
ఒక రాత్రివేళ ఒక వ్యక్తి ఒక వీధిలో నిలబడి గొప్పవెలుగునిస్తున్న ఒక దివిటీని చేతితో పట్టుకొని ముందుకు వెళుతున్నా డనుకొందాం. ఆ దివిటీకి ముందున ఉన్న భవనాలు, వస్తువులు ధగధగా వెలిగిపోతూ ఉంటై. ఆ కాగడా ముందుకు దాటిపోగానే ఆ భవనాలు, ఆ వస్తువులన్నీ ఆ తేజస్సును కోల్పోవటమే కాకుండా అంతకు ముందు తమకున్న కాంతిని కూడా కోల్పోయి కళావిహీనా లైతై. కదా! ఇప్పుడు ఈ విషయాన్ని మన ప్రస్తుత విషయంతో పోల్చిచూద్దాం.
‘మహాకవి’ కాళిదాసు రచించిన రఘువంశ కావ్యంలో విదర్భ రాజకుమారి ఇందుమతికి స్వయంవరం జరుగుతున్నది. మండపంలో నానా దేశాల రాజకుమారులు రెండు వరుసలలో కూర్చొని ఉన్నారు. రాజకుమారి ఇందుమతి దివ్యవస్త్రాలను ధరించి, సకలాభరణాలనలంకరించుకొని, స్వయంవర పూలమాలను చేతులతో పట్టుకొని మండపంలోకి వచ్చింది. ‘ఈ సుందరి నన్నే వరిస్తుంది. నన్నే వరిస్తుంది.’ అన్న ఆలోచనలతో రాకుమారు లందరి ముఖాలు దీపశిఖకు ముందున్న వస్తువులలాగా ఆనందంతో వెలిగిపోతున్నై. ఆమె ఒక్కొక్కరిని కాదంటూ దాటివెళుతుంటే ఆ వెనుకనున్నవారి ముఖాలు దీపశిఖకు వెనుక నున్న వస్తువులలాగా వెలవెల పోతున్నై.
ఈ సందర్భంలో ‘సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ’ – ఇందుమతి రాత్రివేళ నడుస్తున్న దీపశిఖలాగా ఉన్నది అన్నాడు కాళిదాసు. అత్యద్భుతమైన ఈ ఉపమాలంకారాన్ని ప్రయోగించిన కారణంగానే అతడికి ‘దీపశిఖా కాళిదాసు’ అనే ప్రశస్తి లభించింది. -డాక్టర్ పోలెపెద్ది రాధాకృష్ణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment