kalidas
-
లెక్కల్లో మనం తమిళులకు వదిలేసిన... మన తెలుగు సినిమా
సాధారణంగా తొలి తెలుగు టాకీ అనగానే అందరి నోటా వచ్చే మాట ‘భక్త ప్రహ్లాద’ (1932). కానీ, అంతకన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయని తెలుసా? పది రీళ్ళ పూర్తి నిడివి ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే రిలీజైన సదరు నాలుగు రీళ్ళ సినిమా గురించి విన్నారా? తెరపై తెలుగు వారి ఘన వారసత్వానికి గుర్తుగా నిలిచే ఆ సినిమాను అశ్రద్ధతో మనం మన లెక్కల్లో చేర్చుకోకుండా వదిలేశామంటే నమ్ముతారా? తమిళులు మాత్రం అది తమదిగా గొప్పగా చెప్పుకుంటున్నట్టు గమనించారా? సుదీర్ఘ పరిశోధనలో తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ (1931)పై అనేక కొత్త సత్యాలు బయటపడ్డాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమలో... మూగ సినిమాలను వెనక్కి నెడుతూ, మాట్లాడే చిత్రాలు వచ్చింది 1931లో! హిందీ–ఉర్దూల మిశ్రమ భాష హిందుస్తానీలో తయారై, 1931 మార్చి 14న విడుదలైన ‘ఆలమ్ ఆరా’ తొలి భారతీయ టాకీ చిత్రం. బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అర్దేశిర్ ఎం. ఇరానీ ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ‘ఆలమ్ ఆరా’ రిలీజై, ఘనవిజయం సాధించిన తర్వాత మరో ఏడు నెలలకు వచ్చిన ‘ఫస్ట్ ఇండియన్ తమిళ్ అండ్ తెలుగు టాకీ’ ఈ ‘కాళిదాస్’. అక్కడే... ఆ సెట్స్‌లోనే!‘ఆలమ్ ఆరా’ విజయంతోనే దక్షిణాది భాషల్లోనూ టాకీలు నిర్మించాలని ఇరానీకి ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడు ఆయన తన వద్ద ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాదీయుడు హెచ్.ఎం.రెడ్డి వైపు మొగ్గారు. హెచ్.ఎం.రెడ్డి ‘కాళిదాస్’కి నిర్దేశకుడై, తరువాతి కాలంలో ‘దక్షిణ భారత టాకీ పితామహుడి’గా పేరొందారు. గమ్మత్తేమిటంటే – బొంబాయిలోనే, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌లోనే ఈ ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’నూ’’ చిత్రీకరించారు. రంగస్థల నటి, అప్పటికే దక్షిణాదిన కొన్ని మూకీ చిత్రాల్లో నటించిన టి.పి. రాజలక్ష్మి చిత్ర హీరోయిన్. మూకీల రోజుల నుంచి సినిమాల్లో ఉన్న మన తెలుగు వెలుగు ఎల్వీ ప్రసాద్ ‘ఆలమ్ ఆరా’లో లానే, ఈ ‘కాళిదాస్’లోనూ ఒక చిన్న వేషం వేశారు. మరి, ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నటుడెవరు? అసలు హీరో తెలుగువాడే!కాళిదాస్ పాత్రధారి ఎవరనే అంశంపై చరిత్రలో నరసింహారావు, హరికథా భాగవతార్ పి. శ్రీనివాసరావు, తమిళ నటుడు పి.జి. వెంకటేశన్... ఇలా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి, ఆ పాత్ర ధరించినది పైన పేర్కొన్న వారెవరూ కారు! ఆ నటుడి పేరు– వి.ఆర్. గంగాధర్. ఆ రోజుల్లోనే ‘‘బి.ఏ. చదివిన’’ ఉన్నత విద్యావంతుడు. అప్పట్లో ‘‘ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్.’’ ఆయన, రాజలక్ష్మి జంటగా ‘కాళిదాస్’లో నటించారని తాజాగా బయటపడ్డ నాటి ప్రకటనలతో తేలిపోయింది. ఇంకో విశేషం ఉంది. అదేమిటంటే, ఆ ‘కాళిదాసు’ పాత్ర వేసిన సదరు గంగాధర్/ గంగాధరరావు అచ్చ తెలుగువాడు! అవును... ఇది ఇంతవరకు ఎవరూ పట్టించుకోని అంశం. మన సినీచరిత్రలో నమోదు కాని మరుగునపడిన సత్యం! ‘‘...ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన ఒకరిని కాళిదాసుగా నటింపజేశారు’’ అని సాక్షాత్తూ హీరోయిన్ రాజలక్షే్మ చెప్పారు. (ఆధారం: ‘గుండూసి’ పత్రికకు 1950లలో ఆమె ఇచ్చిన భేటీ).ఎల్వీ ప్రసాద్ సైతం అందులో హీరో తెలుగువాడని తేల్చిచెప్పారు. ‘‘...‘కాళిదాస్’కి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించగా, శ్రీమతి టి.పి. రాజలక్ష్మి, మరో తెలుగు నటుడు పాత్రలు పోషించారు’’ అని తన యాభై అయిదేళ్ళ జీవితానుభవాల ఆత్మకథనంలో పేర్కొన్నారు.అది... ఒకటి కాదు! మూడు చిత్రాలు!!‘కాళిదాస్’ తర్వాత రూపొంది, రిలీజైన ‘భక్త ప్రహ్లాద’ పూర్తి తెలుగు టాకీ. ఆ చిత్ర ప్రదర్శనలో తెలుగు మినహా మరో భాషే వినిపించదు. కానీ, ‘కాళిదాస్’ అలా కాదు! అసలు ఆ చిత్ర ప్రదర్శనే... ఒకటి కాదు... ఒకటికి మూడు చిన్న చిన్న చిత్రాల కదంబ ప్రదర్శన! ఆ మూడింటిలో ప్రధానమైనది– ‘కాళిదాస్’. ఈ రచయిత పరిశోధనలో తాజాగా తేలిందేమంటే... ఆ ఫిల్ము వరకు మొత్తం తెలుగు డైలాగుల్లోనే నడిచింది. ‘కాళిదాస్’తో పాటు కలిపి ఒకటే ‘ప్రోగ్రామ్’గా ప్రదర్శించిన మిగతా రెండు లఘు చిత్రాలు మాత్రం తమిళం. అవి... తమిళ దేశభక్తి గీతాలు, తమిళ కురత్తి పాటలు – డ్యాన్సు ఉన్న చిత్రాలు.కొన్నేళ్ళ క్రితమే అన్వేషణలో అందుబాటులోకి వచ్చిన ‘కాళిదాస్’ పాటల పుస్తకం ఆ ‘ప్రోగ్రామ్’ వివరాలను స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారం ఆ ‘‘ప్రోగ్రామ్’’ వివరాలు ఏమిటంటే... 1). దేశభక్తి నిండిన జాతీయవాద గీతాలు (తమిళంలోవి), కీర్తనలు (తెలుగులోని త్యాగరాయ కీర్తనలు), ప్రణయ గీతాలు (తమిళంలోవి), డ్యాన్స్ చూపిన 3 రీళ్ళ చిత్రం. 2). ‘కాళిదాస్’. ఇందులో కాళిదాస్ హాస్యఘట్టాల్లో ఒకటి, అలాగే అతని జీవితంలోని ప్రేమఘట్టం మరొకటి చూపారు. ఇది 4 రీళ్ళ చిత్రం. (ఇది పూర్తిగా తెలుగు డైలాగులతోనే తీసిన తెలుగు కథాచిత్రం). 3). హీరోయిన్ మిస్. టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై విజయవంతంగా అభినయిస్తూ, అప్పటికే ఎంతో పేరు సంపాదించుకున్న ‘కురత్తి’ డ్యాన్స్. ఇది 2 రీళ్ళ చిత్రం. కురత్తి డ్యాన్స్ అంటే పూసల దండలు, దారాలు విక్రయించేవారు వీథుల్లో చేసే నృత్యాలన్నమాట. మొత్తం ఈ 3 తక్కువ నిడివి చిత్రాల సమాహారమే ‘కాళిదాస్’ అన్నమాట. అన్నీ కలిపితే మొత్తం 9 రీళ్ళు. విడివిడిగా నిడివి తక్కువ గల ఈ మూడు లఘు చిత్రాలనూ కలిపి, ఒకే టాకీ ప్రదర్శనగా రిలీజ్ చేశారు. మూడూ కలిపి ఒకే షోగా వేశారు. అలా ఆ సినిమా ప్రదర్శన అటు తెలుగు డైలాగుల ‘కాళిదాస్’తో పాటు, తెలుగు త్యాగరాయ కీర్తనలు, తమిళ దేశభక్తి గీతాలు, కురత్తి డ్యాన్సుల కదంబ కార్యక్రమంగా జనం ముందుకు వచ్చింది. అన్ని భాషల వారినీ ఆకర్షించేందుకు వీలుగా ‘కాళిదాస్’ను ‘‘తొలి భారతీయ తమిళ, తెలుగు టాకీ చిత్రం’’గా పబ్లిసిటీ చేశారు. అదీ జరిగిన కథ. ‘కాళిదాస్’లో... అన్నీ తెలుగు డైలాగులే! తమిళం, హిందీ లేవు!!అయితే, ఇవాళ తమిళ సినీ చరిత్రకారులు ‘కాళిదాస్’ను వట్టి తమిళ టాకీగానే పేర్కొంటున్నారు. తమ భాష సినిమాగా లెక్కల్లో కలిపేసుకుంటున్నారు. కానీ, ‘కాళిదాస్’లో అసలు తమిళ డైలాగులే లేవు! హీరో తెలుగులో మాట్లాడితే, హీరోయిన్ తమిళంలో బదులు ఇచ్చిందనీ, పూజారి పాత్ర ధరించిన ఎల్వీ ప్రసాద్ లాంటి వారు హిందీలో సంభాషణలు పలికారనే ప్రచారంలోనూ వాస్తవం లేదు. ‘కాళిదాస్’ కథాచిత్రం మొత్తం తెలుగు డైలాగులతోనే తయారైంది. ఆ చిత్ర హీరోయిన్ అప్పట్లోనే చెప్పిన మాటలు, పత్రికల్లోని ఆనాటి సమీక్షలే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ ‘కాళిదాస్’ చిత్రంలో ‘‘నేను తమిళ, తెలుగు పాటలు పాడాను. తెలుగులో డైలాగులు చెప్పాను’’ అని ఆ సినిమా రిలీజు వేళలోనే హీరోయిన్ రాజలక్ష్మి పేర్కొనడం గమనార్హం. రాజలక్ష్మి ‘‘జన్మస్థలం (తమిళనాడులోని) తంజావూరు సమీప గ్రామం. తమిళం తప్ప, వేరొక భాషా పరిచయం లేదు.’’ అందుకే, ‘కాళిదాస్’ టాకీలో నటిగా మొత్తం తెలుగు డైలాగులే చెప్పాల్సి వచ్చినప్పుడు, ‘‘తెలుగు మాటలను ద్రావిడ లిపిలో (అంటే తమిళ లిపిలో అన్నమాట) రాసుకొని వల్లించాను’’ అని ఆమె వివరించారు.రాజ్యలక్ష్మి వేరొక సందర్భంలో మాట్లా డుతూ, ‘‘ఒకరోజు (దర్శకుడు) హెచ్.ఎం.రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు ఏవేమి వచ్చని ఆయన అడిగారు. కురత్తి పాటలు, నృత్యం తెలుసని చెప్పాను. అంతే... (అవి చేయించి) అది చిత్రీకరించారు. ఆ తర్వాత ‘కాళిదాస్’ అనే చిత్రాన్ని తెలుగులో తీశారు. అందులో రాకుమారిగా నటిస్తూ, ఆయన తెలుగులో చెప్పింది తమిళంలో రాసుకొని, చదువుకొని ఆ సంభాషణలు పలికే అవకాశం నాకు దక్కింది. అలా మొదటి టాకీయే (వివిధ అంశాల, లఘు చిత్రాల) ఒక కదంబ టాకీగా తమిళనాడుకొచ్చింది’’ అని తేటతెల్లం చేశారు. ‘కాళిదాస్’ తెలుగు ఫిల్మ్ అని చెప్పకనే చెప్పారు.మనం వదిలేసుకున్నాం! .. వాళ్ళు కలిపేసుకున్నారు!! ‘కాళిదాస్’లో ఒక్క హీరోయినే కాదు... హీరో సహా అందరూ తెలుగు లోనే మాట్లాడారు. తమిళం ఒక్క ముక్క కూడా లేదు. తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ సైతం ‘‘...అందులో తమిళ మాటలు లేవు. కనుక్కుంటే, అది తెలుగు భాష అని తెలిసింది. (సినిమా ప్రదర్శన) మొదట్లో, మధ్యలో, చివరలో మాత్రం కొన్ని తమిళ పాటలు వచ్చాయి’’ అని అప్పటి తన సమీక్షలో తేల్చే సింది. (ఆధారం: ‘ఆనంద వికటన్’ 1931 నవంబర్ 16). అంటే, 10 రీళ్ళ పూర్తి నిడివి, పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కన్నా ముందే తొలిసారిగా తెలుగు మాటలు, పాటలతో వచ్చిన 4 రీళ్ళ లఘు కథాచిత్రం ‘కాళిదాస్’. ఆ ‘కాళిదాస్’లోనే మన తెలుగు మాట, పాట తొలిసారిగా వెండితెరపై వినిపించాయి. తెలుగు టాకీకి శ్రీకారం చుట్టాయి. తెలుగు భాషకు అంతటి ఘనత కట్టబెట్టింది ‘కాళిదాస్’ అయినా, అది మొత్తం తెలుగు డైలాగులే ఉన్న సినిమాయే అయినా... తెలుగువాళ్ళమైన మనం ఉదాసీనంగా ఆ సినిమాను లెక్కల్లో వదిలేసుకున్నాం. అతి శ్రద్ధ గల తమిళులేమో దాన్ని తమ తమిళ టాకీగా చరిత్రలో కలిపేసుకున్నారు. మరి, కేవలం తెలుగు డైలాగులతోనే తీసినప్పటికీ, ‘కాళిదాస్’ను అప్పట్లో తమిళ – తెలుగు సినిమాగా ఎందుకు చెప్పినట్టు? నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ... తెలుగు, తమిళ, తదితర భాషల సమాహారం. అందరినీ ఆకర్షించాలన్నది సహజంగానే దర్శక, నిర్మాతల భావం. ఈ మూడు లఘు చిత్రాల కదంబ సినీ ప్రదర్శనతోనే... తెలుగు, తమిళ భాషలు రెండూ తెరపై తొలిసారిగా వినిపించాయి. ఆ చిత్రం మొట్టమొదట మద్రాసులో రిలీజవుతున్నప్పుడు ‘‘తమిళ – తెలుగు భాషల్లో తొలి వాక్చిత్రం’’ అంటూనే ప్రకటనలిచ్చారు. అంతేతప్ప, కేవలం తమిళ టాకీ అని చెప్పలేదు. అది గమనించాలి! ఆ రకంగా ‘కాళిదాస్’ ప్రోగ్రామ్‌లో తెర మీద తమిళంతో పాటు తెలుగు కూడా ఒకేసారి వినిపించింది కాబట్టి, తమిళంతో సమానంగా దీటుగా తెలుగూ నిలిచిందని గ్రహించాలి!! పూర్తి నిడివి టాకీల విషయంలో మాత్రం తమిళ ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) కన్నా ముందే తయారై, రిలీజైన తెలుగు ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6)తో మనమే ముందున్నామని గుర్తించాలి!! దక్షిణాదిలో తొలి సినిమా పాటల పుస్తకంమూడు లఘు చిత్రాల కదంబ ప్రదర్శన ‘కాళిదాస్’లోని తమిళ, తెలుగు పాటలన్నీ హీరోయిన్ రాజలక్షే్మ పాడారు. అప్పట్లో ఈ సినిమా పాటల పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా పాటల పుస్తకమిదే! పాటల పుస్తకంలో ‘కాళిదాస్’ చిత్ర కథా సంగ్రహం వివరాలను తెలుగు, తమిళం, ఇంగ్లీషు మూడు భాషల్లోనూ ప్రచురించడం విశేషం. పాటల పుస్తకం ముఖచిత్రంపై ‘కాళిదాస్’లో రాజలక్ష్మి నృత్యభంగిమ ఫొటో, మద్రాసు కినిమా సెంట్రల్లో సినిమా రిలీజ్ తేదీ తదితర వివరాలు ఇంగ్లీషులో వేశారు. ఇవాళ ఇంటర్నెట్ అంతటా కనిపించే ‘కాళిదాస్’ పోస్టర్ అదే! తెరపై తొలి తెలుగు పాట... త్యాగరాయ కీర్తన! అప్పటికే సుప్రసిద్ధురాలైన టి.పి. రాజలక్ష్మి రంగస్థలంపై పాడుతున్న పాపులర్ త్యాగరాయ కీర్తనలనే ఈ ‘కాళిదాస్’లోనూ ఆమెతో పాడించారు. పాటల పుస్తకంలోని ‘ఎంత రానీ...’ (హరికాంభోజి రాగం, దేశాది తాళం), ‘స్వరరాగ సుధారస...’ (శంకరాభరణ రాగం, ఆది తాళం) రెండు కీర్తనలే కాక ‘రామా నీయెడ ప్రేమ రహితులకు...’ (ఖరహరప్రియ రాగం, ఆది తాళం) అనే మూడో తెలుగు కీర్తన పాడిన సంగతి రాజలక్ష్మి అప్పట్లోనే చెప్పారు. వెండితెరపై వినిపించిన తొలి తెలుగు పాటలు ఇవే! అలా పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932) కన్నా ముందే తెరపై తెలుగు మాటలు, పాటలు వినిపించాయన్నది సత్యం.రీలు బాక్సుకు పూజలు, హారతులు‘కాళిదాస్’ 1931 అక్టోబర్ 31న మద్రాసులోని ‘కినిమా సెంట్రల్’లో రిలీజైంది. బొంబాయిలో తయారైన ఈ ‘కాళిదాస్’ ఫిల్ము రీళ్ళను తెచ్చినప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి సినిమా హాలు దాకా వాల్‌ట్యాక్స్ రోడ్డులో జనం రీలు బాక్సు వెంట ఊరేగింపుగా నడిచారు. పూలు వెదజల్లారు. కొబ్బరికాయలు కొట్టారు. అగరువత్తులు, కర్పూరం వెలిగించారు. దాన్నిబట్టి, తెరపై స్థానిక భాషను వినిపించే టాకీ పట్ల ప్రజల్లో పెల్లుబికిన ఉత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా సవాలక్ష లోపాలున్నా బొమ్మ బాక్సాఫీస్ హిట్. ‘కాళిదాస్’ తమిళులు అధికమైన సింగపూర్, మలేసియాలకూ వెళ్ళింది. స్థానిక తమిళుల్ని ఆకర్షించడం కోసం అక్కడ ‘కాళిదాస్’ను తమిళ సినిమాగానే పబ్లిసిటీ చేయడం గమనార్హం. తెలుగు తర్వాతే తమిళం! తొలి పూర్తి తమిళ టాకీ... ‘హరిశ్చంద్ర’! తెలుగు కథాచిత్రానికి... తమిళ పాటలు, కురత్తి డ్యాన్సులు పక్కన చేర్చి రిలీజ్ చేసిన ‘కాళిదాస్’ కదంబమాలిక విజయం దక్షిణాది సినీ చరిత్రలో కీలక పరిణామం. ఆ వెంటనే తెలుగులోనే పూర్తి నిడివి కథాకథన చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ టాకీ నిర్మాణానికి అది పురిగొల్పింది. ‘కాళిదాస్’ తీసిన హెచ్.ఎం. రెడ్డే దానికీ దర్శకుడు. పూర్తిగా తెలుగు మాటలు, పాటల ‘ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న దేశంలోనే తొలిసారిగా రిలీజై, విజయవంతమైంది. ఈ పరిణామాలన్నీ అటుపైన పూర్తి నిడివి తమిళ టాకీ ‘హరిశ్చంద్ర’ (1932) రూపకల్పనకు దారితీశాయి. 1932 ఏప్రిల్ 9న పూర్తిగా తమిళ డైలాగులు, తమిళ పాటలతోనే రిలీజైన ‘హరిశ్చంద్ర’నే ఆ నాటి పత్రికలు ‘‘మొట్టమొదటి తమిళ టాకీ’’ అని పేర్కొన్నాయి (ఆధారం: ‘హిందూ’ డైలీ, 1932 ఏప్రిల్ 8). నిర్మాతలూ ‘హరిశ్చంద్ర’నే ‘‘తొలి పూర్తి నిడివి 100 శాతం తమిళ టాకీ’’ అని ప్రకటనల్లో అభివర్ణించారు. అలా ‘కాళిదాస్’ చిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకొనే... పూర్తి స్థాయి తెలుగు సినిమా, పూర్తి తమిళ సినిమా వచ్చాయి. తెరపై తొలిసారిగా పూర్తిగా తెలుగు డైలాగులతో, మన త్యాగరాయ కీర్తనలతో, తెలుగు హీరో, తెలుగు దర్శకుడితో తయారైన ‘కాళిదాస్’ను ఇప్పటికైనా మన సినిమాగా తెలుగు సినీచరిత్రలో తప్పనిసరిగా గుర్తించాలి. అది అవసరం. మనం చేతులారా వదిలేసుకుంటున్న మన తెలుగు వారి ఘన వారసత్వాన్ని మనమే నిలుపుకోవడం ముఖ్యం.(త్వరలో రానున్న దక్షిణాది సినీ చరిత్ర ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ఆధారంగా)-రెంటాల జయదేవrjayadev@yahoo.com -
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
దేశాలు దాటిన ప్రేమ.. తల్లిదండ్రుల అనుమతితో రాష్ట్రానికి రప్పించి..
సాక్షి, చెన్నై: ఆన్లైన్లో ప్రేమించిన విదేశీ యువతిని రామేశ్వరం ఆలయంలో హిందూ సంప్రదాయ ప్రకారం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వివరాలు.. మదురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన కాళిదాసు (30). ఇతని తండ్రి సబ్ ఇన్స్పెక్టర్గా పని చేసి విశ్రాంతి పొందారు. విదేశాల్లో పని చేస్తూ వచ్చిన కాళిదాసు కరోనా కారణంగా సొంత ఊరికి వచ్చాడు. గత రెండేళ్లుగా ఇంటి నుంచి అన్లైన్లో పని చేస్తూ వచ్చిన అతనికి యూరప్‌కి చెందిన హానా బొమిక్లోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఆన్లైన్లోనే ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకోవడానికి కాళిదాసు ఇష్టపడ్డాడు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ప్రియురాలిని రాష్ట్రానికి రప్పించాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వారి వివాహము రామేశ్వరంలోని భద్రకాళి అమ్మన్ ఆలయంలో బుధవారం ఘనంగా జరిగింది. తర్వాత వధూవరులు రామనాథస్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. చదవండి: (తమిళనాడు అబ్బాయి, దక్షిణ కొరియా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!) -
ప్రొటెం స్పీకర్‌గా కాళిదాస్
సాక్షి, ముంబై: విధాన సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కోళంబ్కర్ నియమితులయ్యారు. రాజ్‌భవన్‌లో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ పదవి రేసులో బాలాసాహెబ్ థోరాత్, బబన్‌రావ్ పాచ్‌పుతే తదితరులున్నప్పటికీ సభలో సీనియర్ అయిన కాళిదాస్‌ను గవర్నర్ ఎంపిక చేశారు. నేడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని గవర్నర్ కోష్యారీ సూచించారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ కాళిదాస్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. -
అప్పుడలా వచ్చావే... ఇప్పుడు రావేం తండ్రీ !
‘నీ నగుమోము కనలేని...’ అని త్యాగయ్య కీర్తన చేస్తూ రాముడిని ‘రఘువరా!’ అని సంబోధించారు. అలానే ఎందుకు సంబోధించాల్సి వచ్చింది. ఇక్ష్వాకు వంశ సంభూతా.. అని కూడా పిలవవచ్చు. అలా పిలవలేదు. ఇక్ష్వాకు వంశం రఘు మహారాజు పుట్టిన తరువాత అది రఘువంశమయి పోయింది. కాళిదాసు రఘువంశ కావ్యంలో...‘‘త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం..’’ అంటారు.రఘుమహారాజు అపారమైన ఐశ్వర్యాన్ని సంపాదించారట. దాచుకోవడానికి కాదు.. త్యాగాయ సంభృతార్థానాం... మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడానికి. నీరు నిలవ ఉంటే దుర్వాసన, సన్యాసి ఒకచోట ఉండిపోతే ప్రమాదం, సంచరిస్తూ ఉండాలి. ధనం ఒకచోట ఉండిపోతే దుర్గుణాలకు ఆలవాలం అవుతుంది. అందుకే అది కదులుతూ ఉండాలి. అందుకని అది దానం చేయడానికి సంపాదించాడు. ‘సత్యాయ మిత భాషిణాం’.. ఎక్కువ మాట్లాడితే అందులో అసత్యం ఉన్న వాక్కేదైనా దొర్లుతుందేమోనని తక్కువ మాట్లాడేవారట. యశసే విజగీషూణాం–అపారమైన దండయాత్రలు చేసి సామ్రాజ్య విస్తరణ చేసింది రక్తపాతం కోసం కాదు, క్షాత్రధర్మం కనుక రాజ్య విస్తరణ చేసి కీర్తిని సంపాదించడానికట. ప్రజాయై గృహమేధినాం–గృహస్థాశ్రమం వంశాన్ని నిలబెట్టడానికి కావలసిన సంతానం కోసమేనట. ఇటువంటి సుగుణాలు కలిగిన రఘు మహారాజు వంశంలో పుట్టిన నీవు రాఘవుడివై ఆ కీర్తిని మరింత వెలిగేటట్లు చేసావు.సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ: గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాత్రవాన్–నీ గుణాలేమిటో తెలుసా రామా! సత్యేన్ లోకాన్ జయతి.. సత్యంతో లోకాలన్నింటినీ గెలిచావు, సత్యమే రామచంద్రమూర్తి పౌరుషమంటారు వాల్మీకి. దానాలతో దీనులను గెలిచావు. గురువుకు కానుకలు ఇవ్వగలిగినవాడు లేడు కనుక నీవు నీ సేవలతో వారిని గెలిచావు. కోదండం పట్టుకున్నావా శత్రువనేవాడు లేకుండా చేయగలిగిన వీరత్వం నీది. అటువంటివాడివై రఘువంశంలో కీర్తి పెంచిన రామా! లోకాలను రక్షించడం కోసం కూర్మావతారమెత్తి అంతటి క్లేశాన్ని భరించావే, (మంధర పర్వతాన్ని వీపుమీద మోస్తూ), వరాలను పొందిన రావణుని దుష్ట ప్రవర్తన అణచడం కోసం దశరథమహారాజువారి యాగస్థలిలో ప్రత్యక్షమై ఆయనను తండ్రిగా ఎంచుకుని రాముడిగా జన్మనెత్తి ఎన్నెన్ని కష్టాలకోర్చావు, ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శ్రీ కృష్ణుడిగా గోవర్థన పర్వతాన్ని ఏడురోజులు ఎత్తి పట్టుకుని గోవిందుడివై లోకాల్ని రక్షించావే....ఇన్ని చేసావు కదా... నేనవేవీ అడగలేదు కదా స్వామీ, నేనడిగినదేమిటి... నగుమోము కనలేని నాదుజాలీ తెలిసీ... ఒక్కసారి కనపడమని అడిగాను. కనపడితే నేనేమయినా అడుగుతాననుకుంటున్నావా... అలా అడిగేవాడిని కానే... అప్పుడు అన్నిసార్లు వచ్చిన వాడివి... ఇప్పుడు రాలేదంటే ఏమనుకోవాలి... నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరయినా నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నారా... నీవారోజున గజేంద్రుడిని రక్షించడానికి ఆగమేఘాలమీద పరుగెడుతుంటే.. వారెవరూ నిన్ను ఆపలేదు కదా... అందువల్ల వారలా ఆపేవారు కూడా కాదు.. పైగా సంతోషంగా నీవెంట వచ్చేవాళ్ళే కదా... అయినా నా కోరికేమిటి? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లితో కలిసి కోదండం చేతపట్టుకుని, లక్ష్మణుడు పక్కన నిలబడితే, హనుమ నీ పాదాల వద్ద కూర్చుని సేవిస్తుంటే... చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా నావంక చూస్తే.. నీ దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులతో తనివితీరా తాగేసి ఆ ఆనందం పట్టలేక నేను నువ్వయిపోయి నేను నీలో కలిసిపోవాలి. అందుకని నా ఆర్తిని గమనించి రావేం తండ్రీ... అని వేడుకుంటున్నాడు. గీతం, సంగీతం, ఆర్తి, భక్తి...అన్నీ కలిసిపోయిన దృశ్య ఆవిష్కరణ అది. -
దీపశిఖా కాళిదాసు
ఒక రాత్రివేళ ఒక వ్యక్తి ఒక వీధిలో నిలబడి గొప్పవెలుగునిస్తున్న ఒక దివిటీని చేతితో పట్టుకొని ముందుకు వెళుతున్నా డనుకొందాం. ఆ దివిటీకి ముందున ఉన్న భవనాలు, వస్తువులు ధగధగా వెలిగిపోతూ ఉంటై. ఆ కాగడా ముందుకు దాటిపోగానే ఆ భవనాలు, ఆ వస్తువులన్నీ ఆ తేజస్సును కోల్పోవటమే కాకుండా అంతకు ముందు తమకున్న కాంతిని కూడా కోల్పోయి కళావిహీనా లైతై. కదా! ఇప్పుడు ఈ విషయాన్ని మన ప్రస్తుత విషయంతో పోల్చిచూద్దాం. ‘మహాకవి’ కాళిదాసు రచించిన రఘువంశ కావ్యంలో విదర్భ రాజకుమారి ఇందుమతికి స్వయంవరం జరుగుతున్నది. మండపంలో నానా దేశాల రాజకుమారులు రెండు వరుసలలో కూర్చొని ఉన్నారు. రాజకుమారి ఇందుమతి దివ్యవస్త్రాలను ధరించి, సకలాభరణాలనలంకరించుకొని, స్వయంవర పూలమాలను చేతులతో పట్టుకొని మండపంలోకి వచ్చింది. ‘ఈ సుందరి నన్నే వరిస్తుంది. నన్నే వరిస్తుంది.’ అన్న ఆలోచనలతో రాకుమారు లందరి ముఖాలు దీపశిఖకు ముందున్న వస్తువులలాగా ఆనందంతో వెలిగిపోతున్నై. ఆమె ఒక్కొక్కరిని కాదంటూ దాటివెళుతుంటే ఆ వెనుకనున్నవారి ముఖాలు దీపశిఖకు వెనుక నున్న వస్తువులలాగా వెలవెల పోతున్నై. ఈ సందర్భంలో ‘సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ’ – ఇందుమతి రాత్రివేళ నడుస్తున్న దీపశిఖలాగా ఉన్నది అన్నాడు కాళిదాసు. అత్యద్భుతమైన ఈ ఉపమాలంకారాన్ని ప్రయోగించిన కారణంగానే అతడికి ‘దీపశిఖా కాళిదాసు’ అనే ప్రశస్తి లభించింది. -డాక్టర్ పోలెపెద్ది రాధాకృష్ణమూర్తి -
కాళిదాస్ ఫస్ట్‌లుక్ లాంచ్
భరత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాళిదాస్ టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు కార్తీ ఆవిష్కరించారు. కాదల్ వంటి ఘన విజయం తరువాత వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ నటుడు భరత్ ఇటీవల కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. దీంతో మంచి విజయం కోసం పోరుబాట పట్టిన ఈ యువ హీరో తాజాగా ఒక పవర్ఫుల్ పాత్రలో కాళిదాస్ చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ అధికారిగా నటిస్తుండడం విశేషం. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీసెంథిల్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. థ్రిల్లింగ్ కథాంశాన్ని శ్రీసెంథిల్ హ్యాండిల్ చేస్తున్నారని నిర్మాతలు పేర్కొన్నారు. నాళైఇయక్కునార్ టీమ్‌కు క్రియేటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన దర్శకుడు శివనేశన్ దినకరన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం కాళిదాస్. విశాల్ చంద్రశేఖరన్ సంగీతాన్ని, సురేశ్బాల ఛాయాగ్రహణం నిర్వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు కార్తీ గురువారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పాండిరాజ్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు వేల్రాజ్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
కాళిదాసు కవితావైభవం కుమారసంభవం
డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ రాజమహేంద్రవరం కల్చరల్ : ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, వేదవాజ్ఞ్మయానికి మాత్రమే ప్రాథాన్యం ఉన్న రోజుల్లో మహాకవి కాళిదాసు లౌకికమైన కావ్యజగత్తులోకి తన రచనలు తీసుకువచ్చాడు. ఆయన కవితావైభవానికి దర్పణంగా కుమారసంభవం కావ్యాన్ని చెప్పుకోవచ్చునని రామాయణ రత్నాకర డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ అన్నారు. నన్నయ వాజ్మయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన సాహితీ కాళిదాసం సభలో ఆయన కుమార సంభవము– పార్వతీ కల్యాణము అనే అంశంపై ప్రసంగించారు. తొలిరేయి విద్వాంసురాలయిన కాళిదాసు భార్య విద్యాధరి చొరవ తీసుకుని ‘అస్తి కశ్చిత్ వాగ్విశేషః’ మాటలాడుకోవడానికి ప్రత్యేకమైన మాటలే లేవా అని అడిగింది. ఇందులో మొదటిదయిన ‘అస్తి’ కాళిదాసు అనంతర కాలంలో రచించిన కుమారసంభవంలో తొలి పదం, కశ్చిత్ అన్నది మేఘసందేశంలో తొలి పదం, వాగ్విశేషః అన్నది రఘువంశంలో తొలిపదమని కేసాప్రగడ వివరించారు. వేదవ్యాసుని కలం నుంచి జాలువారిన శివపురాణాన్ని స్వీయకపోల కల్పనలతో కుమారసంభవంగా, వాల్మీకి రామాయణాన్ని రఘువంశంగా ఆయన మలిచాడని కేసాప్రగడ వివరించారు. రసికత్వం లేనివారికి నా కవిత్వం వినిపించే దౌర్భాగ్యం తనకు పట్టకూడదని కాళిదాసు కోరుకున్నాడని అన్నారు. దక్షయజ్ఞంలో శివుని అర్ధాంగి నిరాదరణకు గురి అవుతుంది, స్త్రీ అత్తింటిలో నిరాదరణకు గురికావడం మాట ఎలా ఉన్నా, పుట్టింటివారు స్త్రీని నిరాదరిస్తే, ఆ కుటుంబం సర్వనాశనమవుతుందని కేసాప్రగడ అన్నారు. శివుడు తపమాచరించిన ప్రదేశంలోనే పార్వతి తపస్సు చేయడం, శివపార్వతుల కల్యాణం తదతర అంశాలను వివరిస్తూ కేసాప్రగడ ఒక్క కుమారసంభవం నుంచి మాత్రమే కాకుండా బిల్హణుడు, శ్రీనాథుడు, భాష్యకారాచార్యులు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, రచించిన పద్యాలను అలవోకగా ఉట్టంకించారు. సభాధ్యక్షుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ఆదిశంకరులు రచించిన ‘గంగాతరంగ రమణీయజటాకలాపం’ శ్లోకానికి నృత్యాభినయం చేశారు. నన్నయ వాజ్ఞయ వేదిక ప్రధాన కార్యదర్శి చింతలపాటి శర్మ కేసాప్రగడ ప్రసంగాన్ని షడ్రసోపేతమైన విందుగా అభివర్ణించారు. సప్పా దుర్గాప్రసాద్ చేతులమీదుగా ప్రధాన వక్త కేసాప్రగడ సత్యనారాయణను సత్కరించారు. నేడు చింతలపాటి శర్మ ప్రసంగం శనివారం రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ ‘మేఘసందేశము–విప్రలంభము’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. -
84 వసంతాలు
సందర్భం: తెలుగు సినిమా పుట్టినరోజు కట్టూబొట్టూ, మాట, పాట, మనిషి తీరూ - ఇలా అన్నిటిపైనా తనదైన ముద్ర వేసిన పాపం, పుణ్యం మన సినిమాలదే. అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పుట్టినరోజు. సినీప్రియులకు పండగ రోజు. తొలి పూర్తి తెలుగు చలనచిత్రం ‘భక్తప్రహ్లాద’ 84 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. సినిమా అంటే ఒకప్పుడు భాషతో ప్రమేయం లేని మూగచిత్రాలు (మూకీలు). తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదల కావడంతో ఆ యా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. అదీ బొంబాయిలో, ‘ఆలమ్ ఆరా’ కోసం వేసిన సెట్స్‌ను ఉపయోగించుకుంటూ! ప్రధానంగా తమిళ మాటలు - పాటలు, కొంత తెలుగు మాటలు, పాటలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో తయారైన సినిమా ‘కాళిదాస్’. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. ‘‘తొలి తమిళ - తెలుగు టాకీ’’ అంటూ దర్శక - నిర్మాతలు అప్పట్లో ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. ఆ సినిమా విడుదలై, విజయవంతం కావడంతో, ఈ సారి పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే పూర్తి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘కాళిదాస్’ కన్నా ముందే, 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొద్దికాలం ఆధార రహిత ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, సాక్ష్యాధార సహితంగా నిరూపించారు. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే ప్రారంభించడం మొదలై, ఇవాళ్టితో 84 ఏళ్ళు పూర్తయ్యాయి. మన ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటీనటులతోనే ఎక్కువ వేషాలు వేయించి ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి కుమారుడైన ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రలు పోషించారు. తరువాతి కాలంలో తెలుగు సినీ దిగ్గజంగా ఎదిగిన ఎల్.వి. ప్రసాద్ మొద్దబ్బాయిగా నటించారు. అప్పట్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న బొంబాయిలోనే, చిత్ర నిర్మాతల సొంత థియేటరైన కృష్ణా సినిమా థియేటర్లో ముందుగా ఈ చిత్రం విడుదలైంది. అక్కడ రెండు వారాలాడాక, తెలుగు నేల మీదకు వచ్చింది. విజయవాడ (శ్రీమారుతి సినిమా హాలు), రాజమండ్రి (శ్రీకృష్ణా సినిమాహాలు)ల్లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత మద్రాసులో ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన ప్రేక్షకులకు... తెర మీద బొమ్మలు మాట్లాడడం, అదీ మన సొంత తెలుగు భాషలోనే ఆద్యంతం మాట్లాడడం విడ్డూరమైంది. దాంతో, ఈ టాకీ విడుదల హంగామా సృష్టించింది. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ తెలుగు నాట అప్రతిహతంగా సాగుతూనే ఉంది. కాకపోతే, మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఒకటి, రెండు స్టిల్స్, పోస్టర్లే తప్ప సినిమా ప్రింటే లేకుండా పోయింది. పోయినవెలాగూ పోగా, ఇప్పటి కైనా మన సినీపెద్దలు, తెలుగు ప్రభుత్వాధి నేతలు కళ్ళు తెరిచి, పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల మిగిలిన మన 1930-40ల నాటి కొద్దిపాటి తెలుగు చిత్రాల ప్రింట్లనైనా డిజిటలైజ్ చేయిస్తారా?! తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6, బొంబాయిలో కృష్ణథియేటర్ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు, తల్లి లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, తండ్రి హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య ప్రజల్లోని మార్పులకు ప్రతిబింబం ఇది! - ఎ. రమేశ్ ప్రసాద్, ప్రసాద్స్ సంస్థల అధినేత ‘‘తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’, తొలి తమిళ - తెలుగు టాకీ ‘కాళిదాస్’, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ - మూడింటిలోనూ నటించిన, పనిచేసిన అరుదైన ఘనత మా నాన్నగారు ఎల్వీ ప్రసాద్‌ది. ఆయన, నేను, మా కుటుంబ సభ్యులం ‘ప్రసాద్’ సంస్థ ద్వారా ఫిల్మ్ ప్రింటింగ్, ప్రాసెసింగ్, రికార్డింగ్ వగైరా అన్నిటా ముందుండి, పరిశ్రమ పురోగతికి తోడ్పడ్డాం. ఈ 84 ఏళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది. ఒక్క మాటలో, ప్రజల వైఖరిలో వస్తున్న మార్పుల్ని సినిమాల్లో చూడవచ్చు. విలువలు, కథలు మారాయి.నిర్మాణం, పోటీ పెరిగాయి. ఫిల్మ్ పోయి డిజిటలొచ్చింది. ఎంత టెక్నాలజీ వచ్చినా నాన్న గారన్నట్లు ప్యాషన్, పేషెన్స్ (సహనం), పర్సెవరెన్స్ (నిరంతర శ్రమ), అందరి మంచి కోరే ప్యూరిటీ ఆఫ్ థాట్ - ఈ నాలుగు ‘పి’లుంటే ముందుకెళతాం!’’ డబ్బు సంపాదనే ధ్యేయమైతే ఎలా? - దాసరి నారాయణరావు, దర్శక,నిర్మాత ‘‘దాదాపు 50 ఏళ్ళుగా తెలుగు సినిమాతో కలసి నడిచే అదృష్టం నాకు కలిగింది. మనందరం దృష్టి పెట్టాల్సిన కొన్ని ప్రతి కూల అంశాలు చెబుతా. ఒకప్పుడు సిని మాలు కొద్ది రోజుల్లో, తక్కువ బడ్జెట్లో తయారయ్యేవి. అప్పటితో పోలిస్తే, ఇప్పుడెంతో టెక్నాలజీ వచ్చింది. కానీ, దాన్ని వాడుకొనే నైపుణ్యం ఉందా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. కమిట్మెంట్, కళ పట్ల గౌరవం తగ్గి ఇవాళ సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అని పొరపడుతున్నాం. నిజానికి, ఎంటర్టైన్మెంట్లో సినిమా భాగమే తప్ప, సినిమానే ఎంటర్టైన్మెంట్ కాదు. అలాగే, ఎంతో శక్తిమంతమైన మీడియా అయిన సినిమా సమాజాన్ని ప్రతిబింబించాలి. డబ్బులు సంపాది స్తూనే, సమాజానికి అద్దం పట్టే సినిమాలు కొన్నేళ్ళ క్రితం దాకా వచ్చేవి. కానీ, ఇవాళ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా సినిమా ద్వారా అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపించడం లాంటివే చూపిస్తు న్నాం. అదేమంటే, ‘ఇదేనండీ ట్రెండ్’ అంటున్నాం. జనానికి మనం ఏది చూపించి, అలవాటు చేస్తే అదే చూస్తారు. కాబట్టి వాళ్ళను తప్పు పట్టకూడదు. గమనిస్తే ఇప్పుడు చాలామంది మంచి టెక్నీషి యన్లు, నటులు వస్తున్నారు. కానీ, వారి ప్రతిభకు సరైన దోవ లేక పక్కదారి పడుతోందేమోనని నా అనుమానం, బాధ.’’ కథ అదే..! టెక్నిక్కే మారుతోంది! - డి. సురేశ్‌బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ‘‘మా నాన్న గారు డి. రామానాయుడు, మా కుటుంబం కలసి 50 ఏళ్ళపైగా సినీరంగం లోనే కృషి చేయడం అదృష్టం. సినిమా అంటే అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నిక్ వాడి, వెండితెరపై కథ చెప్పడం! నవ్వు, ఏడుపు లాంటి ప్రాథమిక ఉద్వేగాలు, కథ ఒకటే. వాడే టెక్నిక్, చెప్పే విధానం కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు జానపదాల్లో మినియేచర్లు వాడితే, ఇప్పుడు ‘బాహుబలి’కి గ్రాఫిక్స్, యానిమేషన్, డిజిటల్ ఎఫెక్ట్స్ వాడుతున్నాం. అప్పట్లో కొన్ని కోవల సిన్మాలే ఉండేవి. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ, హార్రర్, క్రైమ్ ఇలా రకరకాల కోవల ఫిల్మ్స్ పెరుగుతున్నాయి. వచ్చేరోజుల్లో సిని మాల్ని చూసే వేదికలు, విధానమూ మారతాయి. హాళ్ళు, టీవీల్లోనే కాక కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లలో సినిమాలు చూడడం పెరుగుతుంది. రోజులోని సమయాన్ని బట్టి చూసే వేర్వేరు రకాల సినిమాలు వస్తాయి.’’ -
ఎంతో వేదన అనుభవించా
‘సినీ రాజకీయాలు నాకు తెలియనందుకే వేదనకు గురయ్యా’ అని చెప్పారు నటుడు కమలహాసన్. నటుడు జయరాం కొడుకు కాళిదాస్ ఒరు పక్క కథై అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. నడువుల కొంచెం పక్కత్త కానోం చిత్రం ఫేమ్ బాలాజీ ధరణిధరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం ఇటీవల జరిగింది. కాళిదాస్‌ను నటుడు కమలహాసన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంచెం పేరు రాగానే ఇతరులను మరచిపోతున్న కాలమిదన్నారు. అయితే నటుడు జయరాం అలా కాదన్నారు. ఆయన మాదిరిగానే ఆయన కొడుకు నడుచుకోవాలని హితవు పలికారు. సినిమాలో తనకెవరూ శత్రువులు లేరన్నారు. అయినా ఒక కుటుంబంలో వియ్యంకుల్లాగా గొడవలు పడుతూ విడిపోతున్నారని భావిస్తానన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి తాను నటిస్తున్నానన్నారు. తనకు వారసత్వంపై నమ్మకం లేదన్నారు. శమనే నమ్ముతానని చెప్పారు. వారసులయినంత మాత్రాన జయించలేరన్నారు. తనను వ్యత్యాసమైన వ్యక్తి అంటుంటారని, తాను బాలచందర్ స్కూలులో చదువుకున్నవాడినని ఆయన మాదిరిగానే భిన్నంగా ఉంటానని పేర్కొన్నారు. అందుకే నటించడానికి వచ్చానన్నారు. నటుడు జయరాంకు రాజకీయాలు తెలియవు. తనకు మాత్రం చిత్ర పరిశ్రమలో ఎంతగా రాజకీయాలు చేస్తారో బాగా తెలుసన్నారు. అలాంటి రాజకీయాలతో తాను వేదన అనుభించానని కమలహాసన్ అన్నారు. -
ఆషాఢస్య ప్రథమ దివసే...
కావ్యం/ మేఘసందేశం: మళ్లీ ఆషాఢ మాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలున్నాయి. ఆషాఢమంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్లు వంచవలసిన కాలం. సన్యాసులకు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్తాఅల్లుళ్లు ‘ఒకే గడప దాటకూడని వేడుక’ వేళ వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. కాళిదాస మహాకవి మేఘసందేశ కావ్యం కథ ఆషాఢంలో మొదలవుతుంది. ఒకానొక యక్షుడు భార్య మీద నిరంతర ధ్యాసతో తన విధులు నిర్లక్ష్యం చేసి తన ప్రభువైన కుబేరుడి వల్ల శాపం పొందాడు. ఒక సంవత్సరంపాటు అలకానగరం నుంచి బహిష్కృతుడై ఎక్కడో దక్షిణాన దూరంగా పూర్వం సీతాదేవి తన భర్తతో వనవాసం చేస్తూ గడిపిన రామగిరి ఆశ్రమాల ప్రాంతంలో కాలం గడపవలసి వచ్చింది. దుర్భరమైన భార్యావియోగ భారంతో ఎనిమిది నెలలు ఎలాగో గడిపేశాడు. ఇంతలో ఆషాఢం వచ్చి ఆకాశం మేఘావృతమైంది. ఇక యక్షుడు తన విరహ వేదన భరించలేకపోయాడు. తస్మిన్-అద్రౌ, కతిచిత్-అబలా విప్రయుక్తః స కామీ నీత్వా మాసాన్ కనక వలయ భ్రంశ రిక్త ప్రకోష్ఠః ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం - అశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. ఆ రామగిరి మీద అబలా విప్రయోగాన్ని భరిస్తూ ఆ ప్రేమైక జీవి విరహ తాపం వల్ల కృశించిపోయి, బంగారు చేతి అందె జారిపోవడం వల్ల బోసిపోయిన ముంజేతితో కొన్ని మాసాలు గడిపిన తరువాత, ఆషాఢమాసంలో తొట్ట తొలిరోజున కొండ కొమ్మను పట్టుకుని నిలిచిన మబ్బు కనిపించింది. ఆ మేఘం- వంగి తన దంతాలతో గుట్టలను ఢీకొంటూ ఆడుకుంటున్న ఏనుగులా ఉంది. మేఘాన్ని చూస్తే ఏ పడుచువాడికైనా ప్రేయసి ధ్యాసే మనసు నిండా పరుచుకుంటుంది గదా. ఇక భార్యావిరహంతో తల్లడిల్లుతున్న యక్షుడిమాట చెప్పేదేముంది? పైగా అతగాడికి మరో బెంగ. అక్కడెక్కడో అలకాపురంలో తనలాగే విరహాగ్నితో కాగిపోతున్న తన భార్య మాటేమిటి? ఆమెకు కూడా అక్కడ మేఘాలోకనంతో గుండెగొంతుకలోన కొట్టాడుతుంటుంది కదా! అసలే సుకుమారి. అందులో విరహిణి. ఆపైన ఆషాఢమాసం. రాబోయేవి శ్రావణ, భాద్రపదాలు. అసలు ఆమె ప్రాణమన్నా నిలుపుకో గలుగుతుందా? భయంతో యక్షుడి మనసు కల్లోలమైంది. ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న మేఘం ఎలాగూ ఉత్తరంగా ప్రయాణిస్తున్నది. చల్లగా ఆకాశమార్గంలో పోయిపోయి కొద్ది రోజులలో అలకా నగరం చేరుకొంటుంది. తన ప్రియురాలికి ఊరటనిచ్చి ఉసురు నిలిపే సందేశం ఆ ఆషాఢమేఘం ద్వారానే పంపితే? అచేతనమై కేవలం ధూమ, జ్యోతి, సలిల, మరుతాల సమూహమైన మేఘం ఎక్కడా! గ్రహింపూ, కాళ్ళు చేతులూ, వాక్కూ ఉన్న మనుషుల ద్వారా పంపించాల్సిన ప్రేమ సందేశం ఎక్కడా? ఈ రెంటికీ పొంతన లేదేమోనని ఆ ప్రేమార్తుడికి సందేహం కూడా కలగలేదు. అప్పటికప్పుడే కొండమల్లెలు కోసి, వాటితో మేఘుడిని పూజించి, ప్రార్థించాడు. ‘ఓ మేఘుడా! అసంతృప్తులకు నువ్వే శరణు కదా. నా ప్రియురాలికి నా సందేశం చేరవేసి పుణ్యం కట్టుకోవయ్యా మిత్రమా! నువ్వు వెళ్ళాల్సింది అలకానగరం. వెళ్ళవలసిన త్రోవ నేను వివరంగా చెప్తాను. ఎనిమిది నెలలెలాగూ గడిచాయి, మరో నాలుగు నెలల్లో నేను వచ్చేస్తున్నానని నా భార్యకు చెప్పు. నేనూ తన కోసం తపిస్తున్నానని చెప్పు. కంటికి కునుకు లేక కలలో కూడా ఆమెను దర్శించలేక పోతున్నానని చిత్తరువు కూడా కానరాక అలమటిస్తున్నానని చెప్పు. విరహతప్తమైన నా శరీరంతో అంతే తప్తమైన ఆమె శరీరాన్నీ నా అశ్రువులతో ఆమె అశ్రువులనూ నా నిట్టూర్పులతో ఆమె నిట్టూర్పులనూ కలపటం ప్రస్తుతం మనసు ద్వారా సాధ్యం! ఏం చేస్తాం యిది విధి! అయినా దిగులు పడవద్దని నా మాటగా చెప్పు. భాగ్య చక్ర భ్రమణంలో కింది దశ తరవాత పైదశ వచ్చి తీరుతుంది. మళ్ళీ మనం గువ్వల జంటలా కాలం గడిపే మంచిరోజులు వస్తాయని గుర్తు చెయ్యి!’ అని వేడుకొంటాడు. ఆషాఢంలో యక్షుడి విరహవేదన పాఠకుడి చేత కంటతడి పెట్టిస్తే కాళిదాస కవి పదాల పోహళింపూ, శయ్యా సౌందర్యం, వర్ణనా చమత్కృతీ శ్రావణ మేఘాలలా రసానంద బాష్పవర్షమే కురిపిస్తాయి. అందుకే ఆషాఢం వచ్చిందన్నా, ఆషాఢమేఘం కానవచ్చిందన్నా ఆ మేఘాల నడిమధ్యలో కవికుల గురువు ‘కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారత్ ప్రమత్తః....’ అంటూ కమనీయమైన కావ్యగానం చేస్తూ కళ్ళముందు నిలుస్తాడు. ఆ మబ్బుకు ఆ వైపు రామగిరి అడవులలో ఒంటరిగా, దీనంగా నిలిచిన యక్షుడూ, ఈ వైపు చంద్రిక కోసం చాతక పక్షిలా అలకాపురంలో అమాయకంగా ఎదురుచూస్తున్న అన్నుల మిన్నా మనోగోచరమౌతారు. - ఎం. మారుతి శాస్త్రి