ్యవాదాన్ని ప్రబోధించే సాంఘిక చిత్రం ‘కథానాయకురాలు’లోనూ తన కలం పదును మరోసారి చూపారు. యజమాని, కార్మికుల సంఘర్షణ ప్రధాన ఇతివృత్తమైన ఈ చిత్రానికి రెంటాల రాసిన సంభాషణలు ‘‘ఆయా సన్నివేశాలకు తగినట్టు భావస్ఫోరకంగా, విప్లవతత్వాన్ని వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అప్పట్లో సినీ విమర్శకులు, సమీక్షకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రత్యేకించి, ‘‘సత్యారావు పాత్ర ధరించిన నటుడు నాగభూషణానికి రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి’’ అని పేర్కొన్నారు. రంగస్థలంపై మిత్రులు ఆచార్య ఆత్రేయ ‘విశ్వశాంతి’, అనిసెట్టి ‘గాలి మేడలు’ సహా అనేక నాటకాల్లో రెంటాల నటించారు. ఈ సినిమాలోనూ ఫ్యాక్టరీలో జీతాల పంపిణీ వేళ కార్మికుడు గోపయ్యగా కీలక ఘట్టంలో వెండితెరపైనా కనిపించడం విశేషం. బొంబాయి స్ఫూర్తితో... బెజవాడ దుర్గాకళామందిరం! 1920 జనవరి 17న ఏలూరులో సంపన్న చేనేత కుటుంబంలో జన్మించిన గిడుతూరి సూర్యంకి కళల పట్ల ఆసక్తి కలగడానికి ప్రేరణ ఒక రకంగా విజయవాడలోని ప్రసిద్ధ శ్రీదుర్గాకళామందిరం. బెజవాడలో నాటకశాలగా మొదలై 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సినిమా హాలుగా నడుస్తున్న దుర్గాకళామందిరం నిర్మాణంలో గిడుతూరి తండ్రి బంగారు పాత్ర చాలా ఉంది. 1920లలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆజ్ఞపై బొంబాయి వెళ్ళి, నాటకాలు ప్రదర్శించే థియేటర్లు సందర్శించి వచ్చారు బంగారు. బొంబాయి థియేటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్నీ, స్టేజీ ఏర్పాట్లనూ అనుసరిస్తూ, 1929 జూన్ ప్రాంతంలో పంతులు గారికి విజయవాడలో దుర్గాకళామందిరం నిర్మాణం చేశారు. ప్రదర్శకుల కోసం రొటేటింగ్ డిస్క్, వైర్ వర్క్స్, పాతాళంలోకి వెళ్ళేటట్టు స్టేజీ పైన అక్కడక్కడా పలకలు కిందకు తెరుచుకొనే ఏర్పాట్లు, ఇంకా అనేక టెక్నికల్ సదుపాయాలను కళామందిరంలో గిడుతూరి తండ్రి కల్పించారు. అనేక ప్రఖ్యాత నాటక సంస్థలు ఆయన కూర్చిన టెక్నికల్ సదుపాయాలతో అప్పట్లో అక్కడ అద్భుత ప్రదర్శనలిచ్చేవి. పంతులు గారి ప్రోత్సాహంతో దుర్గాకళామందిరంలో నిత్యం నాటకాలు, మూకీలు చూస్తూ కళల వైపు మొగ్గారు గిడుతూరి. అదే ఆయన సినీరంగ ప్రస్థానానికి బాటలు వేసింది. – రెంటాల జయదేవ చదవండి: హీట్ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ అవసరాల శ్రీనివాస్ బట్టతల వీడియో.. అసలు విషయం ఇదే! -
‘సింహాసనం’కోసం కృష్ణ ఎన్నో సాహసాలు.. ప్రతీది సంచలనమే
జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించిన హీరో కృష్ణ తొలిసారి దర్శకుడై చేసిన మరో సాహసం ‘సింహాసనం’. తెలుగులో తొలి 70 ఎం.ఎం–6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రంగా అది ఆ రోజుల్లో ఓ సంచలనం. అది 1983. ఎన్టీఆర్ సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎన్టీఆర్ వదిలి వెళ్ళిన నంబర్ 1 స్థానం కోసం అగ్ర హీరోల నుంచి యువ తారల దాకా అందరూ పోటీలోకి దిగారు. 1983లోనే నవంబర్‌లో కృష్ణ సొంత స్టూడియో పద్మాలయా ప్రారంభమైంది. నటుడిగా తెలుగులోనూ, నిర్మాతగా హిందీలోనూ కృష్ణ బిజీ. అయితే, ఒకపక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే, ఏదైనా సాహసం చేసి, సంస్థ జెండాను దేశవ్యాప్తంగా రెపరెపలాడించాలి. సరిగ్గా అప్పుడే కృష్ణ హిందీలో ‘పాతాళ్ భైరవి’ (1985 మే 3) రీమేక్‌తో ఓ జానపద ప్రయోగం తీశారు. హిట్. అంతే, పద్మాలయాకూ, దర్శకుడిగా తనకూ ప్రతిష్ఠాత్మకంగా భారీ సెట్స్‌తో జానపద సినిమా, అదీ ఫస్ట్ టైమ్ 70 ఎం.ఎంలో తీస్తే? ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే ‘సింహాసనం’. రెండు రాజ్యాల పోరాటకథగా... జానపదాలు కనుమరుగైపోయిన రోజుల్లో, కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ సాహసం వర్కౌట్ అవ్వాలంటే, హిందీలోనూ తీయాలని తీర్మానించుకున్నారు. తెలుగులో ‘సింహాసనం’, హిందీలో జితేంద్ర హీరోగా ‘సింఘాసన్’ పట్టాలెక్కాయి. మంచికీ – చెడుకీ సంఘర్షణగా ఈ చిత్రం తీశారు. సింహాసనం కోసం దశార్ణ రాజ్యానికీ, అవంతీ రాజ్యానికీ మధ్య పోరాటం ఈ చిత్రకథ. చరిత్ర కలగలిపిన జానపదం టైటిల్స్‌లో కథకు క్రెడిట్ కృష్ణదే అయినా, ఆయన ఆస్థాన రచయిత త్రిపురనేని మహారథిదే రచనలో కీలకపాత్ర. కాకతీయ సామ్రాజ్యం – రాణీ రుద్రమదేవి – ఆపత్కాలంలో ఆమెకు సాయపడే గోన గన్నారెడ్డి... ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి (జయప్రద), ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి (కృçష్ణ) పాత్రలు సృష్టించారు. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర. ఆ స్ఫూర్తితో చందనగంధి పాత్ర (మందాకిని) రాశారు. భారీ రాజదర్బారు... విగ్రహాలు... రెండు రాజ్యాల మధ్య జరిగే ఈ జానపద కథలో సహజత్వం కోసం కళాదర్శకుడు భాస్కరరాజు లక్షల ఖర్చుతో భారీ సెట్లు వేశారు. గమ్మత్తేమిటంటే, ఈ రాజుల కాలం కథలో కీలకమైన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే! ఆయన వేసిన ఆరుబయట రాజ దర్బార్ సెట్టు, భారీ విగ్రహాలు... చాలా కాలం స్టూడియోలో పలకరిస్తుండేవి. రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టే ముందు రామోజీరావుకు సైతం ఆ విగ్రహాల తయారీ గురించి ‘పద్మాలయా’ హనుమంతరావు వివరించారట. కొత్త సింగర్... పాటలు సూపర్‌హిట్ ‘సింహాసనం’లో కృష్ణ చేసిన మరో సాహసం – రాజ్ సీతారామ్ గానం. అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు ఓ వివాదం తలెత్తింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారామ్ గొంతు బాగుందనిపించింది. అంతే... కృష్ణ తన ‘సూర్య చంద్ర’ (1985)లో అన్ని పాటలూ అతనితోనే పాడించారు. ‘సింహా సనం’ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి ఆ గొంతుకే ఓటేశారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘వహవ్వా నీ యవ్వనం’, ‘ఇది కలయని నేననుకోనా’– ఇలా ఆత్రేయ, వేటూరి పాటలన్నీ హిట్. రాజ్‌సీతారామ్ పేరు మోతమోగింది. తీసేది 65 ఎం.ఎం! వేసేది 70 ఎం.ఎం!! నిజం చెప్పాలంటే, అప్పట్లో ఈ చిత్రాలేవీ సిసలైన 70 ఎం.ఎం కెమేరాతో తీసినవి కావు. ఆ కెమేరాలు 35 ఎం.ఎం కన్నా రెట్టింపు రిజల్యూషన్ ఉండే పెద్ద కెమేరాలు. అప్పటికి మన దేశంలో ఆ కెమేరాలూ లేవు. అందుకే అందరూ స్కోపులో, 65 ఎం.ఎం నెగటివ్ స్టాక్ మీద సినిమా షూట్ చేసుకొని, దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయించి, 70 ఎం.ఎం ఫిల్ము మీద ప్రింట్ చేసేవారు. షూట్ చేసిన 65 ఎం.ఎం పోగా, మిగతా 5 ఎం.ఎం ఫిల్మేమో ‘సౌండ్ ట్రాక్’ కోసమన్న మాట. మామూలు 35 ఎం.ఎం రీలుపై గీతలా సింగిల్ సౌండ్ ట్రాక్ ఉంటుంది. కానీ, 70 ఎం.ఎం రీలుపై మేగ్నటిక్ కోటింగ్‌లో సౌండ్‌ను ఆరు ట్రాక్‌లుగా, ఆరుసార్లు ముద్రించాల్సి ఉంటుంది. అందుకే, ‘6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ అంటారన్న మాట. అందరిలానే తెలుగు ‘సింహాసనం’ సైతం ఆ టెక్నిక్‌లో 65ఎం.ఎంలో తీసి, 70 ఎం.ఎంకి బ్లోఅప్ చేసినదే! ‘‘ఫేమస్ ‘షోలే’తో సహా మన దేశంలో తీసిన 70 ఎం.ఎంలన్నీ దాదాపు ఇలా తీసినవే. 35 ఎం.ఎంకి ఒక రకంగా, 70 ఎం.ఎంకి మరో రకంగా కెమేరాలో మార్కింగ్ ఉంటుంది. 35 ఎం.ఎంలో బొమ్మ ఎత్తుంటుంది. నలుచదరంగా ఉంటుంది. 70 ఎం.ఎంలోనూ బొమ్మ ఎత్తు అంతే కానీ, వెడల్పు రెట్టింపు ఉంటుంది. 70 ఎం.ఎం సినిమా తీయాలంటే కెమేరాలో గేట్ మారుస్తారు. ఒక్క 70 ఎం.ఎంలోనే సినిమా తీస్తే సులభమే కానీ, మన దగ్గర అన్ని థియేటర్లుండవు కాబట్టి, అత్యధిక చోట్ల 35 ఎం.ఎం ప్రింట్లే ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే, సినిమా తీస్తున్నప్పుడే బొమ్మ కట్ కాకుండా 35 ఎం.ఎం ప్రింట్‌కీ, 70 ఎం.ఎం ప్రింట్‌కీ తగ్గట్టు జాగ్రత్తగా కెమేరా ఫ్రేమింగ్ పెట్టాలి’’ అని ‘సింహాసనం’కి పనిచేసిన నేటి ప్రముఖ దర్శకుడు తేజ వివరించారు. స్వామి కెమేరా! నగాయిచ్ ట్రిక్స్ ‘సింహాసనం’ ఛాయాగ్రహణమంతా వి.ఎస్.ఆర్. స్వామి పనితనమే. కాగా, ఆయనకు కెమేరా గురువైన రవికాంత్ నగాయిచ్ ఈ ‘సింహాసనం’కి ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారు. నగాయిచ్ దగ్గర అసిస్టెంట్‌గా తేజ పనిచేశారు. ‘‘‘ఆకాశంలో ఒక తార...’ పాటలో బృందావన్ గార్డెన్స్‌లోనే ఓ ప్యాలెస్ ఉన్నట్టు చూపించడం లాంటివి ట్రిక్షాట్లే. అందుకోసం ప్యాలెస్ మినియేచర్ సెట్ తీసుకెళ్ళాం. అక్కడ షూటింగ్ చేశాక, 6 బస్సుల్లో డ్యాన్సర్లందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి, ఇక్కడ షూట్ సాగించాం’’ అని తేజ చెప్పారు. ఏడెనిమిది రెట్లు ఎక్కువ బడ్జెట్! ఒక షాట్‌ను తెలుగులో తీసి, వెంటనే అదే సెటప్‌లో హిందీ ‘సింఘాసన్’ చిత్రీకరించేవారు. 65 రోజుల్లో రెండు వెర్షన్లూ పూర్తి చేశారు. 40 – 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ రూ. 3 కోట్ల 20 లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు. బిజినెస్ కూడా అదే రేంజ్లో భారీగా జరిగింది. తెలుగులో... ఆ ప్రింట్లు ఆరే ఆరు! షూటింగే కాదు... ‘సింహాసనం’ పబ్లిసిటీ, ప్రింట్ల రిలీజు కూడా ఆ రోజుల్లో భారీగా సాగింది. తెలుగు వెర్షన్ సుమారుగా 86 ప్రింట్లతో, 150కి పైగా థియేటర్లలో రిలీజవడం మరో సంచలనం. ఇక హిందీ వెర్షన్‌కు 120 – 130 ప్రింట్లు తీశారు. అప్పట్లో మామూలు 35 ఎం.ఎం ప్రింట్ తీయడానికి రూ. 30 – 40 వేల దాకా అయ్యేది. అదే 70 ఎం.ఎం ప్రింట్ తీయాలంటే, లక్షా అరవై వేలయ్యేది. పైపెచ్చు, దానికి కావాల్సిన పాజిటివ్ ఫిల్ము కోసం మూడు నెలల ముందుగానే చెప్పి, విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇక, ల్యాబ్‌లో 70 ఎం.ఎం ప్రింట్ డెవలప్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు రోలర్స్ మార్చాలి. ఆ ప్రింట్లు తీస్తున్నప్పుడు వేరేవి ప్రింట్ చేయలేరు. అందుకే 70 ఎం.ఎం ప్రింట్లకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేవారు. ఆ ప్రింట్‌ను హాలులో వేయాలన్నా మామూలు ప్రొజెక్టర్‌కు ఉండే రోలర్లు, దానికి ఉండే లెన్సులు మార్చాలి. వెనకాల ఉండే ఆర్క్ లైట్‌ను బ్రైట్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఇలా ‘70 ఎం.ఎం – 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్’ సినిమాలు ప్రదర్శించేందుకు తగిన సాంకేతిక సదుపాయాలున్న హాళ్ళూ తెలుగునాట తక్కువే! గుంటూరు, నెల్లూరు లాంటి చోట్ల ‘సింహాసనం’ 70 ఎం.ఎం ప్రదర్శన కోసం అదనంగా ఖర్చు పెట్టి, హాళ్ళను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల మధ్య ‘సింహాసనం’ చిత్రం రిలీజు కోసం ఆరు 70 ఎం.ఎం. ప్రింట్లు వేశారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని, విజయవాడ (రాజ్), గుంటూరు (మంగా డీలక్స్), విశాఖపట్నం (చిత్రాలయా), నెల్లూరు (అర్చన), కాకినాడ (దేవి), హైదరాబాద్ (దేవి) – ఈ 6 కేంద్రాలలో 70 ఎం.ఎం ప్రింట్లు వేశారు. అందులో 68 రోజులకే సినిమా మారిన ఒక్క నెల్లూరు మినహా మిగతా 5 కేంద్రాలలోనూ, అలాగే రాజమండ్రిలో 35ఎం.ఎం ప్రింట్‌తో (స్వామి టాకీస్‌లో)నూ మొత్తం 6 కేంద్రాలలో ‘సింహాసనం’ డైరెక్ట్ శతదినోత్సవం చేసుకుంది. పోస్టర్ పబ్లిసిటీలో... 24 షీట్ ట్రెండ్! సినిమాలానే ‘సింహాసనం’ పబ్లిసిటీ కూడా భారీగా సాగింది. అప్పట్లో తెలు గులో కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్ వాల్ పోస్టర్లే ఉండేవి. కానీ, ‘సింహాసనం’ కోసం తెలుగులో తొలిసారిగా 24 షీట్ వాల్ పోస్టర్లు సిద్ధం చేయించారు ‘పద్మాలయా’ హనుమంతరావు. అందరినీ ఆకర్షించిన ఆ 24 షీట్ పోస్టర్ల విధానం అప్పటి నుంచి తెలుగు సినిమా పబ్లిసి టీలో ఓ ట్రెండైంది! అలాగే, సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో ‘సింహాసనం’ రిలీజుకు ముందు అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగులు, బెంజ్ సర్కిల్ సెంటర్ దగ్గర 75 అడుగుల చొప్పున హీరో కృష్ణ భారీ ప్లైవుడ్ కటౌట్లు పెట్టారు. అప్పట్లో ఆ పబ్లిసిటీ ఆకర్షణ టాక్ ఆఫ్ ది టౌన్! రాజకీయ ప్రత్యర్థి ఎన్టీఆర్‌పై విసుర్లు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృçష్ణ సహజంగానే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద ‘సింహాస నం’లో కొన్ని విసుర్లు కూడా పెట్టారు. ‘‘థియేటర్లలో ఆ డైలాగ్స్‌కు స్పందన లభించింది. దాంతో ఎన్టీఆర్‌పై జనంలో వ్యతిరేకత మొదలైందనే అంచనాతో మేము ‘నా పిలుపే ప్రభంజనం’, తర్వాత ‘సాహసమే నా ఊపిరి’ తీశాం’’ అని ‘పద్మాలయా’ ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు. సముద్రపుటొడ్డున... అభిమాన జనసముద్రం మధ్యన... 1986 జూలై 12న మద్రాసులో సముద్రపుటొడ్డున వి.జి.పి. గార్డెన్స్‌లో వందలకొద్దీ బస్సులు, కార్లు, వ్యాన్లలో తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది అభిమానుల మధ్య ‘సింహాసనం’ వందరోజుల వేడుక సాగింది. ఆ తరువాత... ఆ సినిమాలు అరుదే! వాస్తవానికి, ‘సింహాసనం’ కన్నా ముందు తెలుగులో ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’, ‘సింహాసనం’ రిలీజైన తరువాత చిరంజీవి ‘కొండవీటి దొంగ’ లాంటి చిత్రాలు కూడా 70 ఎం.ఎం.లో తీసే ప్రయత్నాలు జరిగాయి. కారణాలేమైనా, వాటిని చివరకు ఆ టెక్నిక్‌లో తీయలేదు. ‘సింహాసనం’కే ఆ క్రెడిట్ దక్కింది. తెలుగులో వచ్చిన రెండో 70 ఎం.ఎం – ఏయన్నార్, నాగార్జున ‘అగ్నిపుత్రుడు’ (1987). కాలగతిలో డి.టి.ఎస్, డాల్బీ, డిజిటల్ లాంటి టెక్నాలజీలు వచ్చేయడంతో, 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అనేదే ప్రధాన ఆకర్షణ అయిన 70 ఎం.ఎం సినిమాలు రావడం మన దగ్గర ఆగిపోయింది. అయితేనేం... తెలుగుతెరపై సాహసం.. సాంకేతిక ప్రయోగం రీత్యా ‘సింహాసనం’ ఇప్పటికీ ఓ సంచలనమే! చిరస్మరణీయమే! బప్పీ లహరి బాణీల మేనియా హిందీలో ‘డిస్కో డ్యాన్సర్’ (1982) బాణీలతో దేశాన్ని ఊపేసిన బప్పీలహరికి తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. పద్మాలయాకు హిందీలో అప్పట్లో ఆయనే పర్మినెంట్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో ‘ఆకాశంలో...’ బదులు ‘ఆకాసంలో...’ లాంటి అపశబ్దో చ్చారణ జరిగినా, ముప్పావు నిమిషం పైగా సుదీర్ఘమైన బి.జి.ఎంలే వినిపించినా, శ్రావ్యత కన్నా శబ్దం ఎక్కువైనా సరే – జనం బప్పీలహరి సంగీతం మాయలో పడిపోయారు. అప్పట్లో ఆ పాటలు, వాటి బి.జి.ఎంలు మారుమోగని ఊరు లేదు. శ్రీదేవి బదులు మందాకిని! ఈ భారీ సాహసం కోసం భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు. రెండు వెర్షన్లలో హీరోలు వేరైనా, హీరోయిన్లు జయప్రద, రాధ, మందాకిని, అలాగే వహీదా రెహమాన్ కామన్. అప్పటికే రాజ్‌కపూర్ ‘రామ్ తేరీ గంగా మెయిలీ’లో అందాలు ఆరబోసి, జనాన్ని ఆకర్షించిన నీలికళ్ళ సుందరి మందాకినిని కూడా తెలుగుకు తీసుకువచ్చారు. ‘‘ఆ పాత్రను శ్రీదేవితో చేయిస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాం. అప్పటికే, కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్ చాలా సినిమాలతో పాపులర్. అయితే, ఫ్రెష్‌గా ఉంటుందని, హిందీలో అప్పుడు సరికొత్త హాట్ మందాకినిని తీసుకున్నాం’’ అని కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు వివరించారు. కృష్ణ, మందాకిని హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డ్! సెవన్టీ ఎం.ఎం ప్రింట్లు ఆడిన అరడజను కేంద్రాలలోని సైడ్ థియేటర్లతో సహా, మిగతా అన్ని కేంద్రాలలో సర్వసాధారణమైన 35 ఎం.ఎం. ప్రింట్లతోనే ‘సింహాసనం’ ప్రదర్శితమైంది. అయితేనేం, సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిలో, ఆదరణలో మార్పు లేదు. అభిమానులేమో రికార్డులపై మోజు వీడలేదు. ఏకంగా 116 రోజులు ప్రదర్శితమైన వైజాగ్ ‘చిత్రాలయా’ లాంటి చోట్ల, సరిగ్గా ఆఖరు రోజుకు ముందు రోజు దాకా హాలు బయట హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. ‘‘మొదటివారమే ఆంధ్రప్రదేశ్, బెంగుళూరు కలిపి ఏకంగా రూ. 1.51 కోట్ల పైగా వసూలు చేసి, అప్పటికి హయ్యస్ట్ ఓపెనింగ్ గా ‘సింహాసనం’ బాక్సాఫీస్ చరిత్ర’’ సృష్టించింది. మొదటి 70 ఎం.ఎం ‘షోలే’ కాదు! తెలుగులో తొలి 70 ఎం.ఎం. ‘సింహాసనం’ చిత్రమనే మాట సరే! కానీ, దేశంలోనే ఫస్ట్ సిన్మా ఏమిటి? చాలా మంది ‘షోలే’ అనుకుంటారు. కానీ, ‘షోలే’ కన్నా ముందే వచ్చిన రాజ్‌కపూర్, రాజశ్రీ ‘ఎరౌండ్ ది వరల్డ్’ (1967) మన దేశంలోనే ఫస్ట్ 70ఎం.ఎం చిత్రం. రెండోచిత్రంగా ‘షోలే’ (1975) 70 ఎం.ఎం సిక్స్‌ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో అలరించింది. తర్వాత హిందీలో ‘షాన్’ (’80), అమితాబ్ ‘మహాన్’ (’83) లాంటి సక్సెస్‌లు వచ్చాయి. దక్షిణాదిలో తొలిసారిగా మలయాళంలో ‘పడయోట్ట మ్’ (’82)వచ్చింది. తర్వాత నాలుగేళ్ళకు కృష్ణ తొలి తెలుగు 70 ఎం.ఎంగా ‘సింహాసనం’ (’86) అందించారు. ‘సింహాసనం’ చిత్రాన్ని తమిళంలో ‘సిమ్మాసన్’ పేరిట పద్మాలయా వారే అనువదించి, రిలీజ్ చేశారు. కాగా, అదే ఏడాది తమిళంలోనూ ‘తొలి తమిళ 70 ఎం.ఎం’ రజనీకాంత్ హీరోగా ‘మావీరన్’ (1986 నవంబర్ 1) వచ్చింది. ఈ తొలి తమిళ 70 ఎం.ఎం.నూ పద్మాలయా వారే నిర్మించడం విశేషం. సెట్స్‌లో దర్శకుడిగా సూపర్‌స్టార్ కృష్ణ, జితేంద్ర హిందీ ‘సింఘాసన్’ – రెంటాల జయదేవ ∙ -
సినీసౌధానికి పునాదిరాయి ‘పాతాళభైరవి’
ధైర్యం చేసినప్పుడే విజయం వరిస్తుంది. సాహసం చేసినప్పుడే సంతృప్తి లభిస్తుంది. అది జీవితంలోనైనా... సినిమాలోనైనా! ఈ విషయాన్ని ఏడు దశాబ్దాల క్రితం ఓ భారీ బ్లాక్ అండ్ వైట్ సినిమా... పంచరంగుల్లో నిరూపించింది. నిర్మాణ వ్యయంలో, సాంకేతిక విలువల్లో, సంగీతంలో, సంభాషణల్లో, చివరకు రిలీజులోనూ చేసిన సాహసం ఎందరినో స్టార్లను చేసింది. నిర్మాతలతో పాటు పరిశ్రమకూ ఓ స్థాయి తెచ్చింది. పింగళి నాగేంద్రరావు రచనతో, కె.వి. రెడ్డి దర్శకత్వంలో విజయా సంస్థపై ఎన్టీఆర్, యస్వీఆర్ తదితరులతో నాగిరెడ్డి – చక్రపాణి చేసిన సాహసం... డెబ్భై ఏళ్ళు గడిచినా ఇవాళ్టికీ బలహీనులకూ, బాక్సాఫీస్ గ్రామర్ కూ ఓ పెద్ద బాలశిక్ష. సినీసౌధానికి పునాదిరాయిగా... వందేళ్ళ క్రితం 1921 ప్రాంతంలో తెలుగు వారు మూగచిత్రాలు తీయడం మొదలుపెట్టినప్పుడు సిన్మా ఓ కొత్త ప్రక్రియ. తర్వాతి రోజుల్లో అది ఓ మాధ్యమం. అటుపైన పెరిగిన పరిశ్రమ. ఇవాళ సినిమా – జీవితంలో క్రికెట్‌తో పాటు భాగమైన ఓ మతం. పేరుప్రతిష్ఠలు, వ్యాపార విస్తృతి, వాణిజ్య లాభం – ఇలా అన్నింటిలోనూ తెలుగు సినిమా ఎదగడంలో పునాదిగా నిలిచిన తొలితరం సినిమాల్లో మూలస్తంభం – ‘పాతాళభైరవి’. తమిళ మార్కెట్ కూడా కలిసొచ్చేలా, ఏకకాలంలో రెండు భాషల్లో సినిమా తీసే లాభదాయక ధోరణిని ‘పాతాళభైరవి’తో సక్సెస్‌ఫుల్‌గా ఆచరణలోకి తీసుకొచ్చారు – మన దర్శక, నిర్మాతలు. ధైర్యే సాహసే ‘విజయ’లక్ష్మీ... నిరాశ ముంచెత్తినప్పుడే ధైర్యం కావాలి. సాహసం చేయాలి. 1949లో నిర్మాణ కష్టాల్లో ఉన్న వాహినీ స్టూడియోస్‌ను లీజుకు తీసుకొని, విజయా ప్రొడక్ష¯Œ ్సను స్థాపించిన నాగిరెడ్డి – చక్రపాణి వరుసగా సినిమాలు తీద్దామనుకొన్నారు. తొలిగా ‘షావుకారు’ తీస్తున్నారు. అప్పుడే వాహినీ ‘గుణసుందరి కథ’ (1949 డిసెంబర్ 29) హిట్ అయింది. ఆ జానపదం తీసిన కె.వి. రెడ్డితోనే విజయా వాళ్ళు మరో జానపదం ‘పాతాళభైరవి’ మొదలుపెట్టారు. ఇంతలో ‘షావుకారు’ (1950 ఏప్రిల్ 7) రిలీజై, పేరొచ్చినంత డబ్బు తేలేదు. అయినాసరే భారీ ‘పాతాళభైరవి’ సాహసం నిర్మాతలు ఆపలేదు. ఒకటికి 2 భాషల్లో తీశారు. అక్కడి అద్భుతదీపం.. ఇక్కడి పాతాళభైరవి చందమామ తరహా కథ ‘పాతాళభైరవి’. అరేబియన్ నైట్స్‌లోని ‘అల్లావుద్దీన్ – అద్భుతదీపం’ కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చేశారు రచయిత పింగళి. కె.వి. రెడ్డి స్క్రీన్‌ప్లే రచనకు సహ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తన వంతు తోడ్పాటునిచ్చారు. ‘షావుకారు’ను పొదుపుగా పరిమిత సౌకర్యాలతో తీసిన విజయా సంస్థ ఇక పెద్ద ఆట ఆడాలని సాహసించడంతోనే ‘పాతాళభైరవి’కి కళాదర్శకుడు గోఖలే సారథ్యంలో కళాధర్ నిర్వహణలో భారీ సెట్లు వేయించింది. గెటప్స్ చేయించింది. నిర్మాణ విలువల్ని పెంచేసింది. మార్కస్ బార్ట్లీ కెమెరా మాయాజాలం, ‘డింగరీ’లాంటి మాటలు, చిరకాలం గుర్తుండే ‘సాహసం శాయరా డింభకా’లాంటి డైలాగులు, ‘కలవరమాయే మదిలో..’ లాంటి ఘంటసాల – లీల పాటలు, హేమండ్ ఆర్గాన్ లాంటి విశిష్ట వాద్యాలతో మాస్టర్ వేణు బృందం కూర్చిన ఆర్కెస్ట్రయిజేషన్ – ఇలాంటివన్నీ తోడయ్యాయి. అప్పట్లో వాహినీ స్టూడియోలో శబ్దగ్రహణ శాఖలో పనిచేస్తున్న నేటి మేటి దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ సినిమాకు సౌండ్ అసిస్టెంట్‌గా చేయడం విశేషం. వెరసి, ఈ వీరరస ప్రధాన ప్రేమకథ రసవత్తరంగా తయారైంది. వరుస ఫ్లాపుల మధ్యలోనూ... నిజానికి జానపదాలు వరుసగా ఫ్లాపవుతున్న రోజులవి. ‘షావుకారు’, ‘జీవితం’, ‘సంసారం’ హిట్టయి, సాంఘికాలదే పైచేయనుకుంటున్న సమయం. ఆ వాతావరణంలో దర్శక, నిర్మాతలు చేసిన ఖరీదైన జానపద సాహసం ‘పాతాళభైరవి’. ఆ సాహసం ఫలించి, తరువాత మరో రెండు దశాబ్దాల దాకా జానపద కథలకు కమర్షియాలిటీని నిలిపింది. అలాగే, బొంబాయి పలు ప్రాంతీయ సినీ పరిశ్రమలకు కేంద్రమైనా, అక్కడ హిందీ చిత్రపరిశ్రమే ఎదిగింది. మర్రిచెట్టు లాంటి హిందీ పరిశ్రమ కింద మిగతావి ఆ స్థాయిని అందుకోలేకపోయాయి. కానీ, మద్రాసులో మన చిత్ర పరిశ్రమ పరిస్థితి వేరు. ప్రధానమైన తమిళ పరిశ్రమతో పోటాపోటీగా నిలబడింది. భారీగా ఎదిగింది. ఆ పరిణామంలో 1950ల నుంచి విజయ సంస్థ, వాహినీ స్టూడియో, ఎన్టీఆర్, ఏయన్నార్, యస్వీఆర్, సావిత్రి లాంటి స్టార్ల భాగస్వామ్యం, ‘పాతాళభైరవి’ లాంటి సినిమాల పాత్ర ఉంది. సౌత్‌లో తొలిసారి రికార్డు ప్రింట్లు కథగా పాతాళభైరవి చాలా సింపుల్. రాకుమారి (మాలతి) ప్రేమ కోసం నేపాళ మాంత్రికుడి (యస్వీఆర్) వెంట వెళతాడు తోట రాముడు (ఎన్టీఆర్). కోరిన కోర్కెలు తీర్చే పాతాళభైరవిని సాధిస్తాడు. దుష్టమాంత్రికుణ్ణి ఆఖరికి వధిస్తాడు. ఆసక్తికరమైన కథ, ఆగకుండా సాగే కథనంతో ‘పాతాళభైరవి’ అందరినీ ఆకట్టుకుంది. రిలీజ్ ముందు అనుమానాలు వ్యక్తమైనా, తొలి వారాల్లో విభిన్న స్వరాలు వినిపించినా అవేవీ హిట్‌ను ఆపలేదు. అప్పట్లో తెలుగు సినిమాల వ్యాపారం 10 – 15 ప్రింట్లతోనే జరిగేది. కానీ, 1951 మార్చి 15న విడుదలైన తెలుగు ‘పాతాళభైరవి’ని 13 ప్రింట్లతో రిలీజ్ చేశారు. అలా మొదట 13 కేంద్రాల్లో విడుదలై, పది కేంద్రాల్లో వంద రోజులు, మిగతా 3 కేంద్రాల్లో 90కి పైగా రోజులు ఆడింది. పెరిగిన ప్రజాదరణతో, ఫస్ట్ బ్యాచ్‌లోనే మొత్తం 60కి పైగా ప్రింట్లు తీశారు. ఇక, తెలుగు, తమిళం – రెండూ కలిపితే అప్పట్లోనే 100 ప్రింట్లు తీసిన తొలి సినిమా దక్షిణాదిలో ఇదే! ఆ తరువాత ఇన్నేళ్ళలో పదే పదే రీ–రిలీజైన ‘పాతాళభైరవి’కి మొత్తం మీద 500 ప్రింట్లు తీశారని ఓ లెక్క. ఫస్ట్ డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ... ఫస్ట్ 200 డేస్... భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంకా ఏర్పడని ఆ రోజుల్లో, అప్పటి భౌగోళిక ప్రాంతాల ప్రకారం చూస్తే – ఆంధ్రా, నైజామ్, మైసూరు, మద్రాసు, మలబార్, బొంబాయి – ఇలా మొత్తం 6 విభిన్న భాషా ప్రాంతాలలోనూ శతదినోత్సవం చేసుకున్న తెలుగు సినిమా ఇదే. విజయవాడ, బళ్ళారి, బెంగుళూరు, గుడివాడ, నెల్లూరుల్లో ‘పాతాళభైరవి’ రజతోత్సవమూ చేసుకుంది. తెలుగు నాట ఒక సినిమా డైరెక్టుగా 25 వారాలు ఆడడం అదే తొలిసారి. అంతకు ముందు ఏయన్నార్ ‘బాలరాజు’ రజతోత్సవ చిత్రమే అయినా, ఏలూరులో షిఫ్టింగుతో అది 25 వారాలు ఆడిందనేది గమనార్హం. కాగా, ద్విశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు చిత్రమూ ‘పాతాళభైరవే’. జాతకాలు మార్చిన సినిమా విజయా వారి ‘పాతాళభైరవి’ ఎంతోమందికి కలిసొచ్చింది. జీవితాలను మార్చేసింది. ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగి, స్టారయ్యారు. నేపాళ మాంత్రికుడి పాత్ర అనన్య సామాన్యంగా పోషించి, యస్వీఆర్ తీరిక లేని నటుడయ్యారు. ఒక పాటలో నృత్యంలో కనిపించిన సావిత్రి ఆ తరువాతి అవకాశాలతో మహానటిగా తారాపథానికి ఎగిశారు. విజయా సంస్థ సుస్థిరమైపోయింది. కె.వి. రెడ్డి స్టార్ డైరెక్టరైపోయారు. మంచి చిత్రాలకు చిరునామాగా నిలిచి, తెలుగు సినిమా పురోభివృద్ధికి దోహదం చేసిన అక్కినేని సొంత సంస్థ ‘అన్నపూర్ణా’ ప్రారంభచిత్రం (‘దొంగరాముడు)కు కె.వి. రెడ్డే దర్శకుడయ్యారు. అలాగే, విజయా సంస్థ శాఖోపశాఖలైంది. ‘వాహినీ’ స్టూడియోస్ కాస్తా ‘విజయ – వాహినీ’ స్టూడియోస్‌గా విస్తరించింది. సౌత్ ఈస్ట్ ఏషియాలోకెల్లా అతి పెద్ద ఫిల్మ్స్టూడియోగా అవతరించింది. దీని వెనక ‘పాతాళభైరవి’ మొదలు వరుస హిట్లతో నిర్మాతలకొచ్చిన ధనం, ధైర్యం ఉన్నాయి. పదేళ్ళలో... ఆరు రీళ్ళు మిగిల్చే ఇమేజ్ ‘పాతాళభైరవి’ తర్వాత విజయా సంస్థ ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్స్ తీసింది. పదేళ్ళకు ‘జగదేకవీరుని కథ’ తీసినప్పుడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక్క యుద్ధం కూడా చేయలేదేమిటని నిర్మాత చక్రపాణిని అడిగారు. అందుకాయన, ‘‘పాతాళభైరవి అప్పుడంటే ఎన్టీఆర్ సాహసాల గురించి తెలీదు కాబట్టి అవే 6 రీళ్ళు చూపాం. ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ పెరిగింది. ఎన్టీఆర్‌ను చూపిస్తే చాలు... జగదేకవీరుడని అర్థం చేసుకుంటారు. మళ్ళీ యుద్ధాలు తీయక్కర్లేదు. మాకు 6 రీళ్ళు మిగిలాయి’’ అని చమత్కరించారు. అదీ పదేళ్ళలో ఎన్టీఆర్‌కు పెరిగిన ఇమేజ్! ఋణం తీర్చుకున్న ఎన్టీఆర్... కాలం ఎప్పుడూ ఒకే రీతిలో సాగదు. విజయాకూ, ఎన్టీఆర్ కెరీర్‌కూ పలు హిట్స్ అందించిన కె.వి. రెడ్డి కెరీర్ ఒక దశలో వెనుక పట్టు పట్టింది. ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ ఫ్లాపయ్యాక ‘విజయా’ సంస్థ ఆయనను దూరం పెట్టింది. ఒకప్పుడు సూపర్ హిట్లతో వెలిగిన దర్శకశ్రేష్ఠుడు చేతిలో సినిమాలు లేక, చదువు కోసం కొడుకును అమెరికాకు పంపేందుకు డబ్బు లేక అవస్థలు పడుతున్న సమయంలో ఎన్టీఆర్ తన గురుభక్తి చాటుకున్నారు. ఆ సందర్భంలో వయసుపై పడి, ఆరోగ్యం సహకరించని కె.వి. రెడ్డి ఓసారి ఆటోలో ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించి, అప్పటికప్పుడు పాతికవేలు చెక్కు రాసిచ్చారు. అభిమానధనుడైన కె.వి. రెడ్డి, ‘‘నేను యాచించడానికి రాలేదు రామారావ్! ఏదైనా వర్క్ ఇస్తే చేస్తా’’ అన్నారు. వెంటనే ఎన్టీఆర్, ‘‘నేను మీ ఆత్మాభిమానానికి వెలకట్టడం లేదు గురువు గారూ! నా తదుపరి చిత్రానికి మీరే డైరెక్టర్. ఇది అడ్వాన్స్. పింగళి వారే రాసిన 3 స్క్రిప్టులు ‘శ్రీకృష్ణసత్య, చాణక్య శపథం, శ్రీరామ పట్టాభిషేకం’ నా దగ్గరున్నాయి. మీరు ఏది ఎంచుకుంటే, అది మీ దర్శకత్వంలో చేస్తా’’నన్నారు. ‘‘దర్శకత్వం వహించేందుకు ఆరోగ్యం సహకరించేలా లేద’’న్నారు కె.వి. ‘‘మీరు కుర్చీలో కూర్చొని పర్యవేక్షిస్తే చాలు. మీరు చెప్పినట్టు నేను తీస్తా’’ అని గురుభక్తి చాటారు ఎన్టీఆర్. శిష్యుడి గౌరవానికి కె.వి సంతోషించారు. ఆయన ఎంచుకున్న ‘శ్రీకృష్ణసత్య’ స్క్రిప్టునే, గురువు గారి వాంఛ తీర్చడం కోసం కలర్ సినిమాగా నిర్మించారు ఎన్టీఆర్. సి.ఎం. సీటులో... ‘‘ఫాదర్’’ నాగిరెడ్డి! కానీ తాము వద్దనుకున్న కె.వి.రెడ్డితో ఎన్టీఆర్ కృష్ణసత్య (’71) తీయడం విజయాధినేతలకు నచ్చలేదు. దాంతో, తమ ఆస్థాన హీరో ఎన్టీఆర్‌నే తమ తదుపరి ప్రాజెక్టుల్లో దూరం పెట్టారు. ఎన్టీఆర్ రాయబారం పంపినా, లాభం లేకపోయింది. విజయా వారు తీసిన ‘గంగ–మంగ’, ‘శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ రెండు చిత్రాల్లోనూ ఎన్టీఆర్ లేరు. దాని వల్ల స్టార్ హీరోగా ఎన్టీఆర్ కెరీర్ కేమీ నష్టం రాలేదు కానీ, ఆ తరువాత విజయాధినేతలే చిత్రనిర్మాణం కొనసాగించలేకపోయారు. కాలగతిలో ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ విజయం సాధించి, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ హయాంలో టి.టి.డి. బోర్డు చైర్మనైన నాగిరెడ్డి అప్పటికి ఆ పదవిలో ఉన్నారు. ప్రభుత్వం మారినా సరే తానెప్పుడూ ‘‘ఫాదర్’’ అని ఆత్మీయంగా పిలిచే నాగిరెడ్డిని ఎన్టీఆర్ పక్కకు తప్పించలేదు. పైపెచ్చు, నాగిరెడ్డిని సాదరంగా ఆహ్వానించి, తన సి.ఎం. సీటులో కూర్చోబెట్టి, సముచితంగా సత్కరించారు.తన ఉజ్జ్వల సినీ జీవితానికి బాట వేసిన ‘‘ఫాదర్’’కు కృతజ్ఞత చెల్లించుకున్నారు. సినిమా నుంచే... డ్రామాగా! రంగస్థల నాటకాలు వెండితెరకెక్కడం సినీ చరిత్రలో తొలి రోజుల నుంచి చూస్తున్నదే. కానీ, తెర మీది సినిమా కాస్తా వేదిక మీద నాటకంగా మారడం మాత్రం సురభి నాటకాలలో ‘పాతాళభైరవి’కే దక్కిన మరో ఘనత. సురభి నాటక సమాజం వారు ప్రదర్శించే ధర్మవరపు రామకష్ణమాచార్యుల ‘భక్త ప్రహ్లాద’ తొలి తెలుగు టాకీగా తెరకెక్కితే, ఆపైన సరిగ్గా రెండు దశాబ్దాలైనా గడవక ముందు వచ్చిన పింగళి వారి ‘పాతాళభైరవి’ కథను 135 సంవత్సరాల చరిత్ర ఉన్న సురభి నాటక సమాజం తమ సొంతం చేసుకొని, ఇవాళ్టికీ రంగస్థల నాటకంగా ప్రదర్శిస్తోంది. దాన్నిబట్టి, పాతాళభైరవి కథ, తోటరాముడి సాహసం, నేపాళ మాంత్రికుడి మాయాజాలం తెలుగు వారి కళ, సంస్కతిలో ఎంతగా భాగమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో ఒక సినిమా ఆణిముత్యంగా నిలిచిందనడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. అందుకే, ఎన్నేళ్ళయినా... మళ్ళీ మళ్ళీ ‘జై పాతాళభైరవి’! స్టార్ హీరోగా ఎన్టీఆర్... కొత్త దారిలో ఏయన్నార్! ‘పాతాళ భైరవి’ నాటికే ఏయన్నార్ అగ్రనటుడు. అప్పటికి ఎనిమిదేళ్ళుగా జానపద హీరో అంటే ఏయన్నారే. అప్పటి దాకా ఆయన చేసిన సినిమాల్లో 90 శాతం జానపదాలే. కానీ, ఒక్కసారిగా ‘పాతాళభైరవి’తో తెలుగు తెరపై తిరుగులేని జానపదహీరోగా ఎన్టీఆర్ అవతరించారు. ఏయన్నార్ అటుపైన రూటు మార్చి, ‘దేవదాసు’ లాంటి సాంఘికాల్లో తన ముద్ర చూపారు. ఆ తరువాత ఆయన కెరీర్ లో చేసిన 200 పై చిలుకు చిత్రాల్లో మూణ్ణాలుగు మాత్రమే, అంటే ఒక్క శాతమే జానపదాలనేది గమనార్హం. ఇక, జానపదాలకు ఊపు తెచ్చిన ‘పాతా ళభైరవి’ నుంచి దేశంలో ఏ హీరో చేయనన్ని విధంగా 58 ఫోక్లోర్ చిత్రాల్లో ఎన్టీఆరే హీరో. ఆయన తర్వాతి స్థానంలో కత్తివీరుడు కాంతా రావు నిలిచారు. ఫస్ట్ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో... మన దేశంలో తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 1952లో బొంబాయి, మద్రాసు, ఢిల్లీ, కలకత్తాల్లో జరిగింది. అందులో దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక చిత్రం ‘పాతాళభైరవి’. ‘మొఘల్ –ఎ–ఆజమ్’ (1960) రూపకర్త కె. ఆసిఫ్ ఈ ఫెస్టివల్లో ‘పాతాళభైరవి’, ఆ సెట్లు, ఆ సాంకేతిక విలువలు చూసి, అబ్బురపడ్డారట. ఒక ప్రాంతీయ సినిమానే ఈ స్థాయిలో తీస్తే, హిందీలో జాతీయస్థాయిలో తాను రూపొందిస్తున్న ‘మొఘల్–ఎ–ఆజమ్’ ఇంకెంత స్థాయిలో ఉండాలని తమ సెట్లు, రూపకల్పన శైలిపై మరింత దృష్టి, డబ్బు పెట్టారంటారు. ఇప్పుడు చూస్తున్నా ‘పాతాళభైరవి’ బోరు కొట్టదు. టీవీల దెబ్బకు రిపీట్ రన్లు ఆగే వరకు 60 ఏళ్ళ పాటు ‘పాతాళభైరవి’ హాళ్ళలో అలరిస్తూనే వచ్చింది. ఇప్పటికీ టీవీ, యూట్యూబుల్లో పలకరిస్తూనే ఉంది. ఇంత దీర్ఘకాల జనాదరణ ఉన్న సినిమా మరొకటి కనిపించదు. 1950ల ముందు మ్యూజికల్ హిట్లున్నా, ఆ పాటలు ఆ కాలానికే! కానీ ఇప్పటికీ వినిపించే ఫస్ట్ లాంగ్‌టైమ్ మ్యూజికల్హిట్‘పాతాళభైరవి’. సూపర్ హీరోయిజమ్ తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ (1931 మార్చి 14) రిలీజైన సరిగ్గా రెండు దశాబ్దాలకు తెలుగు ‘పాతాళభైరవి’ (1951 మార్చి 15) వచ్చింది. అంతకు ముందు వరకు సాధారణంగా సినీ కథానాయకుడు సామాన్యుడు. విధి ఆడే వింత నాటకంలో ఓ కీలుబొమ్మ. కానీ, సామాన్యుడు సైతం సాహసిస్తే, ఏదైనా సాధిస్తాడనే హీరోయిజమ్‌ను ‘పాతాళభైరవి’ జనంలోకి బాగా తీసుకువెళ్ళింది. జీవితంలో మనం చెయ్యలేని పనులను తెర మీది సూపర్ నేచురల్ హీరో చేస్తే సామాన్య జనం జై కొడతారనే సైకాలజీని ష్యూర్ హిట్ బాక్సాఫీస్ ఫార్ములాగా తీర్చిదిద్దింది. గత 70 ఏళ్ళుగా సాంఘికాల్లోనూ అదే హిట్ మంత్రమైంది. అలా ఇండియన్ సిల్వర్‌స్క్రీన్‌పై హీరో ఇమేజ్‌కు కొత్త భాష్యం చెప్పింది ‘పాతాళభైరవి’. నెల జీతంపై... 4 సినిమాలు అసలు ‘పాతాళభైరవి’ కథకు దర్శక, నిర్మాతలు ముందు అనుకున్న హీరో – ఏయన్నార్. విలన్ – ముక్కామల. ఒక దశలో అప్పుడే ‘మాయలమారి’ (1951 జూన్ 14)లో గండరగండ పాత్ర చేస్తున్న రాజారెడ్డితో హీరో వేషం వేయిస్తే ఎలా ఉంటుందా అనీ ఆలోచించారట. కానీ, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్య ఓ ప్రాక్టీస్ టెన్నిస్ మ్యాచ్‌లో బంతిని ఎన్టీఆర్ బలంగా కొట్టిన తీరు చూసి, దర్శకుడు కె.వి. రెడ్డి ఈ పాత్రకు ఎన్టీఆరే పర్ఫెక్ట్ అనుకున్నారు. గదతో బొడ్డుదేవర విగ్రహాన్ని బలంగా మోదే దృశ్యాన్ని ఎన్టీఆర్ తో ట్రయల్ షూట్ చేసి మరీ ఓకే అన్నారు. వాహిని – విజయాధినేతలు అంతకు ముందే, తాము తీయనున్న 3 చిత్రాలకు (‘మల్లీశ్వరి’, ‘పెళ్ళిచేసి చూడు’, ‘చంద్రహారం’) హీరోగా కాంట్రాక్టు రాయాలంటూ ఎన్టీఆర్‌ను అడిగారు. భారీ ఖర్చయ్యే ‘పాతాళభైరవి’కి ఇమేజ్ ఉన్న మరో హీరోను పెట్టుకోవాలన్నది వారి ఆలోచన. కానీ, ‘పాతాళభైరవి’ సహా 4 సినిమాలకైతేనే కాంట్రాక్ట్‌గా చేస్తానన్నారు ఎన్టీఆర్. విజయా వారూ సరేనన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కు వారిచ్చిన జీతం – తొలి ఏడాది నెలకు రూ. 500, రెండో ఏడాది నెలకు రూ. 750. మొత్తంగా మొదటి రెండు సినిమాలకూ ఏడున్నర వేల చొప్పున, తరువాతి రెండు సినిమాలకూ పది వేల చొప్పున రెమ్యూనరేషన్ అని ఫిక్స్ చేశారు. ‘‘ఆ 4 సినిమాల తరువాత విజయా వారి కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చాక, ఏకంగా ఇరవై ఏడున్నర వేల అత్యధిక పారితోషికంతో కథానాయక పాత్ర చేశా. ఆ నాటి నుంచి సినీ సీమ వదిలి బయటకొచ్చే దాకా హీరోగా నాదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్’’ అని 1986 ఫిల్మోత్సవ్ వేళ ఎన్టీఆరే చెప్పారు. బహుమతిగా కారు అనేకచోట్ల ‘పాతాళభైరవి’ వందరోజులాడిన సందర్భంగా, ముఖ్యమైన కళాకారులకు కార్లను బహుమతిగా ఇచ్చారు విజయాధినేతలు. ఆ రోజుల్లోనే 6 వేలు ఖరీదు చేసే ఆ బ్యూక్ కారును పదిలంగా ఉంచుకున్నారు ఎన్టీఆర్. ‘‘ఫాదర్ (నాగిరెడ్డి) ఇచ్చిన కారు’’ అని గొప్పగా చెప్పేవారు. ఒకటికి రెండుసార్లు! లేట్ రిలీజులోనూ 20కి పైగా కేంద్రాల్లో ‘పాతాళభైరవి’ శతదినోత్సవం చేసుకొంది. ఆ తర్వాత అలా లేట్ రిలీజ్లో 20కి పైగా కేంద్రాల్లో (సరిగ్గా 46 కేంద్రాల్లో) వంద రోజులు ఆడింది ‘లవకుశ’. రెండూ ఎన్టీఆర్ చిత్రాలే కావడం విశేషం. ఫస్ట్ రిలీజైన తరువాత రెండేళ్ళకే 1953 జూలైలో విజయవాడలో దుర్గాకళామందిరంలోనే ‘పాతాళభైరవి’ మరోసారి రిలీజైంది. అప్పుడూ అదే హాలులో ఏకంగా 11 వారాల పైగా ఆడడం మరో విశేషం. పార్ట్లీ కలర్‌తో... హిందీలోకి! ‘పాతాళభైరవి’ని ఒకేసారి రెండు భాషల్లో చిత్రీకరించారు. తెలుగు వెర్షన్ రిలీజైన రెండు నెలలకు 1951 మే 17న తమిళ వెర్షన్ రిలీజైంది. తెలుగుతో పాటు తమిళంలోనూ హిట్టయిన ఈ చిత్రాన్ని ప్రసిద్ధ జెమినీ సంస్థ హిందీ ప్రేక్షకులకూ అందించింది. నాగిరెడ్డిని ‘‘నాగి.. నాగి..’’ అంటూ అభిమానంతో సంబోధించే జెమినీ అధినేత ఎస్.ఎస్. వాసన్ అప్పటికే ‘చంద్రలేఖ’ లాంటి భారీ చిత్రంతో ఉత్తరాది వారికి దక్షిణాది సినిమా రుచి చూపించారు. ఈసారి విజయా వారి ప్రొడక్షన్ ‘పాతాళభైరవి’లోని నృత్యగీతాలు ‘ఇతిహాసం విన్నారా’, ‘వగలోయ్ వగలు’ రెండింటినీ కలర్లో ప్రత్యేకంగా చిత్రీకరించి మరీ, హిందీలో ‘పాతాళ్ భైరవి’ టైటిలుతో 1952 మార్చి 14న జెమినీ సంస్థ రిలీజ్ చేసింది. అలా ఒకే కథ మూడు భాషల్లో జనం ముందుకు రావడం, వాటిల్లో ఒకే హీరో నటించడం, 3 భాషల్లో విజయం సాధించడం కూడా అదే తొలిసారి. 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే కథను ‘పాతాళ్ భైరవి’ (1985) పేరుతోనే హీరో కృష్ణ సమర్పణలో పద్మాలయా స్టూడియోస్ బాపయ్య దర్శకత్వంలో జితేంద్ర, జయప్రదలతో హిందీలో మరోసారి తీశారు. – రెంటాల జయదేవ -
మాస్ మెచ్చిన క్లాస్ చిత్రం..స్వాతిముత్యం
కథానాయకుడు మానసికంగా ఎదగనివాడు. కథానాయిక అప్పటికే ఓ పిల్లాడికి తల్లి అయిన విధవరాలు. అనుకోని పరిస్థితుల్లో... వాళ్ళిద్దరికీ ముడిపడితే? ఇలాంటి పాత్రలతో, ఈ కథాంశంతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ, ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా అమితంగా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు, బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం! ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట – కె. విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమలహాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం – ‘స్వాతిముత్యం’కి ఈ మార్చి 13తో 35 వసంతాలు. కమలహాసన్, రాధిక మాస్ కథాంశాలైతేనే జనం చూస్తారు. క్లాస్ కథలైతే సామాన్యులు ఆదరించరని ఎవరన్నారు! నిజానికి, అది ఓ తప్పుడు కమర్షియల్ లెక్క. తెరపై కథను చూపించే క్రియేటర్ తాలూకు ప్రతిభా సామర్థ్యాలను బట్టి జనం ఏ సినిమానైనా చూస్తారు. బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడతారు. ఆ సంగతి నిరూపించిన చిత్రం – కమలహాసన్, రాధిక జంటగా, దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన ‘స్వాతిముత్యం’. కల్మషం లేని కథ... కల్లాకపటం తెలీని హీరో... కల్లాకపటం తెలియని ఓ అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా, మనసు ఎదగని వెర్రిబాగులవాడు శివయ్య (కమలహాసన్). ఓ గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్ళాడిన లలిత (రాధిక), ఓ పిల్లాడికి (మాస్టర్ కార్తీక్) తల్లి అయ్యాక, భర్త పోవడంతో తల చెడ్డ ఇల్లాలిగా అన్నావదినల పంచన బతుకీడుస్తుంటుంది. విధవరాలైన కథానాయిక మెడలో గుళ్ళో సీతారామ కల్యాణ వేళ అమాయకంగా తాళికట్టేస్తాడు హీరో. అమాయకుడైన హీరోను ప్రయోజకుడిగా ఆమె ఎలా తీర్చిదిద్దింది అన్నది స్థూలంగా ‘స్వాతిముత్యం’ కథ. భార్య పోతే మగాడు మరో పెళ్ళి చేసుకోవడం సహజమనే లోకంలో, భర్త పోయి, ఆర్థికంగా, మానసికంగా ఆసరా కోసం చూస్తున్న స్త్రీకి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరిగితే తప్పుగా భావించడం ఏమిటనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ చిత్రం. స్వాతిముత్యమంత స్వచ్ఛమైన మనసుతో, కల్మషం లేని అమాయక చక్రవర్తి అయిన ‘శివయ్య’ పేరునే ఈ సినిమాకూ పెడదామని మొదట్లో కమలహాసన్ అన్నారు. కానీ, చివరకు అందరూ ‘స్వాతిముత్యం’ టైటిల్ కే మొగ్గారు. సున్నితమైన... విశ్వనాథ ముద్ర మద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమలహాసన్, రాధిక తదితరుల నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీరికార్డింగ్ ప్రాణంపోశాయి. ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య’ (ఆత్రేయ), ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘రామా కనవేమిరా’, ‘ధర్మం శరణం గచ్ఛామి’, ‘మనసు పలికే మౌన గీతం’ (సినారె) పాటలు ఆల్‌టైమ్ హిట్స్. ముఖ్యంగా, మనసు పలికే మౌనగీతాన్ని అమాయకుడైన హీరోకు హీరోయిన్ పరిచయం చేసి, కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాన్నీ, ఆ ప్రణయ గీతాన్నీ విశ్వనాథ్ సున్నితమైన శైలిలో, అసభ్యతకు తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దడం గమనార్హం. ఆ పాటతో పాటు, సినిమాలోని చాకలి సుబ్బులు – వెంకటసామి పాత్రల్లో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోతారు. ప్రతి సినిమాలోలాగానే ‘స్వాతిముత్యం’ పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడా మగా తేడా తెలియని హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని, జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని...’ పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం మార్గమధ్యంలో కమలహాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి, పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు.తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక, ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. అదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్‌ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ చిత్రం కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెర మీదకు వచ్చింది. ‘సితార’తో రచయితగా పరిచయమైన సాయినాథ్, ‘సిరివెన్నెల’కు రాసిన ఆకెళ్ళ – ఇద్దరూ ఈ సినిమాలో విశ్వనాథ్ కలానికి డైలాగుల్లో చేదోడు అయ్యారు. ఎం.వి. రఘు ఛాయాగ్రహణం అందించారు. వందరోజుల వేళ... అప్పట్లో హైదరాబాద్, కాకినాడ, బెంగళూరు లాంటి కేంద్రాల్లో మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ థియేటర్లలోనూ ‘స్వాతిముత్యం’ వంద రోజులు ఆడింది. ఆ రోజుల్లో 35 థియేటర్లలో, మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే! ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్‌గా ‘స్వాతి ముత్యం’ శతదినోత్సవం జరుపుకొంది. పలుచోట్ల 25 వారాలు (రజతోత్సవం) దాటి ప్రదర్శితమైంది. బెంగుళూరు, మైసూరుల్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రీత్యానూ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే! దాదాపు అన్ని సెంటర్లలో ఆ ఏడాది హయ్యస్ట్ షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే! 1986 జూన్ 20న హైదరాబాద్ దేవి థియేటర్లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆరే (అప్పటి సి.ఎం) స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శక, నిర్మాత రాజ్‌కపూర్ వచ్చారు. విశ్వనాథ్ – ఏడిద జంట నుంచి దేశం గర్వించే మరిన్ని చిత్రాలు రావాలని కళాపిపాసి అయిన ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆస్కార్‌కు ఎంట్రీ! హాలీవుడ్ ఫిల్మ్‌తో పోలిక!! ఆస్కార్స్‌కు ఇండియన్ ఎంట్రీగా వెళ్ళిన తొలి తెలుగు సినిమా, ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా ‘స్వాతిముత్య’మే! తుది జాబితాకు నామినేట్ కాకపోయినా, మరో ఎనిమిదేళ్ళకు రిలీజైన హాలీవుడ్ ‘ఫారెస్ట్‌గంప్’(1994)కూ, మన ‘స్వాతిముత్యం’కూ పోలికలు కనిపిస్తాయి. టామ్ హాంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన ‘స్వాతిముత్యం’లోని శివయ్య పాత్రను గుర్తుతెస్తాయి. అలా హాలీవుడ్‌కూ మన పాత్రలు ప్రేరణనిచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. రాజ్‌కపూర్ మనసు దోచిన సినిమా! ‘షో మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజ్‌కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ మొదలు ఏ సినిమా తీసినా, బొంబాయిలో రాజ్‌కపూర్‌కు చూపించడం విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే, ‘స్వాతిముత్యం’ చూశారు రాజ్‌కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్, వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో, ‘‘మీరు నా హృదయాన్ని టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్’’ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్‌కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమలహాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకనో అది కుదరలేదు. ఏది ఏమైనా, కథ రీత్యా నేటికీ ‘స్వాతిముత్యం’ రిస్కీ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని, విజయతీరం చేర్చడం మన తెలుగు సినిమాకు మరపురాని మహా ఘనత. శతదినోత్సవ వేదికపై రాజ్‌కపూర్, ఎన్టీఆర్, ఏడిద క్లాస్మాటున మాస్ డైరెక్టర్! భారతీయ సినీరంగంలో ప్రయోగాలకూ, ప్రయోగశీలురకూ కొరత లేదు. సత్యజిత్ రే, హృషీకేశ్ ముఖర్జీల నుంచి తమిళ శ్రీధర్, మలయాళ ఆదూర్ గోపాలకృష్ణ్ణన్, కన్నడ పుట్టణ్ణ కణగల్ దాకా ఎంతోమంది కళాత్మకంగా, రిస్కీ కథలతో ప్రయోగాలు చేశారు. అయితే, సహజంగానే ఆ ప్రయోగాలన్నీ విమర్శకుల ప్రశంసలకే పరిమితం. పెద్దగా ఆడవు. ఒకవేళ ఆడినా, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్లయిన సందర్భాలు అరుదు. కానీ, మన తెలుగు దర్శక ఆణిముత్యం విశ్వనాథ్ మాత్రం ఆ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు సంగీత ప్రధానమైన ‘శంకరాభరణం’ అయినా, ఇటు సామాజిక కోణం ఉన్న ‘స్వాతిముత్యం’ అయినా, క్లాస్ కథాంశాలతో కమర్షియల్ గానూ మాస్ హిట్లు సాధించారు. పండితుల ప్రశంసలతో ‘కళాతపస్వి’గా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. పండితులతో పాటు పామర జనాదరణతో బాక్సాఫీస్ వద్ద మాస్ దర్శకులకు మించిన కలెక్షన్లు సాధించి, ‘క్లాస్ మాటున... కనిపించని మాస్ డైరెక్టర్’గానూ నిలిచారు. ఇలా క్లాస్ సినిమాలు తీసి, మాస్‌ను కూడా మెప్పించిన దర్శకుడు మరొకరు లేరు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇది విశ్వనాథ్‌కే సాధ్యమైన ఓ ‘న భూతో న భవిష్యత్’ విన్యాసం! రాధికకు నటించి చూపిస్తూ కె. విశ్వనాథ్ తమిళం, హిందీల్లోనూ... హిట్! తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని నిర్మాత ఏడిద నాగేశ్వరరావే తమి ళంలో ‘చిప్పిక్కుళ్ ముత్తు’ (1986 అక్టోబర్ 2)గా అనువదించారు. తమిళ, మలయాళ సీమల్లో అది మంచి విజయం సాధించింది. మూడేళ్ళ తరువాత అనిల్‌కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’(’89) పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే మధు ఫిలిమ్స్ మల్లికార్జునరావు హిందీలో రీమేక్ చేశారు. అక్కడా విజయవంతమైంది. ఆపైన చాలాకాలానికి ఇదే కథను కొందరు కన్నడ సినీ రూపకర్తలు ‘స్వాతి ముత్తు’ (2003) పేరుతో స్వయంగా రూపొందించారు. ఇప్పటి స్టార్ హీరో సుదీప్, మీనా అందులో జంటగా నటించారు. తెలుగు ‘స్వాతిముత్యం’కు మక్కికి మక్కి కాపీ లాగా ఈ కన్నడ వెర్షన్‌ను తీశారు. అయితే, దర్శకుడు మాత్రం విశ్వనాథ్ కాదు. కమలహాసన్ మేనరిజమ్‌నే మళ్ళీ కన్నడ వెర్షన్లోనూ పెట్టారు. ఇళయరాజా సంగీతాన్నే వాడుకున్నారు. కానీ, అచ్చం జిరాక్స్ కాపీ తీసినట్లుగా రీమేక్ చేయడంతో కథలో ఆత్మ లోపించింది. దాంతో కన్నడ వెర్షన్ అనుకున్నంత జనాదరణ పొందలేదు. ‘‘మాతృకను చూడకుండా, అదే తొలిసారి చూడడమైతే ఓకే కానీ, ఒకసారి ఒక కథను చూసేసిన ప్రేక్షకులు ఆ తరువాత దాన్ని యథాతథంగా మరొకరు తీసే ప్రయత్నాన్ని పెద్దగా హర్షించరు. కథనం, పాటలు, సంగీతం – ఇలా అన్నిటిలోనూ మాతృకతో పోల్చిచూసి, విమర్శిస్తారు. ఇది నా ఇన్నేళ్ళ అనుభవం’’ అని విశ్వనాథ్ వివరించారు. బెంగళూరు సహా కన్నడసీమలోనూ తెలుగు ‘స్వాతిముత్యం’ బాగా ఆడడంతో, తీరా కన్నడంలోకి అదే కథను రీమేక్ చేసినప్పుడు ఆ మాతృక ఘనవిజయం పెద్ద ఇబ్బందిగా మారింది. చిరు పాత్రలో... అల్లు అర్జున్ ‘శంకరాభరణం’ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన మేజర్ సౌందర్ రాజన్ అక్కడ ప్రముఖ నటుడు – ఏడిద నాగేశ్వరరావుకు స్నేహితుడు. సౌందరరాజన్ తొలిసారిగా తెలుగుతెర మీదకొచ్చి, ఈ ‘స్వాతిముత్యం’లో రాధిక మామగారి పాత్రలో కనిపిస్తారు. సినిమాల్లో హీరో అవుదామని వచ్చి, నటుడిగా చాలా పాత్రలు చేసి, నిర్మాతగా స్థిరపడ్డ ఏడిదే ఆ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం. రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనుమడు (పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు) మాస్టర్ కార్తీక్ నటించారు. కమలహాసన్ మనవడిగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తెరపై కనిపించడం విశేషం. మనవరాళ్ళుగా అరవింద్ పెద బావగారు – నిర్మాతైన డాక్టర్ కె. వెంకటేశ్వరరావు కుమార్తెలు విద్య, దీపు తెరపైకి వచ్చారు. స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఈ సినిమానే! రిలీజులో, రికార్డుల్లో కూడా ‘స్వాతిముత్యా’నికి ప్రత్యేకత ఉంది. అది 1986. పదోతరగతి పరీక్షల సీజన్‌కు ముందు సినిమా కలెక్షన్లకు డల్ పీరియడ్‌గా భావించే మార్చి నెలలో ‘స్వాతిముత్యం’ రిలీజైంది. అన్‌సీజన్‌లోనూ అన్ని వర్గాలనూ మెప్పించి, వసూళ్ళ వర్షం కురిపించింది. రజతోత్సవాలు చేసుకుంది. అప్పట్లో తెలుగునాట సినిమాలన్నీ రెగ్యులర్ షోస్ అంటే రోజుకు 3 ఆటలే! ఉదయం ఆట ఏదైనా చిన్న, డబ్బింగ్ సినిమాలు ఆడడం ఆనవాయితీ. రిలీజ్ సినిమాకు హెవీ క్రౌడ్ ఉంటే కొద్ది రోజులు అదనపు ఆటలు వేసేవారు. కానీ, ‘స్వాతిముత్యం’ అలా ఎక్స్ట్రా షోలతోనే ఏకంగా వంద రోజులు ఆడింది. అంతకు దాదాపు పదేళ్ళ క్రితం 1977 ప్రాంతంలో మొదలై ఎన్టీఆర్ 4 చిత్రాలు (‘అడవి రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’) మాత్రం తెలుగునాట ఇలా ఎక్స్ట్రా షోలతో, 4 –5 ఆటలతో వంద రోజులు ఆడాయి. అయితే, అవన్నీ మాస్ చిత్రాలు. వాటి తరువాత అలా అదనపు ఆటలతో తెలుగునాట శతదినోత్సవం చేసుకున్న ఘనత సాధించిన తొలి చిత్రం – ‘స్వాతిముత్యం’. మచ్చుకి గుంటూరు ‘వెంకట కృష్ణా’లో రోజూ 4 ఆటలతో, తిరుపతి ‘వేల్ రామ్స్’లో డైలీ 5 షోలతో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఆ తరువాతే స్టార్లు కృష్ణ (70 ఎం.ఎం. ‘సింహాసనం’), బాలకృష్ణ (‘సీతారామకల్యాణం’), చిరంజీవి (‘పసివాడి ప్రాణం’) లాంటి చిత్రాలతో ఈ అదనపు ఆటల శతదినోత్సవాలు సాధించారు. మన స్టార్ హీరోల కన్నా ముందే ఇలాంటి అరుదైన విజయం సాధించడాన్ని బట్టి క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’ తాలూకు మాస్ హిట్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్ల పోటీలో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్! నిజానికి ఆ ఏడాది తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరు మీదున్నారు. బాక్సాఫీస్ ‘ఖైదీ’ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎం.ఎం. సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్‌బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ సాధించారు. నాగార్జున ‘విక్రమ్’ (1986 మే 23)తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’(1986 ఆగస్ట్14)తో మాస్ హీరోలుగా తెరంగేట్రం చేశారు. వారందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడి (కమలహాసన్)తో, నాన్‌కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది ‘స్వాతి ముత్యం’. వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం అది. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమలహాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫిషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియన్ ఫిల్మ్ కూడా ఇదే! ∙– రెంటాల జయదేవ -
‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ మూవీ రివ్యూ
చిత్రం: ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’; తారాగణం: బిమల్ కార్తీక్ రెబ్బా, సంచితా పూనఛా; కెమేరా: సాగర్ వై.వి.వి, జితిన్ మోహన్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి; సమర్పణ: ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: జయంత్ గాలి; రిలీజ్: మార్చి 12 మారుతున్న సమాజంలో ప్రేమ, పెళ్ళి, ఫ్యామిలీ కూడా మారిపోతున్నాయి. వాటి చుట్టూ ఏళ్ళ తరబడిగా రాసుకున్న విలువలూ మారుతున్నాయి. మన అభిప్రాయాలూ మారుతున్నాయి. అయితే, మనిషిలోనూ, చుట్టూ సమాజంలోనూ ఎన్ని మార్పులు వచ్చినా, మనసులో మాత్రం ఇప్పటికీ లివిన్ రిలేషన్షిప్, ప్రేమ, పెళ్ళి, విడాకుల లాంటి అంశాల మధ్య నవతరంలోనూ బోలెడన్ని కన్ఫ్యూ జన్లు. ఆ సందేహాల ఊగిసలాటను తెర మీదకు తెస్తే? ప్రీ మ్యారిటల్ సెక్స్ కామన్ అవుతున్న రోజుల్లోనూ పెళ్ళి మీద అనుమానాలను బ్యాలెన్సుడ్ గా చర్చిస్తే? అందరూ కొత్తవాళ్ళే చేసిన అలాంటి ప్రయత్నం – ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’. కథేమిటంటే..: బెంగళూరు నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమంటే తెలియని వయసు నుంచి ముగ్గురు, నలుగురితో బ్రేకప్ అయిన వ్యక్తి – అరుణ్ (కార్తీక్). అతనికి అనుకోకుండా రేయా (సంచిత) పరిచయమవుతుంది. ఆల్రెడీ వేరొకరితో బ్రేకప్ అయి, అబార్షన్ కూడా చేయించుకున్న ఆ హీరోయిన్, మన హీరోతో ప్రేమలో పడుతుంది. పెళ్ళి, గిళ్ళి లాంటి జంఝాటాలేమీ లేకుండా సహజీవనం చేసేస్తుంటారు హీరో, హీరోయిన్. ఒక సందర్భంలో పెళ్ళి ప్రతిపాదన తెస్తాడు హీరో. ప్రేమకు ఓకే కానీ, పెళ్ళికి నో అంటుంది హీరోయిన్. భర్తతో విడిపోయిన తల్లిని అలా వదిలేసి, తాను పెళ్ళి చేసుకోనంటుంది. అవతలివాళ్ళను ప్రతిదానికీ జడ్జ్ చేసే పాతబడ్డ హీరో అభిప్రాయాలను తన కౌన్సెలింగ్‌తో హీరోయిన్ బద్దలు కొడుతుంది. అలా తండ్రికి మళ్ళీ దగ్గరవుతాడు హీరో. కాగా, కన్ఫ్యూజన్లో ఉన్న హీరోయిన్‌కు ఆమె తల్లి ఓ షాక్ ఇస్తుంది. తానూ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానంటుంది. అక్కడ నుంచి కథ మరో కీలక మలుపు తిరుగుతుంది. తల్లీ కూతుళ్ళ ప్రేమకథలు అనుకోకుండా ఒకదానికొకటి ముడిపడతాయి. ఆ తరువాత ఏమైంది, పెళ్ళి లేని ప్రేమ ఉండవచ్చేమో కానీ, పెళ్ళి చేసుకున్నంత మాత్రాన ప్రేమ ఉంటుందా లాంటి అంశాలపై చర్చతో మిగతా సినిమా కథ సాగుతుంది. ఎలా చేశారంటే..: అందరూ కొత్తవాళ్ళతో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులంతా సహజంగా అనిపిస్తారు. వారి కన్నా ఆ పాత్రలే కనిపిస్తాయి. హీరో కార్తీక్ తెరపై అందంగా ఉన్నారు. అందంతో పాటు, పాత్రచిత్రణ బలం రీత్యా హీరోయిన్ సంచిత ప్రత్యేకంగా నిలిచారు. బాడీ లాంగ్వేజ్‌లోనూ, నటనలోనూ అప్రయత్నంగా పాపులర్ హీరోయిన్ నిత్యా మీనన్‌ను గుర్తుకు తెస్తారు. ఇలాంటివెన్నో కలవడంతో– హీరో కన్నా ముందు ప్రేక్షకులే ఈ హీరోయిన్‌తో ప్రేమలో పడతారు. హీరో తండ్రి పాత్రలో కృష్ణ హెబ్బలే, హీరోయిన్ తల్లి పాత్రలో కళాజ్యోతి వగైరా యథోచితంగా నటించారు. ఎలా తీశారంటే..: నవలను సినిమాగా తీయవచ్చు. అది కొద్దిగా కష్టం. సినిమాను నవల లాగానూ తీయవచ్చు. ఈ రెండోది మరీ కష్టం. ఫన్ తక్కువ, సీరియస్‌నెస్ ఎక్కువున్న ఈ సినిమా కథాకథనం రెండో ఫక్కీలోది. ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. ఎంతసేపటికీ ప్రీ మ్యారిటల్ సెక్స్, బ్రేకప్, తాగుడు, తిరుగుళ్ళ చుట్టూరానే కథ నడుస్తున్నదేమో అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ, కథనం ఊపందుకుంటాయి. కథలోని మలుపులతో పాటు వివిధ పాత్రల మధ్య చర్చ, డైలాగులు ఆలోచింపజేస్తాయి. ‘‘నాలుగేళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నవాడితోనే హ్యాపీగా లేకపోతే, కొత్తగా పెళ్ళి చేసుకొనేవాడితో ఏం హ్యాపీగా ఉంటాం’’ (స్నేహితురాలితో హీరోయిన్) లాంటి డైలాగులతో వేర్వేరు సీన్లను దర్శకుడు జయంత్ కన్విన్సింగ్‌గా రాసుకున్నారు. నిజానికి, కథాకథనానికి నేపథ్య గీతాలు, సంగీతం కాస్తంత ఎక్కువగానే వాడిన ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా వచ్చిన ఇండిపెండెంట్ సినిమా. ఎక్స్ప్లిసిట్ సీన్లు, డైలాగులు చాలానే ఉన్నప్పటికీ, మారుతున్న సమాజానికీ – మారని మనుషుల మానసిక స్థితికీ మధ్య సంఘర్షణను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఇతివృత్తంతో గతంలోనే కొన్ని సినిమాలు ఇంగ్లీషు, హిందీ, మలయాళాల్లో రాకపోలేదు. ప్రేమ, పెళ్ళి, రిలేషన్షిప్ లాంటి అంశాలను తెలుగులోనూ కొన్ని సినిమాలు బలంగానే ప్రస్తావించాయి. ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ ఆ బాటలో తెరపై ఫ్రెష్‌నెస్ తీసుకురావడం గమనార్హం. కెమెరా వర్క్, పవన్ నేపథ్య సంగీతం, సమర్పకుడిగా ‘మధుర’ శ్రీధర్ రెడ్డి తీసుకున్న శ్రద్ధతో ఒక రకంగా ఈ సినిమా కలరే మారింది. బెంగళూరులో ఉంటున్న రాయలసీమ బిడ్డ జయంత్ తన తొలి ప్రయత్నంలో, ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్లు బాగా రాసుకున్నారు. రెస్టారెంట్ సీన్లో హీరోయిన్ కు హీరో నిజాయతీగా ప్రపోజ్ చేసే సన్నివేశంలోని డైలాగులు చేయి తిరిగిన మాటల మాంత్రికుల్ని తలపించాయి. హీరోయిన్‌కీ – ఆమె తల్లికీ మధ్య డిస్కషన్, ముఖ్యంగా క్లైమాక్స్ లో పెళ్ళి – ప్రేమ గురించి హీరోకు హీరోయిన్ చేసే ప్రబోధం సీన్లు కాసేపు ఆలోచనల్లోకి నెడతాయి. ‘‘పెళ్ళి చేసుకుంటే ఏమొస్తుంది బొజ్జ తప్ప’’ (హీరోతో ఫ్రెండ్) లాంటివేమో నవ్విస్తాయి. పెళ్ళికి ముందే సెక్స్, అబార్షన్, బ్రేకప్‌లు, పార్టీలు, మందు కొట్టడం, గంజాయి తాగడం, యథేచ్ఛగా బూతులు మాట్లాడడం, స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించడం లాంటి వాటితో నేటి ఆధునిక నగర యువతికి ప్రతీకగా హీరోయిన్ పాత్ర కనిపిస్తుంది. కథలోని నిజాయతీ, ఆ పాత్ర, ఆ పాత్రలో కన్నడమ్మాయి సంచిత అభినయం కొంతకాలం గుర్తుండిపోతాయి. వెండితెరపై కథావస్తువులో, స్త్రీ పాత్రల రూపకల్పనలో వస్తున్న మార్పుల గురించి రాబోయే రోజుల్లో చర్చిస్తున్నప్పుడు ఈ సినిమా, ఈ పాత్ర ప్రస్తావనకు వస్తాయి. వాణిజ్య విజయం మాటెలా ఉన్నా ఈ ప్రత్యేకతే ఈ సినిమాను కాస్తంత విభిన్నంగా నిలబెడుతుంది. అయితే, అధిక శాతం ఇంగ్లీషు డైలాగులతో ఇది తెలుగు సినిమాయేనా అని అనుమానమూ వస్తుంది. ప్రేమ, పెళ్ళి, బ్రేకప్పులు అందరికీ కామనే అయినా, అనేక పరిమితుల మధ్య కొత్తవాళ్ళు తీసిన ఈ చిత్రం మల్టీప్లెక్స్ జనం మెచ్చే న్యూ ఏజ్ అర్బన్ ఫిల్మ్ కావచ్చనిపిస్తుంది. కొసమెరుపు: కమర్షియాలిటీకి భిన్నమైన ఇండిపెండెంట్ ప్రయత్నం! బలాలు: నవ సమాజపు పోకడలున్న కథ, పాత్రలు సంగీతం, రీరికార్డింగ్ హీరోయిన్ సంచిత స్క్రీన్‌ప్రెజెన్స్, నటన సెకండాఫ్‌లోని కొన్ని సీన్లు, డిస్కషన్లు బలహీనతలు: నటీనటులు, దర్శకుడు అందరికీ తొలి సినిమా కావడం ఫస్టాఫ్ నవల తరహాలో సాగే నిదానపు కథనం రెగ్యులర్ కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా ఉండడం – రెంటాల జయదేవ -
'గాలి సంపత్' మూవీ రివ్యూ
చిత్రం: ‘గాలి సంపత్’; తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీశ్ కురువిల్లా; కథ: ఎస్. కృష్ణ; సంగీతం: అచ్చు రాజమణి; కెమేరా: సాయి శ్రీరామ్; ఎడిటింగ్: బి. తమ్మిరాజు; నిర్మాతలు: ఎస్. కృష్ణ, హరీశ్ పెద్ది, సాహూ గారపాటి; సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి; దర్శకత్వం: అనీశ్ కృష్ణ; నిడివి: 119 నిమిషాలు; రిలీజ్: మార్చి 11 కొన్ని కాన్సెప్టులు వినడానికి చాలా బాగుంటాయి. ఉద్విగ్నతకు గురిచేస్తాయి. అయితే, ఆ కాన్సెప్టును సరైన రీతిలో కథగా డెవలప్ చేసుకొని, ఆసక్తికర సన్నివేశాలతో అల్లుకున్నప్పుడే పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టు అవుతుంది. లేదంటే, మంచి కాన్సెప్టు సైతం మెచ్చుకొనే రీతిలో తయారు కాలేదని పెదవి విరవాల్సి వస్తుంది. ‘గాలి సంపత్’ చూశాక ఇలాంటి ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతాయి. ప్రకృతి దైవం లాంటిది. అప్పుడప్పుడు కొంత హాని చేసినట్టనిపించినా, దాని స్వభావం మనల్ని రక్షించడమే అనే పాయింట్ చెప్పేందుకు ఈ 2 గంటల చిన్న సినిమాలో ప్రయత్నించారు. కథేమిటంటే..: అరకులో ట్రక్కు డ్రైవర్ సూరి (శ్రీవిష్ణు). తల్లి లేని అతనికి తండ్రి సంపత్ (రాజేంద్రప్రసాద్) ఒక్కడే ఉంటాడు. నోట మాట పోవడంతో, ‘‘ఫి... ఫి... ఫీ’’ అంటూ గాలితో మాట్లాడుతుంటాడు కాబట్టి, ఆ తండ్రి పేరు గాలి సంపత్. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని నాటక పోటీలలో పాల్గొంటూ, ఉంటాడు గాలి సంపత్. ఆ ఊరి సర్పంచ్ కూతురు (లవ్లీ సింగ్)ను ప్రేమిస్తాడు సూరి. అప్పులు తీర్చేసి, ఎలాగైనా ఓ ట్రక్కు కొనుక్కొని, ఆమెను పెళ్ళాడాలని మనోడి ప్లాన్. ఓ బ్యాంకు మేనేజర్‌ను మొహమాటపెట్టి, 5 లక్షలు తెస్తాడు. తీరా నాటక పోటీల కోసం ఆ డబ్బు అతని తండ్రి తీస్తాడు. దాంతో, కంటికి కనిపించకుండా పొమ్మని కొడుకు అంటాడు. ఆ క్రమంలో హోరున కురుస్తున్న వర్షంలో ఇంటి వెనకే లోతైన పెద్ద గోతిలో పడిపోతాడు తండ్రి. పైకి మాట్లాడలేని, అరవలేని ఆ మనిషి ఆ గోతిలో పడ్డ సంగతి ఎవరూ గమనించరు. అతనికై వెతుకులాట సాగుతుంది. తండ్రిని ద్వేషిస్తున్న కొడుకుకు తన కోసం చిన్నప్పుడు తండ్రి చేసిన త్యాగం లాంటివన్నీ సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో వస్తాయి. చివరకు ప్రకృతిని ద్వేషించిన తండ్రికి ఆ ప్రకృతే ఎలా సహకరించింది, అతని అభినయ ప్రతిభ ఎలా బయటపడిందన్నది అక్కడక్కడ మెరుపులతో సాగే మిగతా కథ. ఎలా చేశారంటే..: లేటు వయసులో ఘాటు పాత్ర దక్కడం ఏ నటుడికైనా వరం. నాలుగు దశాబ్దాల పైచిలుకు తరువాత నటుడు రాజేంద్రప్రసాద్ కు ఇప్పుడు అలాంటి వరం మరోసారి దక్కింది. ఈ సినిమా టైటిల్ రోల్ ఆయనదే. ఇంకా చెప్పాలంటే, కథ అంతా ఆయన చుట్టూరానే తిరుగుతుంది.ఆయన తన నట విశ్వరూపం చూపెట్టారు. శ్రీవిష్ణు బాగా చేశారు. మహారాష్ట్ర మోడలింగ్ అమ్మాయి లవ్లీ సింగ్ ఈ సినిమాలో అందానికీ, అభినయానికీ కూడా తక్కువే. మిగిలిన పాత్రల్లో గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా శ్రీకాంత్ అయ్యంగార్, ఆడిటింగ్ ఆఫీసర్ గా అనీశ్ కురువిల్లా లాంటి వారి కామెడీ అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, అతిగా సాగదీసే సరికి ఉసూరుమనిపిస్తుంది. ఎలా తీశారంటే..: వరుస హిట్లతో జోరు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఈసారి ఈ చిన్న కథ, తెలుగు తెరపై కొత్త ప్రయత్నంతో సినీ నిర్మాణంలోకీ వచ్చారు. తానే మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో ప్రధానమైనది తండ్రీ కొడుకుల సెంటిమెంట్. అది అక్కడక్కడా పండింది. కానీ, కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలియకపోవడం, సాక్షాత్తూ కొడుకు పెళ్ళినే అతను చెడగొట్టడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఫ్లాష్‌బ్యాక్ బాగున్నా, తన చిన్నప్పుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన కొడుకుకు ఇంకొకరు చెప్పేవరకు అసలేం జరిగిందో తెలియదనడమూ పెద్దగా అతకలేదు. తీసుకున్న పాయింట్ బాగున్నా, కథారచనలో ఇలాంటి ఇబ్బందులున్నాయి. సహజ పరిణామ క్రమంగా కాక, అనుకున్నట్టల్లా సంఘటనలు జరిగిపోయే సినిమాటిక్ లిబర్టీలూ బోలెడు. ఫస్టాఫ్‌లో చాలా భాగం అసలు కథకు రంగం సిద్ధం చేయడంతోనే సరిపోతుంది. రాజేంద్రప్రసాద్ మూకాభినయ (మైమ్) ప్రదర్శన దగ్గర నుంచి కాస్తంత ఊపు వస్తుంది. గోతిలో పడడ మనే పాయింట్ చుట్టూరానే కథ నడిస్తే బాగుండేది. కానీ, తీసుకున్న పాయింట్ చిన్నది కావడంతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. అది అసలు కథా గమనానికి అడ్డమై కూర్చుంది. సెంటిమెంట్ పండుతున్న చాలా సందర్భాల్లో అనవసరపు హాస్యం అడ్డం పడినట్టు అనిపిస్తుంది. మరింత బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. డైలాగులు లేని మైమ్ ప్రదర్శన, క్లైమాక్స్ గోతి సీన్ లాంటి చోట్ల అచ్చు రాజమణి నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి తీరాలి. ఇవన్నీ సినిమాలో మంచి జీడిపలుకులు. కానీ, ఓవరాల్ గా వంటకంలోనే తీపి తగ్గింది. కొసమెరుపు: కథ తక్కువ! గాలి ఎక్కువ!! బలాలు: ►రాజేంద్రప్రసాద్ విశ్వరూపం, శ్రీవిష్ణు నటన ►అక్కడక్కడ మెరిసిన డైలాగ్స్, సెంటిమెంట్ ►కీలక సందర్భాల్లో నేపథ్య సంగీతం బలహీనతలు: ∙నిదానంగా సాగే ఫస్టాఫ్ ►కథను పక్కదోవ పట్టించే అనవసరపు ట్రాక్‌లు ►సాగదీసిన గ్రామీణ బ్యాంక్ కామెడీ ►రచయిత అనుకున్నట్టల్లా నడిచే సినిమాటిక్ సంఘటనలు రివ్యూ: రెంటాల జయదేవ -
సినిమాల్లో... సగమెక్కడ?
వాళ్ళు... ఆకాశంలో సగం! అందరి జీవితాల్లోనూ సగం!! ప్రతి మనిషి జీవితానికీ మూలం వాళ్ళే! ప్రతి మగాడి విజయం వెనుకా వాళ్ళే!! కళలకు కేంద్రం వాళ్ళే! కలలకు అందమూ వాళ్ళే!! కానీ... పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలకు దక్కాల్సిన స్థానం దక్కుతోందా? సినీ లోకంలో స్త్రీకి ప్రాధాన్యం లభిస్తోందా? నలుగురు మహిళా టెక్నీషియన్లతో స్పెషల్ డిస్కషన్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు , మళ్లీ రాత్రి 11.30కు ‘మహానటి’ సినిమా చేసేప్పుడు ఈ సినిమాకు చెందిన యూనిట్లో 99శాతం మంది మహిళలే ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది - అనీ మాస్టర్, కొరియోగ్రాఫర్ పాతికేళ్ళ క్రితం నేను ఫస్ట్ సినిమాల్లో జాయిన్ అవుతానన్నప్పుడు మా నాన్నగారు కాళ్లు విరగ్గొడతానన్నారు. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. స్త్రీల టీమ్ వల్ల సినిమాలో మెల్ల మెల్లగా ఫిమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. - సునీత తాటి, నిర్మాత ఇప్పుడు మేం మహిళా సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నాం అంటే అందుకు భానుమతీ రామకృష్ణ వంటి తొలితరం వారు వేసిన పునాదులే కారణం. స్త్రీలు సినిమాల్లోకి వస్తే... మన ఇంట్లో వాళ్ళ కన్నా... ఎదురింటి, పక్కింటివాళ్ళ వల్లే పెద్ద ప్రాబ్లమ్! - చైతన్య పింగళి, రైటర్ అండ్ కో-డైరెక్టర్ ఒక మహిళా సాంకేతిక నిపుణురాలిగా నేను రాణిస్తున్నాను అంటే దానికి కారణం నా కుటుంబం నుంచి నాకు లభించిన సపోర్టే. - మోనికా రామకృష్ణ ప్రొడక్షన్ డిజైనర్ - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
అందుకే ప్రభాస్ కూల్: నాగ్ అశ్విన్
‘‘అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్తుతుందనే నమ్మకం ఉంది. ‘బాహుబలి’ సినిమా వల్ల కొత్త దారులు ఏర్పడ్డాయి. స్పైడర్‌మ్యాన్, జేమ్స్‌బాండ్ వంటి చిత్రాలు మన దగ్గర విడుదలవుతున్నాయి. మన సినిమాలు కూడా ఆ స్థాయిలో అక్కడ రిలీజ్ అయ్యే తరుణం వస్తుంది’’ అని దర్శక -నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... ► నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ హిలేరియస్ మూవీ చేద్దామనుకున్నాను. అనుదీప్ చేసిన ఓ కామెడీ షార్ట్‌ఫిల్మ్ చూసి ఓ హిలేరియస్ సినిమా చేద్దామని నేనే అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లా. అతను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. అలా ‘జాతిరత్నాలు’ మొదలైంది. ఈ సినిమాలో కామెడీ, స్టోరీ ఐడియా అనుదీప్‌దే. ఎక్కువకాలం ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించిన ఇన్ పుట్స్ కొన్ని ఇచ్చాను. ► విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి పరిచయం. విజయ్, నవీన్ ల కాంబినేషన్లోనే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ సమయంలో నవీన్ కు ‘జాతిరత్నాలు’ కథ పంపా. అతనికి కథ నచ్చింది. నవీన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. రాహుల్, ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. ఒక స్క్రిప్ట్ రాయాలన్నా.. సినిమా తీయాలన్నా బ్రెయిన్ కావాలి. కానీ మంచి కామెడీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్‌కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్‌గా వచ్చింది. ► ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. ‘మనీ మనీ..’, ‘అనగనగా..’ తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ. రెండు మూడు టైటిల్స్ అనుకున్న తర్వాత ‘జాతిరత్నాలు’ ఫిక్స్ చేశాం. నవీన్ కు హిందీలో మార్కెట్ ఉంది. కాబట్టి దీన్ని హిందీలో డబ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ► నాకు నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మంచి కంటెంట్ సినిమాలు వస్తే స్వప్న సినిమాస్ ద్వారా ప్రోత్సహిస్తాను. ► నా గత చిత్రాలు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లో హ్యూమర్ ఉంది. అలాగే ప్రభాస్‌తో నేను చేయబోయే సినిమాలో కూడా కొంత హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అందుకే సమయం పడుతోంది. జూలైలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ► ప్రభాస్ దగ్గరకి ఒక పెద్ద స్టార్‌గా భావించి వెళతాం. కానీ ఆయన సరదాగా ఉంటారు. సినీ లెక్కలు, బాక్సాసీఫ్ ఓపెనింగ్స్ పట్టించుకోరు. సోషల్ మీడియాపై ఆసక్తి చూపించరు. ఎప్పుడైనా మాట్లాడితే మేం చేయాల్సిన సినిమాలు, ఆయన చేస్తున్న ఇతర సినిమాల గురించే మాట్లాడతారు. అందుకే ప్రభాస్ అంత కూల్‌గా ఉంటారేమో! - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం
కథలోని ప్రధాన పాత్రలకు ఏదో దెబ్బ తగిలి, గతం మర్చిపోవడం ఎప్పుడూ ఓ మంచి వెండితెర కమర్షియల్ పాయింట్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి దాకా ఈ పాయింట్‌తో అల్లుకున్న కథలు అనేకం. మన అగ్ర హీరోల్లో దాదాపు అందరూ ఈ పాయింట్ ఆధారంగా సినిమాలు చేశారు. సక్సెస్ అందుకున్నారు. కలర్ చిత్రాల జోరు మొదలైన రోజుల్లో దర్శకుడు వి. మధుసూదనరావు, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో ఈ పాయింట్‌తో వచ్చిన సక్సెస్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘పవిత్రబంధం’. బిగువైన కథ, పాటలు, హీరోయిన్లు కాంచన, వాణిశ్రీ అందచందాలతో సరిగ్గా 50 ఏళ్ళ క్రితం వచ్చిన ‘పవిత్రబంధం’ ఆ తరానికి ఓ తీపి గుర్తు. ఆ సినిమాలోని ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘పచ్చబొట్టూ చెరిగీపోదులే’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందాల తారలతో... ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సినిమాకు ఒక్కో యు.ఎస్.పి. ఉంటుంది. ‘దేవదాసు’ ఫేమ్ అక్కినేనికి కెరీర్ తొలి రోజుల నుంచీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. ఒకరికి ఇద్దరు నాయికలతో అలాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళ కథలు తెరపై పండించడంలో ఆయనదో ప్రత్యేక ముద్ర. అందుకే, 1950లలో, ’60లలో అలాంటి కుటుంబకథలతో ఆయన తన రేంజ్‌నూ, ఇమేజ్‌నూ పెంచుకుంటూ వచ్చారు. కలర్ సినీశకం మొదలయ్యాక కూడా ఆయన ఆ మార్గం వీడలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరలో అక్కినేని చేసిన అలాంటి ఓ గమ్మతై ్తన ప్రేమ, పెళ్ళి కథ – ‘పవిత్రబంధం’. ‘‘ప్రేమించిన ప్రియురాలు! పెళ్ళాడిన ఇల్లాలు!! ఎవరి అనుబంధం – తరతరాల పవిత్రబంధం?’’ ఒక్కముక్కలో ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల నటి కాంచన, సావిత్రి తరువాత అప్పుడప్పుడే స్టార్ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో అక్కినేని సరసన హీరోయిన్లు. శృంగారాభినయానికి ఒకరు, సెంటిమెంటుకు మరొకరు. ఇక, 1970ల ద్వితీయార్ధానికి హీరోగా స్థిరపడ్డ కృష్ణంరాజు నెగటివ్ రోల్ చేశారు. ఆకట్టుకొనే కథ... కథనం... ‘పవిత్రబంధం’లో ‘‘కల్లకపటాలు లేని పల్లెటూరి వలపులు, అల్లకల్లోలమైన పట్నవాసపు తలపులు’’ చూపారు. అశోక్ మూవీస్ పతాకంపై టి. గోవిందరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి. మధుసూదనరావు పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దారు. మెదడుకు దెబ్బ తగిలి, కథలోని ప్రధానపాత్ర పాత జ్ఞాపకాలను మర్చిపోవడమనే ఫార్ములాను లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టి, హాస్య, శృంగార రసాలకు ప్రాముఖ్యమిస్తూ అల్లుకున్నారు. అనుకోని విధంగా జీవితంలో ఇద్దరు అమ్మాయిలకు ప్రేమను పంచవలసి వచ్చిన హీరో కథ ఇది. అనాథాశ్రమంలో పెరిగి, ఉన్నత విద్య చదివి, ఉద్యోగం దొరకక పట్నంలో తిరుగుతూ, ఓ పాడైపోయిన బస్సులో నివసిస్తుంటాడు హీరో (అక్కినేని). అతి గారాబంతో పంజరంలా మారిన ఇంట్లో నుంచి బయటపడి, తానెవరో చెప్పని ఓ కల వారింటి అమ్మా యి (కాంచన)ను ప్రేమి స్తాడు. ఇంతలో ఓ కారు ప్రమాదం. హీరో గతాన్ని మర్చిపోతాడు. ఓ పల్లెటూరు చేరతాడు. అనుకోకుండా అక్కడో పల్లెటూరి అమ్మాయి (వాణిశ్రీ)ని కాపాడి, ఆమె ప్రేమ దక్కించుకొని, పెళ్ళి చేసుకొంటాడు. పండంటి పిల్లాడికి తండ్రి అవుతాడు. రైతుగా జీవితం గడుపుతుంటాడు. పట్నానికి పని మీద వెళతాడు. తీరా అప్పుడు రెండోసారి ప్రమాదం. మళ్ళీ మెదడుకు దెబ్బ. ఈ రెండు యాక్సిడెంట్లకు మధ్య జరిగిన కథను హీరో మర్చిపోతాడు. మొదటి యాక్సిడెంట్‌కు ముందు పెద్దింటి అమ్మాయితో జరిపిన పాత ప్రేమకథ మాత్రం గుర్తొచ్చి, పెళ్ళికి సిద్ధమవుతాడు. కనిపించని భర్త కోసం వెతుక్కుంటూ పట్నం వస్తుంది పల్లెటూరి భార్య. అక్కడ హీరో కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య అంతః సంఘర్షణ. ‘పచ్చబొట్టు’ పాట, కన్నకొడుకు (బేబీ డాలీ) జ్ఞాపకాలతో హీరోకు తన పల్లెటూరి పెళ్ళికథా గుర్తొస్తుంది. చివరకు ప్రేమ కన్నా, తాళి కట్టిన అమ్మాయిదే పవిత్రబంధం అనే మహిళా సెంటిమెంటుకే సినిమా జై కొడుతుంది. ఒకమ్మాయి త్యాగంతో మరో అమ్మాయి సంసారం చక్కబడుతుంది. మనిషి, మనసు, డబ్బు– వీటి మధ్య బంధం ఏమిటి? హీరో కథలో పట్నంలో జరిపిన ప్రేమా, పల్లెటూరిలోని పెళ్ళా– ఏది గొప్ప? ఇలా పాత్రల ఘర్షణ, అనుబంధాల పవిత్రత చూపుతుందీ సినిమా. ఆరుద్ర కలం... పాటల బలం... ఈ సినిమాకు ఆరుద్ర రాసిన ‘అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..’ (గానం పి. సుశీల బృందం), ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం’ (సుశీల – ఘంటసాల), సంతోష – విషాద సందర్భాలు రెంటిలోనూ వచ్చే ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా’ పాటలు మోస్ట్ పాపులర్. జనపదం మెచ్చే పాటల రచయిత కొసరాజు కలంలోని ‘ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి..’ (సుశీల – స్వర్ణలత) హుషారు రేపింది. అప్పట్లో మంచి మ్యూజికల్ ఆల్బమ్‌గా నిలిచిన ‘పవిత్రబంధం’ సక్సెస్‌కు తారల అభినయంతో పాటు ఈ ఎవర్ గ్రీన్ పాటలూ తోడయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలమైన పాటలతో పాటు మాటలూ ఆరుద్రే రాశారు. ఆ అసిస్టెంట్లు ఇప్పుడు ఫేమస్! సర్వసాధారణంగా తెలుగునాట సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు పెట్టుబడితో తయారవుతూ వచ్చిన కాలం అది. అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ ‘నవయుగ ఫిలిమ్స్’ సహకారంతో ‘పవిత్రబంధం’ తయారైంది. సహజంగానే, ‘నవయుగ ఫిలిమ్స్’ వారే సినిమాకు ప్రధాన పంపిణీదారులు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధులైన ఓ దర్శకుడు, ఓ నిర్మాత అప్పట్లో ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వారెవరంటే – దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నిర్మాత ‘యువచిత్ర’ కె. మురారి. అప్పట్లో దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన ఈ ఇద్దరూ కాలక్రమంలో చెరొక శాఖలో స్థిరపడ్డారు. కోదండరామిరెడ్డి తమ గురువులానే పలు కమర్షియల్ హిట్స్ అందించి, దర్శకుడిగా 100 చిత్రాల మార్కుకు కాస్త దూరంలో ఆగారు. ఇక, ‘నవయుగ ఫిలిమ్స్’ అధినేతలైన కాట్రగడ్డ కుటుంబానికే చెందిన మురారి దర్శకత్వం కన్నా నిర్మాణం తన అభిరుచికి సరిపోతుందని అటు మళ్ళారు. ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’ మొదలు ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా పలు మ్యూజికల్ హిట్స్ నిర్మించారు. అలా ‘పవిత్రబంధం’ అసిస్టెంట్ డైరెక్టర్లిద్దరూ తర్వాత ఫేమసయ్యారు. విజయవాడ విశ్లేషణకు పెద్ద పీట! ఓ సినిమా రిలీజయ్యాక ఆ చిత్ర యూనిట్ ఆంధ్రదేశంలోని ప్రధాన రిలీజు కేంద్రాలకు వెళ్ళడం, విజయయాత్రలు చేయడం, పత్రికా రచయితలతో సంభాషించడం అప్పట్లో ఓ ఆనవాయితీ. సినీ వ్యాపార, పంపిణీరంగ రాజధాని విజయవాడలో ప్రతి సినిమాకూ అవి తప్పనిసరిగా జరిగేవి. ‘పవిత్రబంధం’కి కూడా ఆ ఆనవాయితీ పాటించారు. విజయవాడలో నవయుగ ఫిలిమ్స్ నిర్వహణ బాధ్యతలతో అప్పటికే తల పండిన ప్రముఖ సినీ వ్యాపార, ప్రచార రంగ నిపుణుడు కాట్రగడ్డ నరసయ్య ఎప్పటికప్పుడు వినూత్న ప్రచార వ్యూహాలతో సినిమాకు ప్రచారం కల్పించేవారు. ‘పవిత్రబంధం’ రిలీజయ్యాక తొలి వారంలోనే ఆయన వినూత్నంగా స్థానిక రచయితలతో చిత్ర యూనిట్ ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత టి. గోవిందరాజన్ పాల్గొన్న ఈ ఇష్టాగోష్ఠిలో రావూరి సత్యనారాయణరావు, రెంటాల గోపాల కృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, తుర్లపాటి కుటుంబరావు లాంటి ఆ తరం ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు సినిమాపై తమ అభిప్రాయాలను వివరించడం విశేషం. విజయవాడలో తరచూ రచయితలతో సమావేశాలు జరపడం, వారి అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ తెలుసుకోవడం సినిమా పురోగతికి మేలు చేస్తుందని సాక్షాత్తూ దర్శకుడు వి. మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. ఆ ఒరవడి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన 1990ల చివరి దాకా కొనసాగడం విశేషం. మొత్తం మీద అక్కినేని, మధుసూదనరావుల కాంబినేషన్ లోని ‘పవిత్రబంధం’ ఓ పాపులర్ చిత్రంగా నిలిచింది. అప్పట్లో రేడియోలో పదే పదే వినిపించిన పాపులర్ పాటలతో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయింది. ఆరుద్ర రాసిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది..’ పాట యాభయ్యేళ్ళు గడిచిపోయినా, నేటి సమకాలీన సమాజానికీ వర్తించడం ఓ విశేషం. మారని మన వ్యవస్థకు అద్దం పట్టే ఓ విషాదం. బాక్సాఫీస్ విజయాల లెక్కల కన్నా ఈ బాధామయ పరిస్థితులు, నిరుద్యోగిగా – రైతుగా – ఎస్టేటు యజమానిగా మూడు పార్శా్వలలో అక్కినేని నటన, ఘంటసాల గానం – అన్నీ ఈ సినిమాను చిరస్మరణీయం చేశాయి. కలర్ అక్కినేని వర్సెస్ బ్లాక్ అండ్ వైట్ అక్కినేని! ఓ మాస్ హిట్ సినిమా థియేటర్లలో నడుస్తుండగా... ఆ పక్కనే మరెంత బాగున్న సినిమా మరొకటి వచ్చినా బాక్సాఫీస్ ఎదురీత తప్పదు. అక్కినేని ‘పవిత్రబంధం’కి అలాంటి పరిస్థితే ఎదురైంది. కలర్ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన కలర్‌ఫుల్ మాస్ హిట్ అక్కినేని ‘దసరా బుల్లోడు’ (1971 జనవరి 13). ఆ తరువాత సరిగ్గా 6 వారాలకే ‘పవిత్రబంధం’ వచ్చింది. దానికి ‘దసరా బుల్లోడు’ ఊహించని ప్రత్యర్థి అయి కూర్చుంది. సినిమా, తీసుకున్న పాయింట్, తీసిన విధానం, నటీనటులు, పాటలు – ఇలా అన్నీ బాగున్నా, రంగుల చిత్రం ‘దసరా బుల్లోడు’ వెల్లువ నలుపు తెలుపుల ‘పవిత్ర బంధం’ని బాక్సాఫీస్ వద్ద ముంచెత్తింది. కానీ, అంత గట్టి పోటీలోనూ ‘పవిత్రబంధం’ జనాదరణ పొందింది. బెజవాడలో శతదినోత్సవమూ చేసుకుంది. అక్కినేని కథతో... రాఘవేంద్రుడి ముద్దుల ప్రియుడు గమ్మత్తేమిటంటే, విజయవంతమైన చిత్రాలతో విక్టరీ మధుసూదనరావుగా పేరు తెచ్చుకున్న వి. మధుసూదనరావు దగ్గర తొలి రోజుల్లో పనిచేసిన తరువాతి తరం కమర్షియల్ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు అచ్చంగా ఇదే కథను రంగుల్లో తెరకెక్కించారు. ‘పవిత్ర బంధం’ రిలీజైన 23 ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావు తీసిన ‘ముద్దుల ప్రియుడు’ (1994) చూస్తే – బేసిక్‌గా రెండు కథలూ ఒకటే అని అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ అక్కినేని, వాణిశ్రీ, కాంచన స్థానంలో రెండు దశాబ్దాల తరువాత రంగుల్లో వెంకటేశ్, రంభ, రమ్యకృష్ణ వచ్చారు. కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సిన మసాలాలు దట్టిస్తూ, మార్పులూ చేశారు. అప్పటి ‘పవిత్ర బంధం’లానే ఇప్పటి ‘ముద్దుల ప్రియుడు’లోనూ కొన్ని పాటలు (వేటూరి రచనలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా...’, ‘సిరి చందనపు చెక్క లాంటి భామ...’, సిరివెన్నెల రచన ‘నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక...’) పదే పదే వినిపించాయి. కీరవాణి మార్కు సంగీతానికి, రాఘవేంద్రరావు మార్కు పూలు – పండ్ల చిత్రీకరణ శైలి, రమ్యకృష్ణ అందం తోడై పాటలు రేడియోలో, టేప్రికార్డర్లలో మారు మోగాయి. కానీ, సినిమా మాత్రం ఆశించిన బాక్సాఫీస్ రిజల్ట్ అందుకోలేకపోయింది. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై నిర్మించిన రాఘవేంద్రరావుకు నిరాశే మిగిలింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అక్కినేని సినీ కెరీర్ లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులోనూ, సామాజిక పరిస్థితులకు సరిపడేలా నిత్యనూతనంగా నిలిచిన పాటలూ అనేకం. అలాంటి పాటలనగానే ఎవరికైనా – అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన ‘పాడవోయి భారతీయుడా..’ గుర్తొస్తుంది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోద’నీ, ‘అవినీతి – బంధుప్రీతి – చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు’ననీ అక్కినేని పాత్ర నోట రచయిత పలికిన మాట దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ వర్తించే మాట! ప్రతి స్వాతంత్య్ర దినోత్సవాన జనాన్ని ఆలోచింపజేస్తున్న పాట!! సరిగ్గా అదే పద్ధతిలో చిరస్మరణీయ గీతమైంది – ‘పవిత్రబంధం’లో ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో, ఆరుద్ర రాయగా, ఘంటసాల గళంలో, తెరపై హీరో అక్కినేని నోట వచ్చే ‘గాంధి పుట్టిన దేశమా ఇది.’ ఆ పాటలో ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు’, ‘ఉన్నది మనకు ఓటు – బ్రతుకు తెరువుకే లోటు’ అంటూ సాగే నిరుద్యోగ నాయక పాత్ర ఆవేదన నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. ‘పేరుకు ప్రజలదే రాజ్యం – పెత్తందార్లకే భోజ్యం’ అంటూ కవి క్రాంతదర్శి అయ్యాడు. – రెంటాల జయదేవ -
రివ్యూ టైమ్: పిట్ట కథలు
వెబ్ యాంథాలజీ: ‘పిట్టకథలు’; తారాగణం: జగపతిబాబు, అమలాపాల్, శ్రుతీహాసన్, మంచులక్ష్మి, సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా; దర్శకులు: తరుణ్ భాస్కర్– నందినీ రెడ్డి – నాగ్ అశ్విన్ – సంకల్ప్ రెడ్డి; ఓటీటీ: నెట్ ఫ్లిక్స్; రిలీజ్: ఫిబ్రవరి 19 వేర్వేరు రచయితలు, కవులు రాసిన కొన్ని కథలనో, కవితలనో, గేయాలనో కలిపి, ఓ సంకలనం (యాంథాలజీ)గా తీసుకురావడం సాహిత్యంలో ఉన్నదే! మరి, వేర్వేరు దర్శకులు రూపొందించిన కొన్ని వెండితెర కథలను గుదిగుచ్చి, తెరపైకి తీసుకువస్తే? అదీ యాంథాలజీనే. ఓటీటీ వేదికలు వచ్చాక పెరిగిన ఈ వెబ్ యాంథాలజీల పద్ధతి ఇప్పుడు తెలుగులో కూడా ప్రవేశించింది. తమిళంలో గత ఏడాది ‘పుత్తమ్ పుదు కాలై’ (అమెజాన్ ప్రైమ్), ఈ ఏడాది ‘పావ కదైగళ్’ (నెట్ ఫ్లిక్స్) లాంటివి వచ్చాయి. గత సంవత్సరమే తెలుగులో ‘మెట్రో కథలు’ (ఆహా) లాంటి ప్రయత్నాలూ జరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగులో తొలిసారి తమ ఒరిజినల్ ఫిల్మ్‌గా అందించిన వెబ్ యాంథాలజీ ‘పిట్టకథలు’. పాపులర్ దర్శకులు తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి ఈ పిట్టకథలను రూపొందించారు. మన చుట్టూ ఉన్న మనుషుల కథలు, వాళ్ళ మనసులోని వ్యధలు, ప్రేమలు, మోసాలు, అనుబంధాలు, అక్రమ సంబంధాలు – ఇలా చాలా వాటిని ఈ కథలు తెర మీదకు తెస్తాయి. స్త్రీ పురుష సంబంధాల్లోని సంక్లిష్టతతో పాటు, వారి మధ్య పవర్ ఈక్వేషన్‌ను కూడా చర్చిస్తాయి. నేటివిటీ నిండిన ‘రాములా’: ‘పెళ్ళిచూపులు’ తరుణ్ భాస్కర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకొని, దర్శకత్వం వహించిన ‘రాములా’ గ్రామీణ నేపథ్యంలోని ఓ టిక్ టాక్ అమ్మాయి రాములా (శాన్వీ మేఘన) కథ. తోటి టిక్ టాక్ కుర్రాడు (నవీన్ కుమార్) ప్రేమిస్తాడు. కానీ, పెద్దల కోసం మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైనప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది? ఓ అమ్మాయి కష్టాన్ని మహిళామండలి అధ్యక్షురాలు స్వరూపక్క (మంచు లక్ష్మి) ఎలా వాడుకుంది ఈ కథలో చూడవచ్చు. సహజమైన నటనతో, తెలంగాణ నేపథ్యంలో, అదే మాండలికంలోని డైలాగ్స్ తో ఈ పిట్టకథ – జీవితాన్ని చూస్తున్నామనిపిస్తుంది. క్లైమాక్స్ గుండె పట్టేస్తుంది. హాట్ హాట్ చర్చనీయాంశం ‘మీరా’: ‘ఓ బేబీ’ ఫేమ్ నందినీరెడ్డి రూపొందించిన ‘మీరా’ – అనుమానపు భర్త (జగపతిబాబు) శారీరక హింసను భరించే పద్ధెనిమిదేళ్ళ వయసు తేడా ఉన్న ఓ అందమైన భార్య (అమలాపాల్) కథ. రచయిత్రి మీరా ఆ హింసను ఎంతవరకు భరించింది, చివరకు ఏం చేసిందనేది తెరపై చూడాలి. లక్ష్మీ భూపాల్ మాటలు కొన్ని చోట్ల ఠక్కున ఆగేలా చేస్తాయి. డిప్రెషన్‌తో బాధపడుతూ, భార్యను బతిమలాడే లాంటి కొన్ని సన్నివేశాల్లో జగపతిబాబులోని నటప్రతిభ మరోసారి బయటకొచ్చింది. అమలా పాల్ కూడా టైటిల్ రోల్‌ను సమర్థంగా పోషించారు. వంశీ చాగంటి, కిరీటి దామరాజు, ప్రగతి లాంటి పరిచిత నటీనటులతో పాటు నిర్మాణ విలువలూ బాగున్నాయి. హాట్ దృశ్యాలతో పాటు, హాట్ హాట్ చర్చనీయాంశాలూ ఉన్న చిత్రం ఇది. ట్విస్టులు, కీలక పాత్ర ప్రవర్తన అర్థం కావాలంటే రెండోసారీ చూడాల్సి వస్తుంది. టెక్నాలజీ మాయలో పడితే... ‘ఎక్స్ లైఫ్’: ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తీసిన పిట్టకథ ‘ఎక్స్ లైఫ్’ ఓ సైన్స్‌ఫిక్షన్. దర్శకుడు క్రిష్ వాయిస్ ఓవర్ చెప్పిన ఈ కథ భవిష్యత్ దర్శనం చేయిస్తుంది. ప్రపంచంలోని మనుషులందరినీ కేవలం డేటా పాయింట్లుగా భావించే విక్రమ్ రామస్వామి అలియాస్ విక్ (సింగర్ సన్నత్ హెగ్డే) ఎక్స్ లైఫ్ అంటూ ప్రపంచంలోనే అత్యాధునిక వర్చ్యువల్ రియాలిటీ కంపెనీ నడుపుతుంటాడు. మనుషుల్లోని ప్రేమను చంపేసే టెక్నాలజీని నమ్ముకున్న మాయాలోకం అది. అక్కడ కిచెన్‌లో పనిచేసే అమ్మాయి దివ్య (శ్రుతీహాసన్)ను చూసి, అమ్మ గుర్తొచ్చి, ప్రేమలో పడతాడు. తరువాత ఏమైందన్నది ఈ కథ. టెక్నాలజీ లోకపు పెను అబద్ధాల కన్నా చిరు సంతో షాలు, ప్రేమలు దొరికిన జీవితమే సుఖమనే తత్త్వాన్ని క్లిష్టంగా బోధపరుస్తుందీ కథ. అసంపూర్తి అనుబంధాల... ‘పింకీ’: ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ లాంటి సినిమాలు తీసిన సంకల్ప్ రెడ్డి రూపొందించిన పిట్ట కథ ‘పింకీ’. ఇద్దరు దంపతుల (సత్యదేవ్ – ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ – ఆషిమా నర్వాల్) మధ్య మారిన అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ప్రేమ కోసం పరితపించే ఒకరు, పాత జ్ఞాపకాలను వదిలించుకోవాలనుకొనే మరొకరు... ఇలాంటి వివిధ భావోద్వేగాలతో నాలుగు పాత్రలు కనిపిస్తాయి. ఆ అనుబంధాల క్రమాన్ని కానీ, చివరకు వారి పర్యవసానాన్ని కానీ పూర్తి స్థాయిలో చూపకుండా అసంపూర్తిగా ముగిసిపోయే కథ ఇది. ఈ యాంథాలజీలో ఒకింత ఎక్కువ అసంతృప్తికి గురిచేసే కథా ఇదే. ప్రధానంగా స్త్రీ పాత్రల చుట్టూ తిరిగే ఈ పిట్టకథల్లో పేరున్న కమర్షియల్ చిత్రాల తారల అభినయ కోణం కనిపిస్తుంది. సంగీతంలో వివేక్ సాగర్ (‘రాములా’), మిక్కీ జె మేయర్ (‘మీరా’), ప్రశాంత్ కె. విహారి (‘పింకీ’) లాంటి పేరున్న సాంకేతిక నిపుణులు పనిచేశారు. అలాగే, ఛాయాగ్రహణం, ఆర్ట్ వర్క్‌లోనూ పాపులర్ టెక్నీషియన్లు ఉన్నారు. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, నవతరం దర్శకులు తీసిన ఈ కథలన్నిటిలో లవ్ మేకింగ్ సీన్లు ఎదురవుతాయి. అశ్లీలపు మాటలూ వినిపిస్తాయి. స్మార్ట్ ఫోన్లో చూస్తే అది ఇబ్బంది కాకపోవచ్చు. కానీ, సకుటుంబంగా చూడాలంటే కష్టమే. చిరకాలంగా ‘నెట్ ఫ్లిక్స్’ ఊరిస్తూ వచ్చిన ఈ యాంథాలజీలో నాలుగు కథలూ ఒకే స్థాయిలో లేకపోవడమూ చిన్న అసంతృప్తే. కొసమెరుపు: ‘పిట్టకథలు’... అద్భుతంగా ఉన్నాయనలేం... అస్సలు బాగా లేవనీ అనలేం! బలాలు ♦సమాజంలోని కథలు ♦పాపులర్ దర్శకులు, నటీనటుల ప్రతిభ ♦నిర్మాణ విలువలు బలహీనతలు ♦హాట్ సన్నివేశాలు ♦కొన్ని అసంతప్తికర కథనాలు రివ్యూ: రెంటాల జయదేవ -
'చక్ర' మూవీ రివ్యూ!
చిత్రం: ‘విశాల్ చక్ర’; తారాగణం: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా, కె.ఆర్. విజయ, మనోబాల; మాటలు: రాజేశ్ ఎ. మూర్తి; సంగీతం: యువన్ శంకర్ రాజా; కెమేరా: కె.టి. బాలసుబ్రమణ్యం; ఎడిటింగ్: త్యాగు; నిర్మాణం: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ; రచన – దర్శకత్వం: ఎం.ఎస్. ఆనందన్; నిడివి: 131 నిమిషాలు; రిలీజ్: ఫిబ్రవరి 19. కొనుగోళ్ళ దగ్గర నుంచి ఇంటి సర్వీసుల దాకా ప్రతీదీ ఆన్లైన్, ఇంటర్నెట్ బేస్డ్ అయిపోయాక డిజిటల్ ప్రపంచంలో మన సమాచారం అంతా ఇట్టే లీకయ్యే ప్రమాదం తలెత్తింది. వైరస్ కన్నా వైర్లెస్ నెట్వర్క్ ప్రమాదమైందనే అంశాన్ని తీసుకొని, హ్యాకింగ్‌ను జతచేసి, క్రైమ్నూ, ఇన్వెస్టిగేషన్నూ కలిపితే? ఇలాæ చాలా లెక్కలు వేసుకొని కథ వండి, వడ్డిస్తే – అది ‘విశాల్ చక్ర’. కథేమిటంటే..: మిలటరీ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ అలియాస్ చంద్రు (విశాల్) కుటుంబం మూడు తరాలుగా దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం. అతని తండ్రి దివంగత మిలటరీ అధికారి. అశోక చక్ర పతకం పొందిన వీర జవాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే నగరంలో కాసేపట్లో 50 చోరీలు జరిగి, దాదాపు రూ. 7 కోట్ల విలువైన నగలు, డబ్బు పోతాయి. చంద్రు ఇంట్లో అతని నాయనమ్మ (కె.ఆర్. విజయ)ను కొట్టి, అశోక చక్ర పతకం కూడా దోచుకుపోతారు – ఇద్దరు ముసుగు దొంగలు. ఆ పతకాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించే హీరో ఢిల్లీలోని మిలిటరీ ఆఫీసు నుంచి ఎకాయెకిన హైదరాబాద్ వచ్చేస్తాడు. ఆ కేసును పోలీసాఫీసరైన హీరో ప్రేయసి (శ్రద్ధా శ్రీనాథ్) డీల్ చేస్తుంటుంది. ఆ ఇద్దరూ కలసి, ఆ డిజిటల్ హ్యాకింగ్, సైబర్ క్రైమ్ స్టోరీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ, ఆ నేరాలకు పాల్పడింది ఎవరు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? అన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: నటన కన్నా విశాల్ ఎప్పటిలానే యాక్షన్ సీన్ల మీద, హీరోయిజమ్ మీద ఆధారపడ్డారు. వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యర్థిగా రెజీనా కసండ్రా విలక్షణంగా కనిపించారు. కానీ, ఆ పాత్రకు కథలో కొంత బిల్డప్పూ ఎక్కువే ఇచ్చారు. పోలీసు అధికారిగా శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర కూడా అంతే. సీనియర్ నటి కె.ఆర్. విజయది చాలా చిన్న పాత్ర. ఎలా తీశారంటే..: డిజిటల్ క్రైమ్‌గా మొదలై, చివరకు ఆర్డినరీ విలన్ – హీరో ఎత్తులు పైయెత్తుల క్రైమ్ స్టోరీగా మారిపోతుందీ సినిమా. తొలి చిత్ర దర్శకుడైన ఎం.ఎస్. ఆనందన్ ఈ చిత్ర కథ, దానికి ప్రాతిపదిక బలంగా రాసుకున్నట్టు కనిపించదు. దానివల్ల సినిమా మొదట్లో కాసేపు – ఆ తరువాత ఛేజింగులు, హీరో విలన్ల మధ్య ఇంటెలిజెంట్ గేమ్ మరికాసేపు – ఆసక్తిగానే ఉన్నా, ఆ తరువాత రిపీట్ సీన్లు చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కు వస్తుంది. నిజానికి, ఫస్టాఫ్ కాస్తంత వేగంగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్ లో సినిమా వేగం తగ్గింది. కథ అక్కడక్కడే తిరుగుతుంది. విలన్ ఎందుకు ఈ దొంగతనాలు, దోపిడీలు చేయిస్తోందన్నదానికి సరైన ప్రాతిపదిక ఉన్నట్టు కనిపించదు. అలాగే, ఇంట్లోవాళ్ళ మీద కోపం సరే... సమాజం మీద విలన్ ఆగ్రహానికి లాజిక్ చూపలేదు. సవతి తమ్ముళ్ళను అలా మార్చడమూ అంతే. ఇక, విలన్ ఎత్తులు పైయెత్తులు వేస్తుందనడం కోసమో ఏమో కానీ – చదరంగం ఆటను బలవంతంగా తెర మీదకు తెచ్చారు. తమిళనాట నటుడు విశాల్‌కు ఉన్న రాజకీయ ఉద్దేశాల ప్రకటన కోసమో ఏమో, పొలిటికల్ పంచ్ డైలాగ్స్ కూడా విస్తతంగా సన్నివేశాల్లో ఇరికించారు. అంతా అయిపోయాక, గేమ్ జస్ట్ బిగిన్స్ అంటూ సీక్వెల్ వస్తుందనే భయమూ పెట్టారు. పోలీసు వ్యవస్థకూ, మిలటరీ అధికారి తెలివితెటలకూ ముడిపెడుతూ, హద్దులు చెరిపేసే కథగా ‘విశాల్ చక్ర’ గుర్తుండిపోతుంది. అధికారికంగా ప్రకటించకపోయినా, గతంలో బాగా ఆడిన విశాల్ ‘అభిమన్యుడు’ (తమిళంలో ‘ఇరుంబు తిరై’ – 2018)తో ఈ సినిమాకూ, కథకూ పోలికలు కనిపిస్తాయి. అయితే, ఆదరణలోనూ మళ్ళీ ఆ ఛాయలు కనపడతాయా అన్నది అనుమానమే! కొసమెరుపు: ఆగక సాగే ఛేజులు, ఛాలెంజ్‌లతో (బుర్ర) గిర్రున తిరిగే చక్రం! బలాలు: ♦గత హిట్టయిన ‘అభిమన్యుడు’ (2018) చిత్ర ఫార్ములా ఛాయలు ♦చకచకా సాగే ఫస్టాఫ్ ♦నేపథ్యగీతం మినహా పాటలు లేకపోవడం బలహీనతలు: ∙ ♦వీక్ అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ ♦సెకండాఫ్ ♦కథనంలో లోపాలు ♦కథకు అడ్డుపడే పొలిటికల్ పంచ్‌లు రివ్యూ: రెంటాల జయదేవ -
ప్రేమాభిషేకం: అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం
ప్రేమకథలు... అందులోనూ భగ్న ప్రేమకథలు... తెరపై ఎప్పుడూ హిట్ ఫార్ములా! ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం ‘ప్రేమాభిషేకం’. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1981 ఫిబ్రవరి 18న రిలీజైన సినిమా అది. కానీ ఇవాళ్టికీ ఆ పాటలు, మాటలు – ఇలా అన్నీ సినీ ప్రియులకు గుర్తే! ‘ప్రేమకు అర్థం– త్యాగ’మనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన ‘ప్రేమాభిషేకం’... అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం! అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్(1976 జనవరి 14) స్థాపించి, అప్పటికి నాలుగేళ్ళవుతోంది. స్టూడియో పేరుపై ఆయన ‘రామకృష్ణు్ణలు’ (జగపతి రాజేంద్రప్రసాద్‌తో కలసి –1978), ‘కళ్యాణి’ (’79), ‘పిల్ల జమీందార్’ (’80) తీశారు. అదే కాలంలో ఎ.ఎ. కంబైన్స్ బ్యానర్‌పై ‘మంచి మనసు’ (’78), ‘బుచ్చిబాబు’ (’80) నిర్మించారు. ఇవన్నీ స్టూడియో మొదలెట్టాక, అక్కినేని సమర్పించిన చిత్రాలే. కానీ, ఏవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్టనష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి. కాశ్మీర్లో పుట్టిన కథ! సరిగ్గా అప్పుడే... అక్కినేని వీరాభిమాని, అన్నపూర్ణా స్టూడియోస్‌కు ‘కళ్యాణి’, ‘బుచ్చిబాబు’ తీసిన పాపులర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన అభిమాన హీరోతో కాశ్మీర్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ చిత్రీకరిస్తున్నారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ (’78)తో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది 5వ సినిమా. ఓ రోజు కాశ్మీర్ డాల్ లేక్‌లో షూటింగ్ ముగించుకొని, పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ‘ప్రేమాభిషేకం’ కథాంశం మనసులో రూపుదిద్దుకుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో. కష్టపడి ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తాడు. తీరా ఆమె ఓకే అన్నాక, ఊహించని పరిస్థితులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం, సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే? ఈ కథాంశం చెప్పగానే అక్కినేని డబుల్ ఓకే. సొంత స్టూడియో బ్యానర్ మీదే తీద్దామన్నారు. అలా అక్కినేని సొంత చిత్రంగా, కుమారులు వెంకట్, నాగార్జున నిర్మాతలుగా ‘ప్రేమాభిషేకం’ పట్టాలెక్కింది. ఆగిన షూటింగ్! అన్నపూర్ణ మధ్యవర్తిత్వం!! మొదటి నుంచి ఈ కథపై దాసరికి గట్టి నమ్మకం. తీరా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కినేనికి ఓ డౌట్ వచ్చింది. పెళ్ళిచూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని, పెళ్ళికి ఓకే చెప్పి వస్తాడు హీరో. తీరా తరువాత కవిత పూలబొకేతో ఎదురైతే, ‘నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను చూసి ఓకే చెప్పలేదు’ అంటాడు. ముందు ఓకే అన్నా, ఆ సీన్ తీస్తున్నప్పుడు తన లేడీస్ ఫాలోయింగ్ ఇమేజ్‌కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని అనుమానించారు. ఆ సీను మార్చాల్సిందే అన్నారు. దాసరితో వాదించారు. కానీ, కథానుసారం ఇంటర్వెల్ వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీనుకు ఈ సీనే లింకు అంటూ దాసరి పట్టుబట్టారు. వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్ ఆగింది. అక్కినేని, దాసరి – ఇద్దరూ భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ కలగజేసుకొని, మధ్యవర్తిత్వం వహించారు. చివరకు దాసరి ‘‘ఆ సీనులో సారం చెడిపోకుండా, ఒకటి రెండు సవరణలు చేసి, అక్కినేనిని ఒప్పించా’’రు. అద్భుతంగా తీసి, మెప్పించారు. ఆ దేవదాసు పాత్రలే... మళ్ళీ! గమనిస్తే ఒకప్పటి దేవదాసు, పార్వతి, చంద్రముఖులే ఈ ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని, శ్రీదేవి, జయసుధలు వేసిన పాత్రలు. పార్వతి ప్రేమ కన్నా చంద్రముఖి ప్రేమ గొప్పదనే చర్చ ఈ చిత్రంలోని శ్రీదేవి, జయసుధల పాత్ర ద్వారా చెలరేగింది. సూపర్ హిట్స్ ‘దేవదాసు’, ‘ప్రేమ్‌నగర్’ కథలను కలగలిపి, కొత్తగా వండి వడ్డించారు దాసరి. అయితే, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వంలో దాసరి బహుముఖ ప్రజ్ఞ ఓ సంచలనం. ఆ పాటలకు వందనం... అభివందనం! చక్రవర్తి సంగీతంలో ‘దేవీ మౌనమా’, ‘కోటప్పకొండకు’, ‘తారలు దిగివచ్చిన’, ‘నా కళ్ళు చెబుతున్నాయి’, ‘ఒక దేవుడి గుడిలో’, ‘వందనం’, ‘ఆగదూ’– ఇలా దాసరి రాసిన అన్ని పాటలూ ఆల్‌టైమ్ హిట్. ఎస్పీబీకి సింగర్‌గా నంది అవార్డూ వచ్చింది. నిజానికి, ‘వందనం...’ పాట స్థానంలో దాసరి మొదట ‘జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో’ అనే పాట రాశారు. పాట ఇంకా బాగుండాలన్నారు అక్కినేని. అప్పుడు చేసిన కొత్త పాట ‘వందనం’ అయితే, ఆడియోలో మాత్రం ‘జీవితాన్ని చూడు’ పాట కూడా రిలీజ్ చేశారు. సినిమాలో లేకపోయినా, ఆ పాటా ఆ రోజుల్లో తెగ వినపడింది. 57వ ఏట ‘ప్రేమాభిషేకం’తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. ‘‘ఈ క్రెడిట్ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్ కంట్రిబ్యూషన్’’ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు. మరపురాని డైలాగ్ డ్రామా! నిజం చెప్పాలంటే – సీన్ల రూపకల్పనలో, డైలాగ్ డ్రామాలో దాసరి ప్రతిభకు ‘ప్రేమాభిషేకం’ ఓ మచ్చుతునక. ‘‘ఈ లోకంలో అందరికీ తెలుసు’’ అంటూ హీరోయిన్‌కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్, శ్రీదేవి– జయసుధ– అక్కినేనివ మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. ఆ డైలాగుల్ని జనం అందరూ తెగ చెప్పుకున్నారు. హీరో మరణించినా, మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ, రిపీట్ ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. పాత్ర చిన్నదే... ఆమె అభినయం పెద్దది! మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే టాప్ హీరోయినైన జయసుధ అయితేనో అన్నారు దాసరి. కానీ ‘కేవలం 2పాటలు, 6 సీన్లే ఉన్న పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అన్నది అక్కినేని అనుమానం. ఇంతలో ‘ప్రేమాభిషేకం’లో ఓ చిన్నపాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా వెళ్ళింది. ‘ఆ పాత్ర నేనే చేయాలని దాసరి అనుకుంటే, అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా’ అని జయసుధ యథాలాపంగా అనేశారు. తీరా అది వేశ్య పాత్రే! ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్! అప్పట్లో ‘అక్కినేని – బాలు – చక్రవర్తి – దాసరి అండ్ జయసుధ’ల కాంబినేషన్ వరుస హిట్లు అందించింది. విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవంలో వీళ్ళను ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్ అని జర్నలిస్టులు ప్రస్తావించారు. చాలాకాలం ఫ్యాన్స్‌లో, ట్రేడ్‌లో ఆ పదం పాపులరైంది. బాక్సాఫీస్ చరిత్రలో... సువర్ణాధ్యాయం ‘ప్రేమాభిషేకం’ తెలుగు సినీ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజుకు ముందు మంచి రేటొచ్చినా, దాసరి సలహా మేరకు హక్కులు అమ్మలేదు అక్కినేని. నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంత అన్నపూర్ణా ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన చిత్రం (గూడూరులో 32 రోజులకు తీసేయగా, 28 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రంలో షిఫ్టుతో, మరో కేంద్రంలో నూన్‌షోలతో) మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం చేసుకుంది. అలాగే, 24 కేంద్రాల్లో డైరెక్టుగా, 2 కేంద్రాల్లో షిప్టుతో, 4 కేంద్రాలు సికింద్రాబాద్, ఖమ్మం, గుడివాడ, ఆదోనిల్లో నూన్‌షోలతో మొత్తం 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్టుతో, 10 కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ (25 వారాలు) ఆడింది. తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయా టాకీస్‌లో నేరుగా 365 రోజులు ప్రదర్శితమై, ‘ప్రేమాభిషేకం’ కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ హాలులో 380 రోజుల ప్రదర్శన చేసుకుంది. గుంటూరు కాక, మరో 3 కేంద్రాల్లో షిఫ్టులతో, 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తం 8 కేంద్రాల్లో ఈ విషాద ప్రేమకథ గోల్డెన్ జూబ్లీ (50 వారాలు) ఆడింది. అటు పైన 5 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ (60 వీక్స్) నడిచింది. తర్వాత విజయవాడ, హైదరాబాద్‌లలో షిఫ్టులు, నూన్‌షోలతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్లాటినమ్ జూబ్లీ (75 వీక్స్) ఆడిన తొలిచిత్రం’గా రికార్డు సృష్టించింది. అక్కడ ‘మరో చరిత్ర’... ఇక్కడ ‘ప్రేమాభిషేకం’ నిజానికి, ‘ప్రేమాభిషేకం’ కన్నా ముందే 1978లో కమలహాసన్ – కె. బాలచందర్‌ల నేరు తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ తమిళనాట మద్రాసులో ప్లాటినమ్ జూబ్లీ చేసుకొంది. అక్కడి సఫైర్ థియేటర్లో నూన్‌షోలతో ఏకధాటిగా 596 రోజులు ఆడి, ‘ప్లాటినమ్ జూబ్లీ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం’గా నిలిచింది. అలా మద్రాసులో ‘మరో చరిత్ర’, మన తెలుగునాట ‘ప్రేమాభిషేకం’ తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీ చిత్రాలయ్యాయి. కానీ, విచిత్రంగా ఇక్కడి పబ్లిసిటీలో మాత్రం ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని ‘తెలుగులోనే తొలి ప్లాటినమ్ జూబ్లీ చిత్రం’గా ప్రకటించుకున్నారు. ఇంకా గమ్మత్తేమిటంటే, దీని తరువాత ప్లాటినమ్ జూబ్లీ (525 రోజులు) రికార్డు దగ్గర దాకా వచ్చిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ (1982లో– హైదరాబాద్‌లో 517 రోజులకు), ‘సాగర సంగమం’ (1983లో– బెంగుళూరులో 511 రోజులకు) ఎందుకో అర్ధంతరంగా హాళ్ళ నుంచి అదృశ్యమయ్యాయి. దాని వెనుక ‘ప్రేమాభిషేకం’ పెద్దల మంత్రాంగం ఉందని అప్పట్లో ట్రేడ్ వర్గాల టాక్. చివరకు 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ (హైద్రాబాద్‌లో–565 రోజులు) ఆడి ప్లాటినమ్ జూబ్లీ చిత్రాల లిస్టుకెక్కింది. రన్‌లోనూ... కలెక్షన్లలోనూ... కోస్తా ఆంధ్రలో కొత్త రికార్డ్! ఏది ఏమైనా, ‘ప్రేమాభిషేకం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్ర అయింది. లేట్ రన్‌లోనూ మరో 50 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. మరో 11 కేంద్రాలలో (డైరెక్టుగా – మదనపల్లి, తుని, చిలకలూరిపేట, బెంగుళూరు, మద్రాసుల్లో, నూన్‌షోలతో – శ్రీకాళహస్తి (తొలి శతదినోత్సవం), నంద్యాల, హిందూపురం, నరసరావుపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో) వంద రోజులాడింది. లేట్ రిలీజులోనే బెంగుళూరులో నూన్ షోలతో 365 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మొత్తం 41 శతదినోత్సవ కేంద్రాలకు గాను 14 కేంద్రాల్లో అక్కినేని చిత్రాలలో ఏకైక శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ‘భార్యాభర్తలు’ (1961) తరువాత మళ్ళీ రెండు దశాబ్దాలకు బెంగుళూరులో అక్కినేనికి ఓ శతదినోత్సవాన్ని అందించింది. ఆ రోజుల్లో ‘ప్రేమాభిషేకం’ కోస్తా ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలలో అటు ఆడిన రోజుల్లోనూ, ఇటు వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. అలా విజయవాడ, గుడివాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏలూరు, తణుకు, తుని, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర కేంద్రాల్లో రన్‌లోనూ, కలెక్షన్లలోనూ అప్పటికి ‘ప్రేమాభిషేకం’దే సరికొత్త రికార్డ్. అలా తన అభిమాన హీరో అక్కినేనికి దాసరి ఇచ్చిన అపురూప కానుక ఇది. ఊరూవాడా... ఎన్నెన్నో విజయోత్సవాలు ఇన్ని విజయాలు సాధించిన ‘ప్రేమాభిషేకం’కి ఉత్సవాలు చాలా జరిగాయి. విజయవాడలో శతదినోత్సవం, హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో సిల్వర్‌జూబ్లీ, నెల్లూరులో త్రిశతదినోత్సవం, ఆ తరువాత మద్రాసులో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఇక, ఊరూవాడా ఫ్యాన్స్ చేసిన వేడుకలకైతే అంతే లేదు. అలా అక్కినేని కెరీర్‌కు కిరీటమైందీ చిత్రం. ఫస్ట్ రిలీజైన నాలుగున్నరేళ్ళ తరువాత 1985 సెప్టెంబర్ 20న అక్కినేని బర్త్‌డేకి భారీ పబ్లిసిటీతో, రాష్ట్రమంతటా ‘ప్రేమాభిషేకా’న్ని సెకండ్ రిలీజ్ చేశారు. అయితే, రిపీట్ రన్లలో అక్కినేని చిత్రాలలో ఎప్పుడూ ముందుండే ‘ప్రేమ్‌నగర్’ లాగా ‘ప్రేమాభిషేకం’ ఆశించిన ఆదరణ పొందలేదు. కానీ అదే ‘ప్రేమాభిషేకం’ మరో పదేళ్ళకు 1995లో ఏ హడావిడీ, అంచనాలూ లేకుండా తెలుగునాట అంచెలంచెలుగా రీ–రిలీజైనప్పుడు మంచి వసూళ్ళు తేవడం విశేషం. అందుకే, ‘ప్రేమాభిషేకం’ జనంలోనూ, బాక్సాఫీస్ జయంలోనూ అసలైన ప్రేమకు జరిగిన అపురూప పట్టాభిషేకం. వరుసగా మూడేళ్ళూ... ఆమెకే అవార్డ్! నిడివి చిన్నదైనా, ‘ప్రేమాభిషేకం’లో వేశ్యగా జయసుధదే కీలకపాత్ర అయింది. అందులోనూ గ్లామర్ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డూ జయసుధకే దక్కింది. ‘ప్రేమాభిషేకం’తో మొదలుపెట్టి వరుసగా మూడేళ్ళు (‘ప్రేమాభిషేకం–1981, మేఘసందేశం–1982, ధర్మాత్ముడు–1983’) ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకొని, జయసుధ హ్యాట్రిక్ సాధించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ (ఉత్తమ చిత్రాలు ‘చెల్లెలి కాపురం–1971, కాలం మారింది – 1972, శారద–1973’) తర్వాత అలాంటి హ్యాట్రిక్ మళ్ళీ జయసుధకే సాధ్యమైంది. అక్కినేని, జయసుధ చిత్రం... భళారే విచిత్రం! గమ్మత్తేమిటంటే, 1980లో అక్కినేని పుట్టినరోజైన సెప్టెంబర్ 20న ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్, చెన్నైలలో 32 షూటింగ్ డేస్‌లో పూర్తయింది. 1981లో సరిగ్గా అక్కినేని పెళ్ళిరోజైన ఫిబ్రవరి 18న రిలీజైంది. గమ్మత్తుగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజున ఎన్టీఆర్, ఏయన్నార్ల కాంబినేషన్లో ఆఖరి చిత్రం ‘సత్యం – శివం’ రిలీజైంది. ఆ భాషల్లో మాత్రం వట్టి రీ ‘మేకు’! గమ్మత్తేమిటంటే, తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్ అయినప్పుడు ఆశించినంత ఆడలేదు. తమిళంలో ఈ కథను ‘వాళ్వే మాయమ్’ (1982)గా కమలహాసన్‌తో రీమేక్ చేశారు. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలో ‘ప్రేమాభిషేకం’ పేరుతోనే డబ్ కూడా చేసి, రిలీజ్ చేశారు. ఇక హిందీలో సాక్షాత్తూ దాసరి దర్శకత్వంలోనే జితేంద్ర, రీనారాయ్, రేఖ నటించగా ‘ప్రేమ్ తపస్యా’ (1983) పేరుతో అక్కినేనే నిర్మించారు. కానీ, అవేవీ ఆదరణకు నోచుకోలేదు. కమలహాసనైతే అక్కినేనిలా తాను చేయలేకపోయానని బాహాటంగా చెప్పేశారు. కోటి అంటే... కోటిన్నర! ప్రేయసి బాగు కోసం తన ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ హీరో కథకు జనం బ్రహ్మరథం పట్టారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడే ‘నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా. ఇది బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది’ అని నాతో దాసరి అన్నారు. దాసరి అన్నమాట నిలబెట్టడమే కాక, అంతకు మించి ‘ప్రేమాభిషేకం’ కోటీ 30 లక్షలు వసూలు చేసింది’’ అని మద్రాసులో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. అటుపైనా ఆ సినిమా అప్రతిహతంగా ఆడి, ఏకంగా 75 వారాల ప్లాటినమ్ జూబ్లీ చేసుకుంది. చివరకు కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్లో తొలి రూ. కోటి వసూలు చిత్రం ఇదే! ఆయన కెరీర్లో రెండో గోల్డెన్ జూబ్లీ చిత్రం (మొదటిది ‘దసరా బుల్లోడు’) కూడా ఇదే!! ఇంతటి బాక్సాఫీస్ విజయంతో, ‘ప్రేమాభిషేకం’ అప్పట్లో అన్నపూర్ణా స్టూడియోస్‌ను బాలారిష్టాల నుంచి బయటపడేసింది. - రెంటాల జయదేవ -
ఎఫ్.సి.యు.కె మూవీ రివ్యూ
చిత్రం: ‘ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్ (ఎఫ్.సి.యు.కె)’ తారాగణం: జగపతిబాబు, అమ్ము అభిరామి, రామ్ కార్తీక్, బేబీ సహస్రిత, కల్యాణీ నటరాజన్, భరత్, బ్రహ్మాజీ మాటలు: కరుణాకర్ అడిగర్ల – బాలాదిత్య పాటలు: బాలాదిత్య సంగీతం: భీమ్స్ సెసిరోలియో ఫైట్స్: స్టంట్స్ జాషువా కెమెరా: జి. శివకుమార్ ఎడిటింగ్: కిశోర్ మద్దాలి నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్; కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం: విద్యాసాగర్ రాజు నిడివి: 169 నిమి షాలు రిలీజ్: ఫిబ్రవరి 12 ఒకే సినిమాలో ఎన్నో కథలు చెప్పాలనుకుంటే ఏమవుతుంది? అసలు ఎత్తుకున్న కథ కన్నా మిగతా చుట్టూ అనేక అంశాలు అల్లుకుంటూ పోతే ఏమవుతుంది? కానీ, కుటుంబ కథ చుట్టూరానే తిరగాల్సిన కథను ఎడల్ట్ కామెడీ వ్యవహారంగా మారిస్తే ఏమవుతుంది? డబ్బులు ఎదురిచ్చి ఓ రెండుమ్ముప్పావు గంటలు ఈ పాఠాలన్నీ తెలుసుకోవాలంటే– తాజా రిలీజ్ ‘ఎఫ్.సి. యు.కె’ (ఫాదర్–చిట్టి – ఉమ– కార్తీక్) చూడాలి. కథేమిటంటే..: లేటు వయసులో ఓ పిల్లకు తండ్రి అయిన వ్యక్తి, దాని వల్ల అతని కొడుకుకు వచ్చిన ఇబ్బందులు ఈ చిత్ర ప్రధాన కథ. ఫణి భూపాల్ (జగపతిబాబు) రెండు రాష్ట్రాల్లో ఒక కండోమ్ కంపెనీకి డీలర్. 60 ఏళ్ళ వయసొచ్చినా, అమ్మాయిలతో సరదాలు మానని మనిషి. అతని కొడుకు – తల్లి లేకుండా పెరిగినవాడు కార్తీక్ (రామ్ కార్తీక్). అనుకోకుండా ఓ పిల్లల డాక్టర్ ఉమ (అమ్ము అభిరామి) పరిచయమవుతుంది. ఆమెకూ, అతనికీ స్నేహం పెరిగే లోపలే బంధుత్వాల మీద రిసెర్చ్ చేసే ఓ కుర్రాడు (భరత్)తో ఆమెకు పెళ్ళి కుదురుతుంది. ఉమకూ, కార్తీక్‌కూ మధ్య స్నేహం, పొరపొచ్చాలు సాగుతుండగానే, అరవై ఏళ్ళ తండ్రి తనకు పుట్టిన పసిపాప చిట్టి (బేబీ సహస్రిత)ను తీసుకువస్తాడు. ఎవరా పాప? ఏమిటా కథ? కార్తీక్‌కూ, ఉమకూ మధ్య స్నేహం ఏమైంది అన్నది మిగతా కథ. ఎలా చేశారంటే..: అమ్మాయిలను చటుక్కున పడేసే కళ ఉన్న తండ్రి ఫణి భూపాల్‌గా జగపతిబాబు నటించారు. నిజజీవితంలోనూ 60వ పడిలోకి వస్తున్న ఆయన ఇలాంటి రిస్కీ పాత్ర చేయడం విశేషమే. కానీ, ఆ పాత్రలో జనం ఆయనను ఎంతవరకు అంగీకరిస్తారో చెప్పడం కష్టం. ఫ్లర్ట్ మాస్టర్ అయిన కొడుకు పాత్రలో రామ్ కార్తీక్ కామెడీ, ఫైట్లు, రొమాన్స్– ఇలా అన్నీ చేయడానికి శతవిధాల ప్రయత్నించారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన తమిళమ్మాయి అమ్ము అభిరామి ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’లో స్కూల్ అమ్మాయిగా కనిపించారు. తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ (తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ అవుతోంది)లో హీరో ధనుష్ సరసన నటించి, అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇరవై ఏళ్ళ అభిరామి ఇందులో పిల్లల డాక్టర్ ఉమ పాత్రను పండించడానికి ప్రయత్నించారు. కానీ, ఆ పాత్రను రాసుకున్న విధానంలోనే ఉన్న తప్పులకు ఆమె బాధ్యురాలు అయింది. ఆ పాత్ర స్నేహం కోరుతోందా, ప్రేమ కోరుతోందా, వాటన్నిటికీ మించి సమాజంలో స్త్రీని చూడాల్సిన విధానంపై పోరు చేస్తోందా అన్నది ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. దగ్గుబాటి రాజా, జయలలిత, శ్రీలక్ష్మి, మెల్కోటే లాంటి పాత తరం నటీనటుల మొదలు ఈ తరం భరత్ దాకా సినిమాలో చటుక్కున చెప్పలేనంత చాలామందే ఉన్నారు. నిడివి, లేని ఆ పాత్రల నుంచి అద్భుతాలు ఆశించలేం. ఎలా తీశారంటే..: ‘‘ఆకలేస్తే అన్నం పెడతాం. అవసరమైతే సాయం చేస్తాం. ఆడాళ్ళడిగితే కాదంటామా... ఇచ్చేస్తాం’’ అనే తండ్రి, ‘‘తల్లిని తెస్తా... తల్లిని తెస్తా.. అని చెల్లిని తెచ్చావేంటి’’ అని ప్రశ్నించే కొడుకు, ‘‘బండి ఇంకా కండిషన్ లోనే ఉంది అంకుల్...’’ అనే చుట్టుపక్కలి ఫ్రెండ్సు – ఇలా ఉంటుందీ సినిమా. 1970లలో మొదలైన శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై తండ్రి కీ.శే. కానూరి రంజిత్ కుమార్ బాటలో ఇప్పటికే చాలా సినిమాలు తీశారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. గతంలో ‘అలా మొదలైంది’, ‘అంతకు ముందు – ఆ తరువాత’ లాంటి ఫ్యామిలీ కథాంశాలతో ఆకట్టుకున్న ట్రాక్ రికార్డ్ ఆయనది. కానీ, ఈసారి ఎడల్ట్ కామెడీ చిత్రంతో ఇలాంటి సాహసం చేయడం విచిత్రం. మూడేళ్ళ క్రితం ‘రచయిత’ (2018) చిత్రం రూపొందించిన దర్శకుడు విద్యాసాగర్ రాజుకు ఇది రెండో సినిమా. కానీ, ఆయన కథ రాసుకోవడం మీద ఎంత శ్రద్ధ పెట్టారన్నది ప్రశ్న. తీసిన సినిమా కన్నా ముందు... రాసుకున్న స్క్రిప్టుకు ఎడిటింగ్ అవసరమనే విషయం మర్చిపోయినట్టున్నారు. కన్యాత్వ పరీక్ష, కండోమ్ లకు ఎందుకు యాడ్స్ వేయాలి, పెట్రోల్ ఎలా ఆదా చేయాలి, వయసు పైబడినంత మాత్రాన కోరికలు పోతాయా – ఇలాంటి చాలా విషయాల మీద ఈ చిన్న సినిమాలో చర్చలూ పెట్టారు. పాత్రలు మాటిమాటికీ వాష్ రూమ్‌కు వెళతామని సైగ చేసే ఈ చిత్రంలో అపానవాయువు, పసిపాపల డైపర్ క్లీనింగ్ లాంటి వాటినీ కామెడీ అనుకొని వాడినట్టున్నారు. ‘‘నా జీవితంలో ఏ ప్రాబ్లమ్ లేకపోవడానికి కారణం మా నాన్న’’ అనే కొడుకు, తీరా తన ‘‘జీవితంలో నాకు సమస్యే నువ్వు’’ అని తండ్రిని ప్రశ్నించే స్థాయికి ఎందుకు వచ్చాడన్నది అసలు కథ. ఆ ఎమోషనల్ యాంగిల్ చుట్టూ కథను మరో రకంగా రాసుకొని ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది. గమ్మత్తేమిటంటే, కథ కూడా తానే రాసుకున్న దర్శకుడు అనుకున్నప్పుడు అనుకున్నట్టల్లా పాత్రల ప్రవర్తన మారిపోతుంటుంది. బలమైన కార్యకారణ సంబంధం కనిపించేది తక్కువ. అనేక మలుపులు తిరుగుతూ సా...గిపోయే కథలో అడపాదడపా బోలెడంత క్రియేటివిటీ పొంగి పొరలుతుంది. సినిమా మధ్యలో సరిగ్గా ఇంటర్వెల్ ముందు పాత్రలతో మన జాతీయ గీతం ‘జనగణమన...’ పాడించడం అందులో హైలైట్. భీమ్స్ సెసిరోలియో సంగీతం, జె.బి. నేపథ్య సంగీతం అందించారు. ‘నేనేం చెయ్య...’ పాట కాస్తంత బాగున్నా, హాలు దాటాక ఎన్ని గుర్తుంటాయో చెప్పలేం. నటుడు బాలాదిత్య ఈ సినిమాకు 4 పాటలు, కరుణాకర్ అడిగర్లతో కలసి మాటలు సమకూర్చడం మరో విశేషం. దురర్థం ధ్వనించేలా సినిమాకు ఇలా ‘ఎఫ్.సి.యు.కె’ అని పేరు ఎందుకు పెట్టారంటే – కేవలం జనం దృష్టిని ఆకర్షించడం కోసమేనని దర్శక, నిర్మాతలు ఆ మధ్య వివరణ ఇచ్చారు. కానీ, ఆ టైటిల్ ఇప్పుడీ సినిమాకు ఏ మేరకు ప్లస్ అవుతుందన్నది చెప్పలేం. ఈ చిత్రం ఓ ఫన్ వ్యాక్సిన్ అని చిత్రయూనిట్ మాట. వెరసి, వ్యాక్సిన్ వేసుకుంటే, కాస్తంత సైడ్ ఎఫెక్ట్లకూ సిద్ధపడాల్సిందే! కొసమెరుపు: మరీ ఇన్ని మలుపులతో... ఇంతసేపా... చిట్టీ! బలాలు ♦ బేసిక్ స్టోరీ లైన్ ∙జగపతిబాబు లాంటి పాపులర్ ఫేస్‌లు ♦ అక్కడక్కడి మెరుపులు బలహీనతలు ♦ బోలెడన్ని మలుపులు, సాగదీత కథనం ♦ హీరో హీరోయిన్లు అపరిచితులు కావడం ♦ ఎడల్ట్ కంటెంట్, ముతక కామెడీ ♦ దర్శకత్వం, ఎడిటింగ్ లోపాలు రివ్యూ: రెంటాల జయదేవ -
పరిశ్రమ ఇకనైనా కళ్లు తెరవాలి!
‘తెలుగు సినిమాతల్లి బర్త్‌డే’ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెచ్.ఎం.రెడ్డి తీసిన మన తొలి పూర్తితెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ బొంబాయి కృష్ణా థియేటర్లో 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని ప్రముఖ జర్నలిస్ట్ – పరిశోధకుడు రెంటాల జయదేవ నిరూపించారు. అప్పటి నుంచి ‘కళా మంజూష’ ఏటా ఫిబ్రవరి 6న ‘తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు’ జరుపుతోంది. ఈసారి ‘తెలుగు సినిమా వేదిక’, ‘నేస్తం ఫౌండేషన్’ తోడయ్యాయి. ‘‘స్వచ్ఛంద సంస్థలు కాకుండా, సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే పెద్దలు, ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటివి ఇకనైనా కళ్ళు తెరిచి, ఇక ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు జరపాలి’’ అని సభలో పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ‘‘అరుదైన పాత సినిమాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించి, సినీచరిత్ర నూ, సమాచారాన్నీ భద్రపరిచే పనిని రాష్ట్ర ఆర్కైవ్స్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికైనా చేయించాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్‌ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు ఎన్. శంకర్, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, ఏ.ఎం.రత్నం, విజయ్‌కుమార్ వర్మ, నటి కవిత, కెమెరామ్యాన్ ఎం.వి. రఘు అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు బాబ్జీ, రామ్ రావిపల్లి, నిర్మాతలు గురురాజ్, విజయ వర్మ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ గౌడ్, ఫిల్మ్ స్కూల్ ఉదయ్ కిరణ్, జర్నలిస్ట్ రెంటాల జయదేవ మాట్లాడారు. దివంగత నిర్మాత వి.దొరస్వామిరాజు పేరిట సీనియర్ నిర్మాతలు ఎన్.ఆర్. అనురాధాదేవి, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణరాజు, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలకు పురస్కారాలు అందించారు. జయదేవ, పరుచూరి, వెంకట్, కవిత, తుమ్మలపల్లి, తమ్మారెడ్డి, ఎన్. శంకర్, గురురాజ్, బాబ్జీ, రామ్ రావిపల్లి -
తెలుగు సినిమాకు 89 వసంతాలు
వెండితెర పూర్తి స్థాయిలో తెలుగు మాటలు నేర్చుకొని, ఈ రోజుతో 89 వసంతాలు నిండాయి. మూగ సినిమాలైన ‘మూకీ’లకు మాటొచ్చి, పూర్తి తెలుగు ‘టాకీ’లుగా మారింది సరిగ్గా 89 ఏళ్ళ క్రితం ఇదే రోజున! మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932లో ఫిబ్రవరి 6న థియేటర్లో తొలిసారిగా రిలీజైంది. అలా ఆ నాటి నుంచి పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు ప్రేక్షకులను వెండితెరపై పలకరించడం ప్రారంభమైంది. ఆ లెక్కన మన తెలుగు సినిమాకు ఇవాళ హ్యాపీ బర్త్ డే! మన తెలుగు సినిమా పరిశ్రమ 89 ఏళ్ళు నిండి, 90వ ఏట ప్రవేశిస్తున్నందున సినిమాను ప్రేమించేవారికీ, సినిమా రంగం మీద ఆధారపడినవారికీ ఇదో మెమరబుల్ డే!! దేశంలో ఇవాళ ప్రధాన సినీ పరిశ్రమలలో ఒకటిగా ఉన్నత స్థానానికి చేరుకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేసిన తొలి అడుగు అది. అయితే, తెలుగు సినిమా పెద్దలు, ప్రభుత్వాలు మాత్రం మన సంపూర్ణ తెలుగు టాకీ పుట్టినరోజును మర్చిపోయినట్లుంది. పరిశ్రమకు పండుగగా జరుపుకొనే ఈ సందర్భాన్ని విస్మరించి, నిర్లక్ష్యం చూపుతున్నట్టున్నాయి. మన తెలుగు టాకీ అలా తయారైంది! తొలి దక్షిణ భారతీయ టాకీ ‘కాళిదాస్’ రిలీజై, సక్సెసయ్యాక పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తొలి భారతీయ టాకీ, తొలి దక్షిణాది టాకీలతో అనుభవం గడించిన హెచ్.ఎం. రెడ్డికే దర్శకత్వ బాధ్యత ఇచ్చారు. అప్పుడు పూర్తి తెలుగు మాటలు, పాటల ‘భక్త ప్రహ్లాద’ తయారైంది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, ఫస్ట్ రిలీజ్ కూడా బొంబాయిలోనే జరగడం గమనార్హం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ప్రసిద్ధ ’ప్రహ్లాద’ నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె వి. సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రధారులు. ఇందులో టైటిల్ రోల్ చేసిన మాస్టర్ కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. ఇక, ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’ చిత్రాలలో కూడా పనిచేసిన తరువాతి కాలపు ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఎల్వీప్రసాద్ ‘భక్త ప్రహ్లాద’లో మొద్దబ్బాయిగా నటించారు. ఈ సినిమాకు చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. అలా ఆయన తొలి తెలుగు సినీ కవి అయ్యారు. పరిశోధనలో బయటపడ్డ మన సినిమా పుట్టినరోజు! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లద’ – ఏకంగా ‘కాళిదాస్’ కన్నా ముందే – 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొన్నేళ్ళ పాటు ఆధారాలు లేని వినికిడి ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళు శ్రమించి, సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. 100% సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం మొదలై, నేటితో 89ఏళ్ళు పూర్తయ్యాయి. మన మాటలు రికార్డ్ చేసింది హాలీవుడ్ వాడే! పెట్టుబడి, సాంకేతిక సౌకర్యాలు, ఖర్చు – అన్నీ అతి తక్కువగా ఉన్న రోజులవి. ‘ఆలమ్ ఆరా’ కోసం ఆ రోజుల్లోనే హాలీవుడ్ నుంచి విల్ఫోర్డ్ డెమింగ్ అనే అమెరికన్ సౌండ్ ఇంజనీర్‌ను ఇండియాకు రప్పించారు దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. సౌండ్ ప్రూఫ్ స్టేజీలు లేని ఆ రోజుల్లో కేవలం స్టూడియోల్లో, అదీ బయటి శబ్దాలు ఉండని రాత్రి పూట షూటింగ్ చేశారు. అప్పట్లో పిక్చర్కీ, సౌండ్‌కీ వేర్వేరు నెగటివ్‌లు కూడా ఉండేవి కావు. కేవలం సింగిల్ సిస్టమ్‌లో ‘తానార్ రికార్డింగ్ ఎక్విప్మెంట్’తో మాటలు రికార్డు చేసేవారు. చివరకు షూటింగ్ స్పాట్లోనే ఏకకాలంలో యాక్టింగ్‌తో పాటు, మాటలు చెబుతూ, పాటలు పాడుతుంటే రికార్డింగ్ చేసేయాల్సిందే! అప్పట్లో చివరకు ఇవాళ్టిలా మాటలు రికార్డు చేసే బూమ్ లు కూడా ఉండేవి కావు. కెమేరా కంట్లో పడకుండా మైకులు రకరకాల చోట్ల దాచిపెట్టి, ఈ తొలి టాకీల్లో డైలాగ్స్, సాంగ్స్ రికార్డ్ చేసేవారు. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన జనానికి... తెర మీద బొమ్మలు మాట్లాడడం, పాటలు పాడడం ఓ వింత. అదీ మన సొంత తెలుగు భాషలోనే పూర్తిగా మాట్లాడడం మరీ విడ్డూరం. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ దేశమంతటా, మరీ ముఖ్యంగా మన తెలుగునాట విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కానీ, మన తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలూ చాలానే ఉన్నాయి. ఈ తొమ్మిది దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా చాలానే పురోగమించింది. బాక్సాఫీస్ వేటలో పేటలు దాటి, దేశాల కోటలు దాటి ముందుకు ఉరికింది. అప్పటి ‘భక్త ప్రహ్లాద’ రోజుల నుంచి ఇప్పటి ‘బాహుబలి’ కాలం దాకా మన తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో తయారై, ఆ మాత్రం ఖర్చు వస్తేనే మహాద్భుతం అనుకొనే పరిస్థితి నుంచి ఇవాళ అనేక పదుల కోట్ల రూపాయల బడ్జెట్, వందల కోట్లల్లో వ్యాపారం, వసూళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చూసే కోట్లమంది జనంతో తెలుగు సినిమా అంకెల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల దగ్గర తడబడుతోంది. ఈ ప్రశ్నకు బదులేది? ఓ తెలుగు సినీ కవి అన్నట్టుగా... ‘పుట్టినరోజు పండగే అందరికీ! మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ మన సినిమా చరిత్రను భద్రపరిచే విషయంలో పరిశ్రమ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్లు, ప్రభు త్వాలు చేస్తున్నది చాలా తక్కువే. మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు మన తొలి తెలుగు సినిమా ప్రింటే లేకుండా పోయింది. టాకీలకే దిక్కు లేదు... ఇక మూకీల చరిత్ర మాట చెప్పనే అక్కర్లేదు. మన తొలి తెలుగు సినిమాల్లో మిగిలిన కొన్నింటి ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల ఉన్నాయి. కానీ, మిగిలిన ఆ కొద్ది 1930 – 40ల నాటి తెలుగు చిత్రాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించడానికి సినీపెద్దలు, ప్రభుత్వాలు చేçపడు తున్న చర్యలు శూన్యం. చరిత్రపై తమిళ, మల యాళ, బెంగాలీ చిత్రసీమలకున్న శ్రద్ధ మనకేది? మరోపక్క కొత్త కథాంశాలతో సినిమా తీయడానికి మలయాళ, తమిళ చిత్రసీమలలా మనమెందుకు ముందుకు రాలేకపోతున్నాం? ఒకప్పుడు థియేటర్ల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో ఉన్న మనం ఇప్పుడు తెలుగు రాష్టాలు రెండూ కలిపినా 1600 హాళ్ళు కూడా లేని పరిస్థితిలో పడ్డామెందుకు? భారీ రెమ్యూనరేషన్లు, భారీ బడ్జెట్ల విషవలయంలో పడి ప్రేక్షకుడి నడ్డి విరిచేలా పన్ను పెంచుదాం, టికెట్ రేట్లు పెంచుదాం లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నాం? ఇలా పరిశ్రమ వేసుకోవాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా, ఒకప్పుడు వీధి దీపాల మధ్య టెంట్లో టూరింగ్ టాకీసుల్లో నడిచిన సినిమా ఇవాళ ఏసీ హాళ్ళు, మల్టీప్లెక్సుల మీదుగా ఓటీటీ దాకా వచ్చేసింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుడు టీవీలు, కంప్యూటర్ల మీదుగా ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ఫోన్లలో ఓటీటీలో వినోదాన్ని వెతుక్కుంటున్నాడు. కరోనా వచ్చింది... మనల్ని విడిచి వెళ్ళకుండా ఇంకా ఉంది. ఏడు నెలల పైచిలుకు తరువాత థియేటర్లు తెరిచారు. మరో మూడున్నర నెలల తరువాత ఇప్పుడు హాళ్ళలో అన్ని సీట్లలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాలులో జనం తగ్గారేమో కానీ, సినిమా పట్ల మన మనసుల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడికి సినిమా ఒక మోహం. తెరపై కొత్త బొమ్మ చూడడం తీరని దాహం. ఆ దప్పిక తీర్చడానికి హాలైనా, మరొకటైనా మనకొకటే. అందుకే కాలంతో పాటు మారుతున్న వెండితెర మాయాజాలానికి జేజేలు. లాంగ్ లివ్ సినిమా! మన తెలుగు సినిమా!! ఫస్ట్ ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’ తొలి రోజుల్లో సినిమా అంటే... భాషతో సంబంధం లేని మూగచిత్రాలు (మూకీలు). తర్వాత కాలంలో మూగకు మాటొచ్చింది. వెండితెర మాటలు నేర్చింది. పాటలు పాడసాగింది. మన తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. మాస్టర్ విఠల్, మిస్ జుబేదా నటించిన ఆ చిత్రానికి దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. తెలుగువాడైన హెచ్.ఎం. రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కడి నుంచి మన దేశంలోని విభిన్న ప్రాంతాలు, వివిధ భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మొదలైంది. తొలి భారతీయ టాకీ నిర్మించిన ‘ఇంపీరియల్ మూవీటోన్’ సంస్థే ఆ తరువాత తొలిసారిగా దక్షిణాది భాషల్లో టాకీల రూపకల్పన మొదలుపెట్టింది. ఫస్ట్ సౌతిండియన్ టాకీ ‘కాళిదాస్’ ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పనిచేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. బొంబాయిలోనే ‘ఆలమ్ ఆరా’కు వేసిన సెట్స్ ఉపయోగించుకుంటూ ఆ సినిమా తీశారు. ప్రధానంగా తమిళ మాటలు – పాటలు, కొంత తెలుగు డైలాగులు – కొన్ని త్యాగరాయ కీర్తనలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో ఆ ‘కాళిదాస్’ తయారైంది. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న తొలిసారిగా మద్రాసులోని సినిమా థియేటర్ ‘కినిమా సెంట్రల్’ (తర్వాత ‘మురుగన్ టాకీస్’గా మారింది)లో రిలీజైంది. ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ఆ దర్శక, నిర్మాతలే ప్రకటించిన ఆ సినిమా – మన దక్షిణాది భాషల్లో వచ్చిన ఫస్ట్ టాకీ! టాలీవుడ్ అంటే తెలుగు కాదు... బెంగాలీ! మొదట్లో బొంబాయి ఇంపీరియల్ స్టూడియోలో పనిచేసిన హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ విల్ఫోర్డ్ డెమింగ్ అక్కడ సౌండ్ రికార్డింగ్ మిషన్ పెట్టి, శబ్దగ్రహణమంతా తానే చూసేవారు. ‘ఆలమ్ ఆరా’ సహా బొంబాయిలో 5 చిత్రాలకు ఆయనే వర్క్ చేశారు. ఇంపీరియల్ స్టూడియోలో తయారైన ఫస్ట్ సౌతిండి యన్ టాకీ ‘కాళిదాస్’కు కూడా బహుశా ఆయనే సౌండ్ ఇంజనీర్. అంటే మన తెలుగు మాటల్ని, త్యాగరాయ కీర్తనల్నీ తెరపై వినిపించిన సౌండ్ ఇంజనీర్ ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న ఆ హాలీవుడ్ టెక్నీషియనే కావచ్చు. ఆ తరువాతి కాలంలో ఆయన కలకత్తాకు మకాం మార్చి, బి.ఎన్. సర్కార్ ‘న్యూ థియేటర్స్’ సంస్థలో 2 చిత్రాలకు పని చేశారు. కలకత్తాలోని టాలీగంజ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన బెంగాలీ చిత్రసీమకు ‘టాలీవుడ్’ అని పేరు పెట్టిందీ ఆయనే! 1932లో ‘అమెరికన్ సినిమాటోగ్రాఫర్’ పత్రికకు కలకత్తా సినీ పరిశ్రమ గురించి రాసిన వ్యాసంలో ఆయనే మొదట ఆ పేరు వాడారు. అంటే తెలుగు చిత్రసీమను మనోళ్ళు ‘టాలీవుడ్’ అనడమే పెద్ద తప్పు అన్న మాట! మన తొలి సినిమా విశేషాలు తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సెన్సార్ సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6న, బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి; తొలి 3 టాకీల్లో దర్శక నిపుణుడు చందాల కేశవదాసు, తొలి తెలుగు సినీ కవి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ తొలి 3 టాకీల్లో పని చేసిన వ్యక్తి – రెంటాల జయదేవ -
హీరోయిన్గా... సావిత్రి ఆఖరి చిత్రం
‘ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా?’ ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట. కానీ, స్త్రీని చదివిస్తే, ఆ చదువు ఆమెకే కాదు... మొత్తం ఇంటికే వెలుగవుతుంది. విద్యావంతురాలైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ సంగతిని 50 ఏళ్ళ క్రితమే తెరపై చెప్పిన చిత్రం ‘నిండు దంపతులు’. నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్, సావిత్రితో, బెజవాడ లక్ష్మీటాకీస్ ఓనర్లలో ఒక రైన మిద్దె జగన్నాథరావు యస్వీయస్ ఫిలిమ్స్‌పై తీసిన కుటుంబ కథాచిత్రమిది. వాణిజ్య జయాప జయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా, సావిత్రి హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్ళ క్రితం 1971 ఫిబ్రవరి 4న ఆ ఘట్టానికి తెర తీసిన ‘నిండు...’ జ్ఞాపకాలివి. కొన్ని కథలు, కాంబినేషన్లు విశేషం. ఆడవాళ్ళకు చదువెందుకనుకొనే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా? మాస్ హీరో ఎన్టీఆర్, సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ – ఈ ఇద్దరి కాంబినేషన్ ఊహించగలమా? కానీ, వారిద్దరి కలయికలో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘నిండు దంపతులు’ ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండితెరపై చెప్పింది. అప్పట్లోనే... ఆడవారి చదువు కథగా... కిళ్ళీకొట్టు నడుపుతున్నా, స్త్రీకి చదువు కావాలనుకొనే సంస్కారం ఉన్న హీరో (ఎన్టీఆర్)... ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్ హీరోయిన్ (సావిత్రి)... స్త్రీకి ఆర్థికస్వేచ్ఛ ఉండాలంటూ బి.ఏ చదువుకే గొప్పలు పోయే హీరో మేనకోడలు (లక్ష్మి)... కాపురం చేయాల్సిన ఆడదానికి చదువెం దుకనుకొనే హీరోయిన్ చెల్లె లైన టీ కొట్టు సుబ్బులు (విజయనిర్మల) – ఈ 4 పాత్రల మధ్య కథ ‘నిండు దంపతులు’. హీరో, ఏ దిక్కూ లేని మేనత్త కూతురు వాణి (లక్ష్మి)ని బి.ఏ దాకా చదివిస్తాడు. ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు. కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని (చంద్రమోహన్)ని పెళ్ళి చేసుకుంటుంది. లా చదివిన హీరోయిన్, చదువు లేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది. వాణి చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్ సావిత్రి నల్లకోటు వేసుకొని, కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది. నాయికగా సావిత్రి ఆఖరి సినిమా! ‘మహానటి’ చిత్రం ద్వారా ఈ తరానికీ సుపరిచితమైన శిఖరాగ్ర స్థాయి సినీ నాయిక సావిత్రి. ఆమె తన కెరీర్లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగానూ ‘నిండు దంపతులు’ గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి, వదిన లాంటి సహాయ పాత్రలే! 1966లో షూటింగ్ మొదలైన ఏయన్నార్ ‘ప్రాణమిత్రులు’లో ఏయన్నార్ సరసన సావిత్రి హీరోయిన్. తర్వాత మళ్ళీ ఏయన్నార్ సరసన నాయిక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రాలేదు. అయితే, ఆ తర్వాత ‘నిండు దంపతులు’ దాకా అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్ పక్క ఆమె నాయికగా చేశారు. ఎన్టీఆర్ ‘పల్లెటూరు’ (1952)తో హీరోయిన్గా మొదలైన సావిత్రి, కథానాయికగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం. అలా 1952 నుంచి 1971దాకా 20 క్యాలెండర్ ఇయర్స్ పాటు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ తెరపై వెలిగింది. కాంగ్రెస్ కార్యక్రమాల... బెజవాడ లక్ష్మీటాకీస్ బెజవాడలోని పేరున్న పాతకాలపు థియేటర్లలో ‘శ్రీలక్ష్మీటాకీస్’ ఒకటి. తెలుగు సినీ రాజధాని బెజ వాడలో మారుతీ,దుర్గాకళామందిరం తర్వాత వచ్చిన 3వ సినిమా హాలు ఇది. 1939లో మొదలైన ఆ హాలు గౌడ కులస్థులైన మిద్దె రామకృష్ణారావు, జగన్నాథరావు సోదరులది. అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ వాదులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ఈ సినిమా హాలులో జరిగేవి. రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువున్న రామకృష్ణారావు స్వాతంత్య్రం వచ్చాకా కాంగ్రెస్‌లో తిరిగారు. (నిర్మాత జగన్నాథరావు, 1977 చివర్లో రామకృష్ణారావు పోయాక, ఆ హాలు 1992లో చేతులు మారింది. ఇప్పటి స్వర్ణ ప్యాలెస్‌గా 1995లో ముత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపుమార్చుకుంది. రామకృష్ణారావు 3వ కుమారుడు మురళీకృష్ణ మాత్రం 1996 నుంచి కృష్ణాజిల్లా చీమలపాడులో ‘శ్రీలక్ష్మీ టాకీస్’ పేరుతో ఓ థియేటర్ నడుపుతున్నారు. అదే బెజవాడ పాత లక్ష్మీటాకీస్కు మిగిలిన కొత్త తీపిగుర్తు). దర్శకుడే దైవమన్న ఎన్టీఆర్! ‘నిండు దంపతులు’ సమయానికి హీరోయిన్గా సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్న రోజులు. అప్పటికే జమున, కాంచన, వాణిశ్రీ లాంటి వారున్నా, నిర్మాత జగన్నాథరావు తమ సొంత ఊరు బెజవాడ తార అనే అభిమానంతో అభినేత్రి సావిత్రినే నాయిక లాయర్ పాత్రకు తీసుకుందామన్నారు. వైవాహిక జీవితంలోని చీకాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు. ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయమది. ‘‘ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తూ షూటింగులో డైలాగులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ‘పెద్ద డైరెక్టర్ చెబుతున్నారమ్మా... వినాలి’ అంటూ సావిత్రికి ఎన్టీఆర్ మెత్తగా చెప్పాల్సి వచ్చింది. సినిమా రూపకల్పనలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం నాకిప్పటికీ గుర్తు’’ అని విశ్వనాథ్ అన్నారు. సినీ నిర్మాణంలో తండ్రికి వారసులుగా... బ్లాక్ అండ్ వైట్ ‘నిండు దంపతులు’ అప్పట్లో 35 ప్రింట్లతో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలొచ్చినా, అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్సిన్మాల హవాలో కమర్షియల్‌గా ఈ సినిమా వెనుకబడింది. 50 రోజులే ఆడింది. రెండేళ్ళకే జగన్నాథరావు కన్ను మూశారు. ఆపైన ఆయన నలుగురు కుమారులు (చంద్రకుమార్, విజయకుమార్, జీవన్ కుమార్, వెంకట రమణ కుమార్) తండ్రి బాటలో సాగారు. దాసరితో ‘జీవితమే ఒక నాటకం’ (’77), విజయ నిర్మల డైరెక్షన్లో హీరో కృష్ణతో ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’, ‘శంఖుతీర్థం’ (’79), సోదర సంస్థ పి.వి.ఎస్. (పద్మావతీ వెంకటేశ్వర స్వామి) ఫిలిమ్స్ బ్యానర్ పై కొమ్మినేని శేషగిరిరావుతో ‘కొంటె కోడళ్ళు’ (’83), రేలంగి నరసింహారావు సారథ్యంలో ‘కొంటె కాపురం’ (’86), ‘కాబోయే అల్లుడు’ (’87) తీశారు. మలయాళంలో, కన్నడంలో రెండేసి సినిమాలూ నిర్మించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల రీత్యా యస్.వి.యస్ సంస్థ చిత్ర నిర్మాణం నుంచి విరమించుకుంది. అయితే ఇప్పటికీ సినీ ప్రియులకు ఆ సంస్థ, అది తీసిన సినిమాలు చెదరని జ్ఞాపకాలే! నాలుగు సినిమాల... ఆ కాంబినేషన్ దర్శకుడు కె. విశ్వనాథ్, ఎన్టీఆర్ ఎన్టీఆర్, కె. విశ్వనాథ్‌ల కాంబినేషన్ ఓ విచిత్రం. ‘అన్నపూర్ణా’ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తితో కలసి పనిచేసిన విశ్వనాథ్ నిజానికి అక్కినేనికి సన్నిహితులు. దర్శకుడిగా విశ్వనాథ్ తొలి చిత్రం కూడా ఏయన్నార్ హీరోగా అన్నపూర్ణా వారు తీసిన ‘ఆత్మగౌరవం’ (1966). తర్వాత దాదాపు పాతికేళ్ళకు ఆయన మళ్ళీ ఏయన్నార్‌తో చేసింది ‘సూత్రధారులు’ (1989). కారణాలు ఏమైనా, ఆ రెండే తప్ప ఏయన్నార్‌తో విశ్వనాథ్ మరే సినిమా చేయలేదు. కానీ, ఏయన్నార్‌కు ప్రత్యర్థి అయిన మరో టాప్ హీరో ఎన్టీఆర్‌తో కె. విశ్వనాథ్ ఏకంగా 4 సినిమాలు చేయడం విచిత్రం. గమ్మత్తేమిటంటే, ఆ కాంబినేషన్‌ను కుదిర్చినదీ, మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలను నిర్మించిందీ ఒక్కరే – యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు. ‘‘గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్టీఆర్ గారితో నాకు పరిచయం ఉంది. నా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి స్నేహం ఉంది. దర్శ కుడిగా నన్ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళింది బెజ వాడ లక్ష్మీ టాకీస్ ఓనర్లయిన యస్.వి.యస్. ఫిలిమ్స్ వారే’’ అన్నారు విశ్వనాథ్. అప్పటి నుంచి ఆ సంస్థలో, విశ్వ నాథ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో ‘కలిసొచ్చిన అదృష్టం’ (1968 ఆగస్టు 10), ‘నిండు హృదయాలు’ (1969 ఆగస్టు 15), ‘నిండు దంపతులు’ (1971 ఫిబ్రవరి 4) వచ్చాయి. నిర్మాత– యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు (1919 – 1973) శత జయంతి కూడా ఆ మధ్యనే జరిగింది. ఇవాళ్టికీ ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లోని వారందరికీ బెజ వాడ ‘శ్రీలక్ష్మీ టాకీస్’ ఓనర్లలో ఒకరిగానే సుపరిచితులు. ఆ సినిమాలన్నీ... ఆయనతోనే! ఎన్టీఆర్‌తో నిర్మాత మిద్దె జగన్నాథరావు స్వాతంత్య్రం వచ్చాక... సినీప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్దె సోదరులు విస్తరించారు. హీరో ఎన్టీఆర్‌ది బెజవాడ దగ్గరి నిమ్మకూరు కావడంతో, ఆ పరిచయం, అనుబంధంతో నిర్మాతలుగా మారారు. తొలిప్రయత్నంగా జలరుహా ప్రొడక్షన్స్ పతాకంపై ఆ అన్నదమ్ములు కలసి తీసిన చిత్రం ‘రాజనందిని’ (1958). మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో హీరో ఎన్టీఆరే. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు తమ్ముడు మిద్దె జగన్నాథరావు సొంతంగా యస్.వి.యస్. ఫిలిమ్స్ స్థాపించి, ఆ బ్యానర్ లో విడిగా సినిమాలు నిర్మించారు. జగన్నాథరావు తమ ఆరాధ్యదైవం పేరు మీద ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఫిలిమ్స్ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్ తన ఆఫీసులో కాగితాల ప్యాడ్ మీద గుండ్రటి చేతిరాతతో, అందంగా ఆ బ్యానర్ పేరును తెలుగులో రాసిచ్చారు. అలా ‘యస్.వి.యస్’ ఫిలిమ్స్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రాణం పోసుకుంది. విశేషం ఏమిటంటే, నిర్మాత జగన్నాథరావు 54వ ఏట ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్ లో కేవలం ఎన్టీఆర్ హీరోగానే సినిమాలు తీశారు. అలా ఆ బ్యానర్లో 5 సినిమాలు (ఎస్.డి.లాల్ దర్శకత్వంలోని ‘నిండు మనసులు’, విశ్వనాథ్ తీసిన మూడు సినిమాలు, డి.యోగానంద్ దర్శకత్వంలోని ‘డబ్బుకు లోకం దాసోహం’) వచ్చాయి. ‘డబ్బుకు లోకం దాసోహం’ రిలీజు టైములో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు. ఎప్పుడూ అలవాటైన లక్డీకాపూల్ ద్వారకా హోటల్ రూమ్ నెంబర్ 101లోనే బస చేశారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్ళినా లాభం లేక, 1973 జనవరి 22న కన్నుమూశారు. అలా యస్.వి.యస్. ఫిలిమ్స్ – ఎన్టీఆర్‌ల కాంబినే షన్‌కు ఊహించని బ్రేక్ పడింది. చిరంజీవి సినిమాకు మూలం! చదువుకూ సంస్కారానికీ సంబంధం లేదనీ, సంస్కారానికి చదువు తోడైతే శోభిస్తుందనీ, స్త్రీకి చదువొస్తే సంసారం నిండుగా ఉంటుం దనీ హీరో, హీరోయిన్ పాత్రల ద్వారా చెబు తుంది– ‘నిండు దంపతులు’. సముద్రాల జూనియర్ డైలాగ్స్ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి. చదువు లేని హీరో, మేనత్త కూతుర్ని చదివించి పెళ్ళి చేసుకోవాలనుకొని, నిరాశ పడే భాగం చూస్తే తర్వాతెప్పటికో వచ్చిన కె. విశ్వనాథ్ ‘స్వయంకృషి’ (1987) గుర్తుకొస్తు్తంది. ఇక్కడి ఎన్టీఆర్, లక్ష్మి – అక్కడి చిరంజీవి, అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది. ‘‘స్త్రీ విద్య ప్రధానాంశంగా ‘నిండు దంపతులు’ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నా. అప్పటికి అది రివల్యూషనరీ థాట్. కానీ, సినిమా అనుకున్నంత ఆడలేదు. అందుకని హీరో, తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం ‘స్వయంకృషి’లో మళ్ళీ వాడాం. అయితే, ‘స్వయంకృషి’ కథ, ట్రీట్మెంట్ పూర్తిగా వేరు’’ అని విశ్వనాథ్ ‘సాక్షి’కి వివరించారు. హీరో పాత్రకు కిళ్ళీ కొట్టు స్ఫూర్తి... ‘నిండు దంపతులు’లో ఎన్టీఆర్ వేసిన కిళ్ళీకొట్టు రాములు పాత్రకు ఓ నిజజీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి. అప్పట్లో బెజవాడలో శ్రీలక్ష్మీ టాకీస్ ఎదురు సందులో ‘రాములు కిళ్ళీ షాపు’ చాలా ఫేమస్. అక్కడ రాములు కట్టే రకరకాల, రుచికరమైన కిళ్ళీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు. ‘‘సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిళ్ళీలు కడుతుంది. షూటింగ్లో కిళ్ళీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాపు నుంచి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టే వ్యక్తిని తెప్పించాం’’ అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్ (చిన్ని) తెలిపారు. అరుదైన రికార్డ్ ఆ జంట సొంతం! ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్లో తెరపై బహుముఖ పార్శా్వలు కనిపిస్తాయి. ప్రేయసీ ప్రియులు (కార్తవరాయని కథ, ఇంటిగుట్టు వగైరా) మొదలు భార్యాభర్తలుగా (గుండమ్మ కథ), అన్యోన్య దంపతులుగా (విచిత్ర కుటుంబం), అన్నా చెల్లెళ్ళుగా (రక్త సంబంధం), బాబాయి – కూతురుగా (మాయాబజార్), వదిన – మరుదులుగా (కోడలు దిద్దిన కాపురం), అక్కా తమ్ముళ్ళుగా (వరకట్నం), ప్రతినాయిక – నాయకులుగా (చంద్రహారం), కథను నడిపించే వేశ్య– యాంటీ హీరోగా (కన్యాశుల్కం), కథ ప్రకారం తల్లీ కొడుకులుగా (సర్కస్ రాముడు) ... ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలగా ఒప్పించింది. జనాన్నీ మెప్పించింది. ఒక టాప్ హీరో, టాప్ హీరోయిన్ కలసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడని విషయం. - రెంటాల జయదేవ -
జనం మనసు దోచిన గజదొంగ
ఒక తల్లి... ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే అనుకోకుండా అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. ఒకరు చెడు మార్గంలో, మరొకరు మంచి మార్గంలో వెళుతుంటారు. విలన్ వల్ల అన్నదమ్ములిద్దరూ కలుస్తారు. అతని ఆట కట్టిస్తారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్‌పై పగ తీర్చుకుంటారు. ఇదో బ్రహ్మాండమైన బాక్సాఫీస్ ఫార్ములా! కొన్ని వందల చిత్రాలను విజయతీరాలకు చేర్చిన ఫార్ములా!! ఎన్టీఆర్ అనేకసార్లు చేసిన ఆ తరహా కమర్షియల్ ద్విపాత్రాభినయ కథలకు 1980లలో మళ్ళీ ఒక రకంగా బాక్సాఫీస్ శుభారంభం – ‘గజదొంగ’. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు కొల్లగొట్టిన ఆ ‘గజదొంగ’కు ఈ జనవరి 30తో నలభై ఏళ్ళు నిండాయి. నాలుగు దశాబ్దాల పైచిలుకు క్రితం... ఎన్టీఆర్ డేట్లున్నా, ఆయనతో సినిమా అన్నా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వ్యవహారం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తోటి సినీ నిర్మాతలు, టెక్నీషియన్లకు చిత్ర నిర్మాణానికి డేట్లిచ్చి, నిలదొక్కుకొనేలా చూసేవారు ఎన్టీఆర్. అందుకే, అప్పట్లో అందరూ ఆయనతో సినిమా తీసేందుకు ఉత్సాహపడేవారు. ఆ ముగ్గురు నిర్మాతల ముచ్చట సినీరంగంలో మొదటి నుంచి ఎన్టీఆర్ ప్రోత్సాహం అందుకున్న నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ అప్పటికి చాలా రోజులుగా ఆయనతో సినిమా తీయాలని ఉత్సాహపడుతున్నారు. అంతకు ముందే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘కేడీ నంబర్ 1’ (1978) చిత్రం హక్కులను కోస్తా ఆంధ్రా మొత్తానికీ నిర్మాత చలసాని గోపి, నటుడు కైకాల కొన్నారు. అది వంద రోజులాడి, లాభాలు తెచ్చింది. శతదినోత్సవ ప్రకటనలోనూ వారు ఎన్టీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలూ చెప్పారు. హిట్ కాంబినేషనైన కైకాల, చలసాని కలిసి, సినిమా తీసేలా ఆ పైన ఎన్టీఆర్ డేట్లిచ్చారు. అయితే, ఆర్థికంగా దెబ్బతిన్న ఒకప్పటి నిర్మాత జి. వెంకటరత్నాన్ని కూడా సహ నిర్మాతగా పెట్టుకొని, సినిమా తీయమన్నారు. అలా వచ్చిందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వసూళ్ళ వర్షం కురిపించిన, కమర్షియల్ హిట్ – ‘గజదొంగ’. సోషల్ దుర్యోధనుడు... జేమ్స్‌బాండ్ మ్యూజిక్... 1980 జూలై 20న మద్రాసు ఏ.వి.ఎం. స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైన ‘గజదొంగ’లో అన్నదమ్ములుగా ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. సినిమా కథ ప్రధానంగా బంగారం దొంగిలించే గోల్డ్‌మ్యాన్ పాత్ర అయిన అన్నయ్య చుట్టూ తిరుగుతుంది. హీరో గజదొంగగా ఎందుకు మారాడు, అచ్చం అతనిలా ఉండే తమ్ముడి కథేమిటి, విడిపోయిన ఆ ఇద్దరూ ఎలా కలిశారు, విలన్ ఆట ఎలా కట్టించారనేది కథ. ప్రేమించిన అమ్మాయి నుంచి విడిపోయిన భగ్నప్రేమికుడైన గోల్డ్‌మ్యాన్ పాత్ర నడక, నడత – అన్నీ పౌరాణికాల్లో దుర్యోధనుడిని తలపిస్తుంది. దుర్యోధనుడి క్యారెక్టరైజేషన్‌ను దృష్టిలో పెట్టుకొని, దాన్ని సోషలైజ్ చేసి, తీశారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. సత్యానంద్ రచన, ముఖ్యంగా క్లైమాక్స్‌లో విలన్ ముందు ముగ్గురు ఎన్టీఆర్లలో అసలైన గోల్డ్‌మ్యాన్‌ను కనిపెట్టే సీన్ లాంటివి థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ‘గజదొంగ’ అనే టైటిల్‌కు తగ్గట్టే సంగీత దర్శకుడు చక్రవర్తి ఇంగ్లీషు జేమ్స్‌బాండ్ చిత్రాల స్ఫూర్తితో, ఈ చిత్రానికి రీరికార్డింగ్ చేశారు. ఆ శైలి నేపథ్య సంగీతం, ఛేజింగులు జనాన్ని ఆకట్టుకున్నాయి. కథలో గోల్డ్‌మ్యాన్ దగ్గర బ్లాకీ అనే ఓ నల్ల పెంపుడు పిల్లి, కుక్క, మాట్లాడే బొమ్మ ఉంటాయి. మూడూ ఆకర్షణీయ అంశాలయ్యాయి. బంగారం దొంగిలించే టైటిల్ పాత్రకు తగ్గట్టే కళా దర్శకుడు భాస్కరరాజు వేసిన బంగారం తాపడం చేసినట్టుగా అనిపించే గోల్డెన్ డెన్ సెట్, గద్ద బొమ్మలతో రాజాసనం లాంటివి బాగుంటాయి. అప్పటికే ఎన్టీఆర్‌కు స్పెషలిస్ట్ కాస్ట్యూమర్‌గా పాపులరైన విజయవాడ ‘యాక్స్ టైలర్స్’ వాలేశ్వరరావు డిజైన్ చేసిన బెల్ బాటమ్ ప్యాంట్లు, చొక్కాలు, గోల్డ్‌మ్యాన్ వేసుకొనే బంగారు అంచు సూటు, బూటు ఆకట్టుకున్నాయి. విరిగిన చేతితోనే... షూటింగ్! ‘గజదొంగ’ టైములోనే ‘సర్దార్ పాపా రాయుడు’ షూటింగ్లో బుల్లెట్ మీద నుంచి పడి, ఎన్టీఆర్ కుడి చేయి ఫ్రాక్చరైంది. కానీ, విశ్రాంతి తీసుకుంటే డేట్లు వృథా అయి, నిర్మాతలు ఇబ్బంది పడతారని ఆలోచించి, వాళ్ళ క్షేమం కోసం చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ ‘గజదొంగ’ పాటలు, క్లైమాక్స్‌లో పాల్గొన్నారు. ‘అల్ల నేరేడు చెట్టుకాడ’, ‘చుప్పనాతిచందురుడు’, ‘ఒక రాతిరి ఒక పోకిరి’ పాటలు మూడింటిలోనూ సలీమ్ మాస్టర్ నృత్యసారథ్యంలో, ఎడమ చేతితోనే డ్యా¯Œ ్స మూవ్మెంట్లు ఇస్తూ, విషయం కనపడనివ్వకుండా కవర్ చేశారు. కోటి రూపాయల గ్రాస్! ‘గజదొంగ’ అని టైటిల్ పెట్టినా, ఎన్టీఆర్‌కూ, స్పెషల్ సి.ఐ.డి పాత్రధారి సత్యనారాయణకీ మధ్య ఒక్కటే ఫైట్ ఉంటుంది. మిగతా సినిమా ఛేజింగుల మీదే నడుస్తుంది. దీనిపై ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి వినిపించడంతో, రిలీజైన 50 రోజుల తరువాత సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో ఫైటర్లతో ఎన్టీఆర్ చేసే కారుషెడ్డు ఫైట్‌ను కొత్తగా కలిపారు. ఈ చిత్రం రూ. కోటి గ్రాస్ కలెక్ట్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్ళ గజదొంగగా నిలిచింది. తెలుగు సినీచరిత్రలో అలా కోటి రూపాయల గ్రాస్ వచ్చిన 10వ సినిమా ఇది. వాటిలో ఎన్టీఆర్‌కు ఇది 9వ సినిమా. అంటే, అప్పటికి ఒక్క ‘శంకరాభరణం’ మినహా, ‘లవకుశ’ మొదలుకొని కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మిగతా తొమ్మిది తెలుగు చిత్రాలూ ఎన్టీఆర్వే అన్న మాట! తరువాతి కాలంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్లు తీసిన దర్శకుడు బి. గోపాల్ ‘గజదొంగ’కి రాఘవేంద్రరావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయడం విశేషం. ఫస్ట్ వీక్ ఇండస్ట్రీ రికార్డ్ ‘గజదొంగ’కు ఎన్టీఆర్ పారితోషికం రూ. 17 లక్షలు. పారితోషికంతో కలిపి, ఆ రోజుల్లో రూ. 35 లక్షల లోపే సినిమా నిర్మాణం అయిపోయింది. ఒకటి, రెండు ఏరియాలు మాత్రం నిర్మాతలు ఉంచుకొని, అన్ని ఏరియాలూ దాదాపు రూ. 50 లక్షల పైచిలుకుకు అమ్మేశారు. సినిమా కమర్షియల్‌గా హిట్టయి, బయ్యర్లకూ లాభాలు తెచ్చింది. 45 ప్రింట్లతో రిలీజైన ‘గజదొంగ’ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే (బెంగళూరు, వగైరా ఏరియాలు కలపకుండానే) మొదటి వారం రూ. 34 లక్షలకు పైగా వసూలు చేసి, అప్పటి ఇండస్ట్రీ రికార్డును దాటేసింది. అంతకు ముందు ‘ఛాలెంజ్ రాముడు’ (బెంగుళూరుతో కలిపి రూ. 31 లక్షలు), ‘సర్దార్ పాపారాయుడు’ (ఓన్లీ ఏ.పి. రూ. 29 లక్షలు) తొలి వారం వసూళ్ళలో ఇండస్ట్రీ రికార్డులు. ఆ రెంటినీ అధిగమించిన ‘గజదొంగ’ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ళు కొల్లగొట్టింది. పాతిక సెంటర్లలో 50 రోజులు ఆడింది. వైజాగ్, గుంటూరు కేంద్రాల్లో డైరెక్టుగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరుల్లో సింగిల్ షిఫ్టుతో, ఒంగోలు, తిరుపతిలో నూన్ షోలతో ‘గజదొంగ’ శతదినోత్సవం చేసుకుంది. అలాగే, బెజవాడ, వైజాగుల్లో షిఫ్టింగులతో రజతోత్సవం జరుపుకొంది. నిజానికి, సహ నిర్మాత వెంకటరత్నానికి మొదట్లోనే రూ. 2–3 లక్షల మొత్తం ఇచ్చేసి వదిలించుకొని, సినిమా మొత్తం తామే నిర్మించాలని మిగిలిన ఇద్దరు నిర్మాతలూ భావించారు. కానీ, వెంకటరత్నం మాత్రం అలా వద్దంటూ, నిర్మాణంలో 20 పైసల వాటా ఉంచుకున్నారు. ఆ నిర్ణయమే ఆయనకు లాభించింది. తొలి రిలీజుతో పాటు, మలి విడతలో మరో రెండు రిలీజులకు కూడా సినిమా బాగా లాభాలు తెచ్చింది. అలా వెంకట రత్నానికి వచ్చిన మొత్తం మొదట్లో ఇవ్వజూపిన రూ. 2 –3 లక్షల కన్నా చాలా ఎక్కువే. ఇక, మూడో రిలీజు సమయానికి నిర్మాత కైకాల నాగేశ్వరరావు (సత్యనారాయణ తమ్ముడు) మిగతా ఇద్దరు నిర్మాతల వాటాడబ్బులు లెక్కకట్టి చెల్లించేసి, సినిమా పూర్తి హక్కులు పొందారు. ఫ్యాన్స్ అడిగినా... ఎన్టీఆర్ నో! ఫస్ట్ రిలీజ్లో బెజవాడలో ఈ చిత్రాన్ని ఏకంగా 4 హాళ్ళ (అప్సర, శేష్‌మహల్, పటమట రామకష్ణా, గుణదల రామ్‌గోపాల్)లో వేశారు. కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ, విజయవాడలో మెయిన్ థియేటరైన అప్సరలో ‘గజదొంగ’ 84 రోజులే ఆడింది. అది తీసేసి, హీరో కృష్ణంరాజు ‘పులిబిడ్డ’ (1981 ఏప్రిల్ 24న) రిలీజ్ చేశారు. ‘గజదొంగ’ను హాలులో నుంచి తీసేసే సమయంలో ఎన్టీఆర్ విజయవాడలో ఉన్నారు. బెజవాడ కనకదుర్గ గుడి కొండ మీద ‘అనురాగ దేవత’ చిత్రంలోని ‘ముగ్గురమ్మల గన్నా ముద్దుల మాయమ్మ...’ అనే పాట ఎన్టీఆర్, జయసుధలపై చిత్రీకరిస్తున్నారు. అప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెళ్ళి, ‘గజదొంగ’ పంపిణీదారులైన ‘లక్ష్మీ ఫిలిమ్స్’ వారిని కలసి, అప్సర థియేటర్లో 100 రోజుల దాకా తమ హీరో సినిమా కొనసాగించాలని కోరారు. ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగమూర్తికి ఎన్టీఆర్‌తో ఫోన్ చేయిస్తే, ఫలితం ఉంటుందని పంపిణీ వర్గాల నుంచి ఫ్యాన్స్‌కు సలహా వచ్చింది. దాంతో, ఫ్యాన్స్ వెళ్ళి, ‘అనురాగ దేవత’ షూటింగులో ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ జనవరిలో రిలీజైన ‘‘ఇతర చిత్రాల వంద రోజుల వసూళ్ళ కన్నా, 50 రోజులకే ఎక్కువ కలెక్షన్లు తెచ్చిన ‘గజదొంగ’ను 84 రోజులకే ఎత్తేస్తున్నార’’ని ఫిర్యాదు చేస్తూ, డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేయాలంటూ అభ్యర్థించారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం డిస్ట్రిబ్యూటర్లకున్న ఆబ్లిగేషన్లను గ్రహించాలంటూ సముదాయించారు. ‘‘మన సినిమాను మరో రెండు వారాలు ఆడితే కొత్తగా వచ్చే ఘనత లేదు, ఆడకపోతే పోయేదీ లేదు. ఆల్రెడీ మనకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చాయి కదా’’ అంటూ అభిమానులను అనునయించారు. వీరాభిమానులు అడిగినా సరే, ‘గజదొంగ’ను 100 రోజులు ఆడించేందుకు ఎన్టీఆర్ తన పలుకుబడిని వాడకపోవడం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రిపీట్ రన్స్ లోనూ... గమ్మత్తేమిటంటే ఆ తర్వాత 1983లో, ’87లో, 1990లో– ఈ 3 రిపీట్ రన్స్ లోనూ ‘గజదొంగ’ మళ్ళీ రెగ్యులర్ షోలతో ఏకంగా యాభయ్యేసి రోజుల చొప్పున ఆడింది. చెప్పాలంటే ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ కన్నా ‘గజదొంగ’ రిపీట్ రన్స్‌లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తూ వచ్చింది. ‘‘1990లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు 13 నెలల కాలానికి రెండున్నర లక్షలు పెట్టి ‘గజదొంగ’ రైట్స్ కొన్నాం. చిరంజీవి ‘కొండవీటి దొంగ’ రిలీజ్ టైమ్‌లో 1990 మార్చి 9న గుంటూరులో ‘గజదొంగ’ రిపీట్ రన్ వేశాం. ఒక వారం ఆలస్యంగా విజయవాడలోనూ రిలీజ్ చేశాం. సినిమా 50 రోజులు ఆడింది. ఆరున్నర లక్షలు వ్యాపారం చేసి, మా పెట్టుబడి, ఖర్చులు వెనక్కి రావడమే కాక అప్పట్లోనే రూ. 2 లక్షల లాభం మిగిలింది’’ అని గుంటూరు శ్రీలలితా ఫిలిమ్స్ పంపిణీదారు, పలు చిత్రాల కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. వెరసి, కథ, కథనం మొదలు పబ్లిసిటీ దాకా ‘గజదొంగ’ అనుసరించిన మాస్ కమర్షియల్ పంథా ఆ తరువాత కొత్త తరానికి కూడా బాక్సాఫీస్ రాచబాట అయింది. 10 వారాలు... ముగ్గురు హీరోలు.. మూడు హిట్స్! ‘గజదొంగ’లో గోల్డ్ మ్యాన్ సరసన జయసుధ, తమ్ముడి పాత్ర సరసన శ్రీదేవి నటించారు. ఆ ఏడాది శ్రీదేవి, జయసుధ కలసి నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్. శ్రీదేవి ఇంకా పూర్తిగా ఫైల్లోకి రాక ముందు వారిద్దరూ కలసి శోభన్ బాబు ‘బంగారు చెల్లెలు’, అక్కినేని ‘ముద్దుల కొడుకు’ (1979) లాంటి చిత్రాల్లో చేశారు. కాకపోతే, ఒక పాత్ర పోయాక రెండో పాత్ర వస్తుంది. కానీ, ఇద్దరికీ సమప్రాధాన్యం ఉండేలా వారు చేసిన చిత్రాలు – 1981లో ఎన్టీఆర్ ‘గజదొంగ’, ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, శోభన్‌బాబు ‘ఇల్లాలు’. కేవలం 10 వారాల వ్యవధిలోనే ఆ నాటి పెద్ద హీరోలు ముగ్గురితోనూ ఆ హీరోయిన్లిద్దరూ కలసి మూడు సినిమాలు చేయడం, ఆ మూడూ ఆ ఏడాది అతి పెద్ద హిట్లు కావడం ఓ విశేషం. శ్రీదేవి, జయసుధ అరవై ఏళ్ళ హీరోతో... ‘హాట్’ పాట! నిజజీవితంలో అరవయ్యేళ్ళ వయసుకు దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ కూ, 17 ఏళ్ళ టీనేజర్ శ్రీదేవికీ మధ్య ‘గజదొంగ’లో ‘ఇదో రకం దాహం...’ అంటూ తెరపై పూర్తి హాట్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడం విచిత్రం. రాత్రి ఏ పొద్దుపోయాకో చూడదగ్గ ఈ పాటను ఆ రోజుల్లో, ఆ వయసు ఎన్టీఆర్ మీద తీయడం, జనాన్ని ఒప్పించడం కష్టమే. రాఘవేంద్రరావు చేయదలచిన ఆ రిస్క్‌కు ఎన్టీఆర్ ఓకే అన్నారు. యూనిట్టేమో భయపడి, రిలీజ్ ముందైనా పాట తీసేయాల్సి వస్తుందని సందేహించారు. కానీ, చివరకు ఆ రిస్కీ పాట జనంలోకి వెళ్ళి, ఆమోదం పొందడం విశేషం. డ్యుయట్లు సైతం మాస్ మెచ్చే ధోరణిలో చేసే ఎన్టీఆర్, ఈ అతి శంగార గీతానికి రిస్కును అర్థం చేసుకొని, లలితంగా నటించి మెప్పించారని దర్శకుడు రాఘవేంద్రరావే ఓ సందర్భంలో వివరించారు. మొత్తానికి, అలా రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ చేసిన రిస్కు ఫలించింది. ఇక, ఈ సినిమాలోనే జయసుధపై వచ్చే ‘ఇంద్రధనుసు చీరగట్టి..’, భగ్నప్రేమికుడిగా ఎన్టీఆర్ ఆవేశంగా పాడే ‘రెండక్షరాల ప్రేమ...’ పాటలూ ఆ రోజుల్లో పదే పదే వినిపించేవి. ఆల్‌టైమ్ జయమాలిని హిట్! ‘గజదొంగ’లోని 7 పాటలూ 7 రకాలుగా, ఒకదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. వేటూరి రాసిన ఈ పాటలన్నీ కమర్షి యల్ హిట్. ముఖ్యంగా, ఎన్టీఆర్ గోల్డ్‌మ్యాన్ పాత్రకూ, శృంగార తార జయమాలినికీ మధ్య వచ్చే ‘నీ ఇల్లు బంగారం కానూ’ పాట అతి పెద్ద హిట్. జయమాలిని ఆల్‌టైమ్ హిట్స్‌లో అగ్రస్థానంలో నిలిచే ఆ పాట సినిమాకు ప్లస్ అయింది. ఇప్పటికీ తరచూ వినిపిస్తూ, యూ ట్యూబ్‌లోనూ జయమాలిని పాటల్లో ఎక్కువ వ్యూస్ ఉండే పాటగా ఇదే ట్రెండింగ్! గమ్మత్తేమిటంటే, కొన్నేళ్ళ క్రితం టీవీ యాంకర్ ఉదయభాను చేసిన ‘నీ ఇల్లు బంగారం కానూ’ లాంటి టీవీ షోలు ఆ పాటనూ, సినిమానూ జనం నోట నిలిచేలా చేశాయి. అప్పట్లో ఆ పాటలో జయమాలిని ధరించిన కాస్ట్యూమ్ చాలా ఫేమస్. రాఘవేంద్రరావు తెలుగు హిట్ ‘దేవత’ (1982)ను హిందీలో ‘తోఫా’ (1984)గా రీమేక్ చేసినప్పుడు, హీరోయిన్ శ్రీదేవికి సైతం అదే రకం డ్రెస్ వేయడం మరో విశేషం. ఫ్లోరసెంట్ పోస్టర్ల ట్రెండ్ ‘గజదొంగ’ ఫస్ట్ రిలీజ్ టైమ్‌లో చెన్నైలోని ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గమ్మత్తుగా పబ్లిసిటీ చేశారు. అంతకు కొద్ది నెలల ముందు కమలహాసన్ నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘గురు’ (1980) వచ్చింది. అందులో కమలహాసన్ త్రీడీ కళ్ళద్దాల లాంటివి పెట్టుకోవడం, వజ్రాలు పొదిగిన గద్ద బొమ్మ దొంగతనం లాంటి సీన్లతో ఓ స్టిల్ ఉండేది. ‘గురు’కు కూడా తానే పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహించిన ఈశ్వర్ ఆ స్టిల్ స్ఫూర్తితో, ఎన్టీఆర్ ‘గజదొంగ’కు ఫ్లోరసెంట్ కలర్స్‌తో హైలైట్ అయ్యేలా వాల్ పోస్టర్లు డిజైన్ చేశారు. విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఆ ‘30 బై 40’ సైజు పోస్టర్లను ప్రింట్ చేసేవారు. దాని మీద అక్కడి మరో పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ పి.ఎ. రంగా ఫ్లోరసెంట్ ఎఫెక్ట్ వేసేవారు. చీకటిలో సైతం మెరిసే ఆ ఫ్లోరసెంట్ వాల్ పోస్టర్లను స్తంభాలకు అంటించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్. ఆ ఫ్లోరసెంట్ పోస్టర్ల ట్రెండ్ తరువాత ఇంకా ఊపందుకొని, కొన్నేళ్ళపాటు చాలా సినిమాలు ఆ పబ్లిసిటీ పద్ధతిని అనుసరించాయి. – రెంటాల జయదేవ -
‘మిస్టర్ అండ్ మిస్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘మిస్టర్ అండ్ మిస్’ తారాగణం: జ్ఞానేశ్వరి కాండ్రేగుల, శైలేష్ సన్నీ స్క్రీన్‌ప్లే, డైలాగులు: సుధీర్ వర్మ పేరిచర్ల కథ, తొలి విడత స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ రెడ్డి జనం దగ్గర నుంచి డబ్బులు పోగు చేసి, వాళ్ళను భాగస్వాముల్ని చేసి క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో సినిమాలు తీయడం కొద్దికాలంగా ఊపందుకుంటోంది. ఆ పద్ధతిలో వచ్చిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్’. పూర్తిగా కొత్తవాళ్ళతోనే తీసిన ఈ చిత్రం సమకాలీన సమాజంలో చాలామంది యువతీ యువకులు చేసే ఓ తప్పును ఎత్తి చూపేందుకు ప్రయత్నించింది. కాన్సెప్ట్ బాగున్నా... కథనం బాగుంటేనే ఏ సినిమాకైనా మార్కులు పడతాయి. కానీ, ఈ చిత్రం ఆ పాయింట్‌ను ఎక్కడో మిస్సయినట్టుంది. కథేమిటంటే..: శశికళ అలియాస్ శశి (జ్ఞానేశ్వరి) ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. ముంబయ్‌లో ఉద్యోగం చేస్తూ, ప్రేమికుడున్న హైదరాబాద్‌కు వచ్చేయాలని ప్రయత్నిస్తుంటుంది. తీరా హైదరాబాద్‌కు వచ్చిన హీరోయిన్‌కు ఒకరికి ఇద్దరితో ఎఫైర్లున్న తన లవర్ నిజస్వరూపం ఓ పబ్‌లో బయటపడుతుంది. అతనికి బుద్ధి చెప్పే క్రమంలో యాదృచ్ఛికంగా అమలాపురం అబ్బాయి శివ (శైలేష్ సన్నీ)కి దగ్గరవుతుంది. వారిద్దరూ సహజీవనమూ సాగిస్తుంటారు. ఉద్యోగం పోయిన శివలో వచ్చిన మార్పుతో హీరోయిన్ బ్రేకప్‌కు సిద్ధమవుతుంది. తీరా బ్రేకప్ అయ్యే టైములో వారిద్దరి ముద్దుముచ్చట్ల ప్రేమాయణం తాలూకు ప్రైవేట్ సెల్ఫీ వీడియో ఉన్న హీరో ఐఫోన్ పోతుంది. ఆ ఆంతరంగిక అసభ్య వీడియో నెట్లోకి ఎక్కుతుందనే భయంతో ఆ ఫోన్ కోసం ఇద్దరూ కలసి అన్వేషణ సాగిస్తారు. తరువాత ఏమైంది, ఫోన్ దొరికిందా, వారి ప్రేమ బ్రేకప్ పర్యవసానం ఏమిటన్నది సెకండాఫ్‌లో సుదీర్ఘంగా సా...గే కథ. ఎలా చేశారంటే..: ఈ చిత్రంలో అందరి కన్నా ఎక్కువ పేరొచ్చేది – హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన జ్ఞానేశ్వరి కాండ్రేగులకే! మోడలింగ్ నుంచి టీవీ షో ‘పెళ్ళిచూపులు’లో ఫైనల్స్ దాకా ఎదిగిన ఈ విశాఖ అమ్మాయి ఓ సర్ ప్రైజింగ్ ఫైండ్. ఆ మధ్య ‘క్రాక్’లో బి.బి.సి. విలేఖరిగా కనిపించిన జ్ఞానేశ్వరి ఈ తొలి చిత్రంలోని హాట్ సీన్లను బోల్డ్‌గా చేశారు. ఫోటోజెనిక్ స్కీన్ర్ ప్రెజెన్స్‌తో కొత్తమ్మాయిలా కాక తెరపై ఆత్మవిశ్వాసంతో, అనుభవజ్ఞురాలిలా అనిపిస్తారు. హీరోగా తెరంగేట్రం చేసిన జెమినీ టీవీ యాంకర్ శైలేష్ సన్నీ అక్కడక్కడా మెరుస్తారు. మిగిలినవారిలో బుల్లెబ్బాయ్ పాత్రధారి టైమింగ్, సహజ నటన ఆకట్టుకుంటాయి. ఎలా తీశారంటే..: దర్శకుడు అశోక్ రెడ్డికి గతంలో ‘ఓ స్త్రీ రేపు రా’ చిత్రం తీసిన అనుభవం ఉంది. 2019లో సైమా అవార్డుల్లో బహుమతి గెల్చిన షార్ట్ ఫిల్మ్ తాలూకు కాన్సెప్ట్నే ఈ 125 నిమిషాల సినిమాగా తీశారాయన. కానీ, షార్ట్ ఫిల్మ్ కథను ఫీచర్ ఫిల్మ్ నిడివికి తేవాలంటే కేవలం సాఫ్ట్ పోర్న్ సినిమాలా మిగలకూడదు కదా! బలమైన సీన్లు, బిగువైన కథనం కావాలి కదా! ఆ పాయింట్‌ను ఆయన ఎలా మరిచిపోయారో అర్థం కాదు. ప్రేమలో ఒకసారి దెబ్బతిన్న హీరోయిన్ ఈసారి జాగ్రత్తగా ఉండదలుచుకున్నానంటూనే హీరోను చటుక్కున ప్రేమించడంలో అర్థం లేదు. వారి ప్రేమకు పునాది లైంగిక ఆనందమే తప్ప, మరేదీ ఉన్నట్టూ కనిపించదు. అలాగే, పబ్‌లో ఫస్ట్ లవర్ తాలూకు నిజస్వరూపాన్ని హీరోయిన్ తెలుసుకొనే సందర్భంలోనూ ఆ రెండు పాత్రల ప్రవర్తన వాస్తవానికి దూరంగా ఉంటుంది. మిస్సయిన ఫోన్‌ను కనిపెట్టడానికి ఐఫోన్లో బోలెడన్ని ఫీచర్లుండగా, లాజిక్ లేని జి.పి.ఎస్. ట్రాకింగ్ మీద దర్శక, రచయిత ఆధారపడడం విడ్డూరం. దొరకని ఫోన్ కోసం వెతుకులాటలో సాగదీసిన సీన్లు చూస్తే, హాలులో మనం దొరికిపోయిన ఫీలింగూ వస్తుంది. సినిమాలో అక్కడక్కడా డైలాగ్స్ మెరుస్తాయి. హాలులో నవ్వులు విరుస్తాయి. సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల మానసిక సంఘర్షణ దగ్గరకు వచ్చేసరికి డైలాగులతో క్లాసు పీకుతున్న భావన కలిగితే తప్పుపట్టలేం. పాటలు ఒకటీ, అరా బాగున్నా, ప్రతిసారీ నేపథ్యంలో ఒక బిట్ సాంగ్ రావడం మితిమీరింది. గ్రీన్ మ్యాట్‌లో తీసిన షాట్లు తెలిసిపోతుంటాయి. తీసుకున్న పాయింట్ బాగున్నా, టైటిల్స్ దగ్గర నుంచి ఫస్టాఫ్ అంతా లిప్‌లాక్‌లు, హాట్ సీన్ల మీదే అతిగా ఆధారపడ్డారు. ఉన్నంతలో ఫస్టాఫ్‌లోనే ఫ్లాష్ బ్యాక్ కథ, కథనం ఫరవాలేదనిపిస్తాయి. తీరా సెకండాఫ్‌కు వచ్చేసరికి అవి రెండూ పూర్తిగా చతికిలపడ్డాయి. అసలే అందరూ కొత్తవారున్న ఈ సినిమాకు అది మరీ బలహీనతగా మారింది. హీరోయిన్ చూడడానికి బాగున్నా, కాన్ఫిడెంట్‌గా పాత్ర పోషణ చేసినా, ఎన్ని బోల్డ్ సీన్లున్నా – చివరకు ప్రేక్షకులకు మాత్రం తీరని అసంతృప్తే మిగులుతుంది. బలాలు: యూత్‌ను ఆకర్షించే సీన్లు హీరోయిన్ అభినయం ఫస్టాఫ్ బలహీనతలు: అందరూ కొత్తవాళ్ళే కావడం గాడి తప్పిన సెకండాఫ్ బోరెత్తించే హీరో ఫ్రస్ట్రేషన్ డైలాగులు మిస్స యిన లాజిక్‌లు అతిగా వచ్చే సాంగ్స్ కొసమెరుపు: చూడకున్నా... ఏమీ మిస్ కారు! రివ్యూ: రెంటాల జయదేవ -
కృష్ణ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ఇది
కొన్ని సినిమాలు... కాంబినేషన్లు అంతే! అతిగా ఊహించినప్పటి కన్నా, అంచనాలు లేనప్పుడే అద్భుత విజయాలు అందించి, ఆశ్చర్యపరుస్తాయి. ఆపైన ఆ కాంబినేషన్‌ను బాక్సాఫీస్ సంచలనంగా మార్చేస్తాయి!! అందుకు ఉదాహరణ – దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో కృష్ణ కాంబినేషన్లో 1981 జనవరి 14న రిలీజైన ‘ఊరుకి మొనగాడు’. ఆ కథ తెలుగులో హీరో కృష్ణ కెరీర్ లో ఘన విజయం! హిందీలో కె. రాఘవేంద్రరావునూ, శ్రీదేవినీ స్టార్లను చేసిన సంచలనం! కామెడీ విలనీకి ట్రేడ్ మార్కు కథనం!! ఆ ఫార్ములాకు తెరపై ఇప్పుడు 40 వసంతాలు. నాలుగు దశాబ్దాల క్రితం మాట. హీరో కృష్ణ అప్పటికే 175 సినిమాల హీరో. ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’ లాంటి సూపర్ హిట్లు అందించిన హీరో. అయితే, ఎంతసేపటికీ ‘కృష్ణ సొంతంగా నిర్మించిన సినిమాలే పెద్ద హిట్టవుతాయి. బయటి నిర్మాతలకు పనిచేసినవి ఆడవు’ అనే అపవాదు ఉండేది. దాన్ని తుడిచిపెట్టి, బయటి బ్యానర్ లో కూడా కృష్ణకు భారీ హిట్స్ వస్తాయని బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించిన చిత్రం ‘ఊరుకి మొనగాడు’. ఈ మాట సాక్షాత్తూ హీరో కృష్ణే శతదినోత్సవంలో చెప్పారు. ఈ గ్రామీణ నేపథ్య కుటుంబకథ ఆ సంక్రాంతికి పెద్ద హిట్! కృష్ణ కెరీర్లోనే థర్డ్ బిగ్గెస్ట్ హిట్!! కసితో వచ్చిన కాంబినేషన్... అంతకు సరిగ్గా ఏడాది ముందు 1980 సంక్రాంతికి కె. రాఘవేంద్రరావు – హీరో కృష్ణ కాంబినేషన్లోనే తొలి చిత్రం ‘భలే కృష్ణుడు’ వచ్చింది. ఆ రాఘవేంద్రరావు సొంత సినిమా నిరాశపరిచింది. మరో 2 నెలలకు ‘ఘరానా దొంగ’ (1980 మార్చి 29) వచ్చి, కాస్త ఫరవాలేదనిపించింది. కానీ, తమ కాంబినేషన్ అనుకున్న హిట్ సాధించలేదనే బాధ రాఘవేంద్రరావులో ఉండిపోయింది. దాంతో మూడో చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిర్మాత అడుసు మిల్లి గోపాలకృష్ణేమో స్వయంగా ఆయన స్నేహితుడైన ఎ. లక్ష్మీ కుమార్ (శోభన్‌బాబు ‘రాజా’ చిత్ర నిర్మాత)కు తమ్ముడు. నిర్మాత నుంచి ఏ ఆటంకాలూ లేని ఆ సమయంలో, ఓ మంచి హిట్ ఫార్ములా కథ కోసం చూస్తున్న ఆయనకు సత్యానంద్ రాసిన కథ ‘ఊరుకి మొనగాడు’. ‘‘అప్పట్లో ‘భలేకృష్ణుడు’కు జంధ్యాల, నేను కలసి పని చేసినా, ఎందుకో ఆశించిన ఫలితం రాలేదు. కథ కోసం అన్వేషిస్తున్నప్పుడు అంతకు రెండేళ్ళ క్రితమే నాకు తట్టిన లైన్ చెప్పా. సినిమాలో మొదట మామూలుగా కనిపించే హీరో– చివరకు ఓ పోలీసని తేలడం, పగ తీర్చుకోవడం అనేది కమర్షియల్ ఫార్ములా. అదే పద్ధతిలో... గ్రామీణ నేపథ్యంలో ఓ ఇంజనీరులా ఉద్యోగం మీద ఓ ఊరికి వచ్చిన హీరో వెనుక అసలు కథ వేరే ఉంటే? ఆ ఊరితో అతనికి వేరే బంధముండి, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే? ఈ స్టోరీలైన్ చెప్పగానే రాఘవేంద్రరావుకు నచ్చేసింది. దాన్ని ‘ఊరుకి మొనగాడు’గా తీర్చిదిద్దా’’ అని సత్యానంద్ తెలిపారు. వినోదాత్మక విలనీ క్యారెక్టరైజేషన్! ‘ఊరుకి మొనగాడు’ షూటింగ్ అధిక భాగం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కూళ్ళ, వాకతిప్ప, రామచంద్రాపురాల్లో జరిగింది. గ్రామీణ ప్రాంతంలోని మనుషులు, మనస్తత్వాలు, ఆకతాయి హీరోయిన్, బావా మరదళ్ళ సరసం, హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్, మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు లాంటి సత్యా నంద్ రచనా చమక్కులన్నీ ఈ సినిమాకు హిట్ దినుసులయ్యాయి. ముఖ్యంగా, రావు గోపాలరావు, ఆయనకు సహచరుడైన అల్లు రామలింగయ్యల ట్రాక్ జనానికి తెగ నచ్చింది. రావు గోపాలరావు పాత్ర చిత్రణ, ఆ పాత్రకు రాసిన డైలాగ్స్ ఇప్పటికీ కొత్తగా అనిపిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఆ తరువాత నాగభూషణం లాంటివాళ్ళు వినోదం పండిస్తూనే, విలనీ చేసేవారు. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ (1969)లో నాగభూషణం కామిక్ రిలీఫ్ ఇస్తూ, విలనీ పండించడం, భమిడిపాటి రాధాకృష్ణ డైలాగులు కాలేజీ రోజుల్లో సత్యానంద్ మనసుపై ముద్ర వేశాయి. ‘‘మామూలుగా సినిమాలో విలన్లు పవర్‌ఫుల్‌గా, వయొ లెంట్‌గా ఉంటారు. కానీ, విలన్లు ఈ కథలో పాత్రలకు భయం కలిగిస్తూనే, చూసే ప్రేక్షకులకు వినోదం పంచా లనే కాన్సెప్ట్ తీసుకున్నా. ఆ పద్ధతిని నా తొలి చిత్రం ‘మాయదారి మల్లిగాడు’ (1973)లో నాగభూషణంతో ప్రయత్నించా. ‘ఊరుకి...’లో రావుగోపాలరావు, అల్లుతో పూర్తిస్థాయిలో పెట్టా’’ అని సత్యానంద్ వివరించారు. హిందీలోకీ అదే ఫార్ములా! విలన్, విలన్ వెంట సహాయకుడిగా కామెడీ విలన్ అనేది బాక్సాఫీస్ ఫార్ములాగా మారింది. ఈ సినిమాతో స్థిరపడ్డ ఆ ఫార్ములా ఆ తరువాత ఓ ట్రెండ్ గా తెలుగు తెరపై స్థిరపడింది. సత్యానంద్, రాఘవేంద్రరావు బృందం తీర్చిదిద్దిన ఈ సక్సెస్ ఫార్ములా ఆపైన హిందీ సినిమాల్లోకీ వెళ్ళడం విశేషం. రాఘవేంద్రరావు తన హిందీ చిత్రాల్లో రచయిత, నటుడు ఖాదర్ ఖాన్‌తో కలసి ఆ ఫార్ములాను ఉత్తరాదిలోనూ పాపులర్ చేశారు. అక్కడ చాలా సినిమాల్లో శక్తికపూర్, ఖాదర్‌ఖాన్ జంట మీదా ఈ విలన్, కమెడియన్ జంట ఫార్ములా బాక్సాఫీస్ వద్ద వర్కౌటైంది. గమ్మత్తేమిటంటే, 1990లలో కోట శ్రీనివాసరావు, అతని పక్కన బాబూమోహన్ అనే ట్రెండ్‌కు ఈ ఫార్ములానే మాతృక. కృష్ణకు... థర్డ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ‘ఊరుకి మొనగాడు’పై మొదట అంచనాలు లేవు. కానీ, హీరో కృష్ణ ఇంట్రడక్షన్ మొదలు కథ, కథనం, పాత్రల స్వరూపస్వభావాలు, డైలాగులతో వాటిని నడిపిన తీరు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే జనానికి బాగా పట్టేశాయి. అదే సంక్రాంతి రోజున రిలీజైన ఎన్టీఆర్ ‘ప్రేమ సింహాసనం’ని కూడా కాదని, ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. అప్పటికే ఎన్టీఆర్‌తో బ్లాక్బస్టర్లిచ్చిన రాఘవేంద్రరావు ఈసారి కృష్ణతో తన కమర్షియల్ మాయాజాలం చూపారు. కృష్ణకు కెరీర్లో మూడో బిగ్గెస్ట్ హిట్‌గా ‘ఊరుకి మొనగాడు’ను నిలిపారు. ఆ ఏడాది సంక్రాంతి సీజన్లో తెలుగులో 8 సినిమాలొచ్చాయి. కృష్ణ ‘బంగారు బావ’ (1980 డిసెంబర్ 31), కొత్త ఏడాదిలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, శోభన్‌బాబు ‘పండంటి జీవితం’, ‘జగమొండి’, ‘దేవుడు మామయ్య’, ఎన్టీఆర్ ‘ప్రేమ సింహాసనం’, కృష్ణ ‘ఊరుకి మొనగాడు’, కృష్ణంరాజు ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ రిలీజయ్యాయి. వీటన్నిటిలోకీ ‘ఊరుకి...’ పెద్ద హిట్. ఈ సినిమా రిలీజై నెల తిరగ్గానే అక్కినేని – దాసరి గోల్డెన్‌జూబ్లీ హిట్ ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. ఆ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని, ‘ఊరుకి...’ నిలబడడం విశేషం. కృష్ణ సినీజీవితంలో ‘పండంటి కాపురం’ (17 కేంద్రాలు), ‘అల్లూరి సీతారామరాజు’ (15) తరువాత అత్యధిక సెంటర్లలో (7 కేంద్రాలు – విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు) డైరెక్ట్‌గా వంద రోజులు ఆడిన చిత్రం ‘ఊరుకి మొనగా’డే! అలాగే ఈ చిత్రం మరో 4 కేంద్రాల్లో నూన్ షోస్‌తోనూ వంద నడిచింది. ఆపై షిఫ్టింగులతో రజతోత్సవం కూడా జరుపుకొంది. ఆ తరువాత విడుదలైన ‘ఈనాడు’ (1982) కూడా నేరుగా 7 కేంద్రాలలో 100 రోజులు ఆడి, ‘ఊరుకి’తో సమంగా నిలిచింది. కృష్ణకు నేరుగా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రాలుగా ‘పాడిపంటలు’ (1976), ‘సింహాసనం’ (1986), ‘నెంబర్ వన్’ (1994) రికార్డుకెక్కాయి. మారిన సినీ గ్రామర్... మామూలుగా తెలుగు భాషా, వ్యాకరణ, వాడుక భాషా సంప్రదాయాల్లో దేని ప్రకారం చూసినా ‘ఊరికి’ మొనగాడు అని రాయడం కరెక్ట్. కానీ, ఈ సినిమాకు ‘ఊరుకి’ అని తప్పుగా టైటిల్ పెట్టడం అప్పట్లో విమర్శలకు గురైంది. విజయవాడలో సినిమా యూనిట్ ‘గెట్ టుగెదర్’లో ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ లాంటి వారు సభాముఖంగా ఈ తప్పు ప్రస్తావించారు. అయితే, వ్యాకరణానికే కాదు... ఒక రకంగా సినీ వ్యాకరణానికి కూడా ఈ సినిమా ఎదురెళ్ళింది. సాధారణంగా తెలుగు సినిమాలో 70 నుంచి 80 సీన్లుంటాయి. కానీ, రెండున్నర గంటలైనా లేని ‘ఊరుకి..’లో ఏకంగా 120 దాకా సీన్లున్నాయి. కాకపోతే, అన్నీ చిన్న చిన్న సీన్లే. దాంతో, సీన్లు ఎక్కువున్నా, సినిమా నిడివి తక్కువే. చిన్న సీన్లతోనే చకచకా కథ చెబుతూ, ఒక్క సెంటిమెంట్ పార్ట్ మినహా హీరోయిన్, విలన్ల పాత్రలు సహా మిగతా అంతా ఎంటర్ టైనింగ్‌గా సాగే విధానాన్ని అప్పట్లోనే అనుసరించడం విశేషం. తెలుగు డేట్స్‌తో... హిందీ సినిమా ఈ చిత్ర హిందీ రీమేక్ ‘హిమ్మత్వాలా’ ముందు భారతీరాజా తమిళ హిట్ ‘పదు నారు వయదినిలే’ (పదహారేళ్ళ వయసు) హిందీ రీమేక్ ‘సోలవా( సావన్’ (1979) లాంటి సినిమాల్లో శ్రీదేవి నటించారు. అవేవీ ఆమెకు కలిసిరాలేదు. ఆ మాటకొస్తే, ఈ ‘హిమ్మత్ వాలా’లోనూ శ్రీదేవిని హీరోయిన్గా పెట్టుకోవాలని పద్మాలయా సంస్థ మొదట అనుకోలేదు. వారు ఓ తెలుగు సినిమా కోసం శ్రీదేవిని బుక్ చేసుకొని, డేట్లు తీసుకున్నారు. అనుకోకుండా ఆ తెలుగు సినిమా అనుకున్న టైమ్‌కి మొదలుకాలేదు. ఆగింది. దాంతో, శ్రీదేవి డేట్లు వేస్ట్ చేయడం ఎందుకని హిందీలో తీస్తున్న ‘హిమ్మత్ వాలా’కు అప్పటికప్పుడు శ్రీదేవిని పెట్టారు. ఆమె డేట్స్ అలా వాడుకున్నారు. అలా ఆపద్ధర్మంగా వాళ్ళు తీసుకున్న ఓ నిర్ణయం శ్రీదేవి కెరీర్‌నే మార్చేసింది. హిందీ సీమలో తిరుగులేని నాయికగా ఆమె ఎదగడానికి బలమైన పునాది వేసింది. జితేంద్ర, శ్రీదేవి జంట తెలుగు సిన్మాల హిందీ రీమేక్స్‌కు సరికొత్త పాపులర్ కాంబినేషన్ అయింది. ‘నిషానా’ (1980 – ఎన్టీఆర్ ‘వేటగాడు’ రీమేక్)తో హిందీలో అడుగుపెట్టిన రాఘవేంద్రరావుకు ‘ఫర్జ్ ఔర్ కానూన్’ (1982 – ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’ రీమేక్) తరువాత, ఈ మూడో చిత్రం ‘హిమ్మత్ వాలా’తోనే బాలీవుడ్లో భారీ బ్లాక్‌బస్టర్ వచ్చింది. ఒక్క కథ – ఇటు కృష్ణ, రావు – అల్లు కాంబినేషన్ నుంచి అటు శ్రీదేవి, జితేంద్ర, రాఘవేంద్రరావు దాకా ఎందరి కెరీర్‌నో కీలకమైన మలుపు తిప్పింది. అందరినీ బాక్సాఫీస్ మొనగాళ్ళుగా నిలిపింది. శ్రీదేవి కెరీర్ మార్చిన కథ! హీరో కృష్ణ సొంత సంస్థ పద్మాలయా వారు ఇదే కథను రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే హిందీలో శ్రీదేవి, జితేంద్ర జంటగా ‘హిమ్మత్ వాలా’ (1983) పేరుతో రీమేక్ చేశారు. ఏకంగా 50 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొన్న ఆ హిందీ రీమేక్ అటు పద్మాలయాకూ, ఇటు శ్రీదేవికీ, రాఘవేంద్రరావుకీ – ముగ్గురికీ ఉత్తరాది సినీ సీమలో బ్రేక్ ఇచ్చింది. జితేంద్ర కెరీర్‌కు హీరోగా సెకండ్ ఇన్నింగ్సూ వచ్చింది. తెలుగు తెరపై... దివిసీమ ఉప్పెన! సమకాలీన సంఘటనల్ని సినిమాలోకి జొప్పిస్తే, అది ఎప్పుడూ బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములానే! 1977 నవంబర్‌లో కృష్ణాజిల్లా దివిసీమ తుపానులో జరిగిన భారీ ప్రాణనష్టం దేశవ్యాప్త సంచలనం. ‘ఊరుకి’లో ఆ సంఘటనను సందర్భోచితంగా వాడుకున్నారు. జనం మనసును మెలిపెడుతున్న ఆ ఘట్టాన్ని సినిమాలో వాడితే బాగుంటుందన్నది రాఘవేంద్రరావు ఆలోచన. ఆ ఆలోచనను అందుకొని, దాన్ని మూగవాడైన నటుడు చంద్రమోహన్ పాత్రకూ, నిర్మలమ్మ పాత్రకూ ముడి పెడుతూ, మంచి సెంటిమెంట్ ట్రాక్‌గా కథలో జొప్పించారు సత్యానంద్. ఉప్పెన వల్ల అయినవారిని పోగొట్టుకొని, కొంపా గోడు పోయి వీధిన పడ్డ సామాన్యుల కోసం విరాళాల సేకరణ జరిగిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ సినిమాలో హీరో కృష్ణ జోలె పట్టి తిరిగే దృశ్యాలు తీశారు. ‘కదలి రండి మనుషులైతే...’ అంటూ ఆ సందర్భానికి తగ్గట్టు ఆరుద్ర రాసిన భావోద్వేగ గీతం ప్రేక్షకులను కదిలించింది. చిత్ర ఘనవిజయానికి బాగా తోడ్పడింది. ఆ పాట ఇవాళ్టికీ ప్రకృతి విపత్తుల వేళ రేడియోలో, టీవీలో తప్పకుండా వినిపించే మాట. ఈ కమర్షియల్ సినిమాలో చక్రవర్తి స్వరకల్పనలో ‘ఇదిగో తెల్లచీరా ఇవిగో మల్లెపూలు...’, ‘బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో...’, ‘అందాల జవ్వని మందార పువ్వని...’, ‘మొగ్గా పిందేళ నాడే...’ లాంటి వేటూరి మార్కు గీతాలన్నీ మాస్ నోట నానాయి. కథ, కథనంలోని బిగువుకు ఈ కమర్షియల్ పాటల సరళీ బాగా కలిసొచ్చింది. ఎన్టీఆర్ లాంటి హిట్స్ కోసం... ఆ రోజుల్లో ‘ఊరుకి మొనగాడు’ చిత్రం గుంటూరు జిల్లా హక్కులను హీరోయిన్ శ్రీదేవి తల్లి రూ. 3.2 లక్షలకు తీసుకుంటే, బోలెడంత లాభం వచ్చిందట. 1981 ఏప్రిల్ 25న మద్రాసులో పామ్‌గ్రోవ్ హోటల్లో శతదినోత్సవం జరిగింది. ప్రముఖ దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హీరో ఎన్టీఆర్ విచ్చేసి, కృష్ణను అభినందించి, షీల్డులు అందించారు. ‘‘ఎన్టీఆర్ తో ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ లాంటి సూపర్‌హిట్స్ తీసిన రాఘవేంద్రరావు నాతోనూ ఆ స్థాయి హిట్టయ్యే సినిమాలు ముందు ముందు తీయాలని ఆశిస్తున్నా’’ అంటూ వేదికపై కృష్ణ పేర్కొనడం గమనార్హం. ఇక, నిర్మాతగా ఈ తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ హిట్ సాధించిన అడుసుమిల్లి గోపాలకృష్ణ తమ గోపీ మూవీస్ పతాకంపై రెండో చిత్రం ‘శక్తి’ (1983) కూడా కృష్ణ, రాఘవేంద్రరావుల కాంబినేష¯Œ లోనే నిర్మించడం, అదీ హిట్టవడం విశేషం. ఆ పైన రాఘవేంద్రరావు, కృష్ణ కలయికలో ‘అడవి సింహాలు’,‘ఇద్దరు దొంగలు’,‘అగ్నిపర్వతం’, ‘వజ్రాయుధం’ లాంటి చిత్రాలు వచ్చాయి. జయప్రద, కృష్ణ – రెంటాల జయదేవ -
నిరాశపరిచే రీమేకు ఇది!
చిత్రం: ‘రెడ్’; తారాగణం: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్; సంగీతం: మణిశర్మ; కెమేరా: సమీర్ రెడ్డి; ఫైట్స్: పీటర్ హెయిన్; ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖ్; నిర్మాత: స్రవంతి రవికిశోర్; దర్శకత్వం: కిశోర్ తిరుమల; రిలీజ్: జనవరి 14. ఒక భాషలో హిట్టయిన సినిమాను మరో భాషకు తెస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యథాతథంగా మాతృకనే అనుసరించవచ్చా? అలా అనుసరిస్తే ఈజీనా, ఇబ్బందా? ఇది నిజంగా చర్చించాల్సిన విషయమే. మరీ ముఖ్యంగా రామ్ హీరోగా సంక్రాంతికి రిలీజైన ‘రెడ్’ చూసినప్పుడు ఈ ప్రశ్నలన్నీ మదిలో మెదులుతాయి. పక్క భాషలో ఎంత హిట్టయిన కథనైనా, మన దగ్గరకు తెచ్చుకున్నప్పుడు లోకల్ సెన్సిటివిటీస్‌కు తగ్గట్టు మార్చుకోవడం ఎంత అవసరమో, హిట్‌కు కారణమైన అంశాల్ని కదిలించకపోవడమూ అంతే కీలకం. తమిళ హిట్ ‘తడమ్’ ఆధారంగా వచ్చిన ‘రెడ్’ ఆ సంగతి మరోసారి ప్రూవ్ చేసింది. కథేమిటంటే..: సిద్ధార్థ (రామ్) భవన నిర్మాణ రంగంలో పైకి వస్తున్న సివిల్ ఇంజనీర్. మహిమ (మాళవికా శర్మ)ను ప్రేమిస్తాడు. మరోపక్క ఆదిత్య (రామ్ ద్విపాత్రాభినయం), అతని స్నేహితుడు వేమా (సత్య) ఆవారాగా తిరుగుతుంటారు. వాళ్ళు డబ్బు కోసం ఇబ్బందిపడుతున్న టైమ్‌లో ఆదిత్యకు, గాయత్రి (అమృతా అయ్యర్) ఎదురవుతుంది. ఈ ఇద్దరి కథలూ ఇలా సాగుతుండగా బీచ్ రోడ్డులో ఓ హత్య జరుగుతుంది. ఆ హంతకుడు సిద్ధార్థ, రామ్‌లలో ఎవరు అనేది చిక్కుముడి. ఆ హత్య ఎవరు, ఎందుకు చేశారు? సిద్ధార్థ – ఆదిత్యల మధ్య సంబంధం ఏమిటి లాంటివన్నీ మిగతా కథ. ఎలా చేశారంటే..: తెర మీద లైవ్ వైర్ లాంటి ఎనర్జీ ఉన్న కొద్దిమంది తెలుగు హీరోల్లో ఒకరు రామ్. గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’లో అదేమిటో చూపిన హీరో రామ్ ఈసారి ‘రెడ్’లో ద్విపాత్రాభినయం చేశారు. సినిమాను తన రెండు పాత్రల భుజాల మీద మోశారు. కానీ, ఈ తమిళ రీమేక్ యాక్షన్ థ్రిల్లర్‌ను కొన్నిచోట్ల అనవసరంగా మార్చారు. కొన్నిచోట్ల అవసరం ఉన్నా మార్చలేదు అనిపిస్తుంది. దాంతో, తంటా వచ్చిపడింది. పోలీసు అధికారిగా నివేదా పేతురాజ్ ఉన్నంతలో తన పాత్ర బాగానే చేశారు. కానీ, ఆ పాత్రకున్న పరిధే తక్కువ. మాళవికా శర్మ చూడడానికి బాగున్నారు. సినిమాలో తక్కువ నిడివే ఉన్నా, బలంగా హత్తుకొనే గాయత్రి పాత్రలో అమృతా అయ్యర్ సరిగ్గా సరిపోయారు. కమెడియన్ సత్య కామిక్ రిలీఫ్ ఇస్తారు. అయితే, ఏ పాత్రా మనసుకు హత్తుకోకపోవడమే పెద్ద ఇబ్బంది. ఎలా తీశారంటే..: ఇప్పటికే ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన దర్శక, రచయిత కిశోర్ తిరుమల ప్రయత్నించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆయన తనకు అలవాటైన క్యూట్ లవ్ స్టోరీ ట్రాక్‌తోనే సినిమా మొదలెట్టారు. అక్కడక్కడ తనదైన మార్కు ఆకట్టుకొనే డైలాగులతో ఆకట్టుకున్నారు. అయితే, అసలు థ్రిల్లింగ్ కథ దగ్గరకు వచ్చేసరికి తన మార్కు చూపించలేకపోయారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపడానికి ప్రయత్నించినా, ఒక దశలో కొంత కన్ ఫ్యూజింగ్గానూ అనిపిస్తుంది. సినిమాలోని పాత్రల పాత కథల మీద ఉన్న శ్రద్ధ, వర్తమానంలో వాటి మధ్య ఉన్న సంఘర్షణను తెరపై చూపడం మీద పెట్టలేకపోయారు. అలాగే, సినిమాలోని డ్యుయల్ రోల్లో ఎవరు ఏ రామ్ అన్నది కన్ఫ్యూజన్ లేకుండా చూపడంలోనూ యూనిట్ ఫెయిలైంది. అయితే, ఇటలీలో తీసిన పాటలలాంటివి కలర్‌ఫుల్ గా ఉన్నాయి. హెబ్బా పటేల్‌తో తీసిన ఐటమ్ సాంగ్ ‘ఢించక్ ఢించక్...’ మాస్‌ను ఆకట్టుకుంటుంది. పీటర్ హెయిన్ తీసిన పోలీస్ స్టేషన్ ఫైట్ లాంటివి, హీరో డ్యుయల్ రోల్ సీన్లను సహజంగా అనిపించేలా తీసిన కెమేరా వర్క్‌నూ అభినందించాల్సిందే. మణిశర్మ నేపథ్య సంగీతం అమృతా అయ్యర్ ఎపిసోడ్, మదర్ సెంటిమెంట్ లాంటి ఘట్టాల్లో ప్రత్యేకించి బాగుంది. రెండు పాత్రల రామ్... తనది డ్యుయల్ ర్యామ్ అనిపించుకున్నారు. కానీ కథ, కథన లోపాలు – మదర్ సెంటిమెంట్ కూడా యాంటీ సెంటిమెంట్‌గా అనిపించడం – మన నేటివిటీకి నప్పని స్త్రీ పాత్రల స్వభావాలు – ఇవన్నీ అసంతృప్తికి గురిచేస్తాయి. రెడ్ అనే టైటిల్‌కు జస్టిఫికేషనూ వెతుక్కుంటాం. వెరసి, ఈ థ్రిల్లర్ సినిమాలో థ్రిలింగ్ తక్కువ. వినోదమూ తక్కువే. కొసమెరుపు: ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ జోరుకు ఇది ఓ రెడ్ సిగ్నల్! బలాలు: ∙రెండు పాత్రల్లో రామ్ ఎనర్జిటిక్ నటన ∙మణిశర్మ నేపథ్యసంగీతం, నిర్మాణ విలువలు ∙అక్కడక్కడ మెరిసే డైలాగులు బలహీనతలు: ∙తెలుగు నేటివిటీకి పొసగని కొన్ని స్త్రీ పాత్రల ప్రవర్తన ∙నిదానంగా సా...గే కథనం ∙కన్విన్సింగ్ గా లేని కీలకమైన సెకండాఫ్ ∙పండని మదర్ సెంటిమెంట్ ∙పస తగ్గిన థ్రిల్లింగ్ అంశాలు -రివ్యూ: రెంటాల జయదేవ -
మరీ అంత డర్టీ కాదు!
చిత్రం: ‘డర్టీ హరి’; తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖావాణి; సంగీతం: మార్క్ కె. రాబిన్; కెమెరా: బాలరెడ్డి; నిర్మాతలు: గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయిపునీత్; రచన, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు; ఏ.టి.టి: ఫ్రైడే మూవీస్. ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కనపడేవేవీ లేవు. ఒకరకంగా మొదలైన సినిమా మరో రకంగా ముగుస్తుంది. అయినా సరే, ఓ సినిమా మరీ అసంతృప్తికి గురి కానివ్వకపోవడం, జనాన్ని ఆద్యంతం కూర్చోబెట్టగలగడం విశేషమే. దర్శకుడిగా ఎం.ఎస్. రాజు చేసిన మ్యాజిక్... అదే ‘డర్టీ హరి’. బహుశా, అందుకే వివాదాస్పద వాల్ పోస్టర్లు, ట్రైలర్లతో వార్తల్లోకి వచ్చిన ‘డర్టీ హరి’ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి సర్ప్రైజ్ చేస్తుంది. అంతదాకా పెట్టుకున్న అంచనాలను మార్చేస్తుంది. అదే ఈ సినిమాకు ఉన్న బలం. కథేమిటంటే..: చేయి తిరిగిన చెస్ ప్లేయర్ హరి (శ్రవణ్ రెడ్డి). ఎలాగైనా జీవితంలో పైకి రావాలనే యాంబిషన్ ఉన్న ఆ కుర్రాడు అవకాశాల వేటలో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ బడా కంపెనీ దంపతుల (అంబరీష అప్పాజీ, సురేఖావాణి) కుమార్తె – పెయింటరైన వసుధ (రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. మరోపక్క వసుధ కజిన్, హరికి స్నేహితుడూ అయిన ఆకాశ్ ఏమో సినిమాల్లోకి పైకి రావాలని ప్రయత్నిస్తున్న మోడల్ గర్ల్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్)తో ప్రేమలో ఉంటాడు. వసుధతో ప్రేమ పెళ్ళి పీటలకెక్కే దశలో ఉన్నప్పటికీ, హరి మాత్రం తన స్నేహితుడి లవర్ మీద కన్నేస్తాడు. జాస్మిన్ కూడా హరికి లొంగిపోతుంది. తీరా ఆకాశ్‌తో ఆమె ప్రేమ బ్రేకప్ అవుతుంది. వసుధతో పెళ్ళయిపోయినా సరే జాస్మిన్‌తో ఎఫైర్‌ను మన యాంబిషియస్ హరి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో జాస్మిన్ గర్భవతి అవుతుంది. ఆ వ్యవహారం చివరకు ఎక్కడ దాకా వెళ్ళింది, హరి వైవాహిక జీవితం ఏ మలుపు తిరిగింది, ఏమైంది అన్నది ఆసక్తికరంగా సాగే చివరి ముప్పావుగంట మిగతా కథ. ఎలా చేశారంటే..: దాదాపు రెండు గంటల సినిమాకు ప్రధాన బలం ప్రధాన పాత్రల్లో హరిగా నటించిన శ్రవణ్ రెడ్డి, జాస్మిన్‌గా కనిపించిన పంజాబీ పిల్ల సిమ్రత్ కౌర్. ఈ హీరోయిన్ గతంలో ‘పరిచయం’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో చేసింది. కొంతకాలంగా ముంబయ్‌లో హిందీ సినిమాలు, సిరీస్‌లలో స్థిరపడ్డ తెలంగాణలోని కరీంనగర్ కుర్రాడైన శ్రవణ్ రెడ్డికి తెలుగులో ఇదే తొలి పెద్ద ఛాన్స్. అలా ఈ ప్రధాన పాత్రధారులిద్దరూ మన ప్రేక్షకులకు కొత్త ముఖాల కిందే లెక్క. అయినప్పటికీ, క్యారెక్టరైజేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తెరపై ఆకట్టుకుంటారు. ఫస్టాఫ్‌లో కథానుగుణంగా హీరో స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్లిష్టమైన అడల్ట్ సీన్లలో అచ్చంగా పాత్రలలానే ప్రవర్తించారు. ఇక, జీవితంలో పైకి ఎదగడానికి ఎత్తులు పైయెత్తుల ఆట, కళ్ళలోనే కనిపించేసే కామం, మనసులోని చెడును కనపడనివ్వకుండా పైకి మంచిగా ప్రవర్తించే తీరు, కోపం – ఇలా బోలెడన్ని వేరియేషన్లను హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి బాగా చూపించారు. కడుపు పండాలని ఆరాటపడే అమ్మాయిగా రుహానీ శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోతుంటాయి. చివరలో వచ్చే పోలీసు ఇంటరాగేషన్ సీన్ల లాంటివి మరికొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఎలా తీశారంటే..: ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజుకు దర్శకుడయ్యాక లభించిన సక్సెస్ శూన్యం. ఈ నేపథ్యంలో ఆయన తన ట్రెండ్ మార్చి, ‘డర్టీ హరి’ లాంటి పేరుతో, పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో న్యూ ఏజ్ సినిమా తీస్తుంటే సహజంగానే ఆశ్చర్యమేస్తుంది. తీరా సినిమా చూశాక కథాగమనం, కథలోని ట్విస్టులతో ఆశ్చర్యం పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ – దర్శకుడు ఎం.ఎస్. రాజే! దర్శక – రచయిత, నిర్మాతలు ఎవరూ పైకి చెప్పకపోయినా, సినీ ప్రియులు ఈ కథకు మూలం ఇట్టే చెప్పేస్తారు. ఉడీ అలెన్ రచన, దర్శకత్వంలో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మ్యాచ్ పాయింట్’ (2005) కథను మనవాళ్ళు యథాతథంగా తీసుకొని, చివరి ఘట్టాలను మనదైన పద్ధతిలో మార్చేసుకున్నారు. ఆకట్టుకొనేలా, తెలివిగా ఆ కాపీ కొట్టడమే అసలైన సినీ ట్రేడ్ సీక్రెట్. హైక్లాస్ జీవితాన్ని చూపించే నేపథ్య నిర్మాణ విలువలు మొదలు కీలకమైన ఘట్టాల్లో రీరికార్డింగ్, కెమెరా వర్క్ దాకా అనేకం బాగా తీర్చిదిద్దారు. పనిలో పనిగా నవతరంలోని హైక్లాసు వర్గం వాడే అశ్లీల పదాలు ఈ సినిమాలో యథేచ్ఛగా వినిపిస్తాయి. ఫస్టాఫ్‌లో, అలాగే సెకండాఫ్ మొదట్లో కాసేపు శృంగారం మోతాదు మించి చూపించినా, చివరి ముప్పావుగంట థ్రిల్లింగ్ అంశాలు వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్కమాటలో... ఫస్టాఫ్ డర్టీనెస్, క్లైమాక్స్ హెవీ హార్టెడ్నెస్ ఫీలింగ్! చూడడం పూర్తయ్యాక, సినిమా సంతృప్తిగా ఉందనే భావన కలిగిస్తాయి. చాలా గ్యాప్ వచ్చిన ఎం.ఎస్. రాజు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారనిపించేలా చేస్తాయి. అయితే, వచ్చిన చిక్కల్లా... థియేటర్లు పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితుల్లో... ఎన్నిసార్లు చూస్తే, అన్నిసార్లు డబ్బులు కట్టి చూసే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో, టెక్నికల్ ఇబ్బందులుండే కొత్త ‘ఎనీ టైమ్ థియేటర్’ (ఏ.టి.టి.) యాప్‌లో సినిమా రిలీజు చేయడం! అది ఈ సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి. కొసమెరుపు: ఎంగేజింగ్ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ ఆలోచింపనివ్వని కథనం ప్రధాన పాత్రధారుల నటన, రీరికార్డింగ్ ప్రొడక్షన్ విలువలు, చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు: పిల్లాపాపలతో చూడలేని అడల్ట్ సీన్లు క్యారెక్టరైజేషన్లో ఎగుడుదిగుళ్ళు పెద్దగా పరిచయం లేని నటీనటులు. – రెంటాల జయదేవ -
ప్రేమకథతో... పడేసావే
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘పడేసావే’, తారాగణం: కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, జహీదా శామ్, విశ్వ, నరేశ్ మాటలు: కిరణ్, పాటలు: అనంత్ శ్రీరామ్ సంగీతం: అనూప్ రూబెన్స్ కళ: పురుషోత్తమ్ స్టంట్స్: వెంకట్ కెమేరా: కన్నా కూనపరెడ్డి ఎడిటింగ్: ధర్మేంద్ర కె నిర్మాణం: అయన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చునియా రిలీజ్: 26 ఫిబ్రవరి ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ‘చండీరాణి’ని రూపొందించడం ద్వారా అరుదైన దక్షిణాది మహిళా డెరైక్టర్‌గా పేరుతెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి - మన భానుమతి. కానీ, అప్పటి నుంచి గడచిన 60 ఏళ్ళ పైచిలుకు కాలంలో తెలుగులో వచ్చిన మహిళా దర్శకులు మాత్రం పట్టుమని పదిమంది కూడా లేరు. చాలాకాలం తరువాత ఇప్పుడు చునియా ఆ జాబితాకెక్కారు. తొలి చిత్రం ‘పడేసావే’తో మన ముందుకు వచ్చారు. కె. రాఘవేంద్రరావు లాంటి ప్రముఖ దర్శకుల దగ్గర సహాయకురాలిగా పనిచేసి, టీవీ సీరియల్స్ దర్శకురాలిగా అనుభవం సంపాదించి, అన్నపూర్ణా స్టూడియోలో నాగార్జునకు కుడిభుజంగా నిలిచిన చరిత్ర చునియాది. అందుకే, నాగ్ సహాయ సహకారాలు పుష్కలంగా అందుకొని, ‘యాన్ అక్కినేని నాగార్జున ఎంకరేజ్మెంట్’ అంటూ ఇప్పుడీ ‘పడేసావే’ను తెర మీదకు తెచ్చారు. టైటిల్ సూచిస్తున్నట్లే - ఇదో ప్రేమకథ. కాకపోతే, స్నేహానికీ, ప్రేమకూ మధ్య సాగే కన్ఫ్యూజన్లను ఆధారంగా చేసుకొని అల్లుకున్న ఒక ముక్కోణపు ప్రేమ కథ. కార్తీక్ (కార్తీక్‌రాజు) పనికిరాని వస్తువులతో కళాత్మకంగా బొమ్మలు సృష్టించే జంక్ ఆర్టిస్ట్. తల్లితండ్రులు (నరేశ్, అనితా చౌదరి)లకు ఇష్టం లేకపోయినా, ఆ పని చేస్తుంటాడు. స్నేహితురాలైన ఎదురింటి అమ్మాయి నీహారిక (నిత్యాశెట్టి) హీరోను ప్రేమిస్తుంది. అయితే, హీరో మాత్రం నీహారికకు ఆప్తమిత్రురాలైన స్వాతి (జహీదా శామ్)ని ప్రేమిస్తాడు. సినీ నటి తార (రాశి)కి కూతురైన స్వాతికి వ్యాపారవేత్త అయిన మరో అబ్బాయితో పెళ్ళి కుదురుతుంది. మొదటి గంటలో ఈ వ్యవహారమంతా ఎస్టాబ్లిష్ చేశాక, అక్కడ నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. అప్పటికే పెళ్ళి కుదిరిన స్వాతికి సినీ నటి అయిన తన తల్లి అంటే కోపం. ఆ కోపాన్ని పోగొట్టి, వారిద్దరినీ దగ్గర చేస్తాడు హీరో. ఆ తరువాత ఆమె పెళ్ళి చేసుకోబోతున్న అబ్బాయి మంచివాడు కాదన్నదీ బయటకొస్తుంది. అలా కొన్ని సీన్లతో స్వాతికి హీరో దగ్గరవుతాడు. మనసులో ఆమెకూ హీరో మీద ప్రేమ పుడుతుంది. కానీ, అప్పటికే కుదిరిన పెళ్ళి, ఆప్తమిత్రురాలి స్నేహం, హీరోను తన మిత్రురాలే ప్రేమిస్తుండడం లాంటివన్నీ బంధనాలవుతాయి. మరోపక్క హీరోకూ తనను ప్రేమించే నీహారిక, తాను ప్రేమించే అమ్మాయిల మధ్య ఊగిసలాట. ఈ ముక్కోణపు ప్రేమకథ చివరకు ఎన్ని మలుపులు తిరిగింది? ప్రేమ, స్నేహం మధ్య బంధాలు ఎలా అతలాకుతలమయ్యాయి? హీరో ఇంతకీ ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? లాంటివన్నీ ఓపికగా చూడాల్సిన మిగతా సినిమా. సీరియల్ తరహా స్క్రీన్‌ప్లేతో ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్విస్ట్‌తో నడిచే ఈ సినిమాలో చాలా సీన్లున్నాయి. ఒకదాని తరువాత మరొకటిగా అవన్నీ వస్తున్నప్పుడు నిడివితో సంబంధం లేకుండా చాలా పెద్ద కథే చెప్పారని అనిపిస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ రాజు కుమారుడైన కార్తీక్ రాజు, ఒకప్పుడు ‘దేవుళ్ళు’లో బాలనటిగా పేరు తెచ్చుకొని, ఇప్పుడు తొలిసారిగా కథానాయిక పాత్ర పోషించిన హైదరాబాద్ అమ్మాయి నిత్యాశెట్టి, అలాగే జహీదా శామ్ - ఈ ముగ్గురూ తమ శక్తి మేరకు నటించారు. వారెవరూ ప్రేక్ష కులకు పెద్దగా పరిచితులు కాకపోవడం సినిమాకు ప్లస్, మైనస్సూ! బాగా చేయడానికి వాళ్ళూ, చేయించడానికీ దర్శకురాలూ బానే శ్రమపడ్డారు. కాక పోతే, దర్శకురాలికీ ఇదే తొలి ప్రయత్నం. ‘దేవుళ్ళు’ మొదలు దాదాపు 20 దాకా సినిమాల్లో బాల నటిగా చేసి, 2 నంది అవార్డులు కూడా అందుకున్న నిత్యాశెట్టి రూపురేఖల్లో కొన్నిసార్లు తొలినాళ్ళ ‘కలర్స్’ స్వాతినిగుర్తు చేస్తారు. యువ కమెడియన్ విశ్వ నుంచి సీనియర్ నరేశ్, ఒకటి రెండు సీన్లలోనే వచ్చే కృష్ణుడు, రెండు సీన్లు - ఒక పాటకు పరిమితమయ్యే అలీ - ఇలా చాలామంది హాస్య నటులను సినిమాలో వినోదం కోసం పెట్టారు. వాళ్ళు కూడా అడపాదడపా నవ్వించారు. కాకపోతే, ఉమన్ డెరైక్టర్ పగ్గాలు పట్టిన ఈ సినిమాలోనూ అలీ గ్యాంగ్‌తో హోటల్ రూమ్‌లో జరిగే ఘట్టం లాంటివి ఉండడం ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఈ సినిమాకు మరో అండ - పేరున్న అనూప్ లాంటి సంగీత దర్శకుడు. కాకపోతే, ఇలా రోజూ వస్తున్న కమర్షియల్ లవ్‌స్టోరీలలో హాలులో నుంచి బయటకొచ్చాక పాటలు గుర్తుండాలని అనుకోకూడదు. సెంటిమెంటల్ గీతం ‘చిట్టితల్లీ చిన్నితల్లీ నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి...’, తల్లీ కూతుళ్ళ మధ్య దూరం లాంటి ఎపిసోడ్లు మహిళల్ని ఆకట్టుకొంటాయని ఆశించాలి. ‘ప్రేమ చెప్పి రాదు... చెప్పినా పోదు’ తరహా పంచ్ డైలాగులు, విశ్లేషణల్ని కూడా ఈ సినిమాలో వీలున్నచోటల్లా పెట్టారు. ఇక, ఇతర సాంకేతిక విభాగాల పనితనం కూడా ఈ పరిమిత బడ్జెట్ ప్రేమకథకు సరిపడేవే. ఇది తొలి సినిమానే కాబట్టి, దర్శకురాలు చునియా నుంచి మరీ అతిగా ఆశించడం పొరపాటు. మొన్నటి వరకు సీరియల్స్‌కు అలవాటుపడిన ఆమె భవిష్యత్తులో రచనా విభాగంపై ఇంకా దృష్టి పెట్టి, మరింత పకడ్బందీ కథ, వేగవంతమైన కథనంతో ముందుకొస్తారని ఆశించవచ్చు. కొత్తవాళ్ళను ప్రోత్సహించాలన్న హీరో నాగార్జున తదితరులలానే ప్రేక్షకులు కూడా సహృదయంతో చూసి, రావాల్సిన సినిమా ‘పడేసావే’. - రెంటాల జయదేవ -
విశ్వజయం
విశ్వాన్ని జయించడానికి జయలక్ష్మి లాంటి సహచరి కావాలి. జయాన్ని విశ్వమంతా గుర్తించాలంటే విశ్వనాథ్ లాంటి మార్గదర్శి కావాలి. విశ్వజయానికి ప్రేమ కావాలి. స్వచ్ఛమైన ప్రేమ కావాలి. దిసీజ్ ది స్టోరీ ఆఫ్ టు సోల్‌మేట్స్. ఈ దంపతుల ప్రేమలో ఆత్మ ఉంది. అయినా... ఆత్మీయమైన ప్రేమకు ఒక రోజెలా సరిపోతుంది? అందుకే ‘ప్రేమికుల రోజు’, ‘వరల్డ్ మ్యారేజ్ డే’ లాంటివి లాంఛనాలు మాత్రమే. * ఆదిదంపతుల లాంటి మీకు నమస్కారమండీ! విశ్వనాథ్ గారూ! ఏమిటీ గడ్డం పెంచారు? కొత్త సినిమా గెటప్పా? కె. విశ్వనాథ్: అదేమీ లేదండీ! (సరదాగా...) ఈ గడ్డం చూసైనా, కొత్త తరహా వేషాలు వస్తాయేమోనని! జయలక్ష్మి: (నవ్వేస్తూ) ఆ..అదొకటి కూడానా! (నవ్వులు) విశ్వనాథ్: ఈ 19న నా బర్తడేకైనా తీసేయమని గొడవ! * ఇంతకీ, మీ పెళ్ళి తేదీ గుర్తుందా? జయలక్ష్మి: (అందుకుంటూ...) నా పుట్టినరోజు వినాయక చవితి. ఇక, మా పెళ్ళి రోజు అక్టోబర్ రెండో తేదీ. * పెళ్ళైన తొలినాళ్ళు, కొత్తకాపురం సంగతులు గుర్తున్నాయా? జయలక్ష్మి: అప్పుడు నాకు 14 ఏళ్ళు. ఆయనకు 19 ఏళ్ళు. నేను పదో తరగతి చదువుతుండగానే పెళ్ళయింది. ఆ తరువాత కాపురానికొచ్చేశాను. మద్రాసుకు వచ్చిన కొత్తల్లో వడపళని దగ్గర చిన్న ఇంట్లో ఉన్న రోజులు గుర్తే! విశ్వనాథ్: (నవ్వుతూ) అప్పట్లో సౌండ్‌రికార్డిస్ట్‌గా నా జీతం 75 రూపాయలు. చాప వేసుకొని పడుకొంటే, చేతికి చెప్పుల స్టాండ్ తగిలేంత చిన్న అద్దె గది. దానికి రూ. 20 అద్దె. ఆ గదికి ముందు కొబ్బరాకులతో చిన్న వరండా లాంటిది వేస్తే బాగుంటుందనుకొనేవాణ్ణి. చివరకు మా ఓనర్ వేయించాడు. కాకపోతే, మరో 5 రూపాయలు అద్దె పెంచాడు (నవ్వులు...). అక్కడ దానికి ఆనుకొని తోటమాలి ఉండేవాడు. అతనికి ఓ కూతురు. పిచ్చిది. జయలక్ష్మి: ఆ అమ్మాయి పేరు ఇంద్రాణి! నాకు గుర్తే! విశ్వనాథ్: మా నాన్న గారు వాళ్ళు మా ఆవిడను కాపురానికి తీసుకొని బెజవాడ నుంచి మద్రాసుకు ‘మెయిల్’లో ఉదయాన్నే వచ్చారు. చెక్క భోషాణంలో సరుకులు, సామాన్లు అవీ తీసుకొచ్చారు. కానీ నాన్న గారితో ఇంటి సంగతులు చెప్పి ఇబ్బంది పడతారని ‘వెంటనే వెళ్ళిపొమ్మన్నా’. ఉదయం కాపురానికొచ్చిన మా ఆవిడ వాళ్ళు ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు (నవ్వు). జయలక్ష్మి: తర్వాత మళ్ళీ వచ్చాం లెండి! విశ్వనాథ్: ఇల్లంటే బెజవాడలో పెరిగిన రోజులు గుర్తుకొస్తాయి. కృష్ణలంకలో తాడికొండవారి తోటలో మా ఇల్లు. అప్పట్లో అగ్నిప్రమాదాలు, కృష్ణానదికి వరదలెక్కువ. ఏది జరిగినా ఇంట్లో నుంచి సామాన్లన్నీ తీసుకొని, కట్ట మీదకొచ్చి, కాలక్షేపం చేసేవాళ్ళం. మా తర్వాతే నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలొస్తే తనే! పెద్దవాళ్ళను చూసుకొనేదీ తనే! ఏడాదిలో 8 నెలలు బెజవాడలో, 4 నెలలు మద్రాసులో! * మరి, మిస్సయిన ఫీలింగ్ ఉండేదా? జయలక్ష్మి: ఎప్పుడూలేదు. అత్తమామల సేవలో తృప్తుంది.చల్లగావున్నామంటే వారి ఆశీర్వాదం. విశ్వనాథ్: అప్పట్లో నైట్ షూటింగ్స్ ఎక్కువ. రికార్డిస్ట్‌గా రాత్రంతా పనిచేసి, ఉదయాన్నే స్టూడియో క్యాంటీన్లో టిఫిన్ చేసొచ్చి, రూమ్‌లో పడుకొనేవాణ్ణి. సాయంత్రమే లేవడం! మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. లేవగానే స్నానం చేసి, స్టూడియోకి. వేరే ధ్యాసే లేదు. జయలక్ష్మి: సేవ చేసేది పరాయివాళ్లకని అనుకోలేదు. మా అత్తగారికి ఆయన కన్నా నా మీదే నమ్మకముండేది. విశ్వనాథ్: పెళ్లయిన ఎనిమిదేళ్లకు మాకు పిల్లలు పుట్టారు. నేను అన్నపూర్ణా సంస్థలో చాకిరీ చేస్తున్న రోజులవి. మా మొదటి సంతానం... అమ్మాయి పుట్టింది. విజయవాడలో అమెరికన్ ఆసుపత్రిలో డెలివరీ. మా మేనమామ అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేస్తే, వెళ్ళా. ఆరోగ్యం బాలేని పసిగుడ్డుని ఒళ్ళో పెట్టుకొని, ‘చంద్ర శేఖరాష్టకం’ చదువుకుంటూ మా ఆవిడ కనిపించింది. అప్పుడు ‘వెలుగు నీడలు’ రీరికార్డింగ్ జరుగుతోంది. రీరికార్డింగ్ నోట్స్ నా దగ్గరే ఉంది. నేను దర్శకుణ్ణి కాకున్నాసరే వెంటనే మద్రాసెళ్ళిపోయా. దాన్ని మూర్ఖత్వమనుకోవాలి! ఆమె మాత్రం ఏమీ అనుకోలేదు. * ఫలానా చేయలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ ఏమైనా ఉందా? విశ్వనాథ్: స్కూల్ ఫైనలయ్యాక చదువుతానంటూ అప్పట్లో మా ఆవిడ ఉత్తరం రాసింది. పరిస్థితుల వల్ల కంటిన్యూ చేయించలేదు. అదే ఇప్పటికీ నాకు పెద్ద గిల్టీ. జయలక్ష్మి: నాకు బాధేమీ లేదు. టెన్త్ వరకే చదివినా, ఇప్పటికీ గుర్తే. మనవరాళ్ళు చదువుతుంటే నేను సరిదిద్దుతా. ‘ఇవన్నీ తెలుసా బామ్మా!’ అని ఆశ్చర్యపోతుంటారు. * మీ చిన్నప్పటి కబుర్లు, స్కూలు విషయాలు చెప్పండమ్మా? జయలక్ష్మి: మాది కైకలూరు. మా పుట్టింటి వారు ‘బందా’ వారు. ప్రముఖ రంగస్థల కళాకారులు బందా కనకలింగేశ్వరరావు మాకు దాయాదులే! నాన్న గారు, బాబాయి అప్పట్లో ఇక్కడ హైదరాబాద్‌లో నిజామ్ వారి రైల్వేస్‌లో పనిచేసేవారు. రజాకార్ల ఉద్యమ సమయంలో కైకలూరు వచ్చేశారు. తర్వాత అన్నయ్య చదువుకి బందరు మారాం. అక్కడ లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివా. * మీ పెళ్ళెలా కుదిరింది? అయినవాళ్ళ సంబంధమా? జయలక్ష్మి: (నవ్వుతూ) లేదు. బయట సంబంధమే! అదో కథ. అన్నయ్య పెళ్లి చేసుకున్న వారి వైపు నుంచి ఒక సంబంధం వచ్చింది. అంతా సిద్ధమనుకున్నాక, తీరా అది తప్పిపోయింది. అప్పుడీయనతో పెళ్ళి జరిగింది. విశ్వనాథ్: నాదీ ఓ పిట్టకథ ఉంది. ప్రసిద్ధ ఓరియంటల్ పబ్లిషింగ్ కంపెనీకి విజయవాడ మేనేజర్‌గా మా మేనమామ పనిచేసేవారు. మంచి మనిషి. వాళ్ళ యజమానికి ముగ్గురు కూతుళ్ళు. ఆ రోజుల్లోనే కోట్ల ఆస్తి. రెండో అమ్మాయిని చూడడానికి తెనాలి తీసుకెళ్ళాడు మా మేనమామ. తీరా చేసుకోనంటే, మామయ్య చెడతిట్టాడు. నా చిత్రాల్లో ‘సాక్షి’ రంగారావు పాత్రల స్వభావం ఆయనదే! * సంసారం నడుపుకోవడం, మంచీచెడు ఎలా నేర్చుకున్నారు! విశ్వనాథ్: ఏదైనా పొరపాటు చేద్దామన్నా ‘నాన్న గారేమంటారో, అమ్మేమంటుందో’ అనే భయం ఉండేది. డిసిప్లిన్డ్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీవ్యాల్యూస్తో పెరిగాం. ‘తల్లి తండ్రుల్ని ప్రేమించవలె’నని ప్రత్యేకించి నీతులు చెప్పక్కర్లేదు. జయలక్ష్మి: మన ప్రవర్తన బాగుంటే పిల్లలూ ఆ దోవలోనే. అత్తమామల్తో వచ్చేపోయే చుట్టాలతో సర్దుబాటెలా ఉండేది? జయలక్ష్మి: బంధువుల్ని చూస్తే పిల్లలకు ఆనందం! బంధువులెవరైనా వచ్చివెళ్ళిపోతుంటే, దిగులు వాళ్ళకు! ‘వెళ్లద్దు మావయ్యా’ అని ఆప్యాయత చూపేవారు. కానీ, అంతమందికి వండడం, వడ్డించడం... జయలక్ష్మి: కష్టం అనుకుంటే కష్టం, ఆనందం అనుకుంటే ఆనందం. కలసి పని చేసుకునేవాళ్లం. * వంటలో ఆయనెప్పుడైనా సాయం చేసేవారా? జయలక్ష్మి: వంట చేయడం నామోషీ కాదు. మా మామ గారు వంటలో సాయం చేసేవారు. ఈయనా కూరలు తరగడంలో సాయపడతారు. అదేగా దాంపత్యమంటే! * తరాలతో ప్రేమ, పెళ్లి మీద అభిప్రాయాలు మారుతున్నాయి! జయలక్ష్మి: ఎప్పుడూ ప్రేమలు, పెళ్లిల్లూ ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయండి ఈ ప్రపంచంలో. భార్యలను కొట్టే మొగుళ్లున్నారు, ప్రేమగా చూసుకునే వారున్నారు. తల్లితండ్రులు కొట్టుకుంటుంటే పిల్లలూ అలాగే తయారవుతారు. * విశ్వనాథ్ గారికి ఒక్కోసారి కాస్తంత కోపం ఎక్కువేమో! జయలక్ష్మి: అబ్బే లేదండీ! అది చీకాకు. పని అనుకున్నట్లు జరగకపోతే వస్తుంది. వచ్చినా ఒక్క క్షణమే! * భార్యాభర్తలకు సరిపడకపోయినా కాపురం చేయాలా? విశ్వనాథ్: అవసరం లేదు. రోజూ తిట్టుకొని, కొట్టుకొనే కన్నా ఆ బంధం నుంచి బయటకొచ్చేయచ్చు. ‘మాంగల్యానికి మరో ముడి’ సినిమాలో అదే చెప్పా. జయలక్ష్మి: సరైన కారణాలుంటే సరే. ప్రతి చిన్నదానికీ విడాకులొద్దు. పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రం కుదర్దు. విశ్వనాథ్: మహిళలు బాధ్యతలన్నీ నిర్వర్తించడం నాట్ ఎ జోక్. అందుకే సినిమాల్లో స్త్రీలని ఉన్నతంగా చూపిస్తా. మ్యారీడ్ కపుల్‌పై లవ్‌స్టోరీ తీయాలని ఇప్పుడనిపిస్తోంది. జయలక్ష్మి: అవును... ఇంత జీవితం చూసిన తర్వాత ఇదివరకటి కన్నా ఇప్పుడే బాగా తీయగలరు కూడా! (నవ్వులు) * మీరు ఎప్పుడైనా షూటింగ్‌లకు వెళ్లేవారా? జయలక్ష్మి: ఏముందనక్కడ ఇల్లు వదిలేసి వెళ్లడానికి! పిల్లలకీ అదే అలవాటైంది. ఆయన సినిమాలేస్తే చూసేవాళ్ళం. * ఆయనలో మీకు నచ్చని అంశం ఏదైనా ఉందా? జయలక్ష్మి: నచ్చని అంశం ఏమీ లేదు కానీ, ఆయనకు డబ్బు విషయంలో శ్రద్ధ తక్కువ. అదే చెబుతుంటాను. విశ్వనాథ్: అది నిజం. యావ లేదు, శ్రద్ధా తక్కువే. లేకపోతే కోట్లు కూడబెట్టేవాళ్ళం! అయినా తృప్తిగా ఉన్నాం. నలుగురొస్తే అన్నం పెట్టగలుగుతున్నాం. ఇంకేం కావాలి! * మరి మీరు మీ శ్రీమతికి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి? విశ్వనాథ్: ఐ హ్యావ్ గివెన్ హర్ త్రీ గుడ్ చిల్డ్రన్. జయలక్ష్మి: (నవ్వుతూ) ఇంకేం కావాలి.. పిల్లలు బంగారం! విశ్వనాథ్: మా కోడళ్ళు అంతకన్నా బంగారాలు! * అది సరే! మీరెప్పుడైనా మీ శ్రీమతికి చీరలు కొని తెచ్చేవారా? జయలక్ష్మి: (అందుకుంటూ) తెచ్చినా, నాకు నచ్చేది కాదు! విశ్వనాథ్: (నవ్వుతూ) నాకు ఆలివ్ గ్రీన్ రంగు ఇష్టం. వాళ్ళేమో దాన్ని పాచి రంగనేవారు. ఒకసారి మద్రాస్‌లో చీర కొని, బెజవాడ తీసుకెళ్ళా. చీర చూడగానే ‘ఎంత’ అంది మా ఆవిడ. ‘నాలుగువేలు’ అని చెప్పగానే ‘అంత ధర కనబడట్లేదే చీరలో’ అనేసింది. నా గాలి పోయింది! * అప్పట్లో అత్తా కోడళ్లు అంటే అమ్మా కూతుళ్లలా ఉండేవారా? జయలక్ష్మి: అప్పుడైనా ఇప్పుడైనా అలాగే ఉండాల్సింది! విశ్వనాథ్: నా సినిమాల్లో కూడా అలాగే చూపించేవాడిని. * మీ మధ్య ఎప్పుడైనా, ఏదైనా విషయంలో గొడవలు? విశ్వనాథ్: ఇప్పటివరకూ ఎలాంటి గొడవలూ లేవు, రావు! జయలక్ష్మి: మీరెన్ని రాసినా రావు (నవ్వులు...)! * విశ్వనాథ్ గారూ! ఇలాంటి జీవిత భాగస్వామి దొరకడం...? విశ్వనాథ్: నిజంగా నా అదృష్టం. జయలక్ష్మి: సేమ్ టు సేమ్. ఇది నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం. ఆయన బింబం... నేను అద్దంలో కనిపించే ప్రతిబింబం. ఏ తేడా లేదు. సాక్షి: అభిమాన దేవుళ్ళ నుంచి మీకు శతమానం భవతి. - రెంటాల జయదేవ విశ్వనాథ్: పెద్ద నగ కొంటే, డైమండ్ రింగ్ కొనిస్తేనే ప్రేమ అనుకోకండి. మా నాన్న గారు అప్పట్లో వాహినీ పిక్చర్స్‌లో ఫిల్మ్ రిప్రెజెంటేటివ్. ఆయన జీతం నెలకు 24 రూపాయలు. రోజుకు రూపాయి పావలా బేటా. ఎన్ని టూర్లకు వెళ్ళినా, ఆ కొద్ది మొత్తంలోనే జాగ్రత్తగా మిగిల్చి, తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మకు కచ్చితంగా చీర తెచ్చేవారు. మాకు చాక్లెట్లు తెచ్చేవారు. మలబార్‌కు వెళ్ళినప్పుడు ఆవకాయ ముక్కలు కోసే కత్తి పట్టుకొస్తే, పెద్ద విషయం. నాకు మూడుచక్రాల సైకిల్ కొన్నారు. అదే మాకు రోల్స్‌రాయిస్ కారు! ప్రేమ, వాత్సల్యానికి ప్రతిరూపాలైన వాటికి విలువెవరు కట్టగలరు! విశ్వనాథ్: భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పరం నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికుల దినం, వైవాహిక దినం - అని ఏడాదికి ఒక రోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు. జయలక్ష్మి: ప్రేమ ఉన్నప్పుడు ఏదీ తప్పుగా అనిపించనే అనిపించదు. ఏమైనా, డబ్బు వల్ల సమస్యలొస్తాయి. అతిగా కోరికలు లేకుండా, ఉన్నదాంట్లో తృప్తి పడితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ‘కోరికలు దుఃఖహేతువులు’ అని బుద్ధుడు ఏనాడో చెప్పాడు కదా! (నవ్వులు...) -
బస్‌లో... స్పీడున్న హీరో
కొత్త సినిమా గురూ! చిత్రం- ‘స్పీడున్నోడు’ మూలకథ- ప్రభాకరన్ కెమేరా- విజయ్ ఉలగనాథ్ యాక్షన్- రవివర్మ సంగీతం- డి.జె. వసంత్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత- వివేక్ కూచిభొట్ నిర్మాత- భీమనేని సునీత స్క్రీన్‌ప్లే- దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్‌రావు ‘‘తప్పుడు ఫ్రెండ్స్ ఉండవచ్చేమో కానీ, ఫ్రెండ్షిప్ ఎప్పుడూ తప్పు కాదు!’’ ‘స్పీడున్నోడు’లో ఒక డైలాగ్ ఇది. ఈ చిత్రకథ, హీరో పాత్ర స్వభావం బేసిగ్గా ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్నవే. స్నేహం, ప్రేమ, పగ, ద్వేషం, ద్రోహం - దీనికి మూలస్తంభాలు. తమిళ హిట్ ‘సుందర పాండియన్’ (2012)కి ఇది రీమేక్. ఇదే కథ కన్నడంలో ‘రాజా హులి’ (2013) పేరిట రీమేకై, అక్కడా సక్సెసైంది. రీమేక్‌లకు మారుపేరైన భీమనేని శ్రీనివాస్‌రావు ఆ మ్యాజిక్‌ను తెలుగులో క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. తమిళంలో పల్లెటూళ్ళ నేపథ్యంలోని ఈ కథను తెలుగులో రాయలసీమకి మార్చారు. రాప్తాడు, వెంకటాపురం అనే రెండు గ్రామాల మీదుగా పక్కనే ఉన్న పట్నానికి ఓ ఆర్టీసీ బస్సు వెళుతుంటుంది. పట్నం వెళ్ళి చదువుకొనే స్టూడెంట్స్ ప్రేమలకు కారణమైన ‘ప్రేమపావురం’ ఆ బస్సు. రాప్తాడు ప్రెసిడెంట్ వీరభద్రప్ప (ప్రకాశ్‌రాజ్). అతని కొడుకు శోభన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). డిగ్రీ అయి, నాలుగేళ్ళయినా జాలీగా ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తుంటాడు. అతనికి ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం. స్నేహితుల ప్రేమ నిలబెట్టడా నికి ఎన్ని ట్రిక్కులైనా వేస్తాడు. ఇక, వెంకటాపురం పెద్దమనిషి (రావు రమేశ్) కూతురు వాసంతి (సోనారిక). ఆమె ప్రేమను పొందడానికి హీరో ఫ్రెండ్ గిరి అలియాస్ రబ్బరు గాడు (మధునందన్), పక్క ఊరి చిట్టి (సత్య) పోటీలు పడుతుంటారు. మరోపక్క హీరోయిన్‌కు బావ వరసయ్యే జగన్ (కబీర్ దుహాన్ సింగ్) ఆమెను పెళ్ళాడాలనుకుం టాడు. తీరా హీరోయినేమో హీరోనే ప్రేమిస్తున్నానంటుంది. సెకండాఫ్‌కొచ్చేసరికి, హీరోయిన్ని ప్రేమించిన చిట్టి మళ్ళీ బస్సులో గొడవపడ్తాడు. అక్కడో ఘటనతో కథలో ట్విస్ట్. తర్వాతి మలుపులన్నీ తెరపై చూడాల్సిన మిగతా కథలోని అంశాలు. పేరున్న నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన హీరో శ్రీనివాస్‌కిది రెండో సినిమా. ‘అల్లుడు శీను’లానే ఈసారీ మాస్‌ని ఆకట్టుకొనేందుకు తపించారు. పాటలు, ఫైట్లు - అన్నిటిలో ఆ శ్రమ కనిపించింది. ఇక, ఆ మధ్య ‘జాదూగాడు’లో, ఇప్పుడు ఇందులో మెరిసిన హీరోయిన్ సోనారికది బస్సుకూ, పాటలకూ పరిమితమైన అందం. సినిమా నిండా భారీ తారాగణం ఉంది. హీరో మిత్ర బృందంలో శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్ - ఇలా చాలామంది కనిపిస్తారు. ఇల్లరికపు అల్లుళ్ళుగా పృథ్వి, పోసాని నవ్విస్తారు. ‘అల్లుడు శీను’లానే ఇందులోనూ తమన్నా ఐటవ్ుసాంగ్ చేశారు. ఇన్ని హంగు లున్న సినిమాగా ‘స్పీడున్నోడు’లో నిర్మాణవిలువలు పుష్కలం. సంగీతం, రీరికార్డింగ్ ల్లోనూ మాస్‌ని దృష్టిలో పెట్టుకొన్నారు. భీమనేని, ప్రవీణ్‌వర్మ రాసిన డైలాగ్స్ పేలాయి. రెండున్నర గంటల పైచిలుకు సినిమాలో - ఫస్టాఫ్ అంతా హీరోల ఫ్రెండ్స్, మందు పార్టీలు, బస్సులో ప్రేమతో అక్కడక్కడే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడందు కుంటుంది. ఊహించని ట్విస్టులూ వస్తాయి. నిజానికి, హీరోయిన్ పదో తరగతిలో ఉన్న ప్పుడే హీరో ఆమెను ప్రేమించాడనీ, ఆమె కాదనేసరికి అప్పట్లో వదిలేశాడనీ చూపిస్తారు. అలాగే, హీరోయిన్‌పై బావ మోజు కానీ, వాళ్ళిద్దరూ బంధువులని కానీ ఆ బావకి బాగా ఫ్రెండైన హీరోకు చివరి దాకా తెలియదంటారు. అవన్నీ కన్వీయంట్ స్క్రీన్‌ప్లే. తమిళ కథను యథాతథంగా తీసినా, హీరోయిజమ్ కోసం, తెలుగు వారికి అలవాటైన స్టైలిష్ టేకింగ్ కోసం మార్పులు అనివార్యమని దర్శక నిర్మాతలు ఫీలవ డం అర్థం చేసుకోవాలి! ‘కొట్టింది ఫ్రెండ్ అయితే, అరుపు బయటకు వినిపించకూడదు’ అని తమాషాగా ముగు స్తుందీ సినిమా. అక్షరాలా ‘స్పీడున్నోడు’ అరుపులు వినిపించని సెలైంట్ కిల్లర్! - రెంటాల జయదేవ -
సీతమ్మ ప్రేమ... రామయ్య క్రికెట్
చిత్రం: ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’ తారాగణం: రాజ్‌తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, సురేఖావాణి, శ్రీలక్ష్మి కెమేరా: విశ్వ డి.బి ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్ సంగీతం: గోపీ సుందర్ నిర్మాతలు: ఎస్. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి రచన - దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి కుటుంబాన్ని హీరో ఎదిరించడం, ఆ అమ్మా యిని పెళ్ళి చేసుకోవడం కోసం ఒక పందెంలో నిలవడం, అష్టకష్టాలూ పడి ఆఖరుకు గెలవడం - ఈ స్కీమ్ ఆఫ్ ఈవెంట్స్, సీన్లు సినిమాకు కొత్త కావు. ఆ పందెం ఏదో క్రికెట్, కబడ్డీ లాంటి ఆటల చుట్టూ తిరిగితే? అప్పుడెప్పుడో హిందీ ‘లగాన్’ వచ్చినప్పటి నుంచి ఆటల్నీ, ఇలా ప్రేమనీ ముడిపెట్టడం పెరిగింది. జగపతిబాబు ‘కబడ్డీ కబడ్డీ’ లాంటివన్నీ ఆ తాను ముక్కలు. ఆ ఛాయలతోనే ఇప్పుడు వరుస హిట్స్‌లో ఉన్న యువ హీరో రాజ్ తరుణ్‌తో వచ్చింది ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’. అనగనగా ఒక ఊరు... రామచంద్రాపురం. ఆ ఊళ్ళో రామ్ (రాజ్ తరుణ్), ఊరి ప్రెసిడెంట్ (రాజా రవీంద్ర) వాళ్ళమ్మాయి సీతామాలక్ష్మి (నూతన పరిచయం అర్తన) చిన్నప్పటి ఫ్రెండ్స్. చిన్నప్పుడే సీత కోసం చదివే స్కూల్ మారిన రకం రామ్. పెద్దయ్యాక అది అతనిలో పిచ్చి ప్రేమగా మారుతుంది. చిన్నప్పుడే చదువు కోసం సిటీ వెళ్ళిపోయి, ఎం.బి.బి.ఎస్. చేస్తున్న సీత పెద్దయ్యాక ఊరికి వస్తుంది. ఇంటర్ కూడా పాస్ కాక, డింకీలు కొడుతూ, ఫ్రెండ్స్‌తో సిగరెట్టు, మందుతో కాలం గడిపే హీరో ఇక హీరోయిన్‌కు తన ఇష్టం వ్యక్తం చేసి, ఆమెను ప్రేమలో పడేసే పనిలో పడతాడు. అంతా ఓకే అవుతోందనుకున్న టైమ్‌లో ఎంతసేపూ ప్రేమని పండించుకొనే పనిలో పడతాడు. మామూలు సినిమాల్లో అయితే, అమ్మాయి సరేనంటుంది. కానీ, ఇక్కడ హీరోయిన్ ఛీ కొడుతుంది. ట్విస్ట్. ఇక సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కాసింత కథా తెరపై చూపించాల్సి వచ్చేస్తుంది. దాంతో, సినిమా తప్పక వేగం పుంజుకుంటుంది. గుడిలో పల్లకీ మోసి, నిప్పులగుండంపై నడిచిన హీరోపై ఆటోమేటిగ్గా ప్రేమ పుడుతుంది. తీరా అదే టైవ్ుకి హీరోయిన్‌కి మరో అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ చేస్తాడు తండ్రి. హీరోలు, క్రికెటర్ల దగ్గరే డబ్బంతా ఉంటుంది కాబట్టి, ఒక క్రికెటర్‌కి అమ్మాయినిచ్చి చేయాలనుకుంటాడు. ఇంకేం.. హీరో వెళ్ళి ఆ క్రికెటర్‌తో ఢీ అంటాడు. క్రికెట్లో తమపై గెలిచి, ప్రేమను గెలుచుకోమని అతను హీరోకి సవాలు విసురుతాడు. చిన్నప్పుడెప్పుడో తన వల్ల హీరోయిన్ ముఖానికి బంతి తగిలిం దని క్రికెట్‌నే వదిలేసిన హీరో- మళ్ళీ ఈ పందెం కోసం బ్యాట్ పడతాడు. ఊళ్ళోని మిత్ర బృందం తోడవుతుంది. అక్కడ నుంచి క్రికెట్ మైదానంలో జరిగే పందెం కథ ఏమిటో ఊహించుకోవచ్చు. రాజ్‌తరుణ్ ఎప్పటిలానే అలవాటైన నటన చూపారు. అతనిలోని నటుడికి ఛాలెంజింగ్ అనిపించే సీన్ల కోసం స్క్రిప్ట్‌లో వెతకకూడదు. హీరోయిన్గా అర్తన తన నిజ జీవిత వయసుకు తగ్గట్లే చిన్న పిల్లలా ఉన్నారు. కొత్తమ్మాయి కాబట్టి, అతిగా అభినయం ఆశించడం తప్పు! హీరో మిత్ర బృందంలోని నటులు, ముఖ్యంగా అంజి పాత్రలో ‘షకలక’ శంకర్ కొన్నిచోట్ల నవ్విస్తారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబిం బించే ఆ వినోదాత్మక దృశ్యాలు, మాటలు చూసేసినవే అయినా ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. హీరో తల్లితండ్రులుగా దర్శకుడు ఎన్. శంకర్, సురేఖావాణి కనిపిస్తారు. గోపీ సుందర్ బాణీల్లో సెకండాఫ్ మాంటేజ్ పాటలు వినడానికీ, చూడడానికీ కూడా బాగున్నాయి. తొలి చిత్ర దర్శకుడైన శ్రీనివాస్ గవిరెడ్డి ప్రేక్షకులకు అలవాటైపోయిన కథనే ఎంచుకు న్నారు కాబట్టి, ఇక కథనం మీదే దృష్టి అంతా! దానికి తగ్గట్లు ఆయన వీలైనన్ని ఎక్కువ సీన్లు రాసుకున్నారు. కాకపోతే, సీన్ వెంట సీన్లోనూ అవే పాత్రలు, పాత్రధారులు. దాంతో ఫస్టాఫ్‌లో కథ అంగుళాల చొప్పున ముందుకు నడుస్తుంది. వినోదం మీద దృష్టి పెట్టారు. ఉన్న కాసింత కథలో కీలక ఘట్టం అంతా సెకండాఫ్‌లోనే! అక్కడా ఆఖరి పావుగంట క్రికెట్మ్యాచ్, రన్నింగ్ కామెంటరీ. హాలులోకి బదులు స్టేడియమ్లోకి వచ్చామేమోనని అనుమానం వస్తుంది. రెండు గంటల మీద కాసేపు నిడివే కాబట్టి, సినిమాలో పాత్రల ప్రవర్తనలో, సన్నివేశాల్లో కార్యకారణ సంబంధం ఆలోచించే వేళ కల్లా సినిమానే అయి పోతుంది. వెరసి, క్రికెట్ గెలిపించిన మరో వెండి తెర ప్రేమకథగా ఈ సినిమా లెక్కల్లో మిగిలిపోతుంది. - రెంటాల జయదేవ -
మేమిద్దరం హీరోలమే!
♦ మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి. భోళా శంకరులు. మీకు... ఈ ‘డిక్టేటర్’ అనే టైటిల్‌కూ... (నవ్వుతూ... అందుకుంటూ...) భోళా శంకరులే డిక్టేటర్లు. అది మా నాన్నగారి నుంచొచ్చింది. పదిమందితో సంప్రతిస్తారు. చివరకు తీసుకొనే నిర్ణయం తీసుకుంటారు. ఆవేశంతో చేయకపోతే, కొన్నిపనుల్చేయలేం. నేనూ అంతే! ♦ ‘సింహ’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’ - ఇలా పవర్ఫుల్ టైటిల్స్‌తో అంచనాలెక్కువవుతాయే! ‘డిక్టేటర్’ టైటిల్ కథ అనుకున్నాక పెట్టినదే. నాకీ టైటిల్‌పై అనుమానమేమీ లేదు కానీ, ‘ఇంత బరువైన టైటిల్ పెడుతున్నాం. కాబట్టి, సబ్జెక్ట్, క్యారెక్టరైజేషన్లో అప్రమత్తంగా ఉందాం’ అని దర్శకుడితో అన్నా. అలాగే అన్నీ కుదిరాయి. ♦ ‘డిక్టేటర్’ నేపథ్యం కూడా కొత్తగా ఉంటుందేమో! ప్రభుత్వం ఎవరిదైనా, సారథులు ఎవరైనా - దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేదంతా కొందరు వ్యాపారవేత్తలే! అలాంటి కుటుంబవ్యక్తిగా కనిపిస్తా. ఢిల్లీ నేపథ్యంలో కథ ఉంటుంది. ♦ రసవత్తరమైన సమకాలీన రాజకీయం ఉందట! ఉంది. కానీ అంతా జనరల్‌గానే తప్ప ఎవర్నీ ఉద్దేశించినది కాదు. ఆనాటి ప్రముఖ నటి రతి అగ్నిహోత్రీ నాతో ఢీ అంటేఢీ అనే పొలిటీషియన్. ♦ ముందుగా హేమమాలినిని అనుకున్నట్లున్నారు! హేమమాలిని, షబనా అజ్మీ- ఇలా చాలా మందిని అనుకున్నాం. కుదరలేదు. ఇంతలో మా డెరైక్టర్ శ్రీవాస్ గారికి రతి పేరు గుర్తొచ్చింది. ఫ్రెష్‌నెస్ ఉంటుందని వెంటనే ఓకె అనేశా. గతంలో మేమిద్దరం ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా చేశాం. ♦ ఈ చిత్రంలో మీతో తొలిసారిగా నటిస్తున్న అంజలిని మహానటి సావిత్రితో పోల్చినట్లున్నారు! అవును. నేనెప్పుడూ నా పాత్రే కాకుండా, నా పక్కన ఉండే పాత్రలు బాగుండాలని చూస్తా. పాత్రధారులు మంచి నటులై ఉండాలని చూస్తా. అప్పుడే కదా... మంచి కెమిస్ట్రీ, టైమింగ్ కుదిరి, సీన్ పండుతుంది. హీరోయిన్లందరినీ అరువు తెచ్చుకుంటున్న రోజుల్లో ఆమె తెలుగమ్మాయి. అటు అందంతో పాటు అభినయం ఉన్న మంచి ఆర్టిస్ట్. ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులం అంతా ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తాం. ♦ మీతో అందరూ భయంగా, గౌరవంగా ఉంటారు కదా! ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఎలా తెస్తారు? సినిమా మొదలుపెట్టినప్పుడు మొదట సెలైంట్‌గా ఉంటా. నాలుగైదు రోజులు అబ్జర్వ్ చేస్తా. లైట్‌బాయ్ నుంచి దర్శకత్వ శాఖ దాకా ఎవరు పనిచేస్తారో, ఎవరు పనిదొంగో గమనిస్తా. పనిమంతుల్ని గుర్తించి, ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పచెబుతాను. షూటింగ్లో టెంపో పెరిగే కొద్దీ, అందరూ లీనమవుతారు. ప్రాజెక్ట్‌లో భాగస్థులమనే ఫీలింగ్ క్రియేటవుతుంది. ♦ కానీ, అందరూ మీరు కోపధారి అంటారెందుకు? నిజజీవితంలో నటించడం నాకు చేతకాదు. పెద్ద విషయాల కన్నా చిన్న చిన్నవాటికే నాకు కోపమొస్తుంది. ‘క్రీమ్ ఆఫ్ ఎయిటీస్’ అని నేను, చిరంజీవి, వెంకటేశ్, అలాగే దక్షిణాది తారలు రజనీకాంత్, మోహన్‌లాల్, సుహాసిని, కుష్బు - ఇలా చాలామందిమి సరదాగా కలుస్తుంటాం. వ్యక్తిగత హోదాలన్నీ మర్చిపోయి, సరదాగా గడపాలని అలా ఒక్కోచోట కలుస్తాం. అందరితో కలసి, గ్రూప్ ఫోటోలు దిగుతుంటే, ‘బాలా! వచ్చేయ్... కిందకు!’ అని సుహాసిని అంది. ఏమి టంటే, ‘రజనీకాంత్ వచ్చారు’ అంది. అందరం ఒకటనుకొని కలిస్తే, తేడాలు చూపించేసరికి నాకు సర్రున కోపం వచ్చింది. ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్‌స్టార్?’ అని అరిచా. ‘ఫోటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందకు వచ్చా. నేను పర్ఫెక్ష నిస్ట్ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలను కుంటా. లేకపోతే కోపమొస్తుంది. ♦ ‘డిక్టేటర్’ 99వ సినిమా. వందో సినిమా ఏంటి? (నవ్వేస్తూ...) నాకు ఏ ప్లాన్లూ ముందుగా ఉండవు. అందరూ ‘వంద సినిమాలు చేసేశారు’ అంటున్నారు. నేను మాత్రం ‘వంద సినిమాలేనా చేశాను’ అంటాను. అయితే, వంద సినిమాలనే సంఖ్య ఒక మైలురాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి! 41 ఏళ్ళ క్రితం బాల నటుడిగా ప్రవేశించా. బాగా చదువుకోవాలని మధ్యలో మా నాన్న గారు ఆపకపోతే, ఈపాటికి 150 నుంచి 200 సినిమాలు చేసి ఉండేవాణ్ణి. కానీ, నిజామ్ కాలేజ్‌లో చదువుకోవడం వల్ల ప్రపంచజ్ఞానం పెరిగింది. ఎంతోమందితో పరిచయాలొచ్చాయి. నా కాలేజ్‌మేట్స్ - కిరణ్‌కుమార్‌రెడ్డి సి.ఎం అయ్యాడు. సురేష్ రెడ్డి స్పీకర్ అయ్యాడు. అంతా ఎంతో ఎదిగారు. కాలేజ్ చదువు లేకపోతే, వీళ్ళందరితో సాంగత్యం పోగొట్టుకొనేవాణ్ణి. అందుకే, మా పిల్లల విషయంలో కూడా చదువుకే ప్రాధాన్యమిచ్చా. వాళ్ళూ బాగా చదువుకున్నారు. ♦ మీ అబ్బాయి మోక్షజ్ఞ మీ వందోసిన్మాలో ఎంట్రీట! (నవ్వేస్తూ...) ఏమో అవ్వచ్చు. ఆలోచనలు న్నాయి. ఎలా టర్న్ తీసుకుంటాయో చెప్పలేం! ఏదైనా అప్పటికప్పుడు వేడివేడిగా నిర్ణయం తీసు కోవాలి. ఆచరించాలి. నాన్చడం ఇష్టం ఉండదు. ♦ నూరో సినిమా బోయపాటి దర్శకత్వంలోనేనా? (నవ్వేస్తూ) చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏమీ అనుకోలేదు. ఏమైనా, రెండు నెలలు అంతా సిద్ధం చేసుకొని, మార్చి కల్లా వందో సినిమా పట్టాల మీదకు ఎక్కిస్తాం. అప్పటికి బోయపాటి రెడీగా ఉంటే సరే, ‘లేదు. నాలుగైదు నెలలు టైమ్ పడుతుం’దంటే, అంతకాలం ఆగలేను. వెంటనే మరొకరితో, ఇంకో సినిమా, పాత్ర చేయాల్సిందే. ♦ సింగీతంతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేస్తారనీ... స్టోరీ బోర్డ్‌తో సహా అది సిద్ధంగా ఉంది. చూడాలి. ఏమైనా, ఒక వారంలో ఈ సంక్రాంతి పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటా! ♦ వందో సినిమా తర్వాత పూర్తిగా ప్రజాసేవకేనా? లక్షలాదిప్రజల్ని తృప్తిపరిచే నటన వదిలి పెట్టను. నేనింకా అనేకపాత్రల్లో చేయాలనీ, చూడాలనీ ఫ్యాన్స ఆశిస్తున్నారు. వాళ్ళని నిరాశ పరచను. సినిమాలు చేస్తూనే, ప్రజాసేవ చేస్తా. ♦ ‘కాబోయే సి.ఎం. బాలయ్య’ లాంటి స్లోగన్లు...? ఆ మాటలు వినిపిస్తుంటాయి. పట్టించు కోను. నేను దేన్నీ ఆశించను. ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. ఏది నాకు రావాలనుంటే అది వస్తుంది. అది కాలం నిర్ణయిస్తుంది. ♦ తాతయ్య అయ్యాక మీలో వచ్చిన మార్పు? ఏమీ లేదు. నేనిప్పటికీ ‘బాలు’ణ్ణే! (నవ్వు). నాలోని ఆ పసితనం పోలేదు. పోదు. ♦ అమరావతి శంకుస్థాపన, సత్య నాదెళ్ళ సమా వేశం - ఏదైనా మీ మనుమడే స్టార్ ఎట్రాక్షన్. (మనుమణ్ణి ఎత్తుకొని...) వీడికి ఎనిమిది నెలలు. వీడికి నేనే సందడి. వీడితో నాకు మంచి కాలక్షేపం. హావభావాలతో డైలాగ్స్ చెబుతుంటే, అలా చూస్తూ ఉంటాడు. మెడలో పులిగోరు చూడ గానే ‘గడ్డం తాత (చంద్రబాబు) కాదు.. నేను’ అని గుర్తుపడతాడు. వీడి కోసం నేను లైవ్ పెర్ఫా ర్మెన్స్... డ్యాన్స్‌లు చేస్తుంటా. వాడూ ఎగురు తాడు. కెమేరా కనిపించగానే, అలా చూస్తుం టాడు. వీడు కచ్చితంగా హీరో అవుతాడు. ఇద్దరం హీరోలమే! ఈ సంక్రాంతికి వీణ్ణి తీసుకొని, నారావారి పల్లె వెళుతున్నాం. వచ్చే సంక్రాంతి మా ఊరు నిమ్మకూరులో. ♦ సంక్రాంతి మీకు సెంటిమెంటా? నాన్న గారి ‘చంద్రహారం’ నుంచి ఎన్నో సినిమాలు సంక్రాంతికే వచ్చాయి. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘సీతారామ కల్యాణం’ నుంచి ‘దాన వీరశూర కర్ణ’ దాకా అన్నీ ఆ రోజే రిలీజ్. ఆ వాసనలు నాకూ అబ్బాయి. ఒకటి, రెండు సంక్రాంతులు మినహా దాదాపు ప్రతిసారీ నా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి మాత్రం ఇక ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఒకటి ఉంటుంది. ♦ మీది, తారక్, నాగ్, శర్వానంద్లవి - నాలుగు సిన్మాలొస్తున్నాయి. ఈ సంక్రాంతెలా ఉంటుంది? (గంభీరంగా...) నేను వేరేవాళ్ళ గురించి, వేరే సిన్మాలగురించి ఆలోచించను, పట్టించుకోను. ♦ థియేటర్ల విషయంలో మీ సినిమాకూ, ఇతరులకూ మధ్య గొడవని వార్తలు వచ్చాయి. అలాగా! నాకు తెలీదు. నా వరకు ఏదీ రాలేదు. సినిమా ప్రమోషన్ హడావిడిలో ఉన్నా. ♦ అంటే థియేటర్ల విషయం మీరు పట్టించుకోరా? ఫలానా ఊళ్ళో మన సినిమాకి హాలుదొరక్క, ప్రాబ్లమ్ ఉందని వాళ్ళు నాకు ఫోన్ చేసి, నా దృష్టికి తెస్తేనే పట్టించుకుంటాను. లేకపోతే లేదు. ♦ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పుచేస్తే.. ఏదైనా విషయంలో తేడా వస్తే, కూర్చోపెట్టి మాట్లాడ తారా? క్షమిస్తారా? లేదండి. నాలో క్షమించే గుణం తక్కువే. ఏ విషయంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే క్షమించను. బుజ్జగించడం అలాంటివి మనకస్సలు లేవు. ఏదైనా ఒక్కసారే. అంతే. ఏదైనా సరే నా స్టయిల్ల్లో డీల్ చేస్తాను. వాళ్లకు రెండో అవకాశం ఇవ్వను. అక్కడితో కటాఫ్ అంతే. అది ఇంట్లో వాళ్లయినా, బయటి వాళ్లయినా అంతే. ♦ మీ పిల్లల్లో ఎవరికి మీ వద్ద చనువు ఎక్కువ? మా పెద్దమ్మాయి బ్రహ్మిణికి. నన్ను క్రిటిసైజ్ చేసి, సలహాలు ఇవ్వాలన్నా బ్రహ్మిణే. చిన్న మ్మాయి తేజస్విని అడిగితే కానీ చెప్పదు. బ్రహ్మిణి మాత్రం అడగపోయినా చెబుతుంది. ♦ మీ పిల్లల కెరీర్ విషయంలో మీ జోక్యం? నిజానికి, మా అమ్మాయిలతో సహా అందరికీ చదువుకొన్నాక, సినిమాల్లో ఆసక్తి ఉంటే రమ్మని చెప్పాను. కానీ, అమ్మాయిలు వద్దన్నారు. మా అబ్బాయి వస్తున్నాడు. వట్టి బాలకృష్ణగా కాక ‘బ్రహ్మిణి తండ్రి బాలకృష్ణ’ అని అనిపించుకో గలిగితే, అది నాకు పెద్ద కిరీటం లాంటిది కదా. ♦ మోక్షజ్ఞ తొలి సినిమాలు ఎలా ఉండాలి? తొలి అయిదారు సినిమాలు నార్మల్ హీరోగా చేయాలి. ప్రపంచాన్ని కాపాడేశాడు లాంటి సూపర్ హీరో పాత్రలొద్దని. ప్రేక్షకులందరూ మన అబ్బాయి అనుకొనే పాత్రలు చేస్తే, ఆ తరువాత మాస్ ఫాలోయింగ్ ఎలాగూ వస్తుంది. ♦ మీ విజయంలో మీ శ్రీమతి వసుంధర పాత్ర? (నవ్వేస్తూ...) 1982లో మా పెళ్ళయింది. నన్ను ఇంతకాలం భరించిన భార్య ఆవిడ. పిల్లల చదువుల విషయమంతా దగ్గరుండి చూసింది. ♦ ఈ మధ్య ఇంటిల్లపాదీ కలసి చూసిన సినిమా? నిన్నే నేను, నా భార్య వసుంధర, బ్రహ్మిణి, మోక్షజ్ఞ, శ్రీవాస్ కలిసి ‘డిక్టేటర్’ చూశాం. ఇంట్లో అందరూ బాగుందన్నారు. ♦ రాజకీయనాయకుడిగా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్? నేను ప్రచారానికి వెళ్లినప్పుడు మహిళలు బిందెలతో వచ్చేసేవారు. పాపం తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్యాంకుల ద్వారా తాగునీటి సమస్య తీర్చే ప్రయత్నం చేశా. ఆ ఆత్మసంతృప్తి ఉంది. నేనేదో చుట్టంచూపుగా నా నియోజకవర్గానికి వెళ్తానని అనుకున్నారు. కానీ నిజాయతీగా పనిచేస్తున్నాని ప్రజలు గుర్తించారు. ఇంకా చేయాల్సినవి ఎన్నో. ♦ కానీ, తలదూర్చేవారు, తలనొప్పులెక్కువేగా? నా నియోజకవర్గంలో ఎవడైనా తలదూరిస్తే ఎవరికైనా వార్నింగే. నా స్వభావం అలాంటిది. ♦ జీవితంలో పశ్చాత్తాపపడిన సందర్భాలున్నాయా? లేదండీ. ఎప్పుడూ లేదు. ♦ ప్రపంచానికి తెలియని బాలకృష్ణ గురించి? నా జీవితమే ఓపెన్ బుక్. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. చాలామంది టీవీ షోలకు రమ్మన్నా రానని చెప్పా... నా గురించి అందరికీ కొత్తగా తెలిసేది ఏంటని. నాకు కపటం చేత కాదు. నిజజీవితంలో నా ప్రవర్తన నుంచే నా సినిమాల్లో డైలాగులు పుడుతుంటాయి. ఏమున్నా ఆవేశంతో వెళుతుంటా అంతే . చాలామంది నాకు భయపడి దాక్కుని దాక్కుని వెళుతూ ఉంటారు. ♦ మీరు భయపడే సంఘటనలు? అస్సలు దేనికీ భయపడని స్వభావం నాది. ♦ భవిష్యత్తు కొన్నిసార్లు మీకు తెలుస్తుందట... అప్పుడప్పుడూ ముందు జరిగేవి తెలుస్తూనే ఉంటాయి. భగవంతుడు ఆ పవర్ ఇస్తాడు. రామకృష్ణకు యాక్సిడెంట్ జరుగుతుందనగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సాయికృష్ణ చనిపోతున్నా రనగా అలాంటి సంఘటనే జరిగింది. ‘పెద్దన్నయ్య’ రిలీజ్ టైమ్ లో మా తమ్ముడు రామ కృష్ణకి యాక్సిడెంటైంది. ఆ ముందు రోజు రాత్రి కల్లోనే వచ్చింది. పొద్దున లేచేసరికి బెడ్ అంతా చెమటతో తడిచిపోయింది. శాస్త్రి గారిని అడిగి పూజలు చేశా. పెద్ద యాక్సిడెంట్ అయినా, దేవుడి దయ వల్ల ఇప్పటికీ బాగానే ఉన్నాడు. కానీ నాన్నగారి మరణం చూశాక ఒకలాంటి వైరాగ్యం నాలో ఆవహించింది. ఎవరూ దేన్నీ ఊహించ లేరు. మా అన్నయ్య సాయికృష్ణ సంగతీ కలలో తెలిసింది. కానీ, ప్రాప్తం లేదు. కాపాడుకోలేక పోయాం. అందుకే ఎవరికి ఎంత రాసిపెట్టి ఉంటే అంత. కాపాడటానికి యోగం ఉండాలి. ♦ ప్రపంచానికెలా గుర్తుండిపోవాలని ఆలోచన? సినిమాల వల్లే కాక, ‘బాలకృష్ణంటే... ఇలా ఉంటా’డనే వ్యక్తిత్వం ద్వారా గుండెల్లో ఉంటాను. ♦ మీ దృష్టిలో దైవం అంటే? కష్టాల్లో ఉన్నప్పుడే కాకుండా నిత్యం చేయాల్సిన పనుల్లో దైవ చింతన ఒకటి. రోజూ గంట 45 నిమిషాలు పూజ చేస్తా. నా గదిలో పూజ చేస్తాను. దైవాన్ని ప్రార్థిస్తున్నామంటే సరెండర్ అవుతున్నట్టే. యాక్టింగ్‌లో రకరకాల పాత్రలు చేసి, ఆ అహాన్ని పెంచుకోకుండా బయటకు వచ్చి దేవుడికి ఆత్మసమర్పణ చేసుకోవాలి. మన పుష్పక విమానం లాంటివేగా ‘స్టార్ వార్స్’లో చూపించేది. నేను బీజాక్షరాలను నమ్ముతాను. మన వేదాల్లో బుుగ్వేదం, అధర్వణ వేదాలు నమ్ముతాను. అధర్వణ వేదంలో పండితుడైన దండిభట్ల విశ్వనాథశాస్త్రిని చాలా ఏళ్ళక్రితం జర్మనీయులు తీసుకెళ్ళి, తర్జుమా చేయించుకున్నారు. హిందూమతంలో పుట్టినందుకు నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. కానీ కెమెరా ముందుకెళితే పనే నాకు దైవం. ♦ పంచాంగం మీద మీకు చాలా పట్టుందట? (నవ్వేస్తూ) రోజువారీ ముహూర్తాలు చూస్తా. ♦ పునర్జన్మలను మీరు నమ్ముతారా? నమ్ముతాను. నాన్న గారు అన్నట్లు మళ్లీ తెలుగు జాతిలోనే పుడతాను. తెలుగు జాతి రుణం తీర్చుకుంటాను. - డాక్టర్ రెంటాల జయదేవ -
ఓపికగా... అబ్బాయితో అమ్మాయి
చిత్రం: ‘అబ్బాయితో అమ్మాయి’ తారాగణం: నాగశౌర్య, పలక్ లల్వానీ, మోహన్, తులసి, రావు రమేశ్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: పాత్రికేయ పాటలు: రెహమాన్ సంగీతం: ఇళయరాజా కెమేరా: శ్యామ్ కె. నాయుడు ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్ నిర్మాతలు: వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట దర్శకత్వం: రమేశ్‌వర్మ ఏది ప్రేమ? ఏది ఆకర్షణ? జీవితానికి లవ్ ముఖ్యమా? జీవ నోపాధిగా నిలిచే కెరీర్ ముఖ్యమా? ఇవన్నీ ఎవర్గ్రీన్ ప్రశ్నలు. ఎదుటివాళ్ళు ఎంత చెప్పినా, ఎవరికివారు స్వీయానుభవంతో తెలుసుకుంటే కానీ తత్త్వం బోధపడని ప్రశ్నలు. సహజంగానే వీటిని బేస్ చేసుకొని సవాలక్ష సినిమాలొచ్చాయి. అయినా, ‘తమవైన సినిమాలు తమవి గాన’ అన్నట్లు డెరైక్టర్ రమేశ్‌వర్మ చేసిన సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’. ‘ఒక ఊరిలో, వీర, రైడ్’ అందించిన రమేశ్వర్మకిది మరో ప్రయత్నం. డిజైనర్‌గా మొదలెట్టి డెరైక్టరైన ఆయన తీసుకున్న కథ ఒక్క ముక్కలో చెప్పగలిగేది కాదు. రెండు గంటలు చూసినా అయ్యేది కాదు. తాపీగా నడిచే ఈ కథ స్థూలంగా ఏమిటంటే, అమ్మాయి ప్రేమకి తపిస్తూ, సోషల్‌మీడియాలో ఛాటింగ్ చేస్తుంటాడు అభి (నాగశౌర్య). అలా వాయిస్ ఛాట్‌లో ప్రార్థన (పలక్ లల్వానీ) పరిచయమవుతుంది. ఒకరి ముఖం మరొకరికి తెలియకుండా, వ్యక్తిగత వివరాలు పంచుకోకుండానే మంచి స్నేహితులవుతారు. తామే సోషల్ మీడియా ఫ్రెండ్సన్న సంగతి తెలియకుండానే బయటి ప్రపంచంలో అతనూ, ఆమె ప్రేమలో పడతారు. ఆమెను ఎదురింట్లోకీ, ఆపై ప్రేమముగ్గులోకీ దింపుతాడు హీరో. ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒకటవు తారు. హీరోయిన్ను ఆమె తండ్రి (రావు రమేశ్), హీరోను అతని తండ్రి (మోహన్) దూరం పెడితే, ఒకరి ఇంట్లో మరొకరు ఆశ్రయం పొందుతారు. తన చేతిలో జీవితం నలిగిన ఆమే తన సోషల్ మీడియా ఫ్రెండ్ అని హీరోకు తెలుస్తుంది. కుమిలిపోయి, ఆ సంగతి ఆమెకు చెప్పకుండానే అమెరికాలో చదవాలన్న ఆమె లక్ష్యం కోసం ఓపికగా త్యాగాలకూ సిద్ధపడ తాడు. హీరోను హీరోయిన్ ద్వేషిస్తుంటుంది. ఆ క్రమంలో అతను, ఆమె ఫ్యామిలీకి ఎలా దగ్గరయ్యాడు? ఆమె కూడా అసలు విషయం తెలిశాక ఏం చేసింది? ఏమైందన్నది సినిమా. ప్రేమంటే ఛాటింగ్, మీటింగ్, డేటింగనుకొనే కుర్రాడిగా మొదలై ఆ తరువాత పరివర్తన చెందే ప్రేమికుడిగా, సిసలైన స్నేహితుడిగా హీరో నాగశౌర్య కనిపిస్తారు. స్క్రిప్టు పరిధిలో వీలైనంత నటించడానికి ప్రయత్నిస్తారు. హీరోయిన్ పలక్ లల్వానీ ముఖం మనకు కొత్త. ఆమెకు నటన కొత్త. సర్దుబాటు తప్పదు. రావు రమేశ్, ప్రగతితో పాటు ‘మౌనరాగం’ ఫేమ్ మోహన్, తులసి ఉన్నారు. అంతా సీనియర్లు, సీజన్డ్ ఆర్టిస్ట్‌లు. రావు రమేశ్, మోహన్ తదితరుల పాత్రల ప్రవర్తన, వాటి డిజైనింగ్‌పై అభ్యంతరాలుండవచ్చేమో కానీ, ఇచ్చిన సీన్లలో, చెప్పిన యాక్షన్‌లో వారు చేసినదానికి వంకపెట్టలేం. సాంకేతిక నిపుణుల సంగతికొస్తే - ఈ సినిమాకు అనుభవజ్ఞుడైన శ్యామ్ కె. నాయుడు లాంటి కెమేరామన్ ఉన్నారు. ఇక, సంగీతానికి ఇళయరాజా లాంటి పెట్టని కోట ఉండనే ఉంది. ఇలా సినిమాలో అన్నీ ఉన్నాయి. అయినా ఇంకా ఏదో లేదేమిటని అనిపిస్తుంటుంది. ఇళయరాజా మార్కు సంగీతం సినిమా అంతటా ఉంది. కొన్ని పాటలు కొన్నేళ్ళుగా మన చెవులకు అలవాటైపోయిన ఇళయరాజా బాణీలనూ, ఆర్కెస్ట్రయిజేషన్నే మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తాయి. తెరపై దృశ్యం బలహీనమైనచోట్ల తెరవెనక సంగీతంతో లేని భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ‘ఇసై జ్ఞాని’ తోడ్పడ్డారు. కాకపోతే సినిమాలో చాలా డౌట్లొస్తాయి. జరిగింది దిద్దు కోలేనంత తప్పు కాదు కాబట్టి, హీరో హీరోయిన్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పరిష్కారానికి ముందుకు రావచ్చు. కానీ, ఎవరూ ఆ పని చేయరు. ప్రేమించానన్నవాడే చాటింగ్ స్నేహితుడని తెలిశాక హీరోయిన్‌కున్న అభ్యంతరమేమిటో, ఎందుకో స్పష్టత లేదు. ఒకటే రకం సీన్లు... ప్రతి సీనూ సుదీర్ఘంగా నడవడం... ప్రతి పాత్రా పంచ్ డైలాగ్సతో తత్త్వబోధ చేయడం... అసహజ పాత్ర ప్రవర్తన వల్ల ‘అబ్బాయితో అమ్మాయి’ ఓపికగా చూడాల్సిన సినిమా. తెరపై ప్రేమికుల్లానే, తెరవైపు చూసే ప్రేక్షకులకూ క్షణమొక యుగమే. వెరసి, ‘లెటజ్ ఫాల్ ఇన్ లవ్...’ అనే ఉపశీర్షికతో ఉపదేశం చేసే ఈ సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూడాల్సిందే! ఆలసించిన ఆశాభంగం! -
ఫ్యామిలీతో... నేను... శైలజ...
చిత్రం: ‘నేను... శైలజ’ తారాగణం: రామ్, కీర్తీ సురేశ్, సత్యరాజ్ సంగీతం: దేవిశ్రీప్రసాద్ కెమేరా: సమీర్‌రెడ్డి కళ: ఏ.ఎస్. ప్రకాష్ ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్ నిర్మాత: ‘స్రవంతి’ రవికిశోర్ రచన - దర్శకత్వం: కిశోర్ తిరుమల లైఫ్‌లో చాలా ఈజీ - ప్రేమలో పడడం. కానీ, చాలా కష్టం - ఆ అమ్మాయికి ఆ మాట చెప్పడం!’ ‘నేను... శైలజ’లో హీరో ఓ సందర్భంలో కాస్త అటూ ఇటుగా ఇదే అర్థమొచ్చేలా డైలాగ్ చెబుతాడు. సినిమా కూడా అంతే! ప్రేమకథ చెప్పడం ఈజీ. కానీ, దాన్ని తెరపై అందరికీ నచ్చేలా చెప్పడం చాలా కష్టం. మంచి హిట్ కోసం చూస్తున్న హీరో రామ్, మంచి చిత్రాలను అందించడంలో ముందుండే నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సారి అలాంటి ప్రేమకథాచిత్రాన్ని తలకెత్తుకున్నారు. ఇది ‘హరి’ (రామ్) అనేవాడి ప్రేమ కథ. హరి, అతని సోదరి కీర్తి - ఇద్దరూ కవలలు. ఎవరు పెద్దో, ఎవరు చిన్నో తెలీదు కాబట్టి, ‘అక్కయ్యా’ అని అతను, ‘అన్నయ్యా’ అని ఆమె పిలుచుకొనేంత క్లోజ్. వాళ్ళ అమ్మా నాన్న (నరేశ్, ప్రగతి) పిల్లలను ప్రేమగా పెంచే టైప్. క్లబ్లో డీజేగా పనిచేస్తున్న హీరో చిన్నప్పటి నుంచి చాలామందికి ఐ లవ్యూ చెప్పి, నో అనిపించుకుం టాడు. చివరకు యాడ్ ఏజన్సీలో పనిచేస్తున్న శైలజ (కీర్తి సురేశ్) అనే అమ్మాయితో కనెక్ట్ అవుతాడు. చిన్నప్పుడు తాను ఆరాధించి, విడిపోయిన శైలూయే ఈ శైలజ అని గ్రహిస్తాడు. ఆ అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది. అతనే చిన్నప్పటి తన ఉంగరం ఫ్రెండ్ అని గుర్తిస్తుంది. తీరా హీరో వాళ్ళ ప్రేమ కథ ఒక కొలిక్కి వచ్చే టైమ్‌కి, ఆ అమ్మాయికి అయిన సంబంధం కుదురుస్తారు అమ్మా నాన్న. ‘ఐ లవ్ యు.. బట్ అయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు’ అనేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ హీరోయిన్ అసలు కథలోకి వెళితే - ఆమె నాన్న శ్రీనివాసరావు (సత్యరాజ్). పిల్లల బంగారు భవిత కోసం కాంట్రాక్టులంటూ దేశాలు పట్టి అతను వెళితే, అమ్మ (రోహిణి) హీరోయిన్నీ, ఆమె అన్న (ప్రిన్స్)నీ జాగ్రత్తగా పెంచుతుంది. దాంతో, పిల్లల పట్ల ప్రేమ ఉన్నా చెప్పని తండ్రికీ, తన మనసులోని భావాల్ని బాహాటంగా వ్యక్తం చేయలేని కూతురిగా హీరోయిన్‌కూ మధ్య అంతరం పెరిగిపోతుంది. మరోపక్క మాట పట్టింపుతో పాతికేళ్ళ క్రితం శ్రీనివాసరావు తన తండ్రికీ, చెల్లికీ దూరమవుతాడు. తీరా చెల్లెలే వచ్చి తన కొడుక్కి (చైతన్య కృష్ణ), హీరోయిన్ని ఇచ్చి చేసి, కుటుంబాలు దగ్గరవుదామంటుంది. ఈ ఫ్యామిలీ ట్విస్ట్ వల్లే హీరో యిన్ దూరమైందని గ్రహించిన హీరోకు- హీరోయిన్ అన్న, తన అక్క ప్రేమించుకుంటున్నారని తెలుస్తుంది. ఇంకేం... పెళ్ళి కానున్న హీరోయిన్ ఇంటికి వెళతాడు. అక్కడ హీరో ఏం చేశాడన్నది మిగతా సినిమా. ఎక్కువగా మాస్ చిత్రాల్లో హుషారుగా కనిపించే రామ్ ఈ హరి పాత్ర కోసం నియంత్రణలోకొచ్చారు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడ పవన్ కల్యాణ్ శైలి తొంగి చూసినా, తరువాత కుదురుకున్నారు. హీరోయిన్ కీర్తీ సురేశ్ తెలుగుకు కొత్త. కాబట్టి, చూడగానే గుర్తుపట్టడం కానీ, గుర్తుపెట్టుకొనే నటన ఆశించడం కానీ అత్యాశ. హీరోయిన్ తండ్రి పాత్రలో సత్యరాజ్‌కు డైలాగులు తక్కువ. ముఖంలోనే చూపాల్సిన హావభావాలెక్కువ. రోహిణి, నరేశ్, ప్రగతి లాంటి అనుభవజ్ఞులు ఎలాగూ ఉన్నారు. బాల తారలతో బాగా నటింపజేశారు. దర్శక, రచయిత తిరుమల కిశోర్ డైలాగుల్లో రచయితగా తన బలాన్ని మరోసారి చూపించారు. కొన్ని డైలాగులు నవ్విస్తాయి. కొన్ని గుర్తుండిపోతాయి. ‘ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటే... సిస్టమ్‌లో సినిమా చూడడం లాంటిది. లవ్ మ్యారేజ్ అంటే థియేటర్లో సినిమా చూడడం లాంటిది. సినిమా ఒకటే అయినా, ఫీల్‌లో తేడా ఉంటుంది’ లాంటివి యూత్‌కు నచ్చుతాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ పాటలు, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ కలిసొచ్చే అంశాలు. దేవిశ్రీ తరహా క్లబ్ గీతం ‘నైట్ ఈజ్ స్టిల్ యంగ్...’ (రచన సాగర్) సరదాగా అనిపిస్తుంది. ‘ఇఫ్ యు గో టు హెల్ యముడేమో థ్రిల్’ లాంటి ఎక్స్ప్రెషన్స్ కొత్తనిపిస్తాయి. నేపథ్యసంగీతం కొన్ని సీన్లకు ఉత్తేజమిచ్చి, సెకండాఫ్‌లో ఒక దశ దాటాక పాత రికార్డేదో పదేపదే విన్నట్లుంది. ఫస్టాఫ్ అందమైన ప్రేమ క్షణాలతో, యూత్‌ఫుల్‌గా అనిపిస్తూ, చిరునవ్వులు విరబూయిస్తూ సాగుతుంది. కీలక మలుపు తిరిగిన హీరో హీరోయిన్ల ప్రేమకథకు సెకండాఫ్‌లో కన్‌క్లూజన్ చెప్పే క్రమంలో ‘మనసంతా నువ్వే’, ‘నువ్వే నువ్వే’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ దాకా సినిమాలు, వాటి ఫీల్ గుర్తుకొస్తాయి. నిజానికిది రెండుంబావు గంటల పైచిలుకు వ్యవధి సినిమానే. కానీ, సెంటిమెంట్ సీన్ల బరువుతో సెకండాఫ్ భారంగా గడుస్తుంది. అయితే, క్లైమాక్స్‌కు ముందు హీరోతో సత్యరాజ్ మాటలు, సత్యరాజ్‌తో హీరోయిన్ మాట్లాడే మాటలు కీలకం. అలాంటి ఘట్టాలు కొన్ని ఉంటే, సినిమా పట్టు పెరిగేది. ప్రేమలో విఫలమైన రౌడీగా మహర్షి పాత్రను విలన్ ప్రదీప్ రావత్‌తో వేయించడం వెరైటీ. ఒకప్పుడు స్వర్గీయ శ్రీహరికి నప్పే ఈ పాత్రను ఇంకా వాడుకోగలిగితే, కామెడీ కలిసొచ్చేది. ఆల్రెడీ పెళ్ళి కుదిరిన హీరోయిన్. ఆమెను ప్రేమిం చిన హీరో. హీరోయిన్ ఇంటికే హీరో వచ్చి, ఆమె ఇంట్లో వాళ్ళను ఇంప్రెస్ చేసి, తమ ప్రేమని పెళ్ళిపీటలకెక్కించ డం - ఈ బాక్సాఫీస్ ఫార్ములా మనకు కామనే. ‘నేను శైలజ’ కున్న బలమూ, బలహీనత కూడా అదే! అందుకే, ఒక ప్రముఖ సినీ రచయిత ఆ మధ్య ఆంతరంగికంగా అన్నట్లు, మన వరకు ‘దిల్వాలే దుల్హనియా’ ఒకసారి కాదు... ‘బార్.. బార్... లే జాయేంగే’! ఈ ఫ్యామిలీ ఫిల్మ్ దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. - రెంటాల జయదేవ -
డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!
బిరబిరా పారే నది... నదియా! ... జరీనా మొయిదు నుంచి నదియా దాకా... నదియా నుంచి మిసెస్ గోడ్బోలే దాకా... మిసెస్ గోడ్బోలే నుంచి ‘అత్తారింటికి దారేది’ దాకా... నదియా మలుపులు మన గుండెల్ని తట్టాయి. ఎన్ని మలుపులు తిరిగినా తనకు బాగా నచ్చిన పాత్ర... డెఫినెట్లీ... మిసెస్ గోడ్బోలే! * వెల్కమ్ బ్యాక్ టు ‘సుందరి ఆఫ్ సౌత్’! ఇంతకీ మీకు ఆ పేరెలా వచ్చింది? నదియా: తమిళ్లో తొలిచిత్రం ‘పూవే పూచూడవా’లో పాత్ర పేరు సుందరి. అంతకు ముందు మలయాళంలో పేరొచ్చినా, ఆ చిత్రంతో సౌత్‌లో పాపులరయ్యా. బహుశా, అందుకే ‘సుందరి ఆఫ్ సౌత్’ అని అంటారేమో. * క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? హీరోయిన్గా చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్నైన ఈ సెకండ్ ఇన్నింగ్స్నే ఆస్వాదిస్తున్నా. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని అందరూ మా అక్క, మా అత్త, మా అమ్మ ఇలా ఉంటే బాగుండుననుకుంటున్నారు. పురుషాధిక్యమెక్కువ, హీరోయిన్ల షెల్ఫ్‌లైఫ్ తక్కువ ఉండే సినీ రంగంలో నా లాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ విజయంగా దీన్ని భావిస్తున్నా. * ఇప్పటికీ మీరు అందంగా ఉన్నారు. హీరోయిన్గా కూడా చేయచ్చేమో? (నవ్వేస్తూ) ఆ మాట అన్నవాళ్ళందరితో ‘అలాగైతే, నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు కథ రాయండి’ అని అడుగుతుంటా. ఒకప్పుడు హీరోయిన్ ఒరియంటెడ్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి! వయసును బట్టి, మారిన కాలాన్ని బట్టి మనమూ మారాలి. హీరోయిన్గా మొదలెట్టాం కాబట్టి, పాతికేళ్ళ తర్వాతా అవే పాత్రలు చేస్తామంటే ఎలా? * మీ అమ్మా నాన్నల గురించి చెప్పండి. వాళ్ళతో మీది బలమైన బంధమట? మా నాన్న గారి పేరు - ఎన్.కె. మొయిదు. ముస్లిమ్. అమ్మ పేరు- లలిత. హిందువు. ఇద్దరూ మలయాళీలే. ‘టాటాస్’ సంస్థలో పనేచేసేవారు. మా అమ్మానాన్నకు ఇద్దరు పిల్లలం - నేను, చెల్లెలు హసీనా. నా అసలు పేరు జరీనా మొయిదు. సినిమాల్లోకి వచ్చాకా నా బాగోగులన్నీ నాన్న గారే చూసుకొనేవారు. స్క్రిప్ట్‌లు నేను, ఆయన కలసి వినేవాళ్ళం, నిర్ణయం తీసుకొనేవాళ్ళం. మరీ గ్లామరస్ పాత్రలు, వాన పాటలుంటే నో చెప్పేస్తుండేవాళ్ళం. ఒక్క మాటలో - మై ఫాదర్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మి! హి ఈజ్ వెరీ స్పెషల్ టు మి. మా అమ్మ మాకు పెద్ద సెలైంట్ సపోర్టర్! * మరి, హీరోయిన్గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్ళిచేసుకొని, స్టేట్స్ వెళ్ళిపోయారేం? ముంబయ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే నాకూ, మా ఆయన శిరీష్ గోడ్బోలేకూ పరిచయం. ప్రసిద్ధ దర్శకుడు ఫాజిల్ వాళ్ళ బ్రదర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నేను కాలేజ్‌లో చదువుకొంటున్నప్పుడే ఫాజిల్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ, నన్ను ఆ పాత్ర చేయమన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల ఆయనను నమ్మి, ఈ రంగంలోకి వచ్చా. అయితే, వచ్చినప్పుడే తెలుసు... పెళ్ళి చేసుకొని, ఈ రంగానికి దూరంగా వెళ్ళిపోతానని! పద్ధెనిమిదేళ్ళ వయసులో మలయాళ చిత్రం ‘నోక్కెత్త దూరత్తు కన్నుమ్ నట్టు’ (1984)తో వచ్చా. తొలి సినిమాకే ‘ఉత్తమ నటి’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అయిదేళ్ళు హీరోయిన్గా చేశా. శిరీష్ నిలదొక్కుకోగానే, పెళ్ళి చేసుకొని స్టేట్స్ వెళ్ళిపోయా. పదిహేనేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ (2004)తో మళ్ళీ వచ్చా. * ఇంతకీ మీ పేరును నదియా అని మార్చిందెవరు? నేను సినిమాల్లోకి వస్తున్నప్పటికే హిందీ నటి జరీనా వహాబ్ ఫేమస్. అందుకని నా పేరు మార్చారు. ఫాజిల్ గారి సోదరుడి వరుసయ్యే ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పా కదా! ఆయనకు ఒక సిస్టర్ ఉండేది. నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు నిరంతరం ప్రవహించే నదిలా నా ప్రయాణం సాగిపోవాలని ఆమే నా పేరు ‘నదియా’ అని మార్చింది. * పెళ్ళితో హీరోయిన్గా అన్నీ వదులుకొని వెళ్ళిపోవడం కఠిన నిర్ణయమేనే! జీవితంలో తీసుకున్న కీలకమైన, తెలివైన నిర్ణయమదే. ఎందుకంటే, కెరీర్లో ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా వ్యక్తిగత జీవితమూ బాగుండాలి. అయామ్ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ రైట్ ఛాయిస్. * మరి, సినిమాల్లోకి మళ్ళీ ఎలా? దర్శకుడు రాజా ఎలా ఒప్పించారు? ఒకసారి సెలవులకి ముంబయ్‌కి వచ్చా. ఎలా తెలిసిందో ఏమో దర్శకుడు ‘జయం’ రాజా వాళ్ళు ఫోన్ చేసి, ఆ పాత్ర ఆఫర్ చేశారు. ముంబయ్ వచ్చి, తెలుగు మాతృక ‘అమ్మ.నాన్న..ఒక తమిళమ్మాయి’ సీడీ ఇచ్చారు. అందులో హుందాగా ఉన్న తల్లి పాత్ర చూసి, ఒప్పుకున్నా. * సినిమాల్లో కొనసాగినప్పుడు నిజజీవితంలో తల్లిగా ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మేము ముంబయ్‌కి షిఫ్ట్ అయిపోయాం. సినిమాల్లో నటిస్తున్నా, సెట్స్‌లో లేనంటే, ముంబయ్‌లో అందరు అమ్మల్లాగే ఇంటా, బయట పనులు చేసుకుంటూ ఉంటా. ఇప్పటికీ చాలా సెలెక్టివ్. ఏడాదికి ఒకటో, రెండో ఫిల్మ్స్ చేస్తున్నా. త్రివిక్రమ్ ‘అ..ఆ..’ నా 41వ సినిమా. * పదిహేనేళ్ళ గ్యాప్ మాట అటుంచితే, 31 ఏళ్ళ కెరీర్లో ఇన్ని సినిమాలేనా? చేసినవి కొన్నే అయినా, టైటిల్ రోల్స్. రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్మూట్టి లాంటి అగ్ర హీరోలతో, గుర్తుండిపోయే పాత్రలు చేశా. అప్పట్లో నా సమకాలీన హీరోయిన్లయిన రాధ, రాధిక, అంబిక, రేవతి వందల సినిమాలు చేశారు. అయామ్ స్టిల్ ఎ జూనియర్! (నవ్వులు) * హిందీ హీరోయిన్గా చాన్స వస్తే వదిలేశారట? సుభాష్ ఘయ్ సహా కొంతమంది సంప్రతించారు. సల్మాన్‌ఖాన్ తొలినాళ్ళ సూపర్‌హిట్ ‘మై నే ప్యార్ కియా’కు హీరోయిన్గా నన్ను అడిగారు. నిర్మాతలైన బర్జాత్యాలు మా ఇంటికి కూడా వచ్చారు. కానీ, పెళ్ళికి సిద్ధమవుతున్న నేను వద్దనేశా. ఇప్పటికీ ఆ విషయం మా పిల్లలతో సరదాగా చెబుతూ, ‘సల్మానా? మీ డాడీనా?’ అంటే, ‘మీ డాడీకి ఓటేశా’ అంటూ ఉంటా. ‘మైనే క్యా కియా’ అని ఆట పట్టిస్తుంటా. * శిరీష్ గోడ్బోలేతో మీ ప్రేమకథ చెప్పలేదు! మేము ముస్లిమ్‌లం. వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మణులు. ముంబయ్‌లో మా ఇళ్ళు కొద్ది దూరంలోనే ఉండేవి. కామన్ ఫ్రెండ్స్ వల్ల మా ఇద్దరికీ ముందు నుంచే పరిచయం. అప్పటికి నాకు 17 ఏళ్ళు. ఆయనకు 20 ఏళ్ళు. నేనింకా చదువుకుంటున్నా. చదువు, ఉద్యోగం కోసం శిరీష్ అమెరికా వెళ్ళినా మా ప్రేమ, స్నేహం కొనసాగింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇ-మెయిల్స్ లేవు. ట్రంక్ కాల్ బుక్ చేయాలి. లేదంటే, ఉత్తరాలు. అలా మేము చాలా ఉత్తరాలే రాసుకున్నాం. మా ప్రేమ రెండువైపులా తెలిసింది. మా పెళ్ళి అయింది. * కులమతాలు తేడా. రాజీపడాల్సి వచ్చిందా? నేను, ఆయన ముంబయ్‌లో పెరిగినవాళ్ళం. మెట్రోపాలిటన్ ఆలోచనా దృక్పథం, మా సోషల్ సెటప్ ఒకేలా ఉండేవి. అందుకే, కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నేను మరాఠీ ధారాళంగా మాట్లాడతా. మావారి ఇంట్లో చేసే ప్రతి పండుగ మనస్ఫూర్తిగా చేస్తా. మా అత్తమామల్ని ‘మాయి’ (అమ్మ), డాడీ అనే పిలుస్తా. * మరి, ఇంతకీ మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? మా నాన్న గారు ముస్లిమ్ అయినా, మాకు ముస్లిమ్ పేర్లు పెట్టినా, మేమెప్పుడూ ఒకే మత ధర్మాన్ని అనుసరించలేదు. ఇప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు మా నాన్న గారు నేర్పిన ఖురాన్‌లోని ప్రార్థనలు, మా అత్త గారింట్లో నేర్చుకున్న గణేశ్ హారతి, చిన్నతనంలో పారసీ స్కూల్లో నేర్చుకున్న పారసీ ప్రార్థనలు చేసి కానీ పడుకోను. అల్లా బిజీగా ఉంటే వినాయకుడు, ఆయన బిజీగా ఉంటే మరో పారసీ దేవుడు కాపాడతారని మా వాళ్ళతో సరదాగా అంటుంటా. * అప్పటికీ, ఇప్పటికీ పెంపకంలో తేడా? అప్పట్లో పిల్లలం అమ్మానాన్న ఏం చెబితే అది, ప్రశ్నలు వేయకుండా వినేవాళ్ళం. కానీ, ఈ తరం పిల్లలు ప్రశ్నలడుగుతారు. వాళ్ళకు లాజికల్‌గా జవాబివ్వాలి. అప్పటి తల్లితండ్రులు మంచి వక్తలైతే, ఇప్పటివాళ్ళు మంచి శ్రోతలవాలి. పిల్లల కష్టసుఖాలు విని, జవాబివ్వాలి. * మీ అందం, ఆహార, వ్యాయామ సీక్రెట్స్? (నవ్వేస్తూ) అనేక అంశాల కలయిక. ప్రధానంగా అమ్మానాన్నల జీన్స్ నుంచి వచ్చింది. బాగా వండుతా. బాగా తింటా. అందుకు తగ్గట్లే వ్యాయామం చేస్తా.రోజూ వాకింగ్, వెయిట్ ట్రైనింగ్, యోగా - మూడూ చేస్తా. నెగటివ్ ఎనర్జీకీ దూరంగా ఉంటా. వాట్సప్ మినహా ఏ సోషల్ మీడియాలోనూ లేను. ఐ కీప్ మై లైఫ్ సింపుల్. * మీ తాజా సినిమా గురించేం చెబుతారు? త్రివిక్రమ్ ‘అ...ఆ...’లో చేస్తున్నా. ఆయన సూపర్డెరైక్టర్. ఇది ఆయన శైలి మంచి రొమాంటిక్ కామెడీ. సమంతకు తల్లిగా మహాలక్ష్మిపాత్ర కొత్తగా ఉంటుంది. * జరీనాకూ, తెర జీవిత నదియాకూ తేడా? నటినైనా నేల విడిచి సాము చేయను. అందరిలా మామూలు మనిషిలా ఉంటా. ఒక్క మాటలో జరీనా, మిసెస్ గోడ్బోలే- ఒరిజినల్ జీవితం. నదియా - తెరపై అందరినీ నమ్మించే కల్పన. - రెంటాల జయదేవ అమ్మ-నాన్న-ఇద్దరు మరాఠీ అమ్మాయిలు * మా ఆయన శిరీష్ గోడ్బోలే అమెరికాలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’కి మేనేజింగ్ డెరైక్టర్. మా పెద్దమ్మాయి సనమ్‌కి 19 ఏళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో లిబరల్ ఆర్ట్స్, ఆంత్రొపాలజీతో డిగ్రీ చేస్తోంది. ఇక, జానాకి 14 ఏళ్ళు. నైన్త్ గ్రేడ్ చదువుతోంది. * పెద్దమ్మాయి వెస్ట్రన్ మ్యూజిక్ సింగర్. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది. చిన్నమ్మాయికి డ్యాన్స్ ఇష్టం. హిప్హాప్, జాజ్ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతానికైతే పిల్లల దృష్టి చదువు మీదే! -
క్రీస్తును చూసిన పరమహంస
దేవుడొక్కడే! సత్యం ఒక్కటే! కానీ, అక్కడకు చేరుకోవడానికి అనేక మార్గాలు. ‘ప్రపంచంలో మతాలెన్నో మార్గాలన్ని!’ అని శ్రీరామకృష్ణ పరమహంస అన్నది అందుకే. ఆయన అన్ని రకాల మార్గాలలో ఆధ్యాత్మిక సాధన చేశారు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నిటి పట్ల విశ్వాసం చూపారు. ఆ క్రమంలో ఆయన జరిపిన క్రైస్తవ మత సాధన చాలా ప్రత్యేకమైనది. సంవత్సరం, సమయం, సందర్భంతో సహా శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు రికార్డు చేసి, రాసిన జీవితచరిత్రలో ఆ సంఘటన నమోదైంది. ఆ అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి పూర్వాపరాలలోకి వెళితే... అప్పటికే, తంత్రశాస్త్రాలు నిర్దేశించిన 64 సాధనలు, వైష్ణవ సంప్రదాయంలోని శాంత - దాస్యాది పంచభావాల ఆధారంగా భక్తిసాధనలు, మహమ్మదీయ మత సాధన - ఇలా అన్నిటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించారు. 1873 మే 25న సాక్షాత్తూ శారదాదేవినే అమ్మవారిగా భావిస్తూ జరిపిన షోడశీ పూజతో ఆయన సాధన వ్రతం పూర్తి అయింది. షోడశీ పూజ జరిగిన ఏడాది తరువాత 1874లో... శ్రీరామకృష్ణుల్లో మరో సాధనామార్గం ద్వారా దైవాన్ని దర్శించుకోవాలనే ఆకాంక్ష కలిగింది. అప్పటికి, ఆయనకు శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవాడు. అలా ఆయనకు ఏసుక్రీస్తు పావన జీవితం, క్రీస్తు స్థాపించిన మతం గురించి తెలిసింది. క్రైస్తవ సంప్రదాయ మార్గంలో సాధనలు చేయాలనే కోరిక ఆయన మనస్సులో మెదిలింది. దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి దక్షిణ దిక్కులో యదుమల్లిక్ ఉద్యానగృహం ఉంది. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అక్కడ వ్యాహ్యాళికి వెళుతుండేవారు. యదుమల్లిక్కూ, అతని తల్లికీ శ్రీరామకృష్ణులంటే చాలా భక్తి. కాబట్టి, వాళ్ళు ఉద్యానగృహంలో లేని సమయంలో కూడా శ్రీరామకృష్ణులు అక్కడికి వెళితే, సిబ్బంది తలుపులు తెరిచి, అక్కడ కూర్చొని విశ్రమించమని కోరేవారు. ఆ గదిలో గోడలకు చక్కని చిత్రపటాలు ఉండేవి. తల్లి ఒడిలో ఉన్న బాలక్రీస్తు చిత్రపటం అందులో ఒకటి. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఆ గదిలో కూర్చొని, ఆ పటాన్నే తదేక దృష్టితో చూడసాగారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చిత్రం సజీవమై, దివ్యకాంతితో ప్రకాశించసాగింది. పటంలోని ఆ తల్లి, బాల ఏసు దేహాల నుంచి కాంతిపుంజాలు వెలువడ్డాయి. అవి శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రవేశించాయి. అంతే! ఆయన మానసిక భావనలన్నీ పరివర్తన చెందాయి. జన్మసిద్ధమైన హైందవ సంస్కారాలన్నీ మారుమూల ఒదిగిపోయాయి. పూర్తిగా భిన్నమైన సంస్కారాలు ఉదయించాయి. తనను తాను నియంత్రించుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు. ‘అమ్మా! నాలో ఏ వింత మార్పులు తీసుకువస్తున్నావు?’ అంటూ జగజ్జననిని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించారు. కానీ, ఉపయోగం లేకపోయింది. ఏసుక్రీస్తు పట్ల, క్రైస్తవ సంప్రదాయం పట్ల భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణుల హృదయంలో పాతుకున్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఏసుక్రీస్తు మూర్తి ఎదుట ఫాదిరీలు ధూపదీపాదులు అర్పించిన దృశ్యాలు ఆయనకు దర్శనమయ్యాయి. తరువాత శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వచ్చారు. మనసులోని ఆ భావాలు, కదలాడిన దృశ్యాల చింతనలో లీనమైపోయారు. కాళికాలయానికి వెళ్ళి, జగజ్జననిని దర్శించుకోవాలనే విషయం కూడా మర్చిపోయారు. అలా మూడు రోజుల పాటు ఆ భావతరంగాలు ఆయన మనస్సును ఆక్రమించేశాయి. అది మూడో రోజు... చీకటి పడింది. శ్రీరామకృష్ణులు ‘పంచవటి’ గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఉజ్జ్వలమైన గౌరవర్ణుడైన అద్భుత దివ్య మానవుడు ఒకరు తదేకదృష్టితో ఆయనను చూస్తూ, ఆయన వైపు రాసాగారు. ఆ వ్యక్తి విదేశీయుడనీ, విజాతీయుడనీ చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులకు అర్థమైంది. ఆతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆతని ముఖారవిందానికి వింత శోభను సంతరిస్తున్నాయి. ఆతని ముక్కు ఒకింత చప్పిడిగా ఉంది. కానీ, ఆతని అందానికి అదేమీ కొరత కాలేదు. ఆతని ముఖంలో అద్భుతమైన దివ్య భావప్రకటన తొణికిసలాడుతోంది. అదంతా చూసి, శ్రీరామకృష్ణులు ‘ఇతనెవరా?’ అని అబ్బురపడ్డారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు వచ్చాడు. ఆ క్షణంలో శ్రీరామకృష్ణుల హృదయం లోలోపల నుంచి ‘‘ఏసుప్రభువు! దుఃఖయాతనల నుంచి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారో... ఆ ఏసుప్రభువు!’’ అన్న మాటలు వెలువడ్డాయి. అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు, శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన దేహంలో లీనమైపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై, బాహ్యచైతన్యాన్ని కోల్పోయారు. అలా శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ ఏసుక్రీస్తు దర్శనం పొందారు. కనిపించిన రూపమే...! ఇది జరిగిన చాలాకాలం తరువాత ఒకరోజు స్వామి శారదానంద సహా పలువురు ప్రత్యక్ష శిష్యులతో శ్రీరామకృష్ణులు ఏసుక్రీస్తు ప్రస్తావన తెచ్చారు. ‘‘నాయనలారా! మీరు బైబిల్ చదివారు కదా! ఏసుక్రీస్తు భౌతిక లక్షణాల గురించి దానిలో ఏం రాసి ఉంది? ఆయన ఎలా కనిపించేవాడు?’’ అని అడిగారు. దానికి శిష్యులు, బైబిల్లో ఎక్కడా ఆయన భౌతిక వర్ణన తాము చూడలేదనీ, కానీ యూదుడుగా జన్మించడం వల్ల క్రీస్తు మేనిఛాయ ఉజ్జ్వల గౌరవర్ణంలో ఉంటుందనీ, విశాలనేత్రాలు, చిలుక లాంటి కొక్కెపు ముక్కు ఉండడం ఖాయమనీ జవాబిచ్చారు. కానీ, శ్రీరామకృష్ణులు మాత్రం ‘‘ఆయన ముక్కు ఒకింత చప్పిడిదై ఉండడం చూశాను. ఆయనను ఎందుకలా చూశానో తెలియడం లేదు’’ అన్నారు. విచిత్రం ఏమిటంటే, భావసమాధిలో శ్రీరామకృష్ణులు చూసిన స్వరూపం, ఏసుక్రీస్తు వాస్తవమూర్తితో సరిపోలింది. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఏసుక్రీస్తు శరీర నిర్మాణం గురించి మూడు విభిన్న వర్ణనలు ఉన్నాయనీ, ఆయన ముక్కు ఒకింత చప్పిడిగా ఉండేదనే వర్ణన వాటిలో ఒకటి ఉందనీ శ్రీరామకృష్ణుల శిష్యులు తెలుసుకొని అబ్బురపడ్డారు. శ్రీరామకృష్ణులకు దర్శనమైంది స్వయంగా క్రీస్తే అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇవాళ్టికీ రామకృష్ణ మఠంలో... క్రిస్మస్! దేశవిదేశాల్లో వ్యాపించిన శ్రీరామకృష్ణ మఠాలన్నిటిలో, బుద్ధ భగవానుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీచైతన్య, శ్రీశంకరుల జన్మదినోత్సవాలు ప్రతి ఏటా చేస్తారు. అది శ్రీరామకృష్ణ మఠ సంప్రదాయం. విశేషం ఏమిటంటే, శ్రీరామకృష్ణుల క్రైస్తవ ఆధ్యాత్మిక సాధన, పైన చెప్పిన సంఘటనను పురస్కరించుకొని - క్రిస్మస్ సందర్భంగా ‘క్రిస్మస్ ఈవ్’ (డిసెంబర్ 24) నాడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని కూడా మఠంలో శ్రద్ధాభక్తులతో చేస్తారు. ముఖ్యంగా మఠ కేంద్రస్థానమైన కోల్‌కతాలోని బేలూరు రామకృష్ణ మఠంలో క్రీస్తు పూజ, బైబిల్ పారాయణ, భక్తి సంగీత గానం మొదలైనవి జరుపుతారు. రామకృష్ణ మఠం, మిషన్ సెంటర్లలో జరిపే పండుగల్లో హైందవేతర ఉత్సవం ఇదొక్కటే! ఇప్పటికీ ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతోంది. - రెంటాల జయదేవ -
డి.ఐ. ఒక బాహుబలి
‘బాహుబలి’ ఓపెనింగ్ సీన్ గుర్తుందా? చేతిలో పసికందుతో రమ్యకృష్ణ చీకటిలో నడుచుకుంటూ వస్తుంటుంది. సైనికులు తరుముకొస్తుంటారు. అలాగే, ప్రభాస్ వెంట సైనికులు పడే దృశ్యం కూడా! ఆ దృశ్యాలను చిమ్మచీకటిలో, అంత పర్ఫెక్ట్గా ఎలా చిత్రీకరించారని ఆశ్చర్యపోతున్నారా? కెమెరామన్ సెంథిల్‌కుమార్ పట్టపగలు తీసిన ఆ దృశ్యాలు అలా రాత్రి పడే క్రీనీడలతో తెరపై కనిపించిందంటే - అదంతా డెరైక్టర్, కెమెరామన్ల ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టిన బి.వి.ఆర్. శివకుమార్ లాంటి కలరిస్టుల బృందం పనితనం! సినీపరిభాషలో చెప్పాలంటే - అంతా ‘డి.ఐ’ మహిమ!! రాజ్‌తరుణ్ నటించిన ‘ఉయ్యాల - జంపాల’ చూశారా? గోదావరి తీరంలో చెట్టును ఆనుకొని, హీరో నిల్చొని దూరంగా నది మీది వంతెన వైపు చూస్తుంటే, ఆ షాట్లో ఆకాశంలో సూర్యుడు నారింజపండు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. షూటింగ్లో లేని సూర్యుడు తెరపై ఫ్రేమ్ మీదకెంత సహజంగా వచ్చాడంటే, అంతా కెమేరా పనితనమే అనుకుంటాం. కానీ, కెమెరామన్ మనస్సులో సృష్టించుకొన్న ఆ దృశ్యాన్ని అలా తెరపై పునఃసృష్టించడం కలరిస్టుల గొప్పతనమే. ఇలాంటివెన్నో చేయడాన్ని డిజిటల్ ఇంటర్మీడియట్ (డి.ఐ) చేయడమంటారు. అప్పట్లో గ్రేడింగ్... ఇప్పుడు ‘డి.ఐ’ కంప్యూటర్లు రాని దశలో కేవలం రీళ్ళ ప్రాసెసింగ్, ప్రింటింగ్ టైమ్‌లో కెమెరామన్ సూచన మేరకు ల్యాబ్ టెక్నీషియన్లు ఇలాంటి పనే చేసేవారు. రంగులు ఏ మేరకు తెరపై కనిపించాలనే దాన్ని బట్టి కలర్ గ్రేడింగ్ చేసేవారు. నెగిటివ్ల ప్రాసెసింగ్, థియేటర్‌కు పంపే రీళ్ళ ప్రింటింగ్ జరిపేవారు. తొలి రోజుల్లో మాన్యువల్‌గా, తరువాతి రోజుల్లో యంత్రాల సాయంతో ఈ పని సాగింది. ఇప్పుడు అదే పనిని మరిన్ని సౌకర్యాలతో కంప్యూటర్లో చేస్తున్నారన్న మాట. మొన్న మొన్నటిదాకా నెగిటివ్‌తో సినిమా తీసేవారు. అప్పుడు రీళ్ళలోని ఆ విజువల్స్ అన్నీ ముందుగా డిజిటల్లోకి మార్చుకొనేవారు. ఆ తరువాత ఆ డిజిటల్ దృశ్యాల్లో రంగులు మరింత ప్రస్ఫుటంగా కనిపించేలా, ఇందాక చెప్పుకున్నట్లు కావాల్సిన ఎఫెక్ట్స్ వచ్చేలా కంప్యూటర్ సాయంతో చేసేవారు. అంతా అయ్యాక ఆ డిజిటల్ అవుట్‌పుట్‌ను మళ్ళీ నెగిటివ్ మీదకు ఎక్కించేవారు. ఆ ఫైనల్ అవుట్‌పుట్ సినిమా నుంచి థియేటర్లలో ప్రదర్శించే పాజిటివ్ ప్రింట్లు వేయించేవారు. ఇలా ఒకప్పుడు సినిమా రీళ్ళ దశలో ఉన్నప్పుడు, మధ్యలో మెరుగులు దిద్దే ఈ డిజిటల్ వ్యవహారాన్ని అంతా ‘డి.ఐ’ అని పిలిచేవారు. అయితే, ఇప్పుడు సినిమా చిత్రీకరణ మొదలు పోస్ట్‌ప్రొడక్షన్, థియేటర్లో ప్రదర్శన - అంతా డిజిటలే! రీళ్ళే లేవు. అందుకే డిజిటల్ మీడియవ్ుని మధ్యలో ఉపయోగించడమనే అర్థంలో వాడుతున్న డి.ఐ అనే మాట ఇప్పుడు కరెక్టే కాదు. అందుకే, హాలీవుడ్, బాలీవుడ్‌తో సహా అన్నీ ‘కలర్ కరెక్షన్’, ‘కలరిస్ట్’ లాంటి పదాలే వాడుతున్నాయి. పిలిచే పిలుపు ఏదైనా, ఇవాళ ప్రతి సినిమా ఇలా ‘కలర్ కరెక్షన్’ చేసుకొన్న తరువాతే మన ముందుకొస్తోంది. కావాల్సిన ఎఫెక్ట్స్ ఎన్నో పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ‘డి.ఐ’లో సృష్టించడానికి వీలు చిక్కింది. షూట్ చేసిన ఫుటేజ్కీ, తెరపై అవుట్పుట్కీ తేడా కొట్టొచ్చినట్లు రంగుల్లో కనపడసాగింది. కంప్యూటర్లో కొన్ని వేల ఆప్షన్లు ఇవాళ డి.ఐ. లేకుండా ఏ సినిమానూ ఊహించలేం. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల టైమ్‌లో తెరపై అంతా ‘ఈవెన్ టోన్’ ఉండేలా చేసేవారు. అది పరిమితమైన కరెక్షన్. కలర్ చిత్రాలు వచ్చాక, గతంలో ‘రెడ్, బ్లూ, గ్రీన్, బ్రైట్నెస్’ అనే నాలుగే కంట్రోల్స్‌తో ఈ ఎఫెక్ట్‌లన్నీ చేసేవారు. అవన్నీ రీళ్ళ కాలం నాటి సంగతులు. కానీ, ఇప్పుడు డిజిటల్ యుగంలో కంప్యూటర్‌తో కొన్ని వేల ఆప్షన్లు వచ్చాయి. ‘‘ఇన్ని ఆప్షన్లున్నాయి కాబట్టి, మనకు ఏం కావాలో కెమేరామన్‌కు స్పష్టత ఉండాలి. దాన్ని అవగాహన చేసుకొని కలరిస్ట్ డి.ఐ. చేయాలి. లేదంటే, తప్పు చేసే ప్రమాదం ఉంది’’ అని సీనియర్ కలరిస్ట్ బి.వి.ఆర్. శివకుమార్ అన్నారు. అన్నపూర్ణా స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న శివకుమార్ ‘ఉయ్యాల జంపాల’, ‘బాహుబలి’ సహా చాలా చిత్రాలకు డి.ఐ. చేశారు. ఒక్కోసారి లైటింగ్ తదితర విషయాల్లో షూటింగుల్లో జరిగిన తప్పులను కూడా డి.ఐ.లో సరిచేయాల్సి వస్తుంది. ‘‘చాలా సందర్భాల్లో కెమేరామన్లు సరైన అవుట్‌పుట్ ఇవ్వకపోయినా, దాన్ని డి.ఐ. ద్వారా మెరుగుచేయాల్సి ఉంటుంది. కానీ, ఒక మామూలు సినిమా తీసి, దాన్ని ‘అవతార్’ లాగా చేయాలని ఆత్రపడితే అయ్యేపని కాదు. మా దగ్గరకు వచ్చిన ఇన్పుట్ ఎంత బాగుంటుందో, అంత బాగా అవుట్‌పుట్ తీర్చిదిద్దుతాం’’ అని శివకుమార్, అన్నపూర్ణా స్టూడియో డి.ఐ. విభాగం జనరల్ మేనేజర్ సి.వి. రావు వ్యాఖ్యానించారు. తెలుగుకు సంబంధించినంత వరకు తొలిసారిగా డి.ఐ. చేయించిన సినిమా కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’ (2004) అని పరిశీలకులు చెబుతున్నారు. అప్పటికి ఇంత ప్రాచుర్యం పొందని ఈ ప్రక్రియ కోసం దర్శక - నిర్మాత కృష్ణవంశీ చాలా ఖర్చు పెట్టారు. ఆ తరువాత రోజుల్లో ‘‘చిన్న ఎన్టీయార్ ‘అశోక్’ (2006)ని సూపర్35 కెమెరాలో చిత్రీకరించి, డి.ఐ చేశాం’’ అని సెంథిల్ గుర్తుచేసుకున్నారు. ముంబయ్ నుంచి క్రమంగా చెన్నై, హైదరాబాద్‌లకు డి.ఐ. వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ నుంచే... అంతా టీమ్‌వర్క్ నిజానికి, డి.ఐ. అనేది పూర్తిగా టీమ్‌వర్క్. కథ, సన్నివేశం మూడ్ తెలుసుకొని, దృశ్యంలో ఆ మూడ్ ఉండేలా డి.ఐ.లో రంగుల్లో గాఢతను కలరిస్ట్ నిర్ణయిస్తారు. అలాగే, కెమెరామన్ కూడా చివరి క్షణం హడావిడి వల్ల షూటింగ్లో తాను చేయలేకపోయినవి గుర్తుంచుకొని, డి.ఐలో కలర్కరెక్షన్ చేయించుకోవాలి. కెమెరామన్ చెబుతున్నది విజువలైజ్ చేసుకొని, డి.ఐ. చేయడంలో కలరిస్ట్ ప్రతిభ బయటపడుతుంది. కెమెరామన్ సైతం తనతో అనుబంధమున్న కలరిస్ట్ను ఎంచుకుంటారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, తెర మీద విజువల్ ఎక్స్పీరియన్స్ కీలకమైన ‘బాహుబలి’ లాంటి సినిమాలకు ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచి.... కలరిస్టులను భాగం చేస్తారు. లొకేషన్, సెట్ మారినప్పుడల్లా కలరిస్ట్ను పిలుస్తారు. ఎక్కడెలా షూట్ చేస్తున్నదీ చూపిస్తారు. ‘‘షూటింగ్లో ఏ రంగులు వాడారో, కాస్ట్యూమ్స్ ఏమిటో కళ్ళారా చూస్తే, రేపు పోస్ట్‌ప్రొడక్షన్‌లో డి.ఐ.లో ఏ ప్యాలెట్ ఆఫ్ కలర్స్ వాడవచ్చో స్పష్టత వస్తుంది’’ అని శివకుమార్ చెప్పారు. ‘బాహుబలి’కి కొత్త పద్ధతి అలాగే, ఒకప్పుడు రీళ్ళ ప్రింట్లు ఒక్కటే ఉండేవి. కాబట్టి, డి.ఐ. కూడా ఒక రకంగా సులువు. కానీ, ఇప్పుడు డిజిటల్ ప్రింట్లు వచ్చి, ‘క్యూబ్, యు.ఎఫ్.ఒ, పిఎక్స్‌డి, కె సెరాసెరా, స్క్రాబుల్, యునెటైడ్ మీడియా, ఐ-మ్యాక్స్ (4కె వైడ్)’ లాంటి రకరకాల విధానాల్లో థియేటర్లో ప్రొజెక్షన్ జరుగుతోంది. కాబట్టి, అన్ని విధానాల్లోనూ తెరపై దృశ్యం ఒకేలా కావాల్సిన ఎఫెక్ట్‌లో కనిపించేలా కలరిస్ట్ జాగ్రత్తపడాల్సి వస్తోంది. అలాగే,షూటింగ్‌కు బ్లాక్ మ్యాజిక్, రెడ్ ఎపిక్, గో ప్రో, ఫాంటమ్, ఆరీ - ఇలా రకరకాల కెమెరాలు వాడుతుంటారు. ఒక్కో రకం కెమెరాలో ఒక్కో రకం కలర్ స్పేసెస్ ఉంటాయి. సినిమాను వేర్వేరు కెమెరాలతో చిత్రీకరించినా, ఆ మొత్తం విజువల్ ఇన్ఫర్మేషన్ను ఒక స్మూత్ ఫ్లో ఉండే లాగా చేయడం డి.ఐ. చేసే కలరిస్ట్ ముందుండే పెద్ద సవాలు. అలా డి.ఐ. చేయడానికి డావిన్సి, లస్టర్, బేస్లైట్, మిస్టికా లాంటి రకరకాల మెషిన్లను వాడుతుంటారు. అయితే, ‘బాహుబలి’కి సంబంధించి డి.ఐ.లో ‘అకాడెమీ కలర్ ఎన్కోడింగ్ సిస్టమ్’ (ఏ.సి.ఇ.ఎస్) అనే పద్ధతిని తొలిసారిగా వాడారు. ‘అతి పెద్ద కలర్ స్పేస్’ అయిన దీనివల్ల చిత్రీకరణ సమయంలో కెమేరాతో బంధించిన దృశ్యం తాలూకు సమాచారం కంప్రెస్ కాకుండా, ఫుల్ ఇన్ఫోతో డి.ఐ.కి అందుబాటులో ఉంటుంది. డి.ఐ. చేశాకా విజువల్ ఇన్ఫర్మేషన్ నష్టం కాదు. మల్టీప్లెక్సుల్లో 4కె ప్రొజెక్షన్ ద్వారా వేసినా, చివరకు ప్రపంచంలో రెండో అతి పెద్దతెర ప్రసాద్స్ ‘ఐమ్యాక్స్’ స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేసినా సరే ఎక్కడా చుక్కలు చుక్కలుగా కనిపించదు. అందుకే, కెమెరామన్, కలరిస్ట్ల మధ్య అవగాహన ముఖ్యం. ‘ఫోటోషాప్ లేకుండా - దాంతో కలర్ కరక్షన్, క్రాపింగ్ చేయకుండా ఇవాళ ఫోటోలు ఊహించలేం. అలాగే, కలరిస్టులు, డి.ఐ లేకుండా సినిమాని ఊహించలేం. ఇప్పుడిది మోస్ట్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్’. ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్స్ తెరపై చూస్తున్నామంటే, తెర వెనుక శివకుమార్ లాంటి కలరిస్ట్ల కనిపించని శ్రమ అపారం. అందుకే, ఒక్కముక్కలో ఇవాళ తెరపై సినిమాకు డి.ఐ.యే ఒక బాహుబలి. - రెంటాల జయదేవ ఇవాళ డి.ఐ. లేకుండా ఏ సినిమానూ ఊహించలేం. పోస్ట్‌ప్రొడక్షన్‌లో అతి ముఖ్యమైన సపోర్టింగ్ రోల్ దానిది. ‘డి.ఐ’ అంటే వట్టి కలర్ కరెక్షన్ అనుకుంటే పొరపాటే. అంతకు మించిన వ్యవహారం. అవుట్డోర్ షూటింగ్లో ఒక సీన్ చిత్రీకరణ పొద్దున మొదలుపెడితే, పూర్తయ్యేసరికి సాయంత్రం కావచ్చు. కానీ, తెరపై ఆ షాట్లన్నీ ఒకే టైమ్‌లో తీసినట్లనిపించాలి. ఆ జాగ్రత్త డి.ఐ.లో తీసుకుంటాం. - ‘బాహుబలి’ కెమేరామన్ సెంథిల్‌కుమార్ తెలుసా? * ‘బాహుబలి’లో దాదాపు 5 వేల వి.ఎఫ్.ఎక్స్. ఫ్రేవ్ులున్నాయి. * దీని డి.ఐ. అన్నపూర్ణా స్టూడియోలోనే, మన కలరిస్ట్ల చేతుల్లో జరిగింది. * ఏ రోజుకారోజు షూటింగ్ అయిపోగానే ‘రా ఫుటేజ్’ మీద కలరిస్ట్ల పని మొదలైపోయేది. అలా దాదాపు 2.2 లక్షల ఫ్రేమ్ లపై వర్క్ చేశారు. * ‘బాహుబలి’ డి.ఐ.కి దాదాపు 8 నెలలు పట్టింది.డి.ఐ. ఎలా చేస్తారంటే... * షూటింగ్లో కెమెరాలో బంధించిన దృశ్యాల ‘రా మెటీరియల్’ను ముందు డి.ఐ.కి ఇస్తారు. అక్కడ కలరిస్ట్ దానికి బేసిక్‌గా కలర్ కరెక్షన్ చేస్తారు. * ఆ రఫ్ వెర్షన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ (వి.ఎఫ్.ఎక్స్) నిపుణుడికి పంపుతారు. * అతను దానికి విజువల్ ఎఫెక్ట్స్ జత చేసి, మళ్ళీ డి.ఐ. దగ్గరకి పంపుతారు. * ఆ అవుట్పుట్లోని తప్పొప్పుల్ని కెమెరామన్, కలరిస్ట్ చూసి, అవసరాన్ని బట్టి వి.ఎఫ్.ఎక్స్‌కు మళ్ళీ పంపుతారు. అనుకున్న రీతిలో వచ్చేవరకు ఇలా టెన్నిస్మ్యాచ్లో బంతిలా అటూ ఇటూ ఆ విజువల్స్ వెళుతూ, వస్తాయి. * ఈ సుదీర్ఘమైన ప్రాసెస్‌లో దర్శకుడు ఊహించిన రీతిలో తుది విజువల్ వచ్చేలా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో మొదట చిత్రీకరించిన విజువల్ కాస్తా చివరకొచ్చేసరికి ఒక్కోసారి రెట్టింపు మెరుగవుతుంది. -
సంక్రాంతికి... డాడీ సినిమా షురూ!
ఆలోచన ఆకాశాన్ని అంటాలి... ఆచరణ భూమి మీద కనపడాలి. తల్లి తండ్రి అక్క చెల్లి పాద ధూళితో గుండె నింపుకున్న చరణ్ కొత్తగా అనిపిస్తున్నాడు... కొత్తగా వినిపిస్తున్నాడు. చరణ్ అంటేనే పాదం! హిజ్ ఫీట్ ఆర్ రియల్లీ ఆన్ ద గ్రౌండ్! మీరే చదవండి... కొత్తగా కనిపిస్తాడు కూడా! ♦ ‘బ్రూస్లీ’లో చిరు స్పెషల్ రోల్ టాకాఫ్ ది ఆడియన్సైంది (నవ్వేస్తూ...) నిజమే. మేము సినిమా మొత్తం కష్టపడితే, నాన్నగారు చివరలో నాలుగు నిమిషాలొచ్చి, అంతా కొట్టుకుపోయారు. కానీ, అది సినిమాకెంతో ఉపయోగపడింది. తెరపై ఆయన నటనకు జనం స్పందన చూశాక ఎప్పుడెప్పుడు ఆయన హీరోగా సినిమా స్టార్ట్ చేద్దామా అని ఉంది. దసరా లోపలే సినిమా, దర్శకుడు కన్ఫర్మ్ చేస్తాం. సంక్రాంతి కల్లా షూటింగ్ షురూ... ♦ ‘బ్రూస్లీ’లో సరే... జీవితంలో మీ సిస్టర్స్‌తో అనుబంధం? కజిన్స్‌తో కలుపుకొంటే, నాకు ఆరుగురు సిస్టర్స్. అందరికీ నేనొక్కణ్ణే బ్రదర్‌ని. తోడబుట్టిన మా అక్కయ్య సుస్మిత, నేను చిన్నప్పుడు బాగా కొట్టుకొనేవాళ్ళం. పెద్దయ్యాక బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. చెల్లెలు శ్రీజను మేము అప్పుడూ, ఇప్పుడూ చిన్నపిల్లగానే చూస్తాం. ♦ ‘బ్రూస్లీ’లో చూపినట్లు మగపిల్లలకు ప్రాధాన్యమివ్వడం... మన పురుషాధిక్య సమాజంలో ఇలాంటివి చూస్తూ ఉంటాం. కానీ, ఆడపిల్లల చేతిలో అధికారం, పని పెడితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను ముంబయ్‌లో పనిచేసిన యాడ్స్‌లో కానీ, హిందీ సినిమా ‘జంజీర్’లో కానీ చాలామంది ఆడవాళ్ళు పనిచేస్తూ కనిపిస్తారు. వాళ్ళు కరెక్ట్‌గా పనిచేస్తారు. వాళ్ళను చూసి మగవాళ్ళు కూడా తామూ సరిగ్గా పనిచేయాలనే భావనలో ఉంటారు. అందుకే, భవిష్యత్తులో నా ప్రొడక్షన్ హౌస్‌లో ఎక్కువ మంది ఆడవాళ్ళకే అవకాశాలివ్వాలనుకుంటున్నా. మా అక్కయ్య సుస్మితనూ, అలాగే మా పెదనాన్న?? వరసయ్యే డాక్టర్ కె. వెంకటేశ్వరరావు గారి అమ్మాయి కూడా మా ‘కొణిదెల ప్రొడక్షన్స్’లో ముఖ్యపాత్రలు పోషిస్తారు. ♦ మరి, నాగబాబు గారమ్మాయి తెరంగేట్రంపై మాటలేంటి? నీహారిక టీవీ షోస్ చేసింది. ఇప్పుడిక హీరోయిన్గా వస్తోంది. ఎంకరేజ్ చేయాలని నా అభిప్రాయం. కాకపోతే, సినీరంగంలో ‘ఇటీజ్ టఫ్ లైఫ్’ అని తెలియజేస్తాం. ఇక్కడ సవాలక్ష రాజకీయాలూ ఉంటాయి. ఇలాంటివన్నీ నీహారికకు తెలియజేస్తాం. కానీ, తను ఈ రంగాన్నే ఎంచుకోదలుచుకున్నప్పుడు కాదనడానికి మనమెవరం? లక్ష్మి మంచు, సుప్రియ లాంటి వాళ్ళు పేరున్న కుటుంబాల నుంచి వచ్చారు కదా! తప్పేముంది! ♦ ‘మెగా’ కుటుంబం నుంచి చాలామంది వారసులొచ్చారు! ఎవరూ లేకుండానే డాడీ సినీరంగంలో పైకొచ్చారు. ప్రతిభ, కష్టపడే తత్త్వం ఉంటే ఎవరైనా ఒక రజనీకాంత్, చిరంజీవి అవుతారు. వారసులమని చెప్పుకొని వచ్చినా, నిలదొక్కుకోవాలంటే కష్టపడాల్సిందే. ♦ ఎవరినో రోడ్డు మీద కొట్టారని, ఏదో అన్నారని మీ గురించి వివాదాలొస్తూ ఉండేవి. ఎందుకలా? కొన్నిట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ సంగతి తెలుసు. కానీ చాలాసార్లు నాదేమీ లేకుండానే నా గురించి ఏదో ఒకటి అంటారు, మాట్లాడతారు. తాజాగా ‘రుద్రమదేవి’, ‘బ్రూస్లీ’ రిలీజ్ వ్యవహారం అందుకో ఉదాహరణ. ఇలాంటి వాటికి గతంలో దూకుడుగా రియాక్టయ్యేవాణ్ణి. ఇప్పుడు మారాను. ♦ పని మీద దృష్టి పెట్టమని బాబాయ్ చెప్పారట! అందుకా? అలా ఏమీ లేదు. ఇక్కడ ఇవన్నీ ఎవరికి వారు తమ పర్సనల్ జర్నీ ద్వారా తెలుసుకోవాల్సిందే తప్ప, ఎవరో చెబితే వచ్చేది కాదు. అంతెందుకు, వరుణ్ (తేజ్), (సాయిధరమ్) తేజ్‌లకు నేను కూడా ఎక్కువ ఏమీ చెప్పను. ఎవరికి వాళ్ళు తెలుసుకొని, నేర్చుకొంటేనే ఆ అనుభవం నిలబడుతుంది. బాబాయ్ కూడా ఇవన్నీ స్వయంగా చూసి, దాటొచ్చారు. ♦ మునుపటి కన్నా సంయమనంతో మాట్లాడుతున్నారు. పరిణతి వచ్చిందా? లేక తెచ్చిపెట్టుకొన్నారా? ఇదేమీ అసలు రూపాన్ని దాచి, ముసుగు వేసుకోవడం కాదు. కేవలం నా పర్సనల్ గ్రోత్. అన్నిటికీ రియాక్టవడం మన స్థాయిని మనమే తగ్గించుకోవడం! ప్రతి దానికీ రియాక్ట్ అవడం మొదలుపెడితే, రోజూ వంద వస్తుంటాయి. వాటికి వివరణలివ్వడంతోనే టైమ్ గడిచిపోతుంది. జీవితంలో చాలా పనులున్నాయి. ♦ కానీ, మన అనుకున్నవాళ్ళను ఎవరో ఏదో అన్నప్పుడు... (మధ్యలో అందుకుంటూ...) అప్పుడు రియాక్ట్ కావాల్సిందే. మనవాళ్ళను మనం కాపాడుకోవాలిగా! నాన్న గారిని ఎవరైనా, ఏదైనా అనుచితంగా వ్యాఖ్యానించినప్పుడు మేము రియాక్ట్ అయ్యేది అందుకే! ♦ నటుడిగా మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకుంటారు? కెరీర్లో ముందుకు వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి. కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. గతంలో యాక్టింగ్ కోర్స్ చేసినా, మళ్ళీ వెళ్ళి పదును పెట్టుకోవాలి. ఎన్నో ఏళ్ళుగా నేర్చినా నాకొచ్చినవి డ్యాన్స్ స్టైల్స్‌లో 5 శాతమే. నేర్చుకోవాల్సిందెంతో ఉంది. కథ విన్నప్పుడు జడ్జ్ చేసే కెపాసిటీ కోసం స్క్రిప్ట్‌రైటింగ్ కోర్స్ చేయాలి. నవంబర్, డిసెంబర్లో ఆ కోర్స్ చేద్దామనుకుంటున్నా. ♦ కొత్తగా చేయాలంటున్నా మూసలో వెళ్ళారే! నిజమే. కొంత కమర్షియల్‌గానే వెళ్ళా. నేనేమిటో ప్రూవ్ చేసుకున్నా కాబట్టి, ఇక కొత్త కథలు, పాత్రల కోసం ప్రయత్నిస్తాను. జనం కూడా కథలో జెన్యూనిటీ కోరుకుంటున్నారు. అబద్ధపు ఎమోషన్లు చూపిస్తే చూడడం మానేశారు. కేవలం డ్యాన్సులు, ఫైట్లు చేస్తామంటే కుదరదు. బలమైన కథ, ఎవరున్నా హిట్టయ్యే లక్షణాలున్న స్క్రిప్టు ఎంచుకోవాలి. ♦ వయసుకు తగ్గట్లు మంచి లవ్‌స్టోరీ చేయచ్చుగా! చేయాలనే వుంది. ఫ్లాపైనా సోషల్ మీడియాలో అంతా చెప్పుకోనే నా ఫిల్మ్ ‘ఆరెంజ్’. అది నా ఫేవరెట్ ఫిల్మ్. ఈసారి అందరికీ నచ్చే, కమర్షియల్‌గా వర్కౌటయ్యే లవ్‌స్టోరీ చేస్తా. ♦ అమ్మ కోసం అమరనాథ్కి వెళ్ళా! డాడీ లాగే నేనూ ఆంజనేయ భక్తుణ్ణి. తరచూ తిరుమల వెళుతుంటా. డాడీ 18 ఏళ్ళు అయ్యప్ప మాల వేశారు. నాకూ అలవాటైంది. ఆ మధ్య అమ్మ మొక్కు తీర్చడానికి అమరనాథ్ యాత్రకు వెళ్ళా. అదో అద్భుతమైన అనుభూతి. ♦ నేను చేయకపోతే, సల్మానే చేస్తారు! డాడీ, సల్మాన్‌ఖాన్ కలసి థమ్సప్ యాడ్స్ చేశారు. అప్పటి నుంచి పరిచయం. ఎప్పుడు ముంబయ్‌కి వెళ్ళినా ఫోన్ చేయాల్సిందే. నేను చేయకపోతే ఆయనే చేసి, ‘పెద్దవాడివైపోయావా’ అంటారు. ఆయన అంత మంచి మనిషి. ♦ అనుబంధాలు పెరిగేది అలాగే! పరిచయస్థులు, పెద్దవాళ్ళు ఎవరైనా ముంబయ్ నుంచి ఇక్కడకు షూటింగ్‌కు వస్తే, ఇంటి నుంచి భోజనం పంపడం లాంటి అతిథిమర్యాదలు డాడీ చేస్తారు. ఆయన దగ్గర అది నేర్చుకున్నా. అనుబంధాలు, ఆప్యాయతలు అలానేగా పెరిగేది! ♦ ఊసరవెల్లిని కాపాడా! చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ని. మా ఆవిడా అంతే. మా ‘ఉపాసనా ఫార్మ్’లో ఆవులు, గుర్రాలు, ఒంటె ఉన్నాయి. ‘బ్రూస్లీ’ సెట్స్‌లో గాయపడ్డ ఊసరవెల్లి దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చి కాపాడి, బాగయ్యాక వదిలేశా. ♦ స్త్రీమూర్తుల ప్రభావం ఎక్కువ మా డాడీ లైఫ్‌లో, నా లైఫ్‌లో స్త్రీమూర్తుల ప్రభావం ఎక్కువ. అమ్మ, అక్క, చెల్లి - వీళ్ళంతా మమ్మల్ని ప్రభావితం చేశారు. విమర్శించేది, మెచ్చుకొనేది ముందుగా వాళ్ళే. వాళ్ళు లేకుండా నేను లేను. ఇప్పుడు మా ఆవిడ వచ్చి చేరింది. ♦ ఇంట్లో లుంగీనే! ‘బ్రూస్లీ’లో లుంగీ డ్యాన్స్ చూసి డాడీ సినిమాలు, షారుఖ్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లాంటివి గుర్తు చేసుకున్నారు. నిజానికి సెట్స్‌లో, బయట రకరకాల డిజైనర్ దుస్తులు వేసుకొని, వేసుకొని విసుగొచ్చేసింది. అందుకే, ఇంటికి రాగానే హాయిగా లుంగీ కట్టుకుంటా. ఇంట్లో ఎప్పుడూ ఖద్దరు చొక్కాలు, తెల్ల జుబ్బాలు వేసుకుంటా. లుంగీ కట్టుకోవడంతో వర్క్ నుంచి బయట పడి రిలాక్సైన ఫీలింగ్ ఉంటుంది. ♦ అమ్మ... సహనం ఇంట్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కోటి- అమ్మ నుంచి సహనం అలవరచు కున్నా. అలసి ఇంటికొచ్చాక, అమ్మ పెద్ద రిలాక్సేషన్. బయటివి మాట్లాడదు. మంచీచెడ్డా కనుక్కుంటుంది. ♦ నాన్న... స్విచ్చాన్, స్విచ్చాఫ్ సినిమా వార్తలు, పేపర్లు, విషయాలన్నీ డ్రాయింగ్ రూమ్ వరకే తప్ప, బెడ్రూమున్న ఫ్లోర్‌కు రానిచ్చేవారు కాదు డాడీ. స్విచ్చాన్, స్విచ్చాఫ్. నేనూ అలా ప్రయత్నిస్తున్నా. ♦ అక్కయ్య... స్టైలింగ్ అక్క సుస్మితకు క్రియేటివిటీ ఎక్కువ. ఫ్యాషన్ డిజైనింగ్ షోస్ చేసింది. మా డాడీ ఫిల్మ్స్‌కు స్టైలిస్ట్‌గా పనిచేసింది. నాకివాళ కొద్దిగా స్టైలింగ్‌పై అభిరుచి వచ్చిందంటే, అది అక్క చలవే. ♦ చెల్లెలు... శాంతం చెల్లి అచ్చం మా అమ్మ టైప్. సహన మెక్కువ. ఆవేశంతో రియాక్టవదు... శాంతం. అందరిలోకీ మోస్ట్ లవబుల్ చైల్డ్. డాడీకి గారాబుబిడ్డ. చెల్లి సహనం, శాంతం నేర్చుకుంటున్నా. ♦ మా ఆవిడ... సరదా, కలుపుగోలుతనం మాది పెద్ద కుటుంబం. అందరితో మా ఆవిడ ఉపాసన ఎలా సర్దుకుపోతుందా అని భయపడ్డా. కానీ, రాగానే అందరితో కలిసిపోయింది. సరదాగా ఉంటుంది. లంచ్‌కి కూర్చుంటే అందరికీ వడ్డిస్తుంది. - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ - ‘బాహుబలి... ది బిగినింగ్’
ఈ కలల లోకవిహారం... ప్లేట్ మీల్సా? ఫుల్ మీల్సా? .................................... చిత్రం - బాహుబలి... ది బిగినింగ్, తారాగణం - ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, రోహిణి, కథ - వి. విజయేంద్రప్రసాద్, కెమేరా - కె.కె. సెంథిల్ కుమార్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, కాస్ట్యూమ్స్ - రమా రాజమౌళి, ప్రశాంతి, ప్రొడక్షన్ డిజైనర్ - సాబూ శిరిల్, సంగీతం - ఎం.ఎం. కీరవాణి, ఫైట్స్ - పీటర్ హెయిన్, విజువల్ ఎఫెక్ట్స్ - వి. శ్రీనివాస మోహన్, సెకండ్ యూనిట్ దర్శకుడు - కార్తికేయ, లైన్ ప్రొడ్యూసర్ - శ్రీవల్లీ కీరవాణి, నిర్మాతలు - శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - ఎస్.ఎస్. రాజమౌళి .............................. ఆలోచనలు అందరికీ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టేవాళ్ళు కొందరే. వెండితెర కలలు కనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ, వాటిని నిజం చేసుకోవడానికి ఏళ్ళ తరబడి అనుక్షణం శ్రమించేవారు మాత్రం అతి కొందరే. ‘బాహుబలి... ది బిగినింగ్’ సినిమా చూసినప్పుడు - ఇలాంటి బ్రహ్మాండమైన సెల్యులాయిడ్ శిల్పాన్ని స్వప్నించేవాళ్ళు, కల గన్నా కార్యరూపంలో పెట్టేవాళ్ళూ వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంతమంది కూడా ఉండరనిపిస్తుంది. అందుకే, ఈ కల గని, కళ్ళ ముందు తెరపై మనకూ పంచిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని అభినందించకుండా ఉండలేమనిపిస్తుంది. అదే సమయంలో దాదాపు రెండేళ్ళుగా నిరంతరం ప్రచారంలో ఉన్న ఈ సినిమా పార్ట్1లో ఉన్నట్టుండి ఆత్మ ఎక్కడో జారిపోయినట్లు అనిపిస్తుంది. కథ అటూ ఇటూ కాకుండా, అర్ధంతరంగానే ఆగిపోయిన భావన కలుగుతుంది. అద్భుతం కావాల్సిన ప్రయత్నం గమ్యానికి దూరంగానే ఆగిపోయిందా అని అనుమానం కలుగుతుంది. అన్నదమ్ముల పోరాటమే ‘బాహుబలి’ పక్కా జానపద కథ. కాలక్షేపం కథ. రాజకుటుంబానికి చెందిన మహిళ శివగామి (రమ్యకృష్ణ) వెన్నుకు బాణం గుచ్చుకొని, సైనికులు తరుముతుండగా పొత్తిళ్ళలోని పసిబాబును రక్షించడానికి ఎత్తైన జలపాతం దగ్గర ప్రయత్నిస్తుండగా సినిమా మొదలవుతుంది. నీటిలో నిండా మునిగిపోతున్నా, చేతిలోని పసికందును కాపాడుతుంది. ఆమె మరణిస్తుంది. ఆ పసిబిడ్డ గూడెంలో శివుడు (చిన్న ప్రభాస్)గా పెరుగుతాడు. పక్కనే ఉన్న ఎత్తైన జలపాతపు నీటి కొండను ఎక్కాలనుకొనే శివుడు అనుకోకుండా దొరికిన ఒక కొయ్య ముసుగును పట్టుకొని, తన కలల్లో కనిపిస్తున్న అవంతిక (తమన్నా)ను వెతకడానికి వెళతాడు. దేశభక్తులైన తిరుగుబాటు బృందంలో సభ్యురాలు అవంతిక. వాళ్ళంతా పక్కనే ఉన్న మాహిష్మతి రాజ్యంలోని రాజు భల్లాలదేవుడు (రానా) చెరలో పాతికేళ్ళుగా మగ్గుతున్న రాణి దేవసేన (అనుష్క)ను విముక్తురాలిని చేయాలని చూస్తుంటారు. అవంతిక, శివుడు ప్రేమలో పడతారు. దేవసేన తన సొంత తల్లి అని తెలియకుండానే శివుడు, ఆమెను కాపాడే పనిని తన భుజానికి ఎత్తుకుంటాడు. భల్లాలదేవుణ్ణి ఎదిరించే క్రమంలో శివుణ్ణి చూసి ఆ రాజ్య ప్రజలు చనిపోయిన తమ మహారాజు అమరేంద్ర బాహుబలి (పెద్ద ప్రభాస్)ను గుర్తుచేసుకుంటారు. తానెవరన్నది శివుడికి అనుమానం వస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో శివుడి కన్నతండ్రి అయిన ఆ బాహుబలి కథ చూపిస్తారు. యాభై ఏళ్ళ క్రితం జరిగిన ఆ కథలో బాహుబలి తండ్రి మహారాజు. ఆ మహారాజుకు అన్న బిజ్జాలదేవుడు (నాజర్). అన్నకున్న వ్యసనాల వల్ల అతణ్ణి కాదని తమ్ముణ్ణి రాజును చేస్తారన్నమాట. భార్య గర్భవతిగా ఉండగానే మహరాజు చనిపోతాడు. అప్పుడు బిజ్జాలదేవుడి భార్య శివగామి (రమ్యకృష్ణ) రాజ్యభారం చూస్తుంది. ఒక పక్క తన కొడుకు భల్లాలదేవుడు (రానా)నూ, మరోపక్క మరణించిన మహారాజు దంపతుల కొడుకు బాహుబలి (పెద్ద ప్రభాస్)నూ పెంచుతుంది. వారు పెద్దయ్యాక, ఎవరిని రాజును చేయాలనే పోటీ వస్తుంది. అప్పుడే దేశంపై దండెత్తిన కాలకేయులతో పెద్ద యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో వారిని ఓడించి, ప్రజల బాగు కోసం చూసిన బాహుబలి రాజు అవుతాడు. అక్కడి దాకా ఫ్లాష్‌బ్యాక్. మరి, ఆ పెద్ద బాహుబలి ఎలా చనిపోయాడు? వెన్నంటి ఉండే నమ్మకస్థుడైన సేనాయోధుడు కట్టప్ప (సత్యరాజ్) అతణ్ణి ఎందుకు చంపాడు? బాహుబలి భార్య దేవసేన (అనుష్క) కథేమిటి? రాజ్యకాంక్ష ఉన్న భల్లాలదేవుడు ఆమెను పాతికేళ్ళుగా ఎందుకు చెరలో ఉంచాడు? ఇలా సవాలక్ష ప్రశ్నలకు జవాబుల కోసం 2016లో వచ్చే ‘బాహుబలి... ది కన్‌క్లూజన్’ అనే రెండో పార్ట్ కోసం ఎదురుచూడాల్సిందేనంటూ ఈ ఫస్ట్‌పార్ట్ ముగుస్తుంది. రానాయే కాదు... ప్రభాసూ ఇంపార్టెంటే! రిలీజ్‌కు ముందు ఈ సినిమాలో ప్రభాస్‌కు పాత్ర తక్కువా, రానాకు ఎక్కువా లాంటి చర్చలు జరిగాయి. కానీ, సినిమాలో దాదాపుగా ఇద్దరికీ సమానమైన డ్యూరేషన్ ఉంది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో బాహుబలి పాత్రలో ప్రభాస్ కాసేపు కనిపిస్తాడు. అయితే, ప్రధానంగా సినిమాలో ఎక్కువ సేపు కనిపించేది యువకుడైన శివుడి పాత్రలోనే. అమరేంద్ర బాహుబలి పాత్రలో ఎక్కువగా వీరత్వ, ధీరత్వ లక్షణాలనూ, శివుడు పాత్రలో చలాకీతనంతో పాటు చిన్నపాటి తుంటరితనం, ప్రేమ, సాహసం లాంటి లక్షణాలనూ దర్శకుడు చూపే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ ఈ రెండు పాత్రలనూ ఆ మేరకు పోషించాడు. అయితే, అతని నటనా ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే భావోద్వేగభరిత సన్నివేశాలు ఆయనకు ఈ పార్ట్‌లో రాలేదనే చెప్పాలి. విలన్ భల్లాలదేవుడిగా రానా విగ్రహం, వాచికం బాగున్నాయి. క్రూరత్వాన్నీ, కుటిలత్వాన్నీ బాగానే పలికించారు. బాహుబలి భార్య దేవసేనగా వయసు మీద పడ్డ పాత్రలో అనుష్క కాళ్ళకూ, చేతులకూ సంకెళ్ళతోనే కనిపిస్తుంది. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమె కనిపించేది చాలా కొద్ది సేపే. డైలాగులూ ఒకటీ, అరానే! ఒకపక్క గ్లామర్ పాత్రలు పోషిస్తున్న టైమ్‌లో ఇలాంటి పాత్రకు ఆమె ఒప్పుకోవడం, చేయడం విశేషమే. ఒక నమ్మకస్థుడు... ఒక భీకర ప్రతినాయకుడు... శివుడి పాత్రకు పెయిర్ అవంతికగా తమన్నా తన మిల్కీ వైట్ ఛాయతో అందంగా మెరిసింది. అదే సమయంలో తన హైటూ, వెయిటూ సరిపోకపోయినా, ఖడ్గం, విల్లంబులు ధరించిన యోధురాలిగానూ వీరరస పోషణ చేసింది. ఎడమ చేయి అవుడుగా ఉండే బిజ్జాల దేవుడిగా నాజర్ విలనిజమ్ బాగుంది. మాహిష్మతి రాజ్యంలో ప్రభువుల రక్షణకే కట్టుబడిన కట్టుబానిస, ఆయుధాగార అధిపతి కట్టప్పగా సత్యరాజ్ అభినయం గంభీరంగా, పాత్రౌచిత్యాన్ని పెంచేలా ఆకట్టుకుంది. ఆటవిక తెగ కాలకేయు’లకు అధిపతి అయిన కాలకేయుడిగా ప్రభాకర్ ఆహార్యం, కళ్ళలోని క్రూరత్వం ఒక దశలో ఇతర విలన్లను మించినట్లుగానూ అనిపిస్తుంది. ఆ పాత్రకు ప్రత్యేకంగా సృష్టించిన భాష విచిత్రంగా వినిపిస్తూ, ఆకట్టుకుంటుంది. బిజ్జాలదేవుడి భార్య, రాజమాత అయిన శివగామి పాత్రలో రమ్యకృష్ణ హుందాతనాన్నీ, రాజసాన్నీ బాగా పండించారు. తెలుగులో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పారు. ఒకటి, రెండు చోట్ల మాత్రం తెలుగు మాటల ఉచ్చారణలో మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. శివుణ్ణి పెంచిన గిరిజన గూడెం దంపతులు దొర, సంగిగా ప్రభాకర్, రోహిణి కనిపిస్తారు. సినిమా సెకండాఫ్‌లో మద్యం దుకాణం ఓనర్‌గా ఒక సీన్, ఒక డైలాగ్‌తో రాజమౌళి తెరపై కనిపిస్తారు. తెరపై... స్వప్నసాక్షాత్కారం ఇలాంటి కథలు బ్లాక్ అండ్ వైట్ శకం నుంచి మనం చూస్తున్నవే. కాకపోతే, రంగుల్లో, టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్‌తో వచ్చిన విజువల్ గ్రాండియర్ తోడైంది. కళ, ఛాయాగ్రహణం, కూర్పు, రచన - ఇలా అన్ని కళల సమాహార రూపంగా సినిమా తయారైన తీరు తెరపై కనిపిస్తుంటుంది. రాజమౌళి ఊహించిన దృశ్యాలకు వెండితెర రూపం రావడానికి ఈ విభాగాల కృషి బాగా ఉపకరించింది. ఈ సినిమా కోసం వేసిన సెట్లు, తయారు చేసిన ఆయుధాలు, రథాలు (జాతీయ అవార్డు గ్రహీత సాబూ శిరిల్ప్రొడక్షన్ డిజైనర్), కాస్ట్యూమ్స్ (రమా రాజమౌళి, ప్రశాంతి) ఆ కథాకాలానికి తీసుకువెళతాయి. తెలుగువాడైన జాతీయ అవార్డు విజేత వి. శ్రీనివాస మోహన్ సారథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొన్ని పదుల మంది కృషి చేసిన సినిమా ఇది. మైళ్ళ కొద్దీ ఎత్తున్న జలపాతం, భారీ ప్రాసాదాలు, జంతువులు - ఇలా ప్రతిదీ ఏది విజువల్ ఎఫెక్ట్, ఏది వాస్తవం - అనే తేడా తెలియనివ్వకపోవడంలో ఈ టీమ్ కృషి, రాజమౌళి చెక్కుడు అర్థమవుతుంది. టాప్ యాంగిల్ షాట్లో రాజప్రాసాదంలో నడిచివచ్చే సీన్, నీళ్ళ మీదుగా శివుడు గెంతే సీన్ లాంటి కెమేరా పనితనపు ఉదాహరణలు అనేకం. సంగీతమే ప్లస్సూ... మైనస్సూ! విచిత్రంగా ఈ సినిమాకు కీరవాణి సంగీతమే ప్లస్సూ, మైనస్సూ కూడా. కీరవాణి సంగీతంలో పాటలు గొప్పగా అనిపించవు. ‘పచ్చబొట్టు...’ పాట, బిట్ సాంగ్ అయిన ‘నిప్పులో శ్వాసగా...’ లాంటి ఒకటీ అరానే బాగున్నాయి. ఆడియో వీక్ అయినా, సినిమా రీరికార్డింగ్ మాత్రం తెర మీది దృశ్యాల్లోని గాఢతను ఒకటికి పదింతలు చేసేలా సాగడం విశేషం. లోపాలు బోలెడు..! వార్ సీన్స్ సూపర్..! తమిళ, తెలుగు, కన్నడ (‘ఈగ’ ఫేమ్ సుదీప్ ఒక్క సీన్ వేషంలో కనిపించారు) సినీ తారలు ముగ్గురినీ పెట్టుకోవడం మంచి బిజినెస్ స్ట్రేటజీయే. దక్షిణాది భాషల్లో విడుదలైనప్పుడు ఆ స్టార్ పవర్ సినిమాకు కలిసొస్తుందని దర్శక, నిర్మాతలు మంచి స్ట్రేటజీయే వేశారు. కానీ, ఆ పనితనం కథ, కథనం మీద కూడా పెట్టాల్సింది. 'ట్రాయ్’, ‘300’, ‘మాస్క్ ఆఫ్ జోర్’ లాంటి అనేక సినిమాల ప్రభావం స్పష్టంగా ఉన్నప్పటికీ తెరపై చూపిన కథలో లోపాలున్నాయి. ఫస్టాఫ్ ఎక్కువగా చిన్న ప్రభాస్, తమన్నాల మధ్య ప్రేమకే అంకితమైనట్లు అనిపిస్తుంది. డ్రీమ్ సాంగ్ ‘ధీవర...’ కానీ, ప్రేమగీతం ‘పచ్చబొట్టు...’ కానీ సినిమా నిడివినే పెంచాయి తప్ప, ప్రేక్షకుల ఇన్వాల్వ్మెంట్ను పెంచలేదు. రాజమౌళి సినిమాల్లో తరచూ ఉండే బలమైన ఇంటర్వెల్ పాయింట్ ఇందులో మిస్సయ్యామా అనిపిస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. కానీ, అక్కడి ఐటమ్ సాంగ్ జానపదం సెటప్‌లో కాక, కౌబాయ్ సెటప్‌లో రావాల్సిన పాటేమో అనిపిస్తుంది. ఆ పాట కూడా కథాగమనానికి అడ్డే. ఇక, కాలకేయులు అంత హఠాత్తుగా వచ్చి, మాహిష్మతిపై ఎందుకు యుద్ధం చేస్తారో అర్థం కాదు. అలాగే, అనుష్కను కాపాడాలనుకొనే బృందం ఆ పనిలో ఎందుకుందో, తమన్నాకూ ఆ పనికీ సంబంధం ఏమిటో, చిన్న ప్రభాస్ కేవలం చెక్క కొయ్య ముసుగు ఆధారంగా తమన్నాను ఊహించుకుంటూ మబ్బుల్లో ఉండే ఆ నీటికొండను ఎక్కడమేమిటో అర్థం కాదు. దాదాపు 25 నిమిషాలుండే యుద్ధ సన్నివేశాలు మాత్రం హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయి. అవన్నీ వీడియో గేమ్‌లకు అలవాటు పడిన ఈ తరం చిన్న పిల్లల్ని ఆకట్టుకుంటాయి. అయితే, వీటితో పాటు వీటన్నిటినీ బలంగా ముడివేసే తల్లీ కొడుకుల అనుబంధం లాంటి ఎమోషన్స్ మీద మరింత వర్క్ చేసి ఉండాల్సింది. రెండు పార్ట్లు చేయడమే లోపమా? తెరపై ఒక కథను పూర్తిగా చూడడం, చదవడం అలవాటైన తెలుగు ప్రేక్షకులకు రెండు పార్ట్‌లుగా ఒక కథను చూపాలనుకోవడం ఒక రకంగా సాహసమే. అయితే, అలా చేస్తున్నప్పుడు తరువాతి పార్ట్ కోసం ఒక ఆసక్తికరమైన లింక్‌ను అసంపూర్తిగా వదిలిపెట్టడం వరకైతే ఫరవాలేదు కానీ, ఏ పార్ట్‌కు ఆ పార్ట్ వరకు కథలో ఒక కంప్లీట్‌నెస్ ఉండేలా జాగ్రత్తపడాలి. అలా చేయకపోతే, కథ అసంపూర్తిగా ఆగిందంటూ, ప్రేక్షకుడు అంత సినిమా చూసీ, అసంతృప్తిగా బయటకు తిరిగొస్తాడు. ‘బాహుబలి... ది బిగినింగ్’ అనే ఈ ఫస్ట్ పార్ట్‌లో జరిగింది అదే! నిజానికి, దీన్ని ఒక సినిమాగా తీయాలనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తీరా కొన్ని నెలల షూటింగ్ తరువాత - భారీ బడ్జెట్ వల్లనో, మరే కారణం వల్లనో కానీ రెండు పార్ట్‌లుగా తీయాలనీ, విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్లే, కథలో, కథనంలో అనివార్యంగా మార్పులు చేసుకున్నట్లున్నారు. ఫలితంగా, సినిమాలో అక్కడక్కడ కొన్ని సందర్భాలు చాలా ఆసక్తికరంగా అనిపించినా, ఆద్యంతం ఆ టెంపోనూ, ఫ్లోనూ కొనసాగించలేకపోయారు. విందు భోజనం పెడతామని వాగ్దానం చేసినప్పుడు, లేదా ప్రిపేరై వచ్చినప్పుడు పెట్టేవాళ్ళ మాటేమో కానీ, తినేవాళ్ళు మాత్రం విందు భోజనానికే సిద్ధమై వస్తారు. కానీ, తీరా ఫుల్ మీల్స్ కాదు కదా... ప్లేట్ మీల్స్ పెట్టి పంపిస్తే... వచ్చినవాళ్ళకు అసంతృప్తి కలుగుతుంది. ‘బాహుబలి’ పార్ట్1 చూసి బయటకొస్తున్నవాళ్ళ ఫీలింగ్ దాదాపు అదే! ఆకాశమే హద్దుగా జరిగిన ప్రచారం, ‘తెలుగు సినిమా ప్రమాణాలను హాలీవుడ్‌కు చేరుస్తుంది’ అంటూ వచ్చిన పోలిక, ఆశ్చర్యపరుస్తుందంటూ యూనిట్ సభ్యులు చేసిన వాగ్దానం లాంటివన్నీ ‘బాహుబలి’కి పాజిటివ్ కన్నా నెగిటివ్ అయ్యే ప్రమాదం మొదటి రోజు థియేటర్ల దగ్గర కనిపించింది. విజువల్‌గా ఎంతో బాగుందనిపించినా, కథతో, కథనంతో పూర్తిస్థాయి తృప్తి కలగకపోతే, ఆ తప్పు ప్రేక్షకులది మాత్రం కానే కాదు. కొసమెరుపు - రెండు గంటల నలభై నిమిషాలూ చూశాక, ఈ సినిమా ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా’ అవునో కాదో కానీ, ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు డెరైక్టర్ రాజమౌళి’ అని మాత్రం అర్థమవుతుంది. -రెంటాల జయదేవ -
లవ్లీ చిక్కుముడి
మలయాళీ అమ్మాయిల జుట్టు చూస్తే ఓ చిక్కుముడుల ప్రేమకథలా అనిపిస్తుంది. అమ్మాయి జుట్టులోనే ఇన్ని చిక్కులుంటే ఆమెతో ప్రేమలో ఎన్ని ముడులుంటాయో! జుట్టుకైతే దువ్వెనకున్న పళ్లు బలి అవుతాయి. మరి ఆమె ప్రేమకు? పళ్లు ఊడేకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా అన్నది డౌటే! ‘ప్రేమమ్’ సినిమా కేరళను మాన్సూన్లా తాకింది. ఆకాశం నుంచి కాసులు ఊడిపడుతున్నాయి. రికార్డుల ఉరుములు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పట్లో ఆగే వర్షంలా లేదు. త్వరలోనే రీమేక్‌గా మనల్నీ తాకవచ్చు. రామ్ ఎడిటర్, ఫీచర్స్ జూన్ మూడోవారం... తిరువనంతపురంలోని హాలు. బుకింగ్ ఇంకా తెరవలేదు... క్రిక్కిరిసిన జనం... ఎక్కువభాగం యూత్... కాలేజీ కుర్రకారు. పదిహేను రోజుల పైగా మలయాళ సీమను ఉర్రూతలూపేస్తున్న ఆ సినిమాను ఎలాగైనా చూడాలని వాళ్ళలో ఉత్సాహం... రోజుకు అయిదాటలు వేస్తున్నా, క్రేజ్ తగ్గని ఆ సినిమాకు టికెట్లు దొరుకుతాయో లేదో అని చిన్న ఉత్కంఠ... ఇంతలో ఉన్నట్టుండి పోలీసులు ప్రత్యక్షమయ్యారు. కారణం - ఊళ్లోని కాలేజీ స్టూడెంట్లు మూకుమ్మడిగా క్లాసులకు ఎగనామం పెట్టి, సదరు సినిమాకు వస్తున్నారని కంప్లయింట్స్! అరవైమందికి పైగా స్టూడెంట్స్‌ను పోలీసులు బలవంతాన వెనక్కి పంపాల్సి వచ్చింది. కనివినీ ఎరుగని ఈ సంఘటనకు కారణమైన ఆ మలయాళ సినిమా విడుదలై ఇవాళ్టికి నెల దాటింది. ఈ అయిదోవారంలోనూ జనం వేలంవెర్రిగా వస్తూనే ఉన్నారు. టికెట్ల కోసం పై స్థాయి నుంచి ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఒక్క కేరళలోనే కాదు... రిలీజైన ప్రతిచోటా ఇదే పరిస్థితి. ఆ లేటెస్ట్ హిట్.. ‘ప్రేమమ్’ (లవ్ అని అర్థం). బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్! రిలీజైన రెండు వారాల్లో... ఒక్క కేరళలోనే రూ. 20 కోట్లు వసూలు చేసిన ‘ప్రేమమ్’ ఇవాళ టాక్ ఆఫ్ ది సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మొదటివారంలో మలయాళ బిగ్గెస్ట్ హిట్స్ ‘దృశ్యం’, ‘బెంగుళూర్ డేస్’లను మించి, వసూలు చేసిందీ సినిమా. ఇప్పుడు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్... అన్నిచోట్లా హౌస్‌ఫుల్‌గా ఆడుతోంది. ఈ వరుస చూస్తుంటే, రాగల రోజుల్లో ‘ప్రేమమ్’ రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించి, ‘మల్లు’ ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల్చినా ఆశ్చర్యం లేదు. మమ్మూటి, మోహన్‌లాల్ లాంటి టాప్స్టార్సెవరూ లేని ‘ప్రేమమ్’కు ఇంత క్రేజేంటి? మలయాళ సీమలో వాళ్ళే ఇప్పటికీ టాప్ స్టార్స్. కానీ, వాళ్ళ అభిమానులు పెద్దవాళ్ళయిపోతుంటే, సినిమాలకు మహారాజ పోషకులైన యూత్‌లో కొత్తతరం నటులకు క్రేజ్ పెరుగుతోంది. సమకాలీన కథలనే ఎక్కువగా కోరుకుంటున్నారు. తమ అనుభవాలనూ, తమలో ఒకడిగా అనిపించే హీరోనూ తెరపై చూడడానికి ఇష్టపడుతున్నారు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘బెంగుళూర్ డేస్’ లాంటివి బాగా ఆడడానికీ, ఆ చిత్రాల ఫేమ్ 30 ఏళ్ల నివిన్ పౌలీ (‘ప్రేమమ్’లో హీరో కూడా ఇతనే) హాట్‌స్టార్‌గా మారడానికీ అదే కారణం. గుర్తుకొస్తున్నాయీ... గుర్తుకొస్తున్నాయీ! రోజూ సినిమాలను కళ్ళతో చూస్తాం. చెవులతో వింటాం. కానీ, ‘ప్రేమమ్’ లాంటి కొన్ని మాత్రం కళ్ళకు కాదు, మనసుకు పని చెబుతాయి. తెర మీది విజువల్సే స్టెతస్కోపై మర్చిపోయిన మన గుండె చప్పుడును మనకే వినిపిస్తాయి. నోస్టాల్జియా ఎప్పుడైనా, ఎవరికైనా మధుర జ్ఞాపకమే. చిన్నప్పటి అదుపు లేని అల్లరి... బాధ్యతలు తెలియని రోజుల్లో చేసిన చేష్టలు... టీనేజీ కాలేజీ వయసులో తిరిగిన రోడ్లు... కలిసిన స్నేహాలు... ప్రేమ కోసం పడినపాట్లు... కళ్ళ ముందే కరిగిన కలలు... అన్నీ ఎవరికి వారికే యునీక్ ఎక్స్పీరియన్స్. అదే సమయంలో ఆ దృశ్యాలన్నీ అందరిలో ఒకే తీగను సమశ్రుతిలో కదిలించే మ్యూజికల్ సింఫనీలు. ‘ప్రేమమ్’ చేసిన పని అదే. ముప్ఫై ఒక్క ఏళ్ళ క్రితం పుట్టిన ఒక కుర్రాడి జీవితం ఇది. కథలోని హీరోలానే 1984లోనే పుట్టిన 31 ఏళ్ళ డెరైక్టర్ అల్ఫోన్స్ పుతరెన్ తన అనుభవాలను ఈ సినిమాగా అందించారా అనిపిస్తుంది. మొదట టీనేజ్‌లో, తరువాత కాలేజ్‌లో, చివరకు కెరీర్లో సెటిలైన స్టేజ్‌లో కథానాయక పాత్రకు ఎదురైన మోహావేశపు ప్రేమానుభూతులు ఈ సినిమాలో కనిపిస్తాయి. అవన్నీ మనల్ని ఫ్లాష్‌బ్యాక్‌లోకి నడిపిస్తాయి. తెరపై ఉన్న పాత్రల్లో ఏదో ఒకదానితో, మరేదో ఒక సందర్భంలో మనల్ని మనం చూసుకొనేలా జీవితాన్ని గుర్తుచేస్తాయి. ఈ సినిమా ప్రధాన బలం అదే! ఫస్ట్ ఫిల్మ్‌తోనే... టాప్ హీరోయిన్స్ కథానాయక పాత్ర జార్జ్ (నివిన్ పౌలీ) జీవితంలోని వివిధ ఘట్టాల్లో ప్రేమను అనుభూతించిన ప్రతి క్షణం మన గుండె కూడా ‘లవ్... డబ్... లవ్... డబ్’ అని కొట్టుకుంటుంది. ఊహించని అడ్డంకులెదురైన ప్రతిసారీ, ఎలాగైనా అతని ప్రేమ గెలిస్తే, మనమూ గెలిచినట్లే అనుకుంటాం. ఈ సహానుభూతి ఇవాళ ప్రతిచోటా ‘ప్రేమమ్’ను స్పెషల్‌గా నిలబెడుతోంది. కలెక్షన్స్ రాబడుతోంది. ఇలాంటి కథలు గతంలో కూడా వచ్చాయి కదా! ‘ప్రేమమ్’ గొప్పేంటట? దానికి జవాబు - ఫ్రెష్‌నెస్. డిగ్రీ సెకండియర్ చదువుతున్న ‘సాదాసీదా జీన్స్, చుడీదార్ అమ్మాయి’ అనుపమా పరమేశ్వరన్‌కు ఇదే మొదటి సినిమా. అయితేనేం? టీనేజ్ హీరో ప్రేమించే స్టూడెంట్ మేరీ పాత్రలో అమాయకమైన చిరునవ్వుతో ఈ కేరళ కుట్టి అందరి హృదయాలనూ కొల్లగొట్టింది. పోస్టర్ల నిండా ఆమె ఫోటోలే. మరో ప్రేమికురాలైన లెక్చరర్ మలర్ పాత్ర పోషించిన తమిళ పొన్ను సాయి పల్లవి జార్జియాలో ఫైనలియర్ ఎమ్బీబీయస్ స్టూడెంట్. డ్యాన్స్ రియాలిటీ షోలలో కొన్నేళ్ళ క్రితం ఆమెను టీవీలో చూసిన డెరైక్టర్ ప్రత్యేకంగా ఫేస్బుక్లో, ఫోన్లో వెంటపడి మరీ ఆమెను ఎంచుకున్నారు. మొటిమలతో ఎర్రబడ్డ కుడి చెంపతో మన పక్కింటి అమ్మాయే అనిపించే సాయి పల్లవి ఈ ఫస్ట్ఫిల్మ్తోనే ఇవాళ కేరళ కుర్రకారు గుండె చప్పుడు. టెక్నికల్ ఫ్రెష్‌నెస్... మ్యూజికల్ మ్యాజిక్ కథకు కీలకమైన ఈ హీరోయిన్లతో సహా ఏకంగా 17 మంది కొత్త ముఖాలను పరిచయం చేసిన ఈ మలయాళ ఫిల్మ్‌లో సన్నివేశాలు, డైలాగ్స్ సమకాలీన మలయాళ సమాజపు మట్టిపరిమళాన్ని గుప్పుమనిపిస్తాయి. ఈ తాజాదనపు అనుభూతికి కెమేరా (ఆనంద్ సి. చంద్రన్), ఎడిటింగ్ (దర్శక - రచయిత అల్ఫోన్స్ పుతరెన్), మ్యూజిక్ (రాజేశ్ మురుగేశన్) అదనపు చేర్పు. రెగ్యులర్ ఫార్మట్‌కు భిన్నంగా లైటింగ్ నుంచి కలర్ గ్రెడేషన్ దాకా అన్నిటిలో రియలిజానికే పెద్దపీట. ఎడిటింగూ అంతే! ఏడు మలయాళం పాటలు, 2 తమిళ పాటలు... పెద్ద మ్యూజికల్ హిట్. ‘ఆళువా పుళయుడ తీరత్తు..’(ఆళువా ఏటి ఒడ్డున), విజయ్ ఏసుదాస్ పాడిన ‘మలరే...’ పాటలు ఇప్పుడు కేరళలో వినిపించని ఊరు లేదు. ఎక్స్ట్రీమ్ క్లోజప్పులతో సాగే కొన్ని దృశ్యాలలో, డైలాగుల్లేకుండా హీరో రోదించే సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకం. ఇలాంటి కొత్త తరహా పనితీరు సినిమాకు మరింత కొంగ్రొత్తదనాన్ని సంతరించింది. అది ‘ప్రేమమ్’కు మరో ఎడ్వాంటేజ్. అలుపెరుగని అన్వేషణ ఈ సినిమాకూ, తమిళంలో చేరన్ తీసిన ‘ఆటోగ్రాఫ్’ (రవితేజతో రీమేకైన ‘నా ఆటోగ్రాఫ్...’)కూ పోలికలున్నాయని కొందరు తేలిగ్గా తీసిపారేయచ్చు. కానీ, ఆ పోలిక మహా అయితే కథాంశం వరకే. ఇక్కడి సీన్లు డిఫరెంట్. ఆలోచనకు అవకాశం, అవసరం ఇవ్వని రొటీన్ ఫిల్మ్స్‌కు అలవాటుపడిపోయిన కళ్ళకు ఈ రెండుమ్ముప్పావు గంటల లవ్‌స్టోరీ సుదీర్ఘంగా అనిపించవచ్చు. కానీ, ‘ప్రేమమ్’ గుర్తుకుతెచ్చే జ్ఞాపకాలతో పోలిస్తే, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయమే కాదు. తేనె కోసం పువ్వులను వెతికే సీతాకోక చిలుకలా, మనిషి ప్రేమ కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ అన్వేషణ ఫెయిల్ కావచ్చు. ఆ క్రమంలో పరిస్థితుల్లో వచ్చే అతి చిన్న మార్పులు సైతం ఫలితంపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఆఖరుకు ఎక్కడో ఒకచోట అన్వేషణ సక్సెసై, సెటిలవుతాడు. స్థూలంగా... ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’. తెరపై సీతాకోక చిలుకల్ని పదే పదే చూపిన డెరైక్టర్ మాటల్లో, ‘బటర్‌ఫ్లైస్ ఆర్ మెంటల్లీ మెంటల్, సో ఈజ్ లవ్!’ మొత్తానికి, మొన్న మే నెలాఖరుకు కేరళ తీరాన్ని ఒకటి కాదు... రెండు పవనాలు తాకాయి. మొదటిది - చిరుజల్లుల నైరుతీ ఋతుపవనాలు. రెండోది - మంచి సినిమాల కోసం తపిస్తున్న ప్రేక్షకుడిని తాకిన సినీ మలయసమీరం ‘ప్రేమమ్’. రెండూ తాపాన్ని తీర్చి, పరిసరాల్ని ఆహ్లాదంగా మార్చినవే! కావాలంటే, దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్‌కు వెళ్ళండి. టికెట్లు ముందే బుక్ చేసుకొని, ప్రేమిస్తున్నవాళ్ళను వెంటపెట్టుకొని మరీ వెళ్ళండి. ‘ప్రేమ’(మ్) డిజప్పాయింట్ చేయదు! మలయాళం రాకపోయినా, ఈ సినిమా విజువల్‌గా మనకు ఒక అనుభూతిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. భావాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. విజువల్ మీడియమైన సినిమా చేయాల్సింది అదే కదా! - రెంటాల జయదేవ కేరళ... కేరాఫ్ అడ్రస్ టు...సెన్సిబుల్ కమర్షియల్ సినిమా మలయాళ సినిమా అనగానే ‘బిట్లు’ కలిపిన బూతు బొమ్మలనే దురభిప్రాయం. పాతుకుపోయిన ఈ భావాన్ని తుడిచిపెట్టేలా రిలీజవుతున్న కొత్త తరం సినిమాల్లో లేటెస్ట్ వన్ ‘ప్రేమమ్’. తెరపైన మంచి కథలు చెప్పడంతో ఆగకుండా, సినిమాటిక్ మీడియమ్‌పై గౌరవం పెంచేలా జీవితాన్ని తెరకెక్కించడంలో మలయాళ సినిమా ముందుంది. అందుకు తాజా ఉదాహరణలు - నిన్నటి ‘బెంగుళూర్ డేస్’, ఇవాళ్టి ‘ప్రేమమ్’. యాదృచ్ఛికంగా ఈ రెండు ఫీల్‌గుడ్ మూవీస్‌తో బాక్సాఫీస్ వద్ద జాక్‌పాట్ కొట్టిన నిర్మాత ఒకరే! అన్వర్ రషీద్! దర్శకుడిగా మొదలైన రషీద్‌ను భావోద్వేగాలున్న కమర్షియల్ కథలను సొంతంగా నిర్మించాలనే ఆలోచన తొలిచేసింది. అదే టైమ్‌లో అంజలీ మీనన్ తీసిన ‘హ్యాపీ జర్నీ’ చూసి, గుమ్మైయారు. ఆమె దర్శకత్వంలోనే ‘బెంగుళూర్ డేస్’తో నిర్మాత అవతారమెత్తారు. గత ఏడాది రిలీజై, అభినందనలు, ఆదాయం - రెండూ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో సహా అనేక భాషల్లో రీమేక్ అవుతోంది. ఇప్పుడీ ‘ప్రేమమ్’ దర్శకుడు అల్ఫోన్స్ పుతెరెన్కు కూడా రషీద్ అలానే ఛాన్సిచ్చారు. అల్ఫోన్స్ తొలి సినిమా తమిళ, మలయాళ ద్విభాషా చిత్రం ‘నేరమ్’ (టైమ్ అని అర్థం). రెండేళ్ళ క్రితం సరిగ్గా మే నెలలోనే వచ్చి, హిట్టయిన ఈ కామెడీ థ్రిల్లర్ రషీద్‌కు బాగా నచ్చింది. ‘ప్రేమమ్’ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాత రషీదే చెప్పినట్లు, ‘ప్రేమమ్’ ఏదో ఆర్ట్ సినిమా కాదు. సున్నితమైన విషయాలను గుర్తు చేస్తూనే, వినోదాత్మక అంశాలనూ రంగరించిన కమర్షియల్ ఫిల్మ్. ఒక్క మాటలో- సెన్సిబిలిటీ, కమర్షియాలిటీల సమరస సమ్మేళనం. రీమేక్ రైట్స్ కోట్లలో పలుకుతున్న ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో మనం చేయలేమా! -
సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్!
సదరన్ స్పైస్ మీరు అతణ్ణి ద్వేషించడాన్ని ప్రేమిస్తారు. మీరు అతణ్ణి ప్రేమించడాన్ని ద్వేషిస్తారు. ప్రేమిస్తారు. ద్వేషిస్తారు. కాని- ఎప్పుడూ తీసి పడేయలేరు. అలాంటి పిచ్చ పాపులారిటీ కొట్టేశాడు. సినిమాలు హిట్ కావడానికి పెద్ద హీరో, పెద్ద బడ్జెట్, పెద్ద కథ... ఎట్లీస్ట్ ఒకటైనా ఉండాలి. మూడు లేకుండా హిట్ కొట్టినోడు ఉపేంద్ర. అదే ఉపేంద్ర షాక్ వాల్యూ. ఊహించినదాని కంటే పిచ్చగా, ఊహించనంత పిచ్చగా... ఇదీ ఉప్పి ఫార్ములా. సినిమా స్టార్స్ అంటే స్పెషలే... కొందరు మాత్రం మరీ స్పెషల్. కన్నడసీమలో అందరూ ముద్దుగా ‘ఉప్పి’ అని పిలుచుకొనే ఉపేంద్ర అంతే! ఆయన యాక్టింగే కాదు... ఎంచుకొనే చిత్రమైన స్క్రిప్ట్‌లు... వేసే వేషాలు... చేసే సినిమాలు, పెట్టే పేర్లు, విచిత్రమైన హెయిర్‌స్టైల్స్... ఏవైనా అంతే! అవన్నీ... ఉపేంద్ర మార్కు స్పెషల్. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, పాటల రచయిత, గాయకుడు - ఇన్ని వేషాలూ ఉప్పిదాదా వేస్తాడు. కాకపోతే, ‘ఎడ్డెమంటే తెడ్డెమ’నే తరహా హీరో పాత్రలంటే మొదట గుర్తొస్తాడు. అలాంటి పాత్రలకు సౌతిండియన్ సినిమాలో అతనిదే పేటెంటన్నా తప్పు లేదేమో! ఆ క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్... మరెన్నో కమర్షియల్ పాత్రల సృష్టికి బీజం వేశాయి. కావాలంటే, మన పూరి జగన్నాథ్ ‘ఇడియట్’, ‘పోకిరి’ లాంటి హీరో పాత్రలు... ఉపేంద్ర సినిమాలు ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూడండి! చిన్నప్పటి నుంచీ ఉపేంద్ర అంతే! ‘నలుగురికీ నచ్చినది... నాకసలే ఇక నచ్చదురోయ్...’ టైపు. ఎంతో కష్టపడి పైకొచ్చాడు. నాన్న వంటవాడు. అమ్మ, తను, అన్న. పొట్టకూటి కోసం పళ్ళు, కూరలు తీసుకెళ్ళే కాగితపు కవర్లు తయారు చేశాడు. మిక్స్చర్, బూందీ ప్యాక్ చేసే ప్లాస్టిక్ కవర్లు చేశాడు. చేతిలో వంద రూపాయలుంటే గొప్ప అని బతికినరోజులవి. బంధువు, దర్శకుడు కాశీ నాథ్ (‘అనుభవం’ ఫేం) సాయంతో సినిమాల్లోకొచ్చాడు. అక్కడ నుంచి ఉప్పి జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. శాండల్‌వుడ్‌కు... క్రేజీ ఇమేజ్ 1990లలో ఉపేంద్ర ఎంట్రీ శాండల్‌వుడ్‌లో ఊహించని మలుపు. రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ల తరం జోరు తగ్గి, కొత్తవాళ్ళకు ఆడియన్స్ తలుపులు తెరుస్తున్న టైమ్‌లో ఉపేంద్ర ఎంటరయ్యాడు. అసలు ఆయన మొదలు పెట్టింది అసిస్టెంట్ డెరైక్టర్‌గా! ఆయన ఆగలేదు... డెరైక్టర్య్యాడు. విజయం సాధించాడు. అక్కడితో ఆగలేదు... హీరో అయ్యాడు. అన్నిసార్లు ఆగనివాడికి ఆ తరువాత ఎక్కడా ఆగాల్సిన అవసరమే రాలేదు. కొత్త మిలీనియమ్కు కాస్తంత ముందు నుంచి కన్నడ సినిమాలకు ఒక కొత్త క్రేజు, ఇమేజ్ వచ్చిందంటే - అది ఉపేంద్ర మ్యాజిక్. మొదట్లో కెమేరా ముందుకొచ్చి, చిన్న వేషాలేసిన ఉపేంద్ర. కాశీనాథ్ మార్క్ కామెడీ తర్లే నాన్ మగ(92)తో దర్శకుడయ్యాడు. అయితే, ఆడియన్స్‌ను ఆకర్షించాలంటే, భారీ బడ్జెటైనా ఉండాలి. షాకింగ్‌గా అనిపించే స్క్రిప్టైనా ఉండాలి. ఉప్పి రెండో రూట్ ఎంచుకున్నాడు. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ష్’ (’93) తీస్తే, అదీ హిట్టు. ఆ తరువాత శివరాజ్‌కుమార్‌ను హీరోగా పెట్టి తీసిన ‘ఓం’ (’95) ఒక పెద్ద కుదుపు. బెంగుళూరులోని రియల్ గ్యాంగ్స్టర్స్ జీవితాలను చూపెట్టిన సినిమా అది. అసలు సిసల్ గ్యాంగ్స్టర్స్నీ నటింపజేశాడు. మింగుడు పడనిది చూపెట్టి, అక్కడ నుంచి వెనక్కి వెళ్ళి, ఫ్లాష్‌బ్యాక్‌తో అదెంత సమంజసమో ఒప్పించే విచిత్రమైన స్క్రీన్‌ప్లే ‘ఓం’లో కనిపిస్తుంది. ఆ పద్ధతిలో వెళ్ళాలనుకొనే చాలామందికి ఇప్పటికీ అది టెక్స్ట్బుక్కే కాదు... గైడ్ కూడా! ఆ మూసలో ఇవాళ్టికీ కన్నడ సినిమాలు వస్తూనే ఉన్నాయి. నటి ప్రేమ తెరకు పరిచయమైంది ‘ఓం’తోనే. తెలుగుతో (రాజశేఖర్ ‘ఓంకారం’) సహా అనేకచోట్ల రీమేకైన ఈ ఫిల్మ్ 20 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ కన్నడంలో హాటే. ఇవాళ్టికీ రిలీజైనప్పుడల్లా, కాసులు కురిపిస్తోంది. అతనికి తిక్కుంది... కానీ లెక్కే లేదు! సినిమా ఫెయిల్... లవ్ సక్సెస్! ఉపేంద్ర ప్రేమ, పెళ్ళి - చాలా పెద్ద కథ. వివాదాస్పదమైన ‘హెచ్2ఓ’ ఘోరంగా ఫెయిలైతే అయింది కానీ, ఆ సినిమా హీరోయినైన బెంగాలీ నటి ప్రియాంకా త్రివేదీతో ఉపేంద్ర ప్రేమ మాత్రం సక్సెసైంది. ‘రా’ సినిమాతో మొదలైన వాళ్ళ స్నేహం... క్రమంగా ప్రేమగా మారి... ఈ సినిమాతో పెళ్ళి పీటలపెకైక్కింది. ముచ్చటైన సంసారం. వాళ్ళకిప్పుడు ఇద్దరు పిల్లలు... అబ్బాయి ఆయుష్ ఆరో తరగతి. అమ్మాయి ఐశ్వర్య అయిదో తరగతి. ఉపేంద్రలో రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఆయన నటిస్తారు. పాటలు రాస్తారు... పాడతారు. కథ చేస్తారు... సినిమా తీస్తారు... దాన్ని ప్రతిభ అనేవాళ్ళు కొందరు... పిచ్చి అనేవాళ్ళు మాత్రం ఎందరో! అది వేపకాయంతా... గుమ్మడికాయంతా? ఏమో తెలీదు. కానీ, ఏది చెప్పినా ముక్కుసూటిగా కాదు... ముక్కు బద్దలయ్యేలా చెప్పడం ఉపేంద్ర నైజం. విచిత్రమైన ఈ ‘క్రియేటివ్ ఎక్సెంట్రిసిటీ’ కొందరికి మొరటు, కొందరికి వెగటు. సగటు ప్రేక్షకుడు మాత్రం ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే, అభిమాన గణంలో, ఆదాయ గణాంకాల్లో - టాప్ ఫైవ్ కన్నడ హీరోల్లో ఉప్పి ఒకడు. ఉపేంద్ర హీరోయిక్ జర్నీ స్టార్ట్ అయింది ‘ఎ’ (’98) సినిమాతో! హీరోయిన్ ప్రేమలో పడ్డ దర్శకుడు... తీరా పేరొచ్చాక ఆ నటి అతణ్ణి కాదనడం... ఆడవాళ్ళంటే అతను పెంచుకున్న ద్వేషం... ఇలా నడుస్తుందా కథ. అది ఉపేంద్ర సొంత కథేననీ, ఆ హీరోయిన్ నటి ప్రేమ అనీ ఒకటే పుకారు. నిజానిజాలు ఉపేంద్ర కెరుక. సినిమా మాత్రం డబ్ అయిన తెలుగులోనూ డబ్బు చేసుకుంది. తెరపై ఉపేంద్ర నిర్మొహమాటం జనానికీ నచ్చుతూనే వచ్చింది. ఉపేంద్రనగానే తెలుగువారికి ‘ఎ’, ‘రా’, ‘ష్’, ‘ఉపేంద్ర’, ‘సూపర్’ ఇప్పటికీ గుర్తొచ్చేదీ అందుకే! పాలిటిక్స్ వయా సినిమా ఉపేంద్ర తన సినిమాల్లో ఆవేశం చూపిస్తాడు. సమాజంలోని ‘హిపో క్రసీ’పై ఆగ్రహం పలికిస్తాడు. ఆ సినిమాలు జనంతో పాటు ఆయన మీదా ప్రభావం చూపాయి. ఈ వెండితెర ఆగ్రహాన్ని వీధుల్లో ఆచరణగా మార్చాలని పాతికేళ్ళుగా సినీ రంగంలోనే ఉన్న 47 ఏళ్ళ ఉప్పి అభిప్రాయం. కన్నడ ‘సూపర్’లో ముఖ్యమంత్రైన ఈ హీరో ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తానంటాడు. అయితే, ఇంకా టైమ్ ఉందంటాడు. ఆ లోగా తనకున్న సినిమాస్కోప్ కలలు తీర్చుకొనే పనిలో ఉన్నాడు. మరక కూడా మంచిదే! కాంట్రవర్సీకీ, కన్నడ స్టార్ ఉపేంద్రకూ దగ్గరి చుట్టరికం. తమిళ, కన్నడ రాష్ట్రాల మధ్య కావేరీ జలవివాదం నేపథ్యంలో ముక్కోణపు ప్రేమకథగా ఆయన రాసి, నటించిన ‘హెచ్2ఓ’ (2002) రోజుల నుంచి ఆ చుట్టరికం మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంది. కానీ, ఆయన కలవరపడలేదు. కామ్‌గా పని చేసుకుంటూ పోయాడు. కన్నడంలో అందరి లానే ఆయనా ఆ మధ్య వరుసగా రీమేక్‌ల బాట పట్టాడు. త్రివిక్రమ్ రాసిన తెలుగు సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’ కన్నడ రీమేక్స్‌లోనూ ఉప్పి హీరో. ఇప్పటికి దాదాపు 50 సినిమాల్లో నటించిన ఉపేంద్ర కొంత గ్యాప్ తరువాత మళ్ళీ ఇప్పుడు మెగాఫోన్ పట్టాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్‌లోనూ బ్రేక్ టైమ్‌లో తన క్యారవాన్‌లోనే ఎడిటింగ్ చేస్తూ గడిపిన ఆయన తన దర్శకత్వంలో 9వ సినిమా ‘ఉప్పి2’తో రానున్నాడు. సౌత్ అంతా ఫేమసే! ‘‘తిరుపతికి పోయి... ఇదే వెంకన్న సామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినాయనా! మన గురించి ఇక్కడ తెలిస్తే సాలదు... హైదరాబాద్‌లో కూడా తెలవాల! ఫేమస్ అవ్వాల మనం...’’ సమ్మర్ రిలీజ్ త్రివిక్రవ్‌ు ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో దేవరాజ్ పాత్రధారి ఉపేంద్ర పలికే డైలాగ్ ఇది. అవును... పాతికేళ్ళ క్రితం జీరోగా మొదలై ఇవాళ హీరోగా వెలుగుతున్న ఉపేంద్ర ఇవాళ ఇక్కడా ఫేమస్సే! కన్నడ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ల తరువాత తెలుగులో, ఆ మాటకొస్తే ఆల్ ఓవర్ సౌతిండియాలోనూ ఫేమున్న ఏకైక కన్నడ హీరో ఉపేంద్రే! ఏళ్ళ క్రితం వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమాలు ‘ఏ’, ’రా’ చూసి ఈల వేసి, గోల చేసిన జనం మొన్న సమ్మర్ రిలీజ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో విలన్ పాత్రకూ థియేటర్లలో అదే రకంగా వెల్కమ్ చెప్పడం ఉపేంద్ర ఇమేజ్‌కు తాజా నిదర్శనం. లైఫ్ ఫిలాసఫీ బెంగుళూరులోని విద్యాపీఠ్‌లో మధ్యతరగతి కుటుంబాల మధ్య వీధుల్లో సైకిల్ తొక్కుతూ పెరిగి, మధ్య, ఎగువ మధ్యతరగతి మనుషుల ‘హిపోక్రసీ’ని తెరపై చెడుగుడు ఆడిన ఉపేంద్రలో చాలామందికి తెలియని మరో కోణం - స్పిరిచ్యువాలిటీ. సినిమాల్లో ఉపేంద్ర చెప్పిన జీవిత పాఠాలన్నీ కలిపి, ఆ మధ్య ‘ఉప్పిగింత’ అంటూ పుస్తకమే వచ్చింది. ‘‘అల్లిరువుదు నమ్మనే, ఇల్లిరువుదు సుమ్మనే’’ (అసలు ఇల్లు వేరెక్కడో ఉంది. ఇప్పుడిక్కడ మనం ఊరకే ఉంటున్నాం అని అర్థం) అనే లోతైన అర్థమున్న కన్నడ సూక్తిని ఆయన ప్రస్తావిస్తుంటాడు. పదిహేనేళ్ళ క్రితం బనశంకరి థర్డ ఫేజ్‌లో ఇంటికి మారిన ఉప్పి, ఆ ఇంటికి పెట్టిన పేరేమిటో తెలుసా? ‘సుమ్మనే!’ అవును. ఉప్పి జీవితాన్ని కాచివడపోశాడు. ఒకప్పుడు... చదువుకొంటూనే, 15 రూపాయల కోసం పేపర్ కవర్లు చేసిన పిల్లాడు... సినిమాల్లో పేరొచ్చాక లక్ష రూపాయల చెక్ ఇస్తే, జీవితంలో అంత డబ్బు మునుపెన్నడూ చూడక తడబడిపోయిన మిడిల్‌క్లాస్ వ్యక్తి... డబ్బులెక్కడ దాచుకోవాలో తెలియని కుర్రాడు... ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. వచ్చినా, తన మూలాలు మర్చిపోలేదు. ఇవేవీ శాశ్వతం కాదనీ మర్చిపోలేదు. అందుకే, ఉపేంద్ర సిన్మా లానే ఉపేంద్రా స్పెషల్. శాండల్వుడ్లోనే కాదు... మరి ఏ ‘వుడ్’లోనూ కనిపించని స్పెషల్. భాషల గోడలు బద్దలు కొట్టుకొని, మనసుపై ముద్ర వేసిన స్పెషల్ స్టార్. ‘సమ్ మే లవ్ హిమ్. సమ్ మే హేట్ హిమ్. బట్ నో వన్ కెన్ ఇగ్నోర్ హిమ్!’ - రెంటాల జయదేవ -
కళ..మా కల
ప్రేమను పంచుకున్నట్టే... బాధ్యతను పంచుకున్నట్టే... సంతోషాన్ని పంచుకున్నట్టే... కష్టాన్ని పంచుకున్నట్టే... నాటిని పంచుకున్నట్టే... నేటిని పంచుకున్నట్టే... రేపటిని... అంటే స్వప్నాన్ని పంచుకుంటే..? అదే జరిగింది... బాహుబలి యూనిట్‌కి రాజమౌళి... కెప్టెన్ ఆఫ్ ద షిప్‌గా మార్గం చూపించాడు, గమ్యం చేర్చాడు. రమ... మార్గాన్ని కష్టమనిపించకుండా... ఇష్టమనిపించేలా చేశారు. యూనిట్‌ని ఒక కుటుంబంలా నడిపించారు. ఎ షేర్డ్ డ్రీమ్ బికమ్స్ ఎ ట్రెజర్డ్ మొమెంట్! అప్పుడే కల... కలకాలం నిలిచే కళ అవుతుంది. - రామ్ ఎడిటర్,షీచర్స్ ♦ ఇప్పుడే హడావిడిగా భోజనం చేసి వస్తున్నట్లున్నారు! ఇంతకీ కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయింది? (నవ్వేస్తూ...) తిండీ, నిద్ర అని కాదు కానీ, మేకింగ్‌లో ఉన్నప్పుడు సినిమా బాగా వస్తోందా- లేదా అనే ఆలోచిస్తాం. పూర్తయి, రిలీజ్ దగ్గర పడేసరికి టెన్షన్లు మొదలవుతాయి. ఎందుకంటే, అప్పుడు జవాబుదారీతనం వస్తుంది. అందుకే టెన్షన్. ♦ భారీ సినిమాకు ‘బాహుబలి’ అనే పేరు మీకు సరిపోయేట్లుందే? (గట్టిగా నవ్వేస్తూ...) ఈ పర్టిక్యులర్ కథ కాదు కానీ, ఒక రాజుల కథ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. నాన్న గారు, నేను ఈ కథ అనుకున్నప్పుడు కూడా ప్రభాసే మనసులో మెదిలాడు. ‘బాహుబలి’ అన్నపేరు నాన్న గారు పెట్టిందే! ♦ కానీ, ఇన్ని కోట్ల సినిమాను మోస్తున్న మీరూ ‘బాహుబలే’! ఇంత భారీ సినిమాను మోయడానికి నాతో పాటు యాక్టర్స్, టెక్నీషియన్స్ - ఇలా చాలా స్తంభాలే ఉన్నాయి. నేనొక్కణ్ణే మోసి ఉంటే, పాతాళానికెళ్ళిపోయి ఉండేవాణ్ణేమో! నిజానికి, నిర్మాతలు శోభు, ప్రసాద్ దేవినేని నా కన్నా ఎక్కువ మోశారు. సినిమాపై వాళ్ళకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ♦ ఈ భారీ ప్రాజెక్ట్ మీద వాళ్ళ ధైర్యానికి కారణం ఏమంటారు? ‘ఇది కేవలం తెలుగు సినిమా కాదు... ఇండియన్ సినిమా. ఒక్క ఇండియన్ మార్కెట్టే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్‌కు వెళ్ళే అవకాశం కూడా ఉంద’ని ఈ కథ చెప్పగానే గుర్తించారు. ♦ ఇంత భారీ ప్రాజెక్ట్‌కు అసలు విత్తనం ఎక్కడ పడింది? ఈ కథకు మూలం - సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర, ఆ క్యారెక్టరైజేషన్. కొన్నేళ్ళ క్రితం నాన్న గారు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడే ఎగ్జైటయ్యా. ఆయన కూడా ఈ కథ ఒకేసారి చెప్పలేదు. ఒక్కో క్యారెక్టరైజేషన్ ఒక్కోసారి చెబుతూ వచ్చారు. ఈ పాత్రలన్నీ కలిపి, ఒక కథ అల్లుకొంటే అనే ఆలోచన వచ్చింది. అలా ‘బాహుబలి’ తయారైంది. ♦ ‘వెరైటీ’ లాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్నీ ఎట్రాక్ట్ చేశారే? ఈ సినిమాకు అంతర్జాతీయంగానూ అంత శ్పాన్, స్కోప్ ఉన్నాయని గుర్తించింది శోభూనే! ‘ఈగ’ టైమ్ నుంచే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్ళి, మన సినిమా గురించి వాళ్ళకు తెలిసేలా చేశారు. ‘బాహుబలి’ కాన్సెప్ట్ ఆర్ట్స్, సినాప్సిస్ సహా మూడేళ్ళ క్రితమే వాళ్ళకు చూపించారు. అందుకే, వాళ్ళు ‘బాహుబలి’ గురించి రాశారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ భారతీయ సినిమా గురించీ ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్‌లో రాలేదు. సౌతిండియన్ సినిమా గురించైతే, వాటిలో ఇంతకు ముందెప్పుడూ రాలేదు. ఆ క్రెడిట్ ‘బాహుబలి’కి దక్కింది. ♦ ఈ మధ్య ‘కాన్స్’ ఫెస్టివల్లో కూడా మార్కెట్ చేసినట్లున్నారు? అవును. నిర్మాత శోభూ వెళ్ళి, వాళ్ళకు ‘బాహుబలి’ గురించి ప్రెజెంట్ చేశారు. లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపాలనీ యత్నిస్తున్నారు. తను చేస్తున్న సినిమా ఇంటర్నేషనల్‌గా వెళుతోందంటే, డెరైక్టర్‌కు అంత కన్నా మోరల్ బూస్ట్ ఏముంటుంది! ♦ మరి, ఇంటర్నేషనల్ బిజినెస్, రిలీజ్ సంగతి ఎందాకా వచ్చింది? చాలా ఆఫర్లున్నాయి. అవి అంత గబుక్కున తేలవు. సబ్-టైటిల్స్‌తో మన భాషలోనే చూడడం అక్కడివాళ్ళ అలవాటు. దానికి ఎడిటింగ్ విధానం, సౌండ్ డిజైనింగ్ పూర్తిగా వేరుగా ఉంటాయి. సినిమాలో కొంత నిడివి తగ్గించడం, కొన్నిచోట్ల నిడివి పెంచడం లాంటివీ ఉంటాయి. అందుకు కావాల్సిన అదనపు షూటింగ్ ఫుటేజీ మా దగ్గరుంది. అదంతా వేరే కథ. ♦ మీ కన్నా మీడియా ఈ సినిమాను ఎక్కువ మోస్తున్నట్లుంది! (నవ్వేస్తూ...) మేము మా కోసం, మేము పెట్టిన డబ్బుల కోసం ‘బాహుబలి’ని భుజానికెత్తుకున్నాం. కానీ, పత్రికలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే సత్తా ఉన్న ఈ సినిమాను ప్రమోట్ చేయడం బాధ్యతగా భావించినట్లున్నాయి. ♦ కానీ, పబ్లిసిటీ ఒక శ్యాచురేటెడ్ స్టేట్‌కి వచ్చిందన్నట్లున్నారు! నిజమే. ‘బాహుబలి’ పబ్లిసిటీ ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇప్పటికే అన్ని చోట్లా దీన్ని భూతద్దంలో చూస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమాకు ఎడ్వాంటేజ్. మరోరకంగా డిజ్ ఎడ్వాంటేజ్. ఆశించినదానికన్నా ఏ మాత్రం ఎక్కువున్నా జనం బ్రహ్మాండం అంటారు. కొద్దిగా తేడా వచ్చినా, కష్టమే. అందుకే, మా అంతట మేము మరీ పబ్లిసిటీ లేదు. కోట్లు సరే.. మూడేళ్ళ లైఫ్, కెరీర్ పణంగా పెట్టడం రిస్క్ కాదా? రిస్క్ అనిపించలేదు. ఎందుకంటే, ఏదో ఒక పాయింట్లో వచ్చిన ఆలోచనలతో కథ తయారవుతుంది. అలా తయారైన కథ బెత్తం పట్టుకొని, మన ముందే కూర్చుంటుంది. ఆ కథకు న్యాయం చేయడం కోసం మన ప్రయాణం మొదలవుతుంది. ఆ క్రమంలో జరిగే ప్రయాణమే సినిమా. ఆ జర్నీ ఎన్నాళ్ళు పట్టినా, మనకు కావాల్సిన శక్తిని ఆ స్టోరీయే ఇస్తుంది. ఏటా వంద సినిమాలోస్తే పదే ఆడుతున్నాయి. కాబట్టి, చిన్న రిస్కా, పెద్ద రిస్కా అని కాకుండా మనకు నచ్చిన సినిమా, నచ్చినట్లుగా చేస్తే బెటర్ కదా! ♦ ఇంతవరకూ ఒక్క పేపర్ యాడ్ లేకుండా, సోషల్ మీడియా పబ్లిసిటీతో ఇండస్ట్రీలో కొత్త దోవ తొక్కినట్లున్నారు! దానికీ శోభూ ముందు చూపే కారణం. ‘ఈగ’ టైమ్‌లోనే సోషల్ మీడియా పవర్ గురించి శోభు చెప్పేవారు. ఇవాళ సెట్స్‌లో లైట్‌బాయ్ చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్, ఫేస్బుక్లో ఎకౌంట్ ఉన్నాయి. హిందీలో కరణ్ జోహార్ ముందుకు రావడానికీ, ఇతర భాషల్లో మా గురించి తెలియడానికీ కూడా సోషల్ మీడియానే హెల్పయింది. ♦ హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ రావడం ఎలా జరిగింది? మా సినిమాకు పెద్ద పబ్లిసిటీ మౌత్‌పీస్ - హీరో రానా. అతనికి, కరణ్‌జోహార్‌తో బాగా స్నేహం. రానా ద్వారా ఈ సినిమా గురించి ఆయనకు తెలిసి, ఆసక్తి చూపించారు. శోభు కూడా కథ సినాప్సిస్, కాన్సెప్ట్ ఆర్ట్స్, పోస్టర్ డిజైన్స్‌తో ‘బాహుబలి’ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్‌ను ఆయనకు చూపెట్టారు. వెంటనే ఆయన హిందీ వెర్షన్‌ను అక్కడ అందించేందుకు ముందుకొచ్చారు. ♦ ఒక్క ఫ్రేమ్ కూడా చూపించకుండానే మార్కెటింగ్ చేశారు! (నవ్వేస్తూ...) మా డీలయ్యాక ఆయనకు చూపించా. ♦ ‘బాహుబలి’లో మీకు మోస్ట్ డిఫికల్ట్ షూటింగేది? కేరళలో జలపాతాల దగ్గర చేశాం. బల్గేరియాలో ఎముకలు కొరికే చలిలో చిత్రీకరించాం. అవన్నీ ఒక ఎత్తయితే, ఈ సినిమా కోసం ఆర్.ఎఫ్.సి.లో 4 నెలల పాటు తీసిన యుద్ధం సీన్లు మరో ఎత్తు. నా కెరీర్లోనే మోస్ట్ ఛాలెంజింగ్ షూటింగ్. అందరికీ అది మరపురాని అనుభవం. ♦ మీ నాన్న గారు, పెద్దన్న కీరవాణి ఎడిటింగ్ కూడా చేశారట! నాన్నగారికి విజువల్స్, గ్రాండియర్ మీద దృష్టి ఉంటే, పెద్దన్న వాటికన్నా పాత్రల మధ్య ఎమోషన్ క్యారీ అయిందా లేదా చూస్తాడు. మిగతా కథల కన్నా ఈ కథ మీద నాన్న గారు విపరీతమైన ఎటాచ్మెంట్ పెంచుకున్నారు. రషెస్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూ వచ్చారు. నా ఎడిటింగ్ చూసి, తనదైన ఆలోచనతో మరో రకంగా కూడా ఎడిట్ చేసి చూపించేవారు. మరొక దర్శక - రచయిత దృష్టి కోణంలో మనకు తట్టనిది తట్టవచ్చు కదా! అలా నాన్న గారు, 230 సినిమాలకు మ్యూజిక్ అందించి, రీరికార్డింగ్ చేసిన పెద్దన్న (కీరవాణి) చెప్పిన కొన్ని సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. ♦ విజువల్స్ నుంచి పాటల దాకా జరిగిన లీకులు చూస్తే, ఈ సినిమాకు ‘లీకుబలి’ అని పేరు పెట్టాలేమో! (బాధగా...) సినిమా అనేది చాలా భాగం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, విజువల్ ఎఫెక్ట్స్ కోసం పంపినప్పుడు, చివరకు సెక్యూరిటీ హెడ్డే విజువల్స్ లీక్ చేస్తే ఏం చేస్తాం? చాలా బాధ అనిపిస్తుంది. కొందరొచ్చి ‘ఏంటీ? లీకైందటగా?’ అని పళ్లికిలిస్తూ, వెకిలిగా అడుగుతారు. వాళ్ళకు ఏం జవాబి వ్వాలి? వాళ్ళ ఇంట్లో ఇలాంటిదేదైనా అయితే, ఇలానే అడుగుతారా? దానికి తోడు ‘రాజమౌళి వాళ్ళే కావాలని లీక్ చేస్తున్నార్రా పబ్లిసిటీ కోసం’ అనేవాళ్ళు ఇంకొందరు. ఇవన్నీ వింటే, బాధతో పాటు కోపమూ వస్తుంది. కానీ, అది వాళ్ళ సంస్కారమనుకోవడమే తప్ప ఏం చేయగలం! ♦ ఇంతకీ వాట్సప్‌లో వచ్చిన కథ ఈ సినిమాదేనా? (నవ్వేస్తూ...) ‘బాహుబలి’ కథ అంటూ, చాలా కథలే వచ్చాయి. కానీ, ఈ సినిమా అసలు కథ మాత్రం వేరు. ♦ విజువల్ ఎఫెక్ట్స్, టెక్నీషియన్ల పరంగా ఏం చెబుతారు? విజువల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్), కెమేరామన్ (సెంథిల్ కుమార్), ఆర్ట్ (సాబూ శిరిల్), కాస్ట్యూమ్స్ (రమా రాజమౌళి) - ఈ నాలుగు శాఖల పని ఇలాంటి సినిమాకు తెర మీద గ్రాండియర్ ఇస్తుంది. సినిమాకు కీలకమైన ఆ నలుగురికీ వాళ్ళ పని మీదే కాక, అవతలివాళ్ళ పని మీద, పనితనం మీద అవగాహన ఉండాలి. కలసికట్టుగా పనిచేయాలి. లేదంటే, ఐస్క్రీమ్నూ, ఆవకాయనూ కలిపేసినట్లు ఉంటుంది. సెంథిల్, రమ - నాకు అలవాటే. కొత్తగా నేను పనిచేసిన జాతీయ అవార్డు గ్రహీతలైన శ్రీనివాసమోహన్, సాబూ శిరిల్ అద్భుతంగా పనిచేశారు. చక్కటి సమన్వయంతో కుదిరిన ఈ నలుగురి వర్క్ సమ్మేళనం రేపు తెర మీద కనువిందు చేస్తుంది. ♦ ‘300’, ‘ట్రాయ్’ లాంటి హాలీవుడ్ సినిమాలొచ్చాయి. డబ్ అయ్యాయి. మరి, ‘బాహుబలి’ కొత్త అనుభూతవుతుందా? ‘బాహుబలి’ అంటే కేవలం విజువల్ గ్రాండియర్, పెద్ద సంఖ్యలో జనం, యుద్ధాలే కాదు. అది కేవలం ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడానికి ట్రైలర్లో చూపిస్తున్నాం. ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ అనుకోండి. కానీ, అంతకు మించిన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. జనం ఒకసారి థియేటర్‌కు వచ్చాక, ఆ ఎమోషనల్ కంటెంట్‌తో కట్టిపడేస్తాం. ఆ నమ్మకం మాకుంది. ♦ హిందీలో ‘మఖ్ఖీ’ (‘ఈగ’ సినిమా హిందీ పేరు) ఆశించినంత ఆడలేదు. మరి, ‘బాహుబలి’కి తీసుకున్న జాగ్రత్తలు? ‘ఈగ’ హిందీ డబ్బింగ్‌ను మార్కెట్ చేసినవాళ్ళతో వియ్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ. పాపం... వాళ్ళు అనుకున్నంత ప్రొఫెషనల్‌గా, ఎఫిషియెంట్‌గా చేయలేకపోయారు. దాంతో, ‘మఖ్ఖీ’ థియేటర్లలో కన్నా అక్కడ శాటిలైట్ టీవీ చానల్స్‌లో అది బాగా పేరు తెచ్చుకుంది. ‘బాహుబలి’ విషయంలో కరణ్ జోహార్ రంగంలోకి దిగారు. అన్ని జాగ్రత్తలూ తీసుకొని, ప్లానింగ్‌తో ప్రమోట్ చేస్తున్నారు. కచ్చితంగా, అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ♦ ఇంతకీ మీ తరువాత సినిమా ఏమిటో ఆలోచించారా? (నవ్వేస్తూ...) నా బుర్రంతా ఇప్పుడు ‘బాహుబలి... ది బిగినింగ్’ చుట్టూరానే తిరుగుతోంది. ఇది ఫస్ట్పార్టే. సెకండ్ పార్ట్ ఇంకా 60 శాతం షూట్ చేయాలి. ఆ సినిమా తరువాతే మరి ఏ కథ అయినా ఆలోచిస్తా. ♦ ఫస్ట్పార్టొచ్చాక, సెకండ్ పార్ట్ చేయడంలో రిస్క్ ఉందేమో? బిజినెస్ పరంగా కానీ, ఆ యాంగిల్లో కానీ ఆలోచించలేదు. ఇంత పెద్ద కథను ఆకట్టుకునేలా చెప్పాలంటే, రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయడమే కరెక్ట్ అనుకున్నాం. ♦ ‘బాహుబలి’ మేకింగ్ గురించి ఏదైనా బుక్కే రాయచ్చుగా? చాలా ఆలోచనలున్నాయి. కామిక్స్, బొమ్మలు - ఇలా చాలా. ఇప్పుడు కుదరలేదు. ఫస్ట్పార్ట్కీ, సెకండ్ పార్ట్‌కీ మధ్య గ్యాప్‌లో అవన్నీ చేస్తాం. ♦ ఎంతసేపూ పెద్ద సినిమాలేనా? ‘మర్యాద రామన్న’ లాంటి చిన్న సినిమాలూ మళ్ళీ చేయచ్చుగా? చేయకూడదనేమీ లేదు. ‘మగధీర’ షూటింగ్ రెండో రోజే సునీల్‌ను పిలిచి, ‘మర్యాదరామన్న’ కథ చెప్పా. ముందే ఆలోచించిన కథను ‘మగధీర’ కాగానే చేశా. ♦ తమిళంలో వస్తున్న ‘మద్రాస్’ లాంటి సినిమాలో, ‘కాక్కా ముట్టై’ లాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా? ఆ రెండు సినిమాలూ నేను చూడలేదు. ఒకటి చూసి, అలాంటి తరహా సినిమా చేయాలని నేనెప్పుడూ అనుకోను. ఆ క్షణానికి వచ్చిన ఆలోచనల్ని బట్టి చేస్తా. అది యాక్షన్ సినిమా కావచ్చు, హార్రర్ కూడా కావచ్చు. ♦ ‘జక్కన్న’ లాగా సినిమాలు బాగా చెక్కుతారని మీకు పేరుంది. ఇంతకీ అది మీకు ప్రశంసా? విమర్శా? (నవ్వేస్తూ...) ‘శాంతినివాసం’ టీవీ సీరియల్ చేసే టైమ్‌లో సీరియల్ కూడా సినిమాలాగా చెక్కుతూ తీస్తున్నానంటూ, నటుడు -ఫ్రెండ్ రాజీవ్ కనకాల నాకు ఆ పేరు పెట్టాడు. హీరో తారక్ (చిన్న ఎన్టీఆర్) ప్రచారంలో పెట్టాడు. ప్రశంసగా అన్నప్పటికీ, అదో పెద్ద బరువు! ♦ మొత్తానికి, మీ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ పూర్తయిందా? లేదు. ‘మహాభారతం’ సినిమాగా తీయాలన్నది కోరిక. అది తీరుతుందో లేదో కానీ అదే నా లైఫ్‌టైమ్ ప్రాజెక్ట్. ♦ ఈ భారీ ప్రాజెక్ట్‌ను డెడికేట్ చేయాలంటే ఎవరికి చేస్తారు? నాన్నకా? తోడుగా నిలిచిన భార్యాపిల్లలకా? గురువుకా? (సాలోచనగా...) అందరితో పాటు ఈ సినిమా కోసం నా భార్య రమ, మా అబ్బాయి కార్తికేయ, ఇంకా నా కుటుంబమంతా కొండంత అండగా నిలిచింది. వాళ్ళూ ఎంతో శ్రమించారు. అయితే, ఈ సినిమాకు ఆ స్థాయి ఉందో లేదో కానీ, చిన్నప్పుడే నా మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు కె.వి. రెడ్డి గారికి అంకితం చేస్తాను. ఇవాళ్టికీ ఆయన ఎంతో గొప్ప డెరైక్టర్! ------------ యూనిట్ అంతా నా ఫ్యామిలీయే... - రమా రాజమౌళి ♦ ‘సై’ సినిమా నుంచి స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నా, ‘బాహుబలి’ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ‘యమదొంగ’తో పోలిస్తే రాజుల ఎపిసోడ్ ఉండే ‘మగధీర’లో కొంత ఎక్కువ కష్టపడ్డా. ‘బాహుబలి’కి ‘మగధీర’ కన్నా పది రెట్లు ఎక్కువ శ్రమించా. వేల మందికి కాస్ట్యూమ్‌లు సిద్ధం చేయడం, అదీ ఆ కాలం నాటి దుస్తులు, అలంకరణల లాంటివన్నీ చూడడం అంత ఈజీ కాదు. ♦ ‘బాహుబలి’లో మనసుకు నచ్చింది చేస్తున్నాం కాబట్టి, రాజమౌళికీ, నాకూ శారీరక శ్రమ తెలియలేదు. మేమెప్పుడూ కష్టానికి భయపడం. కష్టపడితేనేగా జీవితంలో పైకి వచ్చేది! ♦ బడ్జెట్ విషయంలో మాత్రం భయం వేసింది. ప్రతి ఇండస్ట్రీలో కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా! అవి దాటి వెళుతుందేమోనని భయపడ్డా. ‘అసలు ఇలాంటి కలలెందుకు కంటావు! మరీ ఇంత ఖరీదైన కలా?’ అని సినిమా మొదలయ్యే ముందు కూడా రాజమౌళిని వార్న్ చేశా. కానీ, రాజమౌళి టెన్షన్ పడలేదు. ఈ మూడేళ్ళలో ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేశాడు. ♦ భార్య, భర్త ఒకే ప్రొఫెషన్లో, ఒకేచోట ఉంటే, ఎప్పుడూ కలిసే ఉండచ్చు. మా అబ్బాయి కార్తికేయ కూడా ‘బాహుబలి’కి పనిచేశాడు కాబట్టి, మాతోనే ఉన్నాడు. అమ్మాయి మయూఖను స్కూల్ కాగానే సెట్స్‌కు తీసుకెళతా. ఈ జర్నీలో యూనిట్టే నా ఫ్యామిలీ అనిపించింది. ♦ బేసిక్‌గా మా ఇంట్లో ఎవరం ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చోలేం. అందుకని, అందరం ఇలా ఈ పనిలో ఉండడం, సెట్లోనే అందరం కలసి ఉండడం ఒక రకంగా ఉపయోగమే! ♦ నా కన్నా మా చెల్లెలు వల్లి (కీరవాణి శ్రీమతి) చాలా సమర్థురాలు. లైన్ ప్రొడ్యూసర్‌గా వల్లి లేకపోతే, ‘బాహుబలి’ ఇంత సాఫీగా జరిగేది కాదు. ఎక్కడా చిన్న కన్ఫ్యూజన్ కానీ, ఏ మాత్రం ఇబ్బందులు కానీ లేకుండా ఇన్ని వేల మందితో షూటింగ్ చేయించేసింది. ♦ మా వల్లి ట్రైనింగ్‌లో మా అబ్బాయి కూడా వాడు మరో వల్లి అయిపోతాడు (నవ్వులు...). ఈ సినిమాకి చాలా కష్టపడ్డాడు. వాడి శక్తిపై నాకు నమ్మకం కలిగి, ప్రశాంతత వచ్చింది. ♦ రాజమౌళి, మా అబ్బాయి పడే కష్టం చూస్తుంటే, ముచ్చటగా ఉంటుంది. కష్టపడి, పైకి వచ్చేవాళ్ళంటే నాకు గౌరవం. అందుకే, మా వాళ్ళ శ్రమకు బాధపడను. పెపైచ్చు, గర్విస్తా. -రెంటాల జయదేవ -
రుద్రమడాడీ
ఫాదర్స్ డే ప్రత్యేకం తండ్రిగా... ఎంతో ప్రేమిస్తాడు! నాన్నగా... ‘నాన్నలు’ అని పిల్చుకుంటాడు! డాడీగా... వాళ్లని డైనమిక్‌గా మలుస్తాడు! ఫాదర్‌గా... బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు! ఇంటి పెద్దగా... బాధ్యతను నేర్పిస్తాడు! అన్నలా... అడిగింది కొనిస్తాడు! డ్ రైవర్గా... స్కూల్లో దించుతాడు! ఇన్ని గుణాలున్న శేఖరుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ! రాత్రి 7.30 గంటలు. హైదరాబాద్‌లో చిరుజల్లులు... అప్పటికే చీకటి, రోడ్ల మీద ట్రాఫిక్. కమ్ముకొస్తున్న వాటిని చీల్చుకుంటూ ‘గుణ మీడియా వర్క్స్’ ఆఫీసుకి చేరాం. దేశంలో తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ‘రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్ పెద్దమ్మాయి నీలిమ (21) హాలులో ఉంది. చుట్టూ ‘రుద్రమదేవి’ మినియేచర్ సెట్స్, ఆర్ట్ వర్క్స్, చరిత్ర పుస్తకాలు. సెవన్త్ గ్రేడ్ చదువుతున్న చిన్నమ్మాయి యుక్తాముఖి (12) స్కూలులో లేటవడంతో ఇంకా రాలేదు. ముందుగా పెద్దమ్మాయితో, తర్వాత చిన్నమ్మాయితో భేటీ... ‘రుద్రమదేవి’కి సహనిర్మాతలైన ఆ పిల్లలిద్దరూ క్రియేటర్ గుణశేఖర్లోని కుటుంబ కోణంపై ఫోకస్ లైట్ వేశారు. చివరలో గుణశేఖర్, ఆయన శ్రీమతి రాగిణి వచ్చి మాతో కలిశారు. నలుగురితో విడివిడిగా మాట్లాడిన ఈ కలివిడి కబుర్లు... వారు మీడియాకిచ్చిన తొలి ‘ఫ్యామిలీ’ గ్రూప్ ఫోటో సాక్షిగా ఇవీ... వెరీ గుడ్ హ్యూమన్‌బీయింగ్! - నీలిమ (గుణశేఖర్ పెద్దమ్మాయి) గుణశేఖర్ గారు అందరికీ పెద్ద డెరైక్టర్ కానీ, మాకు మాత్రం లవబుల్ డాడ్! ఇంట్లో ఎప్పుడూ ఆయన ఒక ఫాదర్ లానే తప్ప, సినిమా మనిషిలా ఉండరు. మా ఇంట్లో సినిమా వాతావరణమూ ఉండదు. మేమెప్పుడూ షూటింగ్‌లకూ, సినిమా ఫంక్షన్లకూ వెళ్ళేదీ లేదు. ‘రుద్రమదేవి’ప్రాజెక్ట్‌కే ఆ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. పక్కా ఫ్యామిలీ మ్యాన్! సెట్స్‌లో నాన్న సీరియస్‌గా ఉంటారు. కానీ, చాలామందికి తెలియనిదేమిటంటే, ఆయనకు మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. నాన్న ఎంత ఫ్యామిలీ మ్యానంటే... సినిమాకెళ్ళినా, షికారుకెళ్ళినా అమ్మ, నేను, చెల్లెలు - నలుగురం కలిసి వెళ్ళాల్సిందే. ఆయనొక్కరూ వెళ్ళరు. ఇంట్లో హోమ్ థియేటర్లో కూడా అందరం కలిసి, సినిమాలు చూడాల్సిందే! నాన్న పార్టీలకు వెళ్ళే రకం కాదు. ఆయన ధ్యాసంతా సినిమా మీదే! షూటింగ్ పని ముగించుకొని ఇంటికి వచ్చేశాక, ఉన్న కాసేపూ మాతోనే గడుపుతారు. వర్క్‌లో ఎంత టెన్షన్ ఉన్నా, మాతో గడిపే టైమ్ ఆయనకు రిలీఫ్. వీలున్నప్పుడల్లా మమ్మల్ని స్కూలు దగ్గర దింపడం, తేవడం ఆయనకు బాగా ఇష్టం. పుస్తకాలు, పేపర్లు చదవమంటారు! నాకు పెయింటింగంటే ఇష్టం. నా హాబీని నాన్న ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే, ఈ వయసులో ఉండే పిల్లలందరి లానే నాకూ రకరకాల ఇంట్రెస్ట్‌లు. ఒక దాని నుంచి మరో దాని మీదకు ఫోకస్ మారిపోతుంటుంది. అది నాన్న అర్థం చేసుకొని, ప్రతి రంగంలోని పాజిటివ్‌లు, నెగిటివ్‌లు వివరించి చెబుతుంటారు. ఈ మధ్యే బి.ఏ- మాస్ కమ్యూనికేషన్ చదివిన నాకు మంచి జర్నలిస్ట్‌ను కావాలని కోరిక. చరిత్ర, పాతకాలపు వస్తువులంటే నాకిష్టమని, లండన్‌కు పంపి, అక్కడ హయ్యర్ స్టడీస్ చేయిం చాలని నాన్న అనుకుంటున్నారు. ఇక్కడ ‘రుద్రమదేవి’ కోసం ‘గుణ టీవ్ు వర్క్స’ క్రియేటివ్ హెడ్‌గా డిజిటల్ పబ్లిసిటీతో పాటు కాస్ట్యూమ్స్, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ - ఇలా చాలా శాఖల్లో పనిచేశా. ఇదంతా ఇంటర్న్‌షిప్‌లా పనికొచ్చింది. నా చదువునూ, ఈ అనుభవాన్నీ కలిపి, భవిష్యత్తులో సినీ మీడియమ్‌లోకి వస్తానేమో చెప్పలేను. తెలుగు భాషన్నా, చరిత్రన్నా, పుస్తకాలన్నా నాన్నకి ఇష్టం. మా ఇంట్లో పురాణేతిహాసాలు సహా బోలెడన్ని బుక్సున్నాయి. రోజూ బోలెడన్ని పేపర్లు, మ్యాగజైన్స్ ఇంటికి వస్తాయి. మనిషి ఎదగాలంటే పుస్తకాలు చదవాలనీ, తెలుగు బాగా నేర్చుకోవాలనీ చెబుతుంటారు. ఆయన నేర్పిన విలువలు అవి! డెరైక్టర్‌గా నాన్న గొప్పే కానీ, అంతకు మించి వెరీగుడ్ హ్యూమన్‌బీయింగ్! ఆయన నిస్వార్థం, తోటివాళ్ళ బాగోగుల్ని పట్టించుకోవడం నాకు నచ్చుతాయి. ‘తోటివాళ్ళ పట్ల దయగా ఉండాలి. లేనిదాని కోసం ఆరాటం కన్నా ఉన్నదాని పట్ల తృప్తి ముఖ్యం’ - మా ఇద్దరికీ ఆయన నేర్పిన విలువలు అవి. అందుకే, ఇతరులతో పోల్చుకోం. కంఫర్టబుల్‌గా బతకడానికి ఉందని హ్యాపీగా ఉంటాం. ‘రుద్రమదేవి’ కోసం నాన్న 70 కోట్ల డబ్బే కాదు... నాలుగేళ్ళ జీవితం ఇన్వెస్ట్ చేశారు. మా పెదనాన్నైతే ఈ సినిమా ప్రొడక్షన్ చూడడం కోసం వైజాగ్ దగ్గర నుంచి వచ్చి, ఇక్కడే ఉండిపోయారు. ప్రతి సినిమాకుండే కష్టాలే ఈ సినిమాకూ వచ్చాయి. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి, విజయవంతంగా రిలీజ్ చేయడమే మా ఫస్ట్ సక్సెస్. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చడమే కాకుండా, డబ్బులు పెట్టినవాళ్ళకు లాభాలూ తెస్తుందనే నమ్మకం మాకుంది. దేవుడి దయ వల్ల మాకు ఉండడానికీ, తినడానికీ ఉంది. ‘రుద్రమదేవి’ లాంటి మరిన్ని మంచి సినిమాలు తీసే సత్తా మా నాన్నకుంది. అంతకన్నా ఇంకేం కావాలి! వాట్ నెక్స్ట్అంటారు! - యుక్తాముఖి (గుణశేఖర్ చిన్నమ్మాయి) అక్కయ్య మా అమ్మకు బాగా దగ్గరైతే, నేను నాన్నకు చాలా క్లోజ్. నాన్నకీ, నాకూ ఫిజికల్‌గానే కాదు... చాలా విషయాల్లో పోలికలున్నాయి. మేమిద్దరం టెక్ శావీ! నాన్నకూ, నాకూ గ్యాడ్జెట్ల పిచ్చి! కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడమంటే - మా ఇద్దరికీ చాలా ఇష్టం. ‘మ్యాడ్ సైంటిస్ట్స్’ లాగా ఇద్దరం కలసి వాటి గురించి దాదాపు రిసెర్చ్ చేసినంత పని చేస్తాం. నాకు ‘యాపిల్’ కంపెనీ గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. ‘యాపిల్’ ప్రొడక్ట్స్ ఏవి వచ్చినా, అడగగానే నాన్న కొనిస్తారు. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ సినిమాలు చూస్తున్నప్పుడు అవి ఎలా తీశారు, వాడిన టెక్నికేంటి, గ్రాఫిక్సెలా చేశారు లాంటి కబుర్లన్నీ నాన్న చెబుతుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాన్న తీసిన ‘రామాయణం’ నాకు చాలా ఇష్టం. గమ్మత్తేమిటంటే, ఇప్పటి దాకా నాన్న సినిమాలేవీ రిలీజ్‌కు ముందు మేమెప్పుడూ చూడలేదు. నాన్నా చూపించలేదు. ప్రివ్యూలు వేయడం, చూపించడం లాంటివి ఆయన ఎప్పుడూ చేయలేదు. అండర్ ప్రొడక్షన్లో ఉండగా ‘రుద్రమదేవి’ మాత్రం కొంత చూశాం. ఇంట్లో కామ్..! సెట్లో సీరియస్! అసలు చిన్నప్పుడు స్కూల్లో నాన్-డీటైల్డ్ పాఠంగా చదువుకొన్న ‘రుద్రమదేవి’ కథంటే నాన్నకి చాలా ఇష్టం. మాకెప్పుడూ ఆమె జీవితాన్ని కథలు, కథలుగా చెబుతుంటారు. ఆమె కథను దేశమంతటికీ చెప్పాలని ఆయన డ్రీమ్. అందుకోసమే ఇన్నేళ్ళూ కష్టపడ్డారు. ‘రుద్రమదేవి’కి ప్రెజెంటర్‌గా అమ్మ అంతా దగ్గరుండి చూసుకొంది. అలా నాన్న, అమ్మ, అక్క - అంతా సెట్స్‌లోనే ఉంటారు కాబట్టి, నేనూ స్కూలయ్యాక సెట్స్కెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర చాలా కామ్‌గా ఉండే, నాన్న గారు సెట్స్‌లో డిఫరెంట్‌గా అనిపిస్తారు. పని మీదే ఫోకస్డ్గా ఉండడం వల్ల, అది జరగనప్పుడు కోపమూ ఎక్కువే చూపిస్తారు. ఆయన పాలసీ అదే! నాన్న సినిమాకు పేరొచ్చి, హిట్టయితే, మేమంతా హ్యాపీ. కంగ్రాచ్యులేట్ చేస్తుంటాం. ఒకవేళ ఎప్పుడైనా చిన్న తేడా వచ్చినా, ఆయన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోరు. ‘డోంట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ది ఫెయిల్యూర్. నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. దేవుడు మనకిచ్చిన దాని గురించి సంతోషపడాలి’ అని నాన్న గారు చెబుతుంటారు. ఆయన ఫాలో అయ్యే పాలసీ అదే! ప్రతి డిసెంబర్ 31వ తేదీ రాత్రి మా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో డిన్నర్ చేసి, లాంగ్ డ్రైవ్‌కి వెళతాం. న్యూ ఇయర్‌కి సంతోషంగా వెల్కమ్ చెబుతాం. పిల్లల మీద ఎలాంటి రిస్ట్రిక్షన్లూ పెట్టకుండా, తగినంత ఫ్రీడమ్ ఇచ్చి, ఫ్రెండ్ లాగా ఉంటారు కాబట్టే ఐ లవ్ మై డాడ్ సోమచ్! కొన్నిసార్లు వాళ్ళే నా ఫాదర్! - దర్శకుడు గుణశేఖర్ అమ్మానాన్నకు ఎనిమిదిమంది పిల్లల్లో నేను ఏడోవాణ్ణి. నాకు మాత్రం ఇద్దరే పిల్లలు. మా అమ్మాయిలిద్దరి భావాలు, వాడే గ్యాడ్జెట్లు మోడరన్. అదే సమయంలో మన సంస్కృతిని మర్చిపోరు. వాళ్ళ అమ్మతో కలసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇప్పటికీ మా ఆవిడనీ, నన్నూ ‘అమ్మా, నాన్నా’ అనే పిలుస్తారు. ఎంత ఎదిగినా, మూలాల్ని మర్చిపోని మా పిల్లల్ని చూసి, అందుకే గర్విస్తుంటా. ♦ మా పిల్లలు, మేము అంతా హోమ్ బర్డ్స్. దేశదేశాల టూర్‌కు వెళ్ళినా నాలుగు రోజులు కాగానే, మా చిన్నమ్మాయి ఇంటికి వెళదామంటుంది. మా పెద్దమ్మాయైతే, మాకు దూరంగా ఉండడం ఇష్టం లేక డిగ్రీ చదువుకు లండన్‌కు వెళ్ళలేదు. అంత బలమైన కుటుంబబంధం మాది! ♦ పిల్లలకు మార్కులే జీవితం కాదు. మార్కుల కన్నా వాళ్ళ ఐ.క్యూ. ఎలా ఉందనేది ముఖ్యం. నేను అదే చూస్తా. మా పిల్లలిద్దరూ మంచి విమర్శకులు. అలా మా ఇంట్లోనే ఇద్దరు క్వాలిటీ కంట్రోలర్లున్నారు. (నవ్వు...) ♦ మా ఆవిడ, పిల్లలే నా బలం. నైతికంగా వాళ్ళ అండ లేనిదే ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌ను కలలోనైనా ఊహించలేను. మా పెద్దమ్మాయి నీలిమకి అవగాహన చేసుకొనే వయసు, అభిరుచి ఉన్నాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు తనతో పంచుకొనేవాణ్ణి. ♦ మేమంతా ఏదో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నట్లు ఉండం. అందుకే, ఒక్కోసారి నా పిల్లలే నాకు తండ్రి కూడా అవుతుంటారు. ఈ ‘రుద్రమదేవి’ జర్నీలో నేనెప్పుడైనా కొద్దిగా డల్ అయితే, ‘చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఫిల్మ్ తీస్తున్నాం’ అని ఉత్సాహపరిచేవారు. ఏ తండ్రికైనా, క్రియేటర్కైనా ఇంట్లో అంతటి సపోర్ట్ ఉంటే, అంతకు మించి ఇంకేం కావాలి! మా ఇద్దరమ్మాయిలతో పాటు నన్ను కూడా అమ్మ లాగా చూసుకొనే రాగిణి నా శ్రీమతి కావడం అదృష్టం! పిల్లల పెంపకంలో నేను 50 శాతమే ఫాదర్‌ని. మిగిలిన 50 శాతం వాళ్ళకు నాన్న మా ఆవిడే! ఆయన నేర్పిన సూత్రం అదే! - శ్రీమతి రాగిణీ గుణ (గుణశేఖర్ భార్య) పిల్లలకు తల్లితండ్రులే రోల్‌మోడల్స్! వాళ్ళు మనల్నీ, మన అలవాట్లు, ప్రవర్తననే చూసి పెరుగుతారు. పిల్లల్ని పెంచడమంటే వాళ్ళకు కావాల్సినవి సమకూర్చడమే కాదు. మంచీ చెడు వివరంగా చెప్పడం, వాళ్ళతో గడపడం! ఆ విషయంలో తండ్రిగా ఆయన (గుణశేఖర్)కు పదికి పది మార్కులు వేస్తా. డిసిప్లిన్ నేర్పుతూనే, పిల్లలతో ఫ్రెండ్‌లా కలిసిపోతారు. ఫలానా డిగ్రీ చదవండి, ఫలానా ఉద్యోగం చేయండి అంటూ పిల్లలపై ఒత్తిడి పెట్టడం ఆయనకు కానీ, నాకు కానీ అస్సలు ఇష్టం ఉండదు. ‘మనసుకు నచ్చింది చదవండి, నచ్చిన పని చేయండి. అది టీచర్ ఉద్యోగం కావచ్చు, ఇంటి నిర్వహణ చూసుకొనే గృహిణి కావచ్చు... ఏది చేసినా దానిలో హండ్రెడ్ పర్సెంట్ పెడితే, మానసిక సంతృప్తి, దానితో పాటు విజయం వస్తాయి’ అని చెబుతుంటాం. పిల్లలకు ఆయన నేర్పిన విజయసూత్రం అదే! - రెంటాల జయదేవ ఫొటోలు: శివ మల్లాల -
కాకి ఎంగిలి
ఈ అన్నదమ్ములిద్దరు టీవీలో పిజ్జాను మొట్టమొదటిసారి చూశారు. జీవితంలో కోడిగుడ్డు కూడా నోచుకోనివాళ్లు. కాకికి కొంచెం ఎంగిలి పారేసి, దాని గూటిలో నుంచి కాకిగుడ్లు దొంగిలించి తినేవాళ్లు. వీళ్లిప్పుడు పిజ్జా తినాలి! కాకి ఎంగిలైనా ఓ.కె! అంటే ఒక ముక్క... ఇద్దరు కొరుక్కున్నా చాలు. మహాపట్టణాల్లో మనం ఎంగిలి చేసి పారేసినవి వీళ్లింటి ముందు మురుగు కాలువలా పారుతుంటాయి. తమిళ సినిమా ‘కాక్కా ముట్టై’ చూస్తుంటే బాధా కలుగుతుంది. సంతోషంగానూ అనిపిస్తుంది. బాధ ఇంకా ఇలాంటి అవస్థ ఉన్నందుకు! సంతోషం బాధను కూడా కాకి ఎంగిలిలా పంచుకోగలుగుతున్నందుకు!! సదరన్ స్పైస్ - కాక్కాముట్టై (తమిళ సినిమా) హీరో ధనుష్‌కు మనసు మనసులో లేదు... తమిళనాట క్రేజున్న ఆ యువ స్టార్‌కు రెండు రోజులుగా అదే అవస్థ. కమర్షియల్ సినిమాలతో తల మునకలై, కోట్లు సంపాదిస్తున్న ఒక స్టార్‌కు అది విచిత్రమైన పరిస్థితే! దర్శకుడు, స్నేహితుడు వెట్రిమారన్ చెప్పిన కథ, ఇచ్చిన స్క్రిప్టు మనసులో సుడులు తిరుగుతూనే ఉంది. ఎవరో మణికంఠన్ అట... కొత్త డెరైక్టర్... అతను రాసిన కథ. ఆ రాత్రి ధనుష్ చదివింది పట్టుమని పది పేజీలే! ఆ తరువాత చదువుదామంటే కంటి మీది నీటి పొర అక్షరాలకు అడ్డం పడుతోంది. ఒక్కసారిగా పాతికేళ్ళ క్రితం రోజులు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. స్క్రిప్టులోని అన్నదమ్ములిద్దరు (పెరియ కాకాముట్టై, చిన్న కాకా ముట్టై) చేసిన పనులు అన్నయ్య సెల్వ రాఘవన్, తాను కలసి చిన్నప్పుడు చేసిన అల్లరిని గుర్తు చేశాయి. చాలా రోజులకు ఒక ఎమోషనల్ స్క్రిప్టు. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ‘ఈ సినిమాలో ఎలాగూ నటించలేను. కానీ, లోలోపల జ్వలిస్తున్న కళాతృష్ణను తీర్చుకోవాలంటే... ఏం చేయాలి? ఇప్పటి దాకా ప్రొడ్యూస్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ నాన్ కమర్షియల్ ఫిల్మ్‌కు నిర్మాతనైతేనో...?’ ధనుష్ అంతరంగ మథనం ఎట్టకేలకు ముగిసింది. అంతే... ధనుష్‌కు నిద్ర పట్టింది. తమిళనాట వీస్తున్న గాలి ఇదే! హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ నిర్మాతలుగా ఒక చిన్న ప్రయోగం తెరకెక్కింది. మనసుకు నచ్చి చేసిన ఆ ప్రయోగం... అంతర్జాతీయంగానూ అందరినీ ఆకట్టుకుంటుందని ఆ రోజున వారు ఊహించలేదు. తాజా జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటులు - ఆ సినిమాకు ఒకటికి రెండు నేషనల్ అవార్డులు. ధనుష్ సినిమా తీస్తున్నప్పుడు ‘దుస్సాహసం’ అన్నవాళ్ళంతా, ఒక్కసారి ఆగి, ఆలోచనలో పడ్డారు. సరిగ్గా రెండు వారాల క్రితం ప్రపంచమంతటా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు వాళ్ళతో పాటు అందరినీ ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. లక్షలాది సామాన్య సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుస్తోంది. ఇప్పుడు తమిళనాట విడుదలైన కొత్త సినిమాల్లో సెన్సేషన్ ఏదైనా ఉందీ అంటే - అది ఈ సినిమానే! ‘కాక్కా ముట్టై’(తెలుగులో ‘కాకి గుడ్డు’ అని అర్థం)!! శంకర్‌ను కదిలించిన ఈ దర్శకుడెవరు? భారీ సినీ స్వప్నాలను వందల కోట్ల ఖర్చుతో వెండితెరపై పరచే దర్శకుడు శంకర్ రియలిస్టిక్‌గా ఉన్న ‘కాక్కా ముట్టై’ చూసి కదిలిపోయారు. చెన్నై మహానగరంలో మురుగు నదిగా మిగిలిన కూవమ్ నది ఒడ్డున, ఒక మురికివాడలో, రైలు పట్టాల పక్కన బతుకులీడ్చే ఒక నిరుపేద కుటుంబం కథను తెరపై చూసి, ఆగలేకపోయారు. వెంటనే ఫేస్బుక్లో ‘‘పెద్ద పెద్ద విషయాల్ని కూడా చాలా సింపుల్ పద్ధతిలో చెప్పిన సినిమా. జీవం తొణికిసలాడే పాత్రలు, నటన...’’ అని తన మనసులో మాటలు పంచుకున్నారు. ఇంతమందిని కదిలిస్తున్న ‘కాక్కా ముట్టై’ తీసిందెవరు? ఈ సినిమాకు రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం - మూడూ మణికంఠన్వే! ఆయనేమీ కొమ్ములు తిరిగిన దర్శకుడు కాదు. సగటు... పెళ్ళిళ్ళ ఫొటోగ్రాఫర్. పోనీ, అంతకు ముందు ఏవైనా సినిమాలు చేశాడా? అదీ లేదు! కానీ, తొలి ప్రయత్నంతోనే అంతర్జాతీయంగా కూడా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి పడేశాడు. టొరంటో, లాస్ ఏంజెల్స్, దుబాయ్... ఇలా ఒకటీ, రెండూ కాదు... అయిదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాకు చప్పట్లు... ప్రశంసలు... స్టాండింగ్ ఒవేషన్లు... అవార్డులు. నిజాయతీతో ఒక ప్రయత్నం చేస్తే, అది ప్రాంతం, భాషలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుందనడానికి ఈ సినిమా తాజా ఉదాహరణ. ఒక ప్రాంతీయ భాషా సినిమాను ‘ఫాక్స్ స్టార్ స్టూడియో’ లాంటి ప్రసిద్ధ సంస్థ పంపిణీ చేయడం చాలా స్పెషల్. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ‘కాక్కా ముట్టై’కి దక్కింది. చిన్న సినిమా... పెద్ద హిట్టు! ఈ సినిమా అవార్డులతో ఆగలేదు. వర్షం... కలెక్షన్ల వర్షం... ఎండకూ, వానకూ వెరవకుండా వస్తున్న ప్రేక్షక జనంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో రోజుకు ఒక్క షో వేస్తున్నా... వర్కింగ్ డే కూడా హాలులో 70 శాతం పైగా ఫుల్. ఆ మాటకొస్తే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా నిర్మాత ధనుష్‌కు డబ్బులు తెచ్చేసింది. శాటిలైట్ రైట్స్ అమ్మకంతోనే ఆయనకు పెట్టిన పెట్టుబడితో పాటు లాభమూ వచ్చేసింది. రిలీజయ్యాక కలెక్షన్ల ద్వారా వస్తున్నదంతా లాభాల బోనస్సే! ఇవాళ ‘కాక్కా ముట్టై’ చిన్న సినిమా కాదు. పెద్ద సినిమా. పది రోజుల్లో రూ. 8.6 కోట్లు వసూలు చేసిన భారీ హిట్ సినిమా. ప్రయోగాత్మక బాలల చిత్రం కాదు... సినీజీవుల్ని ఆలోచింపజేస్తున్న పాత్ బ్రేకింగ్ మూవీ. పెద్దలూ చూడాల్సిన పిల్లల సినిమా ప్రపంచంలో ఉన్నవి రెండే జాతులు - ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు. పెరిగిపోతున్న ఈ అంతరం, ప్రపంచీకరణ పర్యవసానం, ప్రతి ఒక్కరినీ కన్జ్యూమర్స్గా చూస్తున్న వ్యాపార ప్రకటనలు, సెల్‌ఫోన్ మోజు - ఇలాంటి ఎన్నో అంశాల్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. సమకాలీన సమాజం పసి హృదయాలపై చూపుతున్న ప్రభావాన్ని సందేశాలు, బోధనలు, డైలాగుల హోరు లేకుండా విజువల్‌గా మనసుకు తాకేలా చెబుతుంది. గుండెను పిండే ఎన్నో అంశాలను లేయర్లు... లేయర్లుగా చూపెట్టిన ప్రోగ్రెసివ్ ఫిల్మ్ కాబట్టే ఇది ఇవాళ ఇంతమందిని కదిలిస్తోంది. బాలల సినిమాలు రావడం లేదంటాం కానీ, ఇలాంటి సినిమాలకు పిల్లల్ని తీసుకెళితే... పిల్లలే కాదు, పెద్దలూ చుట్టూ ఉన్న సమాజం పట్ల ఆలోచనలో పడతారు. మనం తీయలేమా? ‘కాక్కా ముట్టై’ కథ వింటే... ‘ఓస్... ఇంతేనా’ అని కొందరికి అనిపించవచ్చు. బడ్జెట్ తెలుసుకుంటే... ఇలాంటి డజను సినిమాల ఖర్చుతో కానీ, ఒక తెలుగు సినిమా తయారుకాదని అనుకోవచ్చు. సహజమైన ఆ మాటలు, నటన, లొకేషన్లు... తెరపై చూస్తే... ‘ఈ మాత్రం మనం చేయలేమా’ అనిపించవచ్చు. అనిపించవచ్చు, అనుకోవచ్చు కాదు... కచ్చితంగా అనుకోవాలి. అలా అనుకొని మన తెలుగు నుంచి కూడా ఏ ధనుష్ లాంటి హీరోనో నిర్మాతగా మారాలి. ఏ మణికంఠన్ లాంటి మట్టిలో మాణిక్యమో సినిమా తీయాలి. అలా చేస్తే... అంతకన్నా ఇంకేం కావాలి! తెలుగు సినిమా మళ్ళీ కొత్త బాట పడుతుంది. కొత్తదనంతో కాలరెగరేసుకొని మరీ తిరుగుతుంది. ‘కాక్కా ముట్టై’ ప్రేక్షకులకే కాదు... రూపకర్తలకూ ఇస్తున్న స్ఫూర్తి ఇదే! నిజజీవితంలో 9వ తరగతి చదువుతున్న విఘ్నేశ్, 6వ తరగతి చదువుతున్న రమేశ్ ఇప్పుడు తమిళనాట ధనుష్ కన్నా పెద్ద హీరోలు. ధనుష్ మొన్న సినిమా రిలీజయ్యాక చెప్పిందీ అదే... ఎప్పటికైనా ఈ సినిమాలోని బాల నటుల లాగా తానూ నటించాలి. కెమేరానే లేదన్నట్లుగా, అత్యంత సహజంగా నటించాలి. అలా చేస్తే నటుడిగా తాను ఉన్నత స్థాయికి చేరుకున్నట్లే! ఇలాంటి బాలల సినిమాలు మరిన్ని తీయాలి. ఒక జాతీయ ఉత్తమ నటుడిలో ఈ చిన్న ‘కాకి గుడ్డు’ రగిలించిన క్రియేటివ్ అర్జ్ అది. సినిమా చూస్తే... మనకూ, మనవాళ్ళకూ కూడా మనసు వీణలోని తీగ ఏదో శ్రుతి అవడం ఖాయం! - రెంటాల జయదేవ ఈ ‘కాకి గుడ్డు’ కథేంటి? ఇంతా చేస్తే ఈ సినిమాలో ఉన్నది ప్రసిద్ధ తారాగణమేమీ కాదు. ఆరితేరిన అభినేతలు అసలే కాదు. ఇద్దరు పసివాళ్ళు... అదీ కొత్తవాళ్ళు... విఘ్నేశ్ (14 ఏళ్ళు), రమేశ్ (12). వాళ్ళే కథను నడిపే కథానాయకులు. వాళ్ళు చేసినవి కమర్షియల్ రోల్స్ కావు. చెన్నైలోని ఒక మురికివాడలోని రోజూ కష్టపడి రూపాయి రూపాయి సంపాదించే కుటుంబంలోని పిల్లల పాత్రలు... ఒక నెల మొత్తం సంపాదనతో సమానమైన 300 రూపాయల పిజ్జాను ఎలాగైనా రుచి చూడాలనుకొనే ఆ పసి మనసుల కోరిక చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. తల్లి (ఐశ్వర్యా రాజేష్), బామ్మ - ఇలా సినిమాలో ఎవరిని చూసినా మనం చూసిన మనుషులు, మన జీవితాలే గుర్తుకొస్తాయి. బామ్మ పిల్లాడికి స్నానం చేయిస్తుంటే, పిల్లాడు తన చేతిలోని పెంపుడు కుక్కపిల్లకు అప్రయత్నంగా నీళ్ళు పోయడం లాంటి ఘట్టాలు చూడాల్సినవే. ఇలాంటి ప్రయత్నం కాబట్టే, మరో యువ తమిళ స్టార్ హీరో శింబు కూడా ఇందులో తన నిజజీవిత పాత్రలోనే గెస్ట్‌గా కనిపించారు. జి.వి. ప్రకాశ్‌కుమార్ (సంగీతం), ఇటీవలే కన్నుమూసిన కిశోర్ (ఎడిటింగ్) లాంటి పేరున్న టెక్నీషియన్స్ పెద్ద సపోర్ట్‌గా నిలిచారు. పాటలు, రీ-రికార్డింగ్‌లో ఒక కొత్త జి.వి. ప్రకాశ్‌కుమార్‌ను చూడవచ్చు. అలాగే, దృశ్యాలు మారుతున్న సంగతే తెలియనివ్వని షార్ప్ ఎడిటింగ్ గమనించవచ్చు. -
సినిమా రివ్యూ : పండగ చేస్కో
డబ్బు, టైమ్... ‘దండగ చేస్కో’! చిత్రం - పండగ చేస్కో, తారాగణం - రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, కథ - వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్, రచనా సహకారం - అనిల్ రావిపూడి, కెమేరా - సమీర్ రెడ్డి, నిర్మాత - పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - గోపీచంద్ మలినేని ఒక సగటు తెలుగు సినిమాలో ఉండేవి ఏమిటి? విడిపోయిన కుటుంబాలు... తెగిపోయిన బంధాలు... ఆ ఫ్యామిలీలను కలపడానికి హీరో పడే శ్రమ, అందుకు హీరోయిన్‌తో సాగించే ప్రేమ... వాటి మధ్యలో ఒక విలన్ బృందపు వేట! దీనికి బ్యాక్‌డ్రాప్ - పెళ్ళి వారి ఇంటి నేపథ్యం. ఇలాంటి కథలు ఎన్ని వందలు తెరపై చూశామని బుర్ర బద్దలుకోనక్కర లేదు. గతంలో అలాంటివి చూడకుండా తప్పించుకున్నవారెవరైనా ఉంటే, వారి కోసం తాజాగా అటువంటి మరో సినిమా వచ్చింది. అది చూసి, ‘పండగ చేస్కో’వచ్చు. కథ ఏమిటంటే... ఎక్కడో పోర్చుగల్‌లో కార్తీక్ పోతినేని (రామ్). వీడియో గేమ్స్ మీద పట్టుతో వాటినే డెవలప్ చేసి, పెద్ద కంపెనీ పెట్టి, కోట్లు గడించిన యువతరం వ్యాపారవేత్త. తల్లితండ్రులు (పవిత్రా లోకేశ్, రావు రమేశ్), చెల్లెలు, బావ ఉంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో అతనికి అనుష్క (సోనాల్ చౌహాన్) అనే మరో బడా పారిశ్రామికవేత్త తగులుతుంది. ఫలానా వయసులోగా భారతీయ సంతతి వ్యక్తిని ఎవరినైనా పెళ్ళిచేసుకోకపోతే, వేల కోట్ల ఆస్తి మొత్తం వేరొకరికి వెళ్ళిపోతుందని ఆమె తండ్రి వీలునామా రాసిన సంగతి ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ముప్ఫై రోజులే గడువు ఉండడంతో, వరుడి కోసం వెతుకుతున్న ఆమె కార్తీక్‌ను పెళ్ళాడాలనుకుంటుంది. మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (‘మిర్చి’ సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ హీరో గారి ఫ్యాక్టరీ మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. ఇండియాలోని ఈ ఫ్యాక్టరీ కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు హీరో. హీరో ఇక్కడ కొచ్చాక, ఈ హీరోయిన్ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. అదేమంటే, అసలు తాను పెళ్ళి చేసుకోవాలనుకున్నది ఈ హీరోయిన్నే అంటాడు. కావాలని తానే కేసు వేయించానంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఇదేమిటని మనం విస్తుపోవడంతో ఫస్టాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక, సెకండాఫ్ అంతా... హీరో ఎవరు? అతనికీ హీరోయిన్ తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? హీరోయిన్ తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఇంతలో పోర్చుగల్‌లో హీరో పెళ్ళి మాట ఇచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్ ఇండియాకు దిగుతుంది. ఈ గందరగోళాల మధ్య ఏం జరిగింది, విడిపోయిన కుటుంబాలు ఎలా కలిశాయన్నది మిగతా సినిమా. ఎలా ఉందంటే... తరచూ పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నట్లు అనిపించే రామ్ ఈసారీ అలానే అనిపించారు. ఈసారి ‘అత్తారింటికి దారేది’ తరహా కథ, క్లైమాక్స్‌ను అనుసరించారని అనిపిస్తుంది. కాకపోతే, ఉన్నంతలో ఆయన మంచి ఎనర్జీతో నటించారు. డ్యాన్సులు చేశారు. ఫైట్లూ అంతే. కాకపోతే, ఏ పాటా గుర్తుండదు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చూడడానికి బాగుందే తప్ప, ఆ పాత్రకు ఒక నిర్దిష్ట ప్రయోజనం, పరిధి కనిపించవు. సోనాలీ చౌహాన్ పనికొచ్చిందల్లా... బికినీలో గ్లామరస్‌గా కనిపించే పాటకే! అందరికీ ఉచితంగా సలహాలిచ్చే ‘వీకెండ్ వెంకటరావు’ పాత్రలో బ్రహ్మానందం కాసేపు నవ్విస్తారు. కానీ, సెకండాఫ్‌లో ఆ పాత్రను మరీ చౌకబారుగా మార్చేశారని అనిపిస్తుంది. వెయ్యి సినిమాలు చేసేసిన తరువాత ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం లాంటి ఆలోచనాపరుడు ఇలాంటి పాత్రలు చేయకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటనిపిస్తుంది! రౌడీ శంకరన్నగా అభిమన్యు సింగ్ సో సోగా ఉన్నా, అతని మేనమామ పాత్రలో జయప్రకాశ్‌రెడ్డి డైలాగ్స్, టైమింగ్ కొంత నవ్విస్తాయి. తీరా ఆ పాత్రలు కూడా అర్ధంతరంగా ఆగిపోతాయి. మళ్ళీ ఆఖరు క్షణంలో దర్శక, రచయితలకు గుర్తొచ్చినప్పుడు తెర పైన కనిపిస్తాయి. ఈ సినిమాకు సంగీతం - తమన్‌ది. అయితే, తమన్ బాణీలు కేవలం డప్పులు, దరువుల మోత అంటూ ఒక పాటలో సాహిత్యం ఉండడం తమన్ నిజాయతీకి నిదర్శనం అనుకోవాలేమో! ఇండియాలో తీసి, పోర్చుగల్ బ్యాక్‌డ్రాప్‌తో మిక్స్ చేసిన సి.జి. సీన్లు తెలిసిపోతుంటాయి. ఒకటి, రెండు పాటల చిత్రీకరణ, కెమేరా వర్క్, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ముగ్గురు రచయితలు రచనలో చేయి పెట్టిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే క్రెడిట్ కూడా ఒక రచయితకూ, దర్శకుడికీ కట్టబెట్టారు. ఇంతా చేసి, కథ, కథనం మాత్రం ‘ఢీ’, ‘రెఢీ’, ‘కలిసుందాం రా’, ‘బృందావనం’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సవాలక్ష చిత్రాల్లోని సీన్లకు పేలవమైన అనుసరణే. ఇన్ని సినిమాల రీమిక్స్ అయిన ఈ సరికొత్త వెండితెర వంటకంలో ద్వంద్వార్థపు మాటలు, సీన్లు, వెకిలి చేష్టలు మాత్రం అదనం. ఫస్టాఫ్ కొంత బోర్ అనుకుంటే, సెకండాఫ్‌ను వినోదం పేరుతో అశ్లీలం నింపడం చీకాకు అనిపిస్తుంది. పాతికేళ్ళుగా సంసారం చేయని భార్యాభర్తలు, పెళ్ళికాకుండానే ప్రేమలో హద్దులు దాటాలని చూసే యువకులు, అప్పుడెప్పుడో పెళ్ళి కాక ముందే తల్లి అయిన ఒక స్త్రీ ఫ్లాష్‌బ్యాక్, బాస్‌నే పడగొట్టాలని రాత్రిళ్ళు గదుల వెంట తిరిగే కమెడియన్ - ఇలా అంతా కేవలం ‘సెక్స్’ చుట్టూ తిరుగుతున్నట్లు కథ నడిపారు. ‘పండగ చేస్కో’ లాంటి ఫ్యామిలీ టైటిల్‌కూ, కథా నేపథ్యానికీ, ఈ ప్రవర్తనకూ సరిపడుతుందా, లేదా అన్న ఆలోచన కూడా దర్శక, నిర్మాతలు, రచయితలు చేసినట్లు కనిపించదు. ఇక, సినిమా కథ, కథనంలో లోపాలు సవాలక్ష. అప్పటిదాకా హాస్టల్లో చదువుకున్నట్లున్న హీరోయిన్ ఎక్కడో వేరే ఊరికి వెళ్ళినట్లు చెప్పారు. ఆ తరువాత అక్కడ చాలా కాలంగా ‘గ్రీన్ ఆర్మీ’ పేరిట పచ్చదనం పరిరక్షణకు పనిచేస్తున్నట్లు చూపారు. ఆమె స్టూడెంటా? యాక్టివిస్టా? లాంటి డౌట్లు వస్తాయి. అలాగే మేనమామ కూతురిని పెళ్ళాడాలని అనుకున్న హీరో, మరి పోర్చుగల్‌లో బిజినెస్ మ్యాగ్నెట్ (సోనాలీ చౌహాన్)ను పెళ్ళాడతానని ఎందుకు అన్నట్లు? అనిపిస్తుంది. కానీ, అవన్నీ అప్పటికప్పుడు సినిమాటిక్ స్క్రీన్‌ప్లే రచయితలు తీసుకున్న కన్వీనియన్స్ అనుకొని సర్దుకుపోవడం మినహా సగటు ప్రేక్షకుడు చేయగలిగింది ఏమీ లేదు. వెరసి, కొన్ని కట్స్‌తో చివరకు ‘యు ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ 2 గంటల 42 నిమిషాల సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. ‘ఏ’ సినిమాకు ‘యు ఏ’ఎలా దక్కిందా అన్న ఆశ్చర్యమూ కలుగుతుంది. వెరసి... బోలెడంత టైమ్, కాసింత డబ్బు దండగ చేస్కోవాలంటే మాత్రం ‘పండగ చేస్కో’ మన తెలుగు ప్రేక్షకులకు వచ్చిన లేటెస్ట్ ఆప్షన్. - రెంటాల జయదేవ -
జక్కన్న బాహుబలి
రాజమౌళి గుండెకు కూడా భుజాలు (బాహువులు) ఉన్నాయేమో! లేకపోతే ఇంత టెన్షన్ ఎలా మోస్తున్నాడు? ‘బాహుబలి’ పెద్ద సినిమా అని అందరం వింటూనే ఉన్నాం. ఫిల్మ్ యూనిట్ అన్ని విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల కాబోలు... సినిమా ‘స్కోపు’... కిసీ కో సమజ్మే నహీఁ ఆయా. అర్థం కాలేదు. ఈ మధ్యే మన ‘సాక్షి’ సినిమా టీమ్ అక్కడా ఇక్కడా వినికిడిలో ఉన్న సమాచారం పోగేసుకొచ్చింది. నథింగ్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్. ‘కథ వెనుక కథ ఇంత ఉందా?’ అని మేమే నివ్వెరపోయేంత కథ ఉంది. తెలిసిన విషయం పంచుకోకపోతే కడుపునొప్పే. అదీ... సినిమాను అంతగా ప్రేమించే మీతో పంచుకోకపోతే ఎలా? జూలై 10 సినిమా రిలీజ్. విన్నదానికీ, చూసేదానికీ లింకు అప్పుడు కుదురుద్ది. అప్పటి దాకా మేము చెప్పిందే సినిమా... ఎంజాయ్! ♦ ఇంతకీ ‘బాహుబలి’ కథేంటి? రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జైనులు ఆరాధించే ‘బాహుబలి’ కథ అని కొందరంటున్నారు. యుద్ధం నుంచి శాంతికి పరివర్తన చెందిన మహావీరుడి జీవితం నుంచి తీసుకున్నారని మరికొందరు. అయితే, అవేవీ నిజం కాదని ఆంతరంగిక వర్గాల మాట. రాజుల కాలపు ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా - పూర్తిగా కల్పిత కథ. రాజమౌళి తండ్రి వి.విజయేంద్రప్రసాద్ వండిన వంటకం. రాజ్యాధికారం కోసం పెదనాన్న, చిన్నాన్న పిల్లల మధ్య సాగే పోరాటం. పగ, ప్రతీకారం, ప్రేమ, అసూయల మధ్య సినిమా నడుస్తుంది. శివుడుగా, బాహుబలిగా ఇందులో రెండు పాత్రల్ని ప్రభాస్ పోషిస్తున్నారు. ప్రభాస్ మాటల్లో... ‘‘ఇది - రాజులు, రాజ్యాలు, అధికారం కోసం సాగే పోరాటం, యోధానుయోధుల చుట్టూ తిరిగే కాల్పనిక గాథ’’. బాహువుల్లో అపారమైన బలం ఉన్న వ్యక్తి గనక, అతణ్ణి ‘బాహుబలి’ అంటారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి మాటల్లో అయితే... బాహుబలి ‘‘ది ట్రూ కింగ్’’. ♦ అనుష్క కనిపించేది కాసేపేనా? ప్రభాస్ వేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్రే ఫస్ట్‌పార్ట్ ‘బాహుబలి... ది బిగినింగ్’లో కనిపిస్తుందని ఒక గాలివార్త షికారు చేస్తోంది. అదేమిటని ఆరా తీస్తే, రెండు పాత్రలూ ఇందులో కనిపిస్తాయని తెలిసింది. బాహుబలిలో హీరో తరువాత హీరో అంతటి ప్రాధాన్యమున్న పాత్ర - భల్లాలదేవ. బాహుబలికి తమ్ముడి వరసయ్యే పరమ దుష్టుడు. ఆ పాత్రను వేస్తున్నది రానా దగ్గుబాటి. సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ మీద నడుస్తుంది. అది అంత పవర్ఫుల్ పాత్ర. ‘‘రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ విలన్ పాత్రల్లో ఒకటవుతుంది. ఆ మాట నమ్మకంగా చెప్పగలను’’అని ప్రభాస్ అన్నది అందుకే! బాహుబలి ప్రేమికురాలు అవంతిక పాత్రధారిణి-తమన్నా. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమే ప్రధాన హీరోయిన్. ఇక, అనుష్క పోషించే కీలక పాత్ర దేవసేన. అయితే, ఈ ఫస్ట్ పార్ట్‌లో ఆమె కనిపించేది మాత్రం చాలా కొద్దిసేపేనట! అదీ ఈ మధ్య విడుదల చేసిన వయసు మీద పడ్డ గెటప్‌లోనే అట! 2016లో వచ్చే ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ (దానికి ఇంకా పేరేదీ ఖరారు చేయలేదు)లో మాత్రం అనుష్క పాత్రదే హవా అని కృష్ణా నగర్ కబురు. అలాగే, రమ్యకృష్ణ, తమిళం నుంచి నాజర్, సత్యరాజ్, కన్నడం నుంచి ‘ఈగ’ ఫేమ్ సుదీప్ లాంటి భారీ తారలు ఈ సినిమాలో ఉండనే ఉన్నారు. ♦ ప్రీ-ప్రొడక్షన్‌కే... ఆరు నెలల పైగా... ‘బాహుబలి’ సెట్స్, పాత్రల రూపురేఖలు, దుస్తులు,అలంకరణ లాంటి వాటికి పాతిక మందికి పైగా ఆర్టిస్టులు దాదాపు 15 వేలకు పైగా రేఖాచిత్రాలు గీశారు. జాతీయ స్థాయిలో పేరున్న ఆర్ట్ డెరైక్టర్ సాబూ శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బ్రహ్మాండమైన సెట్స్ వేశారు. అంతటితో ఆగకుండా, ఆయన అక్షరాలా ఒక మెకానికల్ ఇంజనీర్ లాగా అగ్ని గోళాలను విసిరే యంత్రాలు, నీటిని పైకి తోడే పరికరాల లాంటి వాటిని సొంతంగా తయారు చేశారు. ఇప్పటికీ ఆ పరికరాలను స్వయంగా ఉపయోగించి చూడవచ్చు. రాజమౌళి సతీమణి రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని కాస్ట్యూమ్స్ పని చూస్తే, రాజమౌళి ఆస్థాన కెమేరామన్ కె.కె. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. కాన్సెప్ట్ స్కెచ్‌ల మొదలు... ఎక్కడ, ఏ సీన్ ఎలా తీయాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్‌లు, ప్రాపర్టీ వాడాలనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొన్నాకే షూటింగ్‌కు వెళ్ళారు. ఇలా ఆరు నెలలకు పైగా ప్రీ పొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకోవడం వల్ల చిత్ర నిర్మాణవ్యయంలో దాదాపు 25 నుంచి 30 శాతం ఆదా అయింది. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆ సంగతి వెల్లడించారు. ♦ ఎక్కడెక్కడ తీశారు? రెండేళ్ళ క్రితం 2013 జూలైలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ‘బాహుబలి’ షూటింగ్ మొదలైంది. సినిమా ప్రధానంగా ఆర్.ఎఫ్.సి.లో తీశారు. కొంత భాగం మహాబలేశ్వర్‌లో, రెండు పాటలు అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన సెట్స్‌లో చిత్రీకరించారు. కథానుసారం మంచు కొండల నేపథ్యం అవసరం. దాంతో, బల్గేరియా వెళ్ళి, అక్కడ నెల రోజుల పాటు షూట్ చేశారు. కీలక దృశ్యాలు తీశారు. ♦ 3డి ఆలోచన రాలేదా? తమిళంలో ‘బాహుబలి’కి మొదట అనుకున్న పేరు - ‘మహాబలి’. కానీ, తమిళ సంప్రదాయంలో ఆ పేరు ఒక రాక్షసుడిదట! దాంతో, వెనకడుగు వేశారట! పైగా ‘బాహుబలి’ అనే పేరే అన్ని భాషల్లో ఉంటే బ్రాండ్‌గా డెవలప్ చేయడం ఈజీ. అది గ్రహించి, చివరకు ఆ పేరే అన్ని భాషల్లో ఉంచారు. అసలు ముందుగా ఈ చిత్రాన్ని 3డి వెర్షన్లో, ఐ-మ్యాక్స్ వెర్షన్లో కూడా చేయాలని అనుకున్నారట! కానీ, ఇంతకు ఇంత ఖర్చవుతుంది, టైమ్ పట్టేస్తుందని గుర్తించి, ఆలోచన దశలోనే ఆ ప్రతిపాదనను చిత్ర యూనిట్ విరమించుకుందని తెలిసింది. ♦ తెలివి, టెక్నాలజీయే పెట్టుబడి... ఫ్రీగా కోట్ల పబ్లిసిటీ దాదాపు రెండేళ్ళుగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్‌తో జనం నోట నానుతూనే ఉంది. ఇన్నేళ్ళుగా పబ్లిక్‌లో ఇంట్రెస్ట్ తగ్గకుండా ఉండేలా చేయడానికి విభిన్నమైన పబ్లిసిటీ, ప్రమోషన్లు అనుసరించారు. ఫస్ట్‌లుక్స్, మేకింగ్ వీడియోలు మధ్య మధ్య రిలీజ్ చేశారు. ఇప్పటి దాకా ఏ మీడియాలోనూ ఒక్క రూపాయి కూడా యాడ్స్‌కు ఖర్చు పెట్టలేదు. ఆధునిక సాంకేతికతను నేర్పుగా వాడుకున్నారు. కేవలం ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్క్ మీదే ఆధారపడ్డారు. కొన్ని పదుల కోట్ల రూపాయల పబ్లిసిటీని తెలివిగా పొందారు. అందుకే, ఒక్కమాటలో... న్యూ డిజిటల్ ఎరా మార్కెటింగ్‌కు లేటెస్ట్ లెసన్ - ‘బాహుబలి’. సినిమా రిలీజ్ డేట్లు చాలాసార్లు మారుతూ వచ్చినా, ఆ ఎఫెక్ట్ పడకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్త పడ్డారు. మొదట సమ్మర్ రిలీజ్ అనుకున్నారు. కానీ, అది కాస్తా తప్పిపోయింది. అంతే... మే 1వ తేదీ నుంచి వరుసగా సినిమాలోని ప్రధాన పాత్రల గెటప్ పోస్టర్లు, ఆ పాత్రల స్వభావం గురించి దర్శకుడి కామెంట్స్‌తో యూనిట్ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ఫేస్బుక్ పేజ్‌ను 10 లక్షల 33 వేల మందికి పైగా లైక్ చేసి, ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో 74,400 మంది ఫాలోయర్లున్నారు. అక్కడ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు తెలుసుకుంటున్నారు. ‘‘భారత్‌లోనే అతి పెద్దదీ, అతి వేగంగా అభిమానులు విస్తరిస్తున్నదీ - ఈ ఫేస్బుక్ పేజీనే! అలాగే, దక్షిణాదిలో ఏ సినిమాకూ కనీవినీ ఎరుగని సంఖ్యలో ట్విట్టర్ ఫాలోయర్లున్నదీ ‘బాహుబలి’కే’’ అని సినీ మార్కెటింగ్ నిపుణులు చెప్పారు. ♦ అందరి నోటా అదే డిస్కషన్! గమ్మత్తేమిటంటే, బాహుబలి పోస్టర్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. గాజులు వేసుకున్న ఒక చెయ్యి నీటి ప్రవాహంలో నుంచి పైకి లేచి, పసిబిడ్డను మునిగిపోకుండా పెకైత్తి పట్టుకున్న దృశ్యాన్ని ‘బాహుబలి’ పోస్టర్ల సిరీస్‌లో ముందుగా రాజమౌళి విడుదల చేశారు. ‘‘ప్రతి కథకూ ఒక ప్రధాన సందర్భం ఉంటుంది. అది ఆ కథాంశం మొత్తాన్నీ నిర్వచించేలా, ముందుకు నడిపేలా ఉంటుంది. ‘బాహుబలి’కి గుండెకాయ లాంటి ఘట్టం ఇది’’ అంటూ ఆ దృశ్యాన్ని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ పోస్టర్ ఆలోచన, ఒక ఇంగ్లీషు సినిమా పోస్టర్‌కు ఇమిటేషన్ అంటూ సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. అలాగే, ఆ తరువాత వచ్చిన మరికొన్ని పోస్టర్లకూ, పాత సినిమాల్లోని పాత్రలకూ పోలికలున్నాయంటూ రంధ్రాన్వేషణా సాగింది. చిత్ర యూనిట్ మాత్రం దేనికీ పెదవి విప్పలేదు. ♦ ఇంటి దొంగలు... లీకు వీరులు..! ‘బాహుబలి’ రిలీజ్ కాకుండానే, ఫస్ట్‌పార్ట్‌లో 12 నిమిషాల ఫుటేజ్ కొన్ని నెలల క్రితం ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. గ్రాఫిక్స్ వర్క్ కోసం పంపిన ముడిసరుకు దృశ్యాలవి. వాటిని కొందరు ‘ఇంటి దొంగలే’ అక్కసుతో బయటపెట్టారు. ఆ వ్యవహారంపై దర్శక, నిర్మాతలు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, నెట్లో ఎక్కడా ఆ ఫుటేజ్ లేకుండా చేశారు. ♦ పోస్ట్ ప్రొడక్షన్ వండర్స్ భారతీయ సినిమా చరిత్రలో గ్రాఫిక్స్ వండర్ అంటే రానున్న రోజుల్లో ‘బాహుబలి’ పేరే చెప్పుకుంటే ఆశ్చర్యపోనక్కర లేదు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమా కోసం పనిచేస్తున్న రాజమౌళి బృందం కంటి నిండా కునుకు తీసి కొన్ని నెలలైందేమో! మొదట ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నది - మే 15న. ఆ మేరకు రాజమౌళి ప్రకటన కూడా చేశారు. కానీ, వర్క్ పూర్తి కాలేదు. గ్రాఫిక్సూ సిద్ధం కాలేదు. ఏప్రిల్ నెలాఖరుకు కూడా హైదరాబాద్‌లోని మకుట, ఫైర్‌ఫ్లై, చెన్నైలోని ప్రసాద్ ఇ.ఎఫ్.ఎక్స్‌తో సహా వివిధ దేశాల్లో 17 వి.ఎఫ్. ఎక్స్. స్టూడియోల్లో 600 మందికి పైగా సాంకేతిక నిపుణులు ఒకటికి రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. దానికి తోడు హిందీలో పెద్దయెత్తున మార్కెటింగ్‌కు ఇంకొంత టైమ్ కావాలనుకున్నారు. ఫలితం... హిందీ వెర్షన్‌ను సమర్పి స్తున్న దర్శకుడు కరణ్ జోహార్ సూచన మేరకు, హిందీకి కూడా కలిసొచ్చేలా జూలై 10కి రిలీజ్ ఫిక్స్ చేశారు. ♦ హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మూడుసార్లు (‘మ్యాజిక్... మ్యాజిక్’, రజనీకాంత్ - శంకర్ల ‘శివాజీ...ది బాస్’, ‘యంతిరన్... ది రోబో’) జాతీయ అవార్డు అందుకున్న గ్రాఫిక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్. ‘బాహుబలి’ గ్రాఫిక్స్ పనులన్నిటికీ కో-ఆర్డినేటర్‌గా సారథ్యం వహిస్తున్నది ఆయనే. హై క్వాలిటీ కావాలంటే, ప్రతి 10 సెకన్ల విజువల్ ఎఫెక్ట్‌కూ దాదాపు రూ. 50 వేల దాకా ఖర్చవుతుందట! అలాంటిది ‘బాహుబలి’లో ఒక్క గ్రాఫిక్స్‌కే సుమారు రూ. 70 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారని సమాచారం. సినిమాలో దాదాపు 95 శాతం సీన్లలో గ్రాఫిక్స్ ఉంటాయని భోగట్టా. ఇంత వరకూ దర్శకుడు శంకర్ చిత్రాలకూ, బాలీవుడ్లో షారుఖ్ ‘రా...వన్’ లాంటి మహా మహా సినిమాలకు కూడా గ్రాఫిక్స్‌కు ఇంత ఖర్చు పెట్టలేదు. శ్రమ పడలేదు. సినిమా అంతటా గ్రాఫిక్స్ ఉండడంతో, హాలీవుడ్ చిత్రాలు ‘అవతార్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ఫక్కీలో ఏది నిజమో, ఏది గ్రాఫిక్సో తెలియనంత నేర్పరితనం చూపేలా ‘ఫోటో రియల్ గ్రాఫిక్స్’ సృష్టిస్తున్నారు. ♦ ఆకలి పెంచే ఆడియో... ట్రైలర్ల రుచి... మే 31న! ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే భారీ వేడుకలో ‘బాహుబలి’ ఫస్ట్‌పార్ట్ తెలుగు, తమిళ పాటలు విడుదల చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో 8 పాటలుంటాయి. తెలుగు, తమిళ ఆడియో హక్కుల్ని బెంగుళూరుకు చెందిన లహరి మ్యూజిక్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. వారు కేవలం 15 ఏళ్ళ కాలపరిమితికి రూ. 3 కోట్ల పైచిలుకు చెల్లించి, హక్కులు కొనడం విశేషం. ఇక, హిందీ ఆడియో రైట్స్ మరో సంస్థవి. దేశంలో ఏ సినిమా ఆడియో రైట్లూ ఇంత భారీ మొత్తానికి అమ్ముడు కాలేదు. ఇక ఈ ఆడియో రిలీజ్ సంబరానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని టాప్ స్టార్లు, టెక్నీషియన్లు హాజరు కానున్నారు. కేవలం ఈ ఆడియో రిలీజ్ వేడుక ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని ఒక తెలుగు టీవీ చానల్ రూ. 1.1 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం. అన్నట్లు, తెలుగులో తొలిసారిగా డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో విడుదలవుతున్న హై క్వాలిటీ సౌండ్ ఎక్స్పీరియన్స్ ‘బాహుబలి’. అందుకోసం ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. కీరవాణి, సతీష్‌లు విదేశాలకు కూడా వెళ్ళి, అక్కడ పనులు చేసుకొచ్చారు. సినిమా ఎలా ఉంటుందో ముందుగా రుచి చూపించి, ఆకలి పెంచడానికి మొదటి ట్రైలర్ కూడా ఆడియోతో పాటు రిలీజ్ అవుతోంది. సెన్సార్‌లో ‘యు/ ఏ’ సర్టిఫికెట్ వచ్చిన రెండు నిమిషాల 5 సెకన్ల ఈ ఫస్ట్ థియేటరికల్ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే చూసినవారు చెబుతున్నారు. ‘‘అసలు ఈ ట్రైలర్ చూసే కరణ్ జోహార్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ‘ఇది కేవలం ప్రాంతీయ సినిమా కాదు... జాతీయ స్థాయి సినిమా. ఆ రకంగానే భారీయెత్తున ప్రమోట్ చేయా’లన్నారు’’ అని ‘బాహుబలి’ వర్గాలు చెప్పాయి. ♦ ఆల్ ఆర్ ఎవైటింగ్! తెలుగులో ఒక సీన్, ఆ వెంటనే తమిళంలో అదే సీన్ - ఇలా ఆ రెండు భాషల్లో ఏకకాలంలో ‘బాహుబలి’ని చిత్రీకరించారు. ఇప్పుడు తెలుగు నుంచి హిందీలోకి, తమిళ వెర్షన్ నుంచి మలయాళంలోకీ ఫస్ట్‌పార్ట్ డబ్బింగ్ చేస్తున్నారు. ఆ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. జూలై 10న ఈ నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. హిందీ వెర్షన్‌ను ప్రముఖ హిందీ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సారథ్యంలోని ధర్మ ప్రొడక్షన్స్, అనిత్ తడానీకి చెందిన ఎ.ఎ. ఫిల్మ్స్ సమర్పిస్తున్నాయి. తమిళంలోనేమో యు.వి. క్రియేషన్స్, హీరో సూర్య సన్నిహితులదైన స్టూడియో గ్రీన్ సంస్థ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ‘‘భారతదేశంలో తయారైన అతి పెద్ద సినిమా ఇది’’ అని కరణ్ జోహార్ ‘బాహుబలి’ని అభివర్ణించారు. నిజానికి, ఇవాళ తెలుగు, తమిళ సీమల్లోనే కాదు... యావత్ దేశం ఈ సినిమా వార్తలు, విశేషాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తోంది. తమిళ హీరో సూర్య కూడా ఆ మాటే అన్నారు. ‘‘ఎప్పుడెప్పుడా అని ‘బాహుబలి’ కోసం తమిళనాడు మొత్తం వేయికళ్ళతో నిరీక్షిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు చిత్రాలతో పేరు తెచ్చుకున్న ప్రముఖ తమిళ హీరోయిన్ త్రిష అయితే ‘‘రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి’ చూడాలని ఉంది. అదీ తమిళ డబ్బింగ్ కాకుండా, తెలుగు ఒరిజినల్ చూడాలని ఉంది. అలాంటి సినిమాలు మన భారతీయ సినిమా జెండాను ప్రపంచమంతటా ఎగరేస్తాయి’’ అన్నారు. ♦ ఆ దేశాల్లో... అక్కడి భాషల్లో... భారతీయ భాషలతో పాటు చైనీస్‌లోనూ, యూరోపియన్ భాషల్లోనూ ‘బాహుబలి’ని ఇంగ్లీషు సబ్‌టైటిల్స్‌తో విడుదల చేయాలనుకుంటున్నారు. ఏషియన్ సినిమా మార్కెట్లైన జపాన్, సౌత్ కొరియాలకు కూడా ఈ సినిమా వెళ్ళనుంది. ఇప్పటికే, చైనాలో అధికారిక ‘చైనీస్ ఫిల్మ్ కార్పొరేషన్’తో ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే, చైనాలో ఏడాదికి ఒక నిర్ణీత సంఖ్యలోనే విదేశీ సినిమాల రిలీజ్‌కు అనుమతిస్తారు. గతంలో ‘ధూమ్3’ లాంటి చిత్రాలు అక్కడ ఆలస్యంగా రిలీజైంది అందుకే. ఇప్పుడు మన ‘బాహుబలి’ కూడా కాస్తంత ఆలస్యంగా ఈ ఏడాది చివరలోనో, వచ్చే ఏడాది మొదట్లోనే చైనీయుల్ని అక్కడి భాషలో పలకరిస్తుంది. ♦ ఇంగ్లీష్ వెర్షన్ వేరా? ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ తుది నిడివి దాదాపు 2 గంటల 20 నిమిషాల దాకా ఉంటుందట! అంతర్జాతీయంగా విడుదల చేసే ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం మన ఇండియన్ వెర్షన్ కన్నా కాస్తంత నిడివి తక్కువుంటుందట! అంతే కాదు... మన వెర్షన్ కన్నా కొద్దిగా వేరుగా కూడా ఉంటుందని కృష్ణానగర్ సమాచారం. పాటలు తగ్గించడమే కాకుండా, వయెలెన్స్, గ్లామర్ అంశాలను అక్కడ కొంత ఎక్కువగా చూపిస్తారని తెలుస్తోంది. ‘బాహుబలి’ రెండో పార్ట్ విషయానికొస్తే, ఇంకా 40 శాతం దాకా షూటింగ్ చేయాల్సి ఉంది. ఫస్ట్ పార్ట్ రిలీజయ్యాక, ఆ షూటింగ్ పనీ పూర్తి చేసి, 2016లో రిలీజ్ చేయాలని ప్లాన్. ఫస్ట్ పార్ట్‌కూ, రెండో పార్ట్‌కూ మధ్యలో ‘బాహుబలి కామిక్ సిరీస్’, పిల్లల బొమ్మలు, వీడియో గేమ్‌ల లాంటివి విడుదల చేస్తారు. అలా ‘బాహుబలి’ని ఒక బ్రాండ్‌గా మర్చంటైజ్ చేయాలన్నది రాజమౌళి బృందం ఆలోచన. ♦ ‘బాహుబలి’ ఇప్పుడేం చేస్తున్నాడు? ‘బాహుబలి’ సినిమా ఎడిటింగ్, రీ-రికార్డింగ్ వగైరా పనులన్నీ ఇప్పటికే అయిపోయాయని భోగట్టా. కేవలం గ్రాఫిక్స్ వర్కే జరుగుతోందట! అయిదు దేశాల్లో (ఇండియా, సౌత్ కొరియా, హాంగ్‌కాంగ్, అమెరికా, రష్యా) 600 మంది నిపుణులు ఆ పని చేస్తున్నారు. ‘అవతార్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాంటి చిత్రాలకు పనిచేసిన అమెరికాలోని ‘టావ్ ఫిల్మ్స్’ నిపుణులు కూడా అందులో ఉన్నారు. ఆ గ్రాఫిక్స్ వర్క్ కూడా దాదాపు అయిపోవచ్చింది. కాకపోతే, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, ఆఖరు క్షణం దాకా మార్పులు చేర్పులతో మన జక్కన్న అపూర్వ సెల్యులాయిడ్ శిల్పాన్ని చెక్కుతూనే ఉన్నారు. తెలుగు, తమిళ ఆడియో రిలీజ్ కాగానే, హిందీలో ఆడియో రిలీజ్... ఆ వెంటనే ప్రమోషన్... పబ్లిసిటీ... మీడియాలో ఇంటర్వ్యూలు... అలా అలా ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ను ఇంకా ఇంకా పెంచేసి, జూలై 10న తెరపై బొమ్మ పడుతుంది. రాజమౌళికి అచ్చొచ్చిన నెల జూలై. ‘సింహాద్రి’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ లాంటి బ్లాక్బస్టర్లన్నీ వచ్చింది జూలైలోనే! ఈసారి కూడా ఆ జూలై కలిసొచ్చేలా ఉంది. తెలుగు సినిమా పేరు అంతర్జాతీయంగా మారుమోగేలా ఉంది. ♦ ఇది మన హాలీవుడ్ సినిమా! ఒక్క ముక్కలో చెప్పాలంటే, దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రాజమౌళి భారీ కలల్ని తెరపైకి తర్జుమా చేసే ప్రయత్నం - ‘బాహుబలి’. ఇందులో లైవ్ యాక్షన్ షూటింగ్ కొంతే. కానీ, దానికి పోస్ట్ ప్రొడక్షన్లో విజువల్ ఎఫెక్ట్స్ జత కలిశాక - బ్రహ్మాండం. దాదాపు మూడు మైళ్ళకు పైగా ఎత్తున్న జలపాతం, భారీ యుద్ధక్షేత్ర దృశ్యాలు, లక్షలాది సైన్యం, వందలాది ఏనుగులు, గుర్రాలు, రథాలు - అన్నీ విజువల్ వండర్లే. అన్నీ జూలై 10న తెరపై ప్రత్యక్షమవుతాయి. భారీ యుద్ధాల నేపథ్యంలో హాలీవుడ్లో వచ్చిన ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘ట్రాయ్’ లాంటి ఆస్కార్ అవార్డ్ చిత్రాలు, ‘300’ లాంటి పాపులర్ సినిమాలూ మన కళ్ళ ముందు కదలాడతాయి. అందుకే, ‘బాహుబలి’ కేవలం తెలుగు సినిమా కాదు... ఇది తెలుగు వాళ్ళ ‘హాలీవుడ్ సినిమా’. ఆల్ ది బెస్ట్... జక్కన్న టీమ్! - రెంటాల జయదేవ -
సమ్మరమే
సినిమాకి హీరో దేవుడంతటివాడు... కాదు... దేవుడే! హీరోని ఏ వరం అడిగినా ‘ఓకే టేకిట్’ అంటాడు బోళాశంకరుడిలా! అందుకే అతగాడు హీరో. ఈ ఎండాకాలంలో హీరోని ఇండస్ట్రీ ఏమి అడుగుతుంది? చల్లని హిట్ ఇవ్వు స్వామీ అని వేడుకుంటుంది. ఇస్తారా? ఇవ్వకపోతే సమ్మర్లో మాడి మసైపోతుంది ఇండస్ట్రీ. దట్ ఈజ్ ద ప్రాబ్లమ్ అవర్ హీరో ఈజ్ ఫేసింగ్! ఈ సమ్మర్లో హీరోగారు సప్తసముద్రాలు దాటి విలన్ని పంచ్‌లు కొట్టి, హీరోయిన్ మీద పంచ్‌లు విసిరి, సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ టైమ్‌ని పటాపంచ్‌లు చేసి హిట్ కొడతాడా? అన్నదే క్లైమాక్స్ సీన్. 150 కోట్ల లాసులు... 500 కోట్ల స్టేకులు... 8 వీక్స్ టైము... దేఏఏఏవుడా! ఇరవై సినిమాలు... 500 కోట్లు... కేవలం అరవై రోజులు!! మే నెల సెకండాఫ్ నుంచి జూలై ఫస్టాఫ్ దాకా రెండు నెలల కాలంలో వచ్చే సినిమాల రిజల్ట్‌తో ఇండస్ట్రీ భవిష్యత్తు ముడిపడి ఉంది. బాలకృష్ణ ‘లయన్’ మొదలు గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ దాకా పదుల కోట్ల పెట్టుబడితో, ప్రతిష్ఠాత్మకంగా తయారైన అనేక భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. మీడియమ్ రేంజ్ సినిమాలు సహా 20 కొత్త చిత్రాలు పలకరించనున్నాయి. ఒక్కముక్కలో పణంగా ఒడ్డుతున్న 500 కోట్ల సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ వసూళ్ళ వర్షం కోసం ఎదురుచూస్తోంది. సక్సెస్ దాహార్తిలో సినిమా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తెలుగులో ‘యూనివర్సల్ హిట్స్’ ఎన్ని అంటే, వెతుక్కోవాల్సి వస్తోంది. నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక రంగాలు మూడింటికీ తృప్తినిచ్చిన సినిమాగా కల్యాణరామ్ ‘పటాస్’ రీజనబుల్‌గా పే చేసింది. డబ్బింగ్‌ల సంగతికొస్తే - కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టిన ధనుష్ ‘రఘువరన్ బి.టెక్’, ఇటీవలి లారెన్స్ ‘గంగ’ డబ్బులు తెచ్చాయని ఇండస్ట్రీ వర్గాల మాట. ‘‘గత డిసెంబర్లో వచ్చిన రజనీకాంత్ ‘లింగ’ నుంచి వరుస ఫ్లాపులే. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అతను డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన ఫైనాన్షియర్ - ఇలా అందరూ పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక కష్టాల్లో ఉన్నారు. ఒక్క మాటలో తెలుగు సినిమా ‘ఫైనాన్షియల్ స్లంప్’లో ఉంది. ఇండస్ట్రీకిప్పుడు మంచి హిట్ రూపంలో టానిక్ కావా’’లని ‘లయన్’ నిర్మాత రుద్రపాటి రమణారావు వ్యాఖ్యానించారు. ఫస్టాఫ్‌లో... గత ఏడాదే బెటర్! లాస్ట్ ఇయర్ ఫస్ట్‌హాఫ్ ఇంత దారుణంగా లేదు. మహేశ్‌బాబు ‘1’ లాంటివి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ‘లెజెండ్’, ‘రేసుగుర్రం’ లాంటి బాక్సాఫీస్ హిట్లతో ఇండస్ట్రీ కళకళలాడింది. ‘‘ఫ్లాపులొచ్చినా, కొన్ని సూపర్హిట్లు, కొన్ని సక్సెస్‌లతో గత ఏడాదే బ్యాలెన్స్ అయింది. ఈ ఏడాది ఇప్పటి దాకా రూ. 125 కోట్ల పైగా నష్టపోయాం. పరిశ్రమ బ్యాడ్షేప్లో ఉంది’’ అని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే, టాలీవుడ్‌కి ఇది చాలా క్లిష్టమైన కాలం. రానున్న రెండు నెలల్లో సగటున ప్రతి పది రోజులకూ ఒక భారీ చిత్రం రానుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న డిఫరెంట్ జానర్ చిత్రాలైన గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రాజమౌళి ‘బాహుబలి’ మీద ఇప్పుడు అందరి కళ్ళూ ఉన్నాయి. అందరి కళ్ళూ అటువైపే! ఏళ్ళ తరబడి నిర్మాణంలో ఉండి, ఇంకా రిలీజ్‌కు రెడీ కాకపోవడంతో, ఈ చిత్రాల నిర్మాణ వ్యయం, వ్యాపారం వగైరా గురించి ఎవరూ కచ్చితమైన గణాంకాలు చెప్పలేకపోతున్నారు. అయితే, సినీవ్యాపార వర్గాల అంచనా ప్రకారం కేవలం ఈ రెండు సినిమాల మీదే దాదాపు రూ. 200 నుంచి 260 కోట్ల పైచిలుకు సొమ్మును పణంగా ఒడ్డుతున్నారు. ‘‘ఒక సగటు భారీ తెలుగు సినిమాకయ్యే ఖర్చు కన్నా రెట్టింపు వ్యయంతో ‘బాహుబలి’ తయారవుతోంది. ఒక్క తెలుగు వెర్షన్ మీదే వంద కోట్ల పైగా స్టేక్ ఉంటుంది’’ అని సినీ వ్యాపారంలో మూడు దశాబ్దాల పైచిలుకు అనుభవజ్ఞుడు ఒకరు వివరించారు. అలాగే, కాకతీయ వీరనారి రుద్రమదేవి చారిత్రక గాథ ఆధారంగా గుణశేఖర్ తీస్తున్న తొలి తెలుగు స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’ కూడా 60 కోట్ల పైచిలుకు పెద్ద పందెం. ఇక, మహేశ్‌బాబు, రవితేజ, రామ్, కల్యాణరామ్ లాంటి పేరున్న హీరోలు, పూరీ జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు కూడా ఈ అరవై రోజుల సినీ మారథాన్‌లో కీ-ప్లేయర్స్. అందుకే, ఏలూరుకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్. అన్నట్లు, ‘‘ఈ రెండు నెలల్లో రానున్న భారీ బడ్జెట్ చిత్రాలు అటు ప్రేక్షకులకూ, ఇటు పరిశ్రమకూ కొత్త ఎనర్జీని ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే పరిశ్రమ మళ్ళీ కళకళలాడుతుంది.’’ అది ‘లయన్’తో మొదలవుతుందనీ, వరుస హిట్లతో ఈ రెండు నెలల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుందనీ పరిశ్రమ వర్గీయుల ఆశ. స్పెక్యులేటివ్ బిజినెస్ అయిన సినిమా పయనించేది ఎప్పుడూ ఇలాంటి ఆశల గుర్రం మీదే కదా! - రెంటాల జయదేవ హై స్టేక్స్ బాక్సాఫీస్ జూదం పెట్టినఖర్చు, చేస్తున్న వ్యాపారం, ప్రింట్స్, పబ్లిసిటీ కలుపుకొని, పరిశ్రమ భారీగా పణం ఒడ్డుతున్న చిత్రాల్లో కొన్ని... బాహుబలి: *150 - 200 కోట్లు (అన్ని భాషల్లో కలిపి) (జూలై 10న) రుద్రమదేవి: *60 కోట్లు (జూన్) మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’: 60 కోట్లు (జూలై 17 రిలీజ్) లయన్: *35 కోట్లు (మే 14) రవితేజ ‘కిక్2’: *45 కోట్లు (జూన్) రామ్ ‘పండగ చేస్కో’: 22-25 కోట్లు (మే 29) కల్యాణ్‌రాం ‘షేర్’: *20 కోట్లు (జూన్) చార్మి ‘జ్యోతిలక్ష్మీ’: *12 కోట్లు (జూన్) సందీప్ కిషన్ ‘టైగర్’: *7.5 కోట్లు (మే 22) అల్లరి నరేశ్ ‘జేమ్స్‌బాండ్’: *8-10 కోట్లు (జూన్) మోసగాళ్ళకు మోసగాడు: *6-7 కోట్లు (మే 22) సూర్య ‘రాక్షసుడు’: *14 కోట్లు (మే చివర) నాగశౌర్య ‘జాదూగాడు’: *4 కోట్లు (జూన్) ఈ అంకెలన్నీ సినీ వ్యాపార వర్గాల భోగట్టా సెలవుల సీజన్ వేస్ట్ చేశారు! ‘‘ఇవాళ నిర్మాతలు సరైన ప్లానింగ్ లేక, ఈ వేసవి సెలవుల సీజన్‌ను చాలా వృథా చేశారు. తీరా వేసవి సెలవులైపోతుండగా, ఇప్పుడు పెద్ద సినిమాల సీజన్ మొదలవుతోంది. ఈ సినిమాల విజయం మీదే కొన్ని వందల కోట్ల డబ్బు ఆధారపడి ఉంది.’’ - సత్య రంగయ్య, ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ఎవరి దగ్గరా డబ్బులు లేవు! ‘‘ఈ ఏడాది ఇప్పటి దాకా డిజప్పాయింట్మెంటే! ఓవర్ బడ్జెట్ వల్లే ఫ్లాపవుతు న్నాయి. ఎగ్జిబిటర్స్ డబ్బుల్లేక, ఫుల్ పేమెంట్ చేయడం లేదు. దాని మీద ఆధారపడ్డ డిస్ట్రిబ్యూటర్ డబ్బు కట్టడం లేదు. దాంతో ప్రతి రిలీజ్‌కూ కష్టమే.’’ - తేజ, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, దర్శక, నిర్మాత -
ఆయన్ని మిస్సవుతున్నా
త్రిష ఎవరితోనూ మాట్లాడదు... మాట్లాడితే... తన గురించి ఎక్కువగా మాట్లాడతారని భయం కావచ్చు! ఆల్మోస్ట్ పదమూడేళ్ల పాటు డబ్బింగ్ చెప్పకుండానే మాట్లాడింది మరి! చిరంజీవి నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో మాట్లాడించేసింది. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!! షూటింగ్లో... ఎవరైనా అనవసరంగా మాట్లాడిస్తారేమోనని, తప్పించుకోవడానికి అనుకుంటా...సెల్ఫోన్లో తలదూర్చి, తన ప్రపంచాన్ని తాను ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. మరి, అంతటి ‘మూకీ’ దేవత ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడిందో! మరి అదే... మీ ‘సాక్షి’! రామ్,ఎడిటర్, ఫీచర్స్ పదమూడేళ్ళుగా చూస్తున్నాం. చిరు నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో నటించిన హీరోయిన్లలో మీరే ఆఖరేమో! (నవ్వేస్తూ...) నేను సినీరంగానికి వచ్చినప్పుడు సిమ్రాన్, జ్యోతిక, నేను - ఇలా ముగ్గురు, నలుగురమే ఉండేవాళ్ళం. ఇప్పుడు అందం, అభినయమున్న 10 - 15 మంది హీరోయిన్లున్నారు. దీనివల్ల పోటీ పెరిగి, హీరోయిన్ల యావరేజ్ కెరీర్ లైఫ్ శ్పాన్ చాలా తగ్గింది. అయినా ఇన్నేళ్ళు హీరోయిన్గా నిలవడం విశేషమే. అయామ్ బ్లెస్డ్. షార్ట్ శ్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇంత స్టార్సతో నటించడం, పేరు తెచ్చుకోవడం హ్యాపీ. ఈ స్థాయికి రావడంలో మీ కష్టమెంత? అదృష్టమెంత? నన్నడిగితే సరైన స్క్రిప్ట్‌నూ, సరైన దర్శకుణ్ణీ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. భారీ, మాస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు - ఇలా అన్నీ ప్యాకేజ్‌గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. దానికి లక్ తోడవ్వాలి. లేదంటే, (చేతులతో పై నుంచి కిందకు చూపిస్తూ... చటుక్కున తమిళంలోకి మారి..) ‘అంగ వెచ్చిట్ట రసికర్గళ్ ఇంగ తూక్కి పోడువాంగ’ (ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులే, పాతాళానికీ పడదోస్తారు). ఈ బ్యాలెన్సింగ్‌లో మీ అమ్మగారి పాత్ర ఉందట! ‘నా చుమ్మా సెట్స్‌కు వందు వేల పణ్ణిట్టి పోవేన్. బిహైండ్ ది సెట్స్ నరయ వేల ఇరుక్కు’ (నేరుగా సెట్స్‌కు వచ్చి, నటించి వెళ్ళిపోతుంటా. కానీ, తెర వెనుక చాలా శ్రమ ఉంటుంది). ఆ శ్రమ అంతా మా అమ్మదే! ఇప్పటికీ నాకు మోటివేషన్ - మా అమ్మే! అన్నీ నిశ్శబ్దంగా హ్యాండిల్ చేసే మా అమ్మ ‘సెలైంట్ మేనేజర్’. మేనేజరున్నా స్క్రిప్టు ఏమిటి, ఏ సినిమా చేయాలి - అన్నీ నేను, అమ్మే కలసి చర్చించుకుంటాం. సినిమా చేయాలా, వద్దా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే! అమ్మగారి సపోర్ట్ తెలిసిందే... మరి నాన్న? అమ్మ దగ్గర కన్నా చనిపోయిన నాన్న దగ్గరే నాకు గారాబం ఎక్కువ. ఆయావ్ు అప్పాస్ గర్ల! న్యూయార్క్‌లో చత్వాల్ గ్రూపులో 13 ఏళ్ళ పాటు ఆయన పనిచేశారు. ఆ తరువాత ‘తాజ్’ గ్రూపులో చెన్నై, హైదరాబాద్‌లలో పనిచేశారు. (కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా...) ఆయన్ని మిస్సవుతున్నా. బాధపెట్టినట్లున్నా! మళ్ళీ సినిమాల కొద్దాం. ‘లయన్’లో బాలకృష్ణతో తొలిసారి నటిస్తున్నట్లున్నారు! రెండేళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న నా తెలుగు సినిమా - ‘లయన్’. థ్రిల్లర్, యాక్షన్ ఫిల్మ్ ఇది. కానీ, సన్నివేశాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. నిజానికి, ‘అతడు’ తర్వాత ‘బాలా’ (బాలకృష్ణ)తో ఒక సినిమాకు అడిగారు. అలాగే, లాస్ట్ ఇయర్ ‘లెజెండ్’లో కూడా చేయాల్సింది. ఇన్నాళ్ళకు ఆయనతో యాక్ట్ చేయడం కుదిరింది. ఆయన చాలా కూల్. నాలెడ్జబుల్ మ్యాన్. వంద సినిమాలకు దగ్గరవుతున్నా, అంత హుషారుగా పనిచేసే వ్యక్తిని మరొకరిని చూడలేదు. పెద్ద స్టార్స్‌తో చేశారు. వాళ్ళతో మీ నటనానుభవం? ఆ స్థాయికెళ్ళాక, మనకూ కొంత అహం ఉంటుంది. కానీ, కమల్, చిరంజీవి, నాగ్, వెంకీ, బాలా లాంటి వారంతా అహం లేకుండా పనిచేస్తారు. అది నేర్చుకోవాలి. కెరీర్లో చాలా అప్స్ అండ్ డౌన్స చూసినట్లున్నారు? ఈ 13 ఏళ్ళ కెరీర్లో ప్రతి మూడేళ్ళకూ కెరీర్లో నాకు ‘లల్’ వచ్చింది. అప్పుడు ఏదో ఒకటి ఒప్పుకోవడం కాకుండా, ఇంట్లోనే ఖాళీగా కూర్చొనేదాన్ని. మొదటిసారి ‘మంగాత్తా’, రెండోసారి ‘విన్నైతాండి వరువాయా’ వచ్చి హిట్టయ్యాయి. ఇలా కెరీర్ డల్లయినప్పుడల్లా ఏదో ఒక సినిమాతో పైకి లేచా. మరి, చటుక్కున కన్నడ ‘పవర్’ (‘దూకుడు’ రీమేక్) చేశారేం! బాలీవుడ్లో ఒక సినిమా చేసినట్లే, కన్నడంలో ఉత్తినే... ఛేంజ్ కోసం అలా చేశా. అదేదో అన్ని ఇండస్ట్రీల్లో ైపైకి ఎదిగిపోవాలని కాదు. ఆ సినిమా అక్కడ బాగా ఆడింది. ఫర్ మి - కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం - ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్! మీ గురు ప్రియదర్శన్ మలయాళంలో చేయమనడగలేదా? ఆయన హిందీకి వెళ్ళి, అక్కడే ఎక్కువ చేస్తున్నారుగా! నా ఏకైక హిందీ ఫిల్మ్ ‘ఖట్టా మీఠా’ ఆయన తీసినదే! మలయాళంలో మొదట్లో కొన్ని ఛాన్స్‌లొచ్చాయి. చేయలేకపోయా. అయినా నా ప్లాన్ టూ వీక్స్ వరకే! అంతకు మించి కెరీర్లోనే కాదు... జీవితంలో కూడా ఏదీ ముందుగా ప్లాన్ చేయను. హిందీలో ఒక సినిమా చేసినా, నిలబడాలని చూడలేదేం? హిందీలో పనిచేయాలంటే, ముంబయ్‌లో ఉండాలి. కానీ, పుట్టి పెరిగిన చెన్నైలో ఉండడమే నాకు ఇష్టం. పైగా, నార్త్‌తో పోలిస్తే, సౌత్‌లో పనిచేయడమే నాకు కంఫర్ట్ కూడా! నార్తలో పనిచేయాలంటే, పబ్లిక్ రిలేషన్స్ కావాలి. పర్సనల్ లైఫ్ వదిలి, అక్కడకు మారాలి. దాని కన్నా ఇక్కడుంటే సుఖం. ఇంకా మీకు తెలుగుపై పట్టు దొరికినట్లులేదు! తెలుగు బాగా అర్థమవుతుంది కానీ, చదవలేను. రాయలేను. డైలాగులు చెప్పగలను కానీ, ఫ్లూయెంట్‌గా మాట్లాడలేను. కానీ, ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ తెలుగు మాట్లాడేస్తుంటే, అయామ్ జెలస్! నాకు భాషలంత తొందరగా పట్టుబడవు. అడపా దడపా తమిళంలో డబ్బింగ్ చెబుతున్నట్లున్నారు! ఇన్నేళ్ళ తర్వాత ఈ మధ్యే కొన్ని సినిమాలకు! మణిరత్నం దర్శకత్వంలోని ‘ఆయుధ ఎళుత్తు’ (తెలుగులో ‘యువ’), కమలహాసన్ నటించిన ‘మన్మదన్ అంబు’ (తెలుగులో ‘మన్మథ బాణం’) - రెండూ లైవ్ సౌండ్‌లో తీసినవే. దాంతో, సెట్స్‌పై తమిళంలో నా డైలాగులు నేనే చెప్పా. ఆ తరువాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కమల్ డైలాగులు ఎలా పలకాలో పక్క నుండి ఆరు రోజుల పాటు నేర్పారు. మీరెప్పుడూ మొబైల్ఫోన్తోనే కనిపిస్తుంటారు! (నవ్వేస్తూ...) బాగా గమనించారే! ప్రకాశ్‌రాజ్, వెంకటేశ్ లాంటి కో ఆర్టిస్టులు కూడా నా మొబైల్ వాడకం చూసి ఆటపట్టిస్తుంటారు. నిజం చెప్పాలంటే, మొబైల్ ఫోన్ నాకొక ఎడిక్షన్. అయితే, ఫోన్లో నేనెక్కువ మాట్లాడను. మెసేజ్ చేయడానికీ, ఆటలాడడానికీ, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికీ ఫోన్ వాడతా. కొత్త యాప్స్, గ్యాడ్జెట్లపై నాకు ఇంట్రస్టెక్కువ. మీరు బాగా ఫుడీ అట! మరి, నాజూగ్గా ఉన్నారు? ఆ విషయంలో అయామ్ రియల్లీ లక్కీ! కనపడిందల్లా తినేస్తాను. నేను తినే తిండి చూసి, ‘బకాసురుడిలా తింటావు. తిన్నదంతా ఎటు పోతోంది’ అంటూ దర్శకుడు ప్రభుదేవా ఆటపట్టిస్తుంటారు. సర్ప్రైజింగ్లీ... నేను జిమ్‌లకు వెళ్ళను. పెద్ద వ్యాయామాలు చేయను. సూర్య నమస్కారాలు, పవర్ యోగా చేస్తా. నేనెంత బద్ధకస్థురాలినంటే, చీకాకనిపిస్తే కొన్నాళ్ళు వర్కౌట్స్ కూడా చేయను. మీ నిశ్చితార్థంపై చాలా వార్తలొస్తున్నాయి. పెళ్ళెప్పుడు? లెటజ్ నాట్ టాక్ ఎబౌట్ మై పర్సనల్ మేటర్స. పర్స నల్ లైఫ్ ఈజ్ మై సీక్రెట్. దాని గురించి ఇతరులు మాట్లాడుకోవడం ఇష్టముండదు. అందుకే మాట్లాడను. మరో అయిదేళ్ళ తరువాత త్రిష ఏం చేస్తుంటారు? (నవ్వుతూ) అయిదు రోజుల తర్వాతేం చేస్తానో తెలీదు. ఇందాకే చెప్పినట్లు ఏదీ ప్లాన్ చేయను. నా నేచర్ అది. - రెంటాల జయదేవ నచ్చిన దర్శకుల్లో కొందరి గురించి... ప్రభుదేవా: సెట్లో కొంత ఛాలెంజ్ ఇస్తారు. సెల్వరాఘవన్: పర్ఫెక్షన్ కోసం తపించే దర్శకుడు. అంతా సరిగ్గా ఉన్నా... పెదాలు మూసుకోవడంలో చిన్న తేడా ఉందనకున్నా మళ్ళీ కొత్తగా షూట్ చేస్తారు. గౌతమ్ మీనన్: మన స్టైల్లోనే మన నుంచి ది బెస్ట్ తీసుకుంటారు. మనలోని ప్రతిభను ఆయన బయటకు తీస్తారు. మణిరత్నం: ఆయనతో పని చేయడం నా కల. అది నిజమైంది. అనుకున్నది మన నుంచి రాబట్టే వరకు రాజీపడని తత్త్వం ఆయనది. ఆయనతో పని చేయాలంటే, అంతకు ముందు దాకా నేర్చుకున్నదంతా వదులుకోవాలి. ప్రియదర్శన్: సినిమాల్లోకి వచ్చేందుకు నాకు తొలి అవకాశమిచ్చిన గురువు. ప్రతి ఒక్కరినీ ఒకేలా చూస్తారు. ఎంతో సాధించినా, కించిత్తు కూడా గర్వం చూపరు. త్రివిక్రమ్: ఆయన చాలా కూల్. ఆయనతో పనిచేయడంలో ఫన్ ఉంది. కబుర్లాడుతూ, నవ్వుతూ పనిచేయించుకోవడం ఆయనకు అలవాటు. ‘అతడు’ నా బెస్ట్ ఎంటర్టైనర్సలో ఒకటి. శ్రీను వైట్ల: వినోదం బాగా పండిస్తారు. వి.వి. వినాయక్: ఆయన, రవితేజ, నేను గనక ఒక చోట ఉంటే, ఇక వినోదానికి కొదవ ఉండదు. బ్యాంకాక్‌లో షూటింగ్ సైతం, పిక్నిక్లా గడిచిపోయేది. కె. రాఘవేంద్రరావు: ఆయనను ఒక మంచి మిత్రుడిలా చూస్తాను. శరీరానికే తప్ప మనసుకు వయసు రాదని నిరూపించిన మనిషి. స్టార్ కామెంట్ త్రిష అద్భుతమైన నటి. తమిళంలో తన రెండో చిత్రం ‘మౌనమ్ పేసియదే’లో, ఆ తర్వాతా ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. త్రిష హావభావాలు సహజంగా ఉంటాయి. నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటే దర్శక, నిర్మాతలకు త్రిష గుర్తొస్తుంది. - హీరో సూర్య ఇటీవల ఆకట్టుకున్న తోటి నటి? శ్రీయ నుంచి అనూష్క దాకా చాలా మందితో కలసి పనిచేశా. అనూష్క లాంటి మంచి అమ్మాయిని చూడలేదు. ఆమె ఎంత ఫ్రెండ్లీయో చెప్పలేను. ‘అరుంధతి’, రానున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో ఆమె గెటప్‌లు, ఆ రాజసం అద్భుతం. అనూష్కలాగా ఇంకెవరూ చేయలేరు! ఒత్తిడిగా ఉంటే... బ్రేక్ కోసం? ఓ నెలరోజుల పాటు ఊళ్ళు తిరిగొస్తా! పరిశ్రమలో మీ స్నేహితులు? ఇక్కడ అంత ఆప్త మిత్రులు లేరు. నా ఫ్రెండ్సంతా స్కూల్, కాలేజ్మేట్లే. జీవన సిద్ధాంతం? ‘హాయిగా బతుకు... ఇతరులను బతకనివ్వు’! -
సినిమా రివ్యూ - దోచేయ్
ప్రేక్షకుల్ని ‘దోచేయ్’! ....................................... చిత్రం - దోచేయ్, తారాగణం - నాగచైతన్య, కృతీ సనన్, పోసాని కృష్ణమురళి, రవిబాబు, బ్రహ్మానందం, రావు రమేశ్, ‘ప్రభాస్’ శీను, పాటలు - కృష్ణచైతన్య, శ్రీమణి, కృష్ణకాంత్, సంగీతం - సన్నీ ఎం.ఆర్,ఆర్ట్ - నారాయణరెడ్డి, కెమేరా - రిచర్డ్ ప్రసాద్,ఫైట్స్ - పీటర్ హెయిన్, విజయ్, కెచా ఖంఫకడీ, కూర్పు - కార్తీక శ్రీనివాస్,నిర్మాత - బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ, కథనం, దర్శకత్వం - సుధీర్ వర్మ .................................... దొంగతనం, దోపిడీలు, తెలివితేటలతో సాగే మైండ్ గేమ్ - లాంటివి ఎప్పుడూ బాగుంటాయి. వాటిని సరిగ్గా తెరపై చూపెడితే, బాక్సాఫీస్ హిట్లు వచ్చి పడతాయి. కానీ, వాడిన ఫార్ములానే వాడడం, అదీ కథ లేకుండా కథనంతోనే మెప్పించాలనుకోవడం, చివరకు ఆ కథనం కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడం లాంటి బలహీనతలు ఎక్కువైతే కష్టమే. హీరో మోసగాడు... దొంగతనాలు చేసేవాడు అనే క్యారెక్టరైజేషన్‌తో గతంలో ‘స్వామి రారా’ సినిమా తీసిన యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈసారి అక్కినేని నాగచైతన్యతో చేసిన ప్రయోగం - ‘దోచేయ్’. కథ ఏమిటంటే... చందు (నాగచైతన్య) ఒక చిన్న సైజు మోసగాడు. తన స్నేహితుల బృందంతో కలసి, మోసాలు, దొంగతనాలు చేస్తూ, చెల్లెలు లలితను డాక్టర్ చదువు చదివిస్తుంటాడు. అతని తండ్రి (రావు రమేశ్) జైలులో ఉంటాడు. చెల్లెలి మెడికల్ కాలేజీలోనే చదువుతున్న మీరా (కృతీ సనన్)తో హీరోకు పరిచయమవుతుంది. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఇంతలో గుండె నొప్పి తండ్రికి ఆపరేషన్ చేయించడానికి కావాల్సిన డబ్బు కోసం, దాన్ని హోమ్ మినిస్టర్ పి.ఏ (జీవా)కు అందజేయడం కోసం హీరో తంటాలు పడతాడు. అదే సమయానికి చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టి మర్డర్లు, దోపిడీల దాకా ఎదిగిన మాణిక్యం (పోసాని కృష్ణమురళి) ముఠాలోని వ్యక్తుల డబ్బు హీరో చేతిలో పడుతుంది. ఒకపక్క తండ్రిని కాపాడుకొనే ప్రయత్నం, మరో పక్క మాణిక్యం ముఠా వెంటాడడం, ఇంకోపక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ (‘అల్లరి’ రవిబాబు) ఇన్వెస్టిగేషన్ల మధ్య సినిమా సా...గుతుంది. ఈ క్రమంలో హీరోకూ, విలన్‌కూ మధ్య ఉన్న ఒక బంధం బయటపడుతుంది. అది ఏమిటి? విలన్‌ను హీరో ఎలా డీల్ చేశాడు? చివరకు ఏమైందన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే... మోసాలు, ఎత్తులు పెయైత్తులతో ముందుకు నడిచే చందు పాత్రను తనదైన మార్గంలోకి మలుచుకొని, నటించాలని నాగచైతన్య శతవిధాల ప్రయత్నించారు. కాకపోతే, అనుకున్నట్లుగా అందులో సఫలం కాలేకపోయారు. మునుపు చేసిన అనేక సినిమాల్లో లాగానే కనిపిస్తారు. పాత్ర కన్నా నాగచైతన్యే తెర మీద తెలుస్తుంటారు. నవీన యుగపు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్ర - మీరా (కృతీ సనన్)ది. కాలేజ్ ఎగ్గొడుతూ, వారానికి రెండు మూడు సినిమాలు చూస్తూ, ‘లైట్స్’ బ్రాండ్ సిగరెట్లు తాగే తరహా పాత్ర ఆమెది. కాకపోతే, ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానంలో క్లారిటీ కనపడదు. హీరో తన వెంటపడుతున్నాడు, తన మీద అపారమైన ప్రేమ ఉందనే పాయింట్ తప్ప, హీరోను ఆమె ప్రేమించడానికి లాజిక్ వెతకడం వృథా శ్రమ. పొడుగ్గా, నాజూగ్గా ఉండే కృతీ సనన్ అందంగా ఉన్నా, హీరోకు తగ్గ జోడీయేనా అని అనుమానం కలుగుతుంది. ఈ చిత్రంలో ప్రధానమైన విలన్ పాత్ర మాణిక్యం. ఆ పాత్రను పోసాని కృష్ణమురళి పోషించారు. ఆయన తనకు అలవాటైన భంగిమలు, నటనతోనే మరోసారి కనిపించారు. ఒకటి, రెండు చోట్ల యథాశక్తి నవ్వించారు. కానీ, విలన్ పాత్ర కాస్తా వినోదతరహాగా మారిపోయింది. సినిమా సెకండాఫ్ చివరలో వచ్చే హీరో బుల్లెట్బాబుగా బ్రహ్మానందం కాసేపు వినోదం పండిస్తారు. కానీ, సినిమా యాక్టర్ల మీద, అక్కడి వాతావరణం మీద వేసిన కొన్ని జోకులు సినిమా వాళ్ళు తమను తామే మరీ తక్కువ చేసుకొనేలా ఉన్నాయనిపిస్తుంది. సాంకేతిక విభాగాల సంగతేంటంటే... ఈ సినిమాకు ప్రధానమైన బలహీనతల్లో సంగీతం, పాటలు ముందు వరుసలో నిలుస్తాయి. ఒక్క పాటైనా గుర్తుండేలా కానీ, గుర్తుపెట్టుకొనేలా కానీ లేదు. కొన్నిచోట్ల సన్నివేశంలో లేని గాఢతను నేపథ్య సంగీతంలో అందించాలని అతిగా ప్రయత్నించారు. అది అతకలేదనే చెప్పాలి. రాసుకున్న కథలో, తీసుకున్న సన్నివేశాల్లోనే కథను ఆసక్తిగా నడపని, అనవసరపు అంశాలు చాలా ఉన్నాయి. దర్శక - రచయిత తీసుకున్న ఆ నిర్ణయానికి కేవలం ఎడిటర్‌నే తప్పుబట్టి ఉపయోగం లేదు. సినిమా తీశాకే కాదు... తీయక ముందు రచన దశలోనూ ఎడిటింగ్ కత్తెర పదునుగా ఉండాల్సింది. ఉన్నంతలో కెమేరా, యాక్షన్ ఎపిసోడ్లు ఫరవాలేదనిపిస్తాయి. కాకపోతే, చివరి ఛేజ్ దగ్గరకు వచ్చే సరికి అది వీడియో గేమ్ తరహాలో మిగిలింది. ఆశించిన ఉద్విగ్నతను కలిగించలేకపోయింది. వివిధ సందర్భాల్లో సినిమాలో తెరపై కనిపించే ‘శివ’ వాల్‌పోస్టర్, ‘క్షణ క్షణం’ సినిమా వీడియో, నేపథ్యంలో కొన్ని సినిమా పాటలు వగైరా అన్నీ దర్శకుడికి రామ్‌గోపాల్‌వర్మ మీద ఉన్న అభిమానాన్ని చెప్పకనే చెబుతుంటాయి. కథానాయకుడు దొంగ, దోచుకోవడమనే ఫార్ములాకు ఉన్న స్ఫూర్తి తెలుస్తుంటుంది. కానీ, దర్శకుడు సుధీర్ వర్మకు ఇది రెండో సినిమానే కావడంతో ఆ అనుభవ రాహిత్యం తెలిసిపోతుంటుంది. ముఖ్యంగా, బ్యాంక్ దోపిడీ లాంటి చోట్ల దొంగ - పోలీసుల విజువల్స్ లాంటివి భారీ చిత్రాలకు తగ్గట్లు అనిపించవు. ఎలా ఉందంటే... కొంత అస్తుబిస్తుగా ఉన్న నాగచైతన్య కెరీర్‌కు గత ఏడాది ‘మనం’ చిత్రం ఒక కొత్త ఊపునిచ్చింది. కానీ, ఆ తరువాత కూడా ఈ యువ హీరో కెరీర్ ఆశించినంత వేగంగా ముందుకు పోలేదు. ఈ పరిస్థితుల్లో సక్సెస్‌లో ఉన్న నవ యువ దర్శకుడు సుధీర్‌వర్మ కథతో ముందుకు రావాలనుకోవడం తెలివైన పని. అయితే, మునుపు ‘స్వామి రారా’ లాంటి ఫ్రెష్‌నెస్ ఉన్న హిట్ చిత్రంతో ఆకర్షించిన సుధీర్ వర్మ తొలిసారి అచ్చి వచ్చిన దొంగతనం, ఛేజ్‌ల ఫార్ములానే మళ్ళీ ఎంచుకున్నారు. కానీ, అతిగా, అనవసరంగా వాడితే పదునైన ఆయుధమైనా మొద్దుబారినట్లే, ఎంత హిట్ ఫార్ములాకైనా ఆ గతి తప్పదని ‘స్వామి రారా’ చూసి ఆనందించిన కళ్ళతో... ఈ ‘దోచేయ్’ సినిమా చూశాక అర్థమవుతుంది. హీరోకూ, విలన్‌కూ మధ్య పగ, ప్రతీకారాలు కానీ, తెలివితేటల యుద్ధం కానీ ప్రభావశీలంగా లేని సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే, బలహీనమైన విలన్ పాత్ర కామెడీగా మారింది. రెండు కోట్ల బ్యాంక్ దోపిడీ సీన్‌తో మొదలుపెట్టి, దాన్ని చాలాసేపటికి ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ముడిపెట్టడం, విలన్ వెతుకుతున్న వ్యక్తి తాలూకు చెల్లెలు హీరోయినే అన్నట్లు బిల్డప్ ఇవ్వడం లాంటి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌లు ఎఫెక్టివ్‌గా లేవు. పైగా, దర్శకుడి చేతిలో మోసపోయిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగి, ఎదురుతన్నే ప్రమాదం ఉంది. కాగా, హీరోయిన్ పట్ల తన ప్రేమను హీరో వ్యక్తం చేసే ఘట్టాలు రెండూ బాగున్నాయి. పగతో కన్నా హీరోయిన్ పట్ల ప్రేమతో కొడుతున్నానంటూ రౌడీలను హీరో చితగ్గొట్టడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే, పుట్టినరోజు నాడు అలిగిన హీరోయిన్ను బుజ్జగించడానికి వెళ్ళిన హీరో, ఆమెతో ప్లకార్డులతో తన భావాలు వ్యక్తీకరించే సీన్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుంది. సినిమాలో ఇలాంటి ఘట్టాలు కొన్ని అక్కడక్కడా మురిపిస్తాయి. దాదాపుగా సినిమా అంతా అయిపోయాక వచ్చిన పోసాని కృష్ణమురళి పాత్ర పోలీసు, కోర్టు సన్నివేశాల కామెడీ కూడా అలాంటిదే. కాకపోతే, అప్పటికే చాలా సినిమా చూసేసిన ఫీలింగ్‌తో ఉన్న ప్రేక్షకుడు కాసేపు నవ్వుకోవడానికే తప్ప, సినిమాను గుండెకు మనసారా హత్తుకోవడానికి అది ఉపయోగపడకపోవడం విషాదం. మొత్తం మీద, ఒక విషయాన్ని తొలిసారి చూసినప్పుడు కలిగే ఫీలింగ్ కొత్తగా ఉంటుంది. గొప్పగా ఉంటుంది. కానీ, అదే ఫార్ములాను అతుకుల బొంత కథతో, అర్థంపర్థం లేని మలుపులతో, సుదీర్ఘమైన అనాసక్తికరమైన కథనంతో ప్రయత్నిస్తే? అది మనసు దోచే ప్రయత్నంగా కాక, విలువైన డబ్బు, అంతకన్నా విలువైన కాలం దోచేసిన విఫల ప్రయోగంగా ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది! కావాలంటే, మూడు గంట, నూటయాభై రూపాయల కరెన్సీ వెచ్చించి, కొన్ని కొన్ని ఎపిసోడ్లుగా మాత్రం ఫరవాలేదనిపించే ‘దోచేయ్’ చూడండి! - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ - అనేకుడు
అనేక... కథల ఆసక్తికరమైన మేళవింపు చిత్రం - అనేకుడు, తారాగణం - ధనుష్, అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్, కార్తీక్, ఆశిష్ విద్యార్థి, కథ - స్క్రీన్‌ప్లే - కె.వి. ఆనంద్, శుభ, మాటలు - శశాంక్ వెన్నెలకంటి, పాటలు - సాహితి, వనమాలి, సంగీతం - హ్యారిస్ జైరాజ్, స్పెషల్ ఎఫెక్ట్స్ - వి. శ్రీనివాస మోహన్, ఛాయాగ్రహణం - ఓం ప్రకాష్, కూర్పు - ఆంటోనీ, నిర్మాతలు - కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్, దర్శకత్వం - కె.వి. ఆనంద్ జన్మజన్మల బంధం, పూర్వజన్మ జ్ఞాపకాలు, అప్పుడేం జరిగింది లాంటి అంశాలు ఇన్నేళ్ళ ఆధునిక జీవనం తరువాత కూడా మనిషికి ఆసక్తి కలిగించే విషయాలు. మార్మికతతో కూడిన ఈ విషయాలు ఉత్కంఠ, ఉద్విగ్నత రేపుతాయి కాబట్టి, ఇవాళ్టికీ వాటి గురించి చదవడానికీ, చూడడానికీ ముందుకొస్తారు. వెండితెరపైనా ఇది హిట్ ఫార్ములా అని పాత చిత్రాల కాలం నుంచి నిన్న మొన్నటి ‘మగధీర’ వరకు ప్రతి సినిమా నిరూపిస్తూనే ఉంది. ఆ ఫార్ములాను తీసుకొని, దాని చుట్టూ ఒక కథ కాదు... రెండు మూడు పునర్జన్మల కథలను అల్లుకొని, దాన్ని వర్తమానానికి కలిపితే? అలాంటి ప్రయత్నమే - దర్శకుడు కె.వి. ఆనంద్ చేసిన ‘అనేకుడు’. ప్రేమికుల దినోత్సవ కానుకగా తమిళనాట మొన్న ఫిబ్రవరి 13నే విడుదలైన మాతృక ‘అనేగన్’కు ఇది తెలుగు అనువాద రూపం. కథ ఏమిటంటే... వీడియో గేమ్స్ డిజైన్ చేసే ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో ఆ గేమ్స్ రూపకల్పన బృందంలో ఒకరిగా పనిచేస్తుంటుంది మధుమిత (అమైరా దస్తూర్). అదే కంపెనీలో కొత్తగా హార్డ్‌వేర్ ఉద్యోగిగా వస్తాడు అశ్విన్ (ధనుష్). తనకూ, అతనికీ మధ్య జన్మజన్మల అనుబంధం ఉందని భావిస్తుంటుంది మధుమిత. అది కేవలం ఊహాజనితమైన భ్రమ అంటూ ఉంటాడు అశ్విన్. కొత్త గేమింగ్ ప్రాజెక్టుల్ని తొందరగా పూర్తి చేయాలంటూ, తుది గడువు విషయంలో అందరి మీదా ఒత్తిడి పెడుతుంటాడు హీరోయిన్ వాళ్ళ కంపెనీ యజమాని రవికిరణ్ (సీనియర్ నటుడు కార్తీక్). ఒత్తిడిలో ఉన్న మధుమిత సహా అందరికీ డాక్టర్‌తో చికిత్స చేయిస్తుంటాడు. మధుమితకు రెట్రాగ్రెషన్ థెరపీ చేయిస్తూ, ఆమె అనుకుంటున్న పాత జన్మల జ్ఞాపకాలను ఆ డాక్టర్ చెప్పిస్తుంటుంది. పాత జన్మల్లో తాను - అశ్విన్ బర్మాలో ఉన్నామనీ, ఆ పైన వైజాగ్‌లో కాళి - కల్యాణిగా బతికామనీ అంటూ ఉంటుంది హీరోయిన్. ఇంతకీ ఆమె మాటలన్నీ నిజమేనా? భ్రమా? నిజమైతే, వివిధ జన్మల్లో వారిని కలవనివ్వకుండా చేసిందెవరు? లాంటివన్నీ సుదీర్ఘంగా సాగే ఈ రెండుమ్ముప్పావు గంటల సినిమా. ఎలా చేశారంటే... మూడు జన్మల కథల మేళవింపుగా సాగే ఈ చిత్రంలో పూర్తిగా పరస్పర విరుద్ధమైన మూడు వేర్వేరు గెటప్పులు, పాత్రల్లో ధనుష్ కనిపిస్తారు, మెప్పిస్తారు. 1960ల నాటి బర్మా కథలో కాందిశీకుడైన భారతీయ కార్మికుడు బుల్లెబ్బాయ్‌గా, 1987 నాటి వైజాగ్ కథలో రౌడీయిజమ్‌కు కూడా సిద్ధపడే చిత్రకారుడైన కాళిగా, వర్తమానంలో అధునాతన సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిగా - మూడు షేడ్స్‌లోనూ పాత్రల్లోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అలాగే, బర్మా అమ్మాయి సముద్రగా, అహింసను బోధించే కల్యాణిగా, ఆధునిక మధుమితగా అమైరా దస్తూర్ చూడడానికి బాగున్నారు. పాత జన్మల తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చీ రాని సమయం లాంటి చోట్ల ఆమె అభినయం బాగుంది. ఇక, అప్పుడెప్పుడో ‘అభినందన’, ‘ఘర్షణ’ లాంటి చిత్రాల్లో కథానాయకుడిగా, యువ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, అందరి దృష్టినీ ఆకర్షించిన సీనియర్ నటుడు కార్తీక్. ఆ మధ్య కల్యాణరామ్ ‘ఓమ్ -3డి’ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించిన ఆయన ఇప్పుడీ సినిమాలో అలాంటి పాత్రలను తానెంత అద్భుతంగా పండించగలడో నిరూపించారు. ఆయన నుంచి ప్రేక్షకులకు ఇదొక సర్ప్రైజ్. పోలీసాఫీసర్‌గా ఆశిష్ విద్యార్థి, నేటి సుప్రసిద్ధ తమిళ చిత్రకారుడు మణియన్ సెల్వమ్ (మ.సె) బొమ్మలతో తెరపై చిత్రకారుడి పాత్రలో నటించిన ‘తలైవాసల్’ విజయ్, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచడానికి ఆయన రీరికార్డింగ్ ఉపకరించింది. రెండు, మూడు పాటలు కూడా వినాలనిపించేలా ఉన్నాయి. ప్రతి పాటనూ, సన్నివేశాన్నీ కనువిందుగా చూపడంలో ఛాయాగ్రాహక - దర్శకుడు కె.వి. ఆనంద్ ప్రతిభ కనిపించింది. అలాగే, విజువల్ ఎఫెక్ట్లు, ఫైట్లు ఆకట్టుకుంటాయి. రాజకుమారుడు, రాజకుమారి, సైన్యాధ్యక్షుడి జన్మ తాలూకు ఎపిసోడ్‌ను చిత్రీకరించి, ఎడిటింగ్‌లో కత్తెర వేశారని అర్థమవుతూ ఉంటుంది. బర్మా ఎపిసోడ్‌తో సహా మరికొన్ని చోట్ల కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టినా ఇబ్బందేమీ ఉండేది కాదు. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం - ఈ సినిమా డబ్బింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ. సినిమాలో ఆ యా కథల కాలానికి తగినట్లుగా పత్రికల మీద శీర్షికలు, గోడల మీద వాల్‌పోస్టర్లు లాంటివి తెలుగు వాతావరణానికి తగినట్లు మార్చడం శ్రద్ధకు తార్కాణం. ‘ఆర్.బి.ఎఫ్ (రాయపేట బెనిఫిట్ ఫండ్)’ లాంటి బోర్డుల మీద ‘ఆర్.బి.ఎఫ్’ అని ఉంటూనే పక్కనే ‘మార్గదర్శి చిట్‌ఫండ్’ అని రాయడం లాంటి ఒకటీ అరా నెరుసులున్నా మొత్తం మీద ‘మాయాబజార్’ పోస్టర్ మొదలు ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున లాంటి అప్పటి కాలానికి తగ్గ హీరోల కటౌట్లు ఇది నేరు తెలుగు చిత్రమా అనిపించేలా చేస్తాయి. అలాగే, ధనుష్‌కు (డబ్బింగ్ ఆర్టిస్ట్ వాసు), కార్తీక్‌కు (డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయుపుత్ర నాగార్జున) తెలుగులో చేసిన స్వరదానం ఆకట్టుకుంటుంది. ఎలా ఉందంటే... గతంలో తమిళంలో ‘కో’ (తెలుగులో ‘రంగం’) లాంటి హిట్ చిత్రాలు అందించిన ట్రాక్ రికార్డ్ దర్శకుడిగా మారిన ఒకప్పటి న్యూస్ ఫోటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ది. ఆయన ఈ చిత్రంలోనూ తనదైన మార్కు చూపారు. బర్మా ఎపిసోడ్‌కూ, వర్తమానానికీ మధ్య తిరిగే ఫస్టాఫ్ ఆసక్తికరమైన ఘట్టం వద్ద ముగుస్తుంది. ఇక, ఇంటర్వెల్ తర్వాత వచ్చే వైజాగ్ ఎపిసోడ్ లాంటివి ప్రేమకథకు, క్రైమ్, సస్పెన్స్‌ను బాగా కలిపాయి. నిజానికి, మునుపటి హాలీవుడ్, తమిళ, తెలుగు చిత్రాల ప్రభావం చాలానే ఉన్న సినిమా ఇది. మన తెరకూ పునర్జన్మ కథలూ కొత్త కాదు. అయితేనేం, ఒకటికి మూడు కథలను మేళవించడంలోనే అసలు నేర్పు అంతా ఉంది. అందమైన ప్రేమ కథలు, వాటిని ఆహ్లాదంగా చూపడం... కీలకమైంది. నిజానికి, మూడు జన్మలు, ఇన్ని పాత్రల మధ్య ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లేను అల్లుకోవడం, కథను గందరగోళం లేకుండా ముందుకు నడపడం అంత సులభమేమీ కాదు. ఆ విషయంలో దర్శక, రచయిత విజయం సాధించారు. పైగా, ప్రతి సీన్‌కూ బాగానే హోమ్‌వర్క్ చేసుకున్నారని అర్థమవుతుంటుంది. ఒక్కొక్క కథలో ఒక్కొక్కరు... హీరో - హీరోయిన్ల ప్రేమకు విలన్‌గా మారడంతో, వర్తమాన కథకు ఎవరు ప్రతినాయకుడనే విషయంలో చివరి రీళ్ళ వరకు ఒక చిన్న ఉత్కంఠ ప్రేక్షకులలో కొనసాగుతుంది. సినిమా పూర్తయ్యేసరికి బోలెడన్ని పాత్రలు, బోలెడంత కాలపు కథ చూసిన భావన కలుగుతుంది. సినిమా నిడివి కూడా అందుకు తగ్గట్లే ఉంది. అయినప్పటికీ, ఆఖరు క్షణం వరకు ప్రేక్షకుడు కూర్చుంటాడు. ఆ మాత్రం కాలక్షేపం అందించే సినిమాలు... అందులోనూ రోజూ చూస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నమైన ప్రయత్నాలు... కరవైపోయిన రోజుల్లో ఏ సినిమాకైనా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది! ఇప్పటికే తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అనేకుడు’కు తెలుగులోనూ అది కలిసొస్తుందనడానికి హాలులో కనిపిస్తున్న సూచనలూ అనేకం! - రెంటాల జయదేవ -
పిల్లలకు... ఒక పుస్తకంతో... రెండు భాషలొస్తాయ్!
మీ పిల్లలకు పుస్తకాలు కొనివ్వాలనుకుంటున్నారా? చిన్నప్పుడు మీరు చదివిన ‘చందమామ’ పుస్తకాలు, రంగురంగుల సోవియట్ బొమ్మల పుస్తకాలు అందుబాటులో లేవే అని విచారిస్తున్నారా? ఈ ఇంగ్లీషు మీడియమ్ ఆధునిక చదువుల ప్రపంచంలో తెలుగు పుస్తకాన్ని మీ పిల్లలకు చేరువ చేయడమెలాగా అని లోలోపలే సందిగ్ధావస్థలో ఉన్నారా? అయితే, వీటన్నిటికీ పరిష్కారం ఇప్పుడు లభించినట్లే! ఒక తెలుగు ప్రచురణ సంస్థ (ఎమెస్కో బుక్స్), దేశ భాషల విశిష్టత, వికాసం, పరిరక్షణల మీద దృష్టిపెట్టే ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ (సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు) కలసి ఆ కొరతను తీర్చేస్తున్నాయి. ఒక పేజీలో పెద్ద బొమ్మ, ఎదురుగా పేజీలోనే సులభమైన ఇంగ్లీషులో, కిందే తెలుగులో (ఇతర భారతీయ భాషల్లో కూడా) ఉన్న బొమ్మల పుస్తకాలు ఇప్పుడు వచ్చాయి. ఏకంగా 22 భాషల్లో 1008 పుస్తకాలను తెచ్చాయి. ఇప్పటికి అర్ధ పుష్కరకాలం పైచిలుకుగా, కోటిన్నర పైగా ఖర్చుతో సాగుతున్న ఈ బాల సాహిత్య ‘సాంస్కృతిక ఏకీకరణ ప్రయత్నం’పై ‘ఎమెస్కో’ మేనేజింగ్ డెరైక్టర్ డి. విజయకుమార్‌తో జరిపిన సంభాషణలోని ముఖ్యాంశాలు... ఇప్పటికి 30 ఏళ్ళుగా పుస్తక ప్రచురణ, విక్రయ రంగంలో ఉన్నాను. ‘ఎమెస్కో’ తరఫున దాదాపుగా 5 వేల పుస్తకాలు ప్రచురించా. అయితే, ప్రచురణకర్తగా ఇన్నేళ్ళ నా జీవితంలో చేసిన అతి పెద్ద ప్రాజెక్ట్ మాత్రం ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’. దీని మీద పెట్టినంత శ్రమ, పెట్టుబడి మరి దేని మీదా పెట్టలేదు. ఆవేదనతో వచ్చిన ఆలోచన... నిజానికి, ఈ పిల్లల పుస్తకాల ఆలోచనకు బీజం ఏడెనిమిదేళ్ళ క్రితం పడింది. ఒకసారి ‘వరల్డ్ బుక్ ఫెయిర్’ చూసినప్పుడు భారతీయ భాషల్లో బాలసాహిత్యం చాలా తక్కువని అర్థమైంది. మరీ ముఖ్యంగా మన తెలుగులో చిన్న పిల్లలకు ఉత్తమ బాలసాహిత్యం అందుబాటులో లేదు. చిన్నప్పుడు మా తరం చదువుకున్న ‘చందమామ’ లాంటి ఉత్తమ బాలసాహిత్య పత్రికలూ లేవు. ఈ క్రమంలో ఏమైనా చేయాలనే ఆవేదన పడుతున్నప్పుడు బొమ్మలతో కథల పుస్తకాలు ప్రచురిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్ట్ కాబట్టి, ఏకకాలంలో ఎక్కువ భాషల్లో తేవడం సరైన వ్యూహమని భావించా. కేంద్ర మానవవనరుల అబివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే సి.ఐ.ఐ.ఎల్. (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్) వాళ్ళను అనుకోకుండా కలిశా. నా ఆలోచన వాళ్ళకూ నచ్చింది. వాళ్ళు కథ, భాష గురించి చూస్తే, నేను బొమ్మలు, పుస్తకాల ముద్రణ గురించి చూసేలా, ఉమ్మడి కాపీరైట్ ఉండేలా, ఆదాయం కూడా కలసి పంచుకొనేలా ఒప్పందానికి వచ్చాం. ఆరేళ్ళుగా ఎంతో శ్రమించి, ఇప్పటికి జనం ముందుకు కొంత తేగలిగాం. ఒక పేజీలో బొమ్మ... ఎదురుగా రెండు భాషల్లో కథ... ఒక్క ముక్కలో చెప్పాలంటే, కొత్తగా అక్షరాస్యులైనవారికీ, చిన్న తరగతులు చదివే పిల్లలకూ ఉపకరించే సాహిత్య సామగ్రి బ్యాంక్ ఇది. ఈ ప్రాజెక్ట్ కింద వచ్చే పుస్తకాలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అన్నీ 16 నుంచి 24 పేజీల లోపు పుస్తకాలే. వెల అందుబాటులో (రూ. 35) ఉంటుంది. పుస్తకంలో ఒక పేజీలో పెద్ద బొమ్మ, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులోనూ, దాని కిందే ఎంపిక చేసిన భారతీయ భాషలోనూ కథ ఉంటాయి. దీనివల్ల పిల్లలందరికీ ఒకే పుస్తకంతో ఇటు తమ మాతృభాష, అటు ఇంగ్లీషు - రెండూ నేర్చుకొనే వీలు కలుగుతుంది. పెపైచ్చు, ప్రతి పుస్తకం చివర ఆ భాషలో, ఇంగ్లీషులో కూడా చిన్న చిన్న అభ్యాసాలు ఉంటాయి. పుస్తకం చదివిన పిల్లలకు ఇటు వినోదం, వికాసంతో పాటు ఈ లాంగ్వేజ్ టూల్స్ ద్వారా రెండు భాషల మీద పట్టు వస్తుంది. సాంస్కృతిక ఏకీకరణకు మార్గం ప్రస్తుతానికి ‘పంచతంత్ర కథలు’, ‘జాతక కథలు’ లాంటి దేశవ్యాప్తంగా జనానికి తెలిసిన కథలను ఈ పుస్తకాల ద్వారా అందిస్తున్నాం. అలాగే, రామాయణ, భారతాల లాంటి దేశమంతటికీ తెలిసిన పురాణ కథలను కూడా ఇలా తేవడానికి బొమ్మలు వేస్తున్నాం. ఇక, తరువాతి దశలో ఆ యా ప్రాంతాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలనూ, జానపద కథలనూ, అక్కడి సాహిత్య, సాంస్కృతిక ప్రముఖుల జీవితగాథలనూ ఇలాగే అన్ని భాషల్లో పిల్లల పుస్తకాలుగా తెస్తాం. దీనివల్ల ఒక ప్రాంతపు కట్టూబొట్టూ, సంస్కృతి మరొక ప్రాంతానికి తెలుస్తాయి. ఇవాళ్టికీ దేశంలో పరాయివారుగా మిగిలిపోతున్న ఈశాన్య రాష్ట్రాల వారిని అందరితో మమేకం చేయడానికి ఇది కచ్చితంగా తోడ్పడుతుంది. ఆరేళ్ళ శ్రమ... ఒకటిన్నర కోట్ల పెట్టుబడి... అది గ్రహించడం వల్లే ఈ పుస్తకాలను ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సైతం ఈ విశిష్ట ప్రయత్నాన్ని ఎంతో మెచ్చుకున్నారు. సింధీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని భాషల్లో సైతం వీటిని తీసుకురావాల్సిందిగా కోరారు. వాటన్నిటిలో ఈ పుస్తకాలను తేవడానికి మరో రెండు, మూడేళ్ళు పడుతుంది. పిల్లల పుస్తకాల ప్రచురణ నిజానికి ఒక బృహత్తర ఉద్యమం. కేవలం లాభనష్టాల ప్రాతిపదికన ఈ పని చేయలేం. సాధారణ పుస్తకాలు ప్రచురించడం వేరు. పిల్లల పుస్తకాలేయడం వేరు. పిల్లలకు తగ్గట్లు తేలికగా అర్థమయ్యే భాష వాడుతూ, వారికి ఆసక్తికరంగా ఉండేలా మంచి బొమ్మలు వేయించి పుస్తకాలు తేవడానికి బోలెడంత శ్రమ పడాలి. సహనం కావాలి. ఉదాహరణకు ఒక పుస్తకం గమ్మత్తై మూడు కాళ్ళ గుర్రం గురించి కథ. అయితే, ఆర్టిస్టు గుర్రమనగానే పొరబడి, నాలుగు కాళ్ళ గుర్రం వేశారు. తీరా ప్రింటయ్యాక చూసుకొని, 3 వేల కాపీలూ పక్కన పడేశాం. ఇలాంటి ఇబ్బందుల్ని భరించి, ఉన్నత ప్రమాణాల్లో పుస్తకాలు తేవడం సులభం కాదు. ఈ పుస్తకాల కోసం లోపలి పేజీలకు కూడా ముఖచిత్రాలకు వాడే ‘హైబల్క్ ఆర్ట్ కార్డ్’ పేపర్ ఉపయోగించాం. దీనివల్ల పుస్తకం కొన్నేళ్ళపాటు మన్నుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండడానికి హ్యాండ్ పెయింటింగ్‌లే వాడాం. ఏటా 150కి పైగా టైటిల్స్ ప్రచురిస్తున్న మేము ఆరేడేళ్ళుగా మా ఆదాయంలో 60 శాతం పైగా ఈ ప్రాజెక్ట్ మీద పెట్టుబడిగా పెట్టాం. ఇప్పటికి రూ. 1.5 కోట్ల దాకా వెచ్చించాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద బయటకు వచ్చినవి 130 కథలే. మరో 700 కథలకు బొమ్మలు సిద్ధంగా ఉన్నాయి. (బీరువా తెరిచి చూపిస్తూ) ఇవన్నీ కథలకు వేయించిన వేలాదిబొమ్మలే! ఇలాంటి ప్రయత్నం మన భాషలు వేటిలోనూ ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ జరగలేదు. గతంలో ‘అమర్ చిత్రకథ’ లాంటివి ఉన్నా, అవన్నీ ప్రధానంగా ఎదిగిన బాలబాలికల కోసం ఉద్దేశించిన కామిక్స్ తరహావి. పిల్లల మనోలోకంలోకి ఎదిగి, చేస్తున్న ఈ ప్రయత్నం వేరు. వీటి ద్వారా ఈ తరం పిల్లలకు మా చిన్నప్పటి ‘చందమామ’ పుస్తక పఠనం లాంటి అనుభూతి కలిగించాలని నా ఆశ. ఆ ప్రయత్నంలో ఏ కొంత సఫలమైనా ప్రచురణకర్తగా కన్నా, ప్రయోజనాత్మక సాహిత్యాన్ని ప్రేమించే వ్యక్తిగా నాకెంతో సంతృప్తి, సంతోషం! ఫొటో: జి. రాజేశ్ ‘ఎమెస్కో బుక్స్’, ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థ అయిన మా సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు సంయుక్తంగా ఈ ‘పిల్లల బుక్ బ్యాంక్’ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పిల్లల పుస్తకాల్లోని కథ, కథనం, భాష మేము చూసుకుంటే, ఆ పుస్తకాల డిజైనింగ్, లోపల వేసే బొమ్మలు, ముద్రణ వ్యవహారాలు ‘ఎమెస్కో’ చూస్తుంది. అలా ఒక రకంగా ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సాగుతున్న బృహత్తర ప్రయత్నం. రాజ్యాంగంలోని షెడ్యూల్డు భాషలన్నిటిలో, దేశంలోని అనేక గిరిజన భాషల్లో ఈ పుస్తకాలను అందించాలని మా ప్రయత్నం. ఈ నెల 21న ‘మాతృభాషా దినం’ సందర్భంగా 22 భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ తదితర 15 భారతీయ భాషలు, కుయి, ఆవో లాంటి 7 గిరిజన భాషలు) మొత్తం 1008 పుస్తకాలను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విడుదల చేశారు. డాక్టర్ అవదేశ్ కుమార్ మిశ్రా, డెరైక్టర్, సి.ఐ.ఐ.ఎల్ - మైసూరు రెంటాల జయదేవ -
సమస్యలను ఎదుర్కొనే కిటుకు అదే!
‘‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న యువకులు వంద మందిని నాకు ఇస్తే, ఈ దేశాన్నే మార్చేస్తాను!’’ అన్న ద్రష్ట స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి మొత్తం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని నూరేళ్ళ క్రితమే గుర్తించి, ఆ సంగతిని అప్పుడే బాహాటంగా చాటిన దార్శనికత ఆయనది. నేడు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షులు స్వామి జ్ఞానదానందతో సాక్షి సంభాషణ... - స్వామి జ్ఞానదానంద, ‘రామకృష్ణ మఠం’ హైదరాబాద్ అధ్యక్షులు దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా నుంచి స్వామి వివేకానంద తన సోదర శిష్యులకు ఉత్తరం రాస్తూ, ‘‘కిన్నామ రోదసి... న జడః కదాచిత్॥అని పేర్కొన్నారు. అంటే, ‘ఓ మిత్రమా! నువ్వెందుకు విలపిస్తున్నావు? సమస్త శక్తీ నీలోనే ఉంది. ఓ శక్తిశాలీ! నీ సర్వశక్తి స్వభావాన్ని వెలికి తీసుకురా! ఈ లోకం సమస్తం నీకు పాదాక్రాంతమవుతుంది’ అని! ముఖ్యంగా, యువతరం ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. దేనికీ దిగాలుపడకుండా, నిరాశలో కూరుకుపోకుండా మనలోని దైవిక స్వభావాన్ని గుర్తు చేసుకోవాలి. మనం సామాన్యులం కాదనే స్పృహతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలను‘నువ్వెందుకూ పనికిరావు. శుద్ధదండగ... ‘నువ్వు పాపివి! నిష్ర్పయోజకుడివి’ అని పదే పదే అనడం వల్ల చివరకు వారు అలానే తయారవుతారు. అలా కాకుండా, సానుకూల దృక్పథంతో ప్రోత్సహిస్తే - పైకి వస్తారు! యువతరం ఇప్పుడు నిద్రాణ స్థితిలో ఉంది. కమ్ముకున్న తెరలను చీల్చుకొని, నిద్రావస్థ నుంచి వాళ్ళు మేల్కొనాలి. తమలోని శక్తిని గ్రహించి, తమ లోపలే ఉన్న ఆ మహాపురుషుణ్ణి దర్శించాలి. అలా తమ అసలు సిసలు ఆత్మ స్వభావాన్ని గ్రహించి, తమ ఔన్నత్యాన్ని తెలుసుకుంటే చాలు - అన్నిటా విజయం వరిస్తుంది. ‘లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి!’ అని స్వామి వివేకానంద పదే పదే గుర్తు చేసింది అందుకే! మన ఆత్మస్వభావం తెలుసుకోకపోతే - ఎలా తయారవుతామనడానికి ఒక కథ ఉంది. అనగనగా ఒక గొర్రెల కాపరి. ఒకసారి నిండు గర్భిణి అయిన ఒక ఆడసింహం అతని గొర్రెల మంద మీద పడింది. ఆ గందరగోళంలో ఆ సింహం మరొక సింహం పిల్లకు జన్మనిచ్చి, మరణించింది. గొర్రెల కాపరి దగ్గర, ఆ మందలో ఒక గొర్రెపిల్లగా, గడ్డి తింటూ, గొర్రెస్వభావంతో పెరిగిందా - గొర్రెసింహం. తీరా ఒకసారి ఒక సింహం దాడికి వచ్చినప్పుడు, గొర్రెల్లో ఒకదానిలా భయపడిపోతున్న ఈ గొర్రెసింహాన్ని చూసి, తీసుకెళ్ళి, బావిలోని నీటిలో ప్రతిబింబం చూపి, దాని స్వభావాన్ని ఎరుకపరిచింది. అప్పటి నుంచి ఆ పిల్ల సింహం మరుగునపడ్డ తన స్వభావాన్ని గ్రహించి, గర్జన చేసింది. ఈ కథలో ఈ పిల్ల సింహం మనమైతే, మనకు మన నిజ స్వభావాన్ని తెలియజెప్పే పెద్ద సింహం - స్వామి వివేకానంద. ఇవాళ్టికీ స్వామీజీ బోధనల్ని చదివి, తమకు తాము బోధించుకొని, ఆచరణలో పెడితే యువకులు సింహాలై గర్జిస్తారు. వారి వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోతుంది. దురదృష్టవశాత్తూ ఇవాళ్టి సమాజంలో జనం తమలో దైవత్వం ఉందనీ, తాము అమృతపుత్రులమనీ విస్మరిస్తున్నారు. సమస్యలొస్తే - దైర్యంగా ఎదుర్కోవడం లేదు. దూరంగా పారిపోతున్నారు. తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. కానీ, దాని వల్ల లాభం లేదు. పారిపోయే కొద్దీ సమస్యలు ఇంకా బలపోతమవుతాయి. వెంటాడతాయి. వేధిస్తాయి. మనం బలహీనమైపోతాం. అలాకాక, ధైర్యంగా ఎదుర్కొంటే, సమస్యలు బలహీనమై, పారిపోతాయి. అదే అసలు కిటుకు! చదువంటే మార్కులు, ర్యాంకుల పంటలే కాదు... మనిషి శీల నిర్మాణ విద్య. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ మనిషిలో మానసిక బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, నిర్భీతినీ పెంపొందించాలి. అలాంటివి బోధించడానికే, రామకృష్ణ మఠం శాఖలు కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ శాఖలో ఏటా దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులతో ‘యువజన సమ్మేళనం’ జరుపుతున్నాం. అలాగే, ‘హౌ టు ఓవర్‌కమ్ టెన్షన్ అండ్ వర్రీ’, ‘హౌ టు ఓవర్‌కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ లాంటి అంశాలపై తరచూ క్లాసులు, సెమినార్లు, ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాం. వాటివల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడడం స్వయంగా చూస్తున్నాం. ఒక్కముక్కలో చెప్పాలంటే - స్వామీజీ ఆ రోజుల్లోనే అన్నట్లు - యువతరానికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే చాలు - మిగిలినవన్నీ జీవితంలో సాధించుకోగలుగుతారు. మరి, అలా మన మీద మనకు నమ్మకం కలిగించే బోధనలంటే - ఈ తరానికి స్వామి వివేకానంద బోధనల వినా మరో మార్గం లేదు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏటా జరుపుకొనే ఈ జాతీయ యువజన దినోత్సవం నాడు మరోసారి ఆయన మాటలను పునశ్చరణ చేసుకుందాం. ఆ మాటలను ఆచరణలో పెట్టి, నవ భారత నిర్మాణానికి నడుం కడదాం!! సర్వం శ్రీ రామకృష్ణార్పణమస్తు - రెంటాల జయదేవ -
గురితప్పని... పీకే 47
‘పీకే’... ఇటీవలి కాలంలో దేశమంతటా అందరి నోటా నానుతున్న పేరు ఇది. కించిత్ కథ కానీ, కనీసం పాత్రల వివరాలు కానీ వెల్లడించకుండా అంతా గుట్టుగా అట్టిపెడుతూనే, విశేష ప్రచారం పొందిన సినిమా అంటే ఇదే. హీరో ఆమిర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, నిర్మాత విధు వినోద్చోప్రా - ఇలా ముగ్గురు దిగ్దంతుల కలయికలో వస్తున్న సినిమా అయినప్పుడు ఆ మాత్రం హల్చల్ సహజమే. రైలు పట్టాల మధ్య నగ్నంగా, ట్రాన్సిస్టర్‌ను అడ్డుపెట్టుకొని నిలబడ్డ ఆమిర్‌ఖాన్ ఫస్ట్‌లుక్ ఫోటో నుంచి ఇవాళ్టి దాకా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడమే తప్ప తగ్గింది లేదు. మరి, ఇంతగా జనం నోట నానిన ‘పీకే’లో అసలింతకీ ఏముంది! 2014 దాదాపుగా ముగింపునకు వచ్చిన వేళ ఈ ఏడాది కాలంలో విడుదలైన హిందీ చిత్రాలను గమనిస్తే, ఏ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందన్న దగ్గరే చర్చ మొదలై, అక్కడే ఆగిపోతోంది. ఎన్ని లక్షలమంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది, ఎంత వినూత్న కథాంశంతో వచ్చిందన్న చర్చ జరగడానికే అవకాశం లేకుండా తామరతంపరగా సినిమాలొచ్చాయి. తీరా, ఏడాది చివరలో ఒక్కసారిగా వెండితెరపై వచ్చిన కుదుపు - ‘పీకే’. కథాంశం ఎంతో సమకాలీనమైనదే కాక, అంతకు అంత ఆలోచించాల్సిన విషయం కావడం విశేషం. అంతరిక్ష పరిశోధనలో భాగంగా గ్రహాల పైకి వ్యోమనౌకల్ని పంపి, జీవరాశి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఒక గ్రహాంతరవాసి (ఆమిర్‌ఖాన్) మన భూమండలం మీదకు వస్తే? మనిషికే కాక మనసుకు కూడా దుస్తుల ముసుగులు లేని అలాంటి వ్యక్తికి ఇక్కడి మోసాలు, అబద్ధాలు ఎదురైతే? తన వ్యోమనౌక తాలూకు రిమోట్‌గా పనికొచ్చే పచ్చల పతకాన్ని ఇక్కడి జనం కొట్టేస్తే? సరిగ్గా అదే జరుగుతుందీ సినిమాలో. దుస్తులు కానీ, భాష కానీ లేని అతనెలా భాష నేర్చాడన్నది ఆసక్తికరమనిపిస్తుంది. పోయిన పచ్చల పతకాన్ని వెతుక్కుంటూ తిరిగే అతనిలోని మంచితనం, అతడు అడిగే అమాయకపు ప్రశ్నలు చూసి, ‘పీకే’ హై క్యా (తాగి ఉన్నావా) అని అందరూ అడుగుతుంటారు. ‘పోయిన వస్తువు దక్కాలంటే... దేవుడే దిక్కు’ అన్నప్పుడు అతను మనస్ఫూర్తిగా దేవుడి కోసం పడే ఆరాటం కథను మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఈ క్రమంలో అతనికి జగజ్జనని అలియాస్ జగ్గు (అనుష్క శర్మ) అనే టీవీ జర్నలిస్టు తారసపడుతుంది. ఒకరు వినాయకుడు, మరొకరు లక్ష్మీదేవి, ఇంకొకరు శంకరుడు - ఇలా ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి ప్రార్థించడం పీకేకు ఒక విచిత్రంగా కనిపిస్తుంది. అలాగే, మతాల సారం ఒకటేననీ, అందరి దేవుడూ ఒకడేననీ చెప్పే ఈ దేశంలో మనిషికో మతం ఉండడం, ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన విశ్వాసం కావడం లాంటివి పీకేను గందరగోళానికి గురి చేస్తాయి. కట్టెదుట కనిపించని దేవుడు కరుణించకపోవడంతో ‘కనిపించుట లేదు’ అంటూ దేవుళ్ళ బొమ్మలు ముద్రించి పంచే పీకే ఆసక్తిరేపే న్యూస్‌స్టోరీ అవుతాడని భావిస్తుంది జగ్గు. అతని వెంట పడి, అసలు కథ తెలుసుకుంటుంది. ఇంతలో అందరూ ఆరాధించే ‘గాడ్ మన్’ (సౌరభ్ శుక్లా) దగ్గర ఆ పచ్చల పతకం ఉన్నట్లు గ్రహిస్తారు. ఇక అక్కడ నుంచి పీకే తన గ్రహానికి తిరిగి వెళ్ళేందుకు తోడ్పడే ఆ పతకాన్ని తిరిగి సంపాదించుకొనే ప్రయత్నంతో సినిమా నడుస్తుంది. జగ్గు ప్రేమకథ... గ్రహాంతరవాసి అయిన పీకెలో చిగురించే అనురాగం... దేవుడి మీద మనుషుల్లో ఉన్న భక్తిని భయంగా మార్చి, వారి నమ్మకాలను వ్యాపారంగా మార్చుకొనే గాడ్మన్ల వ్యవహారం... టీవీ న్యూస్ చానల్లో సాగే డిస్కషన్ షో... ఇలా సాగుతుంది సినిమా. ఆఖరుకు పీకే ఆ పతకం ఎలా సాధించాడు, అతని అనురాగం ఏమైంది లాంటివన్నీ ఆకట్టుకొనే రీతిలో నడుస్తాయి. నిజం చెప్పాలంటే, ఈ సినిమాకు ఒకరు కాదు - ఇద్దరు హీరోలు. ఆమిర్ కాక, రెండో హీరో ఎవరయ్యా అంటే - దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ‘మున్నాభాయ్ ఎం.బి. బి.ఎస్’లో వైద్య విధానాన్ని ప్రశ్నించి, ‘లగే రహో మున్నాభాయ్’లో గాంధీగిరిని ప్రస్తావించి, ‘3 ఇడియట్స్’లో విద్యావిధానాన్ని నిలదీసిన హిరానీ ఇప్పుడు దేశంలో ‘భగవంతుడికి మేనేజర్లు’గా చలామణీ అవుతున్న గాడ్‌మన్లపై కెమేరా గురిపెట్టారు. ఈ చిత్రం అతని చేతిలో ‘ఏకె 47’. దేవుడనే భావన, నేటి సమాజంలో దైవస్వరూపులుగా తమను తాము ప్రచారం చేసుకుంటున్న సోకాల్డ్ ఆధ్యాత్మికవేత్తల వైఖరిని హిరానీ చర్చనీయాంశాలు చేశారు. మతం, విశ్వాసాల గురించి మాట్లాడడమే పాపం... దుస్సహమైపోతున్న సమకాలీన సందర్భంలో ఇది కత్తి మీద సాము. అయినా, అనేక అంశాలను చాలా నేర్పుగా, వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించారు దర్శక, రచయితలు. సున్నితమైన మతపరమైన అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పాటించారు. ఈ క్రమంలో డైలాగ్స సెటైరికల్‌గా వినోదం అందిస్తూనే, వివేచనను మేల్కొల్పుతాయి. ఈ కథను ఆలోచించడానికీ, ఆలోచించినదాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా నైసుగా తెరపై చెప్పడానికి హిరానీ చాలా శ్రమించారని అర్థమవుతుంది. అంత శ్రమ ఉంది కాబట్టే, ‘3 ఇడియట్స్’ తరువాత అయిదేళ్ళ విరామంతో వచ్చిన హిరానీ సినిమా వచ్చినా, జనం సీట్లకు అతుక్కుపోయి చూస్తారు. కథలోని ప్రతి పాత్రకూ ఒక ప్రాధాన్యం... ప్రతి సంఘటనకూ కథలో ఒక లింకు కుదిరేలా ఈ స్క్రిప్టును అల్లుకోవడం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. చక్కటి స్క్రీన్‌ప్లే పాఠం అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో జిగిబిగి కొంత తగ్గిందేమో అన్న అనుమానం కలిగినప్పటికీ... ప్రేక్షకులు సంతృప్తిగా హాలులో నుంచి బయటకు వస్తారు. పరేశ్ రావల్ నటించిన ‘ఒ మై గాడ్’ (రానున్న ‘గోపాల గోపాల’కు మాతృక)తో కొద్దిపాటి పోలిక కనిపించినా, దీని అనుభూతి వేరు. వాస్తవానికి, బాక్సాఫీస్ ఫార్ములా శంక మనసును పట్టి పీడిస్తున్నప్పుడు దాని నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులభం కాదు. కానీ, ప్రేక్షకుల తెలివితేటల్నీ, అవగాహననూ, అభిరుచినీ తక్కువగా అంచనా వేయడమనే మానసిక దౌర్బల్యం నుంచి బయట పడి, దర్శక - నిర్మాతలు సినిమా తీస్తే ఎంత మంచి ఇతివృత్తాలు తెరపైకి వస్తాయో చెప్పడానికి ‘పీకే’ ఒక ఉదాహరణ. ఈ సినిమా చూశాక బుద్ధిజీవులు ఈ ‘పీకే’తో ప్రేమలో పడతారు. దర్శక, రచయితల నిబద్ధత మీద, నమ్మి ఈ కథ కోసం ప్రాణం పెట్టిన ఆమిర్ లాంటి నట, సాంకేతికుల మీద గౌరవం పెరుగుతుంది. ఔత్సాహికులకే కాదు... వసూళ్ళే పరమావధిగా ఆరు పాటలు మూడు ఫైట్ల వరదలో కొట్టుకుపోతున్న అన్ని భాషల్లోని అనేకమంది సీనియర్ సినీ పెద్దలకూ ‘పీకే’ తాజా పాఠం అనిపిస్తుంది. ఏళ్ల తరబడి మనం తీస్తున్న, చూస్తున్న సినిమాల్లో ఇలాంటివి కదా రావాల్సిందనే భావన కలుగుతుంది. అందుకే, మంచి కథ, కథనం, ఐటమ్ సాంగులు -ఫైట్లు లేని ఆహ్లాదకరమైన వినోదం ఆశించేవారికి ‘పీకే’ ఒక మరపురాని జ్ఞాపకం. వినోదం అందిస్తూనే, మన ప్రవర్తన మీద మనకే ఆలోచన రేపే అనుభవం. ఏ సృజనాత్మక కృషికైనా అంతకు మించి పరమార్థమేముంటుంది! - రెంటాల జయదేవ