లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా | Kalidas 1st Sound Film in Tamil Histor | Sakshi
Sakshi News home page

లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా

Published Sun, Dec 22 2024 11:01 AM | Last Updated on Sun, Dec 22 2024 8:47 PM

Kalidas 1st Sound Film in Tamil Histor
  • కాళిదాస్‌

సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్‌’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్‌ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీ అధినేత అర్దేశిర్‌ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్‌ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్‌ ఇండియన్‌ తమిళ్‌ అండ్‌ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్‌’. 

అక్కడే... ఆ సెట్స్‌లోనే!
‘ఆలమ్‌ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్‌.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్‌.ఎం.రెడ్డి ‘కాళిదాస్‌’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్‌ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్‌’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్‌. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్‌ ‘ఆలమ్‌ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్‌’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించిన నటుడెవరు? 

అసలు హీరో తెలుగువాడే!
కాళిదాస్‌ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్‌ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్‌... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్‌. గంగాధర్‌. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్‌’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. 

ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్‌/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్‌ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్‌ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్‌’కి హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.

అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!
‘కాళిదాస్‌’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్‌’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్‌’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్‌’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్‌’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.

కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్‌’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్‌’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్‌’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్‌ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్‌’. ఇందులో కాళిదాస్‌ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్‌ మిస్‌. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్‌. ఇది 2 రీళ్ళ చిత్రం.

 కురత్తి డ్యాన్స్‌ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్‌’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్‌ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్‌’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్‌’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. 

‘కాళిదాస్‌’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!
అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్‌’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్‌’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్‌ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్‌ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్‌’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్‌ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. 

ఆ ‘కాళిదాస్‌’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్‌ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్‌’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.

రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్‌.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్‌’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్‌’ తెలుగు ఫిల్మ్‌ అని చెప్పకనే చెప్పారు.

మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘
కాళిదాస్‌’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్‌ ‘ఆనంద వికటన్‌’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్‌’ 1931 నవంబర్‌ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్‌’. ఆ ‘కాళిదాస్‌’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్‌’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. 

మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్‌’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్‌’ ప్రోగ్రామ్‌లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్‌ 1932 ఏప్రిల్‌ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!!  

దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకం
మూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్‌’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్‌ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్‌’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్‌’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్‌లో సినిమా రిలీజ్‌ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్‌ అంతటా కనిపించే ‘కాళిదాస్‌’ పోస్టర్‌ అదే!  

తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! 
అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్‌ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్‌’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.

రీలు బాక్సుకు పూజలు, హారతులు
‘కాళిదాస్‌’ 1931 అక్టోబర్‌ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్‌’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్‌’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సినిమా హాలు దాకా వాల్‌ట్యాక్స్‌ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్‌ హిట్‌. ‘కాళిదాస్‌’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్‌’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. 

తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! 
తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్‌ చేసిన ‘కాళిదాస్‌’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్‌’ తీసిన హెచ్‌.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. 

ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్‌ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్‌ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. 

అలా ‘కాళిదాస్‌’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్‌’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.
(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్‌ రీల్‌’ పుస్తకం ఆధారంగా)
-రెంటాల జయదేవ
rjayadev@yahoo.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement